16, మే 2011, సోమవారం

కొత్తావకాయే...తన కంటి ఎరుపాయే!

అది ఒక వేసవి సాయంత్రం!! 

నిప్పులు చెరిగిన సూర్యుడు కాస్తంత శాంతించాడు!!

చల్లని పిల్లగాలి చక్కిలిగింతలు పెడుతోంది!!

రివ్వున ఎగిరే గువ్వపిట్టలా.....మనసు ఆ పైరగాలిలో పడి ఎటో వెళ్ళిపోతోంది!!

డాబా మీద ఉన్న గట్టు పైన కూర్చొని చకచకా ఇంటికి వెళ్ళే పిట్టల్ని చూస్తూ......అలసిసొలసి కిందకి దిగిపోతున్న సూర్యుడికి టాటా చెబుతూ ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉన్నా!

అంతలోనే తియ్యటి పిలుపొకటి చెవిని తాకింది.....'అమ్మలూ.....కిందకి రావే! పచ్చడి కలపాలి!' 

అమ్మ పుడుతూనే తేనే గొంతులో పోసుకుని పుట్టిందేమో....ఎప్పుడు ఇలాగే తియ్యగా పిలుస్తుంది!!

నేను డింగ్ డింగ్ అని రెండుమెట్ల మీదనించి ఒకేసారి దూకుతూ.....కిందకి వెళ్ళానా.....నాకోసం ఎదురు చూస్తున్నాయ్....చక్కగా ఆరబెట్టిన  మామిడి ముక్కలు. వాటిని చూడగానే ఎర్రగా ఉండే ఆవకాయే కళ్ళముందు కనపడుతోంది!!

ముందురోజు మా కూరగాయల రమేష్ కొట్టిచ్చిన ఆ మామిడి ముక్కల టెంకకి ఉన్న తొక్కు తీసి...ముక్కలు తుడిచి....ఆరబెట్టాము కదా....ఇప్పుడేమో పచ్చడి పట్టడం అన్నమాట!

వాటికి తగిన ఆవపిండి,ఉప్పు,కారం,పసుపు కలిపి అంతకు తగ్గ నూనె పోసి....అలా చేత్తో అమ్మ ఆ ముక్కల్ని కలియ తిప్పుతుంటే..... నాకు నోరు ఊరిపోతుంటే....ఆగలేక ఒక ముక్క తీసుకుని నాకేసా! హ్మ్! అప్పుడే కలిపిన ఊరని ఆవకాయ్ దబ్బ ఎలా ఉంటుంది?? అలాగే ఉంది నామొహం కూడా ఆ క్షణంలో!

చిరునవ్వు నవ్వింది అమ్మ! 

'నాలుగురోజులు ఆగవే! అంత ఆత్రమెందుకు! అప్పుడు ఇంతకి రెండింతలు రుచిగా లేకపోతె నన్నడుగు! ' అంది.

అంతటితో ఊరుకుందా....లేదు....నాకిష్టమని తియ్యగా ఉండే బెల్లమావకాయ కొంచెం కలిపింది.....వేడి చేయదని పెసరావకాయ కూడా కొంచెం కలిపింది.ఆ ఊరగాయల్నిఎంచక్కా జాడీలలో పెట్టి....వాసిన కట్టి.....చక్కగా దాచిపెట్టేసింది!

అబ్బబ్బ! నా వల్లకాట్లేదు.....అవన్నీ చూస్తుంటే! అన్నీ ఒకేసారి తినేయాలని అనిపిస్తోంది!! కాని ఎలా?

హ్మ్! సరే...నాలుగురోజులు డెడ్ లైన్...... అప్పటికి ఆవకాయ పెట్టలేదో.........'ప్రియ' పికిల్ తెచ్చేసుకుంటా! అని అల్టిమేటం ఇచ్చా మా అమ్మకి! 

'చూద్దాం! అమ్మ పెట్టె ఆవకాయ రుచి నీకు ఆ 'ప్రియ' పికిల్లో ఎలా వస్తుందో!'

చాలెంజ్-చాలెంజ్....

నాలుగురోజుల తరువాత.....

ఆ రోజు సాయంత్రం......ఆకాశమంతా  నిండైన నీలిరంగు నింపుకున్న ఒత్తైన మబ్బులతో ఊరిస్తోంది!!

ఒక్కో చినుకు.....పడనా...వద్దా అని ఆలోచించి.....నీలినింగికురలనించి జాలువారుతోంది!!

కమ్మటి మట్టి వాసన.....గుండెలనిండా నిండిపోతోంటే.........వేడివేడిగా ఏమైనా తినాలనిపించింది!!

'అమ్మా.....పకోడీ వేయవా?' అని అడిగేలోపు.....కొత్తావకాయ గుర్తొచ్చింది.

దీనికితోడు....పొయ్యి మీద కుతకుతమని ఉడుకుతున్న అన్నం వాసన!

ఇక కొత్తావకాయ మీద దాడి అని నిశ్చయించుకుని........ఎప్పుడు అన్నం ఉడుకుతుందా అని ఆశగా అక్కడే కూర్చున్నా!

నా ఆలోచన ఎలా కనిపెట్టిందో.....అమ్మ ఒక చిన్న గిన్నెలోకి  ఆవకాయ తీసి పెట్టింది!


క్రమంగా చీకటి పడుతోంది. బైట చినుకులు వేగం పుంజుకున్నాయి! అనుకున్నట్టే కరెంటు పోయింది....అమ్మ చార్జ్ లైట్ వెలిగిస్తానంటే.....ఒద్దని కాండిల్ వెలిగించా!

వెనక వైపు తలుపు తెరిస్తే......చల్లటి గాలి.....సన్నని వర్షపు తుంపర ఇంట్లోకి వస్తున్నాయ్! బోలెడంత మట్టివాసన మూటగట్టుకోస్తున్నాయ్!! నడివేసవిలో ఈ వర్షమేంటో....కాని చాలా బాగుంది.


ఇంతలోకే ఎక్కడినించి వచ్చాడో.....మా తమ్ముడు వచ్చాడు.....'అమ్మా ఆకలి అన్నం పెట్టు' అని!

అప్పటిదాకా ఎలాగోలా తమాయించుకున్న నేనూ ఇక ఆగలేకపోయా!

అమ్మ ఇద్దరికీ ఒకే కంచంలో కలిపింది.....వేడి వేడి అన్నంలో....ఎర్రెర్రని కొత్తవకాయ్! అబ్బ! ఆ రంగుచూస్తేనే సగం కడుపు నిండిపోతుంది!!

నూనెలో తేలుతున్న గుజ్జుతో కూడిన ఎర్రని మామిడి ముక్కలు 'రా రమ్మని' అని ఊరిస్తుంటే....అలానే తీసుకుని నోట్లో పెట్టేసుకుందామని ఉన్నా....మళ్లీ అమ్మచేతి కమ్మదనం మిస్ అయిపోతానని ఆ పని చేయలేదు!

అమ్మ పల్చగా కలుపుతుంటే....మారం చేసి మరీ ఒత్తుగా....ఎర్రగా కలిపించా.ఒక్కోముద్ద చేసి.....నాకు తమ్ముడికి నోట్లో పెట్టింది.

ముద్ద ఇలా నోట్లో పెట్టుకోగానే....ఆ కారానికి కళ్ళ వెంబడి నీళ్ళు.....అయినా తినాలని ఆశ...అదేమి ఆకర్షణో ఆవకాయలో!

అంతలోనే.... ఎక్కడనించి తెచ్చిందో ఇంత వెన్నపూస తీసుకొచ్చి వేసింది అమ్మ.

'ఏమే బంగారం.....కారంగా ఉందా? లేదులే తల్లి! ఇప్పుడు చూడు....ఎంత బాగుంటుందో!' అని ముందు ఆ వెన్నపూస కాస్త నాలికకి రాసి తరువాత  ఒక్కొక్క ముద్దలో  వెన్నపూస కలిపి తన చేత్తో నోట్లో పెడుతుంటే......ఆ కొవ్వొత్తి వెలుగులో......ఆ వర్షపు గాలిలో....కొంచెం కొంచెం కారంగా....మరెంతో కమ్మగా ఉన్న కొత్తావకాయ+వెన్నపూస రుచి.... అదుర్సో అదుర్స్!

ఆ రోజు పోటీలు పడి...నేనూ మా తమ్ముడు ఎన్ని ముద్దలు తిన్నామో.....!!

అంత రుచిగా ఒక ఆహార పదార్ధం ఉంటుందని నాకు అప్పటిదాకా తెలీలేదు......ఆ రుచి మళ్లీ ఎక్కడా నాకు తారస పడలేదు!

మరి అది అమ్మ చేతి మహిమో....కొత్తావకాయ గుణమో.....వర్షపు సాయంత్రం వరమో.... ఏమో!

20 కామెంట్‌లు:

రాజ్ కుమార్ చెప్పారు...

అబ్బబ్బా... నేను కుళ్ళుకుంటూన్నానండీ... ప్చ్...
నాకయితే.. కారం ఆవకాయ పెరుగన్నం లో కలిపి కుమ్మేయడం పిచ్చి ఇష్టం..
చిన్నప్పుడయితే.. మామిడీ ముక్కలు నీట్లో కడీగేసి, తినేసేసరికీ వారానికల్లా ఊట మాత్రమే మిగిలేది.. ;) ;) మీ వర్ణనకీ, ఆ ఫొటో లకీ నా నోరు ఊరిపోయి చెరువయిపోయిందండీ..
సూపరు పోస్టు..

తృష్ణ చెప్పారు...

very touching ! nice post.

ఇందు చెప్పారు...

హ్హహ్హహ్హా....రాజ్ నోరు ఊరిపోయి చెరువయిందా? కెవ్వ్వ్!! ఇంకేం ఈసారి కొత్తావకాయ తెచ్చేసుకుని పెరుగేసుకుని తినేయండీ ;) నా పోస్ట్ నచ్చినందుకు థాంక్యూ!! :)

తృష్ణగారూ...థాంక్యూ అండీ :)

మనసు పలికే చెప్పారు...

వా వా..;( నన్ను ఊరిస్తున్నావ్ ఇందూ..:(((((
నాకిప్పుడు తినాలని ఉంది. నోట్లో లాలాజలం ఊరిపోతుంది:( ఇదంత నీవల్లే నీవల్లే నీ.....వల్లే....

వేణూశ్రీకాంత్ చెప్పారు...

అబ్బ.. ఎంత బాగా రాశావ్ ఇందు.. చివరికి వచ్చేసరికి నోరూరిపోయింది.. టపా చాలా చాలా చాలాబాగుంది.. కొత్తావకాయంత రుచిగా :-)

కొత్త పాళీ చెప్పారు...

nice.

kiran చెప్పారు...

ఇందు ఇది అన్యాయం..అక్రమం...ఇప్పుడే మా హాస్టల్ లో పెట్టిన గడ్డి తిని వచ్చిన నాకు ఆవకాయ రుచి ఇంతలా వర్ణిస్తూ టపా పెట్టేస్తావా..:)
చాల రోజుల తర్వాత మళ్లి మా ఇందు ఓ టపా పెట్టింది కాబట్టి accepted .. :P

మురళి చెప్పారు...

మొత్తానికి కొత్తావకాయ రుచ్చూపించేశారు...

లత చెప్పారు...

ఈ రొజే పచ్చడి పట్టాము ఇందూ,ఇప్పుడే ఊరీ ఊరని ఆవకాయ తిన్నాను ఆ రుచి నాకు భలే ఇష్టం ,
మీ పోస్ట్ కూడా ఆవకాయ రుచి లానే కమ్మగా ఉంది

స్నిగ్ధ చెప్పారు...

వెల్కం బాక్ ఇందు గారు...చాలా ఆహ్లాదంగా ఉంది మీ టపా...బాగా నోరూరించారు....
:)

హరే కృష్ణ చెప్పారు...

చాలా బావుంది ఇందు గారు
మొదటి కామెంట్ పెడదామనుకుంటే అసలు ఏదో ప్రాబ్లం వచ్చి కుదరలడం లేదు ఇప్పటికైనా పబ్లిష్ అవుతుందో లేదు
ఈ పోస్ట్ చదివాక ఎప్పుడో నాలుగేళ్ల క్రితం దేశముదురు సినిమాలో ఆవకాయ గురించి ఎవరో చెబుతారు
అంతటి చక్కని ఫీలింగ్ కలిగింది :)
పోస్ట్ ఎలా ఉంది అంటే
అమ్మ చేతి ప్రేమ
ప్రతీక్ ప్రతీకారం చాలా అద్భుతంగా ఉంటాయి :)

మాలా కుమార్ చెప్పారు...

కొత్తావకాయ బాగా రుచి చూపించారు . బ్లాగ్ లోకం లాలాజలం లో మునిగిపోతుందో ఏమో :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

బాగా లేదండీ. మీరు కూడా ఇల్లా చేస్తారనుకోలేదు. ఫోటోవులు పెట్టేసి మమ్మల్ని ఊరించి ఊరించి మీరు తింటూ ఆహా ఏమి రుచి అని పాడుకోవడం ఏమి బాగాలేదు. ఏదో కనీసం ఒక వెయ్యి గ్రాములైనా మాకు ఇవ్వకుండా జాడీలు జాడీలు మీరు దాచేసుకోవడం అసలు బాగాలేదు. అన్నట్టు 1000 గ్రాముల ఆవకాయ తో 2000 గ్రాముల వెన్న పంపించడం మరిచిపోకండి.

ఇందు చెప్పారు...

@మనసు పలికే: అప్పూ..మరేమో....ఆవకాయ...పుల్లపులగా...కారంకారంగా....భలెభలె ఉంది తెల్స? ;)

@వేణూ శ్రీకాంత్ :వావ్! వేణు అంత నచ్చినందుకు....బోలెడు థాంక్యులు :)

@ కొత్త పాళీ :హలో సర్...ఎలా ఉన్నారు? మీరు నా బ్లాగులో కామెంటి చాలా రోజులయిందండీ!! మళ్ళీ వచ్చి కామెంటినందుకు ధన్యవాదాలు :)

ఇందు చెప్పారు...

@kiran : ఇలాంటప్పుడు ముందుజాగ్రత్తగా ఇంటినించి వచ్చేటప్పుడు ఆవకాయ్ తెచ్చేసుకోవాలి అమ్మాయ్ ;) లేకపోతే...ఇందులాంటివాళ్ళు ఇలాగే ఏడిపిస్తారు :P

@మురళి :మురళిగరూఊ.....నాబ్లాగులో మీ మొదటి కామెంటనుకుంటా...వెల్కం సర్..వెల్కం :) ఐతే...మీరు కొత్తవకాయ రుచి చూసేసారన్నమాట :)

@లత:లతగారూ...ఎలా ఉన్నారు? చాలా రోజులయింది మిమ్మల్ని పలకరించి :) నా పోస్ట్ నచ్చినందుకు థాంక్యూ....మీ వంటలు చూసే టైం ఉండట్లేదు...ఈసారి ఒకేసారి అన్ని చూసేసి కామెంటుతా :)

ఇందు చెప్పారు...

@snigdha :హేయ్ స్నిగ్ధ..గుర్తుపెట్టుకుని మరీ కామెంట్ పెట్టినందుకు థాంక్స్ :) నా పోస్ట్ నచ్చినందుకు మళ్ళీ థాంక్స్ :)

@హరే కృష్ణ:మీ కామెంట్ పబ్లిష్ అయిందండీ హరే గారూ! పండగ్ :) హా..అవునా....ప్రతీక్ పగ అంత బాగుందా? అన్వేష్ అమాయకత్వమంత కాదూ? ;)

@ మాలా కుమార్: హ్హహ్హహ్హ! అవునండీ పాపం అందరినీ ఊరించేసా! హాస్టల్స్లో ఉండేవాళ్ళ పరిస్థితి ఘోరం :( అయినా పర్లేదు...ఎవరో చెప్పినట్లు అహనాపెళ్ళంటలో లాగా....నా బ్లాగ్ చూస్తు...ఆవకాయ్ రుచి ఊహించుకుంటు ఒట్టి అన్నం తినేయడమె! ;)

@బులుసు సుబ్రహ్మణ్యం :హ్హహ్హహ్హ! బులుసుగారూ....మీకేంటండీ..ఎంచక్క మీ ఆవిడ చిటికెలో చేసిపెడ్తారు...పాపం మిగితా వారి పరిస్థితి?? అయినా మీకు కేజి ఆవకాయకి రెండు కేజీల వెన్నెదుకబ్బా? ఆవకాయలో వెన్న నంజుకుంటారా? వెన్నలో ఆవకాయ నంజుకుంటారా??

స్నిగ్ధ చెప్పారు...

మీరు గుర్తుండకపోవడమేంటండీ..నా బ్లాగులో తరచూ చదివే లిస్ట్లో మీది ఉంటేనూ...మీకు తీరిక ఉన్నప్పుడు నా బ్లాగ్ వైపు ఓ సారి కన్నెయ్యండీ...

అన్నట్టు ఈ మెసెజ్ ని కావ్య గారికి పాస్ చేయరా..తన బ్లాగ్ని నేను access చేయలేకపోతున్నాను..నా ఐ.డి కొంచెం యాడ్ చేసుకోమని చెప్పరా ప్లేజ్...

శివరంజని చెప్పారు...

మీ పోస్ట్ చదివాక వెంటనే కొత్త ఆవకాయ వేసుకుని తినేసా కొంచెం ఎక్కువగా కూడా తిన్నా

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"ముద్దలో వెన్నపూస కలిపి తన చేత్తో నోట్లో పెడుతుంటే......ఆ కొవ్వొత్తి వెలుగులో......ఆ వర్షపు గాలిలో....కొంచెం కొంచెం కారంగా....మరెంతో కమ్మగా"
మీ కొత్తావకాయ అనుభూతులు చాలా బాగున్నాయండీ..

ramki చెప్పారు...

ఏమండి ఇందు గారు.........
మా మీద ఎంత కోపం వుంటే ఈ పోస్టింగ్ రాస్తారు అంది.......
అసలు మీ ఈ పోస్టింగ్ చదువుతూ వుంటే.......ఒక్క సరి అని పించింది......మనం తినే తిండి తిన్దేనా అని.........
కరెక్ట్ గా అప్పుడే నేను కార్న్ ఫ్లకేస్ తింటున్న........ఒక్క సరిగా అనిపించింది.......ఏంటి ఈ తిండి అని.......... :(
పోనీలెండి....మొతానికి కొత్త ఆవకాయ తినకపోయినా తింటే ఎలా వుంటుంది అన్న అనుభూతిని కలిగించారు........
keep rocking....... :)