3, అక్టోబర్ 2011, సోమవారం

నోట్ బుక్ వెనుక పేజీలో!!

కాలేజి రోజులు అంటేనే ఎన్నెనో జ్ఞాపకాలు!
అసలు ఆ రోజులు తలుచుకుంటే మనసు రెక్కలు కట్టుకుని రివ్వున ఎగిరిపోతుంది.....
ఈ జ్ఞాపకాల దొంతరలోనే దొరికింది ఒక రంగుల పేజి.....అదే 'నోట్ బుక్' వెనుక పేజి.

బహుశా....ఇది అందరి కాలేజి చదువులకి వర్తిస్తుందేమో. ఎందుకంటే క్లాసులో పాఠాలు వింటూనే మాట్లాడుకునే కళ [ఈమధ్య సెల్ఫోన్లు వచ్చాయనుకోండి] మనకి నేర్పింది ఈ నోట్ బుక్స్ యే కదా! నావరకు నేనైతే ప్రతి నోట్ బుక్ ముందు,చివర రెండు పేజీలు  ఖాళీ ఉంచేదాన్ని.మరి సంవత్సరం మాట్లాడుకునే కబుర్లకి ఆ మాత్రం వదలొద్దూ! ఇక పెన్ను వాడితే ఆ రెండు పేజీలు  తొందరగా అయిపోతాయని పెన్సిల్ వాడేదాన్ని [తెలివి ;) ]

ఇక ఆ రాతల్లో ఎన్నెన్ని ఇంఫర్మేషన్లో! ఫోన్ నంబర్లు హడావిడిగా రాసుకోవాలన్నా.....మనసులో పాడుకుంటున్న పాటకి చేతిలో పెన్ను అక్షర రూపం ఇవ్వాలన్నా...... తవికలైన, కథలైన...... ముచ్చట్లైనా..... తిట్లైనా అన్నీ ఆ వెనుక పేజీల్లో పొందిగ్గా అమరిపోయేవి. అందుకే సాధ్యమైనంతవరకు మా నోట్ బుక్స్ అబ్బాయిలకి అడిగినా ఇచ్చేవాళ్ళం కాదు :)))) [ఇన్ఫో లీక్ అయిపొదూ ;) ]

అలాగే సినిమాకి వెళ్ళాలంటే 'మూవీ?' అని రాసి అందరికీ పాస్ చేసేవాళ్ళం.రావాలనుకునేవాళ్ళు వాళ్ళ పేర్లు రాసేవాళ్ళు. కానీ పాపం లెసన్ చెప్పే సార్ ఏమో మేమేదో నోట్స్ షేర్ చేసుకుంటున్నాం అనుకునేవాడు పాపం మానవుడు! ఇక ఎన్నింటికి వెళ్ళాలి? ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులున్నాయ్? టికెట్లకి సరిపోతాయా? ఇత్యాది లెక్కలన్నీ ఆ పుస్తకాలూ అటు-ఇటు మోస్తూ తిరిగేవి 


నాకు ఇదివరకు హిందీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. షారుఖ్ పాటలంటే మరీను.' సూరజ్ హువా మధం' పాటైతే పిచ్చి :)) ఆ పాట లిరిక్స్ మొత్తం నా 'సి' లాంగ్వేజ్ నోట్స్ వెనకాల ఉండేది. ఒకసారి మా సార్ క్లాస్లో రౌండ్స్ వేస్తూ....నా నోట్స్ తీసుకుని అటు,ఇటు తిప్పి చూస్తూ చివరి పేజిలో ఆ పాట చూసి.....ఒక్క క్షణం  కోపమొచ్చినా నవ్వేసి వెళ్ళిపోయారు :)) అప్పుడెంత భయమేసిందో! అయినా బుద్దొస్తుందా.....అలా రాస్తూనే ఉన్నాం :)) 

ఇక నేనైతే.... ప్రతి పేజి కార్నర్ లో బుల్లిబుల్లి బొమ్మలు వేసేదాన్ని. ఇక చివరి పేజీల్లో ఏదో చేతికొచ్చిన బొమ్మ వేయడం.....దానికి రెండు కళ్ళు,ఒక ముక్కు,నోరు రెండు పిలకలు పెట్టడం...... పక్కనున్న నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరి పేరు రాయడం....... ఇక ఆ అమ్మాయిని ఏడిపించడం! ఆ పిల్ల లబోదిబోమన్నా నోట్స్ ఇచ్చేదాన్ని కాదు. అందరూ చూసి పడి,పడి నవ్వాక అప్పుడు తీరిగ్గా ఆ అమ్మాయికి ఇస్తే.....తను ఎంచక్కా తన పేరు కొట్టేసి నా పేరు రాసి కచ్చ తీర్చుకునేది. హహహ! అయినా కూడా భలే ఉండేది...ఆ మజాయే వేరు!

ఇక నిక్ నేమ్స్ ఒక లెఖ్ఖా? హబ్బో! క్లాసులో ప్రతివారికి నేను నిక్నేమ్స్ పెట్టేదాన్ని :))) అది ఎలాగో తెల్సా? వాళ్ళ పేరు కలిసోచ్చేలా అన్నమాట. ఉదా: దున్న దివ్య,బుల్లిబల్లి, కోతి కవిత, మోహిని పిశాచి, రాజి = పి.ఐ.జి, ఇలా! అవి ఎంతగా పాపులర్ అయ్యాయి అంటే..... నా సెల్ ఫోన్లో వాళ్ళ పేర్లకి బదులు ఇవే పేర్లు ఉంటాయ్...ఇప్పటికీ :))))))))))) నన్నైతే చితక్కోట్టేసేవాళ్ళు అలా పిలిస్తే! ఎంత ఉడుక్కునే వాళ్ళో! హ్హహ్హహా! కానీ పాపం నాకు పెట్టడానికి వాళ్ళకి ఏమి దొరకలేదు :)  [నా పేరు అంత 'స్వీట్ నేం' కదా]

ఇక ఒకరోజు ఎలెక్ట్రానిక్స్ క్లాస్ జరుగుతుంది. నాకు ఈ సబ్జెక్ట్ అంటే చాలా చిరాకు. 'ఎహే సోది గోల' అని చెప్పి ఆ క్లాస్ నోట్స్ వెనుక పేజిలో ఇక ఒక కథ రాయడం మొదలుపెట్టా. క్లాస్ అయిపోయేసరికి నా కథ అయిపోయింది :)) న్యూస్ పేపర్ మీద కథలెండి ;) ఇంకా మీ మీదకి వదలలేదు నేను :)) మా ఫ్రెండ్స్ ఐతే అది చూసి......అసలు నన్ను ఒక రేంజ్లో పొగిడేసరికి మా క్లాసు అటకెక్కి కూర్చున్నా కాసేపు. అలా క్లాసులో రాసిన ఇంకో కథే.....నా 'చిట్టి చీమ కథ'.

అలాగే..... బెంచిలమీద రాసే అలవాటుకూడా మనకి అలవడింది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం 'సి' లాంగ్వేజ్ నేర్చుకోడానికి మా గుంపుగుంపు అంతా ఒక ఇన్స్టిట్యుట్ మీద పడ్డాం. అక్కడ ఒక్కక్కరికి ఒక్కో చెయిర్. దానికి రాసుకోడానికి ఒక బుల్లి బల్ల. ఇక దానిమీద ఉండేవి....బాబోయ్! 'విజయేంద్ర వర్మ.....చూసినోడి ఖర్మ', ఇలాంటి కేక పెట్టించే డైలాగ్స్ ఉండేవి. రోజు అవి చూసి నవ్వుకోలేక చచ్చేవాళ్ళం :)) 

కానీ ఇంటర్లో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ నాకు నవ్వు తెప్పిస్తుంది. మా కాలేజిలో రేసిదేన్శియాల్ స్టూడెంట్స్,డే-స్కాలర్స్ ఇద్దరికి ఒకేచోట క్లాసులు. మా గర్ల్స్ క్యాంపస్ పక్క రోడ్లోనే  గర్ల్స్ హాస్టల్. ఈ హాస్టల్ వాళ్ళు రోజు మధ్యాహ్నం లంచ్ కి హాస్టల్ కి వెళ్ళేవాళ్ళు. ఇక మిగితావారు ఇళ్ళకి వెళ్ళేవారు. మా ఇల్లు దూరం అవడంతో నేను క్యారేజి తెచ్చుకునేదాన్ని.మా క్లాసులో నేనొక్కదాన్నే ఉండేదాన్ని. ఇక హాస్టల్ వాళ్ళు చదుకోడానికి చేయిర్లు,ప్లాంకులు అక్కడే పెట్టుకునేవారు. వాటిమీద ఏవేవో రాసున్దేవి. ఎక్కువగా పవన్,మహేష్ ఫ్యాన్స్ రాసేవారు. వాళ్ళ సినిమా పాటలు,డైలాగ్స్ అలా. ఇంకా ఫ్రెండ్షిప్ కోట్స్,లవ్ కోట్స్....ఇలా బోలెడు సమాచారం ఆ ప్లాన్క్స్ మీద ఉండేది ;) నేను అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ ప్లాంక్స్ మీద రాస్తుండేదాన్ని. :)

ఒకరోజు మధ్యాహ్నం లంచ్ అయ్యాక నేను మా ఫ్రెండ్ చైర్లో కూర్చున్ని బుద్ధిగా చదువుకుంటున్నా. తీరా దాని ప్లాంక్ చూస్తే.....కొత్తగా తళతళ లాడుతోంది.నీట్ గా ఏమి రాయకుండా ఖాళీగా ఉంది. అది చూసేసరికి మన చేతులు దురద పుట్టాయి.  'అరె! నాకు చెప్పలేదేంటి ఎప్పుడు కొన్నది ఈ కొత్త ప్లాంక్? భలే బావుంది' అనుకుని ఎంచక్కా నా హైలైటర్ తీసుకుని......అప్పుడే విడుదలైన 'ఒక్కడు' ఆడియోలో పాట రాసేసా ;) 

ఒకటికి నాలుగు సార్లు అది చూసుకుని మురిసిపోయి.....కాసేపు ఆ ప్లాంక్ మీదే నిద్రపోయి....లేచి ముఖం కడుక్కుని నా ప్లేస్ కి వచ్చి కూర్చున్నా.ఇక లంచ్ చేసి అందరూ వచ్చేసారు.....గోలగోలగా ఉంది. ఇంతలో నాకు అస్సలు పరిచయం లేని ఒకమ్మాయి మా ఫ్రెండ్ చైర్ దగ్గరకొచ్చి ఆ ప్లాంక్ తీసుకుని చూసింది.ఆ ప్లాంక్ ఆ పిల్లదట. కేవ్వ్వ్వవ్వ్వ్వ్!!నేను రాసింది చూసి పళ్ళు పటపటా కొరికింది. ఆ పిల్ల పవన్ ఫ్యాన్ అట! మహేష్ అంటే పడదట! మనకేం తెల్సు? వాఆఆఅ......వా............

'ఇక్కడెవరు కూర్చున్నారు? ఈ పాట రాసిందెవరు?' అది ఇది అని చీల్చి చెండాదేస్తుంటే......అసలే సత్య హరిశ్చద్రుడి కజిన్ సిస్టర్ అయిన నేను...... 'నేనే!' అని చెప్పబోతుంటే నా ఫ్రెండ్ నోరు నొక్కేసింది. 'ఆ ఏమో మరి. మాకేం తెల్సు? అయినా నీ ప్లాంక్స్ ఇక్కడ పెట్టకు. తీసుకెళ్ళి నీ చెయిర్లో పెట్టుకో.నా చెయిర్లో పెట్టావేంటి?' అని మా ఫ్రెండు గయ్యిన పడేసరికి దెబ్బకి ఆ అమ్మాయి తోకముడిచి నన్ను కొరకొరా చూస్తూ వెళ్ళిపోయింది. మా ఫ్రెండు నన్ను నాలుగు చీవాట్లేసింది లోకజ్ఞానం అలవరచుకో తల్లి అని :)) 

హ్మ్! అప్పటినించి ఏం రాసినా.....ఎక్కడ రాసినా ఆచి,తూచి రాస్తుంటా అన్నమాట ;)

అదండీ...... నా జ్ఞాపకాల తేనెతుట్టె కదిపేసి ఆ తేనెటీగలను మీమీదకి వదిలేసా! కామెంటు పెట్టకపోతే కుట్టేస్తాయ్ మరి ;) జాగ్రత్తా! :))))))) 

26, సెప్టెంబర్ 2011, సోమవారం

మంచుకురిసేవేళలో.....

నేను కోరుకున్న ఉదయం........

నాకెప్పటినించో మంచుపొరలు ఇంకా వీడకముందే బాల్కని/పాటియొలోకి వచ్చి కూర్చుని వేడి వేడి ఫిల్టర్ కాఫీ తాగుతూ సూర్యోదయాన్ని చూడాలని :) మనకున్న నిద్రాదేవి అపారకరుణాకటాక్షాలవలన అది ఈ జన్మకి నెరవేరని కోరిక అని సరిపెట్టుకుంటువస్తున్నా! :)) కాని నాకు అంతకంటే ఎక్కువ నా కిట్టు కరుణ ఉందని(అప్పుడప్పుడూ ఏడిపించినా) మొన్నే అర్ధమయింది ;) 

అసలు సంగతేంటంటే........

మొన్న లాంగ్ వీకెండ్ ఎక్కడికెళదామా అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే వాషింగ్టన్ వెళ్దాం.... అసలే మొన్న భూకంపం వచ్చింది కదా.... కాస్త పరామర్శిద్దాం ఒబామని అని బయలుదేరాం ;)

మాతోపాటు వచ్చారు మాకు తెలిసినవాళ్ళయిన శర్మ,జ్యోతి :) వాళ్ళకి ఇద్దరు కవలపిల్లలు.... సన్ని,బన్ని :) వయసు మూడేళ్ళే అయినా..... అల్లరి మాత్రం ఆకాశమంత :))

హ్మ్! ఇక మా యాత్ర విషయానికి వస్తే...

సరాసరి వాషింగ్టన్ వెళ్తె ఎలా? మధ్యలో ఏమన్నా కవర్ చేద్దామని.... ఇస్కాన్ గుడికి అంటూ వెస్ట్ వర్జీనియాలో ఉన్న 'గోల్డెన్ టెంపుల్ ' కి వెళ్ళాం. ఆ రోజు రాత్రి అక్కడ ఉండి మర్నాడు పొద్దున్నె దర్శనం చేసుకుని పిట్స్బర్గ్ వెళ్ళాలని ప్లాన్. శుక్రవారం మధ్యాహ్నం ఆఫీసులకి డుమ్మా కొట్టి బయలుదేరినవాళ్ళం ఆ రోజు అర్ధరాత్రికి ఇస్కాన్ చేరాం.  కొండల్లో,అడవుల్లో జీపీయస్ ఇచ్చిన తప్పు రూట్లో వెళ్ళిపోయి మళ్ళి ఎలాగొలా తిరిగి తిరిగి కెరెక్ట్ రూట్ కనుగొని ఎలాగైతేనేం అర్ధరాత్రికి వెళ్ళాం :)

ఇక పొద్దున్నే అందరూ నిద్రపోతుంటే ఎప్పటినించో ఉన్న నా కోరిక తీర్చుకునేందుకు ఆరింటికే నిద్ర లేచా :) [అంతా కృష్ణమాయ :)) ]

కిటికి బ్లెండ్స్ పక్కకి జరిపి చూస్తే.....మన గీతాంజలి సినిమాలో చూప్పించినట్టు అంతా పొగమంచు :) కనుచూపుమేరా మబ్బు నేలవాలిందా అన్నట్టు. బైటికి వెళ్ళాలంటే భయమేసింది. అసలే అడవి..... పైగా మంచు..... ఇంకా జనసంచారం లేదు.సరేలెమ్మని వేడివేడి టీ,కాఫీ లేకపొయినా అలా కిటికి పక్కన కూర్చుని ఆల్చిప్పలాగా కళ్ళు తెరిచి చూస్తు ఉన్నా.

కాసేపటికి మంచు తెరలు ఒక్కొక్కటి విచ్చుకోవడం మొదలుపెట్టాయి.సూర్యుడు ఆ మంచు దుప్పట్లని తొలగించి చెట్లని,పూవులని సుతారంగా ముద్దాడి లేలెమ్మని మేల్కొలుపుతున్నాడు. 

అప్పుడే ఒక విదేశిజంట చేతిలో జపమాల తిప్పుతు వెళుతున్నారు.చక్కగా చీరకట్టుకున్న ఆమెని,లాల్చి వేసుకున్న అతన్ని చూస్తే ముచ్చటేసింది :)

ఇక ఆగలేకపోయా.చందూ చూస్తే బాగా నిదరొయింగ్స్! పాపం రాత్రి డ్రైవింగ్కి అలసిపోయినట్టు ఉన్నాడు. ఎందుకులే లేపడం...పాపం పడుకోని అని ఇక నేనే ధైర్యం చేసి ముందడుగేసా! వెంటనే ఎస్సెల్లార్ మెడలో వేసుకుని అభినవ ఫోటోగ్రాఫర్లాగా బయలుదేరా. నేను ఇలా రూంలొనించి బైటికొచ్చా జ్యోతి కూడా నాతో పాటు వచ్చారు....'పద ఒకసారి అలా తిరిగొద్దాం' అన్నారు :)  ఇక ఇద్దరం చెట్టాపట్టాలేసుకుని బయలుదేరాం :) 

మేము వెళ్ళేసరికే దొంగమంచుపొరలు.......సుర్యుడికే మస్కా కొట్టేసి మళ్ళి చెట్ల మీద పరుచుకున్నాయి :)) మళ్ళీ గీతాంజలి సీన్ రిపీట్.

ఇక మెల్లగా ఆ మంచులో అలాగే సన్నగా వణుకుతూ...... తడిసిన ఆ గడ్డిమీద నడుస్తూ.... దారి పక్కనే పెరిగిన బంతి,చేమంతి,గులాబి పూలు మంచుముత్యాలతో అలరారుతుంటే అవి చూస్తు... చేతిలో కెమెరాతో కనపడిన దృశ్యమల్లా బంధిస్తూ....అలా వనవిహారం చేస్తున్నాం. ఒక రెండు అడుగులు వేయగానే నెమళ్ళ క్రేంకారం వినిపించింది :) అది ఏదో పక్షి అని జ్యోతి కాదు నెమలి అని నేను గొడవ :))

కొద్ది దూరం వెళ్ళగానే ఒక అందమైన చిన్ని కొలను అందులో తెల్లని హంసలు[హంస ఇప్పుడు లేదు కదా....అవి తెల్లని పెద్ద బాతులయుంటాయ్] ఆ దృశ్యం చాలబాగుంది :) ఇక ఆ కొలను ఎదురుగా చుడగానే కృష్ణచైతన్య ప్రభువు అలౌకికానందంలో తేలిపోతూ నాట్యం చేస్తున్నారు. ఆ ప్రతిబింబం ఈ నీటిలో పడి ప్రతిఫలిస్తూ ముచ్చటగొలుపుతుంటే నేను,జ్యోతి కాసేపు అక్కడే ఉండిపోయాం :)

మళ్ళి మా నడక కొనసాగించి ఆ చైతన్యప్రభువుల విగ్రహాల దగ్గరకి బయలుదేరాం. ఆ దారంతా గడ్డిపూలు విరగబూసాయి. వాటిమీద మంచుబిందువులు పడి పూల అందం అమాంతం పెంచేసాయి. ఆ పూలని ఫొటో తీద్దామంటే కుదరలేదు :((

అక్కడ ఇంకో చిన్న కొలను దానికి ఆనకట్టా ఉన్నాయి :) దానిపక్కనే నెమళ్ళ కేంద్రం ఉంది. అక్కడ తెల్ల నెమళ్ళు, మామూలు నెమళ్ళు కలిసి వనవిహారం చేస్తున్నాయి. ఇందాక అరిచినవి అవే :))
            
నాకు ఆ మంచు చూస్తుంటే...'మంచు కురిసే వేళలో' పాట గుర్తుకొచ్చింది. పైకి పాడదాం అంటే మళ్ళీ జ్యోతి పారిపోతారని పాడలేదనుకోండీ ;) 

కానీ అబ్బా.... ఎంత బాగుందో! చుట్టూ కొండలు.... దట్టమైన అడవులు... కొద్దిదూరంలో కృష్ణమందిరం.... మంద్రంగా వినిపిస్తున్న కృష్ణమహామంత్రభజన...... ఎదురుగా కొలను అందులో బాతులు... దాని ఒడ్డున చైతన్యప్రభువులు.... ఆ వనమంతా తిరుగుతూ అల్లరిచేస్తున్న నెమళ్ళు... పధ్ధతిగా పెంచిన రకరకాల పూలమొక్కలు.... అందాలు ఒలకబోస్తున్న గడ్డిపూలు.... రెండు కొలనులమధ్య చిన్ని వంతెన.... అక్కడే కూర్చోడానికి చిన్న రాతిబల్ల.... చెట్లమధ్యగుండా తొంగిచూస్తున్న చల్లని సూర్యుడు...... హ్మ్! ప్రపంచంలో ఇంతకంటే అందమైన ప్రదేశం ఉంటుందా? నాకు తెలిసి ఉండదేమో!

ఆ నెమళ్ళని చూస్తు, ఆ వంతెన దాటి ఆ మంచుపొరల్లో మేము మమేకమయిపోయి, అప్పుడే ఆకులు రాల్చడం మొదలుపెట్టిన వనాల్లోగుండా నడక సాగించి, మెల్లగా చెట్లపైకి వచ్చి ఆశగా తొంగిచూస్తున్న సూరీడ్ని నా కెమెరాలో బంధించి, చిరుచలి గిలిగింతలు పెడుతుండగా ఇక మా రూంకి బయల్దేరాము :)

అలా ఆ చెట్లమధ్యగుండా,మా మధ్య దూరిపోతున్న మంచుమేఘాల్ని తడుముతూ మా రూం కి చేరుకుంటున్నప్పుడు ముక్కుపుటాల్ని తాకింది కట్టెపొంగలి వాసన.....ఇంకా చిక్కటి బ్రూ కాఫీ పరిమళం :)

'మంచి రుచికల ఉదయం కొత్త సన్రైజ్' ....ఎందుకో ఈ ఏడ్ ఠక్కున గుర్తొచ్చింది :)

ఇక ఆగలేక వెళ్ళి,ముఖం కడుక్కుని చందు ని లేపి చిక్కటి కాఫీ తెచ్చుకుని ఎంచక్కా ఆ మంచులో ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ కాఫీ తగుతుంటే.....ఆహ!! స్వర్గం కాళ్ళ కింద ఉందేమో అనిపించింది ఒక్క క్షణం.

నేను కోరుకున్న ఉదయం ఇన్నాళ్ళకి నాకు దొరికింది :)

ఎన్నాళ్ళయినా ఈ చల్లటి మంచు, కొలను, నెమళ్ళు, బాతులు, విగ్రహాలు, వంతెన, చెట్లు, సూర్యుడు నా మనసుని దాటిపోవేమో!! :) 

ఏదేమయినా కృష్ణమాయ కృష్ణమాయే! :) 

నాకెందుకో ప్రకృతినిమించిన అందం దేనిలోను కనిపించదు. ప్రకృతి భగవంతుడి సృష్టి కాబట్టి ఆయన అందం కాస్త అడిగి అరువు తెచ్చుకుందేమో! అరువు తెచ్చుకున్న అందమే ఇంత అందంగా ఉంటే...అసలైన అందం....అదే మా కిట్టూ ఇంకెంత అందంగా ఉంటాడో కదా!

హ్మ్మ్!! :)) 

అవీ ఈసారికి కబుర్లు అయిపోయాయి :) ఫోటోలు చూసి కామెంట్లేసేయండి :)











1, సెప్టెంబర్ 2011, గురువారం

మా ఇంటి గణపయ్య :)

ఉండ్రాళ్ళ మీదకి దండు పంపూ....గణపయ్యా....
కమ్మని నెయ్యి కడు ముద్దపప్పు గణపయ్యా....
ఓ బొజ్జ గణపయ్య...నీ బంటు నేనయ్యా...

ఈ పాట చిన్నప్పుడు ప్రతి వినాయకచవితికి పొద్దున్నే మా టేప్రికార్డర్లో మమ్మల్ని మేలుకొలిపేది :) ఇవాళ పొద్దున్నే నాలుగింటికి ఈ పాట నేనే పాడుకుంటు లేచి.... అన్ని నైవేద్యాలు చేసి.... గణపయ్యకి బోలెడు వండిపెట్టి... ఇంకా చక్కగా పూజ చేసుకుని అంతా అయ్యేసరికి పది :) అసలే వీక్ డే కదా... అంతా ఉరుకులు,పరుగులు లాగా అయిపోయింది :) 

ఇక అట్టే మీకు నా సోదంతా చెప్పి మిమ్మల్ని విసిగించనులే... పిక్స్ పెట్టా..చూసి...తరించేయండి మా ఇంటి గణపయ్యని :) 

గణపయ్యకి ఇష్టమని..ఉండ్రాల్లు,మోదకాలు,గారెలు,పులిహోర,పాయసం చేసా :) వాటికి తోడు.... టమటా పప్పు, బెండ, దొండ కూరలు.. పులుసు.. ఇంకా వడపప్పు,పానకం :) ఇక మామిడి, చెరుకు, అరిటి, ఆపిల్, నారింజ, ద్రాక్ష, పీర్స్, మొక్కజొన్న కూడా పెట్టాను. మరి సరిపోయాయో లేదో బుజ్జిగణపయ్య బుల్లి కడుపుకి :)


ఇంకా పూజ మొదలుపెట్టకముందు బియ్యప్పిండితో ముగ్గేసి...బియ్యంపోసి గణపతిని,వాళ్ళ డాడి శివయ్యని,మా ఇలవేల్పు వెంకీని, ఆయన భార్య లక్ష్మిని పెట్టాను :) 


మా గణపయ్య పూజకి ఎంతముచ్చటగా రెడి అయ్యాడో చూడండీ :) 


శ్ర్రీ మహాగణాధిపతయే...పుష్పం పూజయామి :) 


శ్ర్రీ మహాగణాధిపతయే...పత్రం పూజయామి :) 


కదళీఫల-నారికేళా సహిత నానావిధభక్ష్యభోజ్యం మహానైవేద్యం సమర్పయామి :) 


అంతే...పూజయిపోయిందోచ్! కథవిని అక్షతలు వేసుకుని...తోరం కట్టుకుని గణపతి ఆశీర్వాదం పొందండి :)

సరే...మరి...అందరికి ఇంకొక్కసారి 'వినాయకచవితీ శుభాకాంక్షలు :)


30, ఆగస్టు 2011, మంగళవారం

పరంజ్యోతి

కర్మ అంటే ఏంటి?

కర్మఫలం అంటే ఏమిటి? 

జన్మలు ఉంటాయా?

మరణించిన మనిషి మళ్లీ బ్రతుకుతాడా?


ఈ ప్రశ్నలన్నిటికీ  సమాధానం చెప్పే  మల్లాది గారి అద్భుత ఆధ్యాత్మిక నవల......'పరంజ్యోతి'

మొన్న మా బజ్జు గుంపులో దయ్యాల మీద,పునర్జన్మల మీద,ఊజాబోర్డు గురించి,మల్లాది గారు వ్రాసిన 'అనగనగా ఒక అతిధి'నవల గురించి ఒక  సుదీర్ఘ చర్చ జరిగింది. అప్పుడు నేను చదివిన ఈ నవల గుర్తొచ్చి అది ఈ బ్లాగు పోస్టుకి నాంది పలికింది :)

ఆమధ్య ఇండియా వెళ్ళినప్పుడు ఈ పుస్తకం మా ఇంట్లో చూడగానే....'హబ్బా ఇంకో బోరింగ్ నవల!' అనుకున్నా! కాని మా అమ్మ 'ఒకసారి చదువు నీకే తెలుస్తుంది.....బోరింగో..ఇంటరెస్టింగో'....అంటే సరేలెమ్మని చదవడం ప్రారంభించా!

ముందు నాలుగైదు పేజీలు  కొంచెం విసుగనిపించినా రానురాను కథలో చిక్కదనం ఎక్కువైంది. ఒక వ్యసనపరుడు సాధువుగా ఎలా మారాడు? తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరాడు అన్నది ఈ నర్మదా-గోదావరి నదుల ఒడ్డున సాగే కథ!

రెండు శతాబ్దాల క్రిందట గోదారి తీరంలో వెలసిన 'నెమలి కొండ' సంస్థానం రాజు 'విజయ రామరాజు'  కథ ఇది. వ్యసనపరుడైన రామరాజు  రాజ్యాన్ని,రాణిని ఆఖరికి కన్న కొడుకుని కూడా లక్ష్యపెట్టకుండా  భోగలాలసలో మునిగి తేలుతుంటాడు. అతన్ని మార్చాలని అతని భార్యతో సహా బంధువులందరూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి. చివరికి అతని వ్యసనాలు మందులేని రోగం రూపంలో అతన్ని మంచాన పడేస్తాయి. అయినప్పటికీ అతనిలో మార్పు ఉండదు. ఇదంతా చూసి విరక్తి చెందిన రామరాజు భార్య,బావమరిది కలిసి విషం పెట్టి అతన్ని చంపేస్తారు.

రామరాజు రోగం వల్లే చనిపోయాడనుకుని భావించిన అందరూ గోదావరి తీరాన అతని దేహానికి దహన సంస్కారాలు చేయడానికి  ఏర్పాట్లు చేస్తారు. చితికి నిప్పు పెట్టాక....ఉన్నట్టుండి పెద్ద వర్షం.....దానితోపాటే గోదారి పొంగిపొరలి కొద్దిగా కాలిన  చితిని కొట్టుకుపోయేలా చేస్తాయి. కళ్ళముందే రామరాజు చితి వరదగోదారిలో కొట్టుకుపోతుంటే చేసేది లేక మిన్నుకుండిపోతారు రాజ కుటుంబీకులు. ఈ విషయం బైటికి పొక్కకుండా జాగ్రత్త పడతారు!

కాని కొద్దిరోజుల తరువాత 'రామరాజు' సగం కాలిన దేహాన్ని ఎవరో సాధువు కాపాడారని.....రామరాజుకి తిరిగి ప్రాణం పోశారని అతని పేరు 'పరంజ్యోతి' అని తెలుస్తుంది! ఇది నిజమేనా? ప్రాణం తిరిగి వచ్చిన రామరాజు ఏమయ్యాడు? రాజ్యానికి చేరాడా లేదా? అసలు ఇంతకీ  'రామరాజు' 'పరంజ్యోతి' ఒకరేనా? ఒకవేళ పరంజ్యోతే రామరాజు ఐతే  తనని చంపినవారెవరో తెలుసా?...... ఇలా ఎన్నో ప్రశ్నల పరంపరకి సమాధానాలు కావాలా? అబ్బా.....ఆశ,దోశ,అప్పడం.... నేను చెప్పనుగా!! మరి ఎలా?  అందుకే మంచిపిల్లల్లా ఈ పుస్తకం చదవాలి మరి ;)

అసలే అమ్మమ్మ చనిపోయి దుఃఖంలో ఉన్న నాకు ఈ నవల ఊరటనిచ్చింది. 'కర్మ' అంటే ఏమిటో చెప్పకుండానే చెప్పిన మల్లాది గారి శైలి అద్భుతం. ఏదైనా మంచి విషయం చెప్పాలంటే సరాసరి చెప్పేస్తే బుర్రలోకి ఎక్కదు. అదే చిన్న కథ రూపంలో చెబితే మనసులో నాటుకుపోతుంది. ఈ నవల కూడా ఆ కోవకే వస్తుంది. ఎన్నో ధార్మిక రహస్యాలు, ఆధ్యాత్మిక విశేషాలు,నిత్యం ప్రతి మనిషి పాటించవలసిన సూత్రాలు....ఇలా ఎన్నో 'పరంజ్యోతి' అనే పాత్రని అడ్డుపెట్టుకుని మనకి చెప్పినట్లు అనిపిస్తుంది. పంతొమ్మిదోశతాబ్దంలో  బెంగాల్లో జరిగిన ఒక నిజజీవిత గాధ ఆధారంగా ఈ నవల వ్రాసారు మల్లాది గారు :)

సాధారణ పాఠకులకి ఈ నవల కొంచెం బోర్ గా అనిపించవచ్చు! కాని దైవ చింతన,ఆధ్యాత్మిక జిజ్ఞాస, జ్ఞాన సముపార్జన అనే విషయాల మీద ఆసక్తి ఉన్నవారు.........జన్మలు,కర్మ సిద్దంతాలు మీద నమ్మకం ఉన్నవారు చక్కగా చదువుకోవచ్చు. ఇవన్ని లేకపోయినా......కనీసం తెలియని విషయాలు తెలుసుకోవాలి అనుకునే ఆసక్తి ఉన్నా ఒక్కసారి ఈ నవల చదివితే జీవితం మీద మీ దృక్పధం మారిపోతుంది అన్నది మాత్రం ఖచ్చితం :)

నాకు ఈ నవల ఎంత నచ్చిందంటే...........దీనిలో నాకు నచ్చిన చాలా విషయాలని నేను విడిగా నోట్ చేసుకున్నా... ఎప్పటికి మర్చిపోకూడదని :)

 ఈ నవల చదవడం కూడా నా కర్మఫలమేనేమో!  :)

24, ఆగస్టు 2011, బుధవారం

మసాలా తాతయ్య!!


అవి నేను ఎంసెట్ రాసి,కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఖాళీగా ఈగలు తోలుకుంటున్న రోజులు! 

బద్ధకపు ఉదయాలు..... భుక్తాయాసపు మధ్యాహ్నాలు దాటేసాక ఇక సాయంత్రాలు డాబా మీద చెట్ల మధ్య గడిచిపోయేది. అప్పుడు అమ్మ చేసిపెట్టే  పకోడీలో,బజ్జీలో,కారప్పోసో.... ఏదో ఒకటి నేమరేసేదాన్ని.

ఒకరోజు మా ఎదురింటి సరోజ ఆంటి, పక్కింటి కుమారి ఆంటి మా ఇంటిముందు మెట్లమీద ముచ్చట్లు పెట్టారు. మా అమ్మని ఆహ్వానించారు. నేను సాధారణంగా ఈ రోడ్డు మీద అరుగు పై ముచ్చట్లకి దూరం-దూరం. కానీ ఆ రోజు ఏమి తోచక ఆంటీల బుర్ర తిందామని వెళ్లా! 

అప్పుడే ఒక మసాలా బండి మా ఇంటిముందుగుండా వెళుతోంది.ఆ బండికి 'రాం-లఖన్' అనో....'జై భజరంగబలి' అనో పేర్లు లేవు. మామూలు సాదాసీదాగా ఉంది. ఒక చిన్న గంట కొట్టుకుంటూ ఆ బండి తోసుకేలుతున్న అతనివైపు చూసా! 

చాలా పెద్దాయన. బక్కపలచగా ఉన్నాడు. సన్నని,పొడుగాటి మాసిపోయిన కుర్తా-పజమా ఇంకా తలమీద చిన్న తెల్ల టోపీ.చూస్తేనే తెలుస్తుంది ముస్లిం అతను అని. కళ్ళు లోపలి పోయి ఉన్నాయి. గడ్డం మాసిపోయి ఉంది. ఎందుకో చూడగానే జాలేసింది. 

అప్పటికే అమ్మ స్నాక్స్ ఏమి చేయలేదు. సరే అని...'అమ్మా! మసాలా కొనుక్కుంటా....ప్లీజ్ అమ్మా' అని గొడవ పెట్టా! యే కళనుందో వెంటనే తలూపింది సరే అని.
ఇక ఎగురుకుంటూ వెళ్లి ఆ మసాలబండిని ఆపి.....'తాతా...తాతా.... ఒక మసాలా చాట్ ఇవ్వా?' అని అడిగా.

తాత ఒక చిన్న నవ్వు నవ్వి....వెంటనే ఆ బండిని రోడ్డు పక్కకి పెట్టి.... ఒక న్యూస్ పేపర్ కోన్ లా చుట్టి దాన్లో రెండు చిన్న ఎండు విస్తరాకులు వేసి..... అందులో వేడి,వేడి చనా చాట్ వేసి....ఉప్పు,కారం,ఉల్లిపాయలు, కొత్తిమీరా ఇంకా ఏంటేంటో నాకు తెలీని పొడులు వేసి చకచకా ఒక స్పూన్ పెట్టి తిప్పి పైన నిమ్మకాయ పిండి ఒక తాటాకు ముక్క వేసి తినడానికి ఇచ్చాడు :) 

వేడివేడిగా పొగలు కక్కుతున్న ఆ మసాల చాట్ చూడగానే నా నోట్లో అప్రయత్నంగా నీళ్ళు ఊరిపోయాయి. అయినా ముందు డబ్బులు ఇచ్చి తర్వాత తిందాం అని 'ఎంత తాతా?' అని అడిగితే......'పాంచ్ రుపియా బేటి' అన్నాడు. 

'కేవ్వ్వ్వ్!' అనుకుని లోపలకెళ్ళి ఒక ఐదు రూపాయల బిళ్ళ తీసుకొచ్చి ఇచ్చా! చిరునవ్వుతో అది తీసుకుని ఆ బండి ముందుకు తోసుకుంటూ.....చిన్న గంట మ్రోగిన్చుకుంటూ వెళ్ళిపోయాడు మసాలా తాత.

బండి అటు వెళ్ళగానే ఇటు ఆ తాటాకు స్పూన్ తో ఆ చాట్ తీసి నోట్లో పెట్టుకున్నా......అంతే! అద్భుతం. ఎంత బాగుందంటే.....ఇప్పటివరకు నేను అంత రుచికరమైన చాట్ తినలేదు మళ్లీ. పనిలోపని మా అమ్మకి కూడా ఒక స్పూన్ పెట్టా. అలాగే అక్కడున్న సరోజ ఆంటికి, కుమారి ఆంటికి కూడా! అందరికీ బాగా నచ్చేసింది.

ఇక మరుసటి రోజు సరిగ్గా సాయంత్రం అయిదయ్యేసరికి మళ్లీ మేమందరం రోడ్డు మీద బైఠాయించాం! సరిగ్గా అదే టైముకి వచ్చాడు తాత. ఈసారి ఇరవై రూపాయల బిల్లు చేసాం :)

ఆ మర్నాడు, కుమారి ఆంటి ముగ్గురు అబ్బాయిలు నాని,కిట్టు,పవనూ, మా పక్కింట్లో ఉండే మూడు దయ్యాలు సలోమి,సుధా,సుజాత, మాధవి ఆంటి ఇద్దరూ పిల్లలు అమూల్య,అఖిల, నేనూ...... అందరం కలిసి ఆ చాట్ బండి మీద పడ్డాం. తాత ఫుల్ ఖుష్ ఆ రోజు. మేమందరం కూడా ఫుల్ హాపీస్!

ఇక వారం తిరిగేసరికి మా కిట్టుగాడి క్రికెట్ ఫ్రెండ్స్ అందరూ సాయంత్రం ఐదు అయ్యిందంటే ఆ బండి చుట్టు మూగేసేవారు. మా ఇంటిముందు పెద్ద తురాయి చెట్టు ఉండటంతో ఆ చెట్టు క్రింద బండి నిలిపేవాడు తాత. ఇక ఎంతమంది జనామో! మా కాలని అంతా తాత మసాలాకి ఫిదా అయిపోయారు. ఇంతమందిలోను నన్ను బాగా గుర్తుపెట్టుకునేవాడు తాత. అందరికంటే కూసింత ఎక్కువే పడేది నా వాటా మసాలాచాట్ పోట్లంలో! :) 

కొద్దిరోజులకి గిరాకి బాగా ఎక్కువైపోయేసరికి తన బుల్లి మనవరాలు రేష్మాని తీసుకొచ్చేవాడు సహాయానికి. ఆ అమ్మాయి సన్నగా,బక్కపలచగా ఉన్నా ముఖం ఎంత కళగా ఉండేదో! అలాగే పొడుగైన జడ కూడా! ఆ పాప చిన్ని చిన్ని చేతులతో అందరికీ చాట్ పొట్లాలు అందిస్తుంటే ఒక్కోసారి బాధేసేది. కానీ ఆ అమ్మాయి ఎంతో చలాకీగా,హుషారుగా పని చేస్తూ ఉంటే ముచ్చటేసేది కూడా! 

మా ఆంటివాళ్ళు అరుగుమీద కూర్చుంటే వాళ్ళు బండి దగ్గరకి వచ్చే అవసరంలేకుండా రేష్మా చేత చాట్ పంపేవాడు తాత. నేను వాళ్ళతోపాటే కూర్చునివుంటే 'దీదీ' అనుకుంటూ బుజ్జిగా వచ్చి ఇచ్చేది :) ఎంత ముద్దొస్తూ ఉండేదో!

అలా ముచ్చటగా నాలుగు వీధులు ఉండే మా కాలనీలో తాత,రేష్మ ఫేమస్ అయిపోయారు. మా వీధి చివర మెయిన్ రోడ్డు కలిసే చోట పానీపూరి బండ్లు రెండు వెలసినా తాత మసాల చాట్ కి ఏ ఆటంకము కలిగేది కాదు. అదేమిటో రోజు ఠంచనుగా ఐదింటికి వచ్చే తాత, ఏడింటికి బేరాలన్ని త్వరగా పూర్తిచేసి  వెళ్ళిపోయేవాడు. ఆదివారాలు మాత్రం అస్సలు కనిపించేవాడు కాదు. పోన్లే రెస్ట్ తీసుకుంటాడేమో అనుకునేదాన్ని. 

తాతలో నాకు బాగా నచ్చేది తన చిరునవ్వు. ఎంతమంది కస్టమర్లు ఉన్నా.....అస్సలు విసుగన్నదే ఉండదు ఆ ముఖం మీద. అంతే కాదు.....తాత చాట్ బండి ఎంత నీట్ గా మెయింటెయిన్ చేసేవాడో! డబ్బాలు....చాట్ కలిపే స్పూన్లు అన్నీ చాలా నీట్గా ఉండేవి. అలాగే నన్ను చూసినప్పుడల్లా.... ఏమి మాట్లాడకపోయినా 'బేటి' అంటూ ఆప్యాయంగా అందించే మసాలా పొట్లం ఆ రుచిని అమాంతం పెంచేసేది :) ఇలా మూడు నెలలు పండగ చేసుకున్నా నేను ;)

ఇంతలోనే నా కౌన్సెలింగ్ జరగడం,నేనూ ఇంజినీరింగ్లో జాయిన్ అవడం......రోజు సాయంత్రాలు 'సి' లాంగ్వేజ్ కోచింగ్ క్లాసెస్కి వెళ్లి ఇంటికొచ్చేసరికి ఏడు-ఎనిమిది అయ్యేది. ముందు కొద్దిరోజులు తాత మసాలా మిస్ అయినా క్రమంగా చదువు గోలలో పడి మర్చిపోయా. కానీ అప్పుడప్పుడు తాత గురించి అమ్మని అడుగుతూనే ఉండేదాన్ని. 

ఇక దసరా సెలవులు ఒక వారం రోజులు ఇచ్చారు మాకు. అప్పుడు మళ్లీ తాత దగ్గర మసాలా తిన్నాను. ఎంత ఆనందమేసిందో! తాతకి కూడా నన్ను చూస్తే బోలెడు సంతోషం :) 

మళ్లీ సెలవులు అయిపోయాక మామూలే! ఇక మళ్లీ తాతని చూసే అవకాసం ఎప్పుడు రాలేదు. ఎప్పుడన్నా సెలవులు వచ్చినా మేము ఊర్లకి వెళ్ళడం.....ఇలా ఏదో ఒకటి ఉండటంతో అలా తాతని చూసి చాలా కాలమే అయిపోయింది. 

సెకెండ్ ఇయర్ నేనూ హాస్టల్ లో చేరా! ఇక పూర్తిగా ఈ విషయం మరుగున పడిపోయింది. 

ఒకసారి ఎందుకో గుర్తొచ్చి మాటల మధ్యలో అమ్మని అడిగా!

'తాత ఇంకా వస్తున్నాడా అమ్మా! ఎలా ఉన్నాడు? రేష్మా ఎలా ఉంది?' అని.
'తాతకి ఈమధ్య ఒంట్లో బాగుండటం లేదట. అందుకే కొద్ది రోజులు మసాల బండి రేష్మ,రేష్మ వాళ్ళ అన్నయ్య చూసుకున్నారు. చిన్నపిల్లలు వాళ్ళకేం వచ్చు తాత లాగా రుచికరంగా చేయడం? ఏదో వాళ్ళకి తెలిసినట్టు చేసేవారు. కొద్దిరోజులకి సరైన బేరాలు రాక వాళ్ళు మానేశారు. ఇప్పుడు ఎవరూ మసాల బండి వేయట్లేదు' అని చెప్పింది.

ఎంత బాదేసిందో! తాతకి ఏమి కాకుండా త్వరగా కోలుకుని మళ్లీ మసాల బండి వేయాలని కోరుకున్నా!

కానీ ఆ తర్వాత రేష్మ,వాళ్ళ అన్నయ్య పానిపూరి బండి పెట్టారట మెయిన్ రోడ్డు మీద. మా అమ్మ వాళ్ళదగ్గర ఒకసారి తాత గురించి వాకబు చేస్తే తెలిసిందట.....తాత ఇక లేరని :(

ఎంత బాదేసిందో.....ఆ మాట వింటుంటే! తాత చేతిలో అమృతమైపోయే చాట్...... ఎంత పని ఒత్తిడున్నా తన ముఖం పై చెరగని చిరునవ్వు.......... ఆ గుంటలు పడిన కళ్ళలో నామీద చూపించే అభిమానం,ఆప్యాయత గుర్తొచ్చి చాలా బాధేసింది.

ఏంటో ఈ బంధాలు...... చిత్రంగా కలుస్తాము.......... అంతే చిత్రంగా విడిపోతాము! ప్చ్! ఏంటో కదా!

మళ్లీ ఇన్నాళ్టికి 'మసాలా తాతని' గుర్తుచేసిన మన కొత్తావకాయగారికి బోలెడు బోలెడు ధన్యవాదాలు :) 

21, ఆగస్టు 2011, ఆదివారం

ఒక బృందావనం!!

బృందావనం.......
ఆ పదమే ఒక పులకింత.....ఆ తలపే ఒక మైమరపు....
ఏ క్షణాన....ఆ సుందర లోకంలో అడుగుపెడతానా...అని నా తనువు నిలువెల్లా కనులై  ఎదురుచూస్తున్నది.....
'కృష్ణా!....మనసు ఎందుకో ఉత్తుంగతరంగమై ఎగసి....ఎగసి....నా మోమును సుతారంగా తాకివెల్లిపోతున్న ఆ  పిల్లతిమ్మెరల మీద సాగిపోతోన్న నీ మురళీగానాన్ని ఓడిసిపట్టుకోవాలని ఆత్రపడిపోతోంది!! ఎందుకో దానికి అంత తొందర? 
వచ్చేస్తున్నాను స్వామీ....నీ దివ్యమనోహర లోకానికి....
నీ మృదుపదస్పర్శతో పునీతమైన ఆ నందనవనంలో ప్రతి రేణువు నీ పాదరజమే కదా!
నీ రూపాన్ని నిండారా నింపుకున్న నీ సుధాధామంలో ఒక్క క్షణం నిలిచినా నా జన్మ ధన్యమవును కదా!'

ఈ ఆలోచనల్లో మునిగిపోతూ..... ఆ ఆనందలోకంలో తేలియాడుతుండగానే వచ్చేసింది 'బృందావనం'....నా కలలవనం...

నాతోపాటు వచ్చిన మిత్రబృందం అంతా తమతమ సామాన్లతో బస్సు దిగి...ముందు నడుస్తున్నారు.....
నేను మాత్రం....బస్సు దిగే ముందే....ఆ 'బృందావనం' అధిదేవత అయిన 'రాధారాణి'ని మనసులోనే అనుమతి అడిగి....నమస్కరించి....బస్సు దిగి పరమపవిత్రమైన ఆ మృత్తికని చేతితో స్పృశించి....శిరస్సున ధరించాను!
ఏదో ఒక అనిర్వచనీయమైన అనుభూతి... నన్నునిలువనీయట్లేదు.....ఆ అనుభూతిలోనే మెల్లగా నడుస్తూ....నా నేస్తాలను అనుసరించాను!

చుట్టూ చూసాను! నా కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయ్! ఏదో చూడాలని ఆశపడుతున్నాయ్! ఏదో కనుగొనాలని ఆత్రపడుతున్నాయ్!! కానీ ఎక్కడ? 

మెల్లగా అలా ముందుకు సాగుతున్నాను.....ఎంతకీ ఆ నందనవనం కానరాదే??
ఇదేనా బృందావనం? అని ఎవరినైనా అడగాలనిపించింది. కానీ కళ్ళముందు ప్రత్యక్షంగా కనపడుతోంది.... మరి నా మనసేమో.... 'ఇది కాదు నేను చూడాలనుకున్న బృందావనం' అని గోలచేస్తోంది.ఇదేమి పట్టించుకోకుండా కెమెరాలతో కనపడినదల్లా ఫోటోలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు నా మిత్రబృందం. వారివెంట జీవంలేనిదానిలాగా నడుస్తున్నాను నేను!

నా భుజాన వ్రేలాడుతున్న కృష్ణుడిముఖచిత్రం ఉన్న హాండ్ బాగ్....బరువుగా అనిపించింది. అందులో కృష్ణుడిమీద రాసిన వేలవేల పాటలు కలిగి ఉన్న పుస్తకం ఉంది. ఈ బృందావనంలో ఆ దేవదేవునికి అంకితం చేద్దామని తెచ్చి పెట్టుకున్న ఆ పుస్తకం.....దీనంగా నావంక చూస్తున్నట్టు అనిపిస్తోంది....

ఆ పుస్తకంలో ఐదువేల పాటలు రాయాలని నా సంకల్పం....ఇప్పటికీ 4999 రాసి....ఆ చివరి పాట ఈ బృందావన క్షేత్రంలో....ఈ సుమనోహర ప్రదేశాన్ని వీక్షిస్తూ....వ్రాసి....నా సంకల్పాన్ని నెరవేర్చి ఆ స్వామి పాదాలకి ఈ పాటలతోటని అంకితమివ్వాలని ఆశ పడ్డా!! కానీ ఏమని వ్రాయను?? ఎలా రాయగలను??? 

జయదేవుడు వర్ణించిన ఆ అద్భుత సౌందర్య అద్వితీయ సుందర నందనవనం ఇదేనా?
నా లీలామోహనుడు....ప్రతినిత్యం రాధాదేవితో రాసలీలలాడే రససామ్రాజ్యం ఇదేనా?
నా మురళీధరుడు తన సఖీసమూహంతో ఆటలాడిన వ్రజ భూమి ఇదేనా?
"మాధవికా....పరిమళ లలితే....నవ మాలతి జాతి సుగంధౌ!!" అని అన్నారే జయదేవులు....మరి ఎక్కడ ఆ మాధవీలతలు? ఎక్కడ ఆ మాలతిపుష్పగంధాలు?
"లలితలవంగలతా పరిశీలన...కోమలమలయసమీరే....మధుకరనికర కరమబ్బిత కోకిల...కూజిత కుంజ కుటీరే!" ఈ కీర్తనకి అర్ధం? ఏవి ఆ లతలతో అల్లుకున నికుంజాలు?? ఫల,పుష్పవృక్షాలతో అలరారే కుటీరాలు? కమ్మని కోయిలల కిలకిలా స్వరాలు?

నా కళ్ళవెంట నీటి తడి! ఎదలో ఏదో మూల అలజడి! ఎక్కడికక్కడ షాపులు..... రకరకాల వస్తువులు అమ్ముతూ నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు..... వస్తువులు కొన్నా కొనకపోయినా కనీసం చూసినా ఖరీదు కట్టమని నిలదీసే వర్తకులు.... విపరీతమైన వానరసేన.....ఇరుకిరుకు సందులు..... పాతకాలంనాటి ఇళ్ళు... కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కుడ్యాలు..... తోసుకుంటూ తిరిగే జనాలు..... అంతకంటే వేగంగా సంచరించే అపరిశుభ్ర గోగణం.... భక్తిభావం అసలు లేకుండా అంతా గోలగోలగా ఓహ్! ఇక నావల్ల  కాలేదు..... నాకు అస్సలు అడుగు ముందుకువేయబుద్ది కాలేదు.... ఇక ఏమీ చూడాలనిపించలేదు!! ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించగా.... అక్కడే ఒక షాపు దగ్గర కూలబడ్డాను! అప్రయత్నంగా నా కనురెప్పలు మూతపడ్డాయి..... మనసుమాత్రం కృష్ణనామజపంలో మునిగిపోయింది! అలా ఎంతసేపున్నానో తెలీదు....

క్రమంగా చీకటిపడిపోయింది.... లేచి చూసేసరికి ఎవ్వరూ లేరు.... నా స్నేహితులు....మమ్మల్ని తీసుకొచ్చిన బస్సు....ఆ మనుషులు.........ఎవ్వరూ లేరు....

దిగ్గున లేచాను! వెనక్కి తిరిగాను....అంతే! మాటాలు రాక చేష్టలుడిగిపోయి మైనపుబోమ్మలా అలా చూస్తూ ఉండిపోయాను! నాకళ్ళను నేనే నమ్మలేకపోయాను!

ఇందాక చూసిన రోడ్ల స్థానే పచ్చటి తివాచి పరిచినట్టున్న నందనవనాలు..... ఇంతింతేసి పువ్వులతో విరగబూస్తున్నాయి...... అంతే కాదు..... ఎప్పుడు కనివిని ఎరుగని రకరకాల ఫలాలతో విరగగాసిన చెట్లు ఆ ఫలభారంతో కొంచెం ముందుకు వంగాయి కూడా! పెద్దపెద్ద చెట్లు.... వాటిని బలంగా అల్లుకుని ఒకచెట్టునించి ఇంకో చెట్టుకి బంధం వేస్తున్న లతలు.... ఆ లతల్ని ఆధారంగా చేసుకుని ఉయ్యాలలూగుతున్న అందమైన గోపికలు..... ఆకాశంలో నక్షత్రాలన్నీ గుదిగుచ్చి తారాతోరణం కట్టినట్టు అంతటా వెలుగుజిలుగులు.... ఎటూ చూసినా.... కన్నెపడుచులు.... నవ్వుతూ.... తుళ్ళుతూ.... ఆటలు ఆడుతూ... పాటలు పాడుతూ.... అబ్బ! ఆ పాటలు తేనెలతేటలులాగా ఎంత బాగున్నాయో.......అలా ఆ వింతలన్నీ అబ్బురంగా చూస్తూ ముందుకు సాగాను!

రకరకాల పక్షుల కిలకిలారావాలతో,కమ్మని పూల పరిమళాలతో ఆ దారంతా ఆహ్లాదంగా ఉంది! కాళ్ళకింద ఆ పూలపుప్పొడి జారిపడి సుతిమెత్తగా తగులుతోంది.... చల్లని మలయమారుతం నా శ్వాసలో మమేకమౌతోంది..... ఆ పువ్వులని... ఆ ఆకులను చేతులతో తాకుతుంటే  ఏదో పులకింత! అలా... ఆ తోటలో..... ఆ పొదరిళ్ళ మధ్యలో...... ఆ చుక్కల పరదా క్రింద మెత్తమెత్తగా నడుస్తూ వెళుతుంటే..... వినిపించింది..... ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతున్న గలగలల సవ్వడి! "యమున....అది యమునా నదే!!" అనుకుంటూ పరుగుపరుగున వెళ్లి చూద్దునుకదా...... అదేమిటో.... నల్లగాఉండే యమున..... పున్నమి చంద్రుడి వెన్నెలకి కాబోలు.... ధవళ కాంతులతో ధగధగలాడుతోంది.... యమున ఒడ్డున ఉన్న సైకత రేణువులు... హిమరజములా అన్నంతగా మెరిసిపోతున్నాయ్! యమున ఎంత ఉవ్వెత్తున ఎగసిపడుతోందంటే...... బృందావనంలోకి వచ్చేసి ఆ అందమంతా తన చేతులతో స్పృశించాలి అనుకునేంతగా!! ఇక నెలరాజు అందం చెప్పనలవికానంతగా ఉంది..... నా కృష్ణుడి మోమల్లె!!

ఇంతలో ఎక్కడినించో.... కిలకిలమని నవ్వులు..... కోలాహలాలు...... మంద్రస్వరంలో గానం వినిపిస్తున్నాయ్! అటు వైపు తలతిప్పి చూస్తే..... ఒక పెద్దదేవగన్నేరు వృక్షం..... చెట్టునిండా పూలే..... అల్లంతదూరానికి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయ్! దానికింద.... బుల్లిబుల్లి తువ్వాయిలు గెంతులేస్తున్నాయ్! ఇంతంత తోకలతో నెమళ్ళు అటు,ఇటు తెగ హడావిడిగా తిరిగేస్తున్నాయ్! ఇంకా చాలామంది గోపీగోపికలనుకుంటా నృత్యాలు చేస్తున్నారు...... అటు వైపు వెళదామని నడక సాగించాను! దారిలో నా కాలికి అక్కడక్కడా చిన్నిచిన్నికుందేలుపిల్లలు అడ్డుపడుతున్నాయ్..... వాటిని పట్టుకుందామని..... ఒకదానివెంట పరుగుతీసాను..... ఇంతలో ఎక్కడినించి వచ్చిందో...... ఒక చిన్నారి జింకపిల్ల బెదురుబెదురుగా చూస్తూ.... నావైపు వచ్చి నన్ను చూడగానే..... పారిపోబోయింది...... నేను దానివేనకే పరుగు మొదలుపెట్టాను.....


అది... .నన్ను ఎక్కడికేక్కడికో తీసుకెళ్ళింది...... ఏవేవో వనాలు తిప్పింది..... దారిలో ఎన్నో వింతలను చూపించింది...... అయినా దానికి అలుపు రాదే! నాకు ఆయసమోచ్చేస్తోంది..... ఇంతలో ఒక పొన్నచెట్టు కనపడితే.... అక్కడ కాసేపు ఆగాను!

 ఈ జింకపిల్ల ఎటువేల్లిపోయింది అని అనుకుంటూ.... మెల్లగా ముందుకు వెళుతుంటే.... అక్కడ  ఏదో ఒక సుప్రకాశం నాకు దగ్గరవుతోంది.... క్రమంగా అది ఒక ఆకృతిని సంతరించుకుంటోంది.... నాకు బాగా పరిచయమున్న వ్యక్తిలాగే అగుపిస్తోంది....... ఆ వ్యక్తి దగ్గరయ్యే కొద్దీ దివ్యచందన పరిమళమేదో నా మేనిని చుట్టేస్తోంది..... ఒక నీలకాంతి ఆ ప్రదేశమంతా పరుచుకుంది..... ఒక మురళీరవం నా చెవుల్లో అమృతం పోస్తోంది..... ఒక అందెలరవళి నా గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది.... ఒక తులసిమాల నా చేతులకు అందే దూరంలో నిల్చుని ఉంది.... ఒక నెమలిపింఛం ఆ మణిమయ కిరీటంలో ఒదిగిపోయింది...... ఒక కస్తూరితిలకం నా కళ్ళకు స్పష్టంగా..... అతి దగ్గరగా కనిపిస్తోంది...... ఒక అచ్చెరువొందే సౌందర్యం ఒలికిస్తున్న నేత్రద్వయం నావైపు చూసింది! సమస్త సృష్టిని స్తంభింపజేసే ఒక చిరునవ్వు ఆ మోమున విరిసింది.... నా గుండె వేగం రెట్టింపయ్యింది...... నా ఊపిరి  క్రమంగా బరువైపోతోంది ...... నా శరీరంలో ఆణువణువూ కంపిస్తోంది..... కానీ పెదవులు మాత్రం........ అతి కష్టం మీద  పెగుల్చుకుని ఒక్క పదం ఉఛ్ఛరించాయి..... 'కృష్ణా!'

అంతే.... లేచి చూసేసరికి చుట్టూరా నా స్నేహితులు..... కంగారుగా నా కళ్ళలోకి చూస్తున్నారు! 'అరె.... ఇప్పుడే కదా... ఇంత దగ్గరగా చూసాను.... ఆ నీలమేఘశ్యాముడిని..ఏడీ?? నా కృష్ణుడు ఏడీ?'...... నాకంతా అయోమయంగా ఉంది..... 'అంటే....ఇదంతా కలా? అయ్యో.... నిజమైతే ఎంతబాగుండేది?' ఒక్క క్షణం దుఖం తన్నుకొచ్చింది.....

'కృష్ణా! ఇదంతా నిజమైతే  బాగుండు కదా....ఎందుకిలా చేసావ్? కనిపించినట్టే కనిపించి మాయమయ్యావా కన్నయ్యా?' అని బాధగా మనసు అడుగుతుంటే.... కళ్ళు శ్రావణమేఘాల్లా వర్షిస్తున్నాయి..... ఎందుకో అప్రయత్నంగా నా హ్యాండ్ బాగ్లో చేయి పెట్టాను..... నా పాటల పుస్తకం బైటకు తీశాను! ఇంకొక్క పాట.... ఒకేఒక పాట రాస్తే...... ఇక ఈ బృందావనవిహారికి అంకితమివ్వొచ్చు!! కానీ ఇప్పుడు ఈ బాధలో.... ఎలా?నావల్ల కాదు.... ఇక ఇప్పటికీ ఇంతే ప్రాప్తం.... మళ్లీ ఎప్పుడు ఈ పుస్తకం పూర్తి చేస్తానో..... ఈ గోపాలునికి ఎప్పుడు అర్పితం చేస్తానో.... అనుకుంటూ...... చివరి పేజి తెరిచాను.....

ఆశ్చర్యం!!!!..... నా గుండె ఒక్క క్షణం  ఆగి కొట్టుకుంది......
నా చేతివ్రాతలో రాసి ఉంది... నా 5000వ పాట! ఇందాక కలలో నేను విన్న ఆ గోపికలు పాడిన పాట! కానీ... ఇది ఎలా సాధ్యం? అంటే.... ఇందాక నేను చూసింది..... కలా? నిజమా?.....

వేవేల మురళీస్వరాలు ఒక్కసారిగా చుట్టుముట్టిన అనుభూతి.....
రంగురంగుల పూలబంతై ఊయలూగుతున్నట్టున్న జగతి....
నన్నల్లుకుపోతున్న మధురాధిపతి అందించిన మధురగీతి. 

ఒక్కసారి ఆ దేవదేవుని మనసారా స్మరించి......కృష్ణస్పర్శతో పునీతమైన ఆ పాటల పుస్తకాన్ని ఆర్తితో ముద్దాడి నా మురళీమనోహరుడి దివ్యచరణాలవిందాలకు సమర్పించాను!
  


[కృష్ణాష్టమి సందర్భంగా వ్రాసిన ఈ బుల్లి కథ నా బుజ్జి కిట్టుగాడికి అంకితం :) ]

18, ఆగస్టు 2011, గురువారం

జైలుకెళ్లాననే అనుకున్నా!

ఒకరోజేమయిందో తెల్సా? అసలిక నేను జైలుకి వెళ్ళిపోయాననే అనుకున్నా....
బాబోయ్! ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికీ నాకు దడగానే ఉంటుంది....

మన దేశంలో జీవితం ఎంతో స్వేచ్చగా సాగిపోతుంటుంది. రూల్స్,రెగ్యులేషన్స్ ఎన్నున్నా మనం వాటిని పెద్దగా ఎప్పుడు పట్టించుకోం. కానీ విదేశాల్లో పరిస్థితి అలా కాదు. ప్రతిది రూల్స్ ప్రకారమే జరగాలి.


'For women ' కోసం రాసిన నా పూర్తి వ్యాసం ఇక్కడ ......

అమెరికాకి వచ్చిన కొత్తల్లో అంతా కొత్తకొత్తగా ఉన్న నాకు జరిగిన ఒక ఆసక్తికర సన్నివేశం. చదివి ఎలా ఉందో చెప్పండే! :) 

16, ఆగస్టు 2011, మంగళవారం

నేను....నా వరలక్ష్మి వ్రతం.

హబ్బ! ఎలాగైతేనేం.....నా మొదటి వరలక్ష్మి వ్రతం పూర్తి చేసుకున్నాను [క్రితం సంవత్సరం కుదరలేదులెండి]

అసలు మూడు రోజులనించి ఒకటే హైరానా! సరే...వ్రతం చేసుకుంటాను..... మరి వాయనాలు? ఎవరికి ఇవ్వాలి? ఎక్కడికెళ్ళి ఇవ్వాలి? ఇలా బోలెడు డౌట్లు బుర్రని వడ్రంగి పిట్టలా పోడిచేస్తున్నాయ్ [పోలిక బాగుందా? నేనే కనిపెట్టా ;) ]

అసలే కొత్త అపార్ట్మెంట్లోకి దిగాం.దీనికి తోడు....మా ఎదురు, పైన,పక్కన అందరూ నిశివర్ణ పరాక్రములే! మనకేందుకులేమ్మని కిమ్మనకుండా ఉంటున్నాం. ఇప్పుడు వాయనం అనుకుంటూ వెళితే ఇంకేమన్నా ఉందా?

ఈ దిగులుతోనే ఎలాగో అలా పూజసామాగ్రి తెచ్చుకున్నాను. షాపువాడిని 'నల్ల శనగలు' ఉన్నాయా అని అడిగితే.....'గ్రీన్/ఎల్లో' ఉన్నాయ్ అని చెప్పాడు. హతవిధీ అనుకుని ఆ 'ఎల్లో' శనగలే తెచ్చుకుని ముందు రోజు రాత్రి ననబోసా. ఇంతలోకే మా చందూ కొలీగ్ వైఫ్ వ్రతం రోజున పేరంటానికి పిలిచారు. తెలుగువారే! ఇక ఇదే చాన్స్ అనుకుని వారిని అదే రోజున మా ఇంటికి భోజనానికి పిలిచా! పనిలోపని వాయనం ఇవ్వొచ్చు కదా అని ఆశతో. ముందు మొహమాటపడ్డా తర్వాత వస్తామన్నారు ఇంటిల్లిపాది. అప్పుడు నాక్కొంచెం మనసు కుదుటపడింది.

ఇక మరుసటిరోజు ఐదింటికి అలారం పెట్టా! యధావిధిగా ఆరింటికి లేచా![అలా చూస్తారేం? చాలా తొందరగా లేచా కదా!] లేస్తూనే పనిలోపని చందుని లేపేసా! 

'నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే......నేను పొద్దునే లేవటం ఎందుకు ఇందు?' అంటే......
'ఆహా! మరి వంటకి సాయం ఎవరు చేస్తారుట?' పూజకి ముందే ప్రసాదాలు చేయాలి కదా! అసలే తొమ్మిది రకాలు చేయాలనీ డిసైడేడ్' అని చెప్పా! 
మా చందూ గుండెలో రాయి పడింది. అయినా ఆ చేదు నిజాన్ని దిగమ్రింగి....నేను తీసుకున్న వయోలేంట్ డెసిషన్ కి తన సహాయసహకారాలు పూర్తిగా అందించాడు :) [ఎంత మంచాబ్బాయో కదా!]

ఇద్దరం లేచి...తల స్నానం చేసి ప్రసాదాలు వండటం ప్రారంభించాం.ముందుగా నేనైతే.... ఎంచక్కా మడిచీర కట్టుకుని..... కాళ్ళకి పసుపు రాసుకుని..... నాకు ఇష్టమైన ఆహార్యంలో....   నాకు చాలా ఇష్టమైన తులసి కుండికి [ఇక్కడ కోటలు,మేడలు కట్టలేములెండి] దణ్ణం పెట్టి పువ్వులు పెట్టి.....దాని ముందు ముగ్గులేసి పసుపు,కుంకుమ చల్లి దణ్ణం పెట్టొచ్చా! :) అలాగే ఇంటిముందు ముగ్గేసి వచ్చా! [అబ్బ! నా కోరిక తీరింది]

ఇక ఇందుగారు వంటగదిలోకి రంగప్రవేశం చేసారు. చకచకా పచ్చి చలివిడి చేసేసారు. వెనువెంటనే అప్పాలు చేసేసి ఎర్రగా వేయించేశారు. ఇంతలో చందుగారేమో పులిహోర కలిపేసి, పరమాన్నం  చేయడంలో మునిగిపోయారు. అంతలోనే ఇందుగారు టకటకా టమాటా పప్పు చేసి,చకచకా చిక్కుడు కూర చేసి, ఇక రసం పెట్టే పనిలో మునిగిపోయారు. ఈలోగా చందుగారు చేసిన పులిహోర,పరమాన్నం రెడీ అయిపోయాయి. అంతలోనే కొబ్బరి+మామిడి కలిపి పచ్చడి చేసేసారు ఇందుగారు.

సరే కదా అని కాస్త నుదురుకి పట్టిన చెమట తుడుచుకుంటూ టైం చూద్దుము కదా! ఎనిమిదిన్నర!!!!!! చందూ గారు 'కేవ్వవ్వ్వ్వ్' అని ఒక కేక పెట్టి తొమ్మిదింటికి మీటింగ్ ఉంది అని పరిగెత్తారు. నేను 'హిహిహి' అని నవ్వుకుని ఆ ప్రసాదాలన్ని ప్లేట్ల్స్లో ఎంచక్కా సర్దుకుని పూజకి అన్నీ రెడీ చేసుకునే పనిలో పడిపోయాను.

ఇక ఎంచక్కా ఉప్పాడ పట్టుచీర కట్టుకుని, నా ఫ్రెండు బుల్లి ఇచ్చిన నెక్లెస్ సెట్ పెట్టుకుని, అచ్చ తెలుగు అమ్మాయిలా చక్కగా ముస్తాబయ్యి ...... హాల్ లో ఒక మూల అమ్మవారికి మండపం ఏర్పాటు చేసుకుని..... ఫలములు-పుష్పములు,ఇతర పూజా ద్రవ్యములు అన్నీ దగ్గర పెట్టుకుని అత్యవసరమైన లాప్టాప్ కూడా పక్కనే పెట్టుకుని.... ఒక పండు,తాంబూలం తీసుకుని తూర్పు ముఖముగా కూర్చుని పూజ ప్రారంభించాలని సంకల్పించాను.

ఇంతలో ఇంకో డౌటు మదిలో మెదిలింది. తోరాలు కట్టాలి కదా! అని. వెంటనే టిక్కు-టిక్కు  అని నంబర్లు నొక్కి ఇంటికి కాలాను. 

మా అమ్మ ఫోన్ ఎత్తి 'పూజ అప్పుడే...అయిపోయిందా 'అంది.
'ఇంకా మొదలే పెట్టలేదే తల్లీ...ముందు ఈ తోరాలు ఎలా కట్టలో చెప్పు....మూడు తోరాలు కట్టాలి అట కదా!' అన్నాను.
"ఓ! అదెంత పని.... తొమ్మిది దారపు పోగులు తీసుకుని,పసుపు రాసి,వాటికి తొమ్మిది పూలతో తొమ్మిది ముడులేసి తోరం కట్టాలి' అని చెప్పింది.
'ఈ తొమ్మిది గోలేంటి అమ్మా! అయినా ఇప్పుడు నేను పూలు మాల కట్టాలా?' అని నొక్కినోక్కి అడిగాను.
'మరి చెప్పింది అదే కదా! తొమ్మిద పూలతో తొమ్మిది ముడులేయాలి' అన్నది మా అమ్మ.
'అది మామూలు జనాలకి ఐతే లెఖ్ఖ. మనం కొంచెం వెరైటి కదా! నాకు పూలు మాల కట్టడం రాదు కాదే తల్లి.....ఇప్పుడు తొమ్మిది పూలు X మూడు తోరాలు = 27 పూలు మాల కట్టాలంటే నేను కిందపడి దొర్లి ఏడ్చినా నావల్ల కాదు కదా అమ్మా!"
" నీ ఖర్మ! నీకు చిన్నప్పటినించి కొన్ని వందల సార్లు చెప్పా! పూలు మాల కట్టడం నేర్చుకోవే అని. విన్నావు కాదు. ఏదో ఒకటి చేయి. పోనీ తొమ్మిది ముడులేయ్యి చాలు"
"ముడులంటే ఏం ముడులు? నాకు అడ్డదిడ్డంగా పీటముడి తప్ప ఇంకేం ముడులు రావు కదే!"
"నా ఖర్మ! ఎంత పనిమంతురాలివే తల్లీ! ఇంకా నయం అబ్బాయిగా పుట్టలేదు.... పెళ్ళిలో మూడు ముడులంటే నోరు వేల్లబెట్టేవాడివి"
"అమ్మా! జోకులా? ఇంకో రెండు గంటల్లో భోజనాలకి చందూ కొలీగ్స్ ఫ్యామిలి వస్తారు.....అటు,ఇటు కాకుండా అయిపోతుంది. వ్రతం ఈలోగా పూర్తి చేయాలి. ఈ తోరాలు లేకుండా వ్రతం చేయాలేమా?"
" ఎలాగో అలా తొమ్మిది పూలతో తొమ్మిది ముడులు వేయడం నేర్చుకో. గంట కానీ...రెండు గంటలు కానీ. ఇప్పుడు రాకపోతే ఇక ఎప్పటికీ రాదు. పూజ అయ్యాక ఫోన్ చేయి' అని ఠపీమని ఫోన్ పెట్టేసింది మా అమ్మ!

వాఆఆఆఅ..................వాఆఆఆఆఆ...........

మీరు నమ్మరేమో....కనీసం ముప్పావుగంట పట్టింది నాకు పూలు మాలకట్టడం నేర్చుకుని, ఆ మూడు తోరాలు చేయడానికి. [పాపం ఇందు కదా!]

ఎలాగోలా ఆ తోరాలు కట్టి....ఇక రాగా.కాం తెరిచి వరలక్ష్మి వ్రత విధానం ఆడియో ఆన్ చేశా!

ముందు కాసేపు బానే జరిగింది. గణపతికే అరగంట పూజ చేసాడు ఇక వరలక్ష్మికి గంటన్నర చేస్తాడేమో అనుకున్నా. కానీ పర్లేదు తొందరగానే పేకప్ చెప్పేసాడు. అయినా ఈ పూజ మొత్తంలో ఒక పదిసార్లు ఆ ఆడియోకి పాజ్ పెట్టి,లేచి అవి-ఇవి తెచ్చుకుని మళ్లీ స్టార్ట్ చేసాను.[అలా చేయొచ్చో లేదో!]

అమ్మవారికి ఎంచక్కా మొదటి వాయనం ఇచ్చి బోలెడు కోరికలు కోరేసుకున్నా ;) 

ఇక లాస్ట్ కి నైవేద్యం అప్పుడు......నారికేళం కొట్టమన్నాడు. నేను వంటగదిలో పట్టకారు తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నా! ఆయన చెప్పిందే తడవుగా ఆ కొబ్బరికాయ తీసుకుని ఆ పట్టకారుతో రెండు పీకులు పీకా! అబ్బే! అస్సలు చలనం లేదు. 'ఈ చందుని తెమ్మన్నాను చూడు నాది బుద్ది తక్కువ! ముదురుకాయ అనుకుంటా!' అని రెండు సనుగుళ్ళు సణుక్కుని మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించా!

 హ్మ్! దాన్ని కొట్టే దెబ్బలకి నా చెయ్యి ఎర్రగా కందిపోయిందిగాని అది తొణకదు,బెణకదు. నాకు నీరసమొచ్చేస్తోంది. అసలే పొద్దునించి కడుపులో మేతలేదు! పైగా పొద్దున్నే లేచా! ఎంత చాకిరి చేశా! టైం చూస్తే.....పన్నెండు! ఇక ఇహనో,ఇపుడో వాళ్ళు వచ్చేస్తారు. 'అయినా వ్రతం అంతా అయిపోవచ్చాక ఈ కొబ్బరికాయ దగ్గర ఆపేసావేంటి తల్లి?' అని అమ్మవారివంక దీనంగా చూసేసరికి కరిగిపోయిందో ఏమో....నెక్స్ట్ కొట్టిన దెబ్బకి కొంచెం పెచ్చు లేచింది. ఇక దానికి ఒక రంద్ర్హం చేసి ముందు నీళ్ళు అన్నీ గిన్నెలో పట్టేసి....ఆనక ధబీధబీమని బేకితే అప్పుడు అష్టచేక్కలైంది మా కొబ్బరికాయ! 

"ఈ విషయం చచ్చినా ఎవరికి చెప్పకూడదు. ఆఖరికి కొబ్బరికాయ కొట్టడం కూడా రాదా? అని నవ్వి ముక్కున వేలేసుకున్నా.... వేసుకొందురు..... అయినా ఎప్పుడు నేను కొబ్బరికాయ కొట్టినా ముచ్చటగా మధ్యకి చీలి రెండు వక్కలౌతుంది. ఇదేమి ఖర్మో! ఇవాళ ఇలా ఏడిపించింది".... అని నాలోనేనే మధనపడి...ఎలాగో అలా మొత్తానికి చివరాఖరికి నానావిధఫల,భక్ష్య భోజ్యాలతో అమ్మవారికి నైవేద్యం పెట్టాక.... 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నా!

అనుకున్నట్టే....పన్నెండున్నరకి వారు పిల్ల-జేల్లతో సహా ఇంటికి భోజనానికి వచ్చారు. ఆమెకి ఎంచక్కా బొట్టు పెట్టి,పసుపు రాసి నా వంకరటింకర తోరము కట్టి, వాయనం ఇచ్చి..... దణ్ణం పెట్టా! 

తరువాత  మేము చేసిన అపురూప వంటకాలతో వారికి కొసరికోసరి వడ్డించి మరీ భోజనాలు పెట్టాం. మిక్కిలి సంతసించిన ఆమె సాయంత్రం వాళ్ళింటికి నలుగురైదుగురు ముత్తైదువులు వాయనానికి వస్తారని...... కావాలంటే నేను కూడా వాళ్ళకి వాయనమివ్వోచ్చని చెప్పారు. ఇక సంతోషంతో నాలుగు గెంతులు వేసి..... సాయంత్రం నా వాయనాలన్ని తీసుకుని వాళ్ళింటికి వెళ్లా! అక్కడ అందరికీ ఇచ్చి, వాళ్లకి తెలిసినవాల్లింటికి వెళ్లి ఇచ్చి, వాళ్ళలో కొందరు వాళ్ళింటికి నన్ను పిలిచి నాకు ఇచ్చి..... అలా బోలెడు మందికి వాయనాలు ఇచ్చి-పుచ్చుకుని, అలా చాలామందితో ఫ్రెండ్షిప్ చేసేసుకుని రాత్రి ఏ పదింటికో తెరిపిన పడ్డాను :) 

హమ్మయ్య! ఎలాగైతేనేం...........చందూ గారి అపరిమితమైన సహాయసహకారాలతో నా మొదటి వరలక్ష్మి వ్రతం గ్రాండ్ సక్సెస్! దేశంకాని దేశంలో వాయనాలు ఎవరికి ఇవ్వాలో అని పడ్డ టెన్షన్ అంతా హుష్ కాకి :) 

అదండీ.....నేను....... నా వరలక్ష్మి వ్రతం కథ! ఈ కథా శ్రవణం[అదే..వీక్షణం] చేసిన మీరందరూ కామెంట్ల అక్షతలు[అంటే తిట్లు కాదు బాబోయ్...దీవెనలు] నామీద జల్లుతారని ఆశిస్తూ....మీ ఇందు :) 


నా వ్రతం ఫోటోలు పెడుతున్నానోచ్! అడిగిన వారందరూ చూసేయన్దోచ్!





8, ఆగస్టు 2011, సోమవారం

రివర్స్ సేమ్యా ఉప్మా!

రండి బాబూ....రండి...
నేడే చూడండి....మా 'రివర్స్ సేమ్యా  ఉప్మా'

ఉప్మా అంటే.....ఉప్మా కాదు....
చెప్మా అంటే...చెప్మా కాదు....
పదిలంగా చేసుకుతిన్న రివర్స్ ఉప్మా మాది.....రివర్స్ ఉప్మా మాది ;) [పాట బాగుంది కదా!]

ఈ రివర్స్ ఉప్మా చేయాలనీ ఎందుకనిపించిందంటే.......ఎప్పుడు చేసే పని ఎందుకు చేయాలి? డిఫరెంట్ గా ఎందుకు ట్రై చేయకూడదు? అందుకే ఎప్పుడు చేసే సేమ్యా ఉప్మాని ఇలా వెరైటిగా,ఇన్నొవేటివ్గా చేశా :)  [బాగా బిల్డప్ ఇచ్చానా? :)) ]

ఇప్పుడు కావాల్సిన పదార్ధాలు: [పక్కూరి వంటలో చూపించినట్టు మంచిమంచి గాజు ప్లేట్స్ లో పెట్టుకోండి ఈ పదార్ధాలు అన్ని]

ముఖ్య పదార్ధాలు:

  1. ఉప్మా చేయడానికి ఒక స్టవ్ [పనిచేసేది]
  2. వండటానికి గిన్నె,భాండి,తిప్పడానికి గరిటె
  3. వడగట్టడానికి స్త్రైనెర్,
  4. తినడానికి నాలుగు ప్లేట్లు,నాలుగు స్పూన్లు[ఇవి మీ ఇష్టం]
  5. చేసింది తినిపెట్టడానికి మనిషి [లేదా మనుషులు]

సహాయ పదార్ధాలు:
  1.  సేమ్యా ఉప్మా కాబట్టి సేమ్యా ఉండాలిగా
  2.  మన ఉప్మా కొంచెం వెరైటి కాబట్టి....రకరకాల కూరగాయలు ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి :)    [క్యారెట్,బీన్స్, పీస్ ఇత్యాదివి]
  3.  ఉల్లిపాయలు లేకపోతె అస్సలు బాగోదు....కాబట్టి అవి నిలువుగా,సన్నగా కోయాలి.
  4. పచ్చిమిర్చి కూడా తగిలితే చురుక్కుమంటుంది...అంచేత రెండు నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి 
  5. టమాటతో మంచి ఫ్లేవర్ వస్తుందిట. అది తరిగి పెట్టేసుకుంటే పోలే! 
  6. పోపు పెట్టకపోతే ఉప్మా ఎలా అవుతుంది? కాబట్టి...ఆవాలు,జీలకర్ర,జీడిపప్పు[ఇది నా క్రియేటివిటీ] కూడా రెడి చేసేసుకోండి
  7. ఇంగువ లేకపోతె రుచే ఉండదు :) కావున చిటికెడు ఇంగువ
  8. అసలు కరివేపాకు లేకుండా వంట పూర్తవుతుందా? సో...నాలుగు రెబ్బలు అవి...
  9. కొంచెం అల్లం-వెల్లులి పేస్ట్ వేస్తె...ఘుమఘుమలాడుతుంది మరి ఇక మీ ఇష్టం.
  10. రుచికి ఉప్పు
  11. తాలింపుకు నూనె 
  12. సువాసనకు కొత్తిమీర


ఇప్పుడు ప్రధాన పదార్ధాలను కొన్నిటిని వినియోగించి సహాయపదార్ధాల సహకారంతో మన రివర్స్ సేమ్యా ఉప్మా చేయబోతున్నాం :)
తయారి విధానం :

ముందుగా తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టుకుని వంట మొదలుపెట్టండి :) 

ఇప్పుడు ఒక లైటర్ తీసుకుని(విదేసవాసులు జస్ట్ బర్నర్ తిప్పి) స్టవ్ వెలిగించి దానిమీద నెమ్మదిగా ఒక గిన్నె లాండ్ చేయాలి.

ఇప్పుడు ఆ గిన్నెలో ఒక గ్లాసుడు నీరు పోసి అవి వంద డిగ్రీల సెంటిగ్రేడు దగ్గర సలసలా కాగాక, ఒక కప్పుడు సేమ్యా వేసి....ఒక మిల్లీలీటరు నెయ్యి వేయాలి [సేమ్యా ఉప్మా జీడిపాకంలా అవకుండా ముందు జాగ్రత్త]

ఇంతలో  కోసిన రకరకాల కూరగాయముక్కలు ఒక వందగ్రాములు వీలయితే ఓవెన్లో/లేదంటే కాసిని వేడినీళ్ళు పోసి గిన్నెలో పదినిమిషాలు ఉడికించుకోవాలి.

ఈలోగా...పక్క స్టవ్వు వెలిగించి భాండి పెట్టి అది వేడెక్కాక రెండు ఔన్సుల నూనె వేయాలి.

నూనె వేడెక్కాక......ఆవాలు వేసి....అవి చిటపటమని ఇల్లంతా చిందాక......జీలకర్ర వేసి....వెంటనే జీడిపప్పు వేసి అవి ఎర్రగా అయిపోయేలోగా ఇంగువ వేసేసి..... అది మాడిపోయేలోగా మిర్చి చీరికలు, ఉల్లిపాయ తరుగు,టమాట ముక్కలు  వేసేసి ఒక గరిటె తీసుకుని కసాబిసా తెగ తిప్పెసేయాలి[అచ్చం మనం షెఫ్లాగా బిల్డప్పు ఇవ్వాలి] .

ఈలోగా...సేమ్యా ఉడికిపోయుంటుంది ఒకసారి చూడండి. ఉడికితే దించేసి వెంటనే ఒక స్త్రైనేర్ తీసుకుని ఈ వేడివేడి సేమ్యా అందులో వేసేసి చల్లనీటి ట్యాప్ క్రింద పెట్టేయాలి. అప్పుడు సేమ్యా ముద్దముద్ద అవకుండా.... విడివిడిగా,పొడిపొడిగా ఉంటుంది ;) [ఇది షేఫ్స్ సీక్రెట్ ]

ఇప్పుడు పైన చెప్పిన కసబిస మిశ్రమంలో కాస్త అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉడికించిన కూరగాయ ముక్కలు వేసేసి, విడిపొడి సేమ్యా వేసి అవన్నీ కలియబెట్టాలి :) 

రుచికి కాస్త ఉప్పువేసి.....అలాఅలా సుతారంగా తిప్పేసి....పైన మీ శక్తికొలది కొత్తిమీర సమర్పిస్తే ఇక 'రివర్స్ సేమ్యా ఉప్మా' రెడి....రెడి....రెడి.....

ఉప్మాని ఉప్మాలా కాక ఇలా తిరగతిప్పి చేయడమే రివర్స్ ఉప్మా :) [రివర్స్ గేర్ లాగా ;) ]

చూసారా! ఎంత వీజియో మా రివర్స్ సేమ్యా ఉప్మా ;) 
ఈ ఉప్మాలో చట్ని-గిట్ని,పంచదార-గించదార ఏమి వేసుకోకుండా ఉత్తిగా అలా తినేయడమే :)

ఇప్పుడు ఒక ప్లేటు తీసుకుని అందులో ఈ రివర్స్ ఉప్మాని వడ్డించి ఆరగించాలి.

మర్చిపోయా..... ఈ పదార్ధం తయారుచేసాక పైన చెప్పిన ప్రధాన పదార్ధాలు లో ముఖ్యమైనది,ఆఖరిది అయిన ఒక మనిషిని సంపాదించి[నాకు డిఫాల్ట్ గా దేవుడు ఒకరిని ఇచ్చాడు...మీమీ బలిపశువులను మీరే తెచ్చుకోవాలి మరి ]......... వారికి ముందు ఈ పదార్ధం పెట్టి... వారు ఇది తిన్నాక కూడా మామూలుగానే ఉంటె(దేవుడి దయవల్ల) ఇక మీరు నిస్సందేహంగా తినేయోచ్చు :))

[హబ్బ! పోస్ట్ మొత్తంలో ఎక్కడ 'సేమ్య' అని టైపినా ముందు 'సౌమ్య' అని వచ్చేస్తోంది. కొంపదీసి ఎక్కడైనా 'సేమ్య' కి బదులు 'సౌమ్య' అని రాయలేదు కదా! ఒకవేళ రాస్తే సౌమ్యగారికి మాత్రం చెప్పకండే! ;) ]

2, ఆగస్టు 2011, మంగళవారం

తళతళా...మిలమిలా...

ఏమిటి ఇదేమన్న సర్ఫ్ ఎక్సెల్ ప్రకటన అనుకుంటున్నారా? హ్హేహ్హే...కాదుగాని... మా పాత ఇంటి ఇక్కట్లు...మీతో కాసిని పంచుకుందామని ఇటు వచ్చానన్నమాట!

మా ఇల్లు ఒక వెయ్యిచదరపుటడుగుల 'శ్వేతసౌధం' [అంటే అమెరిక ప్రెసిడెంటు ఇల్లుకి ట్రు కాపి అని కాదు నా అర్ధం..మరిన్ని వివరములకొరకు పూర్తీ టపా చదువుడి]
క్రితం సంవత్సరం ఆదరాబాదరా అమ్రికా వచ్చేసామా!? వచ్చిరాగానే మా చందు స్నేహితుల ఇంట్లో దిగాం! :) పాపం పదిరోజులు అక్కడే మకాం! ఈలోగా.... ఇల్లు కోసం కిందా మీదా పడి వెదికాం! ఒక్క అపార్టుమెంటు ఖాళీ లేదాయే! అన్నీ కొన్ని నెలలముందే అడ్వాన్స్ బుకింగ్ చేయించుకోవాల్ట! మరి మా గతి ఏమి??

ఈలోగా....మా కొండల ఊరంతా తవ్వి.....ఎలుకని కాకుండా ఏకంగా ఎలుగుబంటిని పట్టారు మా చందుగారు!! ఈ ఇల్లు చెప్పుకోడానికి సింగిల్ బెడ్రూం అయినా.....లంకంత వంటగది....సముద్రమంత బాత్రూముతో అలరారుతూ....నా ప్రాణానికి గుదిబండ అయ్యింది! ఉంటె ఉంది విశాలంగా......దీనికి తోడు....అంతా ధవళమయమే !! 

తెల్లటి ఫ్రిజ్జు,తెల్లటి పొయ్యితో సరిపెట్టకుండా......వంటగదంతా తెల్లటి తలుపులు...తెల్లటి అరలు...తెల్లటి గట్టు.... ఆఖరికి ఫ్లోరింగ్ కూడా తెలుపే! పోనీ గది కొంచెం చిన్నదైతే తెల్లగా ఉన్నా ఏదో రోజు తుడుచుకుంటూ మేనేజ్ చేయోచ్చు! అబ్బే...ఎంచక్కా ఒక బ్రేక్ఫాస్ట్ టేబిల్ కూడా వేసుకునేంత 'పెద్ద' కిచెన్ నాకవసరమా అధ్యక్షా?

అప్పటికే రెండు ఫ్లోర్ మేట్స్ తెచ్చి వేసా! అబ్బే! లాభం లేదు. రోజు వంట అయ్యాక ఆ జిడ్డుమరకలు తుడుచుకుని, కిందపడ్డ ఆవగింజలు మినప్పప్పుని వేటాడి, చెత్తాచెదారం శుబ్రం చేసేసరికి అందరు దేవుళ్ళు దిగోచ్చేవారు!

 దీనికి తోడు....మంచం వేసుకుని పడుకునేంత విశాలంగా ఇచ్చాడు ఆ బాత్రూం! ఇక్కడ బాత్రుం తలుపుంటే...ఆ మూలేక్కడో కనిపించి...కనిపించకుండా ఉంటుంది బాత్ టబ్! ఇక్కడా నేలంతా పాలసముద్రాన్ని తలపిస్తుంది! ఈ విపరీతాలకి తోడు మనకసలే జుట్టు రోజుకి కిలోల్లెక్కన ఊడిపోతుండడం వలన పొరబాటున బాత్రుమ్లో అద్దంలో చూసుకుని తల దువ్వుకుంటే.....తెల్లటి ఆ గచ్చుమీద నల్లటి నా వెంట్రుకలు చూస్తె  తిరుమలలో 'కళ్యాణ కట్ట' కళ్ళముందు కనపడుతుంది! :((

ఇక మిగితా ఇల్లంతా కార్పెట్ పరిచి నామీద దయతలిచాడు కాని లేకుంటేనా.....చచ్చేదాన్ని! ఇక ఈ సౌలభ్యాలకి తోడూ ఇక్కడ చీపుర్లు గట్రా ఉండవు గనుక....ఒక చిన్న బ్రష్షు తీసుకుని ఆ వంటగది,బాత్రుము చిమ్ముతుంటే ఏడుపోచ్చేదంటే నమ్మండి! వాక్యుం పెట్టొచ్చుగా అంటారేమో.....ఆ వాక్యుం ఘనకార్యలన్ని కార్పెట్ మీదే...ఈ హార్డ్ ఫ్లోర్ మీద చెల్లవు! బ్రష్శే గతి! ఒక్కోసారి నాకు ఇండియాలో ట్రైన్లలో బోగీలు ఊడ్చే చిన్నపిల్లలు గుర్తోచ్చేవారు! :(

ఇక విషయానికి వస్తే..... మొన్న ఇండియా నించి వచ్చాక ఒక వారంరోజులు జెట్లాగ్ పేరుచెప్పుకుని....... ఇంకో రెండురోజులు 'టులిప్ షో' కి వెళ్లి రోజంతా వర్షంలో తడిసి తెచ్చుకున్న జలుబు పేరు చెప్పుకుని మూసిన కన్ను తెరవకుండా పడుకున్నానా.......ఇక ఇల్లు చూస్తె....నాకే చీదర వేస్తుంటే..... పాపం మా చందు వంట తప్ప ఇలాంటి క్లీనింగ్ సెక్షన్లో కాలు కూడా మోపని కారణమున చచ్చినట్టు నేనే లేచి ఘట్టిగా ఊపిరి పీల్చి.....రంగంలోకి దిగాను!

తీరాచూస్తే..........క్లీనింగ్ కోసం నేనెప్పుడు వాడే క్లీనింగ్ సొల్యుషన్ కాకుండా వేరేది ఏదో ఉంది! ఏంటి బాబు ఇది అని అడిగితె.... ఆ నువ్వు లేనప్పుడు ఇది తీసుకొచ్చా.....కొంచెం ఎఫెక్టివ్ గా పనిచేస్తోంది అని చెబితే సంబరపడి.... ఆవేశంతో ఆరోజే ఆ మురికిపట్టిన మల్లెపూవులా ఉన్న మా వంటగదిని శుభ్రం చేసే కార్యక్రమానికి నాంది పలికా!!

తుడిచా...తుడిచా....ఆ సొల్యుషన్ పిచికారి చేయడం....టిష్యు తో  తుడవడం....మళ్లీ తడి బట్ట పెట్టి...దాని పొడి గుడ్డతో తుడిచి....వార్నాయనో చిరాకోచ్చేసింది!! సాయంత్రానికి మా 'మిల్క్ సీ' అదే బాత్రూం కూడా అతి కష్టం మీద శుభ్రం చేసేసరికి నా తల ప్రాణం తోకలోకి వచ్చింది! ఆనక ఇల్లంతా వాక్యుం పెట్టి సోఫాలో కూలబడ్డా!  సరే పనైతే అయ్యింది కాని చేతులు కొంచెం మంట పుట్టాయి!ఆ ఘాటు మహిమలే అనుకుని ఊరుకున్నా!

కాసేపయ్యేసరికి చేతుల మీద చిన్నచిన్న గాట్లు! వామ్మో అని చూసుకునేసరికి అన్ని చేతివేళ్ళు ఎర్రెర్రగా బొక్కలు పడిపోయాయి! :( సొల్యుషన్ కొంచెం ఎఫ్ఫెక్టివ్ అనుకున్నా కాని ఇంతనుకోలేదు! నేను కేవ్వవ్వ్వ్వ్! వాటికి ముందు మాయిశ్రైసర్ రాసా....కాసేపాగి మళ్లీ ఏదేదో రాసి ఎం చేసినా మంట మాత్రం పోదే! అలాగే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ ఎలాగో ఉండిపోయా! :((( అసలే రోజుకోసారి వంట చేసేటప్పుడు విధిగా వేళ్ళు కోసుకోవడం నా రివాజు! దానికితోడు ఇవి కొత్తగా! హతవిధీ!

అలా ఆరు గాట్లు....మూడు చందుచీవాట్లతో రోజులు దొర్లిపోయాయి!

క్రమంగా గాట్లు తగ్గుముఖం పట్టాయ్! ఈలోగా అపార్ట్మెంట్ల వేట మొదలుపెట్టాం. ఈసారి ఒక అపార్ట్మెంట్ ఎంచుకుని అన్నీ మాట్లాడుకుని 'ఒకే. డీల్...డీల్' అనుకుని ఆ అపార్ట్మెంట్ ఫైనలైజ్ చేసాం. తీరా ఒకసారి చూస్తాం మా అపార్ట్మెంట్ చూపించమంటే రిసెప్షన్ దేవత.....'సారి రిపెయిర్లో ఉంది కుదరదు' అంది :( నాకేదో తేడా కొడుతోంది. అయినా సర్లే అనుకుని లైట్ తీసుకున్నాం.

ఇల్లు మారే సమయం ఆసన్నమైంది! ఇండియాలోలాగా పెట్టె,బేడ సర్దుకుని ఎగురుకుంటూ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోవడానికి ఇక్కడ కుదరదుగా......వీళ్ళకి ఇల్లు తీసుకునేటప్పుడు ఎలా ఉందో....ఇచ్చేటప్పుడు అలాగే ఉండాలి! గోడల మీద, పొయ్యి గట్టు మీద,బాత్రూమ్లో చిన్న చిన్న మరకలు పడ్డా ఫైన్ వేస్తాడు! పసుపు మరక పడిందో....ఇక అయిపోయినట్టే!అలాగే మనకి ఇల్లు ఇచ్చేటప్పుడు కూడా....చక్కగా కొత్త పైంటు వేసి,కార్పెట్ మార్చి,రిపైర్లు చేసి ఇస్తారు.....కాబట్టి మనం ఇల్లు ఖాళి చేస్తున్నప్పుడు అంతే నీట్టుగా ఇవ్వాలనడం తప్పు కాదేమో!

అందుకనే ముందు సామాన్లు అన్ని సర్దుకుని ఇక ఒక బ్రష్షు.....బకెట్టు.....చేట.....ఒక లిక్విడు[ఈసారి కొంచెం తక్కువ ఎఫ్ఫెక్ట్ చూపించే లిక్విడ్ తెచ్చాం లెండి] తెచ్చుకుని ఇద్దరం ఇంటిమీద పడి రుద్దడం మొదలుపెట్టాం!

రుద్ది....రుద్ది...కడిగి...కడిగి....కడిగిందే కడిగి....కార్పెట్ మీద వాక్యుం చేసిందే....చేసి....ఎలాగైతేనేం ఇంటిని కొత్త ఇల్లు లాగా తళతళ మిలమిల లాడే ట్రిపుల్ ఎక్స్ లాగా తీర్చిదిద్దేసాం!

హమ్మయ్య! ఒక గోల వదిలింది! ఈసారి వెళ్ళే ఇల్లన్నా కొంచెం ఈ ధవళమయం కాకుండా చూడు స్వామీ!! అని కోరుకుని.....కొత్తింటిని ఒకసారి చూద్దామని వెళ్ళాం!

తలుపు తీయగానే పక్కనే వంటగది......హమ్మయ్య కొంచెం చిన్నదే.....బ్రతికాను దేవుడా అని అనుకుంటూ అలా లోపలికి అడుగుపెట్టి లైటు వేసా.....అంతే.....

కేవ్వ్వ్వవ్వ్వ్వ్!

అవ్వాక్కయ్యా!!

ఎందుకంటే.....ఇక్కడ కూడా.....అవాక్కయేలా 'టైడ్' తెల్లదనమే! నాలుగు దేదీప్యమానమైన లైట్ల వెలుగులో ధగధగా మెరిసిపోతున్న ఆ తెల్లతెల్లటి వంటగది నాకు  ముద్దుముద్దుగా స్వగతం పలుకుతుంటే..... ఏడుపొక్కటే తక్కువ!

మళ్లీ తెలుపుతో నా యుద్ధం మొదలు!

హ్మ్! ఇంటిని మార్చగలిగాం కాని తలరాతని మార్చగలమా?