కవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఆగస్టు 2016, బుధవారం

నీవు వస్తావని ....

ఎన్నిరాత్రులు ... ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు .. 
నీవు వస్తావని .... 

కలలన్నీ ఆవిరిలా  కరిగిపోయాయి ....  
నా కన్నీటిని అందులో కలిపేసుకుని.... ఆకాశానికి ఎగిరిపోయాయి . 
నిట్టూర్పులు వాకిట్లో దీపాలు పెడుతున్నాయి... 
కళ్ళు కలువరేకులై, సూర్యుని తాపానికి తాళలేక వసివాడిపోయాయి ... 

ఎన్నిరాత్రులు... ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు .. 
నీవు వస్తావని .... 

ఆశెల బాసలను మోసుకొచ్చే నీలిమేఘానివై వస్తావని .... 
ప్రతిచినుకు నను తాకువేళ .... నీ నులివెచ్చని ఊపిరి నాకు ఇస్తావని ... 
ఆ వానే వెల్లువొచ్చి  వరదై ......  నన్ను నిలువెత్తున ముంచే ప్రేమసాగరమౌతుందని... 
ఆ వెల్లువలో మది విచ్చుకున్న మల్లియనై నీ గుండెగుడిలో ఒదిగిపోవాలని ... 

ఎన్నిరాత్రులు.. ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు .. 
నీవు వస్తావని .... 

అదిగదిగో ... వస్తోంది నా ఆశెల మేనా ఎక్కి వలపుల మేఘం!
రెక్కలుచాచి రివ్వున ఎగురుతున్న సీతాకోక విసిరిన ప్రేమ గంధం 
అదిగదిగో ..... నా మనసులాగే పురివిప్పి ఆడుతోంది నృత్యమయూరం!
నేను ఆపినా... ఆగనంటూ...  నా తనువు విడిచి నీకై ఎదురొస్తోంది నా ప్రాణం!

నీవు చినుకుగా మారి నాలో కరిగినా సరే!
నేను ఆవిరైపోయి నీలో కలగలిసినా సరే!

నిన్ను చేరేవరకు ఆగదు నా ప్రాణం! ఆపను ఈ ప్రయాణం!

31, జులై 2012, మంగళవారం

ఒక వాన చినుకు!!

ఒక చిన్నిచినుకు....

మిలమిలా మెరిసిపోతున్న వాననీటి తళుకు...

నీలిమేఘాల కురులసిగలో విరిబాలగా వెలుగుతుంటే..

చల్లనిగాలి వచ్చి చెక్కిలి నిమిరి చక్కలిగింతలు పెట్టగానే...

జలజలా జారి...మధుమాసపు మంచుపూవై రాలి..

నేలమ్మ నులివెచ్చని కౌగిలిలో చేరే వేళ...

పచ్చని ఆకుల పొదరిల్లోకటి సాదరంగా ఆహ్వానిస్తే..

చిగురుటాకుల ఒడిలో సేదదీరి....

కమ్మని మన్నుపరిమళం అనుభవిస్తుంటే...

రంగురంగులరెక్కల కోక ఒకటి వస్తే...

నీకు రంగుల లోకం చూపిస్తా వస్తావా అంటే...

సర్రున జారి.... సీతాకోకరంగుల్లో కలిసిపోయి...

తోటంతా తిరిగి.... ఆటలెన్నో ఆడుకుని... పాటలెన్నో పాడుకుని...

మలిసందె వెలుగు మసకపడే మునిమాపటివేళ...

కోకమ్మ సెలవు తీసుకుని..... మల్లెపొదలో జారవిడిస్తే...

మల్లెపూల రెక్కలపై చిరురవ్వల ముక్కెరైపోయి...

మల్లెభామ మత్తులో తూగి... సందెగాలి పాటలో ఊగి...

రాతిరమ్మ చుక్కలపందిరి కింద వెన్నెలభోజనాలు పెట్టే వేళ...

జాబిలమ్మ వెండి ఊయలలో ఊరేగుతుంటే......

వెన్నముద్దల్లా విచ్చుకున మల్లెపూలతోటలోకి...

 
వయ్యారంగా నడిచి వచ్చిన ఒక చక్కనిచుక్క...

అరవిచ్చిన మల్లెల్లో అచ్చంగా ఒదిగిపోయిన వానచినుకుని చూసి...

మురిసి.....ఆమె మోమున ముద్దబంతిపువ్వు విరిసి...

మత్తెక్కించే  మల్లెలను అరచేతుల్లో పోదివిపట్టుకుని...

ముచ్చటైన ముత్యపుచినుకును ముద్దాడగానే....

 వెల్లకిల్లా ప్రేమలో పడ్డ వానచినుకు....

'ఈ జన్మకిది చాలు' అనుకుని మెల్లగా నేలతల్లి ఇల్లు చేరుకుంది....






-ఇందు

[Imagesource:Google]

13, జూన్ 2011, సోమవారం

'శ్రావణమేఘం' కోసం.....!!



శైలాబాల గారిని చూసి....చేతులు కొంచెం దురద పుట్టి.....'ఇదేదో భలే ఉందే...మనమూ ట్రై చేస్తే పోలే!' అనుకుని చేశా! శైలాగారి అంత అందంగా కాకపోయినా....ఏదో నా రేంజ్ అన్నమాట ;) 

శైలా గారు...మీ శిష్యురాలి పనితనం నచ్చినట్లయితే......కామెంటు పెట్టి జై కొట్టుము ;)

మనలోమనమాట.....ఈ కవిత మాత్రం నాదేనండోయ్! ఇది కూడా కాపీ అనుకునేరు! అర్ధం చేసుకోరూ! :))

15, నవంబర్ 2010, సోమవారం

అపురూపమైన కల....


నడిరాతిరి నిదురలో ఎన్నెన్నో కలలు....
కలలు అలలై చెలియలిగట్టు దాటుతుంటే...
ఉలిక్కిపడిన రెప్పలమాటున ...
నిద్రాదేవి వీడ్కోలు తీసుకుంటే....
అరమోడ్పున విచ్చుకున్న ఆ నేత్రద్వయం,
స్వప్నలోకం విడిచి రాలేమంటే....
వాస్తవంలో కాలం  కలై కరిగిపోతుంటే...
అసంపూర్తి స్వప్నం వెలవెలబోతుంటే....
అది చూసి చలించిన మనసు,
అపురూపమైన ఆ కలను తనలో నిక్షిప్తంచేసి..
చీకటి అంచులకి మెరుపుల జిలుగులు అద్ది...
రంగుల కుంచెతో దాన్ని పరిపూర్ణం చేస్తుంటే...
తన స్థానంలో కలకి ప్రాణం పోస్తున్న మనసుని చూసి
మురిసిపోయిన నిద్రాదేవి......
ఆప్యాయంగా కళ్ళను ముద్దిడుతున్నవేళ...
తొలి తూరుపు కిరణం నేల తాకిన వేళ....
మాగన్నుగా నిద్ర పట్టింది.

5, నవంబర్ 2010, శుక్రవారం

దివ్వెల పండుగ


కోటి కాంతుల వెలుగులు విరజిమ్మే "తారాజువ్వలు" .......

నవ్వుల పువ్వులు పూయించే "కాకర పువ్వోత్తులు ".........

ఆనందాల వెల్లువ పొంగించే  "మతాబులు ".....

తారా తోరణాలను ఇంటిముందు వాల్చే "దీపాల కాంతులు"...

వెరసి...
చెడు పై మంచి సాధించిన విజయానికి నిదర్శనం...ఈ దివ్వెల పండుగ....

సంతోషాల దీపావళి...అందరి జీవితాల్లో వెలుగులని పంచాలని ఆశిస్తూ...


అందరికీ 'దీపావళి' శుభాకాంక్షలు....