8, మార్చి 2011, మంగళవారం

తింగర మంగళ!

మొన్న సాయంత్రం 'మంగళ' సినిమా చూసాం! అసలే దయ్యాలంటే.....వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాను.... నాకు అవసరమా ఇప్పుడు 'మంగళ' చూడటం? అప్పటికే...'నాగవల్లి' సినిమా చూసి..... 'నాగవల్లా....గోడమీద బల్లా?' అనే టైటిల్ తో ఒక పోస్ట్  వేద్దామనుకుంటే....'నాగవల్లి' గారు ఇచ్చిన సీరియస్ వార్నింగ్ దెబ్బకి దడిచి ఆ పోస్ట్ పబ్లిష్ కూడా చేయకుండానే డెలీట్ చేసేసా! అయినా కూడా భయంభక్తి లేకుండా....'మంగళ' చూడ్డానికి రెడి అయిపోయా!

ఇక విషయానికొస్తే....ఒక ఆదివారం సాయంత్రం...తెల్లటి ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్మిన వేళ.....పొద్దున మిగిలిపోయిన మాడిపోయిన ఉప్మా ని మళ్లీ వేడి చేసుకుని తింటూ.....ఇదిగో....ఈ 'మంగళ' సినిమా చూడటం మొదలుపెట్టాం!

కథ పెద్దగా ఏమిలేదు....మూడు ముక్కల్లో చెప్పాలంటే.....ఆ...మూడు ముక్కలు కూడా వేస్ట్.....రెండు ముక్కల్లో..... ఛార్మి,సకూచి అంతే!

ఇందులో ఛార్మి గారు ఒక ప్రముఖ సినినటి :))

ఇక ఈ 'సకూచి ' ఎవరబ్బా అనుకుంటున్నారా? 'సకూచి'....అనగానే మీరు పసిగట్టేయాలి.....మన కాశిమజిలి కథల్లో.....'పిడతకూచి' అంటే ఎవరు? 'పిశాచి' అంటే ఎవరు? అలాగే 'సకూచి' కూడా....ఇది ఎవరినైనా ఆవహిస్తే.....వాళ్ళు చచ్చేదాకా వదిలిపెట్టదు.... :D

ఈ 'సకూచి' గారు....చార్మి గారిని పట్టుకుని పీడిస్తే...ఏం జరుగుతుందో.....అదే కథ :D

సరే...కథనం విషయానికి వస్తే....ఒక పనిపాట లేని మంత్ర గాడు(ప్రదీప్ రావత్)....పిచ్చి పిచ్చి ప్రయోగాలు, చేతబడులు చేస్తూ ఉంటాడు. వాడికి దయ్యాలు,పిశాచాలు మంచి ఫ్రెండ్స్.అలాగే మన 'సకూచి' వారు కూడా! వీడి కొడుకు చచ్చిపోవడానికి 'ఛార్మి' కారణం అని నమ్మి ఈ 'సకూచి' ని నిద్రలేపి మరీ ఛార్మి మీదికి పంపుతాడు. కాని ఇక్కడే ఉంది ఒక ట్విస్ట్! 'సకూచి'......అన్ని దయ్యాల్లాగా.....అల్లరిచిల్లరి దయ్యం కాదు! ఇది ఒక్కసారి ప్రయోగించబడితే..... సీతయ్యలాగా... ఎవరి మాటా వినదు.....ఆ ప్రయోగించిన మాంత్రికుడి మాట తప్ప! మరి మన మెంటల్ మాంత్రికుడేమో  ఇంచక్కా దాన్ని ఛార్మి మీద ప్రయోగించేసి.... బాల్చి తన్నేస్తాడు. ఇక ఎలా? 'సకూచి' నించి ఛార్మి ని రక్షించే శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడుంది?

ఇంతలోనే....సినిమాలో మసాలా ఎలిమెంట్స్ మిక్స్ చేయడానికి రెండు సాంగ్లు....మూడు ఫైట్లు ఉంటాయన్నమాట! ఇందులో 'సకూచి' చేసిన ఫైట్ కూడా ఉంటుందన్దోయ్! 'సకూచి' పూనినప్పుడు.....ఛార్మి చేస్తుంది ఫైటు....హ్హహ్హహ్హా ... ఇరగదీసేస్తుందిలే! ఒంటి చేత్తో....రౌడీల దుమ్ము దులిపేస్తుంది తెల్సా! అలా  'సకూచి' వారి విశ్వరూపం ప్రదర్సించాక.....ఛార్మి బ్రతికి బైటపడే మార్గం తెలుస్తుంది....అదెక్కడో తెల్సా! ....'శివకోన' అనే జంగిల్ సెట్టింగ్ లో ;)


ఇక ఎలాగోలా రొప్పుతూ,రోస్తూ ఈ శివకోన చేరిన ఛార్మిని  ఈసారి కొంచెం గట్టిగా పూనుతుంది మన 'సకూచి'. ఇక చూడండి.....ఆ శివకోనలో 'సకూచి'గారి  విలయతాండవం అబ్బో కేకోకేక!ఈలోగా ఈమెని రక్షించడానికి ఒక 'అఘోర'ల గుంపు జింగుజింగుమని ఎగురుకుంటూ వస్తుంది.ఇది క్లైమాక్స్......ఇక్కడ మనం మాములుగా .....పూజలు...గట్రా ఊహించుకుంటాం. కానీ డైరెక్టర్ గారి స్కిల్ మరి! ఇక్కడ ఆ అఘోరాల చేత మాంఛి గ్రూప్ డాన్స్ పెట్టించాడు. వాళ్ళు అలా కాలికొచ్చిన డాన్స్ వేస్తూ ఉంటె....ఇక ఛార్మి గారి వెకిలి చేష్టలు మొదలౌతాయ్! నాలుక బైట పెట్టడం..... భయపెట్టాలని ముఖంలో పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ పెట్టడం....నేల మీద పాకడం...గాల్లో ఎగరడం అబ్బో! ఛార్మి నట విశ్వరూపం(!?) చూడవచ్చు! నాకైతే భయం సంగతి పక్కనబెడితే.....'ఎహే! ఏంటి ఈ సుత్తి గోల....తొందరగా తేల్చండి' అని అనిపించింది.

అలా అఘోరాలు డాన్సు....చేసి...చేసి.... ఛార్మి వికృత చేష్టలు... చేసి...చేసి...... అలసిపోతున్నప్పుడు ......నాకు విసుగొచ్చి ఆవలిస్తున్నప్పుడు..... ఇక శివుడికి చిరాకేసి .....'ఆపండ్రా బాబోయ్! మీగోల భరించలేకపోతున్నా!' అని జలశివలింగ రూపంలో దర్సనమిస్తాడు. ఆ శివజలం ఛార్మి మొహం మీద కొట్టగానే.....మనం బ్రతికిపోతాం.....అంటే....'సకూచి' గారు చార్మిని వదిలేసి వెకేషన్ కి వెల్లిపోతారన్నమాట.

అద్గదీ సంగతి! అలా ఛార్మి 'సకూచి' కి టాటా చెప్పేసి....మనకి బై చెప్పేస్తుంది.నేను బ్రతుకుజీవుడా....అని టీవీ కట్టేసా! 

ఆనక ఒక స్ట్రాంగ్ టీ తాగితే కాని తలనెప్పి వదల్లేదు!

కాని నాకు ఈ సినిమాలో ఒక తీరని వెలితి కనిపించింది. అదేంటంటే.....ఎంతసేపటికి సకూచి  చార్మిని ఆవహించడమే చూపించారుగాని......అసలు సకూచి  'రూపలావణ్యాలు'....'అందచందాలు' ఎక్కడా చూపించలేదు! నేనెంత ఫీల్ అయ్యానో తెల్సా! మరి రాత్రి నిద్రపోయేటప్పుడు.....నా కలలోకి సకూచి  రావాలంటే....దానికి ఏదో ఒక రూపం ఉండాలి కదా! హ్మ్! ఏం చేస్తాం! నా 'సకూచి' ని చూపించకుండానే సినిమా మొత్తం లాగించేసారు! :((

నాకు బాగా చిరాకేసినవి మాత్రం కితకితలు పెట్టుకున్నా నవ్వురాని కామెడి సీన్లు.....ఎంత భయపడాలనుకున్నా వీలు  కానీ హర్రర్ సీన్లు!!  కానీ లాస్ట్ క్లైమాక్స్ లో ఒక 'ఫార్మేషన్' నాకు  నచ్చింది. ఇక్కడ ఫోటోలో చూపించినట్టు ఆ అఘోరాలందరూ.....ఇలా 'శివలింగం' ఆకారంలో ఫార్మ్ అవుతారు! మధ్యలో ఛార్మి ఉంటుంది ;) అప్పుడు ఒక్కసారిగా మధ్యలోనించి  స్ప్రింగ్ లాగా ఛార్మి పైకి లేస్తుంది...అది వేరే విషయం :))))

ఇక ఈ సినిమాలో...నాకు ఛార్మి అస్సలు....అసలులో కొసరు కూడా నచ్చలేదు.ఛార్మిలో మునుపటి చార్మ్ పోయింది  ;) డాన్స్ లో కూడా గ్రేస్ లేదు. మ్యూసిక్ ఓకే ఓకే.... డైరెక్షన్ పూర్! ఏదో సరదాగా ఏమి తోచకపోతే ఒకసారి చూడొచ్చు!

ఈ సినిమాలో....ఒక సస్పెన్స్ కాని....థ్రిల్ కాని....హర్రర్ కానీ ఏమి లేదు.....నేనిప్పటికే దీనిని తలదన్నేలాంటి  దయ్యం సినిమాలు చూడటం వలన.....ఇది నాకు కామెడి సినిమాగా గుర్తుండిపోతుంది తప్ప.....నో సీరియస్ ఎలిమెంట్స్! సో! మీకెవరికైనా దయ్యాలంటే భయముంటే....దయ్యాల సినిమాలు చూసే ధైర్యం లేకపోతె.....మంచి కామెడి ఎంటర్టైనర్ కావాలంటే ఈ సినిమా చూడండి :)) ఇందులో ఎటు దయ్యంకి ఒక రూపం ఉండదు కనుక.... ఛార్మినే దయ్యం పాత్ర కూడా పోషించింది కనుక.....మనం ఛార్మికి భయపడే సీన్ లేదు కనుక...ధైర్యంగా ఎంజాయ్ చేస్తూ సినిమా చూసేయోచ్చు!

ఇది 'మంగళ' సినిమా మీద ఇందు రివ్యు ;)

2, మార్చి 2011, బుధవారం

శివ..శివ...హర..హర!

'ఓం నమశ్శివాయ'

ఇవాళ శివరాత్రి కదా! శివుడికి బోలెడు ఇష్టమైన రాత్రి....లయకారుడు లింగోద్భవమై  దర్సనమిచ్చే రాత్రి! మనం  శివరాత్రి ముచ్చట్లు....అలాగే శివుడికి నాకు మధ్య డిష్యు-డిష్యుం అన్నీ చెప్పేసుకుందామే!

ఇప్పుడంటే నాకు కృష్ణుడంటే వల్లమాలిన భక్తీ కానీ....చిన్నప్పటినించి నాకు తెలిసిన దేవుడు శివుడే! మా ఇంట్లో పెద్ద శివుని పటం ఉంటుంది.అది ఒక పెయింటింగ్.ఏదో పెయింటింగ్ ఎక్జిబిషన్ లో నాన్నగారికి బాగా నచ్చి దాన్ని తీసుకొచ్చి ఫ్రేం కట్టించారు! మా ఇంట్లో శివుడి బొమ్మలాంటి బొమ్మ మరెక్కడా చూడలేదు! సాక్ష్యాత్తు శివుడే వచ్చి యోగముద్రలో తపస్సు చేస్తున్నట్టు ఉంటుంది :) 


మా ఇంటికి కూతవేటు దూరంలో 'మల్లిఖార్జున స్వామీ' దేవాలయం ఉండేది.ఆ గుడి ప్రధాన పూజారి మాకు బాగా తెలుసు! ప్రతి సోమవారం అభిషేకం....పండగ రోజుల్లో,పుట్టిన రోజులకి అర్చన....అలా ఆ గుడంటే క్రమంగా ఇష్టం ఏర్పడింది. ఎక్జాంస్ అప్పుడు రోజు ఆ గుళ్ళో దేవుడికి దణ్ణం పెట్టుకుని పరీక్ష రాయడానికి వెళ్ళేదాన్ని! ఆ స్వామి దయవల్లేనేమో.....ఇంత బాగా చదువులు అబ్బాయి మాకు! నా చిన్నప్పుడు ప్రతి శివరాత్రి ఆ గుళ్ళోనే జరిగింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఫుల్లుగా స్వెట్టర్లు వేసుకుని, ఆ చలిలో బయలుదేరేవాళ్ళం గుడికి.ఇక పూజారి అప్పుడు పూజ మొదలు పెట్టి ఏకాదశ మహారుద్రాభిషేకం చేసి....చివరికి సరిగ్గా పన్నెండు గంటలకి లింగోద్భవ వేళ స్వామీ వారి దర్సనం చేయించేవాడు! ఆ చలిలో అలాగే ముడుక్కుని....కళ్ళ మీదకి నిద్రోస్తున్నా ఆపుకుని.... పంచాక్షరిని జపిస్తూ అలాగే కుర్చునేదాన్ని! నేను చలికి వణుకుతూ ఉంటె...అమ్మ చెప్పేది...'శివరాత్రికి చలి శివ...శివా...అని పారిపోతుంది.ఇక చలి బాధ ఉండదులే' అని :) 


కొద్దిగా పెద్దయ్యాక మాకు ఇక గుడికి వెళ్ళే తీరుబడి లేకపోయింది. నేనే ఇంట్లో ఎలాగో అలా ఒంటిగంటవరకు జాగారం(!) చేసి.....నా ముత్యాల దండనే జపమాలగా అనుకుని పంచాక్షరిని జపిస్తూ అలాగే పక్కకి ఒరిగి నిద్రపోయేదాన్ని ..... అలా ప్రతి శివరాత్రి ఇలా జాగారం చేయడం....శివనామస్మరణ చేయడం అలవాటయిపోయాయి! క్రమంగా పరిస్థితులు మారాయి.శివరాత్రికి ఏదో ఒక పవిత్ర క్షేత్రానికి వెళ్ళడం అలవాటయింది.అలా ఒకసారి  శ్రీశైలం వెళ్ళాం! కాని అనుకోకుండా కొన్ని కారణాలవల్ల తిరిగి వచ్చేసాం! అప్పుడు ఎంత బాధేసిందో! నా ఫేవరేట్ పుణ్యక్షేత్రం- శ్రీశైలం. ఆ మల్లిఖార్జునున్నిచేతులార తాకి.....తలని ఆ లింగానికి ఆన్చి మొక్కుకుని....చేతులకు అంటిన ఆ పవిత్ర లింగం యొక్క విభూదిని మహాప్రసాదంగా భావించి ఒక అలౌకికమైన ఆనందంలో మునిగితేలుతూ....బైటికి వస్తుంటే.... 'ఈ గుడిలో శిలనైనా కాకపోతిని స్వామీ నీ సేవ చేయగా ' అని అనిపిస్తుంది! శ్రీశైలం ఇప్పటికి ఏ ముప్పయ్ సార్లో వెళ్లుంటాం....కనీసం ఏడాదిలో మూడు-నాలుగు సార్లు కంపల్సరీ.కాని శివరాత్రి రోజు వెళ్ళాలనే కోరిక మాత్రం తీరలేదు :(

ఇక శివరాత్రి స్పెషల్ అంటే గుర్తొచ్చేది మా గుంటూరు జిల్లా కోటప్పకొండ. అసలు ఈ టైంకి హడావిడే హడావిడి! పెద్ద పెద్ద ప్రభలు కడతారు...వాటిని ఊరేగిస్తూ కొండమీదకి తీసుకెళ్లడం అది ఇంకా పెద్ద ప్రహసనం.అవి తీసుకు వెళ్ళేటప్పుడు ఆ దారిపొడవునా కరెంటు తీస్తారు.ఆ ప్రభలు అంత పొడవుగా ఉంటాయ్ మరి! ఆ తరువాత ఇక తిరునాళ్ళ! కొండమీద తిరునాళ్ళ జరిగాక....మరుసటి రోజు నరసరావుపేటలో పల్నాడు రోడ్డులో 'శివుడి బొమ్మ సెంటర్' దగ్గర మళ్లీ ఇంకోసారి తిరునాళ్ళ జరుగుతుంది. ఆ రోజు కూడా ఊరంతా ప్రభలను ఊరేగిస్తారు. వాటిముందు డాన్సులు వేస్తారు....అబ్బో....గోలగోలలే! :))


మా కోటయ్య స్వామీ మాత్రం ఏం తక్కువ తిన్నాడు!ఇక్కడ ఎంత పద్దతిగా అభిషేకం చేస్తారో! శ్రీశైలంలో హడావిడి కార్యక్రమం ఐతే....ఇక్కడ చాల నిమ్మళంగా..కుదురుగా చేస్తారు. కన్నులపండువగా చూడొచ్చు అంతసేపు స్వామిని. ఐతే....శ్రీశైలం లో స్వామిని తాకే బంపర్ ఆఫర్ ఇక్కడ లేదుగా! అందుకే...దేనికి అదే సాటి :)) నేను ఒకే ఒక్కసారి తిరునాళ్ళకి వెళ్ళా! మా ఫ్రెండు వాళ్ళ తాతయ్య ఒకరు కోటప్పకొండలో ఉన్న ఒక సత్రానికి అధికారి :) ఆయన వి.ఐ.పీ టిక్కెట్లు ఉన్నాయ్...రమ్మంటే నేను,మా ఫ్రెండ్సు వెళ్లాం :)) కాని మేము వెళ్ళేసరికే ఎవరో వచ్చి ఆ టికెట్లు తీసుకేల్లిపోయారట! అలా కొండ ఎక్కి మరీ స్వామిని చూడకుండా వచ్చేసాం! :(

హ్మ్! ఇన్ని చెప్పి మా అమ్మమ్మగారి ఊళ్ళో శివుడి గురించి చెప్పలేదు చూడండి? అయినా మీకు తెలిసిందే కదా ఆ సంగతి.....మా క్షీరా రామలింగేశ్వర స్వామీ.....ఎంత మంచోడో! ఈయనోక్కడే కొంచెం నామీద జాలి చూపించాడు! :D


ఇదెక్కడి చోద్యమో! అటు శ్రీశైలం వెళితే....మల్లన్న....'బెటర్ లక్ నెక్స్ట్ టైం' అన్నాడు....ఇటు కోటప్పకొండలో ...కోటయ్య కూడా....' ఈసారికి ఇలా కానిచ్చేయ్ నాన్నా! ఇంకోసారి చూద్దాంలే!' అన్నాడు. ఈసారి ఇక్కడ మిషిగన్లో...ఫ్లింట్ లో 'పశ్చిమ కాశి' అని పెద్ద శివుని గుడి ఉంది. ఎంత బాగా పూజ చేస్తారో.....అక్కడికి వెళ్దామంటే కుదరనీయకుండా ఒక అడ్డుపుల్ల వేసాడు! హ్మ్! శివుడు బహు చమత్కారి సుమా!!


శివుడెమైనా నా విషయంలో హార్ట్ అయ్యాడా? నేనేం చేసానబ్బా? ఓ! కిట్టుని ఎక్కువగా పట్టించుకుని....శివుడి విషయంలో కొంచెం కినుక వహించాను అనేమో! ఎమన్నా ఉంటే మాట్లాడుకోవాలికాని ఇలా అలిగితే ఎలా?  ఏదేమైనా....శివుడు నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు.ఐ హార్ట్! ఐ హార్ట్ అంతే!! ఇప్పుడు ఇద్దరికీ డిష్యుం-డిష్యుం. శ్రీశైలం వెళ్లి సుమారు రెండు సంవత్సరాలౌతోంది!! ఎవరికీ చెప్పను నా బాధ?? (అమ్మో! ఇలా బాధపడుతున్నా అని తెలిస్తే....శివుడు ఇంకా బెట్టు చేస్తాడో ఏమో!!....)

హ్మ్! ఇక చేసేదేముంది? ఆయనగారి అలక తీరేవరకు నాకు శివరాత్రి రోజున శివాలయంలో శివుని దర్సనం లభించదు :)) అంతే!

అదండీ నా శివరాత్రి సంగతుల్స్! వాట్ ఎల్స్!?

ఓకే మరి....అందరు ఉపవాసాలు చేసి....జాగారాలు చేసి...శివుడి కటాక్షం పొందండి....జాగారం అంటే...బ్లాగుల ముందు...బజ్జుల ముందు కూర్చోడం కాదు ;) శివనామస్మరణ చేయాలి....అర్ధమయిందా? ;) 

'ఓం నమశ్శివాయ' అనండి....అన్నారా? లేదా?.....అద్దీ అలా మంచిగా మాట వినాలి :) 

మరొక్క సారి అందరికి శివరాత్రి శుభాకాంక్షలు :) 

'ఓం నమశ్శివాయ'