14, ఫిబ్రవరి 2012, మంగళవారం

ఇష్టాలే కష్టాలైపోతే?

ఒక సెలవురోజున భోరున వర్షం కురుస్తోంది.

మీరు ఎప్పటిలాగే  వేడివేడి పకోడీ చేసుకుని, ఒక పెద్ద మగ్గునిండా టీ నింపుకుని కిటికీ/బాల్కనిలో కూర్చుని వర్షాన్ని ఆస్వాదిస్తూ, నోటికి పని కల్పిస్తున్నారు.

ఇంతలో చిన్న మూలుగుడు వినిపిస్తుంది. మీ చెవులు అసలే షార్పు కదా! చటక్కున లేచి రోడ్డుమీదకి చూస్తారు.

అక్కడ ఒక బుజ్జి కుక్కపిల్ల  చలికి వణికిపోతూ ఉంటుంది. మీ గుండె అది చూసి కరిగిపోతూ ఉంటుంది.

వెంటనే మీకు సమాజ సేవ,పెటా,బ్లూ క్రాస్  లాంటివికి కళ్ళముందు 70 .ఏం.ఏం. స్క్రీన్లో కనపడతాయ్! ఇక వెంటనే మీలో రక్తం ఉరకలు వేసి గొడుగు కూడా మర్చిపోయి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వీధిలోకి వెళతారు.

ఎదురింటి అబ్బాయి/అమ్మాయి మిమ్మల్ని గాని చూస్తుంటే ఇంకా రెచ్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ కుక్కని అక్కున చేర్చుకుంటారు. అది జాలికళ్ళతో మిమ్మల్ని చూడగానే మీ హృదయాంతరాలలో దాగున్న జంతుప్రేమ ఒక్కసారి వరదమూసినదిలా ఉప్పొంగిపోతుంది.

అది 'కుయ్యో మర్రో' అన్నా మీకు చిలకపలుకుల్లాగే ఉండి దాన్ని నిమురుకుంటూ ఇంట్లోకి తెస్తారు. 

దానికి ఒక టవల్ చుట్టి దుప్పటి మీద బజ్జోపెడతారు. ఆ కుక్క ఎప్పటినించి ఉగ్గబట్టుకుందో ఒక్కసారిగా మీ దుప్పటిని,మీ మంచాన్ని ఖరాబు చేసేస్తుంది.

అయినా మీ మూడ్ సూపరుగా ఉంది కాబట్టి, ఇప్పుడిప్పుడే మీ కుక్క మీద కలిగిన తొలివలపు కాబట్టి మీరు చిదానందబ్రహ్మానంద స్వరూపులై ఎంచక్కా మీ కుక్కని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టి పక్కబట్టలు మార్చి మళ్లీ దానికి బెడ్డింగ్ ఎరేంజ్ చేస్తారు.

ఇంతలోనే దానికి ఏదన్నా పెడదామనే మహత్తర అవిడియా మీ బుర్రలోకి తొంగి చూస్తుంది. వెంటనే దాన్ని అమలు చేస్తారు. 

వేడివేడి పాలు కాచి ఒక చిన్ని ప్లేటులో పోసి దానికి అందిస్తారు. అది దాని బుజ్జినాలుక బైట పెట్టి ఆబగా ఆ పాలని ఒక నాకు నాకి.....ఆ వేడికి కెవ్వుమని.....సారి కుక్కలు కేవ్వుమనలేవు కదా....అదే అదే.....'భౌవ్వుమని' అరుస్తుంది.

మీరు....వెంటనే లీటర్ల లీటర్ల సెంటిమెంటు కార్చేసి....'అచ్చోచ్చో! నోరు కాలిందా నాన్నా? ఆగు కాస్త చల్లారబెడతా' అని ఆ కుక్క నాకిన పాలను ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదిపెడతారు. 

ఇంతలోనే మీ మట్టిబుర్రకి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. 'అరె! మన పప్పికి ఇంకా పేరెం పెట్టలేదే?' అని.

'ఏం పేరు పెడదాం?' అని అలోచించి.....వర్షంలో దొరికింది కాబట్టి మీ సినిపరిజ్ఞానం ఉపయోగించి 'త్రిష' అని పేరు పెడతారు.

'త్రిష!త్రిష!త్రిష!' అని ముమ్మార్లు ముద్దుగా పిలుస్తారు.

అది దాని రెండు చెవులు ఎత్తి మీవంక ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. మీరు అది అంగీకారం అనుకుని గెంతులేసి.....చేతిలో పాలు ఒలకబోసి..... అయినా కూడా నామకరణోత్సవ సంరంభంలో మునిగి ఉన్నారు కావున అస్సలు విసుక్కోకుండా ఆ ఒలికిన పాలను ఎంచక్కా శుభ్రం చేసేసి మీ త్రిషకి మూతికాలని పాలని తీసుకొచ్చి కొసరి కొసరి స్పూన్తో తాగిస్తారు.

అసలే ఆకలిమీద ఉందేమో మీ త్రిష........ శ్రీ కృష్ణుడు పూతన పాలు తాగినట్టు నిర్విరామంగా తాగుతూనే ఉంటుంది. అది చూసి మీరు మురిసి ముక్కలైపోతారు.ఇలాంటి కొన్ని అపురూప ఘట్టాల మధ్య ఆ రోజుకి అంతా బానే ఉంటుంది. మీ త్రిష బుజ్జి కళ్ళు, చిట్టి తోక, బుల్లిబుల్లి పళ్ళు మీకు తెగ నచ్చేస్తాయ్.

'నా త్రిషా అంత అందమైన కుక్క ఈ ప్రపంచంలో లేదు' అని డిసైడ్ అయిపోతారు.

క్రమంగా మీకు,త్రిషకి మధ్య బంధం దృఢమౌతుంది. తన చిలిపి చేష్టలతో,అల్లరి అరుపులతో త్రిష మీకు బోలెడు ఆనందాన్ని పంచిస్తుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయ్!

ఒకరోజున మీరు ఆఫీసులో పని చేసేబదులు ఆంగ్రి బర్డ్స్ తెగ ఆడేసుకోవడం చూసిన మీ మేనేజరు తన పళ్ళు పరపరా కొరికి.......ఇక మీ చేతులు అరిగిపోయేలా......కళ్ళు పేలిపోయేలా......బుర్ర గిర్రున గింగిరాలు తిరిగేలా పని ఇస్తాడు. 

మీది అసలే జాలి గుండె కదా! ఈ దెబ్బకి అది ఇంకా కరిగిపోయి ఆఫీసులో అట్టే నిలవలేక ఇంటికి మోసుకేలుతుంది పనిని.

ఇంటికెళ్ళగానే మీ త్రిష మీకు ఎదురయ్యి మీ బూట్లు నాకుతుంది. మీరు అది స్ట్రెస్ బస్టర్ అనుకుని, మీ త్రిష ఇంట్లో కాలుమోపిన క్షణం నించి అన్ని ఒక రీలేసుకుంటారు. 

ముద్దుగా మీ త్రిషని ఎత్తుకుంటారు. మీ ఒళ్లో మీ ఆఫీసు కాగితాలు,పక్కనే లాప్టాపు ఉంటాయ్. మీరు ఎత్తుకోగానే మీ త్రిష సంతోషం ఆపుకోలేక మీమీదనే చిచ్చు చేసేస్తుంది. 

మీ లాప్టాపు కీబోర్డ్ మీద, మీ కాగితాలమీద ఒలికిన మీ త్రిషమ్మ ఆనంద భాష్పాలు చూసి మీకు కన్నీరు ఆగదు.

అప్పుడు మొదటిసారి మీలో అపరిచితుడు నిద్ర లేస్తాడు. అసలే ఓపిక లేక, ఆపై ఆఫీసు పని తెమలక.....రేపు బాసుకి అందించాల్సిన డాక్యుమెంట్లను మీ త్రిష ట్రాష్ లో పడేసే పరిస్థతి తీసుకురాగా........... మీ ఆగ్రహం  సాగర డ్యాం లా కట్టలు తెంచుకుని ఆ కోపంలో మీ త్రిషని పక్కన పడేసి.....

'దొంగ మోహమా! నిన్ను వర్షంలో కాపాడితే ఇదా నువ్వు చూపించే విశ్వాసం' అని మీ కుక్కకు అర్ధం కానీ భాషలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి..... మీ త్రిష చేసిన ఘనకార్యాన్ని వేనోళ్ళా పొగుడుతూ....... మీ పనిలో మునిగిపోతారు.

త్రిషకి  ఏమి అర్ధం కాక..... చిన్నగా మూలుగుతూ ఇంట్లో ఒక మూలకెళ్ళి ముడుక్కుని బజ్జుంటుంది.

ఇదే ఇష్టాలు కష్టాలైపోవడమంటే!!!

ఎంతో నచ్చినది ...........మనం చిరాకులో ఉంటే ఏదన్నా చిన్న తప్పు చేసినా ఓ...విరుచుకు పడిపోయి తిట్టేస్తే......ఎవరికి నష్టం? మనకే! ఏదైనా చూసేదానిలో ఉంటుంది. ఒకప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చలేదు అంటే......ఆ వస్తువులో మార్పు కాదు మన మనసులో ఆ వస్తువు మీద ఉన్న అభిప్రాయం మారింది అని అర్ధం. 

కొత్తొక వింత...పాతొక రోత. కొత్త చింతకాయ పచ్చడి బానే ఉంటుంది. పాతబడే కొద్ది రుచి తగ్గుతుంది. అలాగని పచ్చడి మొత్తం దిబ్బలో కొట్టలేం కదా! కష్టపడి పెట్టిన పచ్చడి. ఏముంది కాస్త ఆవాలు, మెంతులు, ఎండుమిరప, ఇంగువ వేసి పోపు పెట్టేయడమే! జీవితమూ అంతే! 

ఏమన్నా అర్ధమయిందా? కాలేదా? అర్ధమయితే మహా మంచిది..............కాలేదో.....మరీ మంచిది :)

Anyways.... Happy Valentine's Day Folks!! :) 


27 కామెంట్‌లు:

రాజ్ కుమార్ చెప్పారు...

త్రిష విశేషాలు బాగానే ఉన్నాయండీ..
"మరీ మంచిది" అనుకుంటున్నాను ;)

మనసు పలికే చెప్పారు...

కిక్కిక్కి.. నాకర్థమయిందోచ్...;);)

నీ వాలంటైన్స్ డే శుభాకాంక్షలకి ధన్యవాదాలు:) మరియు, నీకు కూడా వాలంటైన్స్ డే మరియు జన్మదిన శుభాకాంక్షలు..:))

వేణూశ్రీకాంత్ చెప్పారు...

అమ్మో అంత వేదాంతాన్ని ఇంత చిన్న కథలో భలే ఇమిడ్చేసి చెప్పారుగా బాగుంది :-)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ప్రేమికుల రోజు నిత్య నూతనం గా ఎప్పుడూ..ప్రేమగా ఉండటానికి భలే చక్కని చిక్కని కథ చెప్పారు!
ఆ వస్తువులో మార్పు కాదు మన మనసులో ఆ వస్తువు మీద ఉన్న అభిప్రాయం మారింది అని అర్ధం.

బాగా చెప్పారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇందూ..

జయ చెప్పారు...

ఇంత వివరంగా చెప్పాక కూడానా! అర్ధం అయినట్లే ఉందండి:-)

అజ్ఞాత చెప్పారు...

** ఒకప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చలేదు అంటే......ఆ వస్తువులో మార్పు కాదు మన మనసులో ఆ వస్తువు మీద ఉన్న అభిప్రాయం మారింది అని అర్ధం.
చాలా బాగా చెప్పారు.
Wish you a very happy bday Indu gaaru

హరే కృష్ణ చెప్పారు...

.ఆ వస్తువులో మార్పు కాదు మన మనసులో ఆ వస్తువు మీద ఉన్న అభిప్రాయం మారింది అని అర్ధం.
కొత్తొక వింత...పాతొక రోత. కొత్త చింతకాయ పచ్చడి బానే ఉంటుంది. పాతబడే కొద్ది రుచి తగ్గుతుంది. అలాగని పచ్చడి మొత్తం దిబ్బలో కొట్టలేం కదా! కష్టపడి పెట్టిన పచ్చడి. ఏముంది కాస్త ఆవాలు, మెంతులు, ఎండుమిరప, ఇంగువ వేసి పోపు పెట్టేయడమే! జీవితమూ అంతే!


చాలా చాలా మంచి ఇన్ఫో ఇచ్చావు ఇందూ!
మరోసారి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు

మాలా కుమార్ చెప్పారు...

indu gaaru , Happy Birthday .

జ్యోతిర్మయి చెప్పారు...

పుట్టినరోజు అందులోనూ ప్రేమికుల రోజూ కదా చక్కగా దూదిపింజలా అలా అలా తెలిపో౦డి. జన్మదిన శుభాకాంక్షలు ఇందూ..

Vineela చెప్పారు...

సూపర్ చెప్పారు ఇందు గారు..మీకు కూడా ప్రేమికుల రోజు మరియు జన్మదిన శుభాకాంక్షలు అండి

Sudha చెప్పారు...

మధుర బ్లాగ్ లో మీ గురించి చదివి ఇక్కడికి వచ్చాను. చాలా చక్కగా చెప్పారు పాత చింతకాయ ఉదాహరణ... జన్మదిన మరియు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

రసజ్ఞ చెప్పారు...

చాలా బాగా చెప్పారండీ! నాకు మాత్రం బసికల్గా కుక్కలంటే ఇష్టం లేదు!

హార్థిక జన్మదిన శుభాకాంక్షలు ఇందు గారు!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Happy Birthday ఇందూ గారు..

Padmarpita చెప్పారు...

బాగా చెప్పారండీ... Many more happy returns of the day.

శశి కళ చెప్పారు...

అయినా మీ మూడ్ సూపరుగా ఉంది కాబట్టి, ఇప్పుడిప్పుడే మీ కుక్క మీద కలిగిన తొలివలపు కాబట్టి మీరు చిదానందబ్రహ్మానంద స్వరూపులై ఎంచక్కా మీ కుక్కని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టి పక్కబట్టలు మార్చి మళ్లీ దానికి బెడ్డింగ్ ఎరేంజ్ చేస్తారు.
...ha...ha...yemi jeevita sathyaalu...nice post

Nagamani చెప్పారు...

nice post

ఛాయ చెప్పారు...

ఇందు గారు ..
"మీ భావాలు అనుభావాలా!?
అనుభవాలే భావాలా?!!"
పోస్ట్ అర్ధవంతంగా ఉంది.
ఇప్పుడే కామెంట్స్ చదివితే తెలిసింది , పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఇందు చెప్పారు...

@రాజ్: హ్హహ్హ!! అంటే అర్ధం కాలేదన్నమాట ;) థాంక్స్ థాంక్స్

@ అప్పు: హహ!! అర్ధమయిపోయిందా కెవ్వ్!! :) వెల్కం మరియూ థాంక్స్!! :)

@venu:అవును వేణూ... ఏదో అలా అనిపించింది చెప్పేసా!!

ఇందు చెప్పారు...

@వనజావనమాలి: ధన్యాదాలు వనజ గారు :) అవునండీ. ప్రేమని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉండాలి లేదంటే జీవితం స్తబ్దుగా ఉండిపోతుంది :)

@జయ: అయినట్లే ఉందా?? అయిందా? ;) హ్హహ్హ!!

@Sree:థాంక్యూ శ్రీ!!

ఇందు చెప్పారు...

@హరే కృష్ణ :హహ :)) నీ పోస్టులో ఇచ్చిన ఇంఫో కంటేనా ఏండీ :)) థాంక్స్ థాంక్స్!!

@మాలా కుమార్ : Thankyou Malagaaru :)

@ జ్యోతిర్మయి: మీరు చెప్పినట్టే అలా అలా తేలిపోయి ఇదిగో ఇప్పుడే నేలమీదకి దిగానండీ :)) థాంక్యూ!!

ఇందు చెప్పారు...

@ Vineela:హాయ్ వినీలగారూఉ... చాలారోజులకి కనిపించారు! ఎలాఉన్నారూ?? థాంక్స్ అండి :)

@Sudha :మధు బ్లాగు చూసి వచ్చారా?? భలే రాసింది కదా!! :) థాంక్స్ అండీ... హమ్మయ్య ఐతే మధు బ్లాగు చూసి నా బ్లాగుకి వచ్చిన మిమ్మల్ని డిజపాయింట్ చేయలేదన్నమాట! థాంక్స్ థాంక్స్! :)

@ రసజ్ఞ: పర్లదులేండీ.... కుక్కలంటే ఇష్టం లేకపోతే ఇదే ఉదాహరణ పిల్లితో చెప్పేసుకుందాంలే :) థాంక్యూ!!

ఇందు చెప్పారు...

@ రాజి: హేయ్ రాజి... చాల థాంక్స్ అండి :)

@ 'Padmarpita': Thankyou somuch padmagaru :)

@ శశి కళ :హహ్హా!! కదా శశి ;) Thankyou :)

ఇందు చెప్పారు...

@Nagamani: Thankyou Nagamani :)

@ఛాయ: ఎబ్బే!! మనకంత సినిమా ఎక్కడండీ బాబూ... ఏదో ఊరికే రాయలనిపించి రాసా అంతే :) థాంక్యూ ఛాయగారు :)

Vineela చెప్పారు...

nenu super andi :) mimmalni inspiration ga tesukoni java lo dukudam ani trying :D btw..me photo chala bagundi..mee creativity tho design chesara leka gift aa ;)

ramki చెప్పారు...

nice post... :)

జైభారత్ చెప్పారు...

ఇందు గారు.. స్టొరీ అదిరింది సుమా...ఐనా త్రిష లో మీరు ఎవర్ని చూసారో...గాని...బలే బలే..

గీతిక బి చెప్పారు...

belated happy birth day Indu garu...

చర్చకు పెడితే చాన్నాళ్ళు సాగే విషయాన్ని చిన్న చిన్న మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు. చాలా బావుంది. ఊహు... చాలా చాలా బావుంది.