16, ఆగస్టు 2011, మంగళవారం

నేను....నా వరలక్ష్మి వ్రతం.

హబ్బ! ఎలాగైతేనేం.....నా మొదటి వరలక్ష్మి వ్రతం పూర్తి చేసుకున్నాను [క్రితం సంవత్సరం కుదరలేదులెండి]

అసలు మూడు రోజులనించి ఒకటే హైరానా! సరే...వ్రతం చేసుకుంటాను..... మరి వాయనాలు? ఎవరికి ఇవ్వాలి? ఎక్కడికెళ్ళి ఇవ్వాలి? ఇలా బోలెడు డౌట్లు బుర్రని వడ్రంగి పిట్టలా పోడిచేస్తున్నాయ్ [పోలిక బాగుందా? నేనే కనిపెట్టా ;) ]

అసలే కొత్త అపార్ట్మెంట్లోకి దిగాం.దీనికి తోడు....మా ఎదురు, పైన,పక్కన అందరూ నిశివర్ణ పరాక్రములే! మనకేందుకులేమ్మని కిమ్మనకుండా ఉంటున్నాం. ఇప్పుడు వాయనం అనుకుంటూ వెళితే ఇంకేమన్నా ఉందా?

ఈ దిగులుతోనే ఎలాగో అలా పూజసామాగ్రి తెచ్చుకున్నాను. షాపువాడిని 'నల్ల శనగలు' ఉన్నాయా అని అడిగితే.....'గ్రీన్/ఎల్లో' ఉన్నాయ్ అని చెప్పాడు. హతవిధీ అనుకుని ఆ 'ఎల్లో' శనగలే తెచ్చుకుని ముందు రోజు రాత్రి ననబోసా. ఇంతలోకే మా చందూ కొలీగ్ వైఫ్ వ్రతం రోజున పేరంటానికి పిలిచారు. తెలుగువారే! ఇక ఇదే చాన్స్ అనుకుని వారిని అదే రోజున మా ఇంటికి భోజనానికి పిలిచా! పనిలోపని వాయనం ఇవ్వొచ్చు కదా అని ఆశతో. ముందు మొహమాటపడ్డా తర్వాత వస్తామన్నారు ఇంటిల్లిపాది. అప్పుడు నాక్కొంచెం మనసు కుదుటపడింది.

ఇక మరుసటిరోజు ఐదింటికి అలారం పెట్టా! యధావిధిగా ఆరింటికి లేచా![అలా చూస్తారేం? చాలా తొందరగా లేచా కదా!] లేస్తూనే పనిలోపని చందుని లేపేసా! 

'నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే......నేను పొద్దునే లేవటం ఎందుకు ఇందు?' అంటే......
'ఆహా! మరి వంటకి సాయం ఎవరు చేస్తారుట?' పూజకి ముందే ప్రసాదాలు చేయాలి కదా! అసలే తొమ్మిది రకాలు చేయాలనీ డిసైడేడ్' అని చెప్పా! 
మా చందూ గుండెలో రాయి పడింది. అయినా ఆ చేదు నిజాన్ని దిగమ్రింగి....నేను తీసుకున్న వయోలేంట్ డెసిషన్ కి తన సహాయసహకారాలు పూర్తిగా అందించాడు :) [ఎంత మంచాబ్బాయో కదా!]

ఇద్దరం లేచి...తల స్నానం చేసి ప్రసాదాలు వండటం ప్రారంభించాం.ముందుగా నేనైతే.... ఎంచక్కా మడిచీర కట్టుకుని..... కాళ్ళకి పసుపు రాసుకుని..... నాకు ఇష్టమైన ఆహార్యంలో....   నాకు చాలా ఇష్టమైన తులసి కుండికి [ఇక్కడ కోటలు,మేడలు కట్టలేములెండి] దణ్ణం పెట్టి పువ్వులు పెట్టి.....దాని ముందు ముగ్గులేసి పసుపు,కుంకుమ చల్లి దణ్ణం పెట్టొచ్చా! :) అలాగే ఇంటిముందు ముగ్గేసి వచ్చా! [అబ్బ! నా కోరిక తీరింది]

ఇక ఇందుగారు వంటగదిలోకి రంగప్రవేశం చేసారు. చకచకా పచ్చి చలివిడి చేసేసారు. వెనువెంటనే అప్పాలు చేసేసి ఎర్రగా వేయించేశారు. ఇంతలో చందుగారేమో పులిహోర కలిపేసి, పరమాన్నం  చేయడంలో మునిగిపోయారు. అంతలోనే ఇందుగారు టకటకా టమాటా పప్పు చేసి,చకచకా చిక్కుడు కూర చేసి, ఇక రసం పెట్టే పనిలో మునిగిపోయారు. ఈలోగా చందుగారు చేసిన పులిహోర,పరమాన్నం రెడీ అయిపోయాయి. అంతలోనే కొబ్బరి+మామిడి కలిపి పచ్చడి చేసేసారు ఇందుగారు.

సరే కదా అని కాస్త నుదురుకి పట్టిన చెమట తుడుచుకుంటూ టైం చూద్దుము కదా! ఎనిమిదిన్నర!!!!!! చందూ గారు 'కేవ్వవ్వ్వ్వ్' అని ఒక కేక పెట్టి తొమ్మిదింటికి మీటింగ్ ఉంది అని పరిగెత్తారు. నేను 'హిహిహి' అని నవ్వుకుని ఆ ప్రసాదాలన్ని ప్లేట్ల్స్లో ఎంచక్కా సర్దుకుని పూజకి అన్నీ రెడీ చేసుకునే పనిలో పడిపోయాను.

ఇక ఎంచక్కా ఉప్పాడ పట్టుచీర కట్టుకుని, నా ఫ్రెండు బుల్లి ఇచ్చిన నెక్లెస్ సెట్ పెట్టుకుని, అచ్చ తెలుగు అమ్మాయిలా చక్కగా ముస్తాబయ్యి ...... హాల్ లో ఒక మూల అమ్మవారికి మండపం ఏర్పాటు చేసుకుని..... ఫలములు-పుష్పములు,ఇతర పూజా ద్రవ్యములు అన్నీ దగ్గర పెట్టుకుని అత్యవసరమైన లాప్టాప్ కూడా పక్కనే పెట్టుకుని.... ఒక పండు,తాంబూలం తీసుకుని తూర్పు ముఖముగా కూర్చుని పూజ ప్రారంభించాలని సంకల్పించాను.

ఇంతలో ఇంకో డౌటు మదిలో మెదిలింది. తోరాలు కట్టాలి కదా! అని. వెంటనే టిక్కు-టిక్కు  అని నంబర్లు నొక్కి ఇంటికి కాలాను. 

మా అమ్మ ఫోన్ ఎత్తి 'పూజ అప్పుడే...అయిపోయిందా 'అంది.
'ఇంకా మొదలే పెట్టలేదే తల్లీ...ముందు ఈ తోరాలు ఎలా కట్టలో చెప్పు....మూడు తోరాలు కట్టాలి అట కదా!' అన్నాను.
"ఓ! అదెంత పని.... తొమ్మిది దారపు పోగులు తీసుకుని,పసుపు రాసి,వాటికి తొమ్మిది పూలతో తొమ్మిది ముడులేసి తోరం కట్టాలి' అని చెప్పింది.
'ఈ తొమ్మిది గోలేంటి అమ్మా! అయినా ఇప్పుడు నేను పూలు మాల కట్టాలా?' అని నొక్కినోక్కి అడిగాను.
'మరి చెప్పింది అదే కదా! తొమ్మిద పూలతో తొమ్మిది ముడులేయాలి' అన్నది మా అమ్మ.
'అది మామూలు జనాలకి ఐతే లెఖ్ఖ. మనం కొంచెం వెరైటి కదా! నాకు పూలు మాల కట్టడం రాదు కాదే తల్లి.....ఇప్పుడు తొమ్మిది పూలు X మూడు తోరాలు = 27 పూలు మాల కట్టాలంటే నేను కిందపడి దొర్లి ఏడ్చినా నావల్ల కాదు కదా అమ్మా!"
" నీ ఖర్మ! నీకు చిన్నప్పటినించి కొన్ని వందల సార్లు చెప్పా! పూలు మాల కట్టడం నేర్చుకోవే అని. విన్నావు కాదు. ఏదో ఒకటి చేయి. పోనీ తొమ్మిది ముడులేయ్యి చాలు"
"ముడులంటే ఏం ముడులు? నాకు అడ్డదిడ్డంగా పీటముడి తప్ప ఇంకేం ముడులు రావు కదే!"
"నా ఖర్మ! ఎంత పనిమంతురాలివే తల్లీ! ఇంకా నయం అబ్బాయిగా పుట్టలేదు.... పెళ్ళిలో మూడు ముడులంటే నోరు వేల్లబెట్టేవాడివి"
"అమ్మా! జోకులా? ఇంకో రెండు గంటల్లో భోజనాలకి చందూ కొలీగ్స్ ఫ్యామిలి వస్తారు.....అటు,ఇటు కాకుండా అయిపోతుంది. వ్రతం ఈలోగా పూర్తి చేయాలి. ఈ తోరాలు లేకుండా వ్రతం చేయాలేమా?"
" ఎలాగో అలా తొమ్మిది పూలతో తొమ్మిది ముడులు వేయడం నేర్చుకో. గంట కానీ...రెండు గంటలు కానీ. ఇప్పుడు రాకపోతే ఇక ఎప్పటికీ రాదు. పూజ అయ్యాక ఫోన్ చేయి' అని ఠపీమని ఫోన్ పెట్టేసింది మా అమ్మ!

వాఆఆఆఅ..................వాఆఆఆఆఆ...........

మీరు నమ్మరేమో....కనీసం ముప్పావుగంట పట్టింది నాకు పూలు మాలకట్టడం నేర్చుకుని, ఆ మూడు తోరాలు చేయడానికి. [పాపం ఇందు కదా!]

ఎలాగోలా ఆ తోరాలు కట్టి....ఇక రాగా.కాం తెరిచి వరలక్ష్మి వ్రత విధానం ఆడియో ఆన్ చేశా!

ముందు కాసేపు బానే జరిగింది. గణపతికే అరగంట పూజ చేసాడు ఇక వరలక్ష్మికి గంటన్నర చేస్తాడేమో అనుకున్నా. కానీ పర్లేదు తొందరగానే పేకప్ చెప్పేసాడు. అయినా ఈ పూజ మొత్తంలో ఒక పదిసార్లు ఆ ఆడియోకి పాజ్ పెట్టి,లేచి అవి-ఇవి తెచ్చుకుని మళ్లీ స్టార్ట్ చేసాను.[అలా చేయొచ్చో లేదో!]

అమ్మవారికి ఎంచక్కా మొదటి వాయనం ఇచ్చి బోలెడు కోరికలు కోరేసుకున్నా ;) 

ఇక లాస్ట్ కి నైవేద్యం అప్పుడు......నారికేళం కొట్టమన్నాడు. నేను వంటగదిలో పట్టకారు తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నా! ఆయన చెప్పిందే తడవుగా ఆ కొబ్బరికాయ తీసుకుని ఆ పట్టకారుతో రెండు పీకులు పీకా! అబ్బే! అస్సలు చలనం లేదు. 'ఈ చందుని తెమ్మన్నాను చూడు నాది బుద్ది తక్కువ! ముదురుకాయ అనుకుంటా!' అని రెండు సనుగుళ్ళు సణుక్కుని మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించా!

 హ్మ్! దాన్ని కొట్టే దెబ్బలకి నా చెయ్యి ఎర్రగా కందిపోయిందిగాని అది తొణకదు,బెణకదు. నాకు నీరసమొచ్చేస్తోంది. అసలే పొద్దునించి కడుపులో మేతలేదు! పైగా పొద్దున్నే లేచా! ఎంత చాకిరి చేశా! టైం చూస్తే.....పన్నెండు! ఇక ఇహనో,ఇపుడో వాళ్ళు వచ్చేస్తారు. 'అయినా వ్రతం అంతా అయిపోవచ్చాక ఈ కొబ్బరికాయ దగ్గర ఆపేసావేంటి తల్లి?' అని అమ్మవారివంక దీనంగా చూసేసరికి కరిగిపోయిందో ఏమో....నెక్స్ట్ కొట్టిన దెబ్బకి కొంచెం పెచ్చు లేచింది. ఇక దానికి ఒక రంద్ర్హం చేసి ముందు నీళ్ళు అన్నీ గిన్నెలో పట్టేసి....ఆనక ధబీధబీమని బేకితే అప్పుడు అష్టచేక్కలైంది మా కొబ్బరికాయ! 

"ఈ విషయం చచ్చినా ఎవరికి చెప్పకూడదు. ఆఖరికి కొబ్బరికాయ కొట్టడం కూడా రాదా? అని నవ్వి ముక్కున వేలేసుకున్నా.... వేసుకొందురు..... అయినా ఎప్పుడు నేను కొబ్బరికాయ కొట్టినా ముచ్చటగా మధ్యకి చీలి రెండు వక్కలౌతుంది. ఇదేమి ఖర్మో! ఇవాళ ఇలా ఏడిపించింది".... అని నాలోనేనే మధనపడి...ఎలాగో అలా మొత్తానికి చివరాఖరికి నానావిధఫల,భక్ష్య భోజ్యాలతో అమ్మవారికి నైవేద్యం పెట్టాక.... 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నా!

అనుకున్నట్టే....పన్నెండున్నరకి వారు పిల్ల-జేల్లతో సహా ఇంటికి భోజనానికి వచ్చారు. ఆమెకి ఎంచక్కా బొట్టు పెట్టి,పసుపు రాసి నా వంకరటింకర తోరము కట్టి, వాయనం ఇచ్చి..... దణ్ణం పెట్టా! 

తరువాత  మేము చేసిన అపురూప వంటకాలతో వారికి కొసరికోసరి వడ్డించి మరీ భోజనాలు పెట్టాం. మిక్కిలి సంతసించిన ఆమె సాయంత్రం వాళ్ళింటికి నలుగురైదుగురు ముత్తైదువులు వాయనానికి వస్తారని...... కావాలంటే నేను కూడా వాళ్ళకి వాయనమివ్వోచ్చని చెప్పారు. ఇక సంతోషంతో నాలుగు గెంతులు వేసి..... సాయంత్రం నా వాయనాలన్ని తీసుకుని వాళ్ళింటికి వెళ్లా! అక్కడ అందరికీ ఇచ్చి, వాళ్లకి తెలిసినవాల్లింటికి వెళ్లి ఇచ్చి, వాళ్ళలో కొందరు వాళ్ళింటికి నన్ను పిలిచి నాకు ఇచ్చి..... అలా బోలెడు మందికి వాయనాలు ఇచ్చి-పుచ్చుకుని, అలా చాలామందితో ఫ్రెండ్షిప్ చేసేసుకుని రాత్రి ఏ పదింటికో తెరిపిన పడ్డాను :) 

హమ్మయ్య! ఎలాగైతేనేం...........చందూ గారి అపరిమితమైన సహాయసహకారాలతో నా మొదటి వరలక్ష్మి వ్రతం గ్రాండ్ సక్సెస్! దేశంకాని దేశంలో వాయనాలు ఎవరికి ఇవ్వాలో అని పడ్డ టెన్షన్ అంతా హుష్ కాకి :) 

అదండీ.....నేను....... నా వరలక్ష్మి వ్రతం కథ! ఈ కథా శ్రవణం[అదే..వీక్షణం] చేసిన మీరందరూ కామెంట్ల అక్షతలు[అంటే తిట్లు కాదు బాబోయ్...దీవెనలు] నామీద జల్లుతారని ఆశిస్తూ....మీ ఇందు :) 


నా వ్రతం ఫోటోలు పెడుతున్నానోచ్! అడిగిన వారందరూ చూసేయన్దోచ్!





29 కామెంట్‌లు:

విరిబోణి చెప్పారు...

బావుంది ఇందు మొత్తానికి నీ ఇస్తినమ్మా వాయనాలు, పుచ్చుకుంటినమ్మ వాయనాల వరలక్ష్మి వ్రతం :) ఫోటో కూడా పెట్టి వుంటే మేము చూచి తరించేవాళ్ళం కదా :)

విరిబోణి చెప్పారు...

నేను కూడా వాయనాలకు చాట ల కోసం చూసా ఇందు మీరు ఫోటో లో పెట్టినట్టు..మరి ఇక్కడ దొరక వేమొ మనకు :)

వాత్సల్య చెప్పారు...

>>మేము చేసిన అపురూప వంటకాలతో వారికి కొసరికోసరి వడ్డించి మరీ భోజనాలు పెట్టాం...

క్రిష్ణప్రియ గారు రాసినట్టు "అమ్మో ఏమి రుచి" అనుకున్నారో " ఆహా ఏమి రుచి" అనుకున్నారో మరి ...:)))

ఆత్రేయ చెప్పారు...

ఎవరూ దొరకక పోతే మిషెల్ ని పిలిచి ఆమె నిశివర్ణ పాదములకు హరిద్ర లేపనం పూసి .. మిగతా క్రతువు జరిపించి అమ్మా ఆమెరికా ఆర్ధిక పరిస్థితి, తద్వారా ఇతర దేశాల స్థితి బాగుపడేలా చూడామణి నీ పతి కి చెప్పమ్మా అనేవారా?

మధురవాణి చెప్పారు...

బాగా చేసుకున్నావన్నామాట.. వరలక్ష్మీ వ్రతం.. Indu is a good girl! :))

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆ వరలక్ష్మి దేవి మీపై కటాక్ష వీక్షణాలు ప్రసరించాలని, సకల సౌభాగ్యాలు కలగ జేయాలని కోరుకుంటూ నాలుగు అక్షంతలు వేస్తున్నాము.

మరి మాకేంటి?

durgeswara చెప్పారు...

అమ్మ అనుగ్రహముంటే అంతేనమ్మా
మీ వ్రతవిధానానికి ఆటంకం లేకుండా లోపం లేకుండా జరిపించింది. జగన్మాత అనుగ్రహం మీమీద సంపూర్ణంగా వర్షించాలని కోరుకుంటున్నాను

ఛాయ చెప్పారు...

అవును తొమ్మిది ఆత్మా ప్రదక్షిణాలు చేశారా!:) చక్కగా చేసుకోన్నరుగా.. ఓ వాయనం ఫోటో కూడా పెట్టాల్సింది..

హరే కృష్ణ చెప్పారు...

బావుంది ఇందు
చక్కగా చేసుకున్నదుకు ఆభినందనలు
ఇచ్చినమ్మా టాస్క్ అంటే కంప్లీట్ చేసినమ్మా టాస్క్ :))
జావా గర్ల్ కి జేజేలు
వెన్నెల ఇందు కి జేజేలు :))

Praveena చెప్పారు...

Very good post :)

లత చెప్పారు...

బాగా చేసుకున్నారు ఇందూ, అలవాటైతేనే వ్రతం అయ్యేవరకూ టెన్షన్ తప్పదు.మొదటిసారి అంటే ఇక చెప్పక్కర్లేదు.
చేట భలే క్యూట్ గా ఉంది

చాతకం చెప్పారు...

అంతా బానే ఉంది కానీ నాకు ఒక బుల్లి డౌటు. ఇది వరలక్ష్మీ వ్రతమా లేక వర వెంకటేశ్వర వ్రతమా? ఆ పటం చూస్తె డౌటు వచ్చింది. హిహి.

అన్నట్లు ఆ కొబ్బరికాయలకి పీచు ఉన్నదా లెదా? ;) పట్టకారు కంటె సుత్తి బెటరు. వాష్బేసిన్ లొ కొట్టేకంటే ఒక పెద్ద బాండీ వాడటం సులువు, కార్పెట్ ఖరాబు కాదు.

7>2 తొక్కలో పోపు అన్నము, పాలు చక్కర అన్నములు చెయ్యటానికి అంత బిల్డప్ ఇచ్చిన చందూ గారిదగ్గర శానా నేర్చుకొవాలి ;)

శశి కళ చెప్పారు...

వరలక్ష్మి కటాక్ష పల సిద్దిరస్తు.నాకు ప్రసాదమ్ యెదమ్మా?యెంత చక్కగా ఉయ్యాల ఊగుతుందొ
మా బంగారు ఇందు......

ఇందు చెప్పారు...

@ విరిబోణి:విరిబోణీ నీకోసమే ఫొటోలు కూడా పెట్టా! :) చూడు! అవును ఇక్కడ దొరకవ్! నేనేదో గూగుల్లో వెతికితే దొరికింది అంతే :)

@రిషి :కెవ్వ్వ్! ఇప్పుడు మీరంటే డౌట్ వస్తోంది ;) ఏమో మరి సుష్ఠుగానే ఆరగించారు :)

@ ఆత్రేయ: బహుకాల దర్సనం నా బ్లాగుకి :) లేదండీ. ఎవరు లేకపోతే అమ్మవారికి ఇచ్చిన మొదటి వాయనంతో సరిపెట్తేదాన్ని :)

ఇందు చెప్పారు...

@మధురవాణి: థాంక్యూ మధూ! అబ్బో పొంగిపోయాను నీ పొగడ్తకి ;) థాంక్స్ థాంక్స్

@ బులుసు సుబ్రహ్మణ్యం :అబ్బ! బులుసుగారూ కడుపు నిండిపోయింది :) థాంక్స్ అండీ! మీకేంటనా? నేను చేసిన ప్రసాదాలన్నీ ఏలూరుకి పార్సెల్ :) వాకేనా?

@ durgeswara: అవునండీ. ఎంత శ్రమపడినా చాలా జరిగింది వ్రతం. అంతా మీరన్నట్టు తల్లి దయ. థాంక్స్ అండీ :)

ఇందు చెప్పారు...

@ ఛాయ: ఆ చేసితిని ;) కుఠోలు పెట్టేసా! మీరు చూసేయడమే తరువాయి :)

@ హరే కృష్ణ : హహ్హహా! నీ పోస్ట్లే కాదు కామెంట్లు పంచులతో బాగుంటాఉ హరే!
>>ఇచ్చినమ్మా టాస్క్ అంటే కంప్లీట్ చేసినమ్మా టాస్క్ :))
ఇది కేకో కేక!!

@ Praveena: Thankyou Praveena.

ఇందు చెప్పారు...

@ లత: థాంక్యూ లతగారూ! చేట నాది కాదు గూగుల్ ది :) అవును.వామ్మో! అలవాటయ్యేవరకు ఎంత టెన్షనో!

@ చాతకం:వెంకన్న గుండెల్లో లక్ష్మి దేవి కొలువుండగా ఇంకో పటం ఎందుకని అలా వెంకటేస్వరుని పటం పెట్తేసా! :)

పీచులేని కొబ్బరికాయ పూజకి వాడరుగా! నేను సింకులో కొట్టలేదు....కార్పెట్ మీద టిష్యు పరచి దానిమీద పెట్టిన గిన్నెలో కొట్టాను. ఎప్పుడూ అలాగే కొడతాం ఈసారి కొంచెం ముదురుకాయ అందుకే తిప్పలు!

మీ లెఖ్ఖ తప్పు! :) ఆరుగురికి పులిహోర,పరవాన్నం చేసినా.....టమాటా పప్పుకి టమాటాలు,పచ్చిమిర్చి తరగడం, అప్పాలకి పిండి కలపడం, రసంకి పోపు పెట్టడం ఇలా అన్ని తనూ చేసారు కాబట్టీ 7>2 కాదు 9=9 :) అర్ధమయిందా? :)) మర్చిపోయా బిల్డప్ తనివ్వలేదు..తనకి నేనిచ్చా!! ;)

ఇందు చెప్పారు...

@t is sasi world let us share : హ్హహ్హహా! థాంక్స్ శశి. అయ్యో! ప్రసాదం పార్సెల్ చేయనా పోనీ! హిహి! భలే ఉంటుంది అలా ఊగుతు ఉంటే ;)

Sravya V చెప్పారు...

పూజ బావుంది , ఫోటోలు బావున్నాయి , పోస్టు బావుంది :)))))

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా.. ఇందూ.. సూపరు నువ్వు:) ఫోటోలు భలే ఉన్నాయి. టపా వర లక్ష్మి దేవంత అందంగా ఉంది..
ఈ సంవత్సరం నేను కూడా చేశానోచ్ వరలక్ష్మి వ్రతం :))

ఇందు చెప్పారు...

@ Sravya Vattikuti: ThnQ Sravya :)

@Appu: Wow! apuu thnq somuch :) mari nee pics pampaledem naaku??? :D

స్నిగ్ధ చెప్పారు...

బాగుంది ఇందు మీరు వరలక్ష్మీ వ్రతం చేసుకున్న విధానం..నాకు ఫుటో చూసి డౌట్ వచ్చింది లక్ష్మీ వ్రతమా లేక వెంకటేశ్వర స్వామి వ్రతమా అని...
తిన్న వాళ్ళకి ఏమి కాలేదు కదా...:)
నేను చేసుకున్నా ఈ సారి వ్రతం కానీ మా అత్తయ్య గారితో..హి హి హి..
చెప్పటం మర్చిపోయా ఫుటోలు అన్నీ సూపరూ...

సుభద్ర చెప్పారు...

ఇందు,
చాలా చాలా బాగా చేసుకున్నారు పూజా..అది దేశం కాని దేశం లో టు గుడ్...

ramki చెప్పారు...

ఎలాగా ఐతే ఎం...అమెరికా లో కూడా వాయనాలు ఇచేసారు...
ఇంతకి అంత పూజ చేసి...మీ ఫాన్స్ కి ప్రసాదం పెట్టడం మర్చిపోయినట్లున్నారు..... :)
ఇన వాయనాలు ఇవ్వటానికి అంత ఆలోచించారా ?
ఒక్క మెసేజ్ కొట్టి వుంటే మీ female ఫాన్స్ అంత వలిపోఎవాళ్ళు కదా అండి...ఒఫ్కోర్సే మేల్ ఫాన్స్ ఎలాగు భోజనాలకి వస్తాం అనుకోండి... :)
అసలు పువ్వులు కట్టడం రాదు అంటే ఎం చేస్తారు అబ్బ అని తెగ టెన్షన్ పడ్డాను...మొతానికి సాధించారు...
నెక్స్ట్ టైం ఇలాంటి పరిస్థితి ఎదురు ఐతే ఈ కొంటె ఐడియా ని వాడేయండి :)
stapler తీసుకొని...పువ్వుకి..దారానికి ఒక నొక్కు నొక్కండి.... :)
కిక్కురుమనకుండా గట్టిగ అతుక్కుపోతుంది...చక్కగా....fancy గ కూడా కనిపిస్తుంది.... :)
belated వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు

Ennela చెప్పారు...

నువ్వు వ్రతం బాగా చేసుకున్నానని వ్రాసిన టపా ఫొటోలు బాగున్నాయి..మిషెల్ కి వాయనం, కొబ్బరికాయ కొట్టే టెక్నిక్కులు, పూలా మాల కట్టాడానికి స్టేప్లర్ , ఇస్తినమ్మా టాస్కు ..యీ కామెంట్లన్నీ టపాకి ఎక్స్ట్రా వన్నె తెచ్చాయి

Unknown చెప్పారు...

ఆ వరలక్ష్మి దేవి నీఫై కటాక్ష వీక్షణాలు ప్రసరించాలని, సకల సౌభాగ్యాలు కలగ జేయాలని కోరుకుంటూ
వాయనం ఇస్తే వెల్తానమ్మ అసలే బోలెడు మంది పిలిచారు

ఇందు చెప్పారు...

@ snigdha :అమ్మ స్నిగ్ధా! ఎంత మాటనేసారు? అంతా బానే ఉన్నారు! ;) థాంక్స్ నా ఫుటోలు నచ్చేసినందుకు :)

@ సుభద్ర:థాంక్యూ సుభద్రా :) అవునండీ...మన దేసంలో ఐతే హాయిగా అయిపోయేది :)

@ Ennela: హ్హహ్హహా! అవును ఎన్నెలగారు :) నాకు అదే అనిపించింది :)

ఇందు చెప్పారు...

@ RAMAKRISHNA VENTRAPRAGADA said...: ఫిమల్ ఫ్యాన్స్? మేల్ ఫ్యాన్స్? అబ్బ ఉక్కపోస్తోంది ఈ ఫ్యాన్స్ అన్ని ఎక్కడున్నాయబ్బా? :)) మీరు చెప్పిన ఐడియా అసలు సుపరూ! ఈసారి త్రై చేస్తా! కాని పూలకి నొప్పేసి తిట్టుకుంటాయేమో! అసలు నేను పూలు మాల కట్టందే అందుకు. పూలకి నొప్పేస్తుందేమో అని భయం....అలా అలా పెరిగిపోయి అసలు మాల కట్టడమే రాకుందా అయిపోయింది :)

@ kallurisailabala: థాంక్యూ సోమచ్ శైలు :) ఇచ్చేసా వాయనం....మరి పుచ్చుకున్నవా? ;)

సుజాత వేల్పూరి చెప్పారు...

ఇందూ, నువ్వు టపా రాసిన ఏడాదికి చదువుతున్నా! కేక పెట్టించావ్ గా!

నీ నారికేళ విచ్ఛేద ప్రక్రియ నన్ను కడుపుబ్బా నవ్వించింది.

భలే ఉన్నాయి నీ వ్రతం కబుర్లు !:-))