25, మే 2011, బుధవారం

సైకిల్ పోయి కారు వచ్చే డింగ్!డింగ్!డింగ్!

మొన్న కావ్య 'కార్' పోస్ట్ చూసాక.....'ఛస్! నేను పోస్ట్ రాద్దామనుకునేలోగా ఈ అమ్మాయ్ రాసెస్తుంది' అని  కావ్యాని రెండు తిట్లు తిట్టేసుకుని ;) 'ఆ అయినా లైట్ లే' అని ఈ పోస్ట్ రాస్తున్న!! 

నా సైకిల్ ప్రేమ మీ అందరికి తెలిసిందే! :) [ఇదేమి ఆ పోస్ట్ కి పార్ట్-౨ కాదు....కంగారు వలదు ]చిన్నప్పుడు నాకు సైకిల్ తొక్కడం అంటే ఎంత ఇష్టమో.....అంత భయం కూడా! ఏదో మా ఫ్రెండ్ సాయిలక్ష్మి దయవల్ల కిందా,మీదా పడి ఎలాగోలా సైకిల్ నేర్చేసుకుని జింగ్ జింగ్ అని తోక్కేసేదాన్ని! రెండు,మూడు సార్లు కిందపడి మోకాలు చిప్పలు పగిలినా....ఎబ్బే....సైకిల్ మీద లవ్వు మాత్రం తగ్గలేదు :))

కాని మా నాన్న ఇంటర్లో నాకు స్కూటి కొన్నాక..... మళ్లీ మనకి భయం స్టార్ట్! 'అమ్మో! సైకిల్ అంటే మనం బ్రేక్ వేస్తె ఆగుతుంది....కనీసం పెడల్ తోక్కక పోయినా ఆగుతుంది....ఇది ఆక్సేలేరేటార్ డవున్ చేయాలి....బ్రేక్ వేయాలి.... పెట్రోల్ ఉందొ,లేదో చూసుకోవాలి....అసలు ముందు బండి స్టార్ట్ చేయాలి....ఆపితే స్టాండ్ వేయాలి  అమ్మో...వామ్మో ' అని భయపడ్డా! కానీ ఈసారి మా నాన్న అష్టకష్టాలు పడి ఎలాగోలా నేర్పించారు! ఇక దాన్నివేసుకుని  ఝాం అంటూ దూసుకుపోయేదాన్ని[కాని మనకి డబల్స్ రాదు......'U  ' టర్న్ రాదు :( మరి ఇంకేం వచ్చమ్మా అని అలా కొషన్ మార్కు మొహం పెడితే నేనేమి చెప్పలేను బాబోయ్! ]

నా స్కూటి విన్యాసాలు చూసి.....మా నాన్నకి నా మీద బోలెడు నమ్మకం కలిగి రోజు తనే డ్రాప్ చేసేవాళ్ళు కాలేజి దగ్గర! హతవిధీ! దీన్నే 'అతి జాగ్రత్త' అని నేను అంటాను.....కాని నా 'కనీస జాగ్రత్త' అని మా నాన్న అంటారనుకోండి!!  అలా స్కూటి మీద నా చెయ్యి పడనివ్వకుండా చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా.... మా నాన్న మాగన్నుగా ఉన్నప్పుడు చూసి.....దాన్ని ఎలాగోలా బైటికి తీసి....ఊరంతా తిరిగి జాతర,జాతర చేసేదాన్ని :)) 

సరే! స్కూటి రోజులు అయిపోయాయి! హైదరాబాదులో రైళ్ళ విన్యాసాలు కూడా అయిపోయాయి!! ఇక పెళ్లయింది! కొద్దిరోజులు బెంగుళూరులో బస్సు విన్యాసాలు.....ఆనక విమాన విన్యాసాలు చేసి ఇదిగో ఈ దేశం వచ్చి పడ్డానా..... ఇక్కడన్ని కార్లే! హుహ్! తుమ్మలన్నా....దగ్గాలన్నా కార్ ఉండాల్సిందే అన్నట్టు ఉంటుంది ఇక్కడి పరిస్థితి! మనకా కారులో క్లచ్ అంటే ఏంటి.....గేర్ అంటే ఏంటి....ఏమి తెలియవు! దీనికి తోడూ మా చందు గారు నన్ను ఒక అమెరికన్ మాష్టారు దగ్గరకి కారు నేర్చుకోడానికి పంపిస్తా అన్నాడు! నేను కేవ్వ్వ్!! మనకి మామూలుగా అచ్చ తెలుగులో చెబితేనే త్వరగా బుర్రకి ఎక్కదు.....అసలేమి తెలీని కార్ గురించి ఇక అతని దగ్గర నేర్చుకుంటే............హ్హహ్హ! అయినట్టే!! అందుకే నేనో బంపర్ ప్లాన్ వేసా! దాన్ని  సూపర్గా అమలు చేశా ;)

అదేమిటంటే....మొన్న ఇండియా వెళ్ళినప్పుడు కార్ నేర్చేసుకుందామని బాగా డిసైడ్ అయ్యా! అలాగే....ఇండియా వెళ్ళిన వారానికే అనుకున్న పని మొదలు పెట్టా! మా నాన్నకి తెలిసిన అతను డ్రైవింగ్ స్కూల్ పెట్టాడుట! రోజు ఇంటి దగ్గరకొచ్చి పికప్ చేసుకుని డ్రైవింగ్ నేర్పించి మళ్లీ డ్రాప్ అన్నమాట! నాకూడా వెనక సీట్లో మా అమ్మ :) 


ముందురోజు ఒకడోచ్చాడు.....నేను బైటికి వచ్చీ రాగానే.....డ్రైవింగ్ సీట్లో నన్ను కూర్చోబెట్టేసాడు! ఇక పోనివ్వమన్నాడు! నేను పిచ్చి చూపులు చూస్తె.....ఇంజిన్ ఎలా ఆన్ చేయాలి....చెప్పాడు....చేశా....తరువాత క్లచ్ నోక్కమన్నాడు....అక్సేలేరేటార్ రైజ్ చేయమన్నాడు.....ఆ గేరు...ఈ గేరు అన్నాడు.....ఏదేదో కంగారుగా చేసేసా! మా ఇంటినించి....మా పక్కింటి దాకా కారు తోలా!! ఇవాల్టికి ఇక చాల్లే అన్నాడు! నాకేమో బోలెడు డౌట్లు మిగిలిపోయాయి! అడిగితె.....నెక్స్ట్ క్లాస్ అన్నాడు! సర్లే అని ఊరుకున్నా! దీనికి తోడూ..........రోజు నోట్స్ రాయాలి! మర్నాడు పొద్దున్న...........దాన్ని ఆ మాష్టారు కరెక్షన్ చేస్తాడట ;) 

నెక్స్ట్ క్లాస్లో ఒక మిడిగుడ్ల+బట్టతలా మాష్టారు వచ్చాడు......... కార్ స్టార్ట్ చేయగానే  గేరు మార్చమన్నాడు..... 'ఫోర్త్' గేర్ వేయమన్నాడు.... అదన్నాడు....ఇదన్నాడు.....నాకేమో ఏమి తెలీదు! 'ఇవాళ మనం ఆరు కిలోమీటర్లు వెళతాం! జాగ్రత్తగా డ్రైవ్ చెయ్ అన్నాడు' నా పై ప్రాణాలు పైనే పోయాయి! మా అమ్మ భయంభయంగా చూసింది నా వైపు!! సరే! 'ధైర్యే సాహసే!' అని మొదలు పెట్టా!! ఇక చూస్కోండి......అతనేమీ చెప్పడు! కనీసం చూడడు! ఎటో చూస్తూ ఉంటాడు.... నాకేమో ఏమి రాదు! ముందు రోజు అడిగితె వాడు ఏమి చెప్పలేదు....ఈ రోజు వీడు వచ్చి ఏదో నేను 'షుమేకర్' అన్నట్టు కారు ఫోర్త్ గేర్లో పోనివ్వమంటాడు........ఈ గోల ఏంట్రా దేవుడా! అని నాలోనేనే ఏడుస్తూ ఏదో కారు  పోనిచ్చా! ఇక గేర్లు మార్చేటప్పుడు క్లచ్ తో పడ్డాను ఇబ్బంది..........'ఎహే! ఈ క్లచ్ ఎవడు కనిపెట్టాడ్రా బాబూ....' అని అనిపించింది. ఆ రోజు ఇంటికొచ్చాక చాల సేపటికి కాని నాకు దడ తగ్గలేదు! డ్రైవింగ్ కి ఒక దండం అని చెప్పేసా! 

ఇక మరుసటి రోజు మాష్టారు చేంజ్! వాడిని ఫైర్ చేసేసారు డాడీ ;) వేరేవాడు వచ్చాడు :) ఇతనికి స్టోరి అంతా చెబితే.....మళ్లీ ఓపిగ్గా మొదటినించి చెప్పుకొచ్చాడు! క్లచ్,గేర్,బ్రేక్,ఆక్సేలేరేటార్......ఎప్పుడు ఏది వెయ్యాలి.....ఎందుకు వెయ్యాలి.....వాటి ఉపయోగం ఏంటి.....అన్ని చక్కగా నేర్పించాడు! రెండో రోజుకే నాకు బాగా ధైర్యం వచ్చేసింది :) ఇక మళ్లీ స్కూటి పోనిచ్చినట్టే రయ్యి.....రయ్యి అని కారు పోనిచ్చా! ముందు కొంచెం తడబడ్డా....బానే వచ్చేసింది! 

రివర్స్ చేయడం,'U' టర్న్ చేయడం.......గేర్లు మార్చడం..........చిన్నచిన్న సందుల్లో చాకచక్యంగా నడపడం..........బాగా ట్రాఫిక్లో నడపడం........అన్ని బాగా నేర్పించాడు.....రోజు దీనిమీద నోట్స్ రాసేదాని! పిచ్చ కామెడి గా ఉండేది! ఈ నోట్స్ రాయడం ఏంటి? అని.కాని ఏం చేస్తాం! అలా...అలా....కారుని అలవోకగా నడిపే రేంజ్కి వచ్చేసా! ఇక గుంటూరునించి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు.....సాగర్ రోడ్డులో......కలాం దగ్గర నించి స్టీరింగ్ లాక్కుని......నేనే డ్రైవ్ చేశా! కొద్ది చోట్ల స్పీడింగ్ కూడా చేశాగా! ;) 
  

ఇక డ్రైవ్ టెస్ట్ ఇచ్చే రోజు.........కారు కాస్త ముందుకి,కొంచెం రివర్స్లో వెనక్కి నడిపి....తరువాత బ్రేక్ ఇన్స్పెక్టర్ అడిగిన పిచ్చి ప్రశ్నలకి భలే భలే జవాబులు చెప్పి...........ఎలాగోలా కార్ లైసెన్స్ తెచ్చేసుకున్నా! :) 

అదండీ ఇండియాలో నా డ్రైవింగ్ కష్టాలు! ఇక మళ్లీ ఇక్కడ కొంచెం నేర్చుకుని ఇక్కడా లైసెన్స్ తెచ్చుకుని.............నా ఫేవరేట్ మస్టాంగ్ వేసుకుని ఝాం అంటూ దూసుకుపోతుంటే............ఆహా! ఆ ఊహే ఎంత బాగుందో! నా ఫ్యూచర్ కార్కి 'హలో కిట్టి'  కీచేయిన్ కూడా కొన్నాగా! బాగుందా.....నా కార్ కీ చెయిన్!? 

సరే మరి...........అర్జెంట్ గా అందరూ......నాకు అమెరికాలో తొందరగా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేయాలని......నేను రెడ్ మస్టాంగ్ కారు జింగ్ జింగ్ అని నడిపెయ్యాలని  ప్రార్ధనలు గట్రా చేసెయ్యండి!! సరేనా.....

24 కామెంట్‌లు:

స్నిగ్ధ చెప్పారు...

ఇందూ,ఈ స్టొరిలో ప్లేసులు తప్ప మిగతా అంతా సేం టు సేం..నేను కూడా అష్ట కష్టాలు పడి డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్ టెస్ట్ రోజు దేవుళ్ళకి మొక్కేసుకుని డ్రైవింగ్ టెస్ట్ అటెండ్ అయ్యొచ్చా..మొత్తానికి లైసెన్స్ తెచ్చేసుకున్నాను...ఇంకో రౌండ్ నేర్చుకుందామని అనుకుంటున్నాను..ఎందుకంటే కొంచెం అతి జాగ్రత్త... త్వరలోనే అమెరికా లొ నీకు డ్రైవింగ్ లైసెన్స్ ప్రాప్తిరస్తు...జయీభవ!! నీ కార్ కీచైన్ బాగుందమ్మాయి...
:)

రాజ్ కుమార్ చెప్పారు...

హహ్హాహా... మొత్తానికి అలా నేర్చుకున్నారన్న మాట.
కానీ వీటన్నిటికన్నా సైకిల్ నేర్చుకోవటమే కష్టం కదండీ..
తొందరలోనే మీకు లైసెన్స్ వచ్చేయుగాక..;)
నైస్ పోస్ట్ అండీ.. ;)
మరిచిపోయా.. మీ కిట్టీ కీచెయిన్ కేకా.. :D

..nagarjuna.. చెప్పారు...

>>అర్జెంట్ గా అందరూ......నాకు అమెరికాలో తొందరగా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేయాలని......నేను రెడ్ మస్టాంగ్ కారు జింగ్ జింగ్ అని నడిపెయ్యాలని ప్రార్ధనలు గట్రా చేసెయ్యండి!! సరేనా.....

ఒకే! చేస్తాం ఐతే మాకేంటి...... అహా మాకేంటీఈ అంట :)

SHANKAR.S చెప్పారు...

టీవీల్లో ఊదరగొట్టేస్తున్న టిడిపి, టిఆర్ఎస్ కార్యకర్తల గొడవ చూసి చిరాకేసి బ్లాగుల్లోకొస్తే సడెన్ గా మీ పార్టీ గుర్తుల హెడింగ్ చూసి ఏంటబ్బా ఇందుగారు రాజకీయాల మీద పడ్డారు అనుకుని చూశా. ఇదా సంగతి!! :) . అన్నట్టు మీ కారు నేర్చుకునే నోట్సు ప్రజలకోసం ఎప్పుడు పబ్లిష్ చేస్తున్నారు?

హరే కృష్ణ చెప్పారు...

అద్దీ నాగార్జునా అలా అడుగు
మొన్న నాకు జరిగిన ప్రతీకారం తీర్చేసుకోవాలి అంతే :)
ఇందు గారు
ఏమిటిది ఒక నిండు డ్రైవర్ కి ఉద్యోగం పోయి మీకు కారు డ్రైవింగ్ వచ్చే డింగ్ డింగ్ డింగ్ అని అడిగేయ్ నాగార్జునా :)
schumi గురించి ప్రస్తావించి ఫెరారీ గురించి రాయరా..ఇది దారుణం అన్యాయం


అందుకే .నాకు అమెరికాలో తొందరగా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేయాలని.....కోరుకుంటున్నాం
ప్రార్ధనలు చేయడానికి ఖర్చవుతుంది కాసేపట్లో విడుదల చేస్తాం

చివరగా పోస్ట్ బావుంది..Ferrari/Mustang ఫోటో ఏది ఏది ఏది ?

కృష్ణప్రియ చెప్పారు...

:) తప్పక ప్రార్థనలు చేస్తాం ఇందూ..

మంచు చెప్పారు...

ఇంకొ రెండు మూడూ సంవత్సరాల వరకూ నీకు డ్రైవింగ్ లైసెన్స్ లభించే అదృస్టం లేదు. మస్టాంగ్ కన్నా కీ చైన్ బాగుంది. :-)

Ennela చెప్పారు...

"అలా...అలా....కారుని అలవోకగా నడిపే రేంజ్కి వచ్చేసా! " good good, naaku nerpinchavaa?

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

>> నా ఫ్యూచర్ కార్కి 'హలో కిట్టి' కీచేయిన్ కూడా కొన్నాగా!
ఎంత ముందు జాగ్రత్త మీది. అదేదో సినిమాలో బ్రహ్మానందం లాగా తలుపులకి, టైర్లకి, ఇంజనుకి etc. కూడా చైన్లు వాటికి తాళాలు, వాటికి కీ చైన్లు కూడా కోనెయ్యండి కారు వచ్చేలోపుల. :):)

ఇవన్నీ కొన్న వెంటనే డ్రైవింగ్ లైసెన్సు ప్రాప్తిరస్తు.

kiran చెప్పారు...

ఇందు నీకు చాలా knowledge ఉంది ఇందు...break లు gear లు అన్ని తెల్సు..మనకు బెబ్బే..
ఇప్పుడే గుడికి వెళ్తున్న...నీకు liscence రావాలి అని.. :) :)
నీ key chain నాకు ఇచేయవ్వా??

మనసు పలికే చెప్పారు...

ఇందూ.. సైకిలు నుండి కారు కి ఎదిగిన చందానే విమానం కూడా నడిపెయ్యాలని కోరేసుకుంటున్నాను ;);) దానికి లైసెన్స్ కూడా వచ్చెయ్యాలని కూడా కోరేసుకుంటున్నాను;)

ఓకే. ఓకే. ఇప్పుడు సీరియస్ :) బులుసు గారి మాటే నాదీనూ..:)

స్నిగ్ధ చెప్పారు...

ఐతే నాదెనా మొదటి కామెంట్...హుర్రే.....సూపర్...
అవును కరెక్టే ,మీకోసం ప్రార్థనలు చేయాలంటే మాకేంటంట..నేనూ హరే,చారిగారి పార్టినే...
:)

శశి కళ చెప్పారు...

are..are....are...meerintha super gaa drive chesthaamani cheppinaaka yela prardinchagalam cheppandi.....
mee debba ku america adhiripoyi mee daggaraku ade raavaali gaani...sasi

ramki చెప్పారు...

lift please......... :P

రత్న మాల చెప్పారు...

హాయ్ ఇందు ఎలాగైతే ఏంటి డ్రైవింగ్ వచ్చేసింది కదా 'హలో కిట్టి' కీచేయిన్ చాలా భాగుంది

Rams చెప్పారు...

Hello indu garu
mee posts baga taggipoyani(May 2 April -1)...Koodali meda aliginara, maalika pi kopam vachinda....
mee manchi swachamina marinni tapalokasam eduruchusthu
o telugu abimani
Krishna

సుజాత వేల్పూరి చెప్పారు...

డియర్ ఇందూ, నీ కీ చైను అలా అలా ఊపుకుంటూ పార్కింగ్ లోకి వెళ్ళి ఇలా కారు బయటికి తీసి జూమ్ అని దుమ్ము రేపుతూ(అక్కడ దుమ్ముండదనుకో, ఏదో ఫ్లో కోసం వాడాను)రోడ్డు మీద నీ కారు పరుగులు తీసే రోజు రావాలని ఆశిసితున్నా!

డ్రైవింగ్ కష్టాలు దాదాపుగా అందరివీ ఒకటే! ఇక్కడో సారి చూడు టైమున్నపుడు

http://manishi-manasulomaata.blogspot.com/2008/04/blog-post_30.html

ఇందు చెప్పారు...

@snigdha :థాంక్యూ స్నిగ్ధ :) హ్హహ్హా! అతి జాగ్రత్తా!!? మీరు భలె వారే...మళ్ళి నేర్చుకుంటున్నరా? ఎంత ఓపికో! :))

@వేణూరాం :థాంక్యూ రాజ్! సైకిల్ ఎందుకు కష్టం రాజ్! బేలెన్సింగ్ నేర్చుకుంటే సరి! అంతే కదా! :)

@..nagarjuna..:నాగార్జున గారూ...మీకు అమెరికా వస్తే..లిఫ్ట్ ఇస్తా ;)

ఇందు చెప్పారు...

@ SHANKAR.S:హ్హహ్హహ్హా! భలె సెట్ అయ్యిందే! నేను రాజకీయాలా? దూరం అని కాదుగానీ....ఎందుకో ఈమధ్య బాగా చిరాకేసేస్తోంది! ఏంచేస్తాం చెప్పండీ! నా నోట్సా? ;) మీరు మరీను!

@ హరే కృష్ణ :మీ ప్రతీకారపు వాసనలు ఇక్కడా పోనిచ్చుకోలేదు ప్రతీక్ గారు ;) ఫెర్రారీఅ? నాకంత లేదండీ...మస్టాంగ్ అక్కడ పిక్స్లో ఉన్న రెడ్ కార్ అదే!

@ కృష్ణప్రియ :థాంక్యూ కృష్ణ :)

ఇందు చెప్పారు...

@ మంచు:మంచుగారూ...ఎందుకండీ నామీద అంత కక్ష! నాకు లైసెన్స్ రాదు అన్నమాటేగాని ఒక్కసారి వస్తుంది అన్నారా? బాబోయ్! నాకుగాని లైసెన్సె రాకపోవాలి మిమ్మల్ని బాగా తిట్టేసుకుంటా! :XX

@Ennela :ఎన్నెలగారు...రెండు నెలలు ఆగండీ...నేనే కారు నడుపుకుంటూ కెనడా వచ్చెసి మిమ్మల్ని బాగ తిప్పుతా :) యా! తప్పకుండా నేర్పిస్తా! మీరు అడగాలా? :)

@ బులుసు సుబ్రహ్మణ్యం :బులుసుగారు...అది తిట్టా?పొగడ్తా? పొగడ్తే అని నేను అనుకుంటున్నా ;) అవన్ని కొనేముందే లైసెన్స్ ప్రాప్తిరస్తు అని దీవించేయొచ్చుగా గురువుగారు :)

ఇందు చెప్పారు...

@ kiran:ఫ్రెండ్ అంటే నువ్వే కిరణ్! నాకోసం గుడికి కూడా వెళ్ళావా! థాంక్స్...థాంక్స్! నీకు కిట్టిగాడు కావాలా! ఐతే వాకే! నీకోసం త్యాగం చేస్తా కిరణ్! త్యాగం చేస్తా! :)

@మనసు పలికే :కామెడీగా అన్నదే బాగుందేమో అప్పూ! విమానం నడిపే రేంజ్ వస్తే...ఆహా..కెవ్వ్వుకేక! :) నీది బులుసుగారి మాటేనా? గురువుకి తగ్గ శిష్యురాలివి కదా!

@snigdha: అవును స్నిగ్ధగారు...థాంక్యూ సోమచ్!

ఇందు చెప్పారు...

@it is sasi world let us share: హ్హహ్హహ్హా! థాంక్స్...థాంక్స్...

@RAMAKRISHNA VENTRAPRAGADA said...: Sure :) మీకు మా రుబీబేబిలో లిఫ్ట్ కావాలా? మస్టాంగ్లో లిఫ్ట్ కావాలా? :))

@ రత్న మాల:హాయ్ రత్నమాలా....థాంక్యూ సోమచ్! :)

ఇందు చెప్పారు...

@Rams:రాముగారు...మీ అభిమానానికి చాలా సంతోషమేసింది! ఇంతబాగా గుర్తుపెట్టుకుని మరీ అడిగారు చూడండీ...సో నైస్ ఆఫ్ యు!

నేను ఇండియా వెళ్ళానండీ...రెండు నెలలు! అస్సలు వీలు పడలేదు నెట్ పెట్టి బ్లాగ్ తెరవడానికి! ఇక్కడంటే కొంచెం లీజర్ టైం ఉంటుంది...అక్కడ ఇంట్లో ఊపిరిసలపని పని! ఇక బ్లాగ్ ఏం రాయను? ఇకనించి రెగ్యులర్గా పోస్ట్లు వేస్తాలేండీ :) థాంక్యూ ఒన్స్ ఎగైన్! :)


@సుజాత :హ్హహ్హహ్హ! సుజాతగారూ...థాంక్యూ! మీరు అన్నట్టే ఆ రోజుకోసం ఎదురుచూస్తా! :)

చందు చెప్పారు...

లైసెన్స్ తెప్పిస్తాము కానీ ...
మస్టాంగ్ వస్తే
మస్ట్ అండ్ షుడ్ గా మమ్మల్ని మీ వూరికొస్తే మస్టాంగ్ లో తిప్పుతారా?