24, ఫిబ్రవరి 2011, గురువారం

మంచుకి ఎదురీత

ఎవరన్నా ఏటికి ఎదురీత అంటారు...ఇదేంటి ఈ పిల్ల 'మంచుకి ఎదురీత' అంటోంది అనుకుంటున్నారా? చెబుతా చెబుతా! మొన్న మేము చేసిన సాహస యాత్ర కబుర్లు చెబుతా ఆగండీ!!


మొన్న మధ్యాహ్నం మూడింటికి మా చందుగారు  ఇంటికొచ్చి 'పద పద! ఒహాయో వెళ్ళాలి!' అని తెగ తొందర పెట్టేసారు. 'ఒకసారి అటు చూసి చెప్పు' అని కిటికీ వైపు చూపించా. మంచు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయింది.... పైగా సన్నగా పడుతోంది కూడా. 'ఇప్పుడు నీకు ఒహాయో అవసరమా?' అన్నాను.అయినాసరే....'చెప్పాకదా! చాల ఇంపార్టెంట్ పని. ఇవాళ అయిపోవాలి అంతే! పద త్వరగా' అని హడావిడిగా బయలుదేరదీసాడు! మరి పట్టువదలని విక్రమార్కులు కదా ఏంచేస్తాం! ఇక ఎన్ని చెప్పినా ఇంతే...తాను పట్టిన కుందేలుకి పది కాళ్ళు అనే రకం కదా!  అని ఇక బయలుదేరా!


సుమారు మూడున్నరగంటల ప్రయాణం.అక్కడికి ఏడున్నరలోగా చేరాలి అని ఒక డొక్కు టార్గెట్ మళ్లీ మాకు! అసలే ముందురోజు రాత్రి అంతా మంచు కురిసింది.రోడ్లు సరిగ్గా క్లీన్ చేయలేదు.గడ్డగట్టిన ఐస్ రోడ్డుకి అతుక్కుపోయింది.అది చాల ప్రమాదకరం.కార్లు ఈసీగా 'స్కిడ్' అయిపోతాయ్. నాకు గుండె పీచుపీచుమంటోంది.అయినా సరే మా చందుగారి ఆజ్ఞల మీద నోరుమూసుకుని కూర్చున్నా. మా ఇంటినించి 'ఫ్రీవే' మీదకి ఎక్కుతున్నప్పుడు 'రాంప్' మీద ఒకసారి కార్ స్కిడ్ అయింది.కాసేపు అటు ఇటు ఊగుతూ డిస్కో చేసింది.'మొదలయ్యింది దేవుడా! ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది అప్పుడేనా? కొంచెం గాప్ ఇవ్వు స్వామీ!!' అని దేవుడ్ని వేడుకున్నా. నా మాట ఆలకించాడేమో కొద్ది దూరం మాములుగానే కొంచెం కొంచెం జారుకుంటూ...అలా...అలా వెళుతూ ఉన్నాం.


ఇక కాసేపటికి భయంకరంగా మంచు కురవడం మొదలుపెట్టింది. మా ముందున్న కారు,వెనక కారు తప్ప నాకు ఇంకేం కనిపించట్లేదు.దూరంగా ఉన్న బ్రిడ్జి...పక్కన ఉన్న ఇంకో రోడ్డు..దానిమీద వెహికల్స్.....ఏమి కనిపించట్లేదు. నల్లటి రోడ్డు....దాని మీద ఉండే తెల్ల గీతలు ఏమి కనపడకుండా అలుక్కుపోయాయి మంచుతో!'చందు ఇప్పుడు ఇంత వైలెన్స్ తో కూడిన జర్నీ అవసరమా?' అని బిక్కమొహం వేసి అడిగా! 'నేను ఇలాంటి క్లైమేట్లో న్యూయార్క్ దాకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళా! ఏంపర్లేదు! నువ్వు కంగారు పడకు....నన్ను కంగారు పెట్టకు' అని రిప్లై వచ్చింది. సర్లే అసలే టెన్షన్లో ఉన్నాడు...మధ్యలో నేనెందుకు కదిలించుకుని మరీ తిట్లు తినడం అని ఊరుకున్నా. ఇక కొద్దిసేపటికి రోడ్డు మీద మంచు అంతా గాలికి పైకి లేస్తూ చక్కర్లు కొట్టసాగింది....నాకైతే ఆకాశంలో....మేఘాల్లో తేలిపోతున్న ఫీలింగ్. కార్లో ఉన్నానో....ఫ్లైట్లో ఉన్నానో ఒక నిమిషం అర్ధం కాలేదు.ఇక ఈ మంచుగాలి దెబ్బకి ముందున్న రోడ్డు....కారు కూడా కనిపించట్లేదు.కారు మధ్య మధ్యలో జర్రు జర్రు అని జారుతోంది.....పక్కనేమో దయ్యాల్లాగా ఇంతింత ట్రక్కులు యమా ఫాస్టుగా వెళుతూ తట్టెడు మంచు మా మొహం మీద కొట్టి పోతున్నాయ్. అలాగే కనిపించని రోడ్డుమీద.... కనిపించని కార్ల మధ్య.....మంచుకి ఎదురీదుతూ మా విక్రమార్కుడు ముందుకు సాగిపోతున్నాడు.


ఇంతలో ఒక రెస్ట్ ఏరియా వచ్చింది.చందుని అక్కడ ఆపమని చెప్పా. 'స్టార్బక్స్ లో ఒక కాఫీ తాగి అపుడు కంటిన్యు అవుదాం' అని చెప్పా. సరే అన్నాడు.అసలు నా ఉద్దేశం....ఆ కాఫీ తాగే టైమ్లో ఎలాగైనా మనసు మార్చి కారు వెనక్కి తిప్పించేద్దామని.సరే కాఫీ తీసుకున్నాం. కాసేపు కూర్చుని తాగుదాం చందు అంటే.....'టైం వేస్ట్ వెళుతూ తాగొచ్చు కదా పద!' అన్నాడు.'అది కాదు చందు...ఇప్పుడు ఎందుకు చెప్పు ప్రాణాలకు తెగించి ఒహాయో వెళ్ళడం అంత అవసరమా?? చూడు ఎంత డేంజరస్గా ఉందో! నా మాట విను చందు.రేపు పొద్దున్న బయలుదేరదాం.ప్లీజ్' అన్నా. 'సరే! ఇంకో టెన్ మైల్స్ చూసి....అప్పటికి ఇలాగే ఉంటె వెనక్కి తిరుగుదాం లే. సరేనా!' అన్నాడు.హమ్మయ్య ఏదో గుడ్డిలో మెల్ల అని ఊపిరి పీల్చుకున్నా.కాని నా ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బైటికి రాగానే మంచు కురవడం చాలా తగ్గిపోయింది(ఈ దేశంలో ఇంతే! ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరు చెప్పలేరు).నావంక ఒక చూపు చూసి....ఒక నవ్వు విసిరి...ఇక కారు తీసి ఝామ్మంటూ దూసుకుపోయాడు మా విక్రమార్కుడు.


'సర్లే! ఏంచేస్తాం!'అని ఊరుకున్నా.ఒక అరగంట ప్రయాణం బానే సాగింది.మళ్లీ మొదలైంది గాలితో కూడిన మంచు.నేను 'దేవుడా! దేవుడా!' అనుకుంటూ కూర్చున్నా. అంతే! ధడేల్మని పెద్ద శబ్దం! మా కార్ బాగా స్కిడ్ అయ్యి ...జుయ్ జుయ్... అని జారుకుంటూ వెళ్లి డివైడర్ కి గుద్దుకుంది. కార్ అస్సలు కంట్రోల్ అవ్వడంలేదు.చందు కార్ ని డివైడర్ కి దూరంగా తేవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు.కాని అది రానంటోంది. దానికి డివైడర్ బాగా నచ్చినట్టుంది....మాటిమాటికి దానిదగ్గరకి వెళ్ళడం.... చందునేమో.... 'ఒద్దమ్మా! అలా ఇందులాగా గోల చేయకూడదు....మాట వినాలి....ఇలా వచ్చేయ్ రోడ్డు మీదకి' అని బ్రతిమిలాడటం. ఇలా కారుని బ్రతిమిలాడి... లాడి... అప్పుడు రోడ్డుమీదకి తెచ్చాడు.ఈలోగా నా పైప్రాణాలు పైనే పోయాయి. అసలు ఇదే ప్రధమం నా లైఫ్లో.ఎన్ని ప్రయాణాలు చేసానో! ఊటీలో ఒకసారి భయపడ్డా కానీ ఇది టూమచ్! నేను కార్ హాండిల్ని,ఆర్మ్ రెస్ట్ని గాట్టిగా పట్టుకుని కూర్చున్నా.అరవలేదు.... కరవలేదు.... అసలు షాక్ తిన్నా! చందు మాత్రం ఏమి జరగనట్టు చిద్విలాసంగా డ్రైవింగ్ కొనసాగించాడు. 'భయపడ్డావా?' అన్నాడు.దానికి సమాధానం చెప్పే సీన్ కూడా లేదు నాకు.


ఒక పావుగంటకి తేరుకున్నానో లేదో....ఇంకో సంఘటన.చాలా మంది కాప్స్ ఉన్నారు.ఏమిటా అని చూస్తే....పెద్ద ట్రక్కు స్కిడ్ అయ్యి డివైడర్ కి  గుద్దుకుని దాన్లోనించి దూసుకెళ్ళి పక్కనున్న రోడ్లోకి  వెళ్ళిపోయింది.ఆ అడ్డం తిరిగిన ట్రక్కుకి గుద్దుకుని రెండు కార్లు నుజ్జునుజ్జు! నేను మళ్లీ....'కేవ్వ్వ్!!' కాని అప్పటికే సగం పైగా దూరం వచ్చేసాం. ఇక వెనుదిరిగే ప్రసక్తే లేదు.అదీ మా విక్రమార్కుల వారు అస్సలు ససేమీరా.అలాగే ఆ మంచులో....మా కారుతో ఈదుకుంటూ మేము చేరవలసిన గమ్యం చేరాము.కాని ఈ మధ్యలో ఎన్ని ఆక్సిడెంట్లో! పక్కకి స్కిడ్ అయి జారిపోయిన ట్రక్కులు,కార్లు,మంచులో ఇరుక్కుపోయిన కార్లు....వాళ్లకి సహాయం చేస్తూ కాప్ కార్స్...అబ్బబ్బ! ఎన్ని దృస్యాలో!! ఇక ఒహాయోలో  చూడాల్సిన పని చూసుకుని....సరిగ్గా  గంటకి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం.అప్పుడు సమయం రాత్రి తొమ్మిది.


ఒహాయో అంతా విపరీతంగా మంచు కురుస్తోంది.ఇక చేసేది లేక అలాగే మెల్లగా జారుకుంటూ.... జారుకుంటూ.... వెళుతూ ఉన్నాం.ఈలోగా ఆకలేసి బర్గర్కింగ్ లో కాస్త మేత మేసి.... మళ్లీ మా మంచు ప్రయాణం మొదలు పెట్టాం. ఒక గంట బానే జరిగింది.కాని పెద్ద పెద్ద ట్రక్కులు.....అస్సలు రూల్సు పాడులేకుండా ఆ మంచులో డెబ్బై మీద రయ్యిన దూసుకెళుతున్నాయ్. అటు-ఇటు ట్రక్కులు...మధ్యలో మేము! నేనైతే వాటిని ఎన్ని తిట్టుకున్నానో! ఆ లాస్ట్ లేన్లో కదా అవి ఉండాల్సింది...ఇష్టం వచ్చినట్టు పోనిస్తున్నారు వెధవలు! ఈలోగా ట్రాఫిక్ జామ్. 'ఛి జీవితం! ఏది సవ్యంగా జరగదు' అనుకున్నా.అలా అరగంట గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే అప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసారు. తీరా చూస్తె కొద్ది దూరంలో ఆక్సిడెంట్.అందుకే ట్రాఫిక్ జామ్. నాలుగు ట్రక్కులు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయ్. చివరి ట్రక్....ముందు ట్రక్ నుజ్జు,నుజ్జు అయిపోయాయి.మధ్యలోవి గుడ్డిలో మెల్లలాగా బ్రతికి బైటపడ్డాయి.కళ్ళు నెత్తికి ఎక్కి మంచులో అంత స్పీడుతో పొతే అంతే మరి! కాని అదృష్టం....ఎవరికీ ఏమి కాలేదు.


'సరేలే! జాగ్రత్తగా పోనివ్వు చందు ఇంకా రెండున్నర గంటల జర్నీ బాకీ' అన్నాను. 'ఏముందిలే....అయిపోతుంది' అన్నాడు చందు.ఒక్క ఐదునిమిషాలు గడిచిందో లేదో....మా ముందు వెళుతున్న ట్రక్ సడన్ గా  స్కిడ్ అయింది. జర్రుమని జారుకుంటూ పక్కకు వెళ్ళిపోయి అడ్డం తిరిగేసింది.దాని వెనకాలే మేము ఉన్నాం.నాకు గుండె ఆగిపోయింది ఒక్క క్షణం.ఏముంది మేము వెళ్లి దానికి గుద్దుకోవడమే తరువాయి! అక్కడ మాకు కనీసం బ్రేక్ వేయడానికి కూడా లేదు. ఆ ట్రక్కు తోక వచ్చి మా కారుని గుద్దినా చాలు. నేను 'చందూ' అని పెద్దగా అరిచా. 'టెన్షన్ పడకు..ఏం కాదు...టెన్షన్ పడకు' అని చాలా ధైర్యంగా,చాకచక్యంతో  ఆ ట్రక్కు వెనకగుండా ఉన్న కొంచెం రోడ్డులో జాగ్రత్తగా కారు పోనిచ్చాడు చందు....ఎలాగైతేనేం బైటపడ్డాం!!మా వెనకాల వెహికల్స్ అన్ని ఆగిపోయాయి.ట్రక్కు రోడ్డుక్కి అడ్డం తిరిగిపోయింది.త్రుటిలో ఎంత పెద్ద ప్రమాదం తప్పించుకున్నామో  ఊహించుకుంటే ఇప్పటికీ గుండె గుభేలుమంటోంది.నాకైతే ఏడుపొచ్చేసింది! కళ్ళముందు అసలు అంత నారో ఎస్కేప్! దేవుడా! చాలాసేపటికి కానీ మామూలు కాలేకపోయా.పాపం ఆ ట్రక్కు డ్రైవర్ కి ఏమి కాకుండా ఉంటె బాగుండు! :(


చందు మాత్రం.....తదేక దీక్షతో...ఇవేమీ పట్టించుకోకుండా ఒక తపస్సులాగా అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకోచ్చేసాడు.ఇంచుమించు పదిగంటలు ఆపకుండా డ్రైవ్ చేసాడు. నాకు మళ్లీ మా ఇంటి మొహం చూస్తానని కూడా అనుకోలేదు.అంత భయమేసింది ఆ ఆక్సిడెంట్లు చూసి.... ఒక తొమ్మిది గంటలు......నిర్విరామ హాలీవుడ్ థ్రిల్లర్+హర్రర్ మూవీ చూసిన ఫీలింగ్!!


చావు అంటే ఇన్నాళ్ళు నేను పెద్ద లెక్కచేసేదాన్ని కాదు! కాని అంత దగ్గరగా చూసాక మొదటిసారి ప్రాణభీతి కలిగింది :))

దీనివలన తెలిసిన నీతి ఏంటయ్యా అంటే....ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా....కొంపలు మునిగిపోతున్నా.....ఊళ్లు కొట్టుకుపోతున్నా..... ఎప్పుడు మంచులో దూర ప్రయాణాలు పెట్టుకోకూడదు అని :D

14, ఫిబ్రవరి 2011, సోమవారం

ఎంతో మజాలంటా....చాక్లేట్ లోకమంటా......

డైరీమిల్క్ యాడ్ ఒకటి గుర్తుందా??
'ఎంతో మజాలంటా! డైరీమిల్క్ ప్రపంచమంటా....డైరీ మిల్క్ పక్షులు...డైరీ మిల్క్ చెట్లు....' అనుకుంటూ ఒక యానిమేషన్ యాడ్ వచ్చేది....అలాగే ఉంది ప్రస్తుతం నా పరిస్థితిbig grin....కానీ నా సాంగ్ ఏమో....'ఎంతో మజాలంటా! హర్షీస్ ప్రపంచమంటా....రీసీస్ పక్షులు...గోడైవా చెట్లు....' ఇలా పాడుకుంటున్నా......నిన్నటి నా దినచర్య ఒకసారి పరిశీలిస్తే ఇది అర్ధమయిపోతుంది.....పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్  తోపాటు ఒక చాక్లెట్.....నెక్స్ట్ ఇంటిపని మొదలుపెట్టే ముందు....అది అయిపోయాక ఒకటి.తర్వాత వంట ప్రోగ్రాం మొదలు పెట్టె ముందు ఒకటి.....అది అవ్వగానే అలిసిపోతాం కదా..అప్పుడు ఇంకో చాక్లెట్....సరే ఇంతలో చందు వచ్చేస్తాడు....మరీ ఇన్ని చాక్లెట్లు తిన్నా అని తెలిస్తే ఎలా?? అందుకని అప్పుడు మాత్రం బుద్దిమంతురాలిలాగా ఉండి లంచ్ అవ్వగానే చందు అటు వెళ్ళగానే మళ్లీ ఇంకో చాక్లెట్(మరి లంచ్ తరువాత తీపి తినాలి కదాwinking)...తరువాత కాసేపు బ్లాగులు  చూడటం...అలా ఒక గంట గడిచిపోతుందా కాసిని  చాక్లెట్లు  తినాలనిపిస్తుంది కానీ ఎక్కువ తినకూడదు కదా అందుకని ఒకేఒక్క చాక్లెట్ తినేసి....ఏదో ఒక పుస్తకం పట్టుకుని కూర్చుంటా.....ఇక సాయంత్రం చందు రాగానే...'ఒక చాక్లెట్ తింటా చందు....' అంటే....'తిను ఇందు...నీకోసమేగా తెచ్చింది తిను...' అంటాడు...అప్పుడు అధికారికంగా ఇంకోటి అన్నమాటwinking....మళ్లీ రాత్రి డిన్నర్ అయ్యాక....'ఇంకొక్కటి తింటా  చందు'  అంటాను....'సరే..ఇక ఇదే ఇవాల్టికి లాస్ట్' అంటాడు....big grin అని ఒక నవ్వు  నవ్వి  ఒక చాక్లెట్ తినేస్తా....అదన్నమాట సంగతి.....హ్హహ్హహ్హా!!

అసలు నాకు ఈ చాక్లెట్ల పిచ్చి ఎలా మొదలయిందా అని తీవ్రంగా ఆలోచిస్తే కొన్ని నిజాలు బైటపడ్డాయి.....చిన్నపుడు నాకు చాక్లెట్లంటే చిరాకు...తీపి అస్సలు పడదు....ఎంతసేపటికి లేస్ చిప్స్,కుర్కురే,హల్దిరామ్స్ మూంగ్ దాల్,... ఇలా హాట్ యే గాని చాక్లెట్లు,బిస్కత్తులు,పిప్పరుమెంటు బిళ్ళలు....లాంటివి అంతగా తిన్న దాఖలాలు లేవు.....ఏదో పుట్టినరోజున బిల్డప్ కోసం చాక్లెట్లు ఇవ్వడమే కానీ వాటిమీద నాకు ఎప్పుడూ ఇంటరెస్ట్ లేదు...మరి ఎలా వచ్చింది నాకు ఈ చాక్లెట్ పిచ్చి?? ఎలా! హౌ? అని నాలో నేను తెగ కోస్నేలు వేసుకుంటే....బుర్ర లో ఒక మెరుపు మెరిసిందిidea మా స్కూల్ లో 'కవిత' అనే ఒక అమ్మాయి ఉండేది.ఆ అమ్మాయి వాళ్ళ అమెరికా బంధువులు తెచ్చే చాక్లెట్ల గురించి మా అందరికీ పెద్ద పెద్ద షోలు వేసి మరీ చెప్పేది.'మా అంకుల్ అమెరికానించి డైరీ మిల్క్ తెచ్చాడే.కానీ నేను దాన్ని టేబుల్ మీద పెట్టేసి మర్చిపోయా.ఒక టూ వీక్స్ తరువాత దాన్ని చూసా.అయినా అది అంతే ఉంది చెక్కు చెదరకుండా! చూసారా! అద్దీ అమెరికా చాక్లెట్లు అంటే' అని తెగ సోది చెప్పేది...బొత్తిగా టీవి  జ్ఞానం లేని నేను 'అవునా! నిజామా! అబ్బో!' అనుకునేదాన్ని.అప్పుడు అమెరికా చాక్లెట్లు అంటే క్రేజ్..డైరీ మిల్క్ ఇండియా లో పాన్ షాపు లో కూడా అమ్ముతారని నా చిన్ని బుర్రకి ఆనాడు తట్టలేదుI don't know. అమెరికా చాక్లెట్లు బాగుంటాయని...ఎప్పటికైనా అమెరికా వెళ్లి చాక్లెట్ తినాలని ఇలా చాలా చాలా అనేసుకున్నా... :))


ఆ తరువాత ఒకసారి డైరీ మిల్క్ మా ఇంటిదగ్గర పచారి షాపు లో చూసా.'అరె! ఇదీ డైరీ మిల్క్ యే...కవిత చెప్పింది దీనిగురించే కదా!!భలే భలే..ఈ షాపు వాడు కూడా అమెరికా చాక్లెట్లు అమ్ముతున్నాడు' అని ఒకటి కొనుక్కుని తిన్నా.....నచ్చింది...మరుసటి రోజూ మళ్లీ వెళ్లి కొనుక్కున్నా..ఇంకా నచ్చింది....అలా రోజూ కొనుక్కుని తింటుంటే మా అమ్మకి విషయం అర్ధమయింది.'చాక్లెట్లు అలా రోజూ తింటే పళ్ళు పుచ్సిపోతాయే...అప్పుడు ఏది తినడానికి ఉండదు' అని తిట్టింది worried.'అమ్మో!!! చాక్లేట్లకంటే పళ్ళు ముఖ్యం అనుకున్నా...' కానీ వదలలేకపోయా....అలా మెల్లగా నాకు చాక్లేట్లకి బంధం ఏర్పడింది.మా తమ్ముడి పుట్టినరోజుకి నాన్న పెద్ద కాడ్బరీ చాక్లెట్ బాక్స్ తెచ్చారు.దాంట్లో ఉన్న చాక్లెట్లు అన్నీ తినేసాక అది వాడు జామెట్రీ బాక్స్ గా యూజ్ చేసేవాడు.నాకు అలాంటిది కావాలని ఎంత ఏడ్చానో! మరీ నా పుట్టినరోజు అప్పటికే అయిపోయిన్దాయే!! ఆఖరికి ఒకరోజు దాంట్లో వేపకాయలు అన్నీ పిసికి రసం చేసి అందులో పోశా...వాడు దెబ్బకి దాని జోలికి  పోలేదుbig grin....ఆ బాక్స్ నేను తీసేసుకున్నా.దాన్లో జెమ్స్,చిన్న కాడ్బరీ చాక్లెట్స్ వేసుకునేదాన్ని. అలా చాక్లెట్లు నా జీవితం లో భాగం అయ్యాయి.ఎంతగా అంటే మా నాన్న ఎప్పుడు సరుకులు కొనడానికి వెళ్ళినా రెండు డైరీ మిల్కులు తీసుకురాకుండా ఉండరు.స్వీట్ డాడీbatting eyelashes


ఇక ఇంజినీరింగ్ లో 'తులసి' అని నా బెస్ట్ ఫ్రెండ్....దానికి నాకంటే చాక్లెట్ల పిచ్చి ఎక్కువ. దాని బాగ్ లో ఎప్పుడు రెండు,మూడు చాక్లెట్లు ఉండాల్సిందే.క్లాస్ లో ఎవరన్నా చాక్లెట్ తింటే దానికి పెట్టాల్సిందే...నేను దానికీ పోటిగా తయారవడం తో మా ఇద్దరి మధ్య చాక్లెట్ యుద్ధాలు కూడా సంభవించాయి.ఇక ఇలా కాదని..ఒక ఒప్పందానికి వచ్చాం.ఎక్కడ చాక్లెట్ దొరికినా చెరిసగం పంచుకోవాలి అని...అదేదో దొంగలు దొంగతనం చేసాక వాటాలు పంచుకున్నట్లుhee hee.చీట్ చేయకూడదు అని రూల్ కూడా పెట్టుకున్నాంtongue అయినా ఎవరికి వారం దొంగచాటుగా చాక్లెట్లు మెక్కేస్తూ ఉండేవాళ్ళం.డైరీ మిల్క్,పెర్క్,మంచ్,మిల్కిబార్,కిట్-కాట్,ఫైవ్ స్టార్,బార్ వన్....ఇంకా డైరీ మిల్క్ లో లభ్యమయ్యే అన్నీ ఫ్లేవర్స్,....అన్నీ వెరైటీస్ టేస్ట్ చేసేసాం....సరదాగా మొదలైనది......వదలలేని స్థితి కి వచ్చింది.చివరికి చందు పరిచయం అయ్యాక తనకీ అర్ధమయింది నా చాక్లెట్ల పిచ్చి....కానీ నా ఇష్టమే వీక్నెస్ అయిపొయింది....ఇక విప్రో ఎక్సామ్స్ అపుడు 'ఇందు నువ్వు ఈ చాప్టర్ ఇవాళ ఫినిష్ చేసేస్తే నీకో చాక్లెట్'......'ఇందు నువ్వు అల్లరి చేయకుండా అన్నం మొత్తం తినేస్తే నీకు పెద్ద చాక్లెట్ కొనిపెడతా' ఇలా సుతిమెత్తని బ్లాక్మైల్స్ కూడా మొదలయ్యాయిd'oh....

ఇక అమెరికా వచ్చాక....ఎన్నెన్ని చాక్లెట్లోdancing....ఆహా! వాల్మార్ట్ కి వెళ్ళినా...క్రోగర్ కి వెళ్ళినా....అదేదో సినిమా లో భానుప్రియ 'కొసరు' అని అడిగినట్టు..నేను కూడా...'చాక్లెట్' అని అడగటం...చేసేది లేక...అవి తీసుకోవడం చందు కి అలవాటయిపోయింది..... అయినా నాకోసమే అన్నట్టు బిల్ కౌంటర్ దగ్గరే పెడతారుbig grin ఏంటో వారి అభిమానం.మొన్నటికి మొన్న వేలంటైన్స్ డే సందర్భంగా బోలెడు చాక్లెట్లు మంచి మంచి ప్యాకింగ్ చేసి పెట్టారు.ఇక నేను ఆగుతానా? పట్టుకొచ్చేసా.... హర్షీస్ కిసేస్, ఇంకా మీనియేచార్స్,లింట్ ట్రఫిల్స్.... ఇవి చిన్ని చిన్ని చాక్లెట్స్ కదా....అటు ఇటు వెళుతూ నోట్లో వేసేసుకోవచ్చ్చు అని నా ప్లాన్. నిన్న రాధికా చాట్ లో చెబుతోంది వాళ్ళ  ఫ్రెండ్ కి సాంబార్ లో చాక్లెట్ నంజుకోవడం అలవాటు అటrolling eyes.నాకు మరీ అంత వైలెంట్ కోరికలు లేవు గాని...ఏదో ...పూటకి మూడు చాక్లెట్ బార్లు తింటే చాలుbig grin అంతే.అల్పసంతోషిని కదా!!

సరే మరి.నాకు  చాక్లెట్ తినే వేళయింది.నా  పోస్ట్ చదివి మీకు చాక్లెట్ తినాలనిపించిందా...అసలే ఇవాళ నా బర్త్ డే మరీ!! మీకు బోలెడు చాక్లెట్స్ ఫ్రీ....ఫ్రీ.....ఫ్రీ.... ఇదిగో చాక్లెట్ .ఎలా ఉంది ?? యమ్మీ కదా!day dreaming

7, ఫిబ్రవరి 2011, సోమవారం

కర కర కాకర

కాకరకాయ....ఎంత చేదుగా ఉంటుందో అంత బాగుంటుంది తినడానికి.సాధారణంగా నాకు చేదుగా ఉండేవి ఏవి నచ్చవు.అందుకే టాబ్లెట్లు వేసుకోగానే కక్కేస్తాphbbbbt...అలాంటిది చిరు చేదుగా ఉండే కాకరకాయకూర  మాత్రం లొట్టలేసుకుంటూ తింటాbig grin.కాకరకాయతో ఏం చేసినా బాగుంటాయ్ కదా! కాకరకాయ కూర, పులుసు, పచ్చడి,చిప్స్....అబ్బో! ఎన్నెన్నో చేసుకు తినొచ్చు ఈ చేదు కాయతో.

రుచి సంగతి పక్కనబెడితే ఆ రూపం చూస్తే నాకు చిన్నపుడు తొండలు,కప్పలు లాంటి సరీసృపాలు గుర్తొచ్చేవిsad.కానీ మెల్లగా అలవాటుపడిపోయా.మా ఇంటి ముందు చిన్న పెరడు ఉండేది.అక్కడ ఫెన్సింగ్ మీద కాకర తీగ పాకించేది అమ్మ.దానికి కాసే బుజ్జి బుజ్జి కాకరకాయల వేపుడు కూర ఎంత బాగుంటుందో!batting eyelashesనాకులాగే మా తమ్ముడికి కాకరకాయ కూరంటే ఇష్టం.ఐతే వాడికి బంగాళదుంప వేపుడంటే కొంచెం ఎక్కువ ఇష్టమనుకోండి.....కానీ మా అమ్మ చేసే కాకరకాయ పిట్ట కూర మాత్రం అమోఘం.ఆ రుచి మళ్లీ నేను ఎక్కడా చూడలేదు.ఎంతమంది చేసిన కాకరకాయ కూర తిన్నా...అమ్మ చేసే పిట్టకూర ముందు బలాదూర్.పిట్టకూర అంటే...ఏ పావురాన్నో,పిచుకనో పీక పిసికి చంపేసి కాకరకాయ వేసి కూర చేసారనుకునేరుshame on you.నేను పక్కా సాత్వికాహారిని....ఏదో సాధుజీవిని.happy'పిట్ట' అంటే మనం వాడుకలో అనుకుంటాం కదా....'పిట్టంత ఉన్నాడు'...అది ఇది అని.అలా చిన్నది అనే అర్ధం అన్నమాట.చాలా సన్నగా ముక్కలు తరిగి నూనెలో వేయించి....అలాగే సన్నగా ఉలిపాయాలు తరిగి అవి విడిగా వేయించి....ఆఖరికి రెండు కలిపి ఉప్పు-కారం....కాసింత పంచదార జల్లి దించేసే ఈ పిట్టకూర తింటే నిజ్జంగా జన్మ ధన్యం big hug

ఇక నా ఫ్రెండ్ ఝాన్సీ వాళ్ళ అమ్మగారు నిలవుండే పొడి-కాకరకాయ కూర చేస్తారు.శనగపప్పుల  పొడిలో...బాగా వేయించిన కాకరకాయ ముక్కలు వేసి చేసే ఈ కూర కనీసం పది-పదిహేను రోజులు ఉంటుంది.అమీర్పేట్ హాస్టల్ లో ఉన్నపుడు నెలకి ఒకసారి ఒక డబ్బాడు కూర చేయించుకుని పట్టుకోచ్చేది ఝాన్సి.అది మూడే మూడు రోజుల్లో ఊదిపారేసేవాళ్ళం మేము rolling on the floor. ఇక కాకరకాయ-బెల్లం కూర కూడా కేక.అదీ నేను చేసినది ఐతే బాగా ఇష్టం batting eyelashes కారంగా-తియ్యగా జ్యుసీ గా ఉండే ఈ బెల్లం కూరని  వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే స్వర్గం అలా వచ్చి కళ్ళముందు వాలినట్టు ఉంటుంది.

కాకరకాయ కారం కూడా భలే ఉంటుందన్డోయ్.ఉల్లిపాయలు నూరి...కాకరకాయ బాగా వేయించి రెండు కలిపి చేసే ఈ కూర కూడా ఒక నాలుగైదు రోజులు నిలవుంటుంది.భలే భలే టేస్టీ గా ఉంటుంది.ఈ కూర చేసినప్పుడు.....నేను ఒక మూడురోజులు ఇంకే కూర చేసినా తినేదాన్ని కాదు.పొద్దున,సాయంత్రం ఇదే వేసుకుని కమ్మగా,హాయిగా తినేసేదాన్నిhappy

ఇక చివరాఖరికి నేను పచ్చి కాకరకాయ కూడా తినడం నేర్చుకున్నా!worried నేను ఎనిమిదో క్లాస్లో ఉన్నపుడు ఎస్.ఎస్.వై లో (యోగ,మెడిటేషన్ నేర్పిస్తారు)చేరాను.అక్కడ పచ్చి కూరగాయ ముక్కలు తినడం నేర్చుకున్నా.పచ్చి కాకరకాయ ముక్కలు చక్రాలు గా కోసిపెట్టేవారు.దానిమీద కాస్త ఉప్పు...ఇంకొంచెం నిమ్మరసం పిండుకుని కళ్ళు మూసుకుని నోట్లో పెట్టేసుకోవడమే.మొదట్లో....ఏడుపోచ్చేది.ఆ తరువాత తినే ఫ్రూట్ సలాడ్ రుచే తెలిసేది కాదు.కానీ రాను రాను అలవాటైపోయింది(తినగ తినగ కాకరకాయ తియ్యన కదా!).ఫ్రూట్ సలాడ్ మీద కాన్సంట్రేషన్ తో ఈ కాకరకాయముక్కలు పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు tongue

ఏంటో కాకరకాయ తలుచుకోగానే నోరూరేస్తోంది.సరే కానీ కాకరకాయ మీద ఒక చిన్న పద్యం ట్రై చేద్దామా!(ఏమన్నా తప్పులున్నా...పద్యం బాగోకపోయినా తిట్టుకోకండి....నేనసలే పద్యాల్లో చాలా వీక్big grin)

కర కర కాకర కిర కిర కీకర 
కీకర బాకర కాకర కర కర 
కర కాకర..కూర  కర కరా...
కరకర కాకర కీకర కిరకిరా...

హ్హహ్హహ్హ....rolling on the floorఇంకా నా బ్లాగ్ చదువుతున్నార? పారిపోకుండా? మీరు చాలా సహనవంతులు సుమండీ.....day dreaming