అనగనగనగా....ఒక దట్టమైన అటవీ ప్రాంతం.అక్కడ ఏనుగులు,దుప్పులు,ఎలుగులు,చిరుతలు....ఇలా ఎన్నో జంతువులు ఉండేవి.ఆ అడవికి రాజు 'గజేంద్రుడు' అనే ఏనుగు. ఆ అడవి మధ్యలో ఒక పెద్ద వాగు ఉంటుంది.ఎండాకాలం లో సన్నగా పిల్లకాలువలా అగుపించినా....వర్షాకాలంలో....చెట్టుని పుట్టని ఏకం చేసేస్తుంది.అందుకే దానిపేరు 'రాకాసి వాగు'.అటువంటి అడవిలో సుమారు ఒక అరకిలోమీటరు భూమిలోపలికి వెళితే...ఒక మహాసామ్రాజ్యం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.అదే 'చీమల రాజ్యం'.ఆ రాజ్యానికి అధినేత 'చక్కెరపతి'.తన రాజ్యంలో చీమలన్నీ సుభిక్షంగా ఉండాలని నిరంతరం తపించే మనసున్న మారాజు. తన సామ్రాజ్యాన్ని చాలా పద్దతిగా,ముందు చూపుతో నిర్మించాడు.చీమ కార్మికులు ఆహరం వేటకు వెళ్ళడం దగ్గరనించి....ఆ ఆహారపు నిల్వలను జాగ్రత్త పరిచేవరకు అన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. ఆ రాజు నీడలో చీమలు....చీకు-చింతా లేకుండా హాయిగా జీవిస్తుంటాయి.

'పండిత పుత్రా పరమ సుంఠ' అన్నట్లుగా ఆ చక్కెరపతి మహారాజుకి ఒక కొడుకు ఉన్నాడు.వాడిపేరు 'రుచి'. చక్కెరపతికి కొడుకంటే ప్రాణం. కొడుకు పుట్టినప్పుడు తన రాజ్యానికి వారసుడు కలిగాడని మహాదానందపడిపోయి అందరికీ తన భాండాగారంలో భద్రంగా దాచిపెట్టిన కమ్మటి పుట్టతెనేతో విందు కూడా ఇచ్చాడు.చిన్నప్పటినించి రుచి కి చీమ విద్యలు నేర్పడం మొదలు పెట్టాడు. ఆహారాన్ని ఎలా సేకరించాలి? యేయే పదార్ధాలను ఎంచుకోవాలి? వాటిని ఎలా భద్రపరచాలి? ఇలా.... చాలా ఓర్పుగా కొడుకుకి విద్యలు బోధించాడు.కాని రుచికి ఇవేమీ పట్టేవి కావు. అల్లాటప్పా గా తిరుగుతూ..స్నేహితులతో జల్సా చేస్తూ గడిపేసేవాడు.ఇలా బిక్కుబిక్కుమంటూ నేలలో ఉండడం...ఆహరం కోసం రోజులకి రోజులు పాకడం నచ్చని పనులు.చెప్పాలంటే మూర్ఖుడైన సోమరిపోతు.పొగరు,గర్వం,అహంకారం అనే అవలక్షణాలు బాగా ఔపోసన పట్టాడు.అలాగే పెరిగిపెద్దయ్యాడు.

అవి వర్షాకాలపు ప్రారంభ రోజులు.రాకాసివాగు మెల్లగా విస్తరిస్తోంది.చీమలు అన్నీసెలవులు తీసుకుని ఇళ్ళల్లో ఉండిపోయాయి. ఒకరోజు రుచి అడవిలో సరదాగా విహార యాత్రకి బయలుదేరాడు.అప్పటికే చక్కెరపతి వాతావరణం బాలేదని వద్దని వారించాడు.మూర్ఖుడైన రుచి పట్టువదల్లేదు.కొడుకు సంగతి తెలిసిన చక్కెరపతి సరే అని అన్నీ జాగ్రత్తలు చెప్పి పంపాడు.అవన్నీ ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసాడు రుచి. మెల్లగా అడవిలో అందాలన్నీ ఆస్వాదిస్తూ..ఎండుటాకుల మీద పాకుతూ...వాటిమీద ఉన్న వానచినుకుల్లో మునిగి తేలుతూ ముందుకు సాగుతున్నాడు రుచి.ఇంతలో ఏదో అలజడి.దూరంగా ఆకులు నలిగిపోతున్న శబ్దం.చూస్తే ఒక గజరాజుల మంద అటుగా వస్తోంది. రుచికి వాటిని చూస్తే నవ్వొచ్చింది.అంతంత పెద్ద ఆకారాలతో ఎలా బ్రతుకుతాయో అని అనిపించింది. ఇంత చిన్న పొట్టలకే ఆహారం వెతుక్కోలేక చస్తుంటే...ఈ ఏనుగులు అడవిని మొత్తం ఒక్క గుటకలో మింగేసేలా ఉన్నాయ్ అని అనిపించింది.ఇంతలో రుచిలో సహజంగా ఉండే పొగరు బైటికొచ్చింది.'ఏమిటి ఈ ఏనుగుల గొప్పతనం ?' అని వెళ్లి వాటికి ఎదురు నిల్చున్నాడు రుచి.

ఏనుగులు రుచిని చూడలేదు.రుచికి గర్వభంగమైంది.'హన్నా! చీమల సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తిని....మహారాజు చక్కెరపతి కుమారుడని....నన్ను గుర్తించవా ఈ మదాంధ గజాలు?' అని పక్కనే ఉన్న ఒక పదునైన పుల్ల తీసుకుని ఎదురు వస్తున్న ఆ అడవికి మహారాజైన గజేంద్రుని పాదంలో గుచ్చాడు రుచి. ఏదో చక్కిలిగింతయనిపించి గజేంద్రుడు కిందకి చూడగా....ఒక ఎండుటాకుపై నిలబడి....రెండు చేతులు నడుము పై నిలిపి....ఒక చేతితో పుల్ల పట్టుకుని....కిరీటధారియై ఉన్న రుచిని చూసి ఫక్కున నవ్వాడు.
"ఎందుకు ఆ నవ్వు గజరాజ?"
"నవ్వక ఇంకేమి చేయను అర్భకరాజ?"
"హన్నా!అటకటా!! నన్ను అర్భకరాజ అనెదవ?"
"మరి నీలాంటి పిపీలికానికి అంతకన్నా విలువయా?"
"హొరీ! దుష్టగజమా! దమ్మున్నచో నాతో తలపడి నెగ్గుము" అని తన ఒరలోని పదునైన కత్తిని పోలిన పుల్లని తీసి ఆ గజేంద్రుడు పాదములపై కలబడ్డాడు.
అది చూసి తనలో తను నవ్వుకున్న గజేంద్రుడు ఒక్క ఘీంకారం చేసి తొండంలో గాలిని పూరించి రుచి పై గురిపెట్టి అధిక పీడనము జోడించి గాలిని వదిలిపెట్టగానే....ఆ దెబ్బకి రుచి వెళ్లి రాకాసి వాగులో పడ్డాడు.
రుచికి దిమ్మతిరిగింది.ఒక్క నిమిషం ఏమీ అర్ధం కాలేదు.అర్ధమయ్యేసరికి పీకల్లోతు నీటిలో పడి కొట్టుకుపోతున్నాడు.'అరె! ఇప్పుడెలా? తండ్రిగారు నేర్పించిన ఈత అయినా సరిగ్గా నేర్చుకొనకపోతిని' అని తనలో తను బాధపడ్డాడు.గజరాజు తో అనవసరంగా తగువు పెట్టుకున్నందుకు తనని తనే నిందించుకున్నాడు.కాని ప్రస్తుతం తన కర్తవ్యమ్ పశ్చాత్తాపం కాదని...ఇక్కడ్నించి బైటపడాలని అనుకున్నాడు.అప్పటికే వర్షం మొదలయింది.ఇక రాకాసి వాగు ఉగ్రరూపం దాలుస్తోంది. అడవిలో పురుగు పుట్రా అన్నీ ఎవరి గూటికి అవి చేరుకున్నాయి.క్రమంగా చీకటి పడుతోంది.ఆ నీటిలో మునుగుతూ...తేలుతూ... రుచి నానాతిప్పలు పడుతున్నాడు.క్రమక్రమంగా ఒడ్డు దూరమైపోతోంది.అంటే...వాగు విస్తరిస్తోంది.

రుచికి వాళ్ళ ఇల్లు గుర్తుకొచ్చింది.అమ్మ చేసిపెట్టే కమ్మని చెరుకు పాయసం గుర్తొచ్చింది.నాన్న చెప్పే జాగ్రత్తలు గుర్తొచ్చాయి. 'నాన్న చెప్పినట్టు నడుచుకుని ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు. మూర్ఖత్వంతో ఏనుగుని ఎదిరించకపోతే తాను ఈ వాగులోకి పడి ఉండేవాడే కాదు.అసలు చీమల రాజ్యం వదిలి బైటికి వచ్చి ఉండేవాడే కాదు.కమ్మగా....పంచదార పలుకులు తింటూ...తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండేవాడు.ఇంకెప్పుడు నాన్న మాట జవదాటకూడదు అనుకున్నాడు.కాని ముందు నేను బ్రతకాలి...ఎలా? ' అని ఆలోచిస్తున్నాడు రుచి.
ఇంతలోకి 'రుచి' అన్న పిలుపు వినిపించింది.'నాన్న! అది నాన్న గొంతు' అని తల పక్కకి తిప్పి చూసాడు.రొప్పుతూ రోస్తూ ఒక కర్రపుల్ల పట్టుకుని వాగు గట్టు వెంబడి పరిగెడుతున్నాడు చక్కెరపతి.
"ఇదిగో! ఈ పుల్లని పట్టుకుని మెల్లగా పాకుతూ రా!" అన్నాడు చక్కెరపతి.
"అలాగే నాన్న!" అని ఆత్రంగా ఆ పుల్ల వైపు కదలసాగాడు రుచి.అతి కష్టం మీద దాన్ని అందుకున్నాడు.
"వేగంగా రా! ఎక్కువసేపు నేను ఈ పుల్లని మోయలేను.వాగు త్వరత్వరగా విస్తరిస్తోంది" అని అరిచాడు చక్కెరపతి.
"సరే! సరే!" అని సాధ్యమైనంత త్వరగా పాకసాగాడు రుచి.
ఆ పుల్లని మోయలేక మోయలేక మోస్తూ....చాలా కష్టం మీద పరిగెడుతున్నాడు చక్కెరపతి.
ఎలాగో అలా పుల్ల చివరకి చేరుకున్న రుచి గట్టుమీదకి ఒక్క ఉదుటన దూకాడు.ఆ దూకుడులో...పట్టుజారి నీటిలోకి పడబోతు గట్టు అంచు పట్టుకున్నాడు.కాని పైకి రాలేకపోతున్నాడు.బురద జారిపోతోంది.మెల్లగా వాగులోకి జారిపోతున్నాడు.అది గమనించిన చక్కెరపతి ఆ పుల్లని వదిలేసి రుచి ఆరుకాళ్ళలో ఒక కాలు దొరకబుచ్చుకుని పైకి బలవంతంగా లాగాడు.ఆ విసురుడుకి రుచి ఒడ్డుకి వచ్చి పడ్డాడు.కాని చక్కెరపతి బురదలోకి జారిపడి...వాగులో పడిపోయాడు.వేగం పెరిగిన వాగులో...రుచి కనులకు అందనంత దూరంలో కొట్టుకుపోయాడు చక్కెరపతి.
స్థాణువై అలాగే చూస్తుండిపోయాడు రుచి.తన తండ్రి ప్రాణాలను సైతం లెక్కచేయక తనని కాపాడాడు.'ఇన్నాళ్ళు....ఇలాంటి త్యాగామూర్తినా నేను ధిక్కరించింది? ఇటువంటి తండ్రి మాటలనా నేను పెడచెవిన పెట్టింది? నాన్న నాకోసం ఎంత కష్టపడ్డాడు? కాని దానికి ప్రతిఫలంగా...కనీసం నాన్నని కాపాడుకోలేకపోయాను' అని ఆ వాగు ఒడ్డున కుమిలి కుమిలి ఏడ్చాడు రుచి.అతని మనసు ఆ దుఖ్ఖ జలాలతో ప్రక్షాళన అయ్యింది.అతనిలో ఉన్న అహంకారపు జ్వాలలు చల్లారాయి.మూర్ఖపు కొమ్ములు విరిగిపోయాయి. రుచి తన తప్పు తాను తెలుసుకున్నాడు. తన తండ్రి కాపాడిన ఈ ప్రాణాలను అతని పేరు నిలబెట్టడానికి అంకితం చేస్తాను అని ఆ రాకాసి వాగు సాక్షిగా ప్రమాణం చేసి చీమల రాజ్యానికి పయనమయ్యాడు.
అటు తరువాత ఆ చీమల రాజ్యానికి చక్రవర్తి అయి తన తండ్రి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసేలా సుపరిపాలన చేస్తూ సుఖంగా జీవించసాగాడు 'చక్రవర్తి రుచి'.
P.S:కథలు వ్రాయడంలో ఇది నా మొదటి అడుగు.చందమామ కథలు స్పూర్తి గా తీసుకుని ఈ కథ వ్రాశా! తప్పులేమన్నా దొర్లితే తప్పక తెలియజేయండి.