నా సైకిల్ ప్రేమ మీ అందరికి తెలిసిందే! :) [ఇదేమి ఆ పోస్ట్ కి పార్ట్-౨ కాదు....కంగారు వలదు ]చిన్నప్పుడు నాకు సైకిల్ తొక్కడం అంటే ఎంత ఇష్టమో.....అంత భయం కూడా! ఏదో మా ఫ్రెండ్ సాయిలక్ష్మి దయవల్ల కిందా,మీదా పడి ఎలాగోలా సైకిల్ నేర్చేసుకుని జింగ్ జింగ్ అని తోక్కేసేదాన్ని! రెండు,మూడు సార్లు కిందపడి మోకాలు చిప్పలు పగిలినా....ఎబ్బే....సైకిల్ మీద లవ్వు మాత్రం తగ్గలేదు :))
కాని మా నాన్న ఇంటర్లో నాకు స్కూటి కొన్నాక..... మళ్లీ మనకి భయం స్టార్ట్! 'అమ్మో! సైకిల్ అంటే మనం బ్రేక్ వేస్తె ఆగుతుంది....కనీసం పెడల్ తోక్కక పోయినా ఆగుతుంది....ఇది ఆక్సేలేరేటార్ డవున్ చేయాలి....బ్రేక్ వేయాలి.... పెట్రోల్ ఉందొ,లేదో చూసుకోవాలి....అసలు ముందు బండి స్టార్ట్ చేయాలి....ఆపితే స్టాండ్ వేయాలి అమ్మో...వామ్మో ' అని భయపడ్డా! కానీ ఈసారి మా నాన్న అష్టకష్టాలు పడి ఎలాగోలా నేర్పించారు! ఇక దాన్నివేసుకుని ఝాం అంటూ దూసుకుపోయేదాన్ని[కాని మనకి డబల్స్ రాదు......'U ' టర్న్ రాదు :( మరి ఇంకేం వచ్చమ్మా అని అలా కొషన్ మార్కు మొహం పెడితే నేనేమి చెప్పలేను బాబోయ్! ]
నా స్కూటి విన్యాసాలు చూసి.....మా నాన్నకి నా మీద బోలెడు నమ్మకం కలిగి రోజు తనే డ్రాప్ చేసేవాళ్ళు కాలేజి దగ్గర! హతవిధీ! దీన్నే 'అతి జాగ్రత్త' అని నేను అంటాను.....కాని నా 'కనీస జాగ్రత్త' అని మా నాన్న అంటారనుకోండి!! అలా స్కూటి మీద నా చెయ్యి పడనివ్వకుండా చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా.... మా నాన్న మాగన్నుగా ఉన్నప్పుడు చూసి.....దాన్ని ఎలాగోలా బైటికి తీసి....ఊరంతా తిరిగి జాతర,జాతర చేసేదాన్ని :))
సరే! స్కూటి రోజులు అయిపోయాయి! హైదరాబాదులో రైళ్ళ విన్యాసాలు కూడా అయిపోయాయి!! ఇక పెళ్లయింది! కొద్దిరోజులు బెంగుళూరులో బస్సు విన్యాసాలు.....ఆనక విమాన విన్యాసాలు చేసి ఇదిగో ఈ దేశం వచ్చి పడ్డానా..... ఇక్కడన్ని కార్లే! హుహ్! తుమ్మలన్నా....దగ్గాలన్నా కార్ ఉండాల్సిందే అన్నట్టు ఉంటుంది ఇక్కడి పరిస్థితి! మనకా కారులో క్లచ్ అంటే ఏంటి.....గేర్ అంటే ఏంటి....ఏమి తెలియవు! దీనికి తోడూ మా చందు గారు నన్ను ఒక అమెరికన్ మాష్టారు దగ్గరకి కారు నేర్చుకోడానికి పంపిస్తా అన్నాడు! నేను కేవ్వ్వ్!! మనకి మామూలుగా అచ్చ తెలుగులో చెబితేనే త్వరగా బుర్రకి ఎక్కదు.....అసలేమి తెలీని కార్ గురించి ఇక అతని దగ్గర నేర్చుకుంటే............హ్హహ్హ! అయినట్టే!! అందుకే నేనో బంపర్ ప్లాన్ వేసా! దాన్ని సూపర్గా అమలు చేశా ;)
అదేమిటంటే....మొన్న ఇండియా వెళ్ళినప్పుడు కార్ నేర్చేసుకుందామని బాగా డిసైడ్ అయ్యా! అలాగే....ఇండియా వెళ్ళిన వారానికే అనుకున్న పని మొదలు పెట్టా! మా నాన్నకి తెలిసిన అతను డ్రైవింగ్ స్కూల్ పెట్టాడుట! రోజు ఇంటి దగ్గరకొచ్చి పికప్ చేసుకుని డ్రైవింగ్ నేర్పించి మళ్లీ డ్రాప్ అన్నమాట! నాకూడా వెనక సీట్లో మా అమ్మ :)
ముందురోజు ఒకడోచ్చాడు.....నేను బైటికి వచ్చీ రాగానే.....డ్రైవింగ్ సీట్లో నన్ను కూర్చోబెట్టేసాడు! ఇక పోనివ్వమన్నాడు! నేను పిచ్చి చూపులు చూస్తె.....ఇంజిన్ ఎలా ఆన్ చేయాలి....చెప్పాడు....చేశా....తరువాత క్లచ్ నోక్కమన్నాడు....అక్సేలేరేటార్ రైజ్ చేయమన్నాడు.....ఆ గేరు...ఈ గేరు అన్నాడు.....ఏదేదో కంగారుగా చేసేసా! మా ఇంటినించి....మా పక్కింటి దాకా కారు తోలా!! ఇవాల్టికి ఇక చాల్లే అన్నాడు! నాకేమో బోలెడు డౌట్లు మిగిలిపోయాయి! అడిగితె.....నెక్స్ట్ క్లాస్ అన్నాడు! సర్లే అని ఊరుకున్నా! దీనికి తోడూ..........రోజు నోట్స్ రాయాలి! మర్నాడు పొద్దున్న...........దాన్ని ఆ మాష్టారు కరెక్షన్ చేస్తాడట ;)
నెక్స్ట్ క్లాస్లో ఒక మిడిగుడ్ల+బట్టతలా మాష్టారు వచ్చాడు......... కార్ స్టార్ట్ చేయగానే గేరు మార్చమన్నాడు..... 'ఫోర్త్' గేర్ వేయమన్నాడు.... అదన్నాడు....ఇదన్నాడు.....నాకేమో ఏమి తెలీదు! 'ఇవాళ మనం ఆరు కిలోమీటర్లు వెళతాం! జాగ్రత్తగా డ్రైవ్ చెయ్ అన్నాడు' నా పై ప్రాణాలు పైనే పోయాయి! మా అమ్మ భయంభయంగా చూసింది నా వైపు!! సరే! 'ధైర్యే సాహసే!' అని మొదలు పెట్టా!! ఇక చూస్కోండి......అతనేమీ చెప్పడు! కనీసం చూడడు! ఎటో చూస్తూ ఉంటాడు.... నాకేమో ఏమి రాదు! ముందు రోజు అడిగితె వాడు ఏమి చెప్పలేదు....ఈ రోజు వీడు వచ్చి ఏదో నేను 'షుమేకర్' అన్నట్టు కారు ఫోర్త్ గేర్లో పోనివ్వమంటాడు........ఈ గోల ఏంట్రా దేవుడా! అని నాలోనేనే ఏడుస్తూ ఏదో కారు పోనిచ్చా! ఇక గేర్లు మార్చేటప్పుడు క్లచ్ తో పడ్డాను ఇబ్బంది..........'ఎహే! ఈ క్లచ్ ఎవడు కనిపెట్టాడ్రా బాబూ....' అని అనిపించింది. ఆ రోజు ఇంటికొచ్చాక చాల సేపటికి కాని నాకు దడ తగ్గలేదు! డ్రైవింగ్ కి ఒక దండం అని చెప్పేసా!
ఇక మరుసటి రోజు మాష్టారు చేంజ్! వాడిని ఫైర్ చేసేసారు డాడీ ;) వేరేవాడు వచ్చాడు :) ఇతనికి స్టోరి అంతా చెబితే.....మళ్లీ ఓపిగ్గా మొదటినించి చెప్పుకొచ్చాడు! క్లచ్,గేర్,బ్రేక్,ఆక్సేలేరేటార్......ఎప్పుడు ఏది వెయ్యాలి.....ఎందుకు వెయ్యాలి.....వాటి ఉపయోగం ఏంటి.....అన్ని చక్కగా నేర్పించాడు! రెండో రోజుకే నాకు బాగా ధైర్యం వచ్చేసింది :) ఇక మళ్లీ స్కూటి పోనిచ్చినట్టే రయ్యి.....రయ్యి అని కారు పోనిచ్చా! ముందు కొంచెం తడబడ్డా....బానే వచ్చేసింది!
రివర్స్ చేయడం,'U' టర్న్ చేయడం.......గేర్లు మార్చడం..........చిన్నచిన్న సందుల్లో చాకచక్యంగా నడపడం..........బాగా ట్రాఫిక్లో నడపడం........అన్ని బాగా నేర్పించాడు.....రోజు దీనిమీద నోట్స్ రాసేదాని! పిచ్చ కామెడి గా ఉండేది! ఈ నోట్స్ రాయడం ఏంటి? అని.కాని ఏం చేస్తాం! అలా...అలా....కారుని అలవోకగా నడిపే రేంజ్కి వచ్చేసా! ఇక గుంటూరునించి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు.....సాగర్ రోడ్డులో......కలాం దగ్గర నించి స్టీరింగ్ లాక్కుని......నేనే డ్రైవ్ చేశా! కొద్ది చోట్ల స్పీడింగ్ కూడా చేశాగా! ;)
ఇక డ్రైవ్ టెస్ట్ ఇచ్చే రోజు.........కారు కాస్త ముందుకి,కొంచెం రివర్స్లో వెనక్కి నడిపి....తరువాత బ్రేక్ ఇన్స్పెక్టర్ అడిగిన పిచ్చి ప్రశ్నలకి భలే భలే జవాబులు చెప్పి...........ఎలాగోలా కార్ లైసెన్స్ తెచ్చేసుకున్నా! :)
అదండీ ఇండియాలో నా డ్రైవింగ్ కష్టాలు! ఇక మళ్లీ ఇక్కడ కొంచెం నేర్చుకుని ఇక్కడా లైసెన్స్ తెచ్చుకుని.............నా ఫేవరేట్ మస్టాంగ్ వేసుకుని ఝాం అంటూ దూసుకుపోతుంటే............ఆహా! ఆ ఊహే ఎంత బాగుందో! నా ఫ్యూచర్ కార్కి 'హలో కిట్టి' కీచేయిన్ కూడా కొన్నాగా! బాగుందా.....నా కార్ కీ చెయిన్!?
సరే మరి...........అర్జెంట్ గా అందరూ......నాకు అమెరికాలో తొందరగా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేయాలని......నేను రెడ్ మస్టాంగ్ కారు జింగ్ జింగ్ అని నడిపెయ్యాలని ప్రార్ధనలు గట్రా చేసెయ్యండి!! సరేనా.....