8, ఆగస్టు 2011, సోమవారం

రివర్స్ సేమ్యా ఉప్మా!

రండి బాబూ....రండి...
నేడే చూడండి....మా 'రివర్స్ సేమ్యా  ఉప్మా'

ఉప్మా అంటే.....ఉప్మా కాదు....
చెప్మా అంటే...చెప్మా కాదు....
పదిలంగా చేసుకుతిన్న రివర్స్ ఉప్మా మాది.....రివర్స్ ఉప్మా మాది ;) [పాట బాగుంది కదా!]

ఈ రివర్స్ ఉప్మా చేయాలనీ ఎందుకనిపించిందంటే.......ఎప్పుడు చేసే పని ఎందుకు చేయాలి? డిఫరెంట్ గా ఎందుకు ట్రై చేయకూడదు? అందుకే ఎప్పుడు చేసే సేమ్యా ఉప్మాని ఇలా వెరైటిగా,ఇన్నొవేటివ్గా చేశా :)  [బాగా బిల్డప్ ఇచ్చానా? :)) ]

ఇప్పుడు కావాల్సిన పదార్ధాలు: [పక్కూరి వంటలో చూపించినట్టు మంచిమంచి గాజు ప్లేట్స్ లో పెట్టుకోండి ఈ పదార్ధాలు అన్ని]

ముఖ్య పదార్ధాలు:

  1. ఉప్మా చేయడానికి ఒక స్టవ్ [పనిచేసేది]
  2. వండటానికి గిన్నె,భాండి,తిప్పడానికి గరిటె
  3. వడగట్టడానికి స్త్రైనెర్,
  4. తినడానికి నాలుగు ప్లేట్లు,నాలుగు స్పూన్లు[ఇవి మీ ఇష్టం]
  5. చేసింది తినిపెట్టడానికి మనిషి [లేదా మనుషులు]

సహాయ పదార్ధాలు:
  1.  సేమ్యా ఉప్మా కాబట్టి సేమ్యా ఉండాలిగా
  2.  మన ఉప్మా కొంచెం వెరైటి కాబట్టి....రకరకాల కూరగాయలు ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి :)    [క్యారెట్,బీన్స్, పీస్ ఇత్యాదివి]
  3.  ఉల్లిపాయలు లేకపోతె అస్సలు బాగోదు....కాబట్టి అవి నిలువుగా,సన్నగా కోయాలి.
  4. పచ్చిమిర్చి కూడా తగిలితే చురుక్కుమంటుంది...అంచేత రెండు నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి 
  5. టమాటతో మంచి ఫ్లేవర్ వస్తుందిట. అది తరిగి పెట్టేసుకుంటే పోలే! 
  6. పోపు పెట్టకపోతే ఉప్మా ఎలా అవుతుంది? కాబట్టి...ఆవాలు,జీలకర్ర,జీడిపప్పు[ఇది నా క్రియేటివిటీ] కూడా రెడి చేసేసుకోండి
  7. ఇంగువ లేకపోతె రుచే ఉండదు :) కావున చిటికెడు ఇంగువ
  8. అసలు కరివేపాకు లేకుండా వంట పూర్తవుతుందా? సో...నాలుగు రెబ్బలు అవి...
  9. కొంచెం అల్లం-వెల్లులి పేస్ట్ వేస్తె...ఘుమఘుమలాడుతుంది మరి ఇక మీ ఇష్టం.
  10. రుచికి ఉప్పు
  11. తాలింపుకు నూనె 
  12. సువాసనకు కొత్తిమీర


ఇప్పుడు ప్రధాన పదార్ధాలను కొన్నిటిని వినియోగించి సహాయపదార్ధాల సహకారంతో మన రివర్స్ సేమ్యా ఉప్మా చేయబోతున్నాం :)
తయారి విధానం :

ముందుగా తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టుకుని వంట మొదలుపెట్టండి :) 

ఇప్పుడు ఒక లైటర్ తీసుకుని(విదేసవాసులు జస్ట్ బర్నర్ తిప్పి) స్టవ్ వెలిగించి దానిమీద నెమ్మదిగా ఒక గిన్నె లాండ్ చేయాలి.

ఇప్పుడు ఆ గిన్నెలో ఒక గ్లాసుడు నీరు పోసి అవి వంద డిగ్రీల సెంటిగ్రేడు దగ్గర సలసలా కాగాక, ఒక కప్పుడు సేమ్యా వేసి....ఒక మిల్లీలీటరు నెయ్యి వేయాలి [సేమ్యా ఉప్మా జీడిపాకంలా అవకుండా ముందు జాగ్రత్త]

ఇంతలో  కోసిన రకరకాల కూరగాయముక్కలు ఒక వందగ్రాములు వీలయితే ఓవెన్లో/లేదంటే కాసిని వేడినీళ్ళు పోసి గిన్నెలో పదినిమిషాలు ఉడికించుకోవాలి.

ఈలోగా...పక్క స్టవ్వు వెలిగించి భాండి పెట్టి అది వేడెక్కాక రెండు ఔన్సుల నూనె వేయాలి.

నూనె వేడెక్కాక......ఆవాలు వేసి....అవి చిటపటమని ఇల్లంతా చిందాక......జీలకర్ర వేసి....వెంటనే జీడిపప్పు వేసి అవి ఎర్రగా అయిపోయేలోగా ఇంగువ వేసేసి..... అది మాడిపోయేలోగా మిర్చి చీరికలు, ఉల్లిపాయ తరుగు,టమాట ముక్కలు  వేసేసి ఒక గరిటె తీసుకుని కసాబిసా తెగ తిప్పెసేయాలి[అచ్చం మనం షెఫ్లాగా బిల్డప్పు ఇవ్వాలి] .

ఈలోగా...సేమ్యా ఉడికిపోయుంటుంది ఒకసారి చూడండి. ఉడికితే దించేసి వెంటనే ఒక స్త్రైనేర్ తీసుకుని ఈ వేడివేడి సేమ్యా అందులో వేసేసి చల్లనీటి ట్యాప్ క్రింద పెట్టేయాలి. అప్పుడు సేమ్యా ముద్దముద్ద అవకుండా.... విడివిడిగా,పొడిపొడిగా ఉంటుంది ;) [ఇది షేఫ్స్ సీక్రెట్ ]

ఇప్పుడు పైన చెప్పిన కసబిస మిశ్రమంలో కాస్త అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉడికించిన కూరగాయ ముక్కలు వేసేసి, విడిపొడి సేమ్యా వేసి అవన్నీ కలియబెట్టాలి :) 

రుచికి కాస్త ఉప్పువేసి.....అలాఅలా సుతారంగా తిప్పేసి....పైన మీ శక్తికొలది కొత్తిమీర సమర్పిస్తే ఇక 'రివర్స్ సేమ్యా ఉప్మా' రెడి....రెడి....రెడి.....

ఉప్మాని ఉప్మాలా కాక ఇలా తిరగతిప్పి చేయడమే రివర్స్ ఉప్మా :) [రివర్స్ గేర్ లాగా ;) ]

చూసారా! ఎంత వీజియో మా రివర్స్ సేమ్యా ఉప్మా ;) 
ఈ ఉప్మాలో చట్ని-గిట్ని,పంచదార-గించదార ఏమి వేసుకోకుండా ఉత్తిగా అలా తినేయడమే :)

ఇప్పుడు ఒక ప్లేటు తీసుకుని అందులో ఈ రివర్స్ ఉప్మాని వడ్డించి ఆరగించాలి.

మర్చిపోయా..... ఈ పదార్ధం తయారుచేసాక పైన చెప్పిన ప్రధాన పదార్ధాలు లో ముఖ్యమైనది,ఆఖరిది అయిన ఒక మనిషిని సంపాదించి[నాకు డిఫాల్ట్ గా దేవుడు ఒకరిని ఇచ్చాడు...మీమీ బలిపశువులను మీరే తెచ్చుకోవాలి మరి ]......... వారికి ముందు ఈ పదార్ధం పెట్టి... వారు ఇది తిన్నాక కూడా మామూలుగానే ఉంటె(దేవుడి దయవల్ల) ఇక మీరు నిస్సందేహంగా తినేయోచ్చు :))

[హబ్బ! పోస్ట్ మొత్తంలో ఎక్కడ 'సేమ్య' అని టైపినా ముందు 'సౌమ్య' అని వచ్చేస్తోంది. కొంపదీసి ఎక్కడైనా 'సేమ్య' కి బదులు 'సౌమ్య' అని రాయలేదు కదా! ఒకవేళ రాస్తే సౌమ్యగారికి మాత్రం చెప్పకండే! ;) ]

2, ఆగస్టు 2011, మంగళవారం

తళతళా...మిలమిలా...

ఏమిటి ఇదేమన్న సర్ఫ్ ఎక్సెల్ ప్రకటన అనుకుంటున్నారా? హ్హేహ్హే...కాదుగాని... మా పాత ఇంటి ఇక్కట్లు...మీతో కాసిని పంచుకుందామని ఇటు వచ్చానన్నమాట!

మా ఇల్లు ఒక వెయ్యిచదరపుటడుగుల 'శ్వేతసౌధం' [అంటే అమెరిక ప్రెసిడెంటు ఇల్లుకి ట్రు కాపి అని కాదు నా అర్ధం..మరిన్ని వివరములకొరకు పూర్తీ టపా చదువుడి]
క్రితం సంవత్సరం ఆదరాబాదరా అమ్రికా వచ్చేసామా!? వచ్చిరాగానే మా చందు స్నేహితుల ఇంట్లో దిగాం! :) పాపం పదిరోజులు అక్కడే మకాం! ఈలోగా.... ఇల్లు కోసం కిందా మీదా పడి వెదికాం! ఒక్క అపార్టుమెంటు ఖాళీ లేదాయే! అన్నీ కొన్ని నెలలముందే అడ్వాన్స్ బుకింగ్ చేయించుకోవాల్ట! మరి మా గతి ఏమి??

ఈలోగా....మా కొండల ఊరంతా తవ్వి.....ఎలుకని కాకుండా ఏకంగా ఎలుగుబంటిని పట్టారు మా చందుగారు!! ఈ ఇల్లు చెప్పుకోడానికి సింగిల్ బెడ్రూం అయినా.....లంకంత వంటగది....సముద్రమంత బాత్రూముతో అలరారుతూ....నా ప్రాణానికి గుదిబండ అయ్యింది! ఉంటె ఉంది విశాలంగా......దీనికి తోడు....అంతా ధవళమయమే !! 

తెల్లటి ఫ్రిజ్జు,తెల్లటి పొయ్యితో సరిపెట్టకుండా......వంటగదంతా తెల్లటి తలుపులు...తెల్లటి అరలు...తెల్లటి గట్టు.... ఆఖరికి ఫ్లోరింగ్ కూడా తెలుపే! పోనీ గది కొంచెం చిన్నదైతే తెల్లగా ఉన్నా ఏదో రోజు తుడుచుకుంటూ మేనేజ్ చేయోచ్చు! అబ్బే...ఎంచక్కా ఒక బ్రేక్ఫాస్ట్ టేబిల్ కూడా వేసుకునేంత 'పెద్ద' కిచెన్ నాకవసరమా అధ్యక్షా?

అప్పటికే రెండు ఫ్లోర్ మేట్స్ తెచ్చి వేసా! అబ్బే! లాభం లేదు. రోజు వంట అయ్యాక ఆ జిడ్డుమరకలు తుడుచుకుని, కిందపడ్డ ఆవగింజలు మినప్పప్పుని వేటాడి, చెత్తాచెదారం శుబ్రం చేసేసరికి అందరు దేవుళ్ళు దిగోచ్చేవారు!

 దీనికి తోడు....మంచం వేసుకుని పడుకునేంత విశాలంగా ఇచ్చాడు ఆ బాత్రూం! ఇక్కడ బాత్రుం తలుపుంటే...ఆ మూలేక్కడో కనిపించి...కనిపించకుండా ఉంటుంది బాత్ టబ్! ఇక్కడా నేలంతా పాలసముద్రాన్ని తలపిస్తుంది! ఈ విపరీతాలకి తోడు మనకసలే జుట్టు రోజుకి కిలోల్లెక్కన ఊడిపోతుండడం వలన పొరబాటున బాత్రుమ్లో అద్దంలో చూసుకుని తల దువ్వుకుంటే.....తెల్లటి ఆ గచ్చుమీద నల్లటి నా వెంట్రుకలు చూస్తె  తిరుమలలో 'కళ్యాణ కట్ట' కళ్ళముందు కనపడుతుంది! :((

ఇక మిగితా ఇల్లంతా కార్పెట్ పరిచి నామీద దయతలిచాడు కాని లేకుంటేనా.....చచ్చేదాన్ని! ఇక ఈ సౌలభ్యాలకి తోడూ ఇక్కడ చీపుర్లు గట్రా ఉండవు గనుక....ఒక చిన్న బ్రష్షు తీసుకుని ఆ వంటగది,బాత్రుము చిమ్ముతుంటే ఏడుపోచ్చేదంటే నమ్మండి! వాక్యుం పెట్టొచ్చుగా అంటారేమో.....ఆ వాక్యుం ఘనకార్యలన్ని కార్పెట్ మీదే...ఈ హార్డ్ ఫ్లోర్ మీద చెల్లవు! బ్రష్శే గతి! ఒక్కోసారి నాకు ఇండియాలో ట్రైన్లలో బోగీలు ఊడ్చే చిన్నపిల్లలు గుర్తోచ్చేవారు! :(

ఇక విషయానికి వస్తే..... మొన్న ఇండియా నించి వచ్చాక ఒక వారంరోజులు జెట్లాగ్ పేరుచెప్పుకుని....... ఇంకో రెండురోజులు 'టులిప్ షో' కి వెళ్లి రోజంతా వర్షంలో తడిసి తెచ్చుకున్న జలుబు పేరు చెప్పుకుని మూసిన కన్ను తెరవకుండా పడుకున్నానా.......ఇక ఇల్లు చూస్తె....నాకే చీదర వేస్తుంటే..... పాపం మా చందు వంట తప్ప ఇలాంటి క్లీనింగ్ సెక్షన్లో కాలు కూడా మోపని కారణమున చచ్చినట్టు నేనే లేచి ఘట్టిగా ఊపిరి పీల్చి.....రంగంలోకి దిగాను!

తీరాచూస్తే..........క్లీనింగ్ కోసం నేనెప్పుడు వాడే క్లీనింగ్ సొల్యుషన్ కాకుండా వేరేది ఏదో ఉంది! ఏంటి బాబు ఇది అని అడిగితె.... ఆ నువ్వు లేనప్పుడు ఇది తీసుకొచ్చా.....కొంచెం ఎఫెక్టివ్ గా పనిచేస్తోంది అని చెబితే సంబరపడి.... ఆవేశంతో ఆరోజే ఆ మురికిపట్టిన మల్లెపూవులా ఉన్న మా వంటగదిని శుభ్రం చేసే కార్యక్రమానికి నాంది పలికా!!

తుడిచా...తుడిచా....ఆ సొల్యుషన్ పిచికారి చేయడం....టిష్యు తో  తుడవడం....మళ్లీ తడి బట్ట పెట్టి...దాని పొడి గుడ్డతో తుడిచి....వార్నాయనో చిరాకోచ్చేసింది!! సాయంత్రానికి మా 'మిల్క్ సీ' అదే బాత్రూం కూడా అతి కష్టం మీద శుభ్రం చేసేసరికి నా తల ప్రాణం తోకలోకి వచ్చింది! ఆనక ఇల్లంతా వాక్యుం పెట్టి సోఫాలో కూలబడ్డా!  సరే పనైతే అయ్యింది కాని చేతులు కొంచెం మంట పుట్టాయి!ఆ ఘాటు మహిమలే అనుకుని ఊరుకున్నా!

కాసేపయ్యేసరికి చేతుల మీద చిన్నచిన్న గాట్లు! వామ్మో అని చూసుకునేసరికి అన్ని చేతివేళ్ళు ఎర్రెర్రగా బొక్కలు పడిపోయాయి! :( సొల్యుషన్ కొంచెం ఎఫ్ఫెక్టివ్ అనుకున్నా కాని ఇంతనుకోలేదు! నేను కేవ్వవ్వ్వ్వ్! వాటికి ముందు మాయిశ్రైసర్ రాసా....కాసేపాగి మళ్లీ ఏదేదో రాసి ఎం చేసినా మంట మాత్రం పోదే! అలాగే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ ఎలాగో ఉండిపోయా! :((( అసలే రోజుకోసారి వంట చేసేటప్పుడు విధిగా వేళ్ళు కోసుకోవడం నా రివాజు! దానికితోడు ఇవి కొత్తగా! హతవిధీ!

అలా ఆరు గాట్లు....మూడు చందుచీవాట్లతో రోజులు దొర్లిపోయాయి!

క్రమంగా గాట్లు తగ్గుముఖం పట్టాయ్! ఈలోగా అపార్ట్మెంట్ల వేట మొదలుపెట్టాం. ఈసారి ఒక అపార్ట్మెంట్ ఎంచుకుని అన్నీ మాట్లాడుకుని 'ఒకే. డీల్...డీల్' అనుకుని ఆ అపార్ట్మెంట్ ఫైనలైజ్ చేసాం. తీరా ఒకసారి చూస్తాం మా అపార్ట్మెంట్ చూపించమంటే రిసెప్షన్ దేవత.....'సారి రిపెయిర్లో ఉంది కుదరదు' అంది :( నాకేదో తేడా కొడుతోంది. అయినా సర్లే అనుకుని లైట్ తీసుకున్నాం.

ఇల్లు మారే సమయం ఆసన్నమైంది! ఇండియాలోలాగా పెట్టె,బేడ సర్దుకుని ఎగురుకుంటూ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోవడానికి ఇక్కడ కుదరదుగా......వీళ్ళకి ఇల్లు తీసుకునేటప్పుడు ఎలా ఉందో....ఇచ్చేటప్పుడు అలాగే ఉండాలి! గోడల మీద, పొయ్యి గట్టు మీద,బాత్రూమ్లో చిన్న చిన్న మరకలు పడ్డా ఫైన్ వేస్తాడు! పసుపు మరక పడిందో....ఇక అయిపోయినట్టే!అలాగే మనకి ఇల్లు ఇచ్చేటప్పుడు కూడా....చక్కగా కొత్త పైంటు వేసి,కార్పెట్ మార్చి,రిపైర్లు చేసి ఇస్తారు.....కాబట్టి మనం ఇల్లు ఖాళి చేస్తున్నప్పుడు అంతే నీట్టుగా ఇవ్వాలనడం తప్పు కాదేమో!

అందుకనే ముందు సామాన్లు అన్ని సర్దుకుని ఇక ఒక బ్రష్షు.....బకెట్టు.....చేట.....ఒక లిక్విడు[ఈసారి కొంచెం తక్కువ ఎఫ్ఫెక్ట్ చూపించే లిక్విడ్ తెచ్చాం లెండి] తెచ్చుకుని ఇద్దరం ఇంటిమీద పడి రుద్దడం మొదలుపెట్టాం!

రుద్ది....రుద్ది...కడిగి...కడిగి....కడిగిందే కడిగి....కార్పెట్ మీద వాక్యుం చేసిందే....చేసి....ఎలాగైతేనేం ఇంటిని కొత్త ఇల్లు లాగా తళతళ మిలమిల లాడే ట్రిపుల్ ఎక్స్ లాగా తీర్చిదిద్దేసాం!

హమ్మయ్య! ఒక గోల వదిలింది! ఈసారి వెళ్ళే ఇల్లన్నా కొంచెం ఈ ధవళమయం కాకుండా చూడు స్వామీ!! అని కోరుకుని.....కొత్తింటిని ఒకసారి చూద్దామని వెళ్ళాం!

తలుపు తీయగానే పక్కనే వంటగది......హమ్మయ్య కొంచెం చిన్నదే.....బ్రతికాను దేవుడా అని అనుకుంటూ అలా లోపలికి అడుగుపెట్టి లైటు వేసా.....అంతే.....

కేవ్వ్వ్వవ్వ్వ్వ్!

అవ్వాక్కయ్యా!!

ఎందుకంటే.....ఇక్కడ కూడా.....అవాక్కయేలా 'టైడ్' తెల్లదనమే! నాలుగు దేదీప్యమానమైన లైట్ల వెలుగులో ధగధగా మెరిసిపోతున్న ఆ తెల్లతెల్లటి వంటగది నాకు  ముద్దుముద్దుగా స్వగతం పలుకుతుంటే..... ఏడుపొక్కటే తక్కువ!

మళ్లీ తెలుపుతో నా యుద్ధం మొదలు!

హ్మ్! ఇంటిని మార్చగలిగాం కాని తలరాతని మార్చగలమా?

27, జులై 2011, బుధవారం

'For Women' లో నా ఆర్టికల్!

కేవ్వవ్వ్వ్వ్!!

ఏంటి...భయపడ్డారా? ఏదైనా అరిచి చెప్పడం నాకు అలవాటు కదా మరీ!!

నా ఆర్టికల్ 'For Women' వెబ్సైట్ లో వేశారు :)

ఇందుకు ముందుగా ఈ సైట్ ఎడిటర్ గారికి ధన్యవాదాలు.

మొదట ఈ వెబ్సైట్ చూసినప్పుడు.....నాకు చాలా ఆశ్చర్యమేసింది! ఎన్నో ఆర్టికల్స్....ఆడవారికోసం!
అంతే కాకుండా...ప్రముఖుల చేత ఇవ్వబడుతున్న  సలహాలు,సూచనలు కూడా. ఆరోగ్యం,విద్య,కెరీర్,వంటలు,ఫ్యాషన్,ఆధ్యాత్మికం,.....ఇలా ఎన్నెన్నో అంశాలమీద చినచిన్న ఆర్టికల్స్ రూపంలో ఎంతో ముచ్చటగా చెబుతున్నారు!

ఇలా మహిళలు,పిల్లలు,జీవన విధానం....వీటి గురించి చక్కగా చెబుతున్న ఈ వెబ్సైట్....చాల బాగుంది!
నాకు ఈ సైట్ చాలా నచ్చింది :) ఒకసారి కావాలంటే మీరు వెళ్లి చూడండి! ఇదిగో లింక్

ఇక నా ఆర్టికల్ గురించి చెప్పాలంటే....
నా బ్లాగ్ చూసి...కామెంటులో మెయిల్  అడ్రస్ ఇచ్చి....తనకి మెయిల్ చేయమని చెప్పారు ఎడిటర్గారు.
తరువాత,
ఒకరోజు....ఇలా మా వెబ్సైట్లో 'ప్రవాసి' కాలం ఉంది ఒక ఆర్టికల్ రాయగలవా? అని అడిగినప్పుడు.....నాకు ముందు భయమేసింది! వామ్మో! నేను ఆర్టికల్ రాయడమా అని. అయినా తను..నువ్వు రాయగలవ్ అని ప్రోత్సహించి.... ముందు ఒక ఆర్టికల్ రాసి పంపమన్నారు.

నేను వ్రాసి భయపడుతూ పంపించా! అది చూసి....చాలాబాగుంది....ఇలా సిరీస్ కంటిన్యు చేయగలవా? అని అడిగినప్పుడు ఎంత హాపిగా అనిపించిందో!

అలా....ఒక పక్క నా జాబ్ ప్రిపరేషన్స్లో పడి.....సమయానికి వాళ్లకి అందించలేకపోయినా ఏమి అనుకోకుండా 'మీకు సమయం ఉన్నప్పుడే రాయండి' అని వెన్నుతట్టి ప్రోత్సహించిన ఎడిటర్ గారికి ఇంకోసారి ధన్యవాదాలు.

ఇదిగో నా ఆర్టికల్  మొదటి భాగం :)

బాగుందా?

13, జులై 2011, బుధవారం

జావావ్రతం-ఫలం

జావా వ్రతం!

ఈ వ్రతం చేస్తే...పుణ్యం మాట దేవుడెరుగు....బుర్ర వేడెక్కిన వైనానికి నాకు అత్యంత ప్రీతిపాత్రమైన నీలికురులు....ఎక్కడ వసివాడిపోతాయో అని బెంగపడిపోయాను!

సరి...సరి...వట్టిమాటలు కట్టిపెట్టి ఇక విషయానికి వస్తే...
ఈ వ్రతవిధానంబెట్టిదనిన...

"ఐ హేట్ జావా.....ఐ హేట్ ఇట్ ఎవర్ అండ్ ఎవర్.... 

చెత్త జావా...
డొక్కు జావా....

దీన్ని తీసుకెళ్ళి మూసినదిలో నిమజ్జనం చెయ్య!
దీన్ని ఈఫిల్ టవర్ మీదనించి తోసెయ్య!

అసలు దీన్ని ఏ పదార్ధంతో తయారుచేసారో!! ఒక్క ముక్క అర్ధమయ్యి చావదు!

ఆదివాసిల భాషలాగా.....తాడు,తీగ....గిన్నె....గరిటె....ఛి ఒక పద్ధతి లేదు....పాడు లేదు.."

ఇవి మొన్నటిదాకా నేను జావాని తిట్టుకున్న తిట్లు!

అప్పుడెప్పుడో మొదలు పెట్టా జావా నేర్చుకుందామని! కానీ మధ్యలో ఏవేవో అడ్డొచ్చి..... అలా సాగుతూ ....ఆగుతూ....అలా జరిగింది.

అసలే రాకరాక మొన్ననే వచ్చింది నాకు వర్క్ పర్మిట్! ఇక టైం వృధా చేసుకోవడం ఇష్టంలేక.... కష్టమైనా ఈ జావాని అయిష్టంగానే దిగమింగి..... ఆ జావా కనిపెట్టినవాడ్ని గూగుల్ మేప్లో సర్చ్ చేస్తూ...... ఏదో ఒకరోజు స్కేచ్చేసి చితక్కోట్టేయాలని డిసైడ్ అయ్యా!

చచ్చిపోతున్నా గత పదిహేను రోజులనించి.....ప్రపంచకంలో ఎవడైనా పదిహేనురోజుల్లో జావా,సర్వ్లేట్స్,జే.ఎస్.పీ, స్త్రట్స్,జేడిబిసి,హెచ్.టీ.ఎం.ఎల్,సి.ఎస్స్.ఎస్స్ ఏకకాలంలో నేర్చేసుకున్టారా?
నేను....నేను ఉన్నాను కదా....నేను నేర్చుకున్నాను!

నాకు దండేసి దండం పెట్టేయాలని రోజు అనిపిస్తోంది! 

 పోనీ నా టెక్నాలజిలో జాబ్స్ ట్రై చేద్దామంటే.....అబ్బే....దానికి మిషిగన్లో పెద్దగా మార్కెట్ లేదు...కాలిఫోర్నియాలో బాగుందట! ఇప్పుడు అంత దూరం వెళ్ళలేం కనుక.....బుద్దిగా 'చందూ క్రాష్ కోర్స్' లో జాయిన్ అయ్యి....ఇదిగో పైన చెప్పిన అండపిండ బ్రహ్మండాలన్ని నేర్చేసుకున్నా! 

సరే...తాటిపండు మీద పడ్డ నక్కలాగా ముక్కుతూ...మూలుగుతూ....మా చందూ చేత తిట్లు,చీవాట్లు తింటూ....ఏడుస్తూ....ఏడిపిస్తూ.....రోజు గంటలు గంటలు ఆ జావాలో మునిగి తేలుతూ......ఎలాగో అలా పక్షంరోజుల 'జావా వ్రతం' పూర్తి చేసా!

అంతటితో అయిపోతే....ఆనందమేగా! కానీ ఇక్కడే మొదలయింది టార్చర్!

నా అందమైన 'రెజుమే' ని వజ్రవైఢూర్యములు పొదగబడిన కంఠాభరణములు...రత్నమాణిక్యములు కూర్చబడిన కంకణములు లాగా.....వివిధరకాల టేక్నాలజిలతో నింపి....రకరకాల స్కిల్స్ రంగరించి....ఎన్నో ప్రాజెక్టులు దండగా గుదిగుచ్చి అంగరంగ వైభవంగా తీర్చిదిద్దింది మా ఎంప్లాయరు నారీమణి!!

ఒకానొక సుముహూర్తాన మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది! ఇక రోజూ వెండార్లు కాల్ చేయడం.... సతాయించడం.... కాలిఫొర్నియా.... మేరిలాండ్.... ఫ్లోరిడా.... విస్కాన్సిన్... ఇలా మిషిగన్ తప్ప అన్ని రాష్ట్రాలనించి కాల్స్ వచ్చాయ్!అందరికి ఒకే ముక్క చెప్పేదాన్ని! 'మిషిగన్ సరిహద్దు దాటి...పొరుగు రాష్ట్రంలొ కాలుమోపే ఉద్దేస్యం కూడా లేదు ' అని.  ఇలా కొన్నిరొజులు సాగగా..సాగగా....

నామీద దయతలచి లోకల్ పొజిషన్ ఒకటి చూపించింది మా దేవత!!! చిన్న జాబ్.....ఎక్కవ కష్టం ఉండదు....స్టేట్ గవర్మెంట్ ప్రాజెక్ట్ అంటే....సరే అని గెంతులేసా!

ఇంటర్వ్యు రోజు రానే వచ్చింది! వాడు నన్ను జావాలో ముచ్చటగా మూడే మూడు క్వషేన్లు అడిగాడు....ఓ!  ఎగురుకుంటూ చెప్పేసా! ఇక మొదలెట్టాడు సోది.....అది ఇది అంటూ...డేటాబేస్ ,ఓరెకిల్,డీబీ2 అడగడం మొదలుపెట్టాడు!

"అన్నాయ్! నేను 'జావా' జావా' "అన్నా ఎబ్బే...వినిపించుకోడే!
ఇక సర్లే అని లైట్ తీసుకున్నా! వాడు నన్ను లైట్ తీసుకున్నాడు ;)

నెక్స్ట్

ఇక రెండో ఇంటర్వ్యు!....ఇది చాలా మంచి జాబ్! లాంగ్టర్మ్ ప్రాజెక్ట్! పెద్ద కంపెనీ! ఇక ఇది రాకపోతే వేస్ట్ అని నేను ఫిక్స్ అయిపోయా! 

కానీ మా చందూ.....'ఇక్కడ చాలామందికి ఏడాది దాటినా కానీ రాదు జాబ్! ఒక ఇంటర్వ్యు కే అలా అయిపోతే ఎలా?' అని చాలా సముదాయించి.....బుజ్జగించి...బ్రతిమాలి....బామాలి.....ఎలాగోలా నన్ను ఇంటర్వ్యూ కి  రెడీ చేసాడు!

ఈసారి అన్నీ ప్రిపేర్ అయ్యా! ఎక్కడా చాన్స్ మిస్ అవకూడదు అని ఘాట్టిగా నిర్ణయించుకున్నా!

ఇంటర్వ్యు....సాయంత్రం ఆరింటికి.....నేనే కాల్ చేసా! చేతులు వణుకుతున్నాయి.. 
మెల్లగా ఇంటర్వ్యూ మొదలయింది...

మాట్లాడా....మాట్లాడా.....
కాసేపటికి పూర్తయింది!

రిజల్ట్ నాకు స్పష్టంగా తెలిసిపోతోంది! మాటలు రాట్లేదు....పరిగెత్తుకుంటూ చందూ దగ్గరకెళ్ళి చెప్పేసా! 

'చందూ.........వాడు నన్ను మెచ్చుకున్నాడు చందూ......చాలా మంచి ఫీడ్ బాక్ ఇచ్చాడు....నేను సెలెక్ట్ అయ్యాననే అనుకుంటున్న!' అని చెప్పా!

మరుసటి రోజు సాయంత్రానికి నా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది :) 

సంవత్సరకాలపు నా గృహవాసానికి తెరపడింది! సంవత్సరం క్రితం 'విప్రో' లో వదిలేసిన జాబ్.....తిరిగి వేరే రూపంలో నా దగ్గరకొచ్చింది :) 

ఓపిగ్గా నాకు దగ్గరుండి......ప్రతిదీ విసుక్కోకుండా చెప్పి....నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన చందూ కి............... బోలెడు థాంకులు :)

అలాగే...నామీద నమ్మకం ఉంచి....ఎప్పుడు ప్రోత్సహించే అమ్మకి,నాన్నకి.....నమస్సులు :)

'ఐ హేట్ యు' అని ఎన్నిసార్లు చెప్పినా నామీద ప్రేమ ఏమాత్రం తగ్గక చివరకి నాదగ్గరకే వచ్చి సెటిల్ అయిపోయిన 'జావా' కి ధన్యవాదాలు :)

అన్నిటిని మించి....కొండంత అండగా నిలబడి నన్ను కంటికిరెప్పలా చూసుకునే మా కిట్టుగాడికి బోలెడు ముద్దులు :) 
అదండీ....అష్టకష్టాలు పడి నిష్ఠగా చేసిన జావావ్రతానికి తగిన ఫలం లభించింది :) 

20, జూన్ 2011, సోమవారం

పుష్పక విమానం!

'నీకు బాగా నచ్చిన సినిమా ఏది?' అని ఎవరైనా నన్ను అడిగితే....మహేష్ బాబు ఫ్యాను/ఏసి కాబట్టి ఠక్కున 'అతడు' అని చెప్పేసినా..... మనసులో అప్పటికే బోలెడు సినిమాలు క్యు లో నిల్చుని ఉంటాయ్! నా పేరు చెప్పలేదే....నా పేరు చెప్పలేదే... అని అలా గింజుకునే సినిమాల్లో..... 'సిరివెన్నెల'.... 'స్వర్ణకమలం'...... 'ఆహా నా పెళ్ళంట'.... 'చంటబ్బాయ్'....  'పుష్పక విమానం' ..... 'గీతాంజలి'...... "అభినందన' ..... 'ఆనంద్' ... 'గోదావరి' ........ఇలా లిస్టు చైనా గోడలా సాగుతూనే ఉంటుంది ;) 

పైన చెప్పిన సినిమాలన్నీ నా గుండె గదిలో కుర్చీలేసుకుని  కూర్చుని  పాప్ కార్న్ తింటూ... కూల్ డ్రింక్ తాగుతూ..... నానా హంగామా చేస్తున్నా.....ఒక మూగ సినిమా మాత్రం తన మౌనంతోనే  నన్నాకట్టుకుంది!

అదే 'పుష్పక విమానం' :)

ఈ సినిమా అంటే ఎందుకో ప్రత్యేకమైన అభిమానం!! కాని...కాలగమనంలో.....మన మెమొరి 'క్యు'లో అట్టడుగుకి చేరిపోయింది!!

మొన్న చెవులకి రింగ్స్ పెట్టుకుంటూ అద్దంలో చూసుకుంటుంటే.... పుష్పక విమానంలో అమల గుర్తొచ్చి..... పెదవుల పై చిన్న చిరునవ్వొచ్చి...ఆనక ఈ సినిమా చూసి ఎన్నేళ్ళయిపోయిందో అని గుర్తొచ్చి........... వెంటనే హాల్లోకొచ్చి ..... అప్పటికే మరమరాలలో ఉప్పు+కారం+ఉల్లిపాయలు+నెయ్యి వేసుకుని తింటూ 'సి.ఐ.డి' అనే డొక్కులో టీవి షో చూస్తున్న మా చందు దగ్గర  లాప్టాప్ సర్రున లాక్కుని  తుర్రున పారిపోయా!

ఆ తరువాత వెంటనే 'యుట్యుబ్' అన్నాయ్  దగ్గరకెళ్ళి టక్..టక్..మని తలుపు తట్టి  అడిగా!
'అన్నాయ్....అన్నాయ్....ఈ సినిమా వేసిపెట్టవూ!!' అని. 
అలా అడిగి అడగగానే...ఇలా లింకిచ్చేసాడు మా 'యుట్యుబ్' అన్నాయ్! హెంత మంచోడో :))

ఏంటి అక్కడెవరో గొణుక్కుంటున్నారు విషయం తేల్చమని??? వస్తున్నా.....అక్కడికే వస్తున్నా.....

పుష్పక విమానం....

సినిమాకి డైలాగు కన్నా నటన ముఖ్యం అని చెప్పిన సినిమా!

మెలికెలు తిరిగే డాన్సులు...డ్యుయెట్ల కన్నా.....చక్కని సంగీతంలో పదాలు అవసరంలేని పాటలు కూడా ఉంటాయని తేల్చిన సినిమా!

కామెడి కావాలంటే......ఏదో ఒక డైలాగ్ కావాలి....లేదా ఎవరినో ఒకడిని బకరాగా చూపెట్టాలి అనే అవసరం లేదని చెప్పిన సినిమా!

ఇక విషయానికి వస్తే..........ఒక నిరుద్యోగి....తెలివితేటలున్నా.....ఉద్యోగం రాక అలమటిస్తుంటే.....అదే సమయంలో ఒక ధనికుడు భార్యమీద కోపంతో ఒక విలాసవంతమైన హోటల్లో దిగుతాడు! ఈ నిరుద్యోగికి ఆ భోగి అనుకోని పరిస్థితుల్లో తారసపడడం..... పాత్రలు తారుమారవడం...... చాకచక్యంగా ఆ హోటల్లో ప్రవేశించి.......ఆ ధనికుడి డబ్బుతో విలాసంగా గడపడం.....ఈ క్రమంలోనే అదే హోటల్లో ఉండే అమ్మాయితో ప్రేమలో పడడం.....చివరకు డబ్బు 'శాశ్వతం కాదు' అనే సత్యాన్ని తెలుసుకుని ఆ పాత్రని చాలించి......తన తప్పుని ప్రేమించిన అమ్మాయికి నిజాయితీగా చెప్పి.....ఆ ధనికుడిని యధాస్థానంకి చేర్చి.....అతడికి జరిగింది చెప్పి క్షమార్పణ కోరి.... మళ్లీ తన మామూలు పేద,నిరుద్యోగ జీవితాన్ని సగర్వంగా స్వీకరించి భవిష్యత్తులోకి ఆత్మవిశ్వాసంతో అడుగేయడం.....ఇది సూక్ష్మంగా కథ!

ఇందులోనే చిటికెడు రొమాన్స్.... కాస్తంత సస్పెన్స్ సరంజామా..... కూసింత హాస్యపు రెబ్బలు...... వేసి.... మంచి ఘాటుగా పోపు పెట్టాడు సింగీతం!

సినిమా మొదలుపెట్టేటప్పుడు హీరో ఏ మెట్టు మీద ఉంటాడో....చివరికి అదే మెట్టుమీద ఉంటాడు..........మధ్యలో ఎన్ని మెట్లు ఎక్కినా! :))

ఇందులో కమల్ నటన బాగుందా? అమల అభినయం బాగుందా? సింగీతం డైరెక్షన్ బాగుందా? సన్నివేశాలకి తగ్గట్టు   వైద్యనాధన్ కూర్చిన సంగీతం బాగుందా అంటే.... జవాబు చెప్పలేమేమో!!

భారి సెట్టింగులు అవసరం లేకుండా.....అమెరికా/ఆస్ట్రేలియా బాక్ డ్రాప్ లేకుండా....కేవలం ఒక హోటల్ గది.....ఒక బీద నిరుద్యోగి గది మాత్రమె ఆసరాగా చేసుకుని ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథనం అనితర సాధ్యం!

ఇందులో నిరుద్యోగి ఆకలి మంట,తపన....అలాగే డబ్బున్నోళ్ళ విలాసం,వైభోగం....రెండు భిన్న ధృవాలైనా ఒకే చట్రంలో భలే ఇరికించేసాడు దర్శక మాంత్రికుడు!

ఆశ,ఆకలి మనిషి చేత ఏ పనికైనా ఒడిగట్టిస్తాయని  చెప్పడానికి ఈ సినిమాకంటే ఉత్తమ ఉదాహరణ ఉండదేమో!!

నేషనల్ అవార్డ్ వరించిన ఈ సినిమా ఒక క్లాసిక్! ఏ భాషా అవసరంలేకుండా చక్కటి సందేశాన్ని నేరుగా గుండెల్లోకి మోసుకొచ్చే 'పుష్పక విమానం'.......... 

ఈ సినిమా చూస్తున్నంతసేపు మాటల్లేవు కాని....ఏదో తెలియని ఫీలింగ్....గుండెల్లోనించి!! సినిమా చివర్లో గులాబీ ముల్లులా కసక్కున గుచ్చుకున్నా..... సమంజసమేకదా అని మనసుకి సర్దిచెప్పాల్సివచ్చింది! :))


13, జూన్ 2011, సోమవారం

'శ్రావణమేఘం' కోసం.....!!



శైలాబాల గారిని చూసి....చేతులు కొంచెం దురద పుట్టి.....'ఇదేదో భలే ఉందే...మనమూ ట్రై చేస్తే పోలే!' అనుకుని చేశా! శైలాగారి అంత అందంగా కాకపోయినా....ఏదో నా రేంజ్ అన్నమాట ;) 

శైలా గారు...మీ శిష్యురాలి పనితనం నచ్చినట్లయితే......కామెంటు పెట్టి జై కొట్టుము ;)

మనలోమనమాట.....ఈ కవిత మాత్రం నాదేనండోయ్! ఇది కూడా కాపీ అనుకునేరు! అర్ధం చేసుకోరూ! :))

7, జూన్ 2011, మంగళవారం

స్మొకీస్ వెళదామా?

స్మోకీస్...
అందమైన మబ్బుల మేలిముసుగు కప్పుకున్న పర్వతశ్రేణులు! 
కనుచూపుమేరా...నీలిరంగులో కనువిందు చేస్తూ.......అప్పుడప్పుడు మేఘాల్ని ఒడిసిపట్టుకుని తమలో దాచేసుకుంటూ...ఆటలు ఆడుకునే అందాల 'పొగ పర్వతాలు' ;)

ఈ స్మోకీస్ కి మొన్న మెమోరియల్ డే లాంగ్ వీకెండ్ కి వెళ్ళాము....మరి మీరు నాతో వస్తారా?? అలా అలా స్మోకీస్ మొత్తం మీతో చక్కర్లు కొట్టించి తీసుకోచ్చేస్తాలే!! :)

నేను ఉండేది మిషిగన్ కాబట్టి...అక్కడనించి మన ప్రయాణం మొదలు పెట్టేద్దాం :)

సరే...స్టార్ట్!

రయ్య్య్యి ........రయ్య్యి....రయ్య్యి!....

తొమ్మిది గంటల ప్రయాణం....బోర్ కొట్టకూడదు కదా! అంటే నేను నాన్-స్టాప్ గా వాగుతూనే ఉంటాననుకో.....కాని నాకు తోడూ ఉండాలిగా....సరే మరి పాటలు పెట్టుకుందాం :)

'మేఘాలలో.....తేలిపోమ్మన్నది..
తూఫానులా రేగిపోమ్మన్నది.....'

ఆహా! సూపర్ పాట! అలా వింటూ ఉండండి....అదే స్పీడులో మనం దూసుకుపోదాం :) 

అదిగో....ఒహాయో వచ్చేసింది.....ఇదిగో స్టార్బక్స్ .....కాఫీ తాగేద్దామా?? నాకైతే 'చాయ్ లాటే' మరి మీకు? 

ఈ చాయ్ లాటే ఒక సిప్ వేసి.......అందులోకి కరకరలాడే మినప చక్రాలు తింటుంటే....ఆహా! సూపరు!

ఒక్కసారి అటు చూడండి....'సిన్సినాటి' డౌన్టౌన్ అది. బిల్డింగ్స్ అల్టిమేట్ ఉన్నాయ్ కదా!! ఆ బ్రిడ్జి ఎక్కుతూ చూస్తె...ఇంకా బాగుంటుంది :) సూపర్ ఉంది కదా 'సిన్సినాటి' :)

అర్రే! అంతలోకే 'కెంటకి' కూడా వచ్చేసామా? వావ్! ఇక్కడ గుర్రాలు ఫేమస్ అట తెల్సా? కిటికీలోనించి అలా చూస్తూ ఉండండి....బోలెడు 'హార్స్ స్టేబుల్స్' కనిపిస్తాయ్! ఇంకా బోలెడు గుర్రాలు గడ్డి మేస్తూ....తోకలు ఊపుతూ మనకి టాటా కూడా చెబుతాయ్!!  :))

ఆ! గుర్రాలు చూసేసారా? సరే మరి....నెక్స్ట్ వచ్చేది 'టేనేస్సీ'....ఈ టేనేస్సి లోనే ఉండేది...'ది గ్రేట్ స్మోకి మౌంటైన్స్' :)

అబ్బ! కనుచూపుమేరా....కొండలే! పచ్చటి కొండలు.....ఈగలు కూడా దూరలేనంత చిక్కటి అడవులు.....పిన్ను పడితే తీసుకోగలిగేంత స్వచ్చమైన నదులు....ఆహా! ఏమి అందాలు....ఈ కొండల మధ్య ఇంత పెద్దపెద్ద రోడ్లు ఎలా వేసారో! 

హా! ఈ కొండల్ని చూస్తేనే కడుపు నిండిపోతోంది....సరే మరి కాస్త ఆకలేస్తుందేమో...టాకోబెల్ కి వెళ్లి రెండు చలుపాలు లాగించేద్దాం పదండి!

భలే ఉన్నాయ్  కదా...చలుపాలు!! సరే ఇక ఎక్కడా ఆగోద్దులే....ఇస్త్రెట్ గా 'స్మోకీస్' కి వెల్లిపోదాం :)

రయ్యి! రయ్యయ్య్యి! రయ్యయ్య్య్యి !!

అదీ....'పీజియన్ ఫోర్జ్' కి వచ్చేసాం! ఇక్కడికి దగ్గరలో 'గాట్లిన్ బర్గ్' దగ్గరే మన 'పొగ పర్వతాలు' మొదలవుతాయ్ అన్నమాట :) సరే! ఇవాల్టికి ఇక్కడతో రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్నే బయలుదేరుదాం :)  సరేనా! 

ఆ కొండ అంచున అందమైన చెక్క ఇళ్ళు చూసారా? అవే 'క్యాబిన్స్' అక్కడే మనం ఉండేది :) చిక్కని అడవిలో....కొండ అంచున చక్కని చెక్క ఇల్లు :) బాగుంది కదా! సరే రేపు పొద్దున్న తొందరగా లేవాలి కదా! ఇవాల్టికి ఇక రెస్ట్!

డే-1

హా! అందరు కాఫీలు,టిఫినీలు చేసేసి రండి....మనం ముందు 'పీజియన్ ఫోర్జ్' నదిలో రాఫ్టింగ్ కి వెళ్దాం :) నది పెద్ద లోతు లేదులే...కంగారు పడొద్దు!!

ఇదే 'పీజియన్ ఫోర్జ్' నది. మనం రాఫ్టింగ్ చేసేది ఇక్కడే! రండి మన 'రైడ్ గైడ్' తో వెళ్దాం :) అదిగో ఆ లైఫ్ జాకెట్ వేసుకుని....ఇదిగో ఈ 'ఓర్స్' (తెడ్లు) తీసుకుని పదండి ముందుకు....పదండి తోసుకు మనం నడిపే బోటు దగ్గరకు!!

'హైలెస్సా! హైలెస్సా.....హైలెస్సా...ఓఓ....నీలాల కనుల్లో సంద్రమే...నింగి నీలమంతా సంద్రమే....హైలెస్సో....ఓఓ..హైలెస్స!'

భలే ఉంది కదా....అబ్బ....ఈ నీరెండలో....ఈ చల్లటి గాలిలో..... అడవుల మధ్య మెలికెలు తిరుగుతూ సాగిపోతోన్న నదిలో..... మనం అందరం కలిసి ఈ బోటు నడుపుతూ ఉంటె.... అది ఈ నదిమీద అలా అలా తేలిపోతుంటే.... ఆహా!!..ఇంకో పాట కూడా గుర్తోచ్చేస్తోంది!

'లాహిరి...లాహిరి...లాహిరిలో....ఓహో జగమే ఊగెనుగా...సాగేనుగా....ఆఆ....ఆ....ఆఆ....ఆ....'

హ్మ్! ఇలా నడుపుతూ ఉంటె సమయమే తెలీదు...కాని మనం బోలెడు చూడాలి కదా.... :) ఇక ఈ లాహిరి...లాహిరి ఇంతటితో ఆపేసి....వెళ్లి కడుపుకి ఏదన్నా కాస్త దాణా వేసి ఇక బయలుదేరుదాం! ఓహో! ఫోటోలు కావాలా? సరే అలాగే తీసుకోండి...నేను రెస్టారెంట్లో ఆర్డర్ చెబుతూ ఉంటా :)

ఆ! అందరికి ఆర్డర్ ఇచ్చేసా :) రండి.తొందరగా తినేస్తే....మీకు ఇప్పుడు సూపర్ ప్లేస్ చూపిస్తా :)

సరే అందరిది తినడం అయిపొయింది కదా! ఇప్పుడు మనం వెళ్ళబోయేది 'క్లింగ్మెన్స్ డోం' .ఇది స్మోకి మౌన్టేయిన్స్ లో హయ్యెస్ట్ పీక్! ఇక్కడ నించి చూస్తె.....ఈ పొగ పర్వతాల్లోకి దిగిపోయే సూర్యుడు ఎంత అందంగా కనిపిస్తాడో మీరే చూడండి!

ఇదిగో...గాట్లింబర్గ్! ఇది స్మోకీస్ కి పర్వతపాదం అన్నమాట :) ఇక్కడ చిన్న డౌన్టౌన్ కూడా ఉంది....చూసారా! ఇక్కడ బోలెడు ఆక్టివిటీస్ ఉంటాయ్ :) పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు! పిల్లలాగే ఎంజాయ్ చేసే పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది ఇది! మనం రేపు ఇక్కడ 'ట్రాం వే' ఎక్కుదాంలె! సరేనా?!

ఇక ఇక్కడినించి అంతా అడవే! అలాంటి ఇలాంటి అడవి కాదు...పెద్దపెద్ద చెట్లతో.....లోతైన లోయలతో....ఎత్తైన శిఖరాలతో......దారిపక్కనే విరబూసే 'సమ్మర్ ఫ్లవర్స్' తో......ఎక్కడపడితే అక్కడ గలగలమని పారే నదీజలాలతొ అలరారే అద్భుత కీకారణ్యం :) 

అలా వెళుతూ...ఉంటె....వెళుతూనే ఉంటె......చాలా దూరం కొండలు ఎక్కుతూ ఉంటె.....అప్పుడు వస్తుంది ఎత్తైన పర్వత శిఖరం.....'క్లింగ్మెన్స్ డోం' . చుట్టూ కొండలు చూసారా? ఊరికే కూర్చుంటే కాదు....అలా దూరంగా కనిపిస్తోన్న నీలగిరుల్ని చూడండి! ఆ పర్వతసానువుల్లో సాగుతున్న సెలయేర్లని చూడండి....ఆ అడవి బాట వెంబడి విరబూస్తున్న 'అడవి' పువ్వుల అందాల్ని ఆస్వాదించండి!! వయ్యారంగా ఒంపులు తిరుగుతోన్న మెలికల దారులని చూడండి!!

అరె...మాటల్లోనే వచ్చేసింది! చూసారా? ఇదే 'క్లింగ్మెన్స్ డోం' ఎంత బాగుందో కదా! నేను చెప్పలేదు? అలా చూడండి....పర్వతాలన్ని మబ్బుల  ముసుగేసుకుని బజ్జున్నట్టు లేదు?! నీలిరంగు తప్ప మీకు ఏమన్నా కనిపిస్తోందా? వీటికి 'నీలగిరిస్' అని మనం నామకరణం చేసేద్దామా?! ;) అంత బాగున్నాయ్ కదా! హిమాలయాలని చూసి పరవశించిన కాళిదాసుని ఇక్కడ కూర్చోబెడితే.....పెద్ద కావ్యమే రాసేస్తాడేమో !! :)

ఇంతలోనే ఈ మబ్బులు ఎక్కడినించి వచ్చాయి?? మనమీదకి వచ్చేస్తున్నాయ్!! మబ్బులలోకంలో విహరిస్తున్నట్టు లేదు! హేయ్...ఈ మబ్బు చూడండి.....మన మీదగుండా వెళుతోంది.....వావ్! దూదిపింజేలా ఎలా చేతిలోంచి జారిపోతోంది! అర్రే! మనల్ని చుట్టుముట్టేస్తోంది.....హ్హహ్హ! భలే ఉందికదా! 

అదిగో సూర్యుడు! హబ్బ ఇప్పుడు కనిపించాడు.....పదండి సూర్యుడు మబ్బులో దిగే దృశ్యం చూద్దాం! ఇక్కడినించి ఒక మైలున్నర  కొండమీదకి 'ట్రెక్కింగ్' చేయాలి మరి! ఇక్కడ ఎలుగుబంట్లు ఎక్కువ! మీకు ఎక్కడైనా ఎలుగు కనిపిస్తే.....అరవొద్దు....దాన్ని చూడనట్టు వచ్చేయండి సరేనా?

లెఫ్ట్-రైట్.....లెఫ్ట్-రైట్...లెఫ్ట్-రైట్....

దేవుడా! ఆయాసమోచ్చేస్తోంది...కాని లేట్ అయితే మళ్లీ సూర్యాస్తమయం అయిపోతే ఇంతా పడ్డ శ్రమ వృధా! హ్మ్! 

లెఫ్ట్..........రైట్..........లెఫ్ట్............రైట్.............

హా! కొంచెం మంచినీళ్ళుంటే ఇస్తారా? దాహం వేస్తోంది.....కొండ ఎక్కి వచ్చేసరికి! హుహ్!!

అబ్బ! ఆ దృశ్యం చూడండి.....ఇప్పుడు నీలానికి కెంజాయ రంగు తోడయింది! సూర్యుడు పర్వతాలకి ఎరుపు రంగు పులిమేస్తున్నాడు! వావ్! ఎంత బాగుందో..అసలు అలలుఅలలుగా ఈ పర్వతాలు అంతే లేకుండా ఉన్నాయేంటబ్బా? కొండలన్నీ పొగలో ఉన్నట్టు ఉన్నాయ్! అందుకే 'స్మోకీస్' అంటారు కాబోలు! ఎవరు పెట్టారో....కరెక్ట్ పేరు పెట్టారు వీటికి :) కాని ఇవి నీలంగా ఉన్నాయ్ కాబట్టి....'నీలపోగపర్వతములు' అని మనం పెట్టేద్దాం ;)

సూర్యుడు కొండల్లోకి దిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు!! ఇక రాత్రికి సన్నని మంచు దుప్పటి పరుచుకుంటుందేమో ఈ ప్రాంతమంతా! వావ్! అప్పుడు ఇంకా ముద్దుగా ఉంటాయేమో ఈ పర్వతాలు!! హ్మ్!! ఎంత అందమైన అనుభూతో కదా!

సరే ఇక కిందకి వెళ్దాం పదండి.......లెఫ్ట్-రైట్...లెఫ్ట్-రైట్...లెఫ్ట్-రైట్....

అరె....అక్కడేంటి నల్లగా కదులుతోంది.....హేయ్....అది ఎలుగుబంటి పిల్ల :)) హుర్రే!! మనం ఎలుగు పిల్లని చూసాం :) అమ్మో! పిల్ల ఎలుగు ఉంది అంటే...ఖచ్చితంగా తల్లి ఎలుగు దగ్గరలోనే ఉంటుంది.... బాబోయ్.... అసలే పెప్పర్ స్ప్రే కూడా లేదు....పదండి...ఆ పిల్ల ఎలుగుకి టాటా చెప్పి....మన కాళ్ళకి పని చెబుదాం!

హమ్మయ్య! కిందకి వచ్చేసాం :) ఇక ఎక్కడన్నా తినేసి....సరాసరి మన చెక్కగృహమునకు వెళ్దాము :)) అందరు చక్కగా నిదరోయి....పొద్దునే లేచి రెడి అవ్వండి :) 

డే-2

పొద్దున అంటే....పది గంటలకా?? ఇలా అయితే ఎలా? ఎన్ని చూడాలి మనం!! హ్మ్! సర్లే....ఏంచేస్తాం!

ఈరోజు మనం స్మోకీస్లో ఉండే దట్టమైన అడవుల్లో జంతువులని చూడటానికి వెళ్తాం :) ఇక్కడ మన దేశంలోలాగా.... పులులు,ఏనుగులు ఉండవు కాని....ఎలుగులు,జింకలు,రాకూన్లు,ఇంకా బుల్లిబుల్లి జంతువులు ఉంటాయట! చూద్దాం మనకి ఎన్ని కనపడతాయో! :) తెల్సా....స్మోకీస్ 'నల్ల ఎలుగుబంటి'కి పెట్టింది పేరు :) అమెరికాలో ఎక్కువగా నల్ల ఎలుగులు ఉండే ప్రాంతం ఇదే!! :) 

మళ్లీ గాట్లింబర్గ్ నగరసందర్సన చేసుకుని.....అడవుల్లోకి వెళ్దాం పదండి :) ఆ గుర్రాలను చూసారా? మనల్ని వాటిమీద అడవుల్లో షికారుకి కూడా తీసుకెళతారు! ఎవరికన్నా వెళ్లాలనిపిస్తే.....మీ ఇష్టం :) అడవిలో గుర్రం మీద స్వారి చేస్తూ.... 'కొండవీటి దొంగ' లాగా ఫీల్ అయిపోండి కాసేపు ;)

సరే...ఇంకాస్త ముందుకి వెళితే....'కేడ్స్ కోవ్' లూప్ వస్తుంది! అంటే....ఒకసారి అందులోకి వెళితే....ఇక అదే దారిలో ముందుకి వెళ్ళాలి...వెనక్కి రావడానికి ఉండదు :) ఆ లూప్ చుట్టేస్తేనే బైటికి వస్తాం :) ఈమధ్యలో మనకి జంతువులు కనిపిస్తాయన్నమాట! అందరు కార్ విండోస్లో తలలు పెట్టి(బయటకి కాదు...) కళ్ళు అప్పగించి....వీలయితే కొంచెం పెద్దవి చేసి...జంతువుల కోసం చూడండి :))  

ర..యి..యయి....ర...యి...యి...యయి....[అంటే...అంత మెల్లగా వెళుతోంది ట్రాఫిక్ అని అర్ధం! అర్ధం చేసుకోరు!! ;) ]

హబ్బ! ఇలా పదకొండు మైళ్ళు వెళ్ళాలా? హ్మ్! ఈ జంతువులేవి? అన్ని కట్టకట్టుకుని ఎక్కడికేల్లిపోయాయి? మనం వస్తున్నాం కదా! కొంచెం రావోచ్చుగా! ;)

అక్కడ దూరంగా కొంచెం నల్లగా ఏదో కనపడుతోంది..ఎంటబ్బ? ఆగు నా బైనాక్యులర్స్ తో చూస్తాను!! హేయ్...అది మమ్మా బేర్....విత్ టూ బేబి బేర్స్...........కేవ్వ్వ్వవ్!! మనకి పిల్లలతోసహా తల్లిఎలుగుబంటి కనిపించిన్దోచ్! కేవ్వ్వ్!!
(ఎలుగుబంటి కోసం పక్క ఫోటోలో కళ్ళు చికిలించి చూడుము)

అరె...ఇటు పక్కకి చూడండి....తెల్లతోక జింకలు....హేయ్...అవి మన దగ్గరికి వస్తున్నాయ్! వావ్....భలే ఉన్నాయ్ కదా! :) మనకి జింకలు కూడా కనిపించాయోచ్చ్! అసలు మనం కేక :) అడవుల్లో స్వేచ్చగా ఉండే జంతువులని చూస్తె....భలే ఉంటుంది కదా! జూలో పెట్టినవి ఏదో కోల్పోయినట్టు ఉంటాయి...కాని ఇక్కడ అలా కాదు....ఎంత ఉత్సాహంగా....ఉల్లాసంగా ఉంటాయో!

హా...ఇవాల్టికి ఇది చాల్లే! :) సరే....అదిగో లూప్ అయిపోవస్తోంది! బాబోయ్.....రెండు గంటలా మనం లూప్ లోకి వెళ్లి వచ్చేసరికి? అసలు టైం తెలీలేదు కదా! :) 

సరే! ఇక బాక్ టూ గాట్లింబర్గ్! అక్కడ డిసైడ్ అవుదాం....నెక్స్ట్ హాల్ట్ ఏంటో! 

ఎంత మెత్తగా సాగిపోతోంది కారు ఈ మెలికెల రోడ్లమీద! మన పక్కనే నది కూడా వస్తోంది చూసారా? ఎక్కువ లోతు లేదు మరి నదిలోకి దిగి సరదాగా నీళ్ళతో ఆడుకుందామా? ఐతే రండి...ఆ పార్కింగ్ లాట్లో కారు పెట్టి....మనం నదిలోకి దిగుదాం :)

జాగ్రత్తగా దిగండి....ఈ రాళ్ళు బాగా పాచిపట్టి ఉన్నాయ్! జారిపోతాం! 

ఆ.....అందరు దిగేసారా! అదిగో...నదిమధ్యలో ఆ రాయి ఉంది చూసారా? దాన్ని తాకి మళ్లీ ఇక్కడికి వచ్చేయాలి :) అది ఆట! ఎవరు ముందు వస్తే...వాళ్ళు విన్నర్! :))

జింగ్...జింగ్....జింగ్...జింగ్....అర్రే.....బాగా జారుతున్నాయ్ రాళ్ళు! బాబోయ్! హ్హహ్హ...చేపలు కూడా ఉన్నాయ్...భలే భలే :))) 

వామ్మో! నదిమధ్యలో బానే లోతు ఉంది :( మోకాళ్ళ దాకా వచ్చేసాయ్ నీళ్ళు! ఆ రాయిదగ్గర లోతు ఎక్కువేమో....ఎవరు వెళ్ళోద్దులే !! ఇక్కడివరకు చాలు :) ఇక్కడే ఒకళ్ళమీద ఒక్కళ్ళు నీళ్ళు కొట్టుకుందాం... కమాన్! ;) 

టిచిక్.....టిచిక్......టిష్...టిష్....టిచిక్....టిచిక్....

హ్హహ్హ :)) భలే ఉంది కదా....ఈ ఆట :) అందరం తడిసిపోయాం :)) సరే మరి కాసిని ఫుటోలు తీసేసుకుని ఇక వెళ్దాం. ఆత్మసీత గోల పెడుతోంది....'అన్నమో రామచంద్రా' అని :)

చలో.....గాట్లిన్ బర్గ్! అదిగో సబ్వే....ఇదిగో పిజ్జాహట్....మీ ఇష్టం :) 

హమ్మయ్య! ఇప్పుడు కళ్ళు కనిపించింగ్ :) సరే....ఇక 'ట్రాం వే' ఎక్కుదామా? పదండి మరి 'ఒబెర్ గాట్లిన్ బర్గ్' కి :)

టికెట్స్ తీసేసుకున్నా మీ అందరికి.ఇక ట్రాం వస్తే ఎక్కేయడమే.....ఇది రోప్ వే అన్నమాట :) ఇప్పుడు మనం ఆ కనిపిస్తున్న'పెద్ద' కొండమీదకి ఈ ట్రాంలో గాల్లో తేలుకుంటూ వెళ్తాం :)

అదిగో....వచ్చేసింది....తొందరగా ఎక్కేసి....ఆ పెద్దకిటికీ పక్కన ప్లేస్ కొట్టేయండి అందరు :) 

హమ్మయ్య అందరికి కిటికీ దొరికింది...ఇప్పుడు చూడండి ఈ ట్రాంలో....గాట్లిబర్గ్ డౌన్ టౌన్ చుట్టూ పరుచుకుని ఉన్న స్మోకీస్ అందాలు ఈ ఎర్రటి ఎండలో :))

ఎండ బాగా ఉన్నా....ట్రాంలో చల్లని గాలి వస్తోంది కదా! మరి అంతా అడవులు!! పచ్చదనంతో పాటే చల్లదనం :) అందుకే అన్నారు.....'వృక్షో రక్షతి రక్షితః' అని :) భలే ఉందికదా....రెండు రెక్కలు కట్టుకుని ఆకాసంలో ఎగరాలన్న నా కోరిక ఇలా తీరింది అన్నమాట :) మీకు అలాగే ఉందా?

'గాల్లో తేలినట్టుందే......గుండె పేలినట్టుందే.....' పాట గుర్తొస్తోంది నాకు :))

హ్మ్! వచ్చేసాం! ఇక్కడ కొన్ని ఎలుగుల్ని పెంచుతున్నారట! వెళ్లి అవి చూసి వద్దాం పదండి :) 

అవిగో....నల్ల ఎలుగుబంట్లు.....అబ్బ ఎంత బలిష్టంగా ఉన్నాయో! తెలుసా....ఇవి పూర్తీ శాఖాహారులట! వీటికి గింజలు,ఆకులు,పళ్ళుదుంపలు,కూరగాయలు మాత్రమె పెడతారట :) కాని నిగనిగలాడుతూ ఎంత బాగున్నాయో! :) కొన్ని బుజ్జిగా  బజ్జోని నిద్రోతున్నాయ్ :)))) 

సరే....ఇక్కడ అందరు సావేనీర్లు కావాలంటే కొనుక్కుని బయలుదేరండి :) మీకు 'పీజియన్ ఫోర్జ్' లో తిరగబడిన ఇల్లు,టైటానిక్ షిప్పు చూపిస్తా :))

హ్మ్! అందరు....బై బై స్మోకీస్ అని చెప్పండి!! ఇదే ఇక లాస్ట్ హాల్ట్ స్మోకీస్లో! ఇక మనం స్మోకీస్ వదిలి వెళ్ళిపోతున్నాంగా! :( 

బై బై స్మోకీస్!

సరే.....పదండి గాట్లిన్ బర్గ్ వదిలి పీజియన్ ఫోర్జ్ కి మన ప్రయాణం!

ఆ అదిగో....తిరగబడిన ఇల్లు :) 'వండర్ హౌస్'....దానిపక్కనే పెద్ద 'టైటానిక్ షిప్' :) మీకు కావాలంటే టైటానిక్ పోస్ పెట్టి ఫోటోలు దిగొచ్చు :)))

సరే మరి! రేపు పొద్దున్న మన తిరుగుప్రయాణం....బాక్ టూ మిషిగన్ :(:)

పొద్దున్నే తొందరగా లేస్తే.....దగ్గరలో 'ఫర్బిడెన్ కావేర్న్స్' చూపిస్తా :)

డే-౩

హ్మ్! అందరు రెడి కదా.....పదండి ఇక్కడికి దగ్గరే....ఈ 'ఫర్బిడెన్ కావేర్స్' 

ఇవి సున్నపు రాయి గుహలు....ఈ గుహలలో నది కూడా ఉంది తెల్సా! ఈ నదిలో నీటి వల్ల ఈ సున్నపురాళ్ళు వివిధ రూపాలు సంతరించుకున్నాయి....ఇంకా కొత్తకొత్త రూపాలు సంతరించుకుంటునే ఉన్నాయి :) 

సరే....అందరు జాగ్రత్తగా నడుస్తూ....ఈ గుహలు చూద్దాం పదండి :) ఈ గుహలలో ఇదివరకు రెడ్ ఇండియన్స్ (ట్రైబల్స్) ఉండేవారట! వాళ్ళు రకరకాల వస్తువుల తయారి కోసం ఈ గుహలు ఉపయోగించేవారట! ఈ గుహల కింద ఒక నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది :)

అదిగో మనకి కనిపించే....ఆ నది చూసారా....ఇది ఇంకో నది :) ఇలాంటి బోలెడు నదుల నీటి రాపిడి వల్ల ఈ గుహలలో ఇన్ని రూపాలు రూపొందాయి! డైనోసార్.....గాద్జిల్లా.....మనిషి కాళ్ళు.....పెద్ద ముక్కు.....రెక్కల వరాహం....చంద్రమండలం ఇలా బోలెడు :)) భలే చల్లగా ఉంది కదా ఈ గుహలో....నేచురల్ ఏసి :)))

సరే మరి! ఇక ఇంటికి వెళదామా? 

హ్మ్!మన స్మోకీస్ ట్రిప్ అయిపొయింది! హుష్ కాకి!

ఇక మనం ఇంటిదారి పట్టాలి! మీ అందరికి స్మోకీస్ నచ్చింది కదా! నాకైతే భలే నచ్చేసింది :)

సరే....ఐతే....అందరికి టాటా-బిర్లా :) 

ఇంకో టపాతో మళ్లీ కలుద్దాం :) అంతవరకూ చూస్తూనే ఉండండి 'వెన్నెల సంతకం'




అన్ని ఫొటోస్ చూడాలనుకుంటే....పైన పిక్ మీద క్లిక్ చేయండి.....పండగ చేస్కొండి :)