Saturday, August 14, 2010

సాగర్ రోడ్డు లో ....

నాకు చాలా ఇష్టమైన,ఎన్నో జ్ఞాపకాలు గుర్తుచేసే సాగర్ రోడ్ ....అందులోని కొన్ని విశేషాలని  ఇక్కడ వ్రాస్తున్నా....


మేము గుంటూరునించి  ఎప్పుడు హైదరాబాదు వెళ్ళాలన్నా...విజయవాడ,నల్గొండ వైపు ఉన్న రహదారులు కాకుండా ఈ సాగర్ రోడ్డు మార్గాన్నే ఎంచుకునేవాళ్ళం....ప్రయాణ సమయం కొంచెం ఎక్కువే అయినా పెద్దగా ట్రాఫిక్ అంతరాయం లేకపోవడం,ఇంకా కనువిందైన సాగర్ అందాలు చూడవచ్చు  అనే ఉద్దేశం తో ఎక్కువగా ఈ దారినే వెళ్ళే వాళ్ళం.....మొన్న అమ్మ వాళ్ళు హైదరాబాదు వెల్లాల్సివచ్చినపుడు ఈ దారిగుండా వెళుతూ అంతకుముందు నేను వారితో కలిసి ప్రయాణం చేసిన జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకున్నారట.....ఇవాళ ఫోన్ చేసినపుడు  దానిగురించి చెప్పారు....అలా సాగర్ రోడ్ గురించి ఆలోచిస్తుంటే ఈ బ్లాగ్ రాయాలనిపించింది....

గుంటూరు నుంచి పిడుగురాళ్ళ-మాచెర్ల-సాగర్-మల్లేపల్లి-మాల్-ఇబ్రహింపట్నం మీదుగా హైదరాబాదు చేరుకునే ఈ రోడ్డు ఈ మధ్యే ఎక్కువ వాడుతున్నారు...గుంటూరు నించి సాగర్ దాక చిన్న చిన్న ఊళ్లు తగులుతూ ఉంటాయ్ కానీ సాగర్ నించి ప్రయాణం కొంచెం విసుగనిపిస్తుంది....అక్కడక్కడ విసిరేయబడ్డట్లు  ఉండే ఊళ్లు,చుట్టూ ఎంతమేరకు చూసినా మట్టిదిబ్బలు కనిపిస్తాయి...కానీ సాగర్ వరకు, ఇంకా సాగర్ దగ్గర ప్రయాణం భలే కులాసాగా సాగుతుంది....


గుంటూరు లో బయలుదేరి....అలా సత్తెనపల్లి మీదుగా వస్తూ దూరంగా కనిపించే 'కొండవీటి కొండల' అందాలను ఆస్వాదిస్తూ...చుట్టూ పచ్చని పొలాలు,మధ్యలో తగిలే వాగుల సొగసులు చూస్తూ.....పిడుగురాళ్ళ 'రావిళ్ళ'హోటల్లో ఒక చిన్న విరామం తీసుకుని కాసిని చాయ్ తాగి...అలాగే ముందుకెళ్ళి మాచర్ల లో మెయిన్ రోడ్డు మలుపు మీద పెట్టిన బజ్జీల కొట్టు లో చాలా ఘాటుగా ఉండే 'మిరపకాయ బజ్జీలు' తిని ఇక సాగర్ వైపు సాగటం మొదలుపెడతాం...ఈ దారి అంతా  మలుపులు మలుపులు గా ఉండి చుట్టూ చిట్టడవులతో భలే ఉంటుంది....ఇక్కడ చిరుత పులులు కూడా తిరుగుతాయట!!( 'శ్రీశైలం-సాగర్ రాజీవ్ పులుల అభయారణ్యం' ఇక్కడే మొదలవుతుంది)...నాకైతే చిన్న చిన్న కుందేలు పిల్లలు ఇంకా తెలుపు-నలుపు నక్కలు కనపడ్డాయ్(ముందు నక్కల్ని చూసి కుక్కలు అనుకున్నా... తరువాత మా డ్రైవెర్ చెప్పాడు అవి నక్కలని వాటి తోక కుచ్చుగా  ఉంటుందని!!!)


ఇక అల్లంత దూరం లో సాగర్ డ్యాం వస్తుందనంగా దూరంగా,లోతుగా కృష్ణానది కనిపిస్తుంది......ఒకవేళ డ్యాం గేట్లు తెరిచి ఉంటే ఆ నీటి ఒరవడికి తుంపర్లు చాలా దూరం వరకు  ఎగసిపడతాయి...దగ్గరకి వెళ్లేకొద్ది కనిపిస్తుంది అద్భుతమయిన నాగార్జున సాగర్ డ్యాం....గుంటూరు-నల్గొండ సరిహద్దుల్లో కట్టిన 'మానవ నిర్మిత మహా సాగరం' ఈ సాగర్ డ్యాం....ఎంతో ఎత్తులో విశాలంగా కట్టిన సాగర్ డ్యాం ని చూస్తే కీ.శే.రాజశేఖర్ రెడ్డి గారు అనే 'ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు' అన్న మాట నిజమనిపిస్తుంది...ఇక్కడ  నది ఎంతో వేగంగా లోతుగా ప్రవహిస్తుంది...నది పై కట్టిన  ఎతైన వంతెన పై నిల్చుని సాగర్ ని అలా ఎంతసేపైన చూడాలనిపిస్తుంది...ఇక సాగర్ డ్యాం కి అటుపక్క వెళ్లి హైదరాబాదు వైపు మళ్ళితే వస్తుంది 'విజయవిహార్' అనే ఆంధ్రా పర్యాటకసేఖవారి వసతిగృహం...అక్కడ ఉండే హోటల్ వెనకవైపు 'సాగర్ బ్యాక్ వాటర్స్' అందం చూసి తీరవలసిందే కానీ చెప్పలేం.....హోటల్ కి 'వ్యూ' కనిపించాలని సాగర్ వైపు అంతా నిలువెత్తు అద్దాలు పెట్టారు.అక్కడ కూర్చుని సాగర్ అందాలూ చూస్తూ ఉండవచ్చు లేదంటే తలుపు తీసుకుని వెనక వైపు ఉన్న చిన్న తోట లోకి వెళ్లి చూడవచ్చు....అక్కడ నించి చూస్తే  అవతలి ఒడ్డు కనిపించనంత సువిశాలంగా నీలిరంగులో మెరిసిపోయే సాగర జలాలు....చీమల్లాగా  కనిపించే డింగిపడవలు.....మధ్యలో చిన్న చిన్న దీవులు....చూడటానికి ఎంత అందంగా ఉంటుందో ఆ ప్రదేశం....ఇక సంధ్యాసమయం ఐతే  వదిలి రాలేము.....నీలి రంగులో ఉండే సాగర జలాల్ని తన సింధూర వర్ణాలు రంగరించి నారింజ రంగులోకి మార్చి మెల్లగా దూరపు కొండల్లోకి ఒదిగిపోయే సూర్యుడిని చూసి మైమరచిపోవలసిందే......అనంతమైన  ఆ సాగరాన్ని చూస్తే అనిపిస్తుంది మనం ఎంత అల్పులం ప్రక్రుతి ముందు అని..అక్కడ రెస్టారెంట్ లో చేసే వేడి వేడి బ్రెడ్ పకోడీ  తిని కాసిని మసాల టీ తాగి బయలుదేరతాం.... 


ఇక ఆ తరువాత కబుర్లలో మునిగి తేలేలోగా లోగా 'మాల్' వస్తుంది...అక్కడ ఆదివారాలు  మన చందమామ కథల్లో సంతలాగా చిన్న సంత జరుగుతుంది మెయిన్ రోడ్డు మీదే అన్నీ రకాల వస్తువులు,తినుబండారాలు పెట్టి అమ్ముతుంటారు...కూరగాయలు చాలా తాజాగా ఉంటాయ్...మా అమ్మ ఎప్పుడు అటువైపు వెళ్ళినా చింతకాయలు,తెల్ల వంకాయలు,దోసకాయలు,చిన్ని చిన్ని మామిడికాయలు తీసుకోకుండా రాదు...ఇక అటు తరువాత మెల్లగా హైదరాబాదు చేరుకుంటాం.....


ఎంతో ఆహ్లాదం కలిగించే సాగర్ రోడ్ ప్రయాణం...ఒక్కసారైనా వెళ్ళవలసిందే...
సాగర్ డ్యాం 'బ్యాక్ వాటర్స్' దగ్గర తీసిన కొన్ని చిత్రాలు :)
9 comments:

వేణూ శ్రీకాంత్ said...

ఓహో మీదీ గుంటూరేనా గుడ్ గుడ్, సాగర్ అందాల గురించి భలే రాశారు. అన్నట్లు ఇదే రోడ్ గురించి రాసిన ఈ టపా చదివారా..
http://narasaraopet-bloggers.blogspot.com/2010/03/blog-post.html

kalapipasi said...

naku kuda sagar dam ante ento istamandi..adi entomandi dahartini terustondi....

జయ said...

విజయ విహార్ దగ్గిరలో, అక్కడే కొండ మీద ఒక స్కూల్ కూడా చూసి ఉండాలే మీరు. చూడలేదా? ఆ అందమైన సాగర్ దౄశ్యాలు నా గతాన్ని గుర్తు చేసాయి. మీకు నా ధన్యవాదాలు.

sivaprasad nidamanuri said...

good narration and photos .

ఇందు said...

@వేణూ శ్రీకాంత్చూ:చూసానండి...కాని వారు ఎక్కువగా వ్రాసింది 'పల్నాడు రోడ్డ్' గురించి కదా!! సాగర్ గురించి ఇంకా వ్రాసిఉంటే బాగుండేదేమో
@kalapipasi :అవునండీ
@జయ :అవునండి స్కూల్ కూడా ఉంది..ఇంకా సాగర్ దగ్గర ఉండే 'విజయపురి సౌత్ ' కి వెల్తే చాలా 'గురుకుల పాఠశాలలు ',వివిధ విద్యసంస్థల స్కూళ్ళు దర్సనమిస్తాయి.థ్యాంక్స్ అండీ.
@sivaprasad nidamanuri:థ్యాంక్స్ అండీ...

సిరిసిరిమువ్వ said...

ఓ మీది గుంటూరా? మేమూ ఇదే రూటులో ప్రయాణిస్తుంటాము... పిడుగురాళ్లలో ఏ హోటలులో అయినా టిఫిను బాగుంటుంది..అక్కడ తినటం కోసమే ఇంటినుండి ఏమీ తెచ్చుకోకుండా వస్తాం.మేము కూడా మాల్లో తప్పనిసరిగా కూరగాయలు కొంటాము. కుందేళ్లు ..నక్కలు మాత్రం ఎప్పుడు కనపడలేదండి..మీరు చెప్పారుగా ఈసారి నుండి జాగ్రత్తగా గమనించాలి. ఫొటోలు బాగున్నాయి.

sivaprasad nidamanuri said...

memu kuda nrt -hyd root lo piduguralla lo tifin chesevallam(eppuduaina morning hyd ki bayaluderithe)

ఇందు said...

@sivaprasad nidamanuri: సంతొషం :)

sanju -The king!!! said...

nice post...kani dams are modern temples of india annadi Nehru quote ani gurtu....