Wednesday, December 1, 2010

నా నెమలీకల జ్ఞాపకాలు

మొన్న  మధురవాణి గారి 'మధుర చిత్రాలు' బ్లాగ్ లో 'నా నోట్బుక్ లో నెమలీక' అనే శీర్షిక చూస్తే  నాకు చిన్నప్పుడు పుస్తకాల్లో దాచుకునే నెమలీక గుర్తుకొచ్చింది.

నాకు ఊహ తెలిసాక మొదటిసారి నెమలీక చూసింది మా పక్కింటి బాపమ్మ గారింట్లో.వారి ఇంట్లో ఒక పెద్ద ఫ్లవర్పాట్ లో..నెమలీకల గుత్తి పెట్టేవారు.రంగురంగులుగా మెరిసిపోయే ఆ నెమలీకలు నాకంటికి అబ్బురంగా కనిపించేవి.ఒకసారి ధైర్యం చేసి ఆమెని అడిగేసా! 'బాపమ్మగారు! ఒక్క ఈక ఇవ్వండీ!' అని.ఆమె సంగతేమో కానీ మా అమ్మ నాకు ఒక లుక్ ఇచ్చింది.దాని అర్ధం నాకు తెలుసు.అందుకే ఇక నోరెత్తకుండా ఇంటికేల్లిపోయా.

స్కూల్లో జాయిన్ అయ్యాక....ఇక చెప్పేదేముంది? అక్కడే నెమలీకల పెంపకం-పోషణ గురించి తెలిసింది.నాకు ఒక నెమలీక కావాలనిపించేది.కాని వెధవ మొహమాటం మళ్లీ.ఎవరిని అడిగేదాన్ని కాదు.నేను తన నెమలీకల వంకే  కన్నార్పకుండా చూడడం గమనించిన కల్పన అనే ఒక అమ్మాయి ఈకలు కట్ చేసి చిందరవందరగా ఉన్న ఒక నెమలీక నాకు దానం చేసింది.'నాకు ఇది ఒద్దు! అందంగా లేదు' అని నేను  తిరిగివ్వబోతుంటే చెప్పింది అసలు విషయం....అది పిల్ల నెమలీకట.దానికి రోజు దాణ వేస్తె...చక్కగా ఏపుగా పెరిగి పెద్దవుతుందట.రోజు ఒక రెండు పాల చుక్కలు...క్రిస్మస్ ట్రీ ఆకులు...పెన్సిల్ షార్ప్ చేస్తే వచ్చే పొట్టు.... దానికి ఆహారం.ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే..ఇది ఎవరికన్నా కనపడితే దిష్టి తగిలి పెద్దదవదుట.అందుకని జాగ్రత్తగా ఎవరి కంటా పడకుండా దాన్ని పెంచి పెద్ద  చేస్తే...అందమైన నెమలీకలా అవుతుంది అన్నమాట :)

నేను కల్పన చెప్పిన జాగ్రత్తలు తు.చ తప్పకుండా పాటించా.కాని ఎన్ని రోజులకి నా ఈక పెద్దది అవ్వలేదు.కొద్దిరోజుల తరువాత మా ట్యూషన్ లో డేవిడ్ అని మా క్లాస్ అబ్బాయి పరిచయమయ్యాడు. వాడు,నేను ఒక గ్రూప్.రోజు హోంవర్క్ అయిపోయాక....నాకు బోలెడు కబుర్లు చెప్పేవాడు.వాళ్ళ ఇంటిదగ్గర పెద్ద అడవి ఉందని.....అప్పుడప్పుడు నెమళ్ళు వాళ్ళింటికి వచ్చి వెళతాయని...తన దగ్గర చాలా నెమలీకలు ఉన్నాయని...ఇలా ఏవేవో చెప్పేవాడు.నేను అన్నీ పిచ్చిమొద్దులా నమ్మేసేదాన్ని.నాకు ఒక నెమలీక తెమ్మని అడిగాను.సరే ఈసారి నెమలి మా ఇంటికొస్తే తెస్తా అన్నాడు.నెమలి వాడి ఇంటికి రాలేదు...వాడు నాకు ఈక తేలేదు.నాకు అప్పటికే ఈ ఈకలు పెంచే గోలకి విసుగెత్తింది.కాని నా నోట్బుక్ లో కూడా అందమైన నెమలీకలు ఉంటే ఎంత గర్వంగా ఉండేదో! అందుకే చాలా సంవత్సరాలు నా పుస్తకాలు నెమలీకలకు ఆశ్రయం ఇచ్చాయి.

ఇక మెల్లగా నెమలీకల గురించి నా భ్రమలన్నీ పటాపంచలు అవడం మొదలయ్యాయి..నెమలీకలు గుడ్లుపెట్టడం ...పెరిగి పెద్దవడం...అదంతా ఒక ఫాంటసి అని తెలిసిపోయింది.కాని కృష్ణభక్తి వలన వాటిమీద ప్రేమ ఇంకా పెరిగింది."జోహారు శిఖి పింఛమౌళి" అనుకుంటూ మురిసిపోయేదాన్ని.అలాగే ఒకసారి శ్రీశైలం వెళితే...అక్కడ బోలెడు నెమలీకలు అమ్మేవాడు కనిపించాడు.అందంగా అంత పెద్ద నెమలీకలు చూడగానే ఆగలేక ఆత్రంగా రెండు నెమలీకలు కొనుక్కున్నా.ఒక ఈకని చిన్నగా కట్ చేసి నా కవితల పుస్తకం లో కృష్ణుని బొమ్మ అతికించిన పేజిలో పెట్టా.ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా అంతే ఉంది.ఇక రెండవది....ఒక చిన్న ఫ్లవర్ వాస్లో పెట్టి నా బెడ్రూం కిటికిలో పెట్టా.ఆ తరువాత ఒక బుల్లి వెదురు వేణువు కొని అది కూడా నెమలీక తో పాటు అ వాస్ లో ఉంచా.

తరువాత ఒకసారి గుంటూరు లో నిలగిరీస్ దగ్గర మళ్లీ ఈ నెమలీకలు చూసి టెంప్ట్ అయ్యి ఇంకొక ఈక కొన్నా.అది తీసుకుని నీలగిరిస్ లో దాన్ని పట్టుకుని మా అమ్మ వెంట తిరిగుతుంటే...ఆ షాప్ ఓనర్ (చాలా పెద్దాయన లెండి)...నాదగ్గరకొచ్చి....'ఏం చేస్తావ్ ఈ ఈకతో?' అని అడిగాడు. నేను నవ్వి 'నాకు నచ్చింది సర్.కొనుక్కున్నా.ఇంట్లో దాచిపెట్టుకుంట' అన్నాను.'నాకిస్తావా మరి? ' అన్నారు. 'లేదు.ఇవ్వను' అని చెప్పా.'సరేలే భద్రంగా దాచుకో...మళ్లీ ఎవరైనా చూస్తే ఎత్తుకేలతారు' అని హాస్యంగా అన్నారు.'అలాగేనండి' అని చెప్పి నవ్వేసి ఇంటికొచ్చేసా.దాన్ని నా బెడ్రూం  గోడకి ఒక ట్రాన్స్పరెంట్ టేప్ తో అంటించా! అది ఫ్యాన్ గాలికి అటు ఇటు ఊగుతూ భలే ఉంటుంది.

కాని అలా అంటించేటప్పుడు  చూసా! ఆ ఈకకి చివర కొసన రక్తపు మరక. 'అంటే...ఈ ఈకని బలవంతంగా నెమలి దగ్గరనించి పీకారన్నమాట' అనుకున్నా!మనసు చివుక్కుమంది.అదే లాస్ట్.ఇంకెప్పుడు ఎన్నిసార్లు నెమలీకలు కనిపించినా...నేను కొనలేదు.ఆ రక్తపు మరకే గుర్తొచ్చి బాధేస్తుంది.జూలో ఇంతింత తోకలు వేసుకుని వయ్యారంగా నడిచే మయురాలను చూస్తే...నెమలీకలు నెమలి దగ్గర ఉంటేనే అందం ఏమో  అనిపిస్తుంది. ఎంతైనా ప్రకృతి అందం ముందు అందరం దాసోహమే కదా!

అవండి...నా నెమలీకల జ్ఞాపకాలు.బాగున్నాయా??!!

25 comments:

మనసు పలికే said...

హబ్బ. టపా అంతా చదువుతూ తెగ ఆనందించేసా.. చివరికొచ్చేసరికి మనసు చివుక్కుమంది ఇందు గారు. నాకు కూడా ఈ నెమలీకలతో చాలా ఙ్ఞాపకాలే ఉన్నాయండి. మీరన్నది నిజం ప్రకృతి ముందు మనమంతా దాసోహం అనాల్సిందే..
మనమేదో సాధించేసాం అనుకుంటాం కానీ అంతా సహజ సిద్ధంగా అందంగా దొరికిన ప్రకృతిని మనమే పాడు చేస్తున్నాం.

రాధిక(నాని ) said...

చాలా బాగున్నాయి మీ నెమిలీకల జ్ఞాపకాలు...కాని అలా అంటించేటప్పుడు చూసా! ఆ ఈకకి చివర కొసన రక్తపు మరక:((

లత said...

బావుందండీ,చాలా చిన్నప్పుడు నేను కూడా బుక్స్ లో కొన్ని నెమలిఈకలు దాచుకున్న గుర్తు.
చిన్నతనంలో అదో సరదా.

కొత్త పాళీ said...

మీ రాసే శైలి బాగే మెరుగుపడింది. ఉద్విగ్న భరితంగా రాస్తున్నారు. ఆ చివర్లో ఇచ్చిన ట్విస్టు టపాని ఒక నాలుగడుగులు పైకెత్తింది.

జయ said...

చాలా బాగుంది ఇందు. నెమలీకల అనుభవాలు అందరి జీవితాల్లో తీపిగుర్తులే. కాని, ఆ చివరి కొసమెరుపు మాత్రం తప్పకుండా ప్రతి మనసునీ మెలితిప్పి మరీ వదులుతుంది.

హరే కృష్ణ said...

అయ్యో..చివరకి వచ్చేసరికి పాపం అనిపించిందండి
మా కాంపస్ లో చాలా నెమల్లు ఉండేవి గ్రౌండ్ లో క్రికెట్ ఆడటానికి వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు చాలా దొరికేవి డబ్బుకోసం ఇలా చెయ్యడం ఎంతైనా పాపమే..శాఖాహారం ఎంత ఉత్తమమో ఇలాంటి పోస్ట్ లు చదివైనా తెలుసుకుంటే చాలా బావుంటుంది.

నిజం తెలిసాక పోస్ట్ బాగుందని చెప్పడం కష్టం

వేణూ శ్రీకాంత్ said...

సరదాగా నడిపించుకుంటూ వచ్చి... చివరి పేరాతో హృదయం మెలిపెట్టేశారు ఇందు :(

భాను said...

సరదాగా బాగుంది అనుకొనే లోపే....చివరగా హ్ర్యుదయం కలిచివేసింది....నిజంగా అలా ఆలోచిస్తే మనం వాడే పెర్ఫుమ్స్ ఇంకా ఎన్నో వాటి వెనక ఎన్ని విషాద బరిత మయిన నిజాలు. ఒక జంతువును కస్తూరి అనుకుంటా చిన్న బోనులో కట్టేసి దాన్ని ఎంత బాగా హింసిస్తే దాని నుండి అంత కస్తూరి స్రావం వస్తుందట ఎక్కడో చదివిన గుర్తు. ఇలా చెప్పాలంటే చాలా ఉదాహరణలు. మన ఆనందం సరదాల కొరకు వాటిని హింసించడం చాలా హేయమయిన చర్యలు. మీ పోస్ట్ బాగుంది

భాను said...

క్షమించాలి. కస్తూరి మృగం సౌందర్యం మగ కస్తూరి నాభి వద్ద ఉంటుంది. ప్రపంచ మార్కెట్లు ఈ కస్తూరి ధర ఒక కేజీ కి సుమారు రెండున్నరలక్షాల రూపయలున్తుందట. ఒక కస్తూరి మృగం నుండి సుమారు ౩౦ నుండి 50 గ్రాముల్ విడుదలవుతుంది. అంటే ఈ పెర్ఫుం లలో మరియు ఔశాదాలలో వాడే కస్తూరి కొరకు ఎన్ని మృగాలను చంపుటారో ఉహించండి. ఇక పై కామెంట్ లో నేనన్నది ఏదో పిల్లి లాంటి జీవి. దాన్ని ఎంత బయపెట్టి అంత హింసిస్తే దాని యోని నుండి వచ్చే ఒక రకమయిన స్రావం బహుశ పెర్ఫుం లలో వాడతారనుకుంటా. ఎక్కడో చదివా సరిగా గుర్తుకులేదు. ఆ పిల్లి లాంటి మృగాన్ని ఎంత హింసిస్తే అంత స్రావం పెరుగుతుందట కాబట్టి దాన్ని సూదులతో గుచ్చి కట్టెలతో పొడిచి...ఉహించుకొంటేనే హృదయవిదారకంగా ఉంది. అవి ఎంత క్షోభ అనుభావిస్తాయో కదా..

sivaprasad said...

ఎంతైనా ప్రకృతి అందం ముందు అందరం దాసోహమే కదా!

నేస్తం said...

:(((

Sree said...

enno gnaapakaalu tatti lepi.. malli antalone oka mulli gucchindi manasulo indu.. chaala bagundi post.

సవ్వడి said...

<< .ఇక రెండవది....ఒక చిన్న ఫ్లవర్ వాస్లో పెట్టి నా బెడ్రూం కిటికిలో పెట్టా.ఆ తరువాత ఒక బుల్లి వెదురు వేణువు కొని అది కూడా నెమలీక తో పాటు అ వాస్ లో ఉంచా. >> అప్పుడు మీ వయసెంత! రియల్లీ ఇట్స్ ఎ నైస్ థాట్...
ఓ గొప్ప ఫాంటసీలో విహరిస్తున్న నన్ను చివరలో బాధ పెట్టేసారు. కరక్ట్ గానే చేసారు.

ఇందు said...

@ మనసు పలికే:అవునండి...మన సంతోషం కోసం ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం.ఇది ఎప్పుడు ఆగుతుందో...

@ రాధిక(నాని ):ధన్యవాదాలు రాధికగారు

@ లత:ధన్యవాదాలు లతగారు :)

ఇందు said...

@కొత్త పాళీ:ధన్యావాదాలండీ.మీనుంచి ఇటువంటి ప్రశంశ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు.మొదటినించీ మీరు నా తప్పొప్పులు చెబుతూనే వచ్చారు.కాబట్టి దీనిలో మీ పాత్ర కూడ ఉంది :) నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు :)

@ జయ:అవునండీ నాకు చాలా బాధేసింది ఆ రోజు. అందుకే ఇక ఎప్పటికీ నెమలీకలు కొనగూడదని అనుకున్నా.


@ హరే కృష్ణ:నా పోస్ట్ భావం అర్ధమయింది కదా అది చాలు.పోస్ట్ నచ్చకపోయినా పర్లేదు :) ఇంతకీ మీ చేయి ఎలా ఉంది? తగ్గిందా?

ఇందు said...

@ వేణూ శ్రీకాంత్::( కొన్ని నిజలు చేదుగా ఉంటాయి వేణు. వాటిని ఒప్పుకోవాలి అంతే.

@ భాను :మీరు అన్నది నూటికి నూరుపాళ్ళు నిజం.పర్ఫ్యుంస్యె కాదు..మన వేసుకునే మందులు..కాస్మెటిక్స్...ఇలా ఎన్నొ..జంతువులమీద ప్రయొగిస్తారు. అవి చూస్తే నిజంగా ఎడుపువస్తుంది. కానీ అన్ని మనకి తెలియవు.అన్నీ ఆచరించలేము.కాబట్టి తెలిసి తెలిసి చేస్తున్న కొన్ని తప్పులని సరిదిద్దుకోవచ్చుగా....అందుకే నేను లెదర్ వస్తువులు వాడను...ఫర్ తో చేసిన దుస్తులు వాడను...కాగితాలు ఎక్కువ వేస్ట్ చేయను.ఇలా కొన్ని నాకు తెలిసినవి పాటిస్తున్నాను.

ఇందు said...

@ sivaprasad: :)

@ నేస్తం : :(

@ Sree:thanq Srii.

@ సవ్వడి:అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నా అండీ...థాంక్యూ.. :)

శివరంజని said...

చాలా బాగా రాశారు ఇందు గారు నాకు నిజం గా చిన్నప్పడి విషయాలు గుర్తొచ్చాయి ... ..నెమలీకలంటే చిన్నపుడు అవే మనకి పెద్ద పెద్ద ఎసెట్స్ లా ఫీల్ అయిపోయేవాళ్ళం ... మంచి జ్ఞాపకం ...మంచి పోస్ట్

kiran said...

ayyooo..papam kadaa nemali... :(..mee post ki thiru ledu.. :D

అశోక్ పాపాయి said...

మీ పోస్ట్ చదువుతుంటే చిన్నప్పుడు మేము చేసిన అల్లరి పనులు గుర్తచ్చాయిండీ. చదువుకునే రోజుల్లో పిల్లలు పెడతాయని నెమలీకలు పుస్తకాల్లో దాచుకునే వాళ్లము :)) మీ పోస్ట్ బాగుందడీ.

Ramakrishna Reddy Kotla said...

నెమలీకలు... చిన్నపుడు నా ప్రియ నేస్తాలు .. బాధల్లో.. సంతోషాల్లో.. ప్రొద్దున్నె బుక్కు తెరిచి వాటిని చూస్తే అదో తృప్తి. వాటికి దాణాగా మేము కొబ్బరి చెట్టుకి ఉంటే పొట్టు లాంటిది వేసే వాళ్ళం ..

Ennela said...

బ్లాగ్ ప్రవేశ మహోస్త్సవము :
Indu garu, ettakelaku blog open chesaanandee.... kaanee inka customise cheyyadaaniki time dorakaledu... prastutaaniki unna blog loney oka chinna opening pettaanu... please chadavaroo...
meeru sakuntuba , bandhu mitra saparivaara samethamga... antey ikkada unna snehithulandaritho saha naa blog visit cheyyochchanna maata.
Thanks for your time and sorry for writing in english...
Ennela

ఇందు said...

@ శివరంజని:Thankyou ranjani.

@ kiran:అవును పాపం నెమలి :(

@ అశోక్ పాపాయి :ధన్యవాదాలు అశోక్ గారు.

@ Ramakrishna Reddy Kotla:బాగుంది మీ నెమలీకల దాణా :))

మంచు said...

మీరు లాస్ట్లొ ఇలాంటి ట్విస్ట్ ఇవ్వడం వల్ల మీ పొస్ట్లు ఎక్కువ రోజులు గుర్తు ఉంటున్నాయండి. నెమలీకలగురించి మీలా నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నా.... మీ లాస్ట్ పేరా చూసి అందరిలా అయ్యో అనే అర్హత నాకు లేదేమో :(

ఇందు said...

@ మంచు :అయ్యొ! అదేంటీ అలా అనేసారు?'అయ్యో' అనడానికి అర్హత ఎందుకండీ?