8, ఆగస్టు 2011, సోమవారం

రివర్స్ సేమ్యా ఉప్మా!

రండి బాబూ....రండి...
నేడే చూడండి....మా 'రివర్స్ సేమ్యా  ఉప్మా'

ఉప్మా అంటే.....ఉప్మా కాదు....
చెప్మా అంటే...చెప్మా కాదు....
పదిలంగా చేసుకుతిన్న రివర్స్ ఉప్మా మాది.....రివర్స్ ఉప్మా మాది ;) [పాట బాగుంది కదా!]

ఈ రివర్స్ ఉప్మా చేయాలనీ ఎందుకనిపించిందంటే.......ఎప్పుడు చేసే పని ఎందుకు చేయాలి? డిఫరెంట్ గా ఎందుకు ట్రై చేయకూడదు? అందుకే ఎప్పుడు చేసే సేమ్యా ఉప్మాని ఇలా వెరైటిగా,ఇన్నొవేటివ్గా చేశా :)  [బాగా బిల్డప్ ఇచ్చానా? :)) ]

ఇప్పుడు కావాల్సిన పదార్ధాలు: [పక్కూరి వంటలో చూపించినట్టు మంచిమంచి గాజు ప్లేట్స్ లో పెట్టుకోండి ఈ పదార్ధాలు అన్ని]

ముఖ్య పదార్ధాలు:

  1. ఉప్మా చేయడానికి ఒక స్టవ్ [పనిచేసేది]
  2. వండటానికి గిన్నె,భాండి,తిప్పడానికి గరిటె
  3. వడగట్టడానికి స్త్రైనెర్,
  4. తినడానికి నాలుగు ప్లేట్లు,నాలుగు స్పూన్లు[ఇవి మీ ఇష్టం]
  5. చేసింది తినిపెట్టడానికి మనిషి [లేదా మనుషులు]

సహాయ పదార్ధాలు:
  1.  సేమ్యా ఉప్మా కాబట్టి సేమ్యా ఉండాలిగా
  2.  మన ఉప్మా కొంచెం వెరైటి కాబట్టి....రకరకాల కూరగాయలు ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి :)    [క్యారెట్,బీన్స్, పీస్ ఇత్యాదివి]
  3.  ఉల్లిపాయలు లేకపోతె అస్సలు బాగోదు....కాబట్టి అవి నిలువుగా,సన్నగా కోయాలి.
  4. పచ్చిమిర్చి కూడా తగిలితే చురుక్కుమంటుంది...అంచేత రెండు నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి 
  5. టమాటతో మంచి ఫ్లేవర్ వస్తుందిట. అది తరిగి పెట్టేసుకుంటే పోలే! 
  6. పోపు పెట్టకపోతే ఉప్మా ఎలా అవుతుంది? కాబట్టి...ఆవాలు,జీలకర్ర,జీడిపప్పు[ఇది నా క్రియేటివిటీ] కూడా రెడి చేసేసుకోండి
  7. ఇంగువ లేకపోతె రుచే ఉండదు :) కావున చిటికెడు ఇంగువ
  8. అసలు కరివేపాకు లేకుండా వంట పూర్తవుతుందా? సో...నాలుగు రెబ్బలు అవి...
  9. కొంచెం అల్లం-వెల్లులి పేస్ట్ వేస్తె...ఘుమఘుమలాడుతుంది మరి ఇక మీ ఇష్టం.
  10. రుచికి ఉప్పు
  11. తాలింపుకు నూనె 
  12. సువాసనకు కొత్తిమీర


ఇప్పుడు ప్రధాన పదార్ధాలను కొన్నిటిని వినియోగించి సహాయపదార్ధాల సహకారంతో మన రివర్స్ సేమ్యా ఉప్మా చేయబోతున్నాం :)
తయారి విధానం :

ముందుగా తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టుకుని వంట మొదలుపెట్టండి :) 

ఇప్పుడు ఒక లైటర్ తీసుకుని(విదేసవాసులు జస్ట్ బర్నర్ తిప్పి) స్టవ్ వెలిగించి దానిమీద నెమ్మదిగా ఒక గిన్నె లాండ్ చేయాలి.

ఇప్పుడు ఆ గిన్నెలో ఒక గ్లాసుడు నీరు పోసి అవి వంద డిగ్రీల సెంటిగ్రేడు దగ్గర సలసలా కాగాక, ఒక కప్పుడు సేమ్యా వేసి....ఒక మిల్లీలీటరు నెయ్యి వేయాలి [సేమ్యా ఉప్మా జీడిపాకంలా అవకుండా ముందు జాగ్రత్త]

ఇంతలో  కోసిన రకరకాల కూరగాయముక్కలు ఒక వందగ్రాములు వీలయితే ఓవెన్లో/లేదంటే కాసిని వేడినీళ్ళు పోసి గిన్నెలో పదినిమిషాలు ఉడికించుకోవాలి.

ఈలోగా...పక్క స్టవ్వు వెలిగించి భాండి పెట్టి అది వేడెక్కాక రెండు ఔన్సుల నూనె వేయాలి.

నూనె వేడెక్కాక......ఆవాలు వేసి....అవి చిటపటమని ఇల్లంతా చిందాక......జీలకర్ర వేసి....వెంటనే జీడిపప్పు వేసి అవి ఎర్రగా అయిపోయేలోగా ఇంగువ వేసేసి..... అది మాడిపోయేలోగా మిర్చి చీరికలు, ఉల్లిపాయ తరుగు,టమాట ముక్కలు  వేసేసి ఒక గరిటె తీసుకుని కసాబిసా తెగ తిప్పెసేయాలి[అచ్చం మనం షెఫ్లాగా బిల్డప్పు ఇవ్వాలి] .

ఈలోగా...సేమ్యా ఉడికిపోయుంటుంది ఒకసారి చూడండి. ఉడికితే దించేసి వెంటనే ఒక స్త్రైనేర్ తీసుకుని ఈ వేడివేడి సేమ్యా అందులో వేసేసి చల్లనీటి ట్యాప్ క్రింద పెట్టేయాలి. అప్పుడు సేమ్యా ముద్దముద్ద అవకుండా.... విడివిడిగా,పొడిపొడిగా ఉంటుంది ;) [ఇది షేఫ్స్ సీక్రెట్ ]

ఇప్పుడు పైన చెప్పిన కసబిస మిశ్రమంలో కాస్త అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉడికించిన కూరగాయ ముక్కలు వేసేసి, విడిపొడి సేమ్యా వేసి అవన్నీ కలియబెట్టాలి :) 

రుచికి కాస్త ఉప్పువేసి.....అలాఅలా సుతారంగా తిప్పేసి....పైన మీ శక్తికొలది కొత్తిమీర సమర్పిస్తే ఇక 'రివర్స్ సేమ్యా ఉప్మా' రెడి....రెడి....రెడి.....

ఉప్మాని ఉప్మాలా కాక ఇలా తిరగతిప్పి చేయడమే రివర్స్ ఉప్మా :) [రివర్స్ గేర్ లాగా ;) ]

చూసారా! ఎంత వీజియో మా రివర్స్ సేమ్యా ఉప్మా ;) 
ఈ ఉప్మాలో చట్ని-గిట్ని,పంచదార-గించదార ఏమి వేసుకోకుండా ఉత్తిగా అలా తినేయడమే :)

ఇప్పుడు ఒక ప్లేటు తీసుకుని అందులో ఈ రివర్స్ ఉప్మాని వడ్డించి ఆరగించాలి.

మర్చిపోయా..... ఈ పదార్ధం తయారుచేసాక పైన చెప్పిన ప్రధాన పదార్ధాలు లో ముఖ్యమైనది,ఆఖరిది అయిన ఒక మనిషిని సంపాదించి[నాకు డిఫాల్ట్ గా దేవుడు ఒకరిని ఇచ్చాడు...మీమీ బలిపశువులను మీరే తెచ్చుకోవాలి మరి ]......... వారికి ముందు ఈ పదార్ధం పెట్టి... వారు ఇది తిన్నాక కూడా మామూలుగానే ఉంటె(దేవుడి దయవల్ల) ఇక మీరు నిస్సందేహంగా తినేయోచ్చు :))

[హబ్బ! పోస్ట్ మొత్తంలో ఎక్కడ 'సేమ్య' అని టైపినా ముందు 'సౌమ్య' అని వచ్చేస్తోంది. కొంపదీసి ఎక్కడైనా 'సేమ్య' కి బదులు 'సౌమ్య' అని రాయలేదు కదా! ఒకవేళ రాస్తే సౌమ్యగారికి మాత్రం చెప్పకండే! ;) ]

39 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ముందుగా తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టుకుని వంట మొదలుపెట్టండి :
చదివేముందు అలానే చేసి చదవడం మొదలు పెట్టాను.
కరెంటు పోయింది మిగతాది చదివి కామెంట్ పెడతాను.

తృష్ణ చెప్పారు...

:))

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హహహ వంటసంగతేమో కానీ మీరు చె్ప్పిన విధానం సరదాగా బాగుంది :-))

Rao S Lakkaraju చెప్పారు...

అప్పుడు సేమ్యా ముద్దముద్ద అవకుండా.... విడివిడిగా,పొడిపొడిగా ఉంటుంది ;) [ఇది షేఫ్స్ సీక్రెట్ ]
-------
అదా సీక్రెట్. థాంక్స్.

Sravya V చెప్పారు...

రివర్స్ ఉప్మా రివర్స్ ఇంజనీరింగ్ లాగ :)))) అయినా ఏదో స్వీట్స్ పెడతారని వస్తే ఇలా ఉప్మా నా :(((((

Unknown చెప్పారు...

ఈ పదార్ధం తయారుచేసాక పైన చెప్పిన ప్రధాన పదార్ధాలు లో ముఖ్యమైనది,ఆఖరిది అయిన ఒక మనిషిని సంపాదించి[నాకు డిఫాల్ట్ గా దేవుడు ఒకరిని ఇచ్చాడు...మీమీ బలిపశువులను మీరే తెచ్చుకోవాలి మరి ].
kevvu kevvu...ఇది నిజంగా నిజం. నువ్వు రాసిన స్టైల్ అదుర్స్ ఇందు . నవ్వలేక నవ్వలేక నవ్వుతున్న

SHANKAR.S చెప్పారు...

నాకు ఇదేదో "జాకర్" ఎఫెక్ట్ తగిలిన రెసిపీలా అనిపిస్తోంది బాబోయ్. :))))

రాజ్ కుమార్ చెప్పారు...

ముందుగా తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టుకుని వంట మొదలుపెట్టండి....
ఇది చాలా నచ్చిందండీ నాకూ.. నేను ఎప్పటి నుండో ఫాలో అవుతున్నాను..

బట్ మిగిలినదంతా చాలా కాంప్లికేటెడ్ గా ఉందీ..
ఉదాః జీడీపప్పు మొత్తం అలా పాన్ లో వేసేస్తే ఎలా?? తిండానికో??? ;) ;)
మీ డీఫాల్ట్ కేస్ గారు సేఫ్ గా ఉంటే చెప్పండీ..మేమూ ట్రై చేస్తాం..
మీ రివర్స్ ఉప్మా చాలా రుచి కరంగా అనిపించిందండీ..

స్నిగ్ధ చెప్పారు...

ఇందూ కేకో కేక మీ ఉప్మా...మీ డెఫాల్ట్ గారు ఓ.కె నా...ఇదెందుకో నేనింట్లో ట్రై చేసేది లాగా కనిపిస్తోంది...కనిపిస్తోందేమిటి నేను కూడా ఇలా ట్రై చేసి మా ఇంట్లో డెఫాల్ట్ కేస్ కి పెట్టా...:)..ఏమి కాలెదు మరి...కాకపోతే మీ షెఫ్స్ సీక్రెట్ పాటించలా..ఈ సారి పాటిస్తా...

హరే కృష్ణ చెప్పారు...

ఇందు గారూ,
నేను కూడా తూర్పు కి దండం పెట్టాను,తూరుపు వైపు ఉన్న పక్క వీధిలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది :)
మీ తరపునుండి కూడా మరో కెవ్వ్! :)
నా లాపీ కి బాక్ అప్/ఇంటికి ఇన్వెర్టర్ ఉంది కాబట్టి కామెంట్ సవ్యంగా రాసేస్తున్నా

చివరి ఫోటో లో పెర్ఫ్యూమ్ ఎన్ని మిల్లీమీటర్లు జల్లుకోవాలో చెప్పనేలేదు :)

>>>పక్క స్టవ్వు వెలిగించి భాండి పెట్టి అది వేడెక్కాక రెండు ఔన్సుల నూనె వేయాలి.
మీరు వండుతున్న పదార్ధం ఏమిటి, కొలతకి ఉపయోగించే బాష ఏంటి :)

రివర్స్ గేర్ లో ఉప్మా కమనీయం గా ఉంది :)
శాఖాహరులకి ఉప్మా నే ఉలాల్లా లేల్లో కింగ్ ఫిషర్ లా రెఫ్రెషింగ్ బ్రేక్ ఫాస్ట్ ! నాకు నచ్చింది మా కుక్ కి డేమో ఇచ్చి రిజల్ట్ బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను కామెంట్ రూపం లో :)

మధురవాణి చెప్పారు...

ఇంతా చెప్పాక.. ఒక ఫోటో కూడా పెడితే నీ సొమ్మేం పోయేదో! ;)
సహాయ పదార్థాలా.. కెవ్వు.. కొత్త వంటలతో పాటు కొత్త పదాలు కూడా కనిపెట్టేస్తున్నావ్ ఇందూ నువ్వు.. :)
నువ్వు చెప్పినట్టే తూర్పు తిరిగి దండం పెట్టి ఎందుకైనా మంచిదని అటు తిరిగే పోస్ట్ మొత్తం చదివాను.. ;)
ఏమైనా నువ్వు చెప్పిన అతి ముఖ్యమైన పదార్ధం ఉండాలి ముందు అప్పుడు గానీ ఏ వంతైనా కనిపెట్టడానికి అవకాశం రాదు మనకి.. :))
Hilarious post!

MURALI చెప్పారు...

శంకర్‌గారు అవునవును ఇది జాకర్ ఎఫెక్టే. భూతభయం అంటే ఏమో అనుకున్నా కానీ ఇందుగారే భూతంలా మారి అందరినీ భయపెడతారని తెలుసుకోలేనయితిని.

కొత్త పాళీ చెప్పారు...

అధ్యక్షిణీ,
మీరు ఉద్యోగంలో చేరాక కూడా కేక కెవ్వు బ్లాగుపోస్టులు రాస్తున్నందుకు అనేకానేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము.
మరియునూ అధ్యక్షిణీ, పక్కూరి వంటలో లాగా ఉండాలంటే ముఖ్యపదార్ధాల్లో వంట చేసే మనిషి కూడ చాలా ముఖ్య అవసరం అని మనవి జేసుకుంటున్నాం. సదరు మనిషికి రెండు కిలోలకి తగ్గని బంగారు నగలు, పదివేలకి తక్కువకాని వర్క్సు చీరా తగిన రవిక కూడా అత్యావశ్యకమైన వస్తువులే అని మనచేసుకుంటున్నాం.
అంతేకానీ అధ్యక్షిణీ ఇవిలేకుండా చేసిన రివర్స్ సేమ్యా ఉప్మా కేసీఆర్ లేని తెలంగాణా ఉద్యమంలా నిర్రంగుగా (అంటే రంగులేకుండా) ఉంటుందని మనవి చేసుకుంటున్నామని మనవి చేసుకుంటున్నాం.

లత చెప్పారు...

ఎంతో ఈజీగా చాలా బావుంది మీ సేమ్యా ఉప్మా
ఈ రోజు మా బ్రేక్ ఫాస్ట్ ఇదే మరి

అజ్ఞాత చెప్పారు...

ఇందు గారి ఉప్మా, కొత్తపాళీగారి వ్యాఖ్య బ్రహ్మాండంగా ఉన్నాయని మనవిచేసుకుంటున్నాను .

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నాకు ఉప్మా అంటే ఇష్టం. దీన్ని అలుసుగా తీసుకొని మా ఆవిడ రకరకాల ఉప్మాలు చేసేస్తుంది. అందులో గోధుమ రవ్వ + సేమ్యా ఉప్మా ఒకటి. సాధారణంగా సేమ్యా 20-25 % కన్నా ఎక్కువ ఉండదు. నిన్న రాత్రి చేసిన దాంట్లో 50% దాటిందేమో ననిపించింది. నిన్న మీ రివర్సు ఉప్మా చదివిందా అన్న అనుమానం వచ్చింది. ఇన్ని రకాల ఉప్మాలని తట్టుకున్నవాడిని ఇది తట్టుకోలేనా అని ధైర్యం తెచ్చుకున్నాను. రాత్రి అవడం మూలాన్న తూర్పు కూడా ఎటో తెలియ లేదు. ఇదిగో ఇప్పటికి తేరుకున్నాను.

డీఫాల్ట్ కేసుల్ని ఇంతగా భయపెట్ట కూడదని మనవి చేసుకుంటున్నాను. ఉప్మా చేసేది మీరు దయ దేముడిదా? ఆ దేముడు మమ్ము సదా కాపాడు కాక.

రవికిరణ్ పంచాగ్నుల చెప్పారు...

నా కేసులో డిఫాల్టు బకరాని నేనే!!!.. ఈ వంటకం(?) నా శ్రీమతి దృష్టిలో పడకుండా చూసుకోవాలి.. :)

శశి కళ చెప్పారు...

ఉప్మా....కెక...ఇక రివర్స్ ఉప్మా ఇన్కా కెవ్వు...
తూర్పు తిరిగి దణ్ణం పెట్టటం బాబొయ్...హ..హ...
మరి మా డీఫాల్ట్ మనిషి యెక్కడ దొరుకుతాడు...
ఇక కొత్త పాళీ గారి వ్యాఖ్య చూస్తె అవన్ని ఉంటె ఉప్మా
అదిరి పోతుంది అనిపించింది.

మనసు పలికే చెప్పారు...

ఇందూ.. వంట మొదలెట్టే ముందు తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలన్న నీ అయిడియా ఉంది చూశావూ.. కెవ్వు కేక ;);) కానీ ఆ పని తినే వాళ్లు కదా చెయ్యాల్సింది అని నా అనుమానం ;)
రివర్స్ ఉప్మా మాత్రం సూపరు ఇందు. నీకు దేవుడు డీఫాల్ట్‌గా ఒకర్ని ఇచ్చినట్టుగానే నాకు కూడా ప్రసాదించాడు కదా. నేను కూడా ట్రై చేస్తా;) తూర్పుకి దండం మాత్రం నేను పెట్టను;)

ఆ.సౌమ్య చెప్పారు...

హమ్మ పిల్లా...చివరికి నాకే కొట్టావూ! చెప్తా నీ సంగతి....హన్నా!

"ఆఖరిది అయిన ఒక మనిషిని సంపాదించి[నాకు డిఫాల్ట్ గా దేవుడు ఒకరిని ఇచ్చాడు...మీమీ బలిపశువులను మీరే తెచ్చుకోవాలి మరి ]"....ఇది కెవ్వు కేక.
ఈ రివర్స్ ఉప్మా ఏదో ట్రై చెయ్యాలి...ఎలాగు బకరా రెడీ కదా! :)

శిశిర చెప్పారు...

నాకు డిఫాల్ట్ గా దేవుడు ఒకరిని ఇచ్చాడు...మీమీ బలిపశువులను మీరే తెచ్చుకోవాలి మరి.
:))) పాపం చందుగారు.

చందు చెప్పారు...

ఇంతకీ ఈ సౌమ్యా ఉప్మా ఎందుకు చేసినట్టు చెప్మా..
చెయ్యక ముందు గొడవపడ్డారా ఇందూ- చందూ....
(ప్రాస కోసం ఏక వచనం .. అన్యధా భావించకుడి)

మురళి చెప్పారు...

మీరు కావాల్సిన దినుసుల్లో ఒకటి చెప్పడం మర్చిపోయారు.. ధర్మామీటర్. అవును మరి నీళ్ళు వంద డిగ్రీలు మరిగాయో లేదో ధర్మామీటర్ లేకుండా తెలిసేదెలా?
రెండో విషయం, నేను చూసిన పక్కూరి వంటలో కొత్తపాళీ గారు చెప్పిన విధంగా వరకు చీర, నగలు దిగేసుకున్న సారీ అలంకరించుకున్నావిడ నూనె వేడెక్కాక మొదట ఇంగువ వేయాలని చెప్పింది, మీరు కొంచం ఆలస్యంగా వేశారు.. అసలు ఉప్మాలో ఇంగువ అవసరమా, కాదా అనే విషయం మీద ఓ పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది.. మనలో మన మాట మీ చండూ గారి చేత చేయిస్తే ఎలా ఉంటుందంటారు? ఇన్ని చేసినాయన ఇది మాత్రం చేయలేరా ఏమిటి?

ramki చెప్పారు...

ఏంటో ఇందు గారు.........
మీరు జావా వ్రతం చేసినప్పటి నుంచి......కొత్త కొత్త ఆలోచనలు మీ మెదడు నుంచి జాలు వారుతూ...మీ ప్రేక్షకభిమనులని అలరిస్తూ......(అబ్బో.......ఇక్కడేదో కపిత్వం చాల ఎక్కువ ఐపోయింది...మిగతా లైన్ మీరు పూర్తి చేసుకోండి...ప్లీజ్..... :P )
ఆ తరువాత...
హా...మన టాపిక్ ..రివర్స్ ఉప్మా....
అస్సలు ఉప్మా ఘుమ ఘుమ లదిపోతున్నట్లుంది.....ఇండియా వరకు కోడుతోంది అంట.....
ఎంత ఇన...లాస్ట్ లో చందు గారికి అసలు విషయం చెప్పకుండా....ఎంత ప్రేమతో వడ్డించారు అండి (ప్లీజ్ రెఫెర్ తో చివరి ఫోటో)
పాపం ...మీ చందు గారి పరిస్తితి తలచుకుంటేనే...జాలేస్తోంది... :)
ఇన ఇలాంటివి అన్ని...అల ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగించేస్తే కష్టం అండి....
ఎవరిని మీ ఇంటికి వచ్చి...బంక లాగా అతుక్కుపోయి...రోజుల తరబడి సెటిల్ ఇపోయారు అనుకోండి....
అప్పుడు చెయ్యాలి....ఇలాంటి పోఖరాన్ అణు పరీక్షలు.... :)
ఎనీ వే...నేను కూడా మీ రేసిపే ని ఈ వీకెండ్ ఫాలో ఇపోయి....మా ఆఫీసు వాళ్ళకి పెట్టేస్త....దెబ్బకి దేవుడు కనిపిస్తాడు.... :P

నందు చెప్పారు...

endhu gaaru mee ideas pics chalaa bhavunnayi andi....

ఇందు చెప్పారు...

@ kallurisailabala: హ్హహ్హ! ఏవిటో తూరుపుకి తిరిగి దణ్ణం పట్టమన్ననే అనుకో....అందరూ పెట్టేయాలా? సరే....అలా పెడితే ఈ వైపరీత్యాలేంటో ;)

@తృష్ణ: :))

@ వేణూ శ్రీకాంత్ :హిహిహి! మనం ఆరితేరిన షెఫ్ఫులం కాదుగా వేణూ....ఇక ఇలాగే రాయాలి మరి ;)

ఇందు చెప్పారు...

@ Rao S Lakkaraju : అవునండీ అదే దేవరహస్యం :) రుచికిరుచి....విడి-పొడి దీని సత్వర ఫలితములు :))

@ Sravya Vattikuti :హ్హహ్హ! రాసేటప్పుడు నాకు ఇలాగే అనిపించిది...ఎంతైనా సాఫ్టూ,సాఫ్టూ కదా మనం ;) హిహి! ఏదో లేండీ జూ.బ్లాగర్లం అప్పుడే పెద్ద పందగలు చేఉకోలేం...అందుకని ఉప్మాతో సరిపెట్టా!

@kallurisailabala:హిహిహి. మరే....అదే లేకపోతే మన పాకశాస్త్రప్రావీణ్యం ఎలా ప్రదర్సించడం? ;)

ఇందు చెప్పారు...

@SHANKAR.S: గుర్తు చేయకండీ బాబోయ్..మీకు దణ్ణం పెడతా బాబోయ్! :((((

@ వేణూరాం : హిహి. థాంక్స్ రాజ్. ఆ జీడిపప్పుదేముంది రాజ్..ఉప్మా అయ్యేలోగా అలా తినేస్తూ ఉండండీ....ఎవరన్నా అడుగుతారా ఏం? మనకి ఎన్ని కావల్సివస్తే...అన్ని వేసేసుకోవడమే! డీఫాల్ట్ గారు భేషుగ్గా ఉన్నారు! మీరు చేసుకు తినడమే తరువాయి.

@ snigdha : అసలు మన డీఫాల్ట్ కేసుల కాళ్ళూ కడిగి దణ్ణం పెట్టినా తప్పుకాదు....పాపం మన చేసే ప్రయోగాలకి వాళ్ళు బలీయ్యినా పల్లెత్తు మాటనరు కదా! ;)

ఇందు చెప్పారు...

@ హరే కృష్ణ: మీకు ట్రాన్స్ఫార్మర్ పేలింది....శైలాబాల గారికి కరెంటుపోయింది. ఏంటో ఈ మాయ ;) హ్మ్! మీ షెఫ్ఫూ నా అంత బాగా చేయకపోవచ్చు....సరేలే....ఎలగో అలా తినేయండీ :)))

@మధురవాణి:ఉన్నదంతా తినేసాక అవిడియా వచ్చింది మధూ! అప్పటికే అలీశం అయిపోయింది ;) సారీ! ఇంకోసారి పెడతాలే :)

@Murali:అహా! మీరందరూ చెప్పిన కధలకి నేను భూతభయంతో వణికిపోతున్నా! మీకే...ఎన్నైనా చెప్తారు :(

ఇందు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఇందు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఇందు చెప్పారు...

@ కొత్త పాళీ: ఎంతైనా మీరు సూపరు మాష్టారు...ఒక్క కామెంటుతో కేకలు పుట్టించారు :))) 'అధ్యక్షిణీ హహహ! ఇది నాకు అసలు సూటవునా? ;) అయినా మీరు చెప్పిన ఆ బంగారపు పోతలకు నేను బహు దూరం సుమా! :)) అందుకే అందరికీ అందుబాటులో ఉండే విధంగా నా రెసెపి చెప్పబడినది అన్నమాట!

@ లత: మీరు నా రెసెపీ ట్రై చేస్తున్నారా? కెవ్వ్వ్వ్వ్వ్! చాలా థాంక్స్ అండీ నన్ను నమ్మి ఇంత సాహసం చేస్తున్నదుకు :)))

@లలిత :మీకు కామెంటు కూడా అందుకు తక్కువేమీ కాదని మనవిచేసుకుంటున్నాను ;)

ఇందు చెప్పారు...

@బులుసు సుబ్రహ్మణ్యం:హ్హహ్హహహా! గురువుగారూఉ...కామెంటుని కూడా క్షమించకుందా నవ్వించేస్తున్నారు :)))) భలే ఉంది. అవును మరి...మేము నిమిత్త మాత్రులం...అంతా దైవలీల! ;)

@ రవికిరణ్:ఐతే ముందు మీ భర్యగారు ఈ వంటని చూడాలని గట్టిగా కోరేసుకుంటున్నా! ;)

@ it is sasi world let us share: మీ ఇంట్లో నిన్ను భరిస్తూ ఉన్నరుగా శశి ;) తను చాల్లే ఈ ప్రయోగానికి :)))

ఇందు చెప్పారు...

@ మనసు పలికే :థాంక్స్ అప్పు! ఏదో అంతా నీ అభిమానం. నువ్వు ఎందుకులే అప్పూ....తినేవాళ్ళు పెడతారు తూర్పుకి తిరిగి! :)

@ ఆ.సౌమ్య:ఆ అయ్యోరామా! నేనేమీ చేయలేదు సౌమ్యా! పోస్ట్ రాస్తుంటే తెలుగు ఎడిటర్ అలా ఆటలాడుకుంది అని చెప్పా అంతే! ;) [నాకమె తెలీదు బాబోయ్ :)) ]

@ శిశిర :మరే..సత్యం చెప్పారు శిశిరా! :))

ఇందు చెప్పారు...

@ చందు :హహ! లేదండీ....కొత్తదనంలోనించి ఉధ్భవించిన వంటకం ఈ ఉప్మా! అయ్యో...ఇందు-చందు అంటే ఏమయిపోతుందీఇ! ఏంకాదు....ఇలాగే పిలవండి :)

@మురళి :అది చాలా సింపుల్ మురళిగారూఉ....నీళ్ళు కాగేటప్పుడు మన వేలు ముంచి మనం 'కెవ్' అంటే...కొంచెం వేడిగా ఉన్నట్టూ..'కెవ్వ్ కెవ్వ్' అంటే కొంచెం ఎక్కువ వేడి ఉన్నటూఉ..'కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్' అని ఘట్టిగా ఒక ఆర్తనాదం పెడితే అప్పుడు ఇక రవ్వ పోసేయొచ్చు :) ఈ సౌలభ్యం ఉండగా థర్మామీటర్ ఎందుకు దండగా! :)) చందుగారా...ఓ...బహుసుబ్బరంగా చేసిపెడ్తారు...అప్పుడు ఆ బకరాని నేనవుతానన్నమట ;)

@RAMAKRISHNA VENTRAPRAGADA said...:ఏంటో రామకృష్ణగారూఉ...మీరు చెప్పింది ఆలోచించబుల్ గానే ఉంది. ఈసారి ఎవరైనా ఇంటికొస్తే..మీ పేరు చెప్పి ఈ ప్రయోగం చేసేయమంటారా? :))

@ నందు..: నందుగారూ....చాలా థాంక్స్ అండీ :) నాకు పనివత్తిడి కొంచెం ఎక్కువగ ఉంది... వీలైనప్పుడు తప్పక వ్రాస్తాను!

kiran చెప్పారు...

సువాసనకు కొత్తిమీర -- > మీ అమెరిక లో కొత్తిమీర కి perfume కొడతార :P
నాకు టిపిని ల లో నచ్చని టిపిని ఉప్మా..
అయినా పాపం చందు గారు...:P

శిశిర చెప్పారు...

>>>నీళ్ళు కాగేటప్పుడు మన వేలు ముంచి
ఇక్కడ మన కన్నా 'డిఫాల్ట్ గా మనకి దేవుడు ఇచ్చిన ఒకరి' వేలు పెడితే రిజల్ట్ బాగుంటుందేమో. మీరు సరిగా అంచనా వేయగలగచ్చు, లేకపోవచ్చు. అదేదో వారే చూసి పెడితే తరువాత 'నువ్వు తొందరపడి రవ్వ పోసేశావ్. బాలేదు' అన్న మాట పడనక్కరలేదు. ఆలోచించండి. :))

చాతకం చెప్పారు...

This weekend, I tried my hand in kitchen and my default-case said, "Excellent, I would like to save it for tomorrow's lunch box", don't know what to make out of it.

PS: I tried to put stove on top of glass plates and broke some, wonder I messed up somewhere.

ఇందు చెప్పారు...

@ kiran: కొత్తిమీరకి పర్ఫ్యుం ఎందుకు కిరణూ.....దానికి నేచురల్ పెర్ఫ్యుం ఉందిగా :)) అందుకే ముందు నీకు పెడతా ఈ టిఫిను ;)

@Sisira: హ్హహ్హహ్హా! భలే చెప్పారు...ఈ పధ్ధతి ఏదో బాగుంది :) ఇదే ఫాలో అయిపోవడం బెటర్!

@Chatakam: కెవ్వ్వ్వ్! పాపం మీ డీఫాల్ట్ గారూ.... :)) మీకు వంట చాలాబాగా వచ్చనుకుంటా!:)))