అసలు ఆ రోజులు తలుచుకుంటే మనసు రెక్కలు కట్టుకుని రివ్వున ఎగిరిపోతుంది.....
ఈ జ్ఞాపకాల దొంతరలోనే దొరికింది ఒక రంగుల పేజి.....అదే 'నోట్ బుక్' వెనుక పేజి.
బహుశా....ఇది అందరి కాలేజి చదువులకి వర్తిస్తుందేమో. ఎందుకంటే క్లాసులో పాఠాలు వింటూనే మాట్లాడుకునే కళ [ఈమధ్య సెల్ఫోన్లు వచ్చాయనుకోండి] మనకి నేర్పింది ఈ నోట్ బుక్స్ యే కదా! నావరకు నేనైతే ప్రతి నోట్ బుక్ ముందు,చివర రెండు పేజీలు ఖాళీ ఉంచేదాన్ని.మరి సంవత్సరం మాట్లాడుకునే కబుర్లకి ఆ మాత్రం వదలొద్దూ! ఇక పెన్ను వాడితే ఆ రెండు పేజీలు తొందరగా అయిపోతాయని పెన్సిల్ వాడేదాన్ని [తెలివి ;) ]
ఇక ఆ రాతల్లో ఎన్నెన్ని ఇంఫర్మేషన్లో! ఫోన్ నంబర్లు హడావిడిగా రాసుకోవాలన్నా.....మనసులో పాడుకుంటున్న పాటకి చేతిలో పెన్ను అక్షర రూపం ఇవ్వాలన్నా...... తవికలైన, కథలైన...... ముచ్చట్లైనా..... తిట్లైనా అన్నీ ఆ వెనుక పేజీల్లో పొందిగ్గా అమరిపోయేవి. అందుకే సాధ్యమైనంతవరకు మా నోట్ బుక్స్ అబ్బాయిలకి అడిగినా ఇచ్చేవాళ్ళం కాదు :)))) [ఇన్ఫో లీక్ అయిపొదూ ;) ]
అలాగే సినిమాకి వెళ్ళాలంటే 'మూవీ?' అని రాసి అందరికీ పాస్ చేసేవాళ్ళం.రావాలనుకునేవాళ్ళు వాళ్ళ పేర్లు రాసేవాళ్ళు. కానీ పాపం లెసన్ చెప్పే సార్ ఏమో మేమేదో నోట్స్ షేర్ చేసుకుంటున్నాం అనుకునేవాడు పాపం మానవుడు! ఇక ఎన్నింటికి వెళ్ళాలి? ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులున్నాయ్? టికెట్లకి సరిపోతాయా? ఇత్యాది లెక్కలన్నీ ఆ పుస్తకాలూ అటు-ఇటు మోస్తూ తిరిగేవి

ఇక నేనైతే.... ప్రతి పేజి కార్నర్ లో బుల్లిబుల్లి బొమ్మలు వేసేదాన్ని. ఇక చివరి పేజీల్లో ఏదో చేతికొచ్చిన బొమ్మ వేయడం.....దానికి రెండు కళ్ళు,ఒక ముక్కు,నోరు రెండు పిలకలు పెట్టడం...... పక్కనున్న నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరి పేరు రాయడం....... ఇక ఆ అమ్మాయిని ఏడిపించడం! ఆ పిల్ల లబోదిబోమన్నా నోట్స్ ఇచ్చేదాన్ని కాదు. అందరూ చూసి పడి,పడి నవ్వాక అప్పుడు తీరిగ్గా ఆ అమ్మాయికి ఇస్తే.....తను ఎంచక్కా తన పేరు కొట్టేసి నా పేరు రాసి కచ్చ తీర్చుకునేది. హహహ! అయినా కూడా భలే ఉండేది...ఆ మజాయే వేరు!

ఇక ఒకరోజు ఎలెక్ట్రానిక్స్ క్లాస్ జరుగుతుంది. నాకు ఈ సబ్జెక్ట్ అంటే చాలా చిరాకు. 'ఎహే సోది గోల' అని చెప్పి ఆ క్లాస్ నోట్స్ వెనుక పేజిలో ఇక ఒక కథ రాయడం మొదలుపెట్టా. క్లాస్ అయిపోయేసరికి నా కథ అయిపోయింది :)) న్యూస్ పేపర్ మీద కథలెండి ;) ఇంకా మీ మీదకి వదలలేదు నేను :)) మా ఫ్రెండ్స్ ఐతే అది చూసి......అసలు నన్ను ఒక రేంజ్లో పొగిడేసరికి మా క్లాసు అటకెక్కి కూర్చున్నా కాసేపు. అలా క్లాసులో రాసిన ఇంకో కథే.....నా 'చిట్టి చీమ కథ'.
అలాగే..... బెంచిలమీద రాసే అలవాటుకూడా మనకి అలవడింది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం 'సి' లాంగ్వేజ్ నేర్చుకోడానికి మా గుంపుగుంపు అంతా ఒక ఇన్స్టిట్యుట్ మీద పడ్డాం. అక్కడ ఒక్కక్కరికి ఒక్కో చెయిర్. దానికి రాసుకోడానికి ఒక బుల్లి బల్ల. ఇక దానిమీద ఉండేవి....బాబోయ్! 'విజయేంద్ర వర్మ.....చూసినోడి ఖర్మ', ఇలాంటి కేక పెట్టించే డైలాగ్స్ ఉండేవి. రోజు అవి చూసి నవ్వుకోలేక చచ్చేవాళ్ళం :))

ఒకరోజు మధ్యాహ్నం లంచ్ అయ్యాక నేను మా ఫ్రెండ్ చైర్లో కూర్చున్ని బుద్ధిగా చదువుకుంటున్నా. తీరా దాని ప్లాంక్ చూస్తే.....కొత్తగా తళతళ లాడుతోంది.నీట్ గా ఏమి రాయకుండా ఖాళీగా ఉంది. అది చూసేసరికి మన చేతులు దురద పుట్టాయి. 'అరె! నాకు చెప్పలేదేంటి ఎప్పుడు కొన్నది ఈ కొత్త ప్లాంక్? భలే బావుంది' అనుకుని ఎంచక్కా నా హైలైటర్ తీసుకుని......అప్పుడే విడుదలైన 'ఒక్కడు' ఆడియోలో పాట రాసేసా ;)
ఒకటికి నాలుగు సార్లు అది చూసుకుని మురిసిపోయి.....కాసేపు ఆ ప్లాంక్ మీదే నిద్రపోయి....లేచి ముఖం కడుక్కుని నా ప్లేస్ కి వచ్చి కూర్చున్నా.ఇక లంచ్ చేసి అందరూ వచ్చేసారు.....గోలగోలగా ఉంది. ఇంతలో నాకు అస్సలు పరిచయం లేని ఒకమ్మాయి మా ఫ్రెండ్ చైర్ దగ్గరకొచ్చి ఆ ప్లాంక్ తీసుకుని చూసింది.ఆ ప్లాంక్ ఆ పిల్లదట. కేవ్వ్వ్వవ్వ్వ్వ్!!నేను రాసింది చూసి పళ్ళు పటపటా కొరికింది. ఆ పిల్ల పవన్ ఫ్యాన్ అట! మహేష్ అంటే పడదట! మనకేం తెల్సు? వాఆఆఅ......వా............

హ్మ్! అప్పటినించి ఏం రాసినా.....ఎక్కడ రాసినా ఆచి,తూచి రాస్తుంటా అన్నమాట ;)
అదండీ...... నా జ్ఞాపకాల తేనెతుట్టె కదిపేసి ఆ తేనెటీగలను మీమీదకి వదిలేసా! కామెంటు పెట్టకపోతే కుట్టేస్తాయ్ మరి ;) జాగ్రత్తా! :)))))))