మొన్న మధ్యాహ్నం మూడింటికి మా చందుగారు ఇంటికొచ్చి 'పద పద! ఒహాయో వెళ్ళాలి!' అని తెగ తొందర పెట్టేసారు. 'ఒకసారి అటు చూసి చెప్పు' అని కిటికీ వైపు చూపించా. మంచు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయింది.... పైగా సన్నగా పడుతోంది కూడా. 'ఇప్పుడు నీకు ఒహాయో అవసరమా?' అన్నాను.అయినాసరే....'చెప్పాకదా! చాల ఇంపార్టెంట్ పని. ఇవాళ అయిపోవాలి అంతే! పద త్వరగా' అని హడావిడిగా బయలుదేరదీసాడు! మరి పట్టువదలని విక్రమార్కులు కదా ఏంచేస్తాం! ఇక ఎన్ని చెప్పినా ఇంతే...తాను పట్టిన కుందేలుకి పది కాళ్ళు అనే రకం కదా! అని ఇక బయలుదేరా!
సుమారు మూడున్నరగంటల ప్రయాణం.అక్కడికి ఏడున్నరలోగా చేరాలి అని ఒక డొక్కు టార్గెట్ మళ్లీ మాకు! అసలే ముందురోజు రాత్రి అంతా మంచు కురిసింది.రోడ్లు సరిగ్గా క్లీన్ చేయలేదు.గడ్డగట్టిన ఐస్ రోడ్డుకి అతుక్కుపోయింది.అది చాల ప్రమాదకరం.కార్లు ఈసీగా 'స్కిడ్' అయిపోతాయ్. నాకు గుండె పీచుపీచుమంటోంది.అయినా సరే మా చందుగారి ఆజ్ఞల మీద నోరుమూసుకుని కూర్చున్నా. మా ఇంటినించి 'ఫ్రీవే' మీదకి ఎక్కుతున్నప్పుడు 'రాంప్' మీద ఒకసారి కార్ స్కిడ్ అయింది.కాసేపు అటు ఇటు ఊగుతూ డిస్కో చేసింది.'మొదలయ్యింది దేవుడా! ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది అప్పుడేనా? కొంచెం గాప్ ఇవ్వు స్వామీ!!' అని దేవుడ్ని వేడుకున్నా. నా మాట ఆలకించాడేమో కొద్ది దూరం మాములుగానే కొంచెం కొంచెం జారుకుంటూ...అలా...అలా వెళుతూ ఉన్నాం.
ఇక కాసేపటికి భయంకరంగా మంచు కురవడం మొదలుపెట్టింది. మా ముందున్న కారు,వెనక కారు తప్ప నాకు ఇంకేం కనిపించట్లేదు.దూరంగా ఉన్న బ్రిడ్జి...పక్కన ఉన్న ఇంకో రోడ్డు..దానిమీద వెహికల్స్.....ఏమి కనిపించట్లేదు. నల్లటి రోడ్డు....దాని మీద ఉండే తెల్ల గీతలు ఏమి కనపడకుండా అలుక్కుపోయాయి మంచుతో!'చందు ఇప్పుడు ఇంత వైలెన్స్ తో కూడిన జర్నీ అవసరమా?' అని బిక్కమొహం వేసి అడిగా! 'నేను ఇలాంటి క్లైమేట్లో న్యూయార్క్ దాకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళా! ఏంపర్లేదు! నువ్వు కంగారు పడకు....నన్ను కంగారు పెట్టకు' అని రిప్లై వచ్చింది. సర్లే అసలే టెన్షన్లో ఉన్నాడు...మధ్యలో నేనెందుకు కదిలించుకుని మరీ తిట్లు తినడం అని ఊరుకున్నా. ఇక కొద్దిసేపటికి రోడ్డు మీద మంచు అంతా గాలికి పైకి లేస్తూ చక్కర్లు కొట్టసాగింది....నాకైతే ఆకాశంలో....మేఘాల్లో తేలిపోతున్న ఫీలింగ్. కార్లో ఉన్నానో....ఫ్లైట్‌లో ఉన్నానో ఒక నిమిషం అర్ధం కాలేదు.ఇక ఈ మంచుగాలి దెబ్బకి ముందున్న రోడ్డు....కారు కూడా కనిపించట్లేదు.కారు మధ్య మధ్యలో జర్రు జర్రు అని జారుతోంది.....పక్కనేమో దయ్యాల్లాగా ఇంతింత ట్రక్కులు యమా ఫాస్టుగా వెళుతూ తట్టెడు మంచు మా మొహం మీద కొట్టి పోతున్నాయ్. అలాగే కనిపించని రోడ్డుమీద.... కనిపించని కార్ల మధ్య.....మంచుకి ఎదురీదుతూ మా విక్రమార్కుడు ముందుకు సాగిపోతున్నాడు.
ఇంతలో ఒక రెస్ట్ ఏరియా వచ్చింది.చందుని అక్కడ ఆపమని చెప్పా. 'స్టార్‌బక్స్ లో ఒక కాఫీ తాగి అపుడు కంటిన్యు అవుదాం' అని చెప్పా. సరే అన్నాడు.అసలు నా ఉద్దేశం....ఆ కాఫీ తాగే టైమ్‌లో ఎలాగైనా మనసు మార్చి కారు వెనక్కి తిప్పించేద్దామని.సరే కాఫీ తీసుకున్నాం. కాసేపు కూర్చుని తాగుదాం చందు అంటే.....'టైం వేస్ట్ వెళుతూ తాగొచ్చు కదా పద!' అన్నాడు.'అది కాదు చందు...ఇప్పుడు ఎందుకు చెప్పు ప్రాణాలకు తెగించి ఒహాయో వెళ్ళడం అంత అవసరమా?? చూడు ఎంత డేంజరస్‌గా ఉందో! నా మాట విను చందు.రేపు పొద్దున్న బయలుదేరదాం.ప్లీజ్' అన్నా. 'సరే! ఇంకో టెన్ మైల్స్ చూసి....అప్పటికి ఇలాగే ఉంటె వెనక్కి తిరుగుదాం లే. సరేనా!' అన్నాడు.హమ్మయ్య ఏదో గుడ్డిలో మెల్ల అని ఊపిరి పీల్చుకున్నా.కాని నా ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బైటికి రాగానే మంచు కురవడం చాలా తగ్గిపోయింది(ఈ దేశంలో ఇంతే! ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరు చెప్పలేరు).నావంక ఒక చూపు చూసి....ఒక నవ్వు విసిరి...ఇక కారు తీసి ఝామ్మంటూ దూసుకుపోయాడు మా విక్రమార్కుడు.
'సర్లే! ఏంచేస్తాం!'అని ఊరుకున్నా.ఒక అరగంట ప్రయాణం బానే సాగింది.మళ్లీ మొదలైంది గాలితో కూడిన మంచు.నేను 'దేవుడా! దేవుడా!' అనుకుంటూ కూర్చున్నా. అంతే! ధడేల్మని పెద్ద శబ్దం! మా కార్ బాగా స్కిడ్ అయ్యి ...జుయ్ జుయ్... అని జారుకుంటూ వెళ్లి డివైడర్ కి గుద్దుకుంది. కార్ అస్సలు కంట్రోల్ అవ్వడంలేదు.చందు కార్ ని డివైడర్ కి దూరంగా తేవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు.కాని అది రానంటోంది. దానికి డివైడర్ బాగా నచ్చినట్టుంది....మాటిమాటికి దానిదగ్గరకి వెళ్ళడం.... చందునేమో.... 'ఒద్దమ్మా! అలా ఇందులాగా గోల చేయకూడదు....మాట వినాలి....ఇలా వచ్చేయ్ రోడ్డు మీదకి' అని బ్రతిమిలాడటం. ఇలా కారుని బ్రతిమిలాడి... లాడి... అప్పుడు రోడ్డుమీదకి తెచ్చాడు.ఈలోగా నా పైప్రాణాలు పైనే పోయాయి. అసలు ఇదే ప్రధమం నా లైఫ్‌లో.ఎన్ని ప్రయాణాలు చేసానో! ఊటీలో ఒకసారి భయపడ్డా కానీ ఇది టూమచ్! నేను కార్ హాండిల్ని,ఆర్మ్ రెస్ట్‌ని గాట్టిగా పట్టుకుని కూర్చున్నా.అరవలేదు.... కరవలేదు.... అసలు షాక్ తిన్నా! చందు మాత్రం ఏమి జరగనట్టు చిద్విలాసంగా డ్రైవింగ్ కొనసాగించాడు. 'భయపడ్డావా?' అన్నాడు.దానికి సమాధానం చెప్పే సీన్ కూడా లేదు నాకు.
ఒక పావుగంటకి తేరుకున్నానో లేదో....ఇంకో సంఘటన.చాలా మంది కాప్స్ ఉన్నారు.ఏమిటా అని చూస్తే....పెద్ద ట్రక్కు స్కిడ్ అయ్యి డివైడర్ కి గుద్దుకుని దాన్లోనించి దూసుకెళ్ళి పక్కనున్న రోడ్లోకి వెళ్ళిపోయింది.ఆ అడ్డం తిరిగిన ట్రక్కుకి గుద్దుకుని రెండు కార్లు నుజ్జునుజ్జు! నేను మళ్లీ....'కేవ్వ్వ్!!' కాని అప్పటికే సగం పైగా దూరం వచ్చేసాం. ఇక వెనుదిరిగే ప్రసక్తే లేదు.అదీ మా విక్రమార్కుల వారు అస్సలు ససేమీరా.అలాగే ఆ మంచులో....మా కారుతో ఈదుకుంటూ మేము చేరవలసిన గమ్యం చేరాము.కాని ఈ మధ్యలో ఎన్ని ఆక్సిడెంట్లో! పక్కకి స్కిడ్ అయి జారిపోయిన ట్రక్కులు,కార్లు,మంచులో ఇరుక్కుపోయిన కార్లు....వాళ్లకి సహాయం చేస్తూ కాప్ కార్స్...అబ్బబ్బ! ఎన్ని దృస్యాలో!! ఇక ఒహాయోలో చూడాల్సిన పని చూసుకుని....సరిగ్గా గంటకి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం.అప్పుడు సమయం రాత్రి తొమ్మిది.
ఒహాయో అంతా విపరీతంగా మంచు కురుస్తోంది.ఇక చేసేది లేక అలాగే మెల్లగా జారుకుంటూ.... జారుకుంటూ.... వెళుతూ ఉన్నాం.ఈలోగా ఆకలేసి బర్గర్‌కింగ్ లో కాస్త మేత మేసి.... మళ్లీ మా మంచు ప్రయాణం మొదలు పెట్టాం. ఒక గంట బానే జరిగింది.కాని పెద్ద పెద్ద ట్రక్కులు.....అస్సలు రూల్సు పాడులేకుండా ఆ మంచులో డెబ్బై మీద రయ్యిన దూసుకెళుతున్నాయ్. అటు-ఇటు ట్రక్కులు...మధ్యలో మేము! నేనైతే వాటిని ఎన్ని తిట్టుకున్నానో! ఆ లాస్ట్ లేన్‌లో కదా అవి ఉండాల్సింది...ఇష్టం వచ్చినట్టు పోనిస్తున్నారు వెధవలు! ఈలోగా ట్రాఫిక్ జామ్. 'ఛి జీవితం! ఏది సవ్యంగా జరగదు' అనుకున్నా.అలా అరగంట గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే అప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసారు. తీరా చూస్తె కొద్ది దూరంలో ఆక్సిడెంట్.అందుకే ట్రాఫిక్ జామ్. నాలుగు ట్రక్కులు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయ్. చివరి ట్రక్....ముందు ట్రక్ నుజ్జు,నుజ్జు అయిపోయాయి.మధ్యలోవి గుడ్డిలో మెల్లలాగా బ్రతికి బైటపడ్డాయి.కళ్ళు నెత్తికి ఎక్కి మంచులో అంత స్పీడుతో పొతే అంతే మరి! కాని అదృష్టం....ఎవరికీ ఏమి కాలేదు.
'సరేలే! జాగ్రత్తగా పోనివ్వు చందు ఇంకా రెండున్నర గంటల జర్నీ బాకీ' అన్నాను. 'ఏముందిలే....అయిపోతుంది' అన్నాడు చందు.ఒక్క ఐదునిమిషాలు గడిచిందో లేదో....మా ముందు వెళుతున్న ట్రక్ సడన్ గా స్కిడ్ అయింది. జర్రుమని జారుకుంటూ పక్కకు వెళ్ళిపోయి అడ్డం తిరిగేసింది.దాని వెనకాలే మేము ఉన్నాం.నాకు గుండె ఆగిపోయింది ఒక్క క్షణం.ఏముంది మేము వెళ్లి దానికి గుద్దుకోవడమే తరువాయి! అక్కడ మాకు కనీసం బ్రేక్ వేయడానికి కూడా లేదు. ఆ ట్రక్కు తోక వచ్చి మా కారుని గుద్దినా చాలు. నేను 'చందూ' అని పెద్దగా అరిచా. 'టెన్షన్ పడకు..ఏం కాదు...టెన్షన్ పడకు' అని చాలా ధైర్యంగా,చాకచక్యంతో ఆ ట్రక్కు వెనకగుండా ఉన్న కొంచెం రోడ్డులో జాగ్రత్తగా కారు పోనిచ్చాడు చందు....ఎలాగైతేనేం బైటపడ్డాం!!మా వెనకాల వెహికల్స్ అన్ని ఆగిపోయాయి.ట్రక్కు రోడ్డుక్కి అడ్డం తిరిగిపోయింది.త్రుటిలో ఎంత పెద్ద ప్రమాదం తప్పించుకున్నామో ఊహించుకుంటే ఇప్పటికీ గుండె గుభేలుమంటోంది.నాకైతే ఏడుపొచ్చేసింది! కళ్ళముందు అసలు అంత నారో ఎస్కేప్! దేవుడా! చాలాసేపటికి కానీ మామూలు కాలేకపోయా.పాపం ఆ ట్రక్కు డ్రైవర్ కి ఏమి కాకుండా ఉంటె బాగుండు! :(
చావు అంటే ఇన్నాళ్ళు నేను పెద్ద లెక్కచేసేదాన్ని కాదు! కాని అంత దగ్గరగా చూసాక మొదటిసారి ప్రాణభీతి కలిగింది :))
దీనివలన తెలిసిన నీతి ఏంటయ్యా అంటే....ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా....కొంపలు మునిగిపోతున్నా.....ఊళ్లు కొట్టుకుపోతున్నా..... ఎప్పుడు మంచులో దూర ప్రయాణాలు పెట్టుకోకూడదు అని :D