2, అక్టోబర్ 2010, శనివారం

చిరు జల్లులు....

పొద్దున నించి ముసురు పట్టింది..సన్నగా వర్షం పడుతోంది...
అదేదో పార్క్ లో 'ఫాల్ ఫెస్ట్' ఉంది...వెళ్దాం అనుకున్నాం....కానీ ఈ వర్షం దెబ్బకి ఇంట్లోనే ఉండిపోయాం....
ఒక చినుకు..అర చినుకు...అలా కురుస్తూనే ఉంది కానీ కాసేపైన రెస్ట్ తీసుకుని మమ్మల్ని కనికరించోచ్చుగా!!
గాలి బాగా వీస్తోందేమో  చెట్లు దయ్యాల్లా ఊగుతున్నాయ్....మా ఇంటి ఎదురు ఉన్న చెట్టు ఊగటమే కాక ఆకులు కూడా తెగ  రాలుస్తోంది...
నాకేమో బైటికెళ్ళి అలా అలా తిరగాలనుంది....కానీ ఆ చలికి తట్టుకోలేము వద్దు అని చందు వాదన :(
నిజమే కాబోలు  పొద్దునించి అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియా లో ఒక్క కార్ కూడా కదలలేదు....
అసలు వర్షం వస్తే ఇంట్లో కూర్చుని ఉండటం ఎంత కష్టమో నాకు....ఎప్పుడెప్పుడు బైటికెళ్ళి తడుద్దామా అనే!!కానీ జలుబు...అదీ ఇది అని ఏవేవో వంకలు చెప్తారు అందరూ....నాకేమో చిరాకు.... 
హ్మ్....ఇక చేసేదేమీ లేక కిటికీ లోనించి అలా వర్షాన్ని చూస్తూ ఆనందిస్తున్నా...అలా చూస్తూ ఉంటే ఏదన్నా కవిత రాయాలనిపించింది...కానీ ఏమి రాయబుద్ది కావట్లేదు....మనసు జ్ఞాపకాల పేజీలు వెనక్కి తిప్పుతోంది...


నేను ఇంజనీరింగ్ చదివేటపుడు...హాస్టల్ లో ఉండే రోజుల్లో....ఒక సారి బాగా వర్షం పడింది....కాసేపు ఒద్దులే,బాగోదేమో అని ఊరుకున్నా ఇక ఆగలేక డాబా మీదకి గొడుగు వేసుకెళ్ళి నేను,రాజి,ఫణిత ఇంకా తన చెల్లెళ్ళు... అందరం భలే ఆడుకున్నాం.....తెచ్చిన గోడుగుని ఎక్కడో పడేసి,డాబా మీద నిలిచి పోయిన నీళ్ళలో గెంతుతూ...ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు జల్లుకుంటూ......ఆ వర్షం లోనే చలి వేస్తున్నా దొంగ-పోలిస్ ఆట ఆడుకుంటూ....వర్షం లో తడిసి ముద్దవుతున్న పూలను ముద్దుపెట్టుకుంటూ..... ఆహా!! ఎంత హాయిగా గడిచిపోయాయి ఆ రోజులు! ఆ తరువాత రూం లో తలుపు దగ్గర కుర్చీలో కూర్చుని...ఆ చినుకులు చేసే చప్పుడు ఆస్వాదిస్తూ...ఆ మట్టి వాసన ఆఘ్రానిస్తూ....ఆ వర్షాన్నే చూస్తున్న నాకు ఒక కవిత రాయాలనిపించింది...అప్పటికప్పుడు పెన్ను,పేపరు పట్టుకుని రాసేసా!!.....ఆంటీ వేసిన వేడి వేడి పకోడిలతోపాటు నా బుర్ర కూడా తినేస్తోన్న రాజి నేను రాస్తున్న పేపర్ లాగేసుకుని మరీ  చూసింది.అప్పటిదాకా మనకి ఇలాంటి ఒక వ్యాపకం ఉందని తెలీని రాజి....అది చూసి ఒక పిచ్చి మొహం పెట్టింది...'ఏంటి అంత చండాలంగా రాశాన?' అని నేను దిగాలుగా మొహం  పెట్టాను....'కవిత బానే ఉంది కానీ నాకు కొన్ని కొన్ని వర్డ్స్ మీనింగ్స్ తెలీదే!' అంది...అప్పుడు తట్టింది నాకు  మేడం గారు సెంట్రల్ స్కూల్ లో చదివారని. తరువాత నా కవితల దయవల్ల రాజీకి తెలుగు బానే వచ్చింది....అలాగే నా ప్రతి కవిత కి బలి అయింది కూడా పాపం రాజినే... 


ఏంటో!! ఏమైపోయాయో ఆ రోజులు....వర్షం లో ఆటలు...వెన్నెల్లో ముచ్చట్లు....చుక్కల్ని లెక్కబెడుతూ చెప్పుకునే కబుర్లు.....జీవితం పై ఎన్నెన్నో ఆశలు....కళ్ళలో ఎన్నెన్నో రంగుల కలలు.... 


అప్పటి విశేషాలు ఇప్పటి జ్ఞాపకాలైపోయాయి....నిన్న,మొన్న జరిగినట్టే ఉన్నాయి...కాలేజి వదిలిపెట్టి అప్పుడే రెండు సంవత్సరాలైపోయిందా అనిపిస్తోంది....కాలం పరుగు చాలా వేగం కదా!!...

7 కామెంట్‌లు:

భాను చెప్పారు...

మీ జ్ఞాపకాలు ఇప్పుడే చిరుజల్లులో తడిసిన పువ్వుల్ల ఫ్రెష్ గా అందంగా ఉన్నాయి

ఇందు చెప్పారు...

థ్యాంక్యూ భాను!!

కొత్త పాళీ చెప్పారు...

" నా కవితల దయవల్ల రాజీకి తెలుగు బానే వచ్చింది."
అమ్మో మీకు చాలా కళలున్నాయే! ఇండియాలో వానల్లో తడిస్తే తడిసారు గాని, ఇక్కడి వానల్లో జాగ్రత్తా తల్లీ! అందులోను ఫాల్ వానల్ని అస్సలు నమ్మకూడదు! ఇవ్వాళ్ల అంతా పనుల మీద బయట తిరుగుతూనే ఉన్నాను. చల్లగానే ఉందిగానీ అంత బిగుసుకు కూర్చోవలసిన చలిగా మాత్రం లేదు.

ఇందు చెప్పారు...

@కొత్త పాళీ:ఏం 'కళలు 'లేండి సర్...ఏదో వానాకాలం కవితలు....ఇండియాలో అంటే వేడిగా ఉంటుంది కాబట్టి వర్షంలో తడిసినా బాగుంటుంది...ఇక్కడ అలా కాదు కదా!!

రాధిక(నాని ) చెప్పారు...

కాలెజీ రోజులు ,ఆ జ్ఞాపకాలు,ఆ ఆనందాలు ఎప్పుడూ గుర్తొచ్చినా కొంచెం భాధగానే ఉంటుందికదా ...బాగున్నాయి ఇందు మీ మదుర జ్ఞాపకాలు.

అజ్ఞాత చెప్పారు...

mee nostalgia baagundandi. vaana pratisaaree manalni ventaadutoone vuntundi..

ఇందు చెప్పారు...

@రాధిక(నాని ) :thankyou..
@ saamaanyudu :thanks.avunu nijame.