31, జనవరి 2011, సోమవారం

'యమునా తటిలో'

'యమునా తటిలో'....అనగానే ఎవరు గుర్తొస్తారు? రాధాకృష్ణులే కదా! నల్లని యమున ఒడ్డున....తెల్లని పండువెన్నెల కురుస్తున్న వేళ....చల్లని వేణుగానం చెవులకి సోకుతుంటే.....ఘల్లు..ఘల్లను గోపాలుని మృదుపదసవ్వడి కోసం ఎదురుచూస్తూ.....ఎంతకీ కానరాని నల్లనయ్యకై  రాధాదేవి పడే బాధ ఏమని వర్ణింపనూ?? 

బృందావనంలో....ప్రతి ఆకు-కొమ్మ....పువ్వు-రెమ్మా.....నింగి-నేల.....చీమ-చిలుక కన్నుల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేది ఒక్కరికోసమే కదా! మోహనాంగుడు...మురళీధరుడు...లీలామనుషరూపుడు అయిన ఆ మాధవుని కోసమే కదా! మరి మాధవుడు రాకపోతే?? రాధ ఎదురు చూపులు అడవి కాసిన వెన్నెలైపోతే? ఆ భావాలను జయదేవుడు 'గీతాగోవిందం'లో ఎన్నో విరహకీర్తనల్లో వర్ణించాడు.....'సావిరహే' కీర్తన అందరికీ తెలిసే ఉంటుంది.

" నిందతి చందన ఇందు కిరణమను విందతి ఖేద మధీరం.....
వ్యాళనిలయ మిళనేన గరళమివ కలయతి మలయ సమీరం....
మాధవ మనసిజ విశిఖ భయాదివ భావనయా త్వయిలీనా.....
సావిరహే తవదీనా....సావిరహే తవదీనా....."

'సావిరహే తవదీన' అంటే తెలుసుకదా....ఈ పాటలో 'నీకై ఎదురుచూస్తున్న రాధ' అని అర్ధం.జయదేవుని అష్టపదులలో నాకు అత్యంత ఇష్టమైనది....కొంచెం కష్టమైనది కూడా ఇదే! మరి అంతే కదా.... కృష్ణుడు లేక రాధ పడుతున్న బాధను వర్ణిస్తూ.....ఆమె చెలి పాడే ఈ గీతం, రాధమనోవేదనను  కళ్ళముందు నిలుపుతుంది.ఎంత బాధపడుతున్నదో కదా అనిపిస్తుంది.

జయదేవుని పాటల్లో రాధ బాధ ఎంత హృద్యంగా వర్ణించాడో.....అంతే అందంగా ఉంటుంది....ఇంకో విరహ గీతం. ఆ భావాన్ని కళ్ళకు కట్టినట్టు..... రాధాహృదయవాణిని కనిపెట్టినట్టు ఉన్న ఈ పాట కూడా నాకు చాలా చాలా ఇష్టం.ఎడబాటులో  ఉన్న వేదన,తపన,వ్యధ,బాధ అన్నీ పొందుపరిచిన ఈ గేయం 'దళపతి' సినిమాలోనిది.ఈ పాటలో ఒకచోట....'పాపం రాధా' అనే వాక్యం వస్తుంది.నాకైతే అది వింటున్నప్పుడల్లా..... 'నిజమే! పాపం కదా! రాధా!' అనిపిస్తుంది.అంతే కాదు పైన చెప్పిన జయదేవుల అష్టపది జ్ఞప్తికి వస్తుంది.

ఈ పాట వినడానికి ఎంత బాగుంటుందో....చూడడానికి అంతే ఆహ్లాదంగా ఉంటుంది.నది ఒడ్డున చిన్నపిల్లలకి సంగీతం నేర్పిస్తూ  శోభన పాడే ఈ గేయం..... ఎంత బాగున్నా....ఒక బాధావీచిక అలా గుండెని తాకి వెళ్ళిపోతుంది.ఇళయరాజా గారి సంగీతం గురించి నేనిప్పుడు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక ఇంత చిన్ని పాట....అంత అందంగా వ్రాసిన 'రాజశ్రీ' గారికి హాట్సాఫ్! డబ్బింగ్ సినిమా అయినా.... శోభన ముఖకవళికలకి  అతికినట్టు సరిపోయే లిరిక్స్ వ్రాసారు.మధురమైన ఈ గేయాన్ని మధురాతిమదురంగా ఆలపించారు స్వర్ణలత.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్యం:

యమునా తటిలో నల్లనయ్యకై ఎదురుచూసెనే  రాధా!
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా!

రేయి గడిచెను....పగలు గడిచెను....మాధవుండు రాలేదే!
రాసలీలలా...రాజు-రాణిదే రాగబంధమే లేదే!!

యదుకుమారుడే లేని వేళలో.....వెతలు రగిలెనే రాధ గుండెలో.....
పాపం.......రాధా...

యమునా తటిలో నల్లనయ్యకై ఎదురుచూసెనే  రాధా!
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఈ పాట వీడియో క్రింద ఇస్తున్నా....చూడండీ....ఎంత బాగుంటుందో!
ఇక,ఈ పాట డౌన్లోడ్ లింక్ ఇక్కడ.(ఇది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది.)
స్లో గా ఉన్నది వినాలనుకుంటే ఇక్కడ
ఈ పాట ఆన్లైన్లో వినాలనుకుంటే....ఇక్కడ.

ఇక ఈ పాట విడియో....ఇదిగో!

18, జనవరి 2011, మంగళవారం

అద్దం అబధ్ధం చెప్పదు

పొద్దున్నే అద్దం లో మన మొహం చూసుకుని....ఏదో ఒకటి అనుకుంటాం.ఇలా ఉందే.....అలా ఉందే అని.అలాగే ప్రతి మనిషి తనకి తాను అందంగానే కనిపిస్తాడు.ఇక ఆడవాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు.....అలా అని మగవారు దీనికి ఏమి తీసిపోవట్లేదు ఈ మధ్య....కానీ అసలు అందం అంటే ఏమిటి? దీనికి కొలమానం ఏమన్నా ఉందా చెప్మా??

'పొడవైన జుట్టు,అందమైన వేళ్ళు,సుతిమెత్తని పాదాలు,పెద్ద పెద్ద కళ్ళు,పాల వంటి మేనిచ్చాయ కలిగిన అమ్మాయిలు.....
వంకీలు తిరిగిన జుట్టు,తీరైన కనుముక్కు,చక్కని ఒడ్డు-పొడవు,కొంచెం స్టయిల్ కలిగిన అబ్బాయిలు....'
ఇదేనా అందం కొలబద్ద???

నాకు తెలిసిన చాలా మంది అమ్మాయిలు...పౌడర్లు,స్నోలు,లిపిస్టిక్కులు(పోకిరి మహేష్ బాబు  డవిలాగులా),ఐలాషులు తెగ వాడేస్తుంటారు.....పొద్దున్నే ఒక రౌండ్ ఫేస్ వాష్ తో కడుగుతారు...స్క్రబ్బరుతో తోముతారు...ఫేస్ క్రీం తో పెయింట్  వేసి.....పౌడర్ తో వార్నిష్ వేస్తారు.....ఇది బేసిక్.ఇక దానికి అప్డేటెడ్ వెర్షన్స్ చాలా ఉంటాయి.చెబితే నమ్మరు కానీ నేను బెంగుళూరు లో ఒకసారి నా ఫ్రెండ్ హాస్టల్ కి తోడు వెళ్ళా.అక్కడ తన రూంమేట్ షాపింగ్ కి రెడీ అవుతోంది.నేను అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నా.ఆమె తన కప్ బోర్డు తలుపు తీసింది.నా కళ్ళు తిరిగాయి.ఎన్నెన్ని ఫేస్ వాష్లు,క్రీంలు(డే టైం+నైట్ టైం అట), లోషన్లు, పౌడర్లు, లిప్స్టిక్, లిప్గ్లాస్,ఐబ్రో పెన్సిల్,కాజల్,......వామ్మో! నేను చెప్పలేను.ఒక చిన్న కాస్మెటిక్ దుకాణం పెట్టేసింది.ఇక బైటికివెళ్ళేటప్పుడు  ఆ వస్తువులన్నీ ఉపయోగించి  అర అంగుళం మందాన మేకప్ కొట్టింది.'అయ్యబాబోయ్!' అనుకున్నా.పగలు చూస్తే పగలే కల్లోకొచ్చి దడుచుకునేల ఉంది.ఇంకొంతమంది ఉంటారు.'నేచురల్ కేర్...నేచురల్ కేర్' అని అంటారు.కానీ వారికి మాత్రమె తెలుసు ఏమేం చేస్తున్నారో.ఐబ్రోస్ షేప్ చేయిస్తారు....నేచురల్ అంటారు.ఫేషియల్ చేయిస్తారు... నేచురల్ అంటారు.వాక్సింగ్ చేయిస్తారు నేచురల్ అంటారు.అదేమంటే ఎదుటివారిమీదకి కయ్యిన లేస్తారు. ఇదేమి నేచురలో!

ఇక అబ్బాయిలు....ఈ మధ్య బ్యూటి సెలూన్స్ లో వీరి హడావిడి ఎక్కువైపోతోంది.అమ్మాయిలకి మల్లె వీరు ఫేషియల్స్  గట్రా చేయిస్తున్నారు.ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు.'అనూస్ ఫేస్ పాక్' అమ్మాయిలకంటే అబ్బాయిలే ఎక్కువ వాడుతున్నారట.అదీ కాక ఈమధ్య వీరికోసం కొత్తగా మగవారి ఫేస్ క్రీమ్స్ కూడా వచ్చాయి. కానీ వీరిని ఒకరకంగా ఒప్పుకోవచ్చు.కేవలం స్కిన్ కేర్ వరకు ఆపేస్తారు.అంతే కానీ....కళ్ళ నించి పళ్ళ దాకా పట్టించుకునే సహనం వీరికి ఉండదు.అబ్బాయిలు లిప్స్టిక్లు,ఐలాష్లూ వేసుకునే విపరీతాలు ఇప్పటిదాకా నాకైతే కంటపడలేదు.కానీ వీరు కండలకోసం జిమ్ముల చుట్టు మాత్రం తెగ తిరుగుతారు.హ హ హ! అలాగే కొత్త కొత్త హెయిర్ స్టయిల్స్ ట్రై చేస్తుంటారు.షర్టు మీద షర్టు...బ్రాండెడ్ షూస్....కాస్ట్లీ పర్ఫ్యుం.....ట్రెండీ వాచ్.....ఇదీ వారి స్టయిల్ మంత్రా.కానీ అమ్మాయిలు సాధారణంగా బ్రాండ్ల జోలికి పోరు.'టాప్ టు టో' అన్నీ మాచింగ్ కావాలి.అందుకోసం ఎంత శోధన అయినా చేస్తారు.

గ్లామర్ ప్రపంచమైన సినిమా రంగంలో...అందానికే అగ్రస్థానం అయినా....అభినయం లేని అందమైన మొహాలను ఎన్నిసార్లు తిప్పికోట్టలేదు? ఆత్మవిశ్వాసం,పట్టుదల,శ్రమ లేకుండా...కేవలం అందం మీద కొట్టుకొచ్చిన వారు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? అందం అనేది ప్రాధమిక గుర్తింపు మాత్రమె.ఆ గుర్తింపుని పది కాలాలపాటు నిలబెట్టేది చక్కని వ్యక్తిత్వం.అయినా శాశ్వతం కానీ అందం కోసం పాట్లు పడి...దాన్ని శాశ్వతంగా చేసుకోవాలని తాపత్రయపడి....ఎందుకో ఇంత ప్రాకులాడతారు??

ఎన్ని రకాలుగా దేహాన్ని అలంకరించినా.....మన అందం ప్రతిఫలించేది మనం చేసే పనిలోనే అని గుర్తించరు చాలా మంది.అందమైన వ్యక్తిత్వం ముందు ఎటువంటి అవకరమైనా కనపడదు.నోటికి వచ్చినది మాట్లాడేవాళ్ళు.....బైటికి సైలెంట్ గా కనిపించి లోపల వైలెంట్ గా ఆలోచించేవాళ్ళు.....తాము అందంగా వుంటాం అని ఫీల్ అయిపోతు...ఏది చేసినా చెల్లుతుంది అనుకునే వాళ్ళు.....ఒక్కసారి అద్దం ముందుకెళ్ళి తాము ఉన్నంత అందంగా తమ మనసు ఉందా అని అడగగలరా?? అద్దం అబధ్ధం చెప్పదు.అది ముఖానికైనా,మనసుకైనా అద్దమే.అందులో కనిపించేది మన ప్రతిబింబమే.అందం అనేది చూసే మనిషిలో కాక అతని నడవడికలో,ప్రవర్తనలో,బుద్ధిలో ఉంటుంది. గొప్ప గొప్ప వాళ్ళలో అందగాళ్ళు చాలా తక్కువమంది.కాని ఎందుకో చాలా మంది మనిషి అందాన్ని బట్టి అతన్ని /ఆమెని బేరీజు వేస్తారు.

ఈమధ్య ఒక అమ్మాయితో మాట్లాడా!ముందు చాలా మంచి అమ్మాయి అనే అభిప్రాయం కలిగింది నాకు. తనకి బ్యూటి కాన్షియస్ చాలా ఎక్కువనుకుంటా.....సరేలే....ఈరోజుల్లో లేనిది ఎవరికీ అనుకున్నా!! కానీ రాను రాను....తన ప్రవర్తనలో తేడా అర్ధమయింది.తను మాత్రమె అందంగా ఉంటుంది అని....ఇతరులు తనకన్నా లీస్ట్ అన్నట్లు ఉంటాయ్ తన మాటలు.నాకు తెలిసిన ఇంకో అమ్మాయి గురించి...ఆమె అవకరాల గురించి చాలా హేళనగా మాట్లాడిన తరువాత నాకు అర్ధమయింది....ఈ అమ్మాయి చూసినంత అందంగా మాత్రం లేదు.....పైకి ఎలా ఉంటేనేం....మనసంతా కుళ్లే అని! నా ప్రాధమిక అంచనా తప్పైనందుకు బాధగా ఉన్నా...తన అసలు రూపం బైటపడ్డందుకు ఒకింత సంతోషంగానూ ఉంది.అలాంటివారికి దూరంగా ఉండొచ్చు కదా! :)

తను ఈ బ్లాగ్ చదువుతుందో లేదో కానీ...ఒక్కటే చెప్పాలనుకున్నా....బాహ్యసౌందర్య వెలుగు ఒక్క క్షణకాలం మాత్రమె. అంతఃసౌందర్యం శాశ్వతం. అది ఏ పౌడర్లకు,క్రీములకు దొరకని చిరునామా :)

హ్మ్!! ఈ టపాతో నేను అర్ధసెంచురీ చేశా! గంగూలీ సెంచురీ కొట్టినంత ఆనందంగా ఉంది.ఐదు నెలల్లో...ఐదుపదుల టపాలు రాసానంటే నమ్మబుద్దవడంలేదు!! బెరుకు బెరుకుగా.....ఏమి రాయాలో...ఏమి రాయకూడదో తెలియక....ఏదో తప్పటడుగులతో బ్లాగ్ మొదలెట్టిన నేను....ఇన్ని రోజులు దాన్ని కొనసాగిస్తా అని కల్లో కూడా అనుకోలేదు.మీ అందరి ప్రోత్సాహం,ఆదరణ లేకపోతె ఇది సాధ్యమయ్యేదే కాదు.ఇలాగే మీ అందరి ఆదరాభిమానాలతో...సంవత్సరం అయ్యేలోగా సెంచురీ కొట్టేయాలని నా బ్లాగ్ని ఆశీర్వదించేయండే! :)

11, జనవరి 2011, మంగళవారం

ఎగురుతావ్...తప్పక ఎగురుతావ్!

అబ్బే! ఇప్పుడు మనకంత సినిమా లేదులెండి.ప్లేన్లో కూర్చొని....ఎప్పుడు డెస్టినేషన్ వస్తుందా అని ఎదురు చూసే బాపతు నేను! ఇప్పుడు కాదుగానీ...చిన్నప్పుడు నాకు ఎగరాలని బహుకోరికగా ఉండేది.ఆ సంగతులు కొన్ని చెప్తానే!

మా చిన్నపుడు అంటే...సుమారు...ఐదు...ఆరు తరగతులనుకోండి....అప్పుడు ఆటలు తెగ ఆడేవాళ్ళం.కరెంట్ షాక్,దాగుడుమూతలు.....కలర్-కలర్....అలా అన్నమాట.ఇవన్నీ స్కూల్ అయ్యాక....సాయంత్రం ఇంటిముందు ఉన్న పెద్ద ప్లే గ్రౌండ్లో ఆ వీధిలో ఉన్న పిల్లలందరం ఆడుకునే వాళ్ళం.కానీ రోజు రాత్రి ఏడింటికి ఠంచనుగా కరెంటు పోయేది.ఆ టైం నాకు భలే ఇష్టం.పిల్లలందరం కలిసి బాగా ఆడుకునే వాళ్ళం.కానీ రాను రాను అమ్మ...రోడ్ మీదకి వెళ్లోద్దని...డాబా మీద ఆడుకోమని అనేది.పాపం కదా అంతగా అడుగుతుంటే కాదనలేం కదా...అందుకే డాబా మీదా..మా ముందు ఇంటి పిల్లలైన కిరణ్,గాయత్రిలతో ఆడుకోవడం మొదలుపెట్టాం.ఆ చిన్న డాబా మీద ఎంత సేపు కరెంట్ షాక్ ఆడుకుంటాం? అందుకే ఇక మెల్లగా అంత్యాక్షరిలోకి దిగేవాళ్ళం.అలా కొద్దిరోజులు సాగిపోయింది.

రోజు వెన్నెల్లో....లేకపోతె నక్షత్రాల వెలుగులో...అలా ఆకాశంలోకి చూస్తూ పాటలు పాడుకోవడం అలవాటైపోయింది.కొద్దిరోజులకి ఆకాశం మీద ఇష్టం పెరిగింది.అక్కడక్కడ మినుకుమినుకుమని మెరిసే మిణుగురులు....అప్పుడప్పుడు దారి తప్పి లేటుగా ఇంటికి వెళ్ళే పాలపిట్టలు.....చూసి....చూసి...నాకు ఆకాశం లో ఎగరాలని కోరిక పుట్టింది.వాటికి నాకు ఏంటి తేడా? ఆ...రెక్కలు....ఎస్! రెక్కలు వచ్చేస్తే....నేను ఎగరోచ్చు అనుకున్నా! వెంటనే కిందకెళ్ళి రెండు టవల్స్ తీసుకొచ్చా! గాయత్రిని పిలిచా! విషయం చెప్పా! నమ్మేసింది పిచ్చిమోహంది.సరే అంది.ఇక ఇద్దరం టవల్స్ వెనక వీపుకి కట్టుకున్నాం.ఆ టవల్స్ అంచులని మా చేతుల మీద వేసుకున్నాం.అవి రెక్కలన్నమాట.అవి ఆడిస్తే...ఇక పైకి ఎగిరేసినట్టే అని చెప్పా గాయత్రికి.

ఇద్దరం  ఆ టవల్స్ కట్టుకుని...ఒంటి కాలు మీద నిల్చొని....రెక్కలు ఆడిస్తూ...(అదే! మా చేతులతో...టవల్ అంచులు ఆడిస్తూ) పైకి ఎగరడానికి సాధ్యమైనంత ప్రయత్నించాం.అబ్బే! ఇంచి కూడ పైకి లేవలేదు.అపుడు నాకొక ఐడియా వచ్చింది.ఏరోప్లేన్ ఎలా ఎగురుతుంది? చాలా దూరం రన్వే మీద పరిగెత్తి....పరిగెత్తి....అప్పుడు జింగ్ మని పైకి ఎగురుతుంది.సో! సేం ప్రిన్సిపిల్. మనం కూడ అలాగే పరిగెత్తుకుంటూ గాల్లో లేద్దాం....అంతే....మనం కూడా ఎగిరేస్తాం! అని చెప్పి గాయత్రికి గీతోపదేశం చేశా! నాకంటే తింగరిది.ఇది కూడ నమ్మేసింది.ఇక ఇద్దరం డాబా ఆ చివర నుండి...ఈ చివరకి పరిగెట్టడం మొదలుపెట్టాం. పరిగెత్తాం.. పరిగెత్తాం.. .నేను ముందు..గాయత్రీ వెనుక.డాబా చివరకి వచ్చేస్తోంది....ఇక ఎగరడమే తరువాయి..అని గాల్లోకి జంప్ చేశా! ఇక ఎగిరినదాన్ని అలాగే పైకి వెళ్ళిపోతాను అనుకున్నా! అదేంటో మరి ఏరోప్లేన్ ప్లాన్ వికటించింది.అక్కడే డాబా మీద ధబీల్మని పడ్డాను.రెండు మోకాలు చిప్పలు పగిలాయి.నేను 'కుయ్యో మర్రో' అని మూలిగేలోగా.....ఏనుగుతల్లి  సైజులో ఉన్న ఆ గాయత్రి దేవి వచ్చి ఎలకపిల్లలా ఉన్న నామీద పడింది.నేను ఇంకా పాతాళంలోకి కూరుకుపోయాను.'ఇదేంటబ్బా? గాల్లో ఉండాల్సింది....ఇలా పాతాళం లో ఉన్నాను?' అని డౌట్ వచ్చి చూసుకుంటే...ఏముంది...ఎక్కడ వేసిన గొంగళి అక్కడే....ఎక్కడ ఎగిరిన మనుషులం అక్కడే కూలబడ్దాం.ఏనుగుతల్లి...సారీ గాయత్రీ వల్ల అణచబడ్డ నేను మెల్లగా అలాగే కుంటుకుంటూ లేచి.....లేవలేక గిలగిలా కొట్టుకుంటున్న  మా గాయత్రిని కూడా లేపి కూర్చోబెట్టా!

కాసేపు ఏంజరిగిందో అర్ధం కాలేదు తనకి.గుక్కెడు నీళ్ళు తాగించి....డిప్పమీద ఒక్కటిస్తే....దెబ్బకి ఈ లోకంలోకి వచ్చింది.సరే! వచ్చింది ఊరుకొవచ్చు కదా! వాడకుండా తుప్పట్టిపోయిన బుర్రని బయటకు తీసి....ఆయిల్ పోసి ఆడించడం మొదలుపెట్టింది.
'అవును ఇందు!? అలా పరిగెత్తుకుంటూ వస్తే ఏరోప్లేన్ లా ఎగురుతాం అన్నావ్!? మరి ఇలా కూలిపోయమేంటి?అసలు నువ్వు చెప్పింది నిజమేనా?మనం ఏరోప్లేన్లా ఎగరగలమా?'....అని అడిగింది.
(అలా మరీ డైరెక్ట్ గా అడిగితే ఏం చెప్తాం??...ఇక నా షార్ప్ బ్రెయిన్ ని నేను బూజు దులిపా!)
'మానవుడు సాధించలేనిది ఏది లేదు గాయత్రీ! జస్ట్ మన మీద మనకి నమ్మకం ముఖ్యం.అంతే! సంకల్పమే సగం బలం.నేను ఎగరగలను అనుకుంటే తప్పకుండా ఏదో ఒకరోజున ఎగురుతావు గాయత్రీ....ఎగురుతావ్!'('నువ్వు నాకు నచ్చావ్' లో  సునీల్ డైలాగ్ లా లేదు! హ్మ్! నా డైలాగే కాపీ కొట్టేసాడు త్రివిక్రమ్ ఏం చేస్తాం! కలికాలం!)
ఇలా మళ్లీ చిన్న సైజ్ గీతోపదేశం చేసి.....రెండు తువ్వాళ్ళు మీదేసుకుని.....కుంటుకుంటూ......మా అమ్మ చేత తిట్లు తినడానికి   ఇంటికి బయలుదేరాను.నేను వెనక్కి తిరిగి చూడలేదు కానీ....మళ్లీ 'ధబీల్' మని పడుంటుంది గాయత్రీ. అదన్నమాట సంగతి.చూసారా...నేనెంత గ్రేటో! :))

6, జనవరి 2011, గురువారం

బుద్ధం శరణం గఛ్చామీ!!

హా! వచ్చేసా! ఇంకో పోస్ట్ తో వచ్చేసా!ఏంటి?! 'శ్రీ కృష్ణ కమిటి' నివేదిక అర్ధం కాక బుర్ర హీటెక్కిందా? ఐతే కాసేపు అలా ఆచ్చికి పోదాం రండి. ఒక ఐదు సంవత్సరాల వెనక్కి వెళదామే!!.అంటే అప్పుడు 2006 అన్నమాట...గిర్రు గిర్రు అని సున్నాలు గీసుకుంటూ(అంటే ఫ్లాష్ బాక్ లోకి అని అర్ధం...అర్ధం చేసుకోరూ!!) మీరూ నాతో పాటు  వచ్చేయండే!ఆ...ఆ....మరీ బాలకృష్ణలాగా ఐదొందలేళ్ళు కాదు....ఐదేళ్ళు చాలు.హా! అద్దీ అక్కడ ఆగిపోండి.ఇప్పుడు చెప్తా వినండి.

సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం.....నేను ఇంజినీరింగ్ రెండో సంవత్సరం....అది కూడా హాస్టల్లో(పేయింగ్ గెస్ట్ అనుకోండి) వెలగబెడుతున్నా.ఇది చెప్పడానికా ఇన్ని గిర్రులు తిప్పావ్ అని తిట్టుకోకండి....చెప్తా!చెప్తా! అప్పుడొచ్చింది ఈ పండగ....'కాల చక్ర-2006-అమరావతి'. ఆహా! మా అమరావతి.మా గుంటూరు పక్కన....అమరేశ్వరుని సన్నిధిలో.... కృష్ణానది ఒడ్డున  ఒద్దిగ్గా ఉండే అమరావతి...కానీ ఇది ఏ హిందూపండగో....జాతారో కాదు....బౌధ్ధుల పండగట.మా అమ్మకి,నాకు బౌద్ధం అంటే కొంచెం ఇష్టం.చైనాలో షాంఘైటెంపుల్......హిమాచల్ ప్రదేశ్ లో ధర్మశాల......మేము చూడాలనుకున్న విష్ లిస్టులో ప్రముఖ స్థానంలో ఉంటాయ్! అన్నిటికంటే ఎక్కువ ఆకర్షించింది 'దలై లామా' వస్తున్నారన్న విషయం.మరి ఆయన ప్రపంచ శాంతి దూత కదా! నాకు ఆయనంటే బోలెడు ఇష్టం.'నో వార్....ఓన్లీ పీస్' టైపు కదా! మా అమ్మ డిక్లేర్ చేసింది....'నేను వెళుతున్నా...మీరు వస్తారా?' అని.నేనెటు హాస్టల్ కదా కుదరదని చెప్పా! కానీ మా నాన్న రోజు అమ్మని తీసుకెళ్ళి...ఒక గంట అలా ఉండి వచ్చేవారు....ఇక  నేను ఉండబట్టలేక ఒక మూడు రోజులు కాలేజికి డుమ్మాకొట్టి ఈ కాలచక్రాకి  వెళ్ళా అనుకోండి!!

2006....జనవరి ఆరవ తేదీన....మొదలయింది ఈ కాలచక్ర మహోత్సవం.సుమారు పదిహేనో తేదీ వరకు జరిగింది.చివరి మూడు రోజులు చాలా ప్రాధాన్యం కలవి.ఇన్నిరోజులూ కష్టపడి వేసిన కాలచక్ర ముగ్గు....అప్పుడు అందరికీ ప్రదర్శిస్తారు.జనవరి నెల మొదలు అమరావతి అంతా ఎర్ర రంగు పులుముకుంది.ఎరుపు రంగు దుస్తులు ధరించిన బౌద్ధభిక్షవులతో కిక్కిరిసిపోయింది.రోడ్లన్నీ టిబెటన్ స్టాల్స్ తో...ఎక్కడికక్కడ గుడారాలతో.......టిబెటన్ వంటకాల ఘుమఘుమలతో.....బౌద్ధభిక్షవుల బాకాల చప్పుళ్ళతో.....టిబెటన్ పాటల హోరుతో....అబ్బో సందడే....సందడి.అమరావతిలో మా పెదనాన్నవాళ్ళు గుడివీధిలో ఉంటారు.వాళ్ళింటికి వెళ్ళడానికి మేము ఎంత దూరం నడిచామో! ఎక్కడో ఊరవతల ఆపించేసారు కార్లని.అక్కడినించి నేను,మా అమ్మ లెఫ్టు...రైటు....మేము ఇలా కాదని....బస్సుల్లో వెళ్ళడం మొదలుపెట్టాం.అప్పుడు కొంచెం లోపలి పోనిచ్చారు...ఏదో గుడ్డిలో మెల్ల అనుకున్నాం.

సరే! ఒకరోజున  అలాగే చస్తూ..బ్రతుకుతూ...ఆ టిబెట్ వాళ్ళని తోసుకుంటూ....ఎలాగో అలా ఆ కాలచక్ర జరిగే చోటికి వెళ్లాం.అందరికంటే ముందు వెళ్ళడం వల్ల డయాస్కి చాలా దగ్గరలో సీట్ దొరికింది మాకు.....నేల మీదే లెండి.ఎవరెవరో  వచ్చారు... ఏంటేన్టో చెప్పారు....నేనేమో 'దలైలామా' కోసం వెయిటింగ్.అసలే మనం తోకలేని కోతులం.ఏదో ఇలాంటి మహానుభావుల ప్రసంగాల వల్ల కొంచెం జ్ఞానం అయినా కలుగుతుందని నా ఆశ :)) అలా చాలాసేపు....ఎదురు చూసి.... చూసి.... నీరసించి.....వెంట తెచ్చుకున్న చాక్లెట్లు.... బిస్కెట్లు ...అవ్వగోట్టేసి....'అమ్మా! ఆకలే!' అని ఎక్స్ప్రెషన్ పెట్టి మా అమ్మ వంక జాలిచూపులు చూస్తుంటే వచ్చారు 'దలైలామా'.అచ్చం టీవీల్లో చూపించినట్టే ఉన్నారు.మెల్లగా నడుచుకుంటూ వచ్చి కూర్చుకున్నారు.కాసేపు ప్రసంగించారు.నేనైతే ఆయన్ని నోరువెళ్ళబెట్టుకుని చూడడమే సరిపోయింది.చాలా చెప్పారు! టిబెట్ గురించి....అక్కడి వాళ్ళు పడుతున్న బాధల గురించి.....టిబెట్ లో శాంతి నెలకొల్పాలంటే ప్రపంచ దేశాలు అందించాల్సిన సహకారం గురించి......బౌద్ధం గురించి...ఇలా ఎన్నో! చివరికి ఈ 'అమరావతి కాలచక్రా' ని 'టిబెట్లో కష్టాలనుభవిస్తున్న వారికి' అంకితమిచ్చారు..తనకి అమరావతి చాలా నచ్చిందని.....బుద్ధుడు ఇక్కడే కాలచక్రకి నాందిపలికాడని....ఇలా మంచి మంచి మాటలు బోలెడు చెప్పారు :)


ఇక లాస్ట్ రోజున మళ్లీ వెళ్లాను.రంగులతో ఎంతో చక్కగా 'కాలచక్ర' ముగ్గు వేసి దానిని వారి పద్ధతుల్లో పూజించి మా అందరికీ ప్రదర్సనకి  పెట్టారు.నేను,అమ్మా వెళ్లి చూసొచ్చాం! ముగ్గు ఎంత బాగుందో! నాకు మామూలు ముగ్గులే రావు....ఈ ముగ్గు చూసి ఫ్లాట్!!నాకు ఈ ముగ్గుని చూస్తే....మన అమ్మవారి 'శ్రీ చక్రం' గుర్తొచ్చింది.ఈ ముగ్గుని బౌద్ధ మంత్రాలతో అనుసంధానించి వేశారుట!నాకు అర్ధం కానిది ఏంటంటే....'ధ్యానం ద్వారా మాత్రమె జ్ఞానాన్ని పొందగలం' అని చెప్పే బౌద్ధంలో మంత్రాలేంటి అని? తరువాత తెలిసింది...బౌద్ధంలో చాలా పధ్ధతులుంటాయనీ.ఆ తరువాత టిబెటన్ల స్పెషల్....'మోమోలు' తిన్నాం అదేదో సాస్లో నంజుకుని.భలే ఉన్నాయ్! నాకు బాగా నచ్చాయని మా అమ్మా తరువాత ఇంట్లో చాలా సార్లు అవి చేసిపెట్టేది :) ఇంకా మనకి మ్యూసిక్ పిచ్చి కదా! భాష రాకపోతే ఏం? సంగీతానికి భాషభేదాల్లెవని ఒక నాలుగైదు టిబెటన్ పాప్ ఆల్బమ్స్ కొన్నా! ఒకటి పనిచేయలేదు.మిగితా వాటిల్లో పాటలు చాలా బాగున్నాయ్! :)) మా నాన్నకి కూడా బాగా నచ్చాయ్!! 'సేవ్ టిబెట్' అని స్లోగన్స్ వ్రాసి ఉన్న మాస్క్లు..... ఇంకా బుద్ధుడి బొమ్మలు కలిగిన బీడేడ్ రిస్ట్ బాండ్స్ కూడా కొన్నా! ఈ కాలచక్ర సందర్భంగా అమరావతిలో పెద్ద బుద్ధుడి విగ్రహం కట్టటం మొదలుపెట్టారు.ఇప్పటికీ పూర్తవలేదు.అదీ మన ప్రభుత్వ నిర్వాకం :))) ఏదైతేనేం...ఎవరూ పట్టించుకోని మా అమరావతిని ఒక పదిహేను రోజులు అంతర్జాతీయస్థాయిలో ఫేమస్ చేసేసిన బుద్ధుడికి జోహార్లు :)

అసలు విషయం మర్చిపోయా! దలైలామ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకున్నా! కానీ ఆయనేమో ఏదో పనుందని వెళ్ళిపోయారు. ప్చ్! ఏం చేస్తాం! నాలాంటి గొప్ప వ్యక్తిని కలిసే భాగ్యం ఆయనకి లేదు ;)

సో! ఫైనల్ గా....'బుద్ధం శరణం గచ్చామి' అని అందరూ అనేసుకోండి. మీ మనసులు ప్రశాంతంగా ఉంటాయ్!! :) అనేసుకున్నారా? సరే! ఇప్పుడు రివర్స్ లో  గిర్రు గిర్రు అని బుద్ధిగా వెనక్కి వచ్చేయండి.....వచ్చేసారా! హమ్మయ్యా! మిమ్మల్ని క్షేమంగా కాలచక్రాకి తీసుకెళ్ళి తీసుకోచ్చేసానోచ్! :)) ఎలా ఉంది మరి మన ఆచ్??

3, జనవరి 2011, సోమవారం

నిద్రమత్తులో ఎన్నో ఉషోదయాలు...

నాకు ఒక తీరని కల ఉంది.దాన్ని నెరవేర్చడం కోసం చాలా ప్రయత్నించా! ప్చ్! లాభం లేదు.అదేమిటంటే....'పొద్దున్నే లేచి...తలస్నానం చేసి....తలకి టవల్ చుట్టుకుని.....పట్టుచీర కట్టుకుని....ఇంత బొట్టు పెట్టుకుని....కాళ్ళకి పసుపు రాసుకుని....తులసి కోట చుట్టు ప్రదక్షిణం చేసి.....ఒక మంచి అన్నమయ్య కీర్తన పాడి[అరె! ఎవరు ఇంత శ్రావ్యంగా పాడుతున్నారు అని చందూ నిద్రలేవాలి అన్నమాట :)) ]....ఇంట్లో దేవుడికి పూజ చేసి ఆ అగరుబత్తి పొగలు ఇల్లంతా వ్యాపించగా....నేను దేవతలగా హారతి పళ్ళెంలో కుంకుమ,ప్రసాదం తీసుకెళ్ళి మా అత్తయ్యకి,మావయ్యకి,చందుకి ఆ ప్రసాదం అందించి......చందూ కాళ్ళకి మొక్కి......ఆశీర్వాదం తీసుకుని ఆ తరువాత అందరికీ కాఫీలు..టిఫినీలు అందించే పనుల హడావిడ్లో పడిపోవాలన్నమాట'......ఇదేంటి? అలా మొహాలు పెట్టారు? ఒక్కసారి మీ సినిమా/సీరియల్ డేటాబేస్ని సరిచేసుకోండి...కొత్తగా పెళ్ళయిన అమ్మాయి.....అత్తగారింటికి రాగానే చేసే పని ఇదే కదా! ఎన్ని సినిమాల్లో చూడలేదు?? కానీ అదేంటో! పెళ్ళయి సంవత్సరమైనా....ఏనాడు నేను అలా చేయలేదు :((  చేయాలనీ మనసులో ఉన్నా....అసలు అలా చేస్తే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడాలని కుతూహలంగా ఉన్నా...మనం నిద్రలేచే కనిష్ట సమయం ఎనిమిదిన్నర.గరిష్టం....ఇక మనిష్టం :)) హ్మ్!నేను లేచేసరికి......చందూ తను కాఫీ తాగి నాకు పెట్టేస్తాడు.ఇక ఏదో హడావిడిగా టిఫిన్ చేసేసి చందూ మొహాన పడేసి నేను దర్జాగా లాప్టాప్లో మెయిల్స్ చూస్తా అన్నమాట!


ఇవాళ పొద్దున ఏడున్నరకి లేచి....అప్పటికే నిద్రలేచిన చందూని టైం ఎంతా అని అడిగి....అబ్బే ఇది నా టైం కాదు అని ఎనిమిదిన్నర దాకా పడుకున్న ఘనురాల్ని....ఏంచేద్దాం! అసలు నాకు ఈ నిద్ర దేవత ఎలా ఆవహించిందా అని ఆలోచిస్తే...చిన్నప్పటినించి మనకి ఈ జాడ్యం ఉన్నట్టు పరిశీలనలో తేలింది.చిన్నప్పుడు మా ఇంటి గేట్ ఎదురుగానే స్కూల్ గేట్.ఇలా మా ఇంట్లోనించి సరాసరి నాలుగు అడుగుల్లో స్కూల్లో ఉంటా....అయినా కూడా రోజు లేటుగా వెళ్లి మా ఇంటిముందే స్కూల్ గేట్ దగ్గర నిల్చున్డేదాన్ని.మా అమ్మ పొద్దున్నే లేపితే విసుక్కుంటూ లేచి పక్క  మంచం మీదకి వెళ్లి పడుకునేదాన్ని.మా నాన్న 'పూజకి పూలు తీసుకురామ్మా' అంటే....మొహం కూడా కడుక్కోకుండా....ఏదో నిద్రమత్తులో నాలుగు పూలు....కొమ్మలు....మొగ్గలుతో సహా తెంపుకొని తీసుకొచ్చి మా నాన్నకి ఇచ్చి పడుకునేదాన్ని.ఈ షార్ట్ గేప్ లో పేపర్ కూడా చదివేసేదాన్ని.ఇక మా పనమ్మాయి వచ్చి....'పాపాయ్! నిద్రలేమ్మ! నేను ఇల్లు చిమ్మాలి!' అంటే విసుక్కుంటూనే దుప్పటితో సహా లేచి అలాగే హల్లోకోచ్చి దివాన్ కాట్ మీద పడుకునేదాన్ని.అప్పటికే మా అమ్మ శతధా...సహస్రధా ప్రయత్నించింది నా నిద్రదయ్యాన్ని వదలగోట్టడానికి....అబ్బే! మనం మామూలు దయ్యాలం కాదుగా! :)))

ఇక కాలేజికి వెళ్ళేటప్పుడు....ఏడింటికి బస్ స్టాప్లో ఉండాలి.అందుకని నేను చచ్చినట్టు ఆరింటికి లేవాలి.నేను ఆరింటికి లేచి.....రెడీ అయ్యి....బస్సెక్కి....హాయిగా తోమ్మిదిన్నరవరకు బస్సులో నిద్రపోయేదాన్ని :) హాస్టల్లో ఉన్నప్పుడు కూడా....పొద్దున్నే వీచే చల్లగాలికి అలాగే ముడుక్కుని పడుకునేదాన్ని.అప్పుడు ఎంత హాయిగా ఉండేదో!ఎక్జాంస్ అప్పుడు తెల్లవారఝామున లేవాలంటే చాలా బద్ధకం.కానీ మనం ఏదో పరీక్షల ముందు చదివి ముక్కున పెట్టుకుని  రాసి పాసయ్యే టైప్ కదా! చచ్చినట్టు చదవాల్సొచ్చేది.అప్పుడు మాత్రమె నేను సూర్యోదయాలు చూసేదాన్ని.ఆఖరికి రైళ్ళు....బస్సుల్లో కూడా నా నిద్ర టైమింగ్స్ మారేవి కావు :)) నేను ఒకసారి హైదరాబాద్ బస్సులో నిద్రపోతు తప్పిపోయా కూడా! ఏదో మా బాబాయ్ బస్సు వెంట పరిగెత్తి.....బస్సుని కొట్టి కొట్టి ఆపకపోతే మీకు నా వెన్నెలసంతకం చదివే భాగ్యం ఉండేది కాదు :)) ఇలా నా నిద్ర నాతో పాటే పెరిగి పెద్దయింది :) ఆఖరికి విప్రోకి వెళ్ళేటప్పుడు కూడా.....రోజు ఎనిమిదింటికి లేచి అరగంటలో రెడీ అయ్యి.... తొమ్మిదింబావుకి ఠంచనుగా ఆఫీస్ లో ఉండేదాన్ని.ఈ క్రెడిట్ అంతా మా చందుకే :) అలా మూడు పీడకలలు....ఆరు తీపికలలుగా నా నిద్ర సాగుతూ వచ్చింది.

'సరే! పెళ్ళయ్యాక రోజు ఎవడు చేస్తాడు? చచ్చినట్టు ఇదే లేవాలి...పనులన్నీ ఇదే చేసుకోవాలి' అని రోజు నాకు శాపం పెట్టి వదిలేసేది మా అమ్మ.పెళ్లయింది.మా అమ్మ కల అడ్డం తిరిగింది.నా కలలు మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయ్! చందూ ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా నన్ను లేపిన పాపాన పోలేదు.ఎప్పుడు నాకు మెలుకువ వస్తే...అప్పుడు గుడ్మార్నింగ్ చెప్పే టైప్ అన్నమాట! కొంచెం లేటైతే కాఫీ పెట్టేసుకుంటాడు....ఇంకొంచెం లేట్ ఐతే తనే టిఫిన్ చేసేస్తాడు......మరీ లేట్ ఐతే...టిఫిన్ తినేసి నా టిఫిన్ ఒక పక్కన పెట్టేసి ఆఫీస్ కి చెక్కేస్తాడు......ఒకవేళ ఇంట్లోనే ఉంటే ఇంకా పండగ....తనే లంచ్ కూడా చేసేస్తాడు.నేను మధ్యాహ్నం లేచినా నో టెన్షన్.నేను ఒకసారి మధ్యాహ్నం రెండింటికి లేచా! తెల్సా!! మా అమ్మ నన్ను చూసి అంటుంది.....'ఏం అదృష్టమే నీది!' అని.కానీ నాకు ఇది ఇష్టం లేదు కదా! నా కల పైన చెప్పినట్టు జరగాలని.కానీ ఇది రివర్స్ కదా! ఇప్పుడెలా! నా కల నెరవేరేది ఎలా?

నా నిద్రమత్తులో ఎన్నో సూర్యోదయాలు వెళ్ళిపోయాయి.ఒక్కసారన్నా తెలతెలవారుతున్న ఆకాశాన్ని,సూర్యుడిని చూడాలని ఆశ! కానీ అదేదో పుష్కరానికి ఒకసారి జరిగే పండగలాగా అన్నమాట :)) హ్మ్! నా అగరుబత్తిల కల....సూర్యోదయాల కల ఇక కలలోనే చూసుకోవాలి.ఇలలో కుదరదేమో!

దేవుడా! మంచి దేవుడా!
పోవడానికి నిద్ర ఇచ్చావ్!
కనడానికి కల ఇచ్చావ్!
నిద్ర లేపకుండా ఉండటానికి చందుని ఇచ్చావ్!
కానీ ఎందుకు దేవుడా! నాకు ఇష్టమైన కలలు నెరవేరకుండా చేసావ్??
నువ్వు నా కలలు నేరవేరుస్తావ్!
నాకు తెలుసు.....
ఎందుకంటే....బేసికల్లి.....యు ఆర్  గాడ్! వెరీ గుడ్ గాడ్!
అంతే!