14, సెప్టెంబర్ 2010, మంగళవారం

పరాయి దేశం లో వినాయకచవితి....





దీపావళి,ఉగాది లాగే నాకు నచ్చే పండుగ ఈ 'వినాయక చవితి' .....బోలెడంత హడావిడి,అలంకరణ,పత్రి,చంద్రుడు వెరసి చిన్నప్పటినించి యే పండుగ జరిపినా జరుపుకోకపోయినా ఈ వినాయకచవితి మాత్రం ఘనంగా జరుపునేవాళ్ళం.....


అటువంటిది దేశం కానీ దేశం లో మొదటి సారి ఇంటికి దూరంగా ఉండి జరుపుకుంటున్న పండుగ.....


రెండు రోజుల ముందు నుంచే చందు ని హింసించడం మొదలుపెట్టాను....పత్రి ఎలా? మట్టి వినాయకుడు దొరుకుతాడా?? ఉండ్రాళ్ళకి బియ్యపు రవ్వ ఎక్కడ  కొనాలి ?? మరి పాలవెల్లి సంగతేంటి ?? వ్రతకథా పుస్తకం ఎలా ?? బంతిపూల మాలలు దొరకవుగా మరి పూలు ఎలా?? ఇలా అది ఇది అని విసిగించేసా.....


ముందుగా పాలవెల్లి కోసం దగ్గరలో ఉన్న 'ఇండియన్ స్టోర్స్' అన్నీ తిరిగాం....అందరూ 'ఈసారి రాలేదండి' అనేవాళ్ళే..!! 'అయ్యో!!' అని ఉసూరుమంటూ వెను తిరిగి వచ్చేసాం...అసలు పాలవెల్లి లేకుండా వినాయకచవితి ఊహించుకోవడం ఎలా?? పాలవెల్లికి  పసుపు రాసి కుంకుమ పెట్టి గోడకి కట్టి దానికి ఆపిల్ కాయలు,దానిమ్మ కాయలు,వెలక్కాయలు,మొక్కజొన్నలు,అరటి పిలకలు,మామిడాకులు,బంతిపూల మాలలు,కలువ పువ్వులు వంటివన్నీ అలంకరణ చేస్తేనే కదా పండగ కళ వచ్చేది!! ఇక లాభం లేదని ఇంటికి వచ్చి గూగుల్ మీద పడి వెతకడం మొదలుపెట్టా....ఎక్కడా పాలవెల్లి జాడ కనిపించలేదు..... సరిగ్గా రేపు పండగ అనగా ఒక సైట్ లో 'పాలవెల్లి ని నేనే తయారు చేసుకున్నా!!' అని పోస్ట్ కనిపించింది. వెంటనే మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. 'అవును కదా మనమే చేసుకుంటే పోలే!!' అనుకుని చందూ కి చెప్పా!! సరే అని ఇద్దరం ముందు 'వాల్ మార్ట్' కి వెళ్లి కావాల్సిన చెక్కముక్కలు వెతికే పనిలో పడ్డం....దొరకలేదు....ఏంచేయాలో పాలుపోలేదు....సరే మిగితావి తీసుకుందాం  ఈ లోగా ఏదో ఒకటి ఆలోచన రాకపోదు అని బయలుదేరాం. 'క్రోగర్' లో పూల బొకేలు ఒక మూడు,అరటిపళ్ళు తీసుకున్నాం ...... 'నమస్తే' కి వెళ్లి కొబ్బరికాయలు తీసుకున్నాం.వచ్చేటపుడు వాళ్ళు మామిడాకులు, చెరకుగడ, తమలపాకులు,రెండు అరటిపళ్ళు ,ఇంకా ఏవో నాలుగు పళ్ళు ఇచ్చారు...'హమ్మయ్య !! అసలు మామిడాకులు లేకుండా పండుగ ఉహించుకోగలమా !!' అనుకుని ఇక మట్టి వినాయకుని వెదికే ప్రయత్నం మొదలుపెట్టాం. ఏ షాపులో చూసినా రంగులేసిన వినాయక విగ్రహాలే....నాకేమో స్వచ్చంగా,అచ్చంగా మట్టి తో చేసిన వినాయకుడే కావాలి....చివరికి ఒక షాపులో దొరికింది. భలే బుజ్జిగా ఉన్నాడు....చిన్న గొడుగు తో సింహాసనం మీద ఠీవి గా కూర్చున్న గణపతి :) ఈ షాపు లో కూడా పండగ సందర్భంగా మామిడాకులు ఇచ్చారు....


తమలపాకులు,వక్కలు,చందనం,చిన్న దీపపు ప్రమిదలు తీసుకుని ఇక పాలవెల్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. చెక్కలు కావాలంటే  'హోమ్ డిపో' కి వెళ్లి తెచ్చుకోవాల్సిందే అనుకుని అక్కడకి వెళ్ళాం....ఎలాగో అలా కష్టపడి మాకు కావాల్సిన విధంగా చిన్నగా ఉన్న చెక్కముక్కలు,వాటిని కోయడానికి పదునైన చాకు,మేకులు,పురికొస తీసుకుని ఇంటిదారి పట్టాం. ఇంటికి రాగానే పాలవెల్లి ని తయారు చేసే పనిలో చందూ మునిగిపోతే, రేపు వంటకి కావాల్సిన ఏర్పాట్లలో నేను ఉండిపోయా....చెక్కలని కష్టపడి కోసి,మేకులు కొట్టి,ఎలాగో అలా  చందూ గారి దయ వల్ల 'పాలవెల్లి' తయారయింది.....ముద్దుగా బొద్దుగా భలే ఉంది :) ఇక దాన్ని ఎలా వ్రేలాడదీయాలి అని డౌట్!! గోడకి పెద్ద మేకు కొడితే రంధ్రం ఏర్పడుతుంది....అది ఇష్టం లేదు....అలా కాకుండా ఇంత బరువైన పాలవెల్లి ని మోయడం  చిన్న మేకుల పని కాదు .'ఏం చేయాలా ??' అని ఆలోచిస్తుంటే....ఇంకో ఆలోచన వచ్చింది....వెంటనే మా సైడ్ టేబుల్ ని పూజామందిరం చేసేసా...కింద పైన రెండు  గ్లాసులు ఉన్న సైడ్ టేబుల్ అది. కింద గ్లాస్ మీద వినాయకుడిని పెట్టొచ్చు..పైన పాలవెల్లి పెట్టొచ్చు....కావాల్సిన పండ్లు వ్రేలాదదీయోచ్చు....అని అనుకున్నాం....హమ్మయ్య అప్పటికి మనసులు కుదుట పడ్డాయి....


మొత్తానికి చవితి రోజున పొద్దున్నే లేచి త్వర త్వరగా వంట కానిచ్చేసి ఇద్దరం పూజ ముందు కూర్చున్నాం.పాలవెల్లి ని పూల తో అలంకరించి,దానికి ఆపిల్స్,మొక్కజొన్నలు,పళ్ళు కట్టి ,దేవుడిని నానావిధ పుష్పాలతో అలంకరించి,పత్రి కోసం మామిడాకులు,దగ్గరలో ఉన్న కొన్ని చెట్ల ఆకులు తీసుకొచ్చి,లాప్ టాప్ లో వినాయక వ్రతం డౌన్లోడ్ చేసి, దానికి అనుగుణంగా పూజ చేయడం మొదలుపెట్టాం. ఈలోగా పండగ పూట అతిధి గా 'నాని' గారు వచ్చారు.....సావధానంగా,దివ్యంగా పూజ చేసుకుని, పులిహోర-పొంగలి-కుడుములు-ఉండ్రాళ్ళు-వడపప్పు-పానకం  తో పాటు మహానైవేద్యం పెట్టి కథాశ్రవణం  చేసి అక్షతలు వేసుకుని పూజ ముగించాం.తరువాత తీర్ధప్రసాదాలు స్వీకరించి నాని గారికి కూడా అందించాం.'ఇండియా ని గుర్తు చేసారండి ఒక్కసారి' అన్నారు నాని గారు.....చాలా సంతోషమేసింది :)


ఆనక నాని గారితో భోజనం చేశాం.....ఆ రోజు రాత్రికి అతిధులు గా కృష్ణ-ప్రసన్న,ఇంకో కృష్ణ వచ్చారు......మా మందిరం,పాలవెల్లి చూసి ముచ్చట పడ్డారు వారు కూడా.....వారికి తీర్థప్రసాదాలు అందించాం.....ఇక రాత్రి ఎలాగైనా చంద్రున్ని చూడకూడదు అని కిటికీ బ్లైండ్స్ అన్నీ వేసేసి దుప్పటి కప్పేసుకుని నిద్రపోయా :D




అలా పరాయి దేశం లో కూడా చక్కగా వినాయకచవితి జరుపుకున్నందుకు  చాలా సంతోషంగా ఉంది :)

24 కామెంట్‌లు:

kiran చెప్పారు...

nijangaa baa chesaree

కొత్త పాళీ చెప్పారు...

చాలా బావుందండీ, మీరు కోరుకున్నట్టు అన్నీ అమర్చుకుని చకగా పూజ చేసుకున్నారు. పాలవెల్లికి దన్నుగా సైడ్ టేబుల్ ని ఉపయోగించడం బ్రిలియంట్.

విరజాజి చెప్పారు...

మనసుంటే మార్గం ఉంటుంది! మీకు సంతృప్తి కలిగేలా అన్నీ ఆ వినాయకుడు అనుగ్రహించాడు! మీ సైడ్ టేబుల్ ఆలోచన మటుకు బ్రహ్మాండం. మీ పాలవెల్లి కూడా సూపర్! మొత్తానికి పరాయి దేశం లో కూడా మన పధ్ధతిని వదలకుండా చక్కగా పండుగ చేసుకున్నారు - శుభం! ఆ విఘ్నరాజు మీకు సకల శుభాలూ అందించు గాక!

రాధిక(నాని ) చెప్పారు...

చాలా బాగున్నాయండి మీ వినాయకచవితి ఏర్పాట్లు,పూజ చిత్రాలు.విదేశం లో ఉన్నా సంప్రదాయబద్దం గా బాగా చేసుకున్నారు.మరి ఊరి వినాయకుడిని కుడా చుడండి.

వాజసనేయ చెప్పారు...

ఇందు గారికి,

భారత దేశం లో ఉంటూ ఇంటిపక్క అన్ని దొరుకుతున్నా బద్దకంతో పూజలు పునస్కారాలు ఇవన్ని చాదస్తం అని పక్కకి పెడుతున్న ఈ రోజులలో పరాయి దేశంలో ఉంటూ మీరు సంభారాల సమీకరణకి పడిన శ్రమ ,పూజ పట్ల మీ నిబద్దత ఆ వినాయకునికి చాలాబాగా నచ్చి ఉంటుంది, అన్ని బాగున్నై కాని మాకు ప్రసాదం పెట్టరా, కొత్తపాళిగారు ప్రసాదం ఇవ్వలేదు.ఇలా ఐతే మా లాంటి ప్రసాదం భక్తుల సంగతి ఏంటండి.

ఇందు చెప్పారు...

@kiran: థ్యాంక్స్ అండీ కిరణ్ గారు...
@కొత్త పాళీ:థ్యాంక్స్ అండీ కొత్త పాలీ గారు :)
@విరజాజి:చాలా థ్యాంక్స్ అండీ....మీ దీవెనలు ఫలించుగాక !! :)
@రాధిక(నాని ) :థ్యాంక్స్ అండీ రాధిక గారు....అలాగే ...
@వాజసనేయ:నిజమేనండీ...చాలా మందికి పండుగ అని గుర్తుకూడా లేదు....అలా అయిపొయింది మన సాంప్రదాయాల పరిస్తితి.... :( ఇక ప్రసాదం విషయానికి వస్తే...ఇప్పటికే వారం అయిపొయింది కదండీ..ఈసారికి ఇలా కానిచ్చెయండీ...వచ్చె సారి తప్పకుండా పెడతా :)

snellens చెప్పారు...

ఛాలా బాగున్నడు మీ గణేషుడు...మాకు మామిడి ఆకు దొరకలేదు. కాక పోతే మిగతా అన్ని తెచ్చాము. పాలవెల్లి మా ఇంట్లో ఎప్పుడు పెట్టరు.సో మేము అంత కష్ట పడలేదు. ప్రతి ఏడు మీరు ఇలాగే జరుపు కోవాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాం

ఇందు చెప్పారు...

@snellens : థ్యాంక్స్ అండీ... :)

భాను చెప్పారు...

పరాయి దేశంలో ఉంది కూడా, చాల చక్కగా వినాయక చవితి జరుపుకొన్నందుకు అభినందనలు.మనసుంటే మార్గముంటుంది అంటారు అందుకే.

రాధిక(నాని ) చెప్పారు...

ఇందు గారు మీ వినాయకచవితి టపా ఆంధ్రజ్యోతి నవ్యలో పడిందండోయ్ పేపర్ చూసుకోండి .శుభాకాంక్షలండి

జ్యోతి చెప్పారు...

మనసుంటే మార్గముండదా? పండగ చాలా బాగా జరుపుకున్నారు. ఇక్కడ అన్నీ దొరికినా కూడా ఒళ్లొంగని ప్రబుద్దులు చాలామంది ఉన్నారు.

ఇందు చెప్పారు...

@రాధిక(నాని ):చాల థ్యాంక్స్ అండీ....మీ వల్లె నాకు ఈ విషయం తెలిసింది....నాకు చాల సంతొషంగా ఉంది...
@జ్యోతి:థ్యాంక్స్ అండీ జ్యొతి గారు...

HarryKris చెప్పారు...

Guntur Ammai. Chakkati Guntur Telugu. Chaalaa Chaala Baagundi andi mee blog. Keep it up.

http://harifinance.blogspot.com/

PhaniRamesh చెప్పారు...

Desaalu marina, mana sampradayanni gouravistu, baavitharalaku meeru adharsanga nilavalani korukuntu..., dhanyavadhaalu....

Unknown చెప్పారు...

baagunnayandi mee vinayaka chaviti erpaatlu,pooja karyakramaalu.mee palavelli super ga undi. mee side table ni pettalane alochana kooda wonderful. meeku aa vinayakudu sakala subhamulu andinchalani korukuntunna.

సవ్వడి చెప్పారు...

baagundi....

chaitu చెప్పారు...

chala bagundi Indu...great

అజ్ఞాత చెప్పారు...

Great blog

swetha చెప్పారు...

superb indu.especially ur palavelli. read ur post in e-paper too. gr8 work.

ఇందు చెప్పారు...

@HarryKris:హ్యారి గారు..ధన్యవాదాలండీ....
@PhaniRamesh:ఫణి రమేష్ గారు మరీ మునగ చెట్టు ఎక్కించేసారు...ధన్యవాదాలు :)
@sahiti:సాహితి..చాలా చాలా థ్యాంక్స్
@సవ్వడి:థ్యాంక్యూ...!!
@chaitu:థ్యాంక్యూ...చైతు..
@Chaitanya:థ్యాంక్యూ...చైతన్యా..
@swetha :థ్యాంక్యూ...స్వేతా..

జయ చెప్పారు...

మీ వినాయకుడు, పాలవెల్లి చాలా బాగున్నాయి. కాని పక్కన లాప్టాప్ ఎందుకబ్బా!!!

కొత్త పాళీ చెప్పారు...

"పక్కన లాప్టాప్ ఎందుకబ్బా!!!"

చదువుకునేప్పుడు వినాయకుడి ముందు పుస్తకాలు పెడతాం, చదువు బాగా రావాలని. తన బ్లాగు దినదినప్రవర్ధమానంగా ఎదగాలని ఇందు గారు లాఫ్ టాప్ పెట్టారేమో!

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగా రాసారు.

ఇందు చెప్పారు...

@జయ:జయగారు ధన్యవాదాలు...అది చందు పూజ మొదలు పెట్టే ముందు నేను తీసిన ఫొటో...మీరు నా టపా మొత్తం చదివి ఉంటే అర్ధం అయ్యేది."లాప్ టాప్ లో వినాయక వ్రతం డౌన్లోడ్ చేసి, దానికి అనుగుణంగా పూజ చేయడం మొదలుపెట్టాం." అని వ్రాసాను.బహుశా మీరు పొరబాటున అని చదివి ఉండకపోవచ్చు. అది లాప్ టాప్ వెనుక ఉన్న కథ. :)
@కొత్త పాళీ :సందేహం తీరిందా అండీ?? :)
@priyamayina:ధన్యవాదాలు అండీ...