13, సెప్టెంబర్ 2010, సోమవారం

అప్పర్ పెనిన్సులా అందాలు-3

మూడవ రోజు....
మా ప్రయాణం లో చివరి రోజు.....చాలా ఆహ్లాదంగా గడిపిన రోజు కూడా.....
ఈ రోజు కొంచెం తొందరగా అంటే 7 కి లేచాం....మరి క్రూయిజ్ బయల్దేరేది 10:00 కి.....ఈ రోజు కూడా లేవగానే టీ తాగేసి కాసేపు అలా తిరుగుదాం అని తలుపు తీసా...అయ్యబాబోయ్ !! భయంకరమైన చలి....వణికిపోయి వెంటనే  తలుపు వేసేసి 'ఇవాల్టి సంగతి ఏంటి రా దేవుడా??!!' అనుకుంటూ అలాగే కాసిని కార్న్ ఫ్లేక్స్ తినేసి త్వరగా తెమిలి,సామాన్లు అన్నీ సర్దేసుకుని, క్యాబిన్ ఖాళి చేసి,క్యాబిన్ యజమానికి చెప్పి బయటపడ్డాం.....ఆ క్యాబిన్ వదిలి వస్తుంటే బాధేసింది :( . కానీ ఏం చేస్తాం? మన ఇల్లు కాదు కదా!!...


ముందుగా పిక్చర్డ్ రాక్స్  క్రూయిజ్ దగ్గరికి వెళ్ళాం......ఈసారి కొంచెం ముందు వెళ్ళాం నిన్నటిలాగా మిస్ అవకూడదని....పోద్దున 9:30 కి అస్సలు ఎండ లేదు....విపరీతమైన చలి...నేనైతే నా హుడ్ స్వెట్టర్ వేసేసుకుని కూర్చున్నా ఫెర్రి పైన ఎక్కి ముందు వరసలో......చాలా మంది చలికి తాళ లేక కిందనే కూర్చున్నారు...కానీ చూడటానికి వచ్చి కింద ఎందుకు కూర్చోవడం అని అలాగే చలికి తట్టుకుని పైన కూర్చున్నాం....మెల్లగా ఫెర్రి అంతా నిండేసరికి 10:15....అప్పుడు బయల్దేరింది......ఫెర్రి కెప్టెన్ తనని తాను పరిచయం చేసుకుని మైక్   లో పిక్చర్డ్ రాక్స్  గురించి,'లేక్ సుపీరియర్' గురించి చెప్పడం మొదలుపెట్టాడు....మంచి నీటి సరస్సు అయిన 'లేక్ సుపీరియర్' ఒడ్డున వరుసగా ఉండే అందమైన రాళ్ళే ఈ 'పిక్చర్డ్ రాక్స్ '....మధ్యలో గుహలు,జలపాతాలు,నదులు,బీచ్ చూసుకుంటూ ఫెర్రి లో మూడు గంటలు సాగే ప్రయాణమే ఈ 'పిక్చర్డ్ రాక్స్ క్రూయిజ్'. మేము చేసిన తప్పు ఏంటి అంటే...ఫెర్రి లో ఎడమ వైపు కూర్చున్నాం....కానీ చూసేది అంతా కుడివైపే....'అయ్యో!!' అనిపించింది.....'సర్లే!! వచ్చేటప్పుడు ఈ దారే కదా అప్పుడు చూద్దాం' అనుకున్నాం. ముందు ఫర్వాలేదు అనేట్టుగా ఉన్న ఈ రాళ్ళ అందాలు రాను రాను అద్భుతం అనేవిధంగా ఉన్నాయి....సహజంగా ఏర్పడిన ఈ రాళ్ళు వాటి నిర్మాణం లో ఉన్న వైవిధ్యం వలన రకరకాల ఆకారాల్లో,రంగుల్లో దర్సనమిస్తాయి...కింద మెత్తటి  రాయి-పైన గట్టి రాయి ఉండటం వల్ల ఆ రెంటి మధ్య నిరంతరం జరిగే రాపిడి వల్ల ఈ రాళ్ళు ఈ రూపాలు సంతరిచుకున్నాయ్....ఇవి కొన్ని వందల సంవత్సరాల నించి జరుగుతున్న కారణాన ఈ నాటికి ఈ రూపం లో దర్సనమిస్తున్నాయ్....కొద్ది సంవత్సరాల్లో మనం ఇప్పుడు చూసినవి ఉండవచ్చు  లేక వేరే రూపాలు రావొచ్చు......


ఎన్నో రంగులు....ఎవరో చిత్రకారుడు శ్రధ్ధ గా  వర్ణాలు కలగలిపి వేసిన అద్భుత చిత్ర రాజాల్లా ఉన్నాయి....ఆ రంగుల మేళవింపు అంతా ప్రక్రుతిది అంటే ఆశ్చర్యమేస్తుంది.మధ్యలో అంతెత్తు నించి సన్నగా జాలువారే జలపాతాల హొయలు.....అక్కడక్కడ మహాసరస్సు లో సంగమించే నదీముఖాలు......కొన్ని చోట్ల సహజంగా ఏర్పడ్డ అందమైన గుహలు.....వాటిలో నించి తొంగి చూసే 'సీగల్స్' పక్షులు.....ఒకవైపు నించి చూస్తే ఒక ఆకారంలో,ఇంకోవైపు నించి చూస్తే ఇంకో ఆకారం లో దర్సనమిచ్చే రాళ్ళు, సహజంగా ఏర్పడిన 'శిలాతోరణం' ఇలా కనువిందైన దృశ్యాలు చూస్తూ గంటన్నర మైమరచిపోయం....ఒక చోట ఐతే ఏకంగా ఫెర్రి ని గుహ లోపలి తీసుకెళ్ళి మళ్ళి అలాగే వెనక్కి తీసుకొచ్చారు.అప్పుడు ముందు వరసలో కూర్చున్న మా అనుభూతి చెప్పడం కష్టం....ఒకో చోట వరుసగా 'యుద్ధ నౌకలు' లాగ నిలబడిన రాళ్ళు చూస్తే 'ఇవి ఇలా ఏర్పడ్డాయా??లేక ఎవరన్నా చెక్కారా??' అనిపించింది......అలా అడుగడుగునా అద్భుతాలు చూస్తూ చాలా దూరం వెళ్లి వెనకి తిరిగి వచ్చాం....మధ్యలో ఒక చోట పెద్ద ఓడ మునిగిపోయిన ప్రదేశం కూడా చూపించారు....అక్కడ అడుగున ఉన్న ఓడ శిధిలాలను చూడడానికి 'షిప్ రెక్ మ్యుసియం' అనే ప్రత్యక ప్యాకేజి లో తీసుకెళ్ళి చూపిస్తారు.ఫెర్రి ని వెనక్కి  తీసుకు వచ్చేటప్పు కొంచెం దూరంగా తీసుకొచ్చాడు....అప్పటికే అందరూ నీరసపడిపోయారు.....ఫెర్రి బయలుదేరేటపుడు పోటీలు పడి మరీ ఫోటోలు తీసిన మహానుభావులు వచ్చేటప్పుడు చప్ప పడిపోయారు.....అలా అందమైన అనుభూతులు మూట కట్టుకుని తిరిగి వచ్చాం....అసలు 3 గంటలు యిట్టె గడిచిపోయాయి...


తరువాత 'సబ్వే' కి వెళ్లి  'వేజ్జి డిలైట్' తీసుకుని తిరిగి  'జలపాతాలు' చూసే కార్యక్రమం మొదలుపెట్టాం....ఈసారి ఎలాగైనా 'మినిసింగ్ ఫాల్స్' జాడ కనిపెట్టాలని ధృడ నిర్ణయం తీసుకుని చాలా జాగ్రత్తగా అంచనా వేసి ఎలాగైతేనేం అక్కడికి చేరగాలిగాం......పార్కింగ్ నించి కేవలం కొద్ది దూరం లో ఉన్నాయి ఈ ఫాల్స్....అక్కడే ఉన్న చెక్క బెంచిల్లో కూర్చొని 'సబ్వే' తినేసి పక్కనే ఉన్న ఆపిల్ చెట్లు వాటికి విరగ కాసిన ఆపిల్ కాయలు చూస్తూ ఫాల్స్ దగ్గరకి బయలుదేరాం......'మినిసింగ్ ఫాల్స్' కూడా కాఫీ రంగులో ఉన్నాయి....చాలా అందం గా  ఉంది ఈ జలపాతం....కానీ 'ఇక్కడ రాళ్ళు చాలా మెత్తగా ఉండటం వలన అప్పుడప్పుడు అవి కూలిపోయి ప్రమాదాలు జరుగుతాయి దగ్గరికి వెళ్లొద్దు' అని బోర్డు పెట్టారు.....ఈ  జలపాతం దగ్గరకి వెళ్ళే దారి అందమైన చెట్లతో భలే గా ఉంది......ఇక అక్కడినించి 'వాగ్నర్ ఫాల్స్' కి బయలుదేరాం......ఈ జలపాతం కూడా  చాలా అందంగా ఉంది....మనం ఇళ్ళలో పెట్టుకునే 'సీనరి' లో ఉండే జలపాతం లా ఉంది....దానికి వెళ్ళే దారి కూడా వంతెనలతో,చెక్క మెట్లతో ఆహ్లాదంగా ఉంది...దాని పక్కనే ఇంకో చిన్న ప్రవాహం ఉంది....కానీ అక్కడికి వెళ్ళడానికి దారి  లేదు..నాకు,చందూ కి అందులోకి వెళ్ళాలనిపించింది.....వెంటనే ఫెన్సింగ్ ఎక్కి దూకేసి అక్కడికేల్లాం...భలే ఉంది అది...చల్ల గా ఉన్న నీటి లో కాసేపు ఆడుకుని,నున్నని గులకరాళ్ళు ఏరుకుని,కాసేపు అక్కడే కూర్చుని మెల్లగా బయల్దేరి వచ్చాం...నాకు ఆ ప్రదేశం భలే నచ్చింది...చుట్టూ చెట్లు,స్వచ్చంగా ప్రవహిస్తున్న సన్నని జలధార, ఒంపులు తిరుగుతూ బండరాళ్ల మధ్య అది ప్రవహిస్తున్న తీరు,పక్కనే  నున్నటి గులకరాళ్ళు,ఎదురుగా చెక్క వంతెన.... ప్రక్రుతి లో మమేకమై ఎటువంటి కాలుష్యం లేని అంత అందమైన చోటు వదిలి ఎలా రావడం???? కానీ చేసేదేమీ లేక అప్పటికే సమయం మించిపోతున్నందున ఎలాగో అలా మళ్ళి ఆ ఫెన్సింగ్ ఎక్కి దూకి వచ్చేసాం....


తరువాత ఇక నేరుగా ఇంటిముఖం పట్టాం...ఈసారి 'మెకినా బ్రిడ్జి' కి వేరే దారిలో వెళ్ళాం....'లేక్ మిషిగన్' పక్కగా సాగే ఈ దారి ఐతే ఆహ్లాదంగా ఉంటుంది అన్న ప్రసన్న సలహాతో అటు వైపు వెళ్ళాం...కనుచూపు మేర నీలివర్ణం లో సూర్యకాంతి ని ప్రతిఫలిస్తున్న 'లేక్ మిషిగన్' ని చూస్తూ 'మెకినా బ్రిడ్జి' చేరుకున్నాం. అక్కడ కాసేపు గడిపి,కొంచెం స్వాంతన పడి...మళ్ళి ఇంటిదారి పట్టాం.....


'అప్పర్ పెనిన్సులా' వదిలి వస్తుంటే 'అయ్యో!! అప్పుడే మూడు రోజులు అయిపోయిందా?' అనిపించింది....అసలు వెళ్ళిన కారణం 'ఫాల్' చూద్దామని...కానీ ఈ సంవత్సరం ఇక్కడ ఇంకా 'ఫాల్' మొదలవలేదు....అక్కడక్కడ మాత్రమే చెట్లు  రంగులు మారాయి....చందూ,కృష్ణ,ప్రసన్న కొంచెం నిరుత్శాహపడ్డారు 'ఫాల్' రాలేదని ,అది ఉండి ఉంటే ఇంకా అందంగా ఉండేది అని....కానీ నేనైతే ఇప్పటిదాకా చూసిన ప్రక్రుతి సౌందర్యానికి  దాసోహమైపోయా......'ఈసారి కాకపొతే వచ్చే ఏడాది చూడొచ్చు ఫాల్ ఏమి ఫర్వాలేదు '...అనుకుని అప్పటిదాకా చూసిన ప్రక్రుతి అందాలను మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకుంటూ ఇంటికి వచ్చా!!


నేను ఇప్పటిదాకా చూసిన వాటిల్లో నాకు బాగా నచ్చిన ట్రిప్ ఇది....
కొండలు,జలపాతాలు,బీచ్,నదులు,సరస్సులు,అడవులు,ట్రెక్కింగ్,క్యాబిన్లు...ఓహ్!! అద్భుతమైన అందాల మణిహారం ఈ 'అప్పర్ పెనిన్సులా'.....ఇంతటి మంచి అనుభూతికి కారణమయిన చందూ కి ధన్యవాదాలు :)


ఈ రోజు తీసిన కొన్ని చిత్రాలు:


పిక్చర్డ్ రాక్స్:














మినిసింగ్ జలపాతం:







వాగ్నర్ జలపాతం:





మిషిగన్ సరస్సు నీటి స్వచ్చతకి దర్పణం:



మెకినా బ్రిడ్జి:





6 కామెంట్‌లు:

Rani చెప్పారు...

good posts.
nice photos, thanks for sharing :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

మీ అనుభూతులు, అనుభవాలు, ఫోటోలు అన్నీ చాలా బాగున్నాయండీ. మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

Unknown చెప్పారు...

బాగున్నాయండీ మీ ఫొటోలు ఇంకా మీ పొస్ట్ కూడా బాగుంది.ఆ జలపాతలు ఐతే భలె నచ్చేసాయ్ నాకు....

Overwhelmed చెప్పారు...

Eppudu veggie delight ee na andi..? ;-)
Apples kosi tinaledaa..?

ఇందు చెప్పారు...

@Rani :రాణి గారు థ్యాంక్స్ అండీ...
@వేణూ శ్రీకాంత్ :వేణు శ్రీకాంత్ గారు మీకు ధన్యవాదాలండీ....
@sahiti :థ్యాంక్స్ సాహితి గారు...
@Jaabili :ఏం చేస్తాం చెప్పండీ??సబ్వె లో దొరికే వెజిటేరియన్ ఐటెం ఇదొక్కటే మరి!!అపిల్స్ ఇంకా పచ్చిగా ఉన్నాయండీ....చిన్న చిన్న కాయలు....అందుకే తినలేదు :)

Rao S Lakkaraju చెప్పారు...

మీ ఫోటోలు చాలా బాగున్నాయి. ఈ తడవ వేజ్జి మాక్స్ ట్రై చెయ్యండి సబ్వే లో. సోయాబీన్ పాటీ తో బాగుంటుంది.