హబ్బ! ఎలాగైతేనేం.....నా మొదటి వరలక్ష్మి వ్రతం పూర్తి చేసుకున్నాను [క్రితం సంవత్సరం కుదరలేదులెండి]
అసలు మూడు రోజులనించి ఒకటే హైరానా! సరే...వ్రతం చేసుకుంటాను..... మరి వాయనాలు? ఎవరికి ఇవ్వాలి? ఎక్కడికెళ్ళి ఇవ్వాలి? ఇలా బోలెడు డౌట్లు బుర్రని వడ్రంగి పిట్టలా పోడిచేస్తున్నాయ్ [పోలిక బాగుందా? నేనే కనిపెట్టా ;) ]
అసలే కొత్త అపార్ట్మెంట్లోకి దిగాం.దీనికి తోడు....మా ఎదురు, పైన,పక్కన అందరూ నిశివర్ణ పరాక్రములే! మనకేందుకులేమ్మని కిమ్మనకుండా ఉంటున్నాం. ఇప్పుడు వాయనం అనుకుంటూ వెళితే ఇంకేమన్నా ఉందా?

ఈ దిగులుతోనే ఎలాగో అలా పూజసామాగ్రి తెచ్చుకున్నాను. షాపువాడిని 'నల్ల శనగలు' ఉన్నాయా అని అడిగితే.....'గ్రీన్/ఎల్లో' ఉన్నాయ్ అని చెప్పాడు. హతవిధీ అనుకుని ఆ 'ఎల్లో' శనగలే తెచ్చుకుని ముందు రోజు రాత్రి ననబోసా. ఇంతలోకే మా చందూ కొలీగ్ వైఫ్ వ్రతం రోజున పేరంటానికి పిలిచారు. తెలుగువారే! ఇక ఇదే చాన్స్ అనుకుని వారిని అదే రోజున మా ఇంటికి భోజనానికి పిలిచా! పనిలోపని వాయనం ఇవ్వొచ్చు కదా అని ఆశతో. ముందు మొహమాటపడ్డా తర్వాత వస్తామన్నారు ఇంటిల్లిపాది. అప్పుడు నాక్కొంచెం మనసు కుదుటపడింది.
ఇక మరుసటిరోజు ఐదింటికి అలారం పెట్టా! యధావిధిగా ఆరింటికి లేచా![అలా చూస్తారేం? చాలా తొందరగా లేచా కదా!] లేస్తూనే పనిలోపని చందుని లేపేసా!
'నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే......నేను పొద్దునే లేవటం ఎందుకు ఇందు?' అంటే......
'ఆహా! మరి వంటకి సాయం ఎవరు చేస్తారుట?' పూజకి ముందే ప్రసాదాలు చేయాలి కదా! అసలే తొమ్మిది రకాలు చేయాలనీ డిసైడేడ్' అని చెప్పా!
మా చందూ గుండెలో రాయి పడింది. అయినా ఆ చేదు నిజాన్ని దిగమ్రింగి....నేను తీసుకున్న వయోలేంట్ డెసిషన్ కి తన సహాయసహకారాలు పూర్తిగా అందించాడు :) [ఎంత మంచాబ్బాయో కదా!]
ఇద్దరం లేచి...తల స్నానం చేసి ప్రసాదాలు వండటం ప్రారంభించాం.ముందుగా నేనైతే.... ఎంచక్కా మడిచీర కట్టుకుని..... కాళ్ళకి పసుపు రాసుకుని..... నాకు ఇష్టమైన ఆహార్యంలో.... నాకు చాలా ఇష్టమైన తులసి కుండికి [ఇక్కడ కోటలు,మేడలు కట్టలేములెండి] దణ్ణం పెట్టి పువ్వులు పెట్టి.....దాని ముందు ముగ్గులేసి పసుపు,కుంకుమ చల్లి దణ్ణం పెట్టొచ్చా! :) అలాగే ఇంటిముందు ముగ్గేసి వచ్చా! [అబ్బ! నా కోరిక తీరింది]
ఇక ఇందుగారు వంటగదిలోకి రంగప్రవేశం చేసారు. చకచకా పచ్చి చలివిడి చేసేసారు. వెనువెంటనే అప్పాలు చేసేసి ఎర్రగా వేయించేశారు. ఇంతలో చందుగారేమో పులిహోర కలిపేసి, పరమాన్నం చేయడంలో మునిగిపోయారు. అంతలోనే ఇందుగారు టకటకా టమాటా పప్పు చేసి,చకచకా చిక్కుడు కూర చేసి, ఇక రసం పెట్టే పనిలో మునిగిపోయారు. ఈలోగా చందుగారు చేసిన పులిహోర,పరమాన్నం రెడీ అయిపోయాయి. అంతలోనే కొబ్బరి+మామిడి కలిపి పచ్చడి చేసేసారు ఇందుగారు.
సరే కదా అని కాస్త నుదురుకి పట్టిన చెమట తుడుచుకుంటూ టైం చూద్దుము కదా! ఎనిమిదిన్నర!!!!!! చందూ గారు 'కేవ్వవ్వ్వ్వ్' అని ఒక కేక పెట్టి తొమ్మిదింటికి మీటింగ్ ఉంది అని పరిగెత్తారు. నేను 'హిహిహి' అని నవ్వుకుని ఆ ప్రసాదాలన్ని ప్లేట్ల్స్లో ఎంచక్కా సర్దుకుని పూజకి అన్నీ రెడీ చేసుకునే పనిలో పడిపోయాను.
ఇక ఎంచక్కా ఉప్పాడ పట్టుచీర కట్టుకుని, నా ఫ్రెండు బుల్లి ఇచ్చిన నెక్లెస్ సెట్ పెట్టుకుని, అచ్చ తెలుగు అమ్మాయిలా చక్కగా ముస్తాబయ్యి ...... హాల్ లో ఒక మూల అమ్మవారికి మండపం ఏర్పాటు చేసుకుని..... ఫలములు-పుష్పములు,ఇతర పూజా ద్రవ్యములు అన్నీ దగ్గర పెట్టుకుని అత్యవసరమైన లాప్టాప్ కూడా పక్కనే పెట్టుకుని.... ఒక పండు,తాంబూలం తీసుకుని తూర్పు ముఖముగా కూర్చుని పూజ ప్రారంభించాలని సంకల్పించాను.
ఇంతలో ఇంకో డౌటు మదిలో మెదిలింది. తోరాలు కట్టాలి కదా! అని. వెంటనే టిక్కు-టిక్కు అని నంబర్లు నొక్కి ఇంటికి కాలాను.
మా అమ్మ ఫోన్ ఎత్తి 'పూజ అప్పుడే...అయిపోయిందా 'అంది.
'ఇంకా మొదలే పెట్టలేదే తల్లీ...ముందు ఈ తోరాలు ఎలా కట్టలో చెప్పు....మూడు తోరాలు కట్టాలి అట కదా!' అన్నాను.
"ఓ! అదెంత పని.... తొమ్మిది దారపు పోగులు తీసుకుని,పసుపు రాసి,వాటికి తొమ్మిది పూలతో తొమ్మిది ముడులేసి తోరం కట్టాలి' అని చెప్పింది.
'ఈ తొమ్మిది గోలేంటి అమ్మా! అయినా ఇప్పుడు నేను పూలు మాల కట్టాలా?' అని నొక్కినోక్కి అడిగాను.
'మరి చెప్పింది అదే కదా! తొమ్మిద పూలతో తొమ్మిది ముడులేయాలి' అన్నది మా అమ్మ.
'అది మామూలు జనాలకి ఐతే లెఖ్ఖ. మనం కొంచెం వెరైటి కదా! నాకు పూలు మాల కట్టడం రాదు కాదే తల్లి.....ఇప్పుడు తొమ్మిది పూలు X మూడు తోరాలు = 27 పూలు మాల కట్టాలంటే నేను కిందపడి దొర్లి ఏడ్చినా నావల్ల కాదు కదా అమ్మా!"
" నీ ఖర్మ! నీకు చిన్నప్పటినించి కొన్ని వందల సార్లు చెప్పా! పూలు మాల కట్టడం నేర్చుకోవే అని. విన్నావు కాదు. ఏదో ఒకటి చేయి. పోనీ తొమ్మిది ముడులేయ్యి చాలు"

"ముడులంటే ఏం ముడులు? నాకు అడ్డదిడ్డంగా పీటముడి తప్ప ఇంకేం ముడులు రావు కదే!"
"నా ఖర్మ! ఎంత పనిమంతురాలివే తల్లీ! ఇంకా నయం అబ్బాయిగా పుట్టలేదు.... పెళ్ళిలో మూడు ముడులంటే నోరు వేల్లబెట్టేవాడివి"
"అమ్మా! జోకులా? ఇంకో రెండు గంటల్లో భోజనాలకి చందూ కొలీగ్స్ ఫ్యామిలి వస్తారు.....అటు,ఇటు కాకుండా అయిపోతుంది. వ్రతం ఈలోగా పూర్తి చేయాలి. ఈ తోరాలు లేకుండా వ్రతం చేయాలేమా?"
" ఎలాగో అలా తొమ్మిది పూలతో తొమ్మిది ముడులు వేయడం నేర్చుకో. గంట కానీ...రెండు గంటలు కానీ. ఇప్పుడు రాకపోతే ఇక ఎప్పటికీ రాదు. పూజ అయ్యాక ఫోన్ చేయి' అని ఠపీమని ఫోన్ పెట్టేసింది మా అమ్మ!
వాఆఆఆఅ..................వాఆఆఆఆఆ...........
మీరు నమ్మరేమో....కనీసం ముప్పావుగంట పట్టింది నాకు పూలు మాలకట్టడం నేర్చుకుని, ఆ మూడు తోరాలు చేయడానికి. [పాపం ఇందు కదా!]
ఎలాగోలా ఆ తోరాలు కట్టి....ఇక రాగా.కాం తెరిచి వరలక్ష్మి వ్రత విధానం ఆడియో ఆన్ చేశా!
ముందు కాసేపు బానే జరిగింది. గణపతికే అరగంట పూజ చేసాడు ఇక వరలక్ష్మికి గంటన్నర చేస్తాడేమో అనుకున్నా. కానీ పర్లేదు తొందరగానే పేకప్ చెప్పేసాడు. అయినా ఈ పూజ మొత్తంలో ఒక పదిసార్లు ఆ ఆడియోకి పాజ్ పెట్టి,లేచి అవి-ఇవి తెచ్చుకుని మళ్లీ స్టార్ట్ చేసాను.[అలా చేయొచ్చో లేదో!]
అమ్మవారికి ఎంచక్కా మొదటి వాయనం ఇచ్చి బోలెడు కోరికలు కోరేసుకున్నా ;)
ఇక లాస్ట్ కి నైవేద్యం అప్పుడు......నారికేళం కొట్టమన్నాడు. నేను వంటగదిలో పట్టకారు తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నా! ఆయన చెప్పిందే తడవుగా ఆ కొబ్బరికాయ తీసుకుని ఆ పట్టకారుతో రెండు పీకులు పీకా! అబ్బే! అస్సలు చలనం లేదు. 'ఈ చందుని తెమ్మన్నాను చూడు నాది బుద్ది తక్కువ! ముదురుకాయ అనుకుంటా!' అని రెండు సనుగుళ్ళు సణుక్కుని మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించా!
హ్మ్! దాన్ని కొట్టే దెబ్బలకి నా చెయ్యి ఎర్రగా కందిపోయిందిగాని అది తొణకదు,బెణకదు. నాకు నీరసమొచ్చేస్తోంది. అసలే పొద్దునించి కడుపులో మేతలేదు! పైగా పొద్దున్నే లేచా! ఎంత చాకిరి చేశా! టైం చూస్తే.....పన్నెండు! ఇక ఇహనో,ఇపుడో వాళ్ళు వచ్చేస్తారు. 'అయినా వ్రతం అంతా అయిపోవచ్చాక ఈ కొబ్బరికాయ దగ్గర ఆపేసావేంటి తల్లి?' అని అమ్మవారివంక దీనంగా చూసేసరికి కరిగిపోయిందో ఏమో....నెక్స్ట్ కొట్టిన దెబ్బకి కొంచెం పెచ్చు లేచింది. ఇక దానికి ఒక రంద్ర్హం చేసి ముందు నీళ్ళు అన్నీ గిన్నెలో పట్టేసి....ఆనక ధబీధబీమని బేకితే అప్పుడు అష్టచేక్కలైంది మా కొబ్బరికాయ!
"ఈ విషయం చచ్చినా ఎవరికి చెప్పకూడదు. ఆఖరికి కొబ్బరికాయ కొట్టడం కూడా రాదా? అని నవ్వి ముక్కున వేలేసుకున్నా.... వేసుకొందురు..... అయినా ఎప్పుడు నేను కొబ్బరికాయ కొట్టినా ముచ్చటగా మధ్యకి చీలి రెండు వక్కలౌతుంది. ఇదేమి ఖర్మో! ఇవాళ ఇలా ఏడిపించింది".... అని నాలోనేనే మధనపడి...ఎలాగో అలా మొత్తానికి చివరాఖరికి నానావిధఫల,భక్ష్య భోజ్యాలతో అమ్మవారికి నైవేద్యం పెట్టాక.... 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నా!
అనుకున్నట్టే....పన్నెండున్నరకి వారు పిల్ల-జేల్లతో సహా ఇంటికి భోజనానికి వచ్చారు. ఆమెకి ఎంచక్కా బొట్టు పెట్టి,పసుపు రాసి నా వంకరటింకర తోరము కట్టి, వాయనం ఇచ్చి..... దణ్ణం పెట్టా!
తరువాత మేము చేసిన అపురూప వంటకాలతో వారికి కొసరికోసరి వడ్డించి మరీ భోజనాలు పెట్టాం. మిక్కిలి సంతసించిన ఆమె సాయంత్రం వాళ్ళింటికి నలుగురైదుగురు ముత్తైదువులు వాయనానికి వస్తారని...... కావాలంటే నేను కూడా వాళ్ళకి వాయనమివ్వోచ్చని చెప్పారు. ఇక సంతోషంతో నాలుగు గెంతులు వేసి..... సాయంత్రం నా వాయనాలన్ని తీసుకుని వాళ్ళింటికి వెళ్లా! అక్కడ అందరికీ ఇచ్చి, వాళ్లకి తెలిసినవాల్లింటికి వెళ్లి ఇచ్చి, వాళ్ళలో కొందరు వాళ్ళింటికి నన్ను పిలిచి నాకు ఇచ్చి..... అలా బోలెడు మందికి వాయనాలు ఇచ్చి-పుచ్చుకుని, అలా చాలామందితో ఫ్రెండ్షిప్ చేసేసుకుని రాత్రి ఏ పదింటికో తెరిపిన పడ్డాను :)
హమ్మయ్య! ఎలాగైతేనేం...........చందూ గారి అపరిమితమైన సహాయసహకారాలతో నా మొదటి వరలక్ష్మి వ్రతం గ్రాండ్ సక్సెస్! దేశంకాని దేశంలో వాయనాలు ఎవరికి ఇవ్వాలో అని పడ్డ టెన్షన్ అంతా హుష్ కాకి :)
అదండీ.....నేను....... నా వరలక్ష్మి వ్రతం కథ! ఈ కథా శ్రవణం[అదే..వీక్షణం] చేసిన మీరందరూ కామెంట్ల అక్షతలు[అంటే తిట్లు కాదు బాబోయ్...దీవెనలు] నామీద జల్లుతారని ఆశిస్తూ....మీ ఇందు :)
నా వ్రతం ఫోటోలు పెడుతున్నానోచ్! అడిగిన వారందరూ చూసేయన్దోచ్!