31, డిసెంబర్ 2010, శుక్రవారం

కొత్త సంవత్సరానికి...హాయ్..హాయ్

పాత సంవత్సరానికి....బై..బై..talk to the hand
కొత్త సంవత్సరానికి...హాయ్..హాయ్...big hug

కొత్త సంవత్సరపు వేడుకలంటే భలే భలే సరదా కదా....గ్రీటింగ్ కార్డ్స్...కేక్స్...కొత్త డైరి...ఇంటిముందు 'వెల్కం న్యు ఇయర్' అని ముగ్గులు....అబ్బో సందడే సందడి.మొత్తం 365 రోజులు...ఇట్టే గడిచిపోయాయంటే నమ్మబుద్ది అవదు. కానీ ఈ365 రోజుల్లో ఎన్ని రోజులు గుర్తుంచుకోతగ్గవి? ఎన్ని జ్ఞాపకాలు దాచుకోతగ్గవి? అవన్నీ మనం ఎంతకాలం గుర్తుపెట్టుకోగలం? అందుకే నేను ఒక ఇయర్ స్క్రాప్ బుక్ పెట్టుకున్నాhappy పింక్ కవర్ పేజి తో ఉండే తెల్లని కాగితాల అందమైన ఈ పుస్తకం లో ప్రతి సంవత్సరం డిసెంబరు31 న....ఆ సంవత్సరం లో జరిగిన ముఖ్యఘట్టాలు...కొన్ని మధుర స్మృతులు...చేదువైనా మరిచిపోలేని జ్ఞాపకాలు....అలా అన్నిటిని అక్షరబద్ధం చేస్తా.క్రితం సంవత్సరం ఆ బుక్ లో వ్రాసిన సంగతులు చదివి వాటిని గుర్తు చేసుకుంటా.అలా చేయడం వల్ల మన జ్ఞాపకాలు పదిలంగా దాచుకున్న ఫీలింగ్ తో పాటు....మనం చేసిన తప్పొప్పులు....ఆలోచనావిధానంలో మార్పులు తెలుస్తాయి అని నా నమ్మకం.

న్యు ఇయర్ అంటే గుర్తొచ్చేది గ్రీటింగ్ కార్డ్స్ కూడా.ఇప్పుడు ఈ-కార్డ్స్  వస్తున్నాయి కాని ఇదివరకు గిఫ్ట్ షాపుల్లో...మామూలు పచారి కొట్లలో కూడా ఎన్నెన్ని గ్రీటింగ్ కార్డ్లు అమ్మేవారో! నాకు గ్రీటింగ్ కార్డ్స్ అంటే చాలా ఇష్టం batting eyelashesఅందుకే మంచి మంచి  గ్రీటింగ్ కార్డ్స్ ఖరీదు ఎక్కువైనా కొని...చక్కగా దాచిపెట్టేసుకుంటా.అదేంటో మరి! ఎవ్వరికి ఇవ్వబుద్ది కాదు tongue కాని...నా ఫ్రెండ్స్ కి,టీచర్లకి నేనే గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి ఇచ్చేదాన్ని.గడ్డిపూలు,గులాబి,తామర పూరేకులు,ముక్కుపుడక చెట్టు కొమ్మలు,...ఇలాంటివి ముందుగానే పుస్తకాల్లో దాచి....ప్రెస్ చేసి...వాటిని తెల్లని కాగితం మీద అందంగా అతికించి...రంగు రంగుల జెల్ పెన్స్ తో స్టెన్సిల్ ఉపయోగించి న్యు ఇయర్ కొటేషన్స్ వ్రాసి అందరికీ ఇచ్చేదాన్ని.అలాగే...పేపర్లు...వీక్లీలు...నోట్ బుక్స్ అట్టల మీద ఉండే సీనరిలు,పూలు,చెట్లు....అన్నీ కట్ చేసి చక్కని గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసేదాన్ని.కొద్దిరోజులయ్యాక ఆయిల్ పెయింట్స్ తో  గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం మొదలుపెట్టా. ఒక రెండు మూడు కలర్స్ విడివిడిగా బ్రష్ తో తీసుకుని ఒక టబ్ నీటిలో వాటిని చిలకరించి....ఆ రంగులు టబ్ అంతా పరుచుకోగానే....బ్రష్ వెనకవైపుతో ఆ రంగునీటిని ఒకసారి తిప్పి... ఒక దళసరి కాగితాన్ని అలా నీటిమీద ఆ రంగులు అంటేలాగా ముంచి తీసేదాన్ని.ఎంతో అందంగా ఉండే పెయింట్ పాటర్న్స్ దానిమీద పడేవి.దాన్నికాసేపు ఎండలో ఆరబెట్టి....అందమైన మెసేజ్ ఒకటి రాస్తే గ్రీటింగ్ కార్డ్ తయార్.ఇలా చేసిన గ్రీటింగ్ కార్డ్ ఒకసారి మా స్కూల్లో మేడం కి ఇస్తే...ఆమె చాలా మెచ్చుకుంది blushing అలాగే..గవ్వలతో,పూసలతో కూడా గ్రీటింగ్ కార్డ్స్ చేసేదాన్ని. అలా నా సొంతంగా తయారు చేసిన కార్డ్ వాళ్ళకి ఇస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో!happy

ఇక 31 రాత్రి చేసే హడావిడి అంతా ఇంతా కాదు.ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేయాలి కదా.మనమా ముగ్గులో వీక్sad.కాని అందరూ వేస్తున్నారు నేను వెయ్యాలి అని ఆత్రుత.మా అమ్మేమో 'నీకెందుకే అసలే ముగ్గులు రావు...పైగా ఈ రంగులు కూడా! అవసరమా? నేను వేస్తా కదా!' అనేది.అయినా వినకుండా ఎదురింటి ఆంటి వాళ్ళ హెల్ప్ తీసుకుని.....పెద్ద పెద్ద ముగ్గులు వేసి మా అమ్మకి గర్వంగా చూపించేదాన్ని.ఆ రోజున ఎవరు వీధిలో అందమైన ముగ్గులు వేసారో అని అన్నీ ఒక రౌండ్ తిరిగి చూసొచ్చి...'మన ముగ్గే బాగుంది' అనుకుని దాన్ని చూసి మురిసిపోయేదాన్ని. నాన్నగారు ఆఫీస్ నించి వస్తూ వస్తూ స్వీట్లు పట్టుకొచ్చేవారు.ఇక అర్ధరాత్రి కోసం ఎదురు చూపులు.అందుకోసం టీ.విలో ఏదో ఒక ప్రోగ్రాం చూడటం...సరిగ్గా పన్నెండు గంటలకి నేను,తమ్ముడు కలిసి పెద్దగా 'హ్యాపీ న్యు ఇయర్' అని వీధి అంతా వినబడేలా అరవడం....స్వీట్లు తినడం....ఇక బంధువులు,ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు...మెస్సేజీలు...అలా గోల గోల చేసి ఎప్పుడో తెల్లవారుజామున పడుకునేదాన్ని.మళ్లీ పొద్దున్నే లేచి కొత్త డ్రస్ వేసుకుని అందరికీ చూపించాలి కదా big grin

ఇక డైరి విషయానికి వస్తే...అదేంటోనండీ ఈ డైరి విషయంలో నాకెప్పుడు చుక్కెదురే.నాకు కావాల్సిన డైరి ఇంతవరకు దొరకలేదు.ప్రతి సంవత్సరం డిసెంబరులో నా కొత్త డైరి వేట మొదలవుతుంది.ఎంత వెదికినా నేను కావాలనుకున్నది దొరకదు.పోనీ మనమే తయారుచేసుకుందాం అంటే..అయ్యే పని కాదు.నాకు మాములు డైరీలు నచ్చవు.చక్కని బాతిక్ ప్రింట్ మీద అందమైన పూసలతో ఎంబ్రాయిడరి చేసిన క్లాత్ ని కవర్ పేజికి అతికించి తయారుచేసిన  డిజైనర్ డైరి కావాలి.అది ఎక్కడా దొరకదే? ఒకసారి బెంగళూరు ఫోరంలో చూసా! ధర అక్షరాలా ఐదు వందలు. బాబోయ్ అని వాడికి దణ్ణం పెట్టి వచ్చేసా! ఎప్పటికీ దొరికేనో నా కలల డైరి!!day dreaming అప్పటిదాకా ఎలాగో అలా సరిపెట్టుకోవడమే...

ఇంకా..కొత్తసంవత్సరం సంగతులంటే...నాకు ఈ రోజున అందరిలాగా....కొత్త నిర్ణయాలు తీసుకోవడం....ఆచరణలోకి పెట్టడం లాంటివి నచ్చవు.మనం ఏదైనా చేయాలనుకుంటే....అ క్షణమే చేయాలి.దానికి వారాలు..వర్జాలు చూడక్కర్లేదు కదా! అని నా పాలసీcowboy.అందరూ సంతోషంగా ఉండాలి...అని మాత్రం కోరుకుంటాను.ఎప్పటిలాగే జీవితంలో ఒక సంవత్సరం అయిపొయింది. మన ఆయువులో సంవత్సరం తరిగిపోయింది.జీవితం చాలా చిన్నది.ఇప్పటిదాకా జరిగిందేదో జరిగింది.ఇక మిగిలిన జీవితాన్ని ఆస్వాదించాలి...అందులో ఆనందాన్ని అనుభవించాలి......ఇదే ప్రతి సంవత్సరం నేను కోరుకునే కొత్త సంవత్సరపు కోరిక happy

ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయా...అందరికీ నూతన సంవత్సర  శుభాకాంక్షలండీ rose

27, డిసెంబర్ 2010, సోమవారం

ఏల బ్రెడ్డు యన్న యింత హేటు??

ఇందు: చందు తొందరగా స్నానం చేసి రా..బ్రెడ్ టోస్ట్ చేసి పెడతా...
చందు: ఇవాళ టిఫిన్ బ్రేడ్డా?sad
ఇందు: అవును.ఏం ఒద్దా?
చందు: అంటే...అది..మరి..ఇందు ఇవాళ నాకు ఆకలిగా లేదు...జస్ట్ కాఫీ చాలు...అంతే...
ఇందు: ఏంటి? మళ్లీ మొదలెట్టావా? మేపిల్ సిరప్ ఉంది....చక్కగా వేస్కొని తినొచ్చు...ఏం ఫర్వాలేదు...వెళ్ళు
చందు: ప్లీజ్ ఇందు...బ్రెడ్ మాత్రం నావల్ల కాదు puppy dog eyes [ఇక్కడ జాలి చూపులు ఉంటాయి...చలిలో వణుకుతున్న కుక్కపిల్లలా అన్నమాట ]
ఇందు: అసలేంటి నీ ప్రాబ్లం? పోనీ మేపిల్ సిరప్ వద్దు...పీనట్ బటర్...జామ్ ఉంది...తింటావా?
చందు: ఒద్దు ఇందు....నువ్వు తిను అవన్నీ వేసుకుని....నన్ను మాత్రం ఒదిలేయ్!
ఇందు: లేదు చందు.....నువ్వు ఏమి తినకుండా ఆఫీస్ కి వెళ్ళడానికి వీల్లేదు.
చందు: :((((( [మళ్లీ జాలి చూపులు....'నన్నొదిలి పెట్టు' అని]....ఆ! నేను ఇవాల్టికి కార్న్ ఫ్లేక్స్ తింటా big grin [అబ్బ ఆ మొహం 1000 క్యాండిల్ బల్బే]
ఇందు: కార్న్ ఫ్లేక్స్ లేదు....గాడిద గుడ్డు ఫ్లేక్స్ లేదు.అయినా ఏంటి బ్రెడ్ తో నీ ప్రాబ్లం? ఎంత బాగుంటుంది అసలు బ్రెడ్? ఇటాలియన్ బ్రెడ్ తెల్సా? అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది.
చందు: నావల్ల కాదు ఇందు.ఐ హేట్ బ్రెడ్....angry[ఐ హేట్ యు అన్న రేంజ్ లో చెప్పాడు పిల్లాడు]
ఇందు: నాకోసం కూడ తినవా చందు?? [సెంటిమెంటు పిండేసానా? ;) ]
చందు: అలా అంటే ఎలా? నాకు అస్సలు ఇష్టంలేదు ఇందు.యుఎస్ వచ్చిన కొత్తల్లో ఇక్కడ వెజిటేరియన్ ఏమి దొరక్క...కేవలం ఆ డొక్కు శాండ్విచ్...సలాడ్ తిని..తిని ఆ రెండూ అంటే విరక్తి పుట్టింది.అందుకే ఐ హేట్ బ్రెడ్.నువ్వు ఏం తినమన్నా తింటా..బ్రెడ్ దక్క!crying
ఇందు: నామొహం లే! అన్నిటికీ ఇవే స్టోరీస్...అటు..ఇటు మార్చి చెప్తావ్! అంతేగా!.....క్యాబేజీ పప్పు తింటావా? కాలిఫ్లవర్ కూర?....తీపి గుమ్మడి కూర? సొరకాయ పప్పు? బీట్రూట్ కూర? ఏం తింటావు చెప్పు? ఇన్ని కండీషన్స్....మళ్లీ చేసినవాటికి వంకలు??? ఆ? అదంతా సరే బ్రెడ్డు తింటావా లేదా?angry
చందు: అసలు ఎలా తింటారు ఇందు బ్రెడ్ ని? అది జ్వరం వస్తే తినే తిండి.ఇక ఈ అమెరికా వాళ్లకి తెలిసిన ఒకే ఒక ఐటం.అయినా నీకీ బ్రెడ్డు పిచ్చేంటి ఇందు??
ఇందు: నాకు బ్రెడ్డు పిచ్చెం లేదు.బ్రెడ్డు అంటే ఇష్టం అంతే! నీకే బ్రెడ్డంటే చేదు.నన్నంటావేంటి? అయినా నీకోసం ఆ డొక్కు..చెత్త...ఇడ్లీలు ఎన్నిసార్లు తినలేదు? నాకోసం ఒక్క బ్రెడ్ స్లైస్ తినడానికి ఎంత ఆలోచిస్తున్నావ్ చందు?
చందు: ఎందుకు ఇందు అంత మాటలంటావ్??? సర్లే నీకిప్పుడు నేను బ్రెడ్ తినాలి అంతేగా? ఇవ్వు ఇటు...తినేస్తా...  :((((
ఇందు : [ఇందు మనసు కరిగిపోయింది....పాపం అనిపించింది ] ఒద్దులే...పాపం నీకు ఇష్టం లేదుగా! ఎందుకులే అంత బలవంతంగా తినడం?? నేను మరీ అంత రాక్షసినేం కాదు! డోంట్ వర్రీ...సర్లే నీకిష్టమైన ఉప్మా చేసిపెడతా...ముందు స్నానం చేసి రా!
చందు: happyమా మంచి ఇందు...ఎంత బుద్ధిగా మాట వింటుందో!! [అసలు మీనింగ్....'నీమొహం లే...చూసావా...నేనే గెలిచాను' అని]
ఇక జింగ్..జింగ్ అని ఈల వేసుకుంటూ...ఎగురుకుంటూ స్నానానికి వెళ్లారు మా చందుగారు...!

ఇదండీ...మా ఇంట్లో బ్రెడ్డు తంతు.ఇది ఒక్కసారి కాదు...మాటీవిలో 'అతడు' మూవీ లాగా...వారానికి ఒకసారి జరుగుతూనే ఉంటుంది....సేం డైలాగ్స్...ఒకటి ముందు...ఇంకోటి వెనుక.అంతే!నాకు బ్రెడ్ అంటే చాలా ఇష్టం.అలాగని నేనేదో అమెరికన్లా ఫోస్ కొడుతున్నా అనుకోకండి...నాకు చిన్నప్పటినించి...టూటీ ఫ్రూటీలు వేసిన మిల్క్ బ్రెడ్ అంటే చాలా ఇష్టం.'లైట్ల బ్రెడ్..లైట్ల బ్రెడ్' అంటూ తినేదాన్ని అట...మా అమ్మా ఎప్పుడు చెబుతూనే ఉంటుంది.మర్చిపోయా చెప్పడం...మా అమ్మకి కూడ బ్రెడ్ అంటే అసహ్యమే...చందు కి,మా అమ్మకి..బ్రెడ్ అంటే ఏదో రోగిష్టిమొహాల తిండిలాగా కనపడుతుంది.జ్వరం వస్తేనే బ్రెడ్ తినాలట.నాకు వీళ్ళకి బ్రెడ్ యుద్ధాలు చాలా జరిగాయి...ఎప్పుడు ఓడిపోయేది మాత్రం నేనే! :((((((((((

ఏం చేస్తాం లెండి..ఏవో బ్రెడ్డు కష్టాలు....ఈమధ్య చందుగారికి బ్రెడ్ సాండ్విచ్ కొంచెం నచ్చుతోంది....బాగా కారంగా...స్పైసీ గా కూర చేసి ఆ సాండ్విచ్లో పెడుతున్నా...పర్లేదు....తినగలుగుతున్నారు అబ్బాయిగారు.... :)
మార్పు అనేది సహజం కదా! winking అలాగని మనం మారకూడదు...ఎదుటివారిని మార్చాలి tongue

20, డిసెంబర్ 2010, సోమవారం

తొలిసారి నిన్ను చూసింది మొదలు...-3

అనన్య అందమైన చీరలో దర్శనమిచ్చింది.అర్జున్ అస్సలు ఊహించలేదు.లేత గులాబీ రంగు చీరలో అచ్చం అరవిచ్చిన గులాబిలాగే ఉంది.అసలు తను ఎక్కడున్నాడో..ఎందుకు వచ్చాడో కూడా మర్చిపోయి..ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు ఆమె వంక రెప్పవాల్చకుండా చూస్తున్నాడు.అది గమనించిన ఆమె బుగ్గల్లో సిగ్గులు పూసాయి.అందరూ వింతగా తమనే చూస్తున్నారని... గ్రహించిన ఆమె వెంటనే తేరుకుంది.
"హలో అర్జున్ గారు! ఇక బయల్దేరదామా?" అని అడిగింది.
అప్పుడు ఇహలోకి వచ్చిన అర్జున్....
"ఓహ్!సారీ...యా....పదండి వెళదాం" అని వాళ్ళని కార్ దగ్గరకి తీసుకెళ్ళాడు.అనన్య ముందు సీట్లో కూర్చుంటే బాగుండనుకున్నాడు.కానీ ఆమె వెనుక సీట్లో తన స్నేహితురాళ్ళతో కూర్చుంది.కొంచెం నిరుత్సాహపడినా..పోన్లే అని త్వరగా ఇంటికి పోనిచ్చాడు.అక్కడికి చేరాక...అర్జున్ అందరికీ ఇంట్లో వాళ్ళని పరిచయం చేసి...ఇల్లంతా చూపించాడు.అర్జున్ వాళ్ళ ఇల్లు కొండ అంచున ఉంటుంది.ఆ ఇల్లే ఆ వీధిలో చివరి ఇల్లు.అక్కడితో డెడ్ ఎండ్.ఇల్లు చిన్నదైనా ముచ్చటగా ఉంది.ఇంటిముందు రకరకాల పూల చెట్లు.ఇంటివెనుక పళ్ళచెట్లు....ఇంకా చిన్న పెరుడు కూడా ఉంది.వారి ఇంటి వెనుక గోడ దాటితే కిందంతా పెద్ద లోయ.ఆ ఇల్లు చాలా నచ్చింది అనన్యకి.
"మీరు లైబ్రరి ఉంది అన్నారు..మీ ఇంట్లో ఎక్కడా?" అని అడిగింది అనన్య..సహజంగా తనకి పుస్తకాల మీద ఉన్న ఆసక్తితో..
"నా రూం పైన ఉంటుందండి.అక్కడుంది నా చిన్ని పుస్తక ప్రపంచం.రండి చూపిస్తా!..మీరూ వస్తార?" అని మిగితావారిని కూడా అడిగాడు.బాబోయ్...ఆ పుస్తకాల గోల మావల్ల కాదు..మీరు కానివ్వండి అని వాళ్ళు కిందే ఉండిపోయారు...

అర్జున్ అనన్యని పైకి తీసుకెళ్ళాడు.అక్కడ కూడా చాలా మొక్కలు కుండీలలో ఉన్నాయి.ఒక చిన్న ఉయ్యాల అర్జున్ రూం పక్కనే ఉంది.అర్జున్ రూం తలుపు తీసి....లైట్ వేసి అనన్యని లోపలి ఆహ్వానించాడు.రూం లోకి అడుగుపెట్టగానే మంచి గంధపు వాసన...'వావ్' అనుకుంది అనన్య.రూం అంతా ఒకసారి పరిశీలనగా చూసింది.కొంచెం పెద్ద రూం.కానీ చాలా పద్దతిగా...నీట్ గా  ఉంది.గదికి నలువైపులా కిటికీలు...వాటికి అందమైన కర్టేన్స్......గోడలకి వెదురుతో చేసిన వాల్ హాన్గింగ్స్.....ఒక మూలకి చిన్ని మంచం....దాని పక్కనే కేన్ టేబుల్-చైర్...దానిమీద చిన్న లైటు....ఒక బుల్లి కొండపల్లి బొమ్మా...సర్దిపెట్టి ఉంచిన పుస్తకాలు....పక్కనే పెద్ద షెల్ఫ్...దాని నిండా ఎన్ని పుస్తకాలో!నెమ్మదిగా అనన్య కాళ్ళు అటు వైపు లాగాయి.ఒక్కో పుస్తకం తీసి ....ఎంతో ఆసక్తితో చూస్తున్న ఆమె వంకే చూస్తున్నాడు అర్జున్.'ఇదంతా నిజమేగా? తన అందాల రాశి...తన రూం లో....ఇదంతా కలై కరిగిపోదు కదా!' అని ఆలోచిస్తున్నాడు.'ఎంతందంగా ఉంది ఈ చీరలో! పొద్దున రైల్వే స్టేషన్లో అల్లరి చేసిన అమ్మాయేనా? తెలుగుదనానికి నిలువెత్తు రూపంలా...బాపు బొమ్మలా....పూల కొమ్మలా....నా చెలి సౌందర్యం ఏమని చెప్పను? అప్సరసలు...దేవతలు...అంటే ఇలానే ఉంటారు కాబోలు....' అనుకుంటూ ఆమె సౌందర్యారాధనలో మునిగితేలుతున్నాడు. ఇంతలో అనన్య అర్జున్ వంక చూసింది.చేతిలో ఉన్న పుస్తకం రాక్లో పెట్టి అతని వంక చూసి చిరునవ్వు నవ్వింది.
"ఏంటి అలా చూస్తున్నారు? "
"మీరూ ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు అనన్య గారు....నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు శారీ కట్టుకుంటారని...రియల్లీ  యు లుక్ ఏమేజింగ్..."
"హ్మ్! మీ ఇంటికి భోజనాలకి వస్తున్నాం కదా...కొంచెం సాంప్రదాయబద్ధం గా ఉంటుందని కట్టుకున్నా..అంతే!"
"ఓకే.ఎలా ఉందండి నా లైబ్రరి?!"
"గ్రేట్.చాలా కలెక్షన్ ఉంది.నేను చదవని ఎన్నో పుస్తకాలు ఉన్నాయి.మీ అభిరుచి కూడా బాగుంది.మీ రూం కూడా...చాలా పద్దతిగా ఉందే! మేము వస్తున్నామని...ఇలా సర్దారా? లేక ఎప్పుడు ఇలాగే ఉంటుందా?" అని చిలిపిగా అడిగింది అనన్య.
"హ్హహ్హ!లేదండి.నా రూం నేనే సర్దుకుంటా.నాకు నీట్ గా లేకపోతె చిరాకు.సో! నా రూం ఎప్పుడు ఇలాగే ఉంటుంది"
"గుడ్!  బైట కూడా ఒకసారి చూద్దామా?" అని రూం బయటకి నడిచింది అనన్య.ఆమె వెంటే వెళ్ళాడు అర్జున్.
అక్కడ నించి లోయ అంతా కనపడుతోంది.చల్లటి కొండగాలి ముఖానికి తాకుతోంది.పుచ్చ పువ్వులా విచ్చుకున్న వెన్నెల..... నల్లటి అగాధంలా ఉన్న ఆ లోయలో కాంతిని నింపడానికి ప్రయత్నిస్తోంది.అక్కడక్కడ మిణుకు మిణుకు అని ఏవో గాల్లో ఎగురుతూ ..మెరుస్తున్నాయి...
"అవేంటి? అలా దూరంగా ఎగురుతూ....మెరుస్తున్నాయి....?" అని అడిగింది అర్జున్ ని.
"అవి మిణుగురు పురుగులండి.అడవి కదా..ఇవన్నీ ఉంటాయి.రాత్రిపూట....ఇలా చల్లగా గాలి వీస్తుంటే...ఈ ఉయ్యాలబల్ల మీద కూర్చొని....అలా లోయలోకి చూస్తూ ఉంటే....ఎంత బాగుంటుందో!"
"చాలా బాగుందండి...ఐతే మనం ఇప్పుడు కూడా ఉయ్యాల బల్ల మీద కూర్చుందాం రండి" అని అర్జున్ తోపాటు వెళ్లి ఉయ్యాలబల్ల మీద కూర్చుంది.కొబ్బరి చెట్ల సందుల్లోనించి చంద్రుడు తొంగి చూస్తున్నాడు.అనన్య దగ్గరనించి ఒక గమ్మత్తైన పరిమళం ఆ పిల్లగాలితో కలిసి అర్జున్ చుట్టు తిరుగుతోంది.చిగురాకుల రెపరెపలు....కీచు రాళ్ళ శబ్దం మినహా.....వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది.అర్జున్ కి ఆ క్షణం ఎంత అపురూపంగా అనిపించిందో....తనకి ఇష్టమైన చోట....తనకి చాలా ఇష్టమైన అమ్మాయితో గడుపుతున్న ఆ కాలం ముదుకు వెళ్ళకూడదు అని ఎన్ని సార్లు అనుకున్నాడో!ఆ పున్నమి రాత్రి తన చెంత వెన్నెల శిల్పం లా ఉన్న వున్న అనన్యని చూస్తూ ఉండిపోయాడు....
"ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు కదా!ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుండు!" అనన్య నోటివెంట తన మనసులో మాటలు విని...అర్జున్ ఆశ్చర్యపోయాడు....
"మరి ఎప్పటికీ నాతోనే ఉండిపోతావా అనూ?" ఇక ఆగలేక అడిగేసాడు అర్జున్.
"ఏంటి?ఏమన్నారు?"
"అదే! ఇక్కడే కాసేపు కూర్చుందామా అన్నాను.అంతే" అని తడబడ్డాడు.అనన్య కి అర్ధమయింది.ఆమెకి అర్ధమయింది అని అర్జున్ కి అర్ధమయింది.వారి మధ్య కాసేపు మౌనం రాజ్యమేలింది.ఇద్దరి మనస్సుల్లో పుట్టి ఇంకా 24 గంటలు కూడా కానీ ప్రేమ...ఎన్ని మాయలు చేస్తోంది? ఒక క్షణం మౌనం..ఒక క్షణం గానం...ఒక క్షణం విరహం..ఒక క్షణం మోహం....మనసు ఎంత చిత్రమైనది? ఎందుకు..ఎప్పుడు..ఎవర్ని కోరుకుంటుందో...దానికే తెలీదు...కానీ ప్రేమ అనే నిప్పుని రగిల్చి....అంతకంతకీ ఆజ్యం పోస్తూనే ఉంటుంది...

అంతలోకే పైకి అనూ ఫ్రెండ్స్ వచ్చారు.
"హేయ్! పైన చాలా బాగుంది కదా! ఇక్కడే భోజనాలు చేద్దామా?" అన్నారు అర్జున్ తో.అతను సరే అనడంతో...అందరూ కిందకి వచ్చి ఆ భోజన సామగ్రి అంతా పైకి తీసుకెళ్ళారు....పైన వెన్నెల్లో...అందరూ కూర్చుని భోజనాలు చేసారు.....మూడురోజులనించి బైట భోజనం తిని తిని వెగటు పుట్టి...ఇపుడు ఇంటి భోజనం దొరికేసరికి....ఒక్కొక్కళ్ళు....ఆకలిగొన్నపులుల్లా...అన్నం మీద దాడి చేసారు.భోజనాల సమయంలో అర్జున్,అనన్య ఒకరితో ఒకరు డైరెక్ట్ గా మాట్లాడుకోలేదు.భోజనాలు అయ్యాక...అంతా అంత్యాక్షరి ఆడుకున్నారు.అప్పుడు కూడా వారిద్దరి మధ్యా మౌనమే! అందరితో బానే ఉన్నా..ఇద్దరూ ఎదురుపడితే మౌనమే సమాధానం అయింది.అర్జున్ చెల్లి అనన్యతో బాగా కలిసిపోయింది.ఆమె,అనన్యా ఇద్దరు తెగ ముచ్చట్లాడుకున్నారు.కాసేపయ్యాక అందరూ కిందకి వెళ్ళారు.అనన్య....అర్జున్ ఇంట్లో ఉన్న సిస్టంలో తాము దిగిన ఫొటోలన్ని కాపీ చేసింది...అది చూసి...'పోనిలే..తన జ్ఞాపకాలైనా ఉన్నాయి' అనుకున్నాడు.ఇక కాసేపటికి అందరూ రిసార్ట్ కి బయలుదేరారు.అందరినీ అక్కడ దింపాడు అర్జున్.వాళ్ళు రేపు అరకు అంతా చూపించే భాద్యత అర్జున్ కి అప్పగించారు.ఆనందంగా స్వీకరించాడు అతను.అందరికీ గుడ్నైట్ చెప్పి ఇంటికి వచ్చాడు.అప్పుడు కూడ అనన్య ముభావంగానే ఉంది.అర్జున్ తన రూం లోకి రాగానే అక్కడ బుక్ షెల్ఫ్ దగ్గర అనన్య పుస్తకాలు తిరగేస్తున్నట్టే అనిపించింది...ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు.అనన్య ఆలోచనలే.'తనకి నేనంటే ఇష్టమా లేదా? ఒక వేళ ఇష్టంలేకపోతె...నేను నా ప్రేమ విషయం డైరెక్ట్ గా చెప్పేస్తే,...తను కాదంటే? నేను అసలు అది తట్టుకోగలనా?? అనన్య ఉద్దేశమేంటి??' ఇలా ఎన్నో ఆలోచనలు ముప్పిరిగొన్నాయి.అలా అనన్య గురించి...తన ప్రేమ గురించి...ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారు ఝామున కొద్దిగా నిద్రపోయాడు.

పొద్దున్నే లేచి తయారయి రిసార్ట్కి వెళ్లి అక్కడ నించి అందరినీ తీసుకుని అరకు చూపించడం మొదలుపెట్టాడు అర్జున్.అనన్య కొంచెం డల్ గా ఉంది.అతనికి విషయం తెలుసు కాబట్టి...ఆమెని ఎక్కువ కదిలించలేదు.అనన్య ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఆమెకి దూరంగా ఉంటున్నాడు.ఇదంతా చూస్తున్న అనన్య మిత్రబృందానికి ఏమి అర్ధం కాలేదు.'ఏమోలే!ఇద్దరిమధ్యా గోడవైందేమో...మనం కలిపించుకోకుండా ఉండడం బెస్ట్' అనుకున్నారు.చాపరాయి ఫాల్స్,ట్రైబల్ మ్యుసియం,పద్మాపురం గార్డెన్స్...అన్నీ చూపించాడు.సాయంత్రానికి ఇక వారు వైజాగ్ కి పయనమయ్యారు.వెళ్లేముందు ఒకసారి అందరూ అర్జున్ ఇంటికి  వచ్చారు.అర్జున్ కుటుంబానికి కృతఙ్ఞతలు తెలియజేసి....ఇక బయలుదేరారు.అర్జున్ కూడా వారితో పాటు బయలుదేరాడు.అతనికి మరుసటిరోజున పరిక్ష ఉంది.అందరూ కలిసి బస్సులో వైజాగ్ పయనమయ్యారు.బస్ లో కూడా....అనన్య అర్జున్ తో ఏదో నామమాత్రంగా మాట్లాడింది.అర్జున్కి మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టైందీ...'తనకి నేను నచ్చలేదేమోలె అనుకున్నాడు!'.ఇక అనన్యని ఇబ్బంది పెట్టకూడదనుకున్నాడు.

మర్నాడు సాయంత్రం అనన్య వాళ్ళు వెళ్ళేది..విజయవాడకి.తాము ఇంకా చూడని సింహాచలం,భీమ్లి బీచ్,రిషికొండ బీచ్ చూసుకుని సాయంత్రం బయలుదేరదామని వాళ్ళ ప్లాన్.అందరూ వైజాగ్ చేరారు.అర్జున్ బస్ స్టాండ్లో వాళ్లకి వీడ్కోలు పలికి..సాయంత్రం కుదిరితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తానని చెప్పి...అనన్య వంక ఒకసారి చూసి....చిన్నగా నవ్వి....హాస్టల్ కి బయలుదేరాడు....ఆ రోజు అర్జున్ చాలా బాధపడ్డాడు.'అనవసరంగా ఒక మంచి అమ్మాయిని బాధ పెట్టాను.పాపం తను ట్రిప్ సరిగా ఎంజాయ్ చేయలేకపోయిందేమో నావల్ల!....కానీ అనన్య లేని నా లైఫ్...ఊహించుకోలేకపోతున్నా! ఒక్కరోజులో కట్టుకున్న ఆశల మేడలన్ని కూలిపోతున్నాయ్ !' అనుకున్నాడు.మధ్యాహ్నం పరీక్ష.ఏదో చదివి...ఏదో రాసి సాయంత్రం బైట పడ్డాడు.వెళ్లేముందు అనన్యకి ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలనిపించింది.కనీసం ఒక స్నేహితుడిగా గుర్తుంచుకున్నా చాలు అనుకున్నాడు.వెంటనే తన ఫ్రెండ్ షాప్ కి వెళ్ళాడు.

రాత్రి....తొమ్మిది గంటలు....అనన్య వాళ్ళ బస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది.అనన్య ఫ్రెండ్స్ అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నారు.ఇంతలో పరుగులాంటి నడకతో అర్జున్ వచ్చాడు.అందరూ అతనికి థాంక్స్ చెప్పి వీడ్కోలు పలికారు.వాళ్ళందరికీ పేరు పేరునా వీడ్కోలు చెప్పాడు అర్జున్.ఇక అనన్య వంతు వచ్చేసరికి అతనికి మాటలు రాలేదు.చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ ఆమెకి అందించాడు.ఎన్నో మాటలు గొంతు దాక వచ్చి ఆగిపోతున్నాయ్.ఆమె కళ్ళల్లో తన ప్రేమని వెదికే ప్రయత్నం చేస్తున్నాడు అర్జున్.అతనికి తన భావాలు కనపడకుండా దాచుకుంటోంది అనన్య.తను కోరుకున్న ప్రేమ ఆమెలో కనిపించక...తన తొలివలపు చిరునామా తెలియక...అలసిన అర్జున్ మనసు ఆమెకి వీడ్కోలు పలికింది.ఆమె అర్జున్ ఇచ్చిన గిఫ్ట్  తీసుకుని అతనికి బై చెప్పి బస్ ఎక్కింది.లోపలి వెళ్లేముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి నవ్వింది.అర్జున్ కళ్ళలో నీళ్ళు....'నువ్వు లేకుండా ఉండలేను అనన్యా!' అని చెప్పాలనిపించింది.కానీ నోరు పెగల్లేదు.అక్కడ అనన్య కళ్ళలో కూడా నీళ్ళు...అర్జున్ ని వదిలి వెళ్ళలేకపోతోంది...కానీ బయటపడడానికి మొహమాటం అడ్డొస్తోంది.'చెప్పాలా..వద్దా? ఇది సమయమా...? కాదా? ఇది ప్రేమేనా? మోహమా?' ఎన్నో ప్రశ్నలు ఆమె మనసులో!!ఇక అక్కడ అర్జున్ ని చూస్తూ ఉండలేక లోపలికెళ్ళిపోయింది అనన్య.అర్జున్ కూడా అనన్య వెళ్ళిపోవడం చూడలేక వెనుదిరిగి వచ్చేసాడు.బస్ బయలుదేరింది....

అర్జున్ అనన్య బాధ తట్టుకోలేక హాస్టల్ రూంకి వెళ్లి పడుకున్నాడు.అతనికి అనన్య రూపమే కళ్ళముందు కదలాడుతోంది.'తనని ఇబ్బంది పెట్టకూడదని కనీసం సెల్ నంబర్ కూడ అడగలేదు....ఇక నా అనన్యని జీవితంలో కలవలేను...ఎలా ఇంత బాధ తట్టుకోవడం?? అసలు తనకి కనీసం నామీద ఇష్టం అయినా ఉందా?ఇక అనన్య నాకు శాశ్వతంగా దూరం అయిపోయినట్టేనా?' అని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు.అక్కడ బస్లో అనన్య అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసింది.ఒక సిరామిక్ మగ్...దానిమీద తామందరం బొర్రాగుహల దగ్గర దిగిన ఫోటో ప్రింట్ చేసి ఉంది.కింద 'విత్ లవ్...అర్జున్' అని వ్రాసి ఉంది.ఆ మగ్లో చాక్లెట్లు...ఒక చిన్న టెడ్డిబేర్ బొమ్మా...దాని మీద..'ఐ మిస్ యు' అని వ్రాసి ఉన్న అక్షరాలూ...అనన్యకి కన్నీళ్ళు ఆగలేదు.ఆ 'మిస్ యు' అనే పదాలు ఆమెలో జరిగే సంఘర్షణకి అర్ధం ఇచ్చాయి.'నేను ఇప్పుడు అర్జున్ ని మిస్ ఐతే...ఇక ఎప్పటికీ తన ప్రేమని మిస్ అయినట్టే.ఇప్పటిదాకా ప్రేమని ఆకర్షణేమో అనుకున్నా! కానీ...ఈ కన్నీళ్ళు...ఈ బాధా..ఇదంతా ప్రేమే కదా! తనని వదలలేని స్థితి...ఇదంతా ప్రేమే కదా! తన కళ్ళలో కనిపించే నా రూపం నిజమని నా మనసు నమ్ముతోంది.ఇది ప్రేమ అని చెబుతోంది.ఇంతకంటే ఇంకేం కావాలి?' అనుకుంది అనన్య.

అనన్య ఊహల్లో కొట్టుకుపోయిన అర్జున్...ఎప్పటికో బయటపడ్డాడు.ఎప్పటికీ మరిచిపోలేని అనన్య తన జీవితంలో వచ్చిన వాసంత సమీరం అనుకున్నాడు.కాసేపయ్యాక తన ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు.ఒక పది మిస్డ్ కాల్స్.ఏదో కొత్త నంబర్...'ఎవరబ్బా ఇన్ని సార్లు కాల్ చేసారు?' అని ఆ నంబర్ కి కాల్ బాక్ చేసాడు.
"హలో! ఎవరు?"
"హలో!"
"హలో!...ఎవరు...అనూ!"
"యస్ అర్జున్! నేనే!...."
"అనన్య! ఐ కాంట్ బిలీవ్ దిస్.మీకు నా నంబర్!!??"
"నిన్న మీ చెల్లిని అడిగి తీసుకున్నా!నీకు కనీసం నా సెల్ నంబర్ అడగాలని కూడా అనిపించలేదు కదా!ఏం చేయాలి నిన్ను?"
"అది కాదు అనన్య!నువ్వు నావల్ల ఇబ్బంది పడుతున్నావేమో అని...నీకు నేనంటే ఇష్టం లేదేమోనని..."
"హ్మ్! ఇప్పుడు చెప్పు....నాకు నువ్వంటే ఇష్టంలేదా!?"
"అదంతా నాకు తెలీదు అనూ!కానీ ఒక్కటి మాత్రం నీకు చెప్పాలనుకుంటున్నా!........'ఐ లవ్ యు అనన్యా!"
" "
"హమ్మయ్య! జీవితంలో ఈ మాట నీతో చెప్పలేనేమో అనుకున్నా! ఇప్పుడు చెప్పేసా! ఎంత హ్యాపీ గా ఉందో!నువ్వు లేకుండా...నేను అస్సలు ఉండలేకపోతున్నా అనూ!...ఐ లవ్ యు...ట్రూలీ...మ్యాడ్లీ..డీప్లీ..మరి నీక్కూడా నేనంటే ఇష్టమేగా?" ఏం సమాధానం వస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు అర్జున్.
"యస్!"
"చాలు అనన్యా!...ఇది చాలు....ఇంతకీ నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చిందా?"
"చాలా.....నువ్వెంత నచ్చావో...అంత!"సమాప్తం 


P.S: ముందుగా...ఇన్ని భాగాలు చేసి ఈ కథను వ్రాసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ...అసలు మొదట...రెండు భాగాలుగా మాత్రమె వ్రాదామనుకున్నా! కానీ అర్జున్-అనన్య మధ్య ప్రేమ..కేవలం ఆకర్షణ కాకూడదు అనే..వారిమధ్య ప్రేమని చిగురించే అంశాలు జోడించా.అందువల్ల కథ నిడివి ఎక్కువైంది.,ఈ మూడు భాగాలు మీ చేత చదివించినందుకు...నన్ను తిట్టుకోకండే మరి! కథ అంతా నచ్చితే...కామెంటేయండి....లేకున్నా...అక్షింతలు వేస్తూ కామెంటేయండి......

17, డిసెంబర్ 2010, శుక్రవారం

తొలిసారి నిన్ను చూసింది మొదలు...-2

అతనికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది....పెదవులపై చిరునవ్వు మెరిసింది.వెంటనే డోర్ దగ్గర నిల్చొని బైటికి చూసాడు.అనన్యా వాళ్ళు వెళ్ళిపోతున్నారు మెట్లు దిగి.ట్రైన్ ఇంకా మెల్లగానే కదులుతోంది...ప్లాట్ ఫారం చివరలో ఉంది.వెంటనే ట్రైన్ దిగేసాడు అర్జున్.
"అనన్య గారు!!" అని గట్టిగా పిలిచాడు.వెంటనే అనన్య వెనక్కి తిరిగింది.ఎదురుగా అర్జున్.వెంటనే ఆమె కళ్ళలో మెరుపు.అది అర్జున్ దృష్టి దాటి పోలేదు.వడివడిగా ఆమె దగ్గరకి నడిచాడు అర్జున్.
"ఓహ్! ఏంటండి!! మీరు వెళ్ళాల్సింది అరకు కదా! ఏమన్నా మర్చిపోయార?"
"అవునండి...మర్చిపోయారు.నేను కాదు...మీరు.మీ ముద్దుల కెమెరా నా దగ్గరే ఉండిపోయింది.ఇది మీకు ప్రాణం కదా! అందుకే తిరిగిద్దామని చూస్తే మీరు వెళ్లిపోతున్నారు.సరే..అని నేనే ట్రైన్ దిగేసా!"
"అయ్యో! ఐం రియల్లీ సారి అండీ..మీకు చాలా ట్రబుల్ ఇచ్చా! అసలు అలా ఎలా మర్చిపోయాను? థాంక్యు వెరీ మచ్" అంది అనన్య మనస్పూర్తి గా..ఇంకా అర్జున్ ని మళ్లీ చూసిన ఆనందం కూడా ఆమె మోహంలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది.
"ఇట్స్ ఒకే! నెక్స్ట్ ట్రైన్ మళ్లీ సాయంత్రానికి కాని రాదు..అప్పటిదాకా ఎలాగో అలా గడిపేస్తాలెండి.మీకు లేట్ అవుతోంది.వెళ్ళండి మరి ఇక గుహలకి"
"అయ్యో! సాయంత్రం వరకా? పోనీ మాతో రండి.మేము ఎటూ సాయంత్రం అరకు వెళతాం.అప్పుడు అందరం కలిసి వెళ్ళొచ్చు.మీకు ఏమి అభ్యంతరం లేకపోతేనే"
"అయ్యో...నాకేం అభ్యంతరం అండీ...ఇక్కడ ఈ స్టేషన్లో కూర్చునే కంటే మీ అందరితో సరదాగా గుహలకి వెళ్ళడమే బెస్ట్.సరే పదండి ఐతే!" అన్నాడు హుషారుగా అర్జున్.తన ప్లాన్ పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది అర్జున్ కి.బొర్రాగుహలనించి బస్ లోనో,జీప్లోనో అరకు వెళ్లిపోవచ్చు.కాని వారితో పాటు గడపాలనే అలా చెప్పాడు.అలా అన్నా కొద్దిసేపు అనన్యతో గడపొచ్చు అని అతని ఆలోచన.
అందరూ కలిసి మెల్లగా నడుచుకుంటూ గుహలవైపు దారి తీసారు.మొత్తం ఆ బృందంలో పదిమంది అనన్యతో కలిపి.ఆరుగు అమ్మాయిలు...నాలుగు అబ్బాయిలు.అర్జున్ వాళ్ళతో తొందరగానే కలిసిపోయాడు.అందరూ గుహల వద్దకు చేరి...టికెట్లు తీసుకున్నారు.అర్జున్ చాలా సార్లు అక్కడికి ఫ్రెండ్స్ తో వచ్చాడు.ఆ ప్రాంతం గురించి బాగా తెలుసు.అక్కడ కొంచెం జాగ్రత్తగా,మెలకువ గా ఉండాలని వారిని హెచ్చరించాడు.ఒకసారి గుహల లోపలి వెళ్ళాక అక్కడ దారి చాలా గజిబిజిగా ఉంటుంది.
అందరూ ఒకేదారిలో వెళ్ళాలి.కొని చోట్ల వొంగొని,కొన్ని చోట్ల రెండు రాళ్ళ మధ్య దూరి...ఇలా సాగుతుంది.అందుకని ముందు ఇద్దరు అబ్బాయిలు...మధ్యలో ముగ్గురు అమ్మాయిలు...తరువాత ఒక అబ్బాయి...మళ్లీ ముగ్గురు అమ్మాయిలు...చివరలో ఇద్దరు అబ్బాయిలు ఉండేట్లు చూసుకున్నారు.మధ్యలో అర్జున్,అతని వెనుక వరుసలో అనన్య ఉన్నారు.ఇక మెల్లగా గుహల్లోకి అడుగు పెట్టారు.అర్జున్ చెప్పినట్లే ఉంది అ దారి.చాలా జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ...అక్కడ విచిత్రమైన ఆకారాల్లో ఉన్న శిలాజాలాలను చూస్తూ....వెళ్లారు.అక్కడక్కడ నేల జారుతోంది.కొన్ని చోట్ల లైటు లేదు.కొంతమంది స్టూడెంట్స్ మధ్య మధ్యలో పెద్దగా అరుస్తున్నారు.దారి పొడుగునా అర్జున్ చేయి వదలలేదు అనన్య.తను అలా పట్టుకుంటే..ఈ గుహ ఏంటి..ఎవరెస్ట్ అయినా అవలీలగా ఎక్కేయోచ్చు అనుకున్నాడు అర్జున్.

సుమారు కిలోమీటరు లోపలికి  నడిచి గుహల చివరి భాగానికి చేరుకున్నారు.అక్కడనించి మెట్లు ఎక్కితే చిన్న గుడి వస్తుంది.అక్కడ శివలింగం చాలా శక్తివంతమని..కోరుకున్నవన్నీ జరుగుతాయని ప్రతీతి.అర్జున్ వాళ్ళు ఆ మెట్లదగ్గరకి చేరుకున్నారు.ఒకసారి పైకి చూసిన అనన్యకి కళ్ళు తిరిగాయి.
"ఏంటి అర్జున్! అంత ఎత్తులో ఉంది..ఈ మెట్లు ఎంత స్టీప్ గా ఉన్నాయో! ఒకవేళ ఎక్కేటప్పుడు కాలు జారి పడితే?"
"ఏముంది! మీతో పాటు...మీ వెనుక ఉన్న అందరినీ కింద పడేస్తారన్నమాట...." అన్నాడు అర్జున్.
"వామ్మో!నేను రాను బాబోయ్! చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయ్! ఇక పైనించి చూస్తే అంతే సంగతులు! మీరు వెళ్ళండి....నేను ఇక్కడే ఉంటా"
"హేయ్..ఇది మరీ బాగుంది...ఏం వీళ్ళందరూ మనుషులు కాదా? మెట్లు ఎక్కి గుడికి వెళ్ళట్లేద? మరీ అంత భయమైతే ఎలా అండీ? సరే నా చేయి గట్టిగా పట్టుకోండి...ఒకవేళ మీరు స్లిప్ అయినా నేను...మీరు కింద పడకుండా పట్టుకుంటా..ఒకే నా?"
"హ్మ్!తప్పదంటారా? సరే...కానీ కొంచెం గట్టిగా పట్టుకోండి"
"సరేనండి!మీరు భయంతో...చుట్టు ఉన్న రాళ్ళ అందాలు చూడట్లేదు.ఇవన్నీ ఒక రకమైన ఖనిజాల వల్ల ఏర్పడతాయ్! అదిగో అక్కడ గుహకి ఒక చిన్న కంత ఉంది చూసారా? ఆకాశం కనపడుతోంది!! అక్కడనించే ఒక ఆవు ఈ గుహలో పడిపోయిందట.ఆ ఆవును వెతుకుతూ వచ్చిన కాపరి ఈ గుహలని కనిపెట్టాడు.కానీ ఇంత ఎత్తులోనించి పడినా..ఆవు క్షేమంగా బయటకి వచ్చిందట.అదంతా ఆ పైన ఉన్న శివుని మహిమ అని ఆయన్ని కనుగొని...పూజించడం మొదలుపెట్టారు.ఈ గుహల కింద నించి అంతర్వాహినిగా....'గోస్తనీ నది' ప్రవహిస్తోంది.మీరు దాని పరవళ్ళ గలగలలు వినొచ్చు....కానీ అది కనపడదు.గుహల బైట లోయలోకి చూస్తే..తెల్లని నురగలో ప్రవహించే గోస్తనీ నది ప్రత్యక్షమౌతుంది.ఆ నది జన్మస్థానం ఈ గుహలే"
ఇలా అనన్య భయం పోగొట్టడానికి ఆ గుహల వైశిష్ట్యం గురించి....అక్కడి శిలాజలాల గురించి...ఇలా ఎన్నో చెబుతూనే ఉన్నాడు అర్జున్.మెల్లగా తనకీ తెలియకుండానే అన్నీ మెట్లు ఎక్కేసి గుడి దగ్గరకి చేరుకుంది అనన్య.అక్కడనించి యధాలాపంగా కిందకి చూసింది.ఆమెకి ఒక్కనిమిషం గుండె ఆగింది.కాళ్ళు వణికాయి.ఆమె ఇంచుమించు గుహల పైకప్పు దగ్గర ఉంది.
"వామ్మో! ఇంత ఎత్తులో ఉన్నానా?"
"అనన్యగారు! తరువాత తీరిగ్గా ఆశ్చర్యపోదురుగాని....రండి...దర్శనం చేసుకుందాం" అని అక్కడ ఉన్న చిన్న,ఇరుకైన గుహలాంటి గుడిలోకి తీసుకెళ్ళాడు అర్జున్.అక్కడ విచిత్ర ఆకారంలో ఉన్న శివలింగాన్ని దర్శించి....తీర్ధం స్వీకరించి...తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు...అర్జున్ ఆ స్వామిని...ఒక్కటే కోరుకున్నాడు.....'అనన్య నా చేయి ఎప్పటికీ విడిచిపెట్టకుండా చూడు స్వామీ' అని.అనన్య ఏం కోరుకుందో అని అడగాలనుకున్నాడు.కానీ అంతలోనే ఆ ఆలోచన విరమించుకున్నాడు.అనన్య కి ఆ శివుని గుహ,శివలింగం అంతా విచిత్రంగా భలే ఉంది.ఆమె మెట్లు దిగేటప్పుడు ఏమి భయపడలేదు.అర్జున్ కి ఏవేవో కబుర్లు చెబుతూ అలవోకగా దిగేసింది.'హమ్మయ్య!అనన్య భయపడలేదు' అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు అర్జున్.కాసేపయ్యాక అందరూ లోపలికి  వెళ్లినప్పటిలాగే  జాగ్రత్తగా గుహల బైటికి వచ్చారు.

ఇక అక్కడినించి వారిని అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గరకి తీసుకెళ్ళాడు అర్జున్.అడవిలో ట్రెక్కింగ్ చేస్తూ...కొండలు గుట్టలు ఎక్కుతూ....ఎలాగో అలా ఆ జలపాతాల దగ్గరకి వెళ్ళారు.అనన్య ఆ జలపాతాల దగ్గర చాలా ఎంజాయ్ చేసింది.ఆమె ఆనందాన్ని చూస్తూ....కళ్ళతోనే తన ప్రేమని వ్యక్తపరుస్తూ...అర్జున్ ఆమె వెంటే తిరిగాడు.ఇవన్నీ తను అంతకుముందు చాలా సార్లు వచ్చిన ప్రదేశాలే! కానీ అనన్యతో కలిసి రావడం....తన ప్రియసఖి చెంత ఆ ప్రకృతి సౌందర్యాని ఆస్వాదించడం...ఒక కొత్త అనుభూతికి లోనయ్యాడు అర్జున్.విచ్చుకుంటున్న పూవుని చూసినా....పరుగులు తీసే సెలయేరుని చూసినా....వాటితో సమానంగా...అందంగా కనిపించే అనన్య ప్రకృతికి నిర్వచనంలా ఉంది.'ఏమిటో ఈ అమ్మాయి...ఇలా దగ్గరైపోయింది....అసలు ఒక్కరోజులో ఇదంతా సాధ్యమా? ఇంత ప్రేమ....ఇంత ఆనందం....ఇదంతా నేనేనా?' అంటూ ఎన్నో సార్లు ఆశ్చర్యపోయాడు అర్జున్. తేనెలూరించే అనన్య మాటలు....ముత్యాలు రాలే అనన్య దరహాసం....జలపాతం లా త్రుళ్ళిపడే  ఆమె హుషారు...అర్జున్ మనసుని కట్టిపడేశాయి.ఆమె చుట్టు అల్లుకున్న ఆహ్లాదపు మాయలో అతను కొట్టుకుపోయాడు....అనన్యని చూడకుండా ఒక్క క్షణమైనా నిలువలేని స్థితికి వచ్చాడు.ఇదంతా గమనిస్తూనే ఉన్నా...ఎక్కడా బైట పడకుండా..జాగ్రత్త పడుతోంది అనన్య.ఆమెకి అర్జున్ అంటే ఇష్టం ఏర్పడింది.కానీ తొలిచూపులో ప్రేమ మీద నమ్మకం లేదు.అర్జున్ గురించి పూర్తిగా తెలియందే....అడుగు ముందుకు వేయకూడదు అని నిర్ణయించుకుంది.కానీ అతను చెంత నిలిస్తే...పరిసరాలన్నీ మరచిపోతోంది....'ఏంటో ఈ మాయ!' అనుకుంది అనన్య.ఇక వీరిద్దరి సంగతి అప్పటికే కనిపెట్టేశారు అనన్య మిత్రబృందం.అర్జున్ ప్రవర్తన,నడవడిక వారికి నచ్చింది.అందుకే వారేమి అనన్య ని వారించలేదు.జరుగుతున్న ప్రేమ తంతుని నెమ్మదిగా గమనిస్తున్నారు.

అక్కడినించి బయలుదేరి స్టేషన్ కి వచ్చారు.అప్పటికే లాస్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది.చేసేది లేక ఇక జీప్ మాట్లాడుకుని అరకు దారిపట్టారు.....మధ్యలో ఒకచోట ఆగి వేడి వేడి టీ తాగి,ఎర్రగా కాల్చి ఉప్పు,కారం,నిమ్మకాయ పట్టించిన మొక్కజొన్న పొత్తులు తిని ఆత్మారాముడ్ని శాంతింపజేసుకున్నారు.క్రమక్రమంగా అడవిలో చీకట్లు ప్రవేశిస్తున్నాయి.సూర్యుడు కొండల వెనుక దాక్కుంటున్నాడు.ఇక మెలికలు తిరిగే ఘాట్ రోడ్లో ప్రయాణం సాగించారు.అందరూ అలసిపోయి ఎక్కడికక్కడ పడుకుండిపోయారు.అనన్య కూడా వెనక్కి వాలి నిద్రపోతోంది.అర్జున్ మాత్రం రెప్పవేయకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు....'నిద్రపోతున్నప్పుడు కూడా ఎంత అందంగా ఉన్నావు బంగారం? ఇంత బుజ్జిగా ఎలా పుట్టావు రా? నాకోసమే పుట్టావు కదా! నాదగ్గరే ఉండిపోతావా? ఇలా ఎప్పటికీ నా దగ్గరే...' అని అప్రయత్నంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.'ఈ చేతి స్పర్శే కదా...నాలో ప్రేమని మేల్కొలిపింది!! ఈ చేయే కదా మన చెలిమికి వంతెన్ వేసింది' అని ఆమె చేతిని ముద్దడబోతు ఆగిపోయాడు.'ఉహు!లేదు...నా బంగారం అనుమతి లేకుండా...నేనీపని చేయలేను' అనుకుని ఆ చేతిని అలాగే పట్టుకున్నాడు.పొద్దున్నించి అలవాటైపోయిందో...లేక నచ్చేసిందో...అనన్య అర్జున్ని గట్టిగా పట్టుకుని పడుకుంది.అర్జున్ కి అనన్య ఇంకా నచ్చింది.అలాగే ఆమెని ప్రేమిస్తూ ఉండిపోయాడు అరకు వచ్చే వరకు.

రాత్రి ఏడుగంటలకి అరకు చేరారు.అనన్య వాళ్ళు 'పున్నమి' రిసార్ట్ లో రూమ్స్ బుక్ చేసుకున్నారు.కాబట్టి ముందు వారిని అక్కడ దింపి తరువాత ఇంటికి చేరుదాం అనుకున్నాడు అర్జున్.అనన్య వాళ్ళు అక్కడ దిగేసాక మళ్లీ పొద్దుటి పరిస్థితే.అనన్యకి  అర్జున్ తనని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు.అర్జున్కి అంతే.అనన్యని వదిలి వెళ్ళలేని పరిస్థితి.అప్పుడే అర్జున్ కి ఇంకో ఆలోచన వచ్చింది.కానీ అది ఎంతవరకు ఫలిస్తుందో తెలీదు.
"సరే మరి.రూమ్స్ అన్నీ ఓకే కదా!" అని వారిని అడిగాడు.
"యా!ఎవ్రిథింగ్ ఈజ్ ఫైన్.మీరు చాలా దూరం వెళ్ళాలా?"
"అబ్బే లేదండి! ఒక టెన్ మినిట్స్.మీరు డిన్నర్ ఎక్కడా చేస్తారు మరి?"
"ఇక్కడే ఏదో కానిచ్చేస్తాం లెండి."
"మీరేమి అనుకోనంటే...మా ఇంటికి రావొచ్చు కదా!అదే డిన్నర్ కి.మా అమ్మా చాలా బాగా వంట చేస్తారు.ఇక్కడ ఏదో ఫుడ్ ఉంటుంది కానీ మీకు అంతగా నచ్చదు.మీకు సూపర్ ఆంధ్రా భోజనం కావాలంటే మా ఇంటికి వచ్చేయండి చక్కగా...మీకేమి అసౌకర్యం ఉండదు.అదీ మీకు ఇష్టం అయితేనే...ఏమంటారు?"
"అంటే..ఇప్పటికిప్పుడు మీ అమ్మగారు...మా అందరికీ చేయడం అంటే...."
"అవన్నీ నాకోదిలేయండి...మా ఇంట్లో నేను మా అమ్మా తరువాత చీఫ్ చెఫ్ అన్నమాట.అదంతా నేను చూసుకుంట.మీరు నైన్ కి రెడీ అయి ఉండండి.నేను తీసుకెళ్త.ఒకే నా?"
అర్జున్...అనన్య అంగీకారం కోసం వేచి చూస్తున్నాడు.ఆమెకి అర్జున్ పాట్లు అర్ధమౌతున్నాయ్! కానీ అతనికి ఏమి చెప్పకుండా నవ్వుతూ నిల్చుంది.ఎవరు ఏమి మాట్లాడలేదు.మెల్లగా అనన్యే ఇక తలూపింది.అర్జున్ మనసులో...'హుర్రే!' అనుకున్నాడు.
"సరే మరి.మీరు షార్ప్ నైన్ కి రెడీ గా ఉండాలి.సియు..బై" అనేసి హుషారుగా ఈల వేసుకుంటూ బయలుదేరాడు అర్జున్.

అర్జున్ వెళ్ళాక అందరూ అనన్య ని ఆటపట్టించడం మొదలుపెట్టారు.
"హేయ్ అనూ!ఏంటి సంగతి? హా? అరకు లవ్ స్టోరి ఆ? కనీసం మాకు చెప్పను కూడా చెప్పలేదు"
"అబ్బా! అదేం లేదే..పదండి....అసలే టైం లేదు.ఇంకో రెండు గంటల్లో రెడీ అవ్వాలి"
"నువ్వివాళ ఏ విషయం తేల్చే వరకు మేము రెడీ అయ్యేది లేదు....చెప్పాల్సిందే..నీ లవ్ గురించి" అని పట్టుబట్టారు.
"హబ్బ! వదిలి పెట్టరు కదా!అతనంటే ప్రేమ అని చెప్పలేను కానీ కొంచెం ఇష్టం.పూర్తిగా తెలియకుండా నేను ప్రొసీడ్ అవ్వదలుచుకోలేదు.సో! ఇప్పటికీ లవ్వు లేదు...గివ్వు లేదు...చెప్పేసా కదా ఇక త్వరగా తెమలండి" అని చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది అనన్య.
ఇక అర్జున్ ఇంటికి వెళ్లి హడావిడి పెట్టేసాడు.పది మంది గెస్ట్స్ అంటే వాళ్ళ అమ్మకి కాళ్ళు,చేతులు ఆడలేదు.'కొంచెం ముందు చెప్పొచ్చు కదా' అన్నారు...'నేను ఉన్నా కదమ్మా!!' అని అర్జున్ చక చకా వాళ్ళమ్మకి పనులన్నీ చేసిపెట్టడం ప్రారంభించాడు. అనన్య ఇంతవరకు టేస్ట్ చేయని ఫుడ్ తినిపించాలని అతని తాపత్రయం.మరీ ఎక్కువ కాకుండా.సింపుల్ గా ఉండేట్లు చూసుకున్నాడు.సరిగ్గా తొమ్మిదింటికి వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి బయలుదేరాడు.పక్కింటి అంకుల్ దగ్గర కార్ తీసుకుని ఝాం అంటూ పున్నమి రిసార్ట్స్ వైపు వెళ్ళాడు.అనన్య ని వదిలి రెండు గంటలు కూడా ఉండలేకపోయాడు..ఎప్పుడెప్పుడు తన దేవతని చూస్తాన అని ఆత్రుతతో రిసార్ట్స్ కి వచ్చాడు.కానీ అతనికి నిరాశే ఎదురయింది.అప్పటికి ఇంకా అనన్య రెడీ అవలేదుట.కనీసం కనపడలేదు కూడా.సరేలే అనుకుని ముందు రెడీ అయిన ఒక ఐదుగురిని తీసుకొచ్చాడు ఇంటికి.వారిని ఇంట్లో అందరికీ పరిచయం చేసి...వారికి కూల్ డ్రింక్స్ ఆఫర్ చేసి...మిగితా వారిని తీసుకురావడానికి మళ్లీ వెళ్ళాడు.లాంజ్ లో తన కోసం వెయిట్ చేస్తూ కనిపించారు మిగితావారు.అప్పుడు చూసాడు అనన్యని.అర్జున్ తన కళ్ళను తానె నమ్మలేకపోయాడు.ఒక్క క్షణం అతనికి కాలం ఆగిపోయినట్టు అనిపించింది.....

- కొరవ...తదుపరి టపా లో...

15, డిసెంబర్ 2010, బుధవారం

తొలిసారి నిన్ను చూసింది మొదలు...-1

వైజాగ్ రైల్వే స్టేషన్....అరకు ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాడు అర్జున్.'వర్షం పడుతోంది....ట్రైన్ త్వరగా వస్తే బాగుండు' అనుకుంటూ ఉన్నాడు.ఇంతలో...."హేయ్!! భలే ఉంది...." అంటూ ప్లాట్ ఫారం మీద నిల్చుని చేతులు చాపి వర్షపు జల్లుతో ఆడుకుంటున్న అమ్మాయిని చూసాడు.చిన్న లేడి పిల్లల్లా గెంతులు వేస్తోంది.తన ఫ్రెండ్స్ అనుకుంటా..వారిని రమ్మంటోంది....వాళ్ళు రానంటే...వర్షపు నీటిని వారిపై విసురుతోంది....'హ్మ్! భలే అల్లరి పిల్ల' అనుకున్నాడు అర్జున్.అలా అనుకుంటూ పరిశీలనగా ఆ అమ్మాయి వంక చూసాడు.లైట్ గ్రీన్ కలర్ చుడిదార్...పొడవాటి జెడ....పాలమీగడ లాంటి మేని ఛాయ...కలువరేకుల్లాంటి కళ్ళు....సంపంగి ముక్కు...కందిరీగ రెక్కల్లా ఆమె ముఖం పై ఆడుకుంటున్న ముంగురులు...'వావ్..బ్యూటిఫుల్..అల్లరే కాదు..అందం కూడా ఉంది' అనుకున్నాడు.ఆమెనే చూస్తూ ఉన్నాడు.ఇంతలో ట్రైన్ వచ్చింది.ఇక అంతే..జనాలు గుంపులు గుంపులుగా ఎగబడ్డారు...అర్జున్ కి  ఇది అలవాటే.అందుకే చాకచక్యంగా ట్రైన్ ఎక్కేసి కిటికీ పక్కన సీట్లోకూర్చున్నాడు.ప్లాట్ ఫారం పై ఆ గ్రీన్ డ్రస్ అమ్మాయి ఉందేమో చూసాడు.ఎక్కడా కనపడలేదు.'ఏంటి ఎప్పుడు లేనిది నేనిలా అమ్మాయి కోసం చూడడం' అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు.మెల్లగా బాక్ పాక్ లోనించి తన ప్రియనేస్తాన్ని బైటికి తీసాడు.ఐపాడ్ ఆన్చేసి,తన నేస్తాన్ని చేతిలోకి తీసుకుని వేరే ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.

ఎవరో తనని పిలుస్తున్నట్టు అనిపించి తల పైకెత్తాడు అర్జున్.
"హలో..ఎక్స్క్యుజ్  మీ..నేను ఇక్కడ కూర్చోవచ్చా?" అదే గ్రీన్ కలర్ చుడిదార్ అమ్మాయి తనని అడుగుతోంది.
'కలా? నిజమా?' అనుకుని...వెంటనే తేరుకుని...
"యా ష్యూర్" అని కొంచెం పక్కకి జరిగాడు.
ఆ అమ్మాయి కొంచెం మొహమాటం పడుతూ వచ్చి పక్కన కూర్చుంది. ఒక గమ్మత్తైన పరిమళం అర్జున్ చుట్టు ఆవరించింది.ఆమెనే చూస్తూ  ఉండిపోయాడు ఒక ఐదునిముషాలు.తను ఇబ్బంది పడుతోంది అని గ్రహించి తన చూపు మరల్చాడు.మళ్లీ తన నేస్తంతో కబుర్లలో పడిపోయాడు.కాని పక్కన కూర్చున్న అమ్మాయి వంక చూడకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది అర్జున్ కి.ఏదైనా మాట్లాడితే బాగుండు అనుకున్నాడు.కాని ముందు తను మాట కలిపే ధైర్యం చేయలేకపోయాడు.ఇంతలో ఆశించిన తరుణం వచ్చేసింది.
"ఏం బుక్ మీరు చదువుతున్నది....ఓహ్! 'ఆల్ కెమిస్ట్' ఆ? నైస్ బుక్" అని తన పుస్తకం వంక చూసి పలకరింపుగా నవ్వింది తను.
"మీరు ఆల్రెడీ చదివేసార?" అన్నాడు అర్జున్.
"యా..నేను పుస్తకాల పురుగుని.మంచి బుక్స్ సేకరించి చదవడం నా హాబి"
"వావ్.నాక్కూడా...మా ఇంట్లో నాకు ఒక చిన్న లైబ్రరి కూడా ఉంది.కాని ఇప్పుడు హాస్టల్ కదా..అందుకే ఎక్కువ బుక్స్ చదివే వీలు ఉండట్లేదు"
"ఓహో! మీరు వైజాగ్ లో ఉంటారా? ఏంటి ఒక్కరే అరకు చూడడానికి వస్తున్నార?"
"అహ! కాదండి.మా ఊరు అరకు.నేను వైజాగ్లో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా"
"అవునా! మీది అరకా? గ్రేట్.నేను కూడా ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్. విజయవాడలో"
"కూల్.ఏంటి అరకు టూర్ మీద వచ్చారా మీ కాలేజి వాళ్ళతో?"
"యా టూర్ మీదే.కాని కాలేజి ఫ్రెండ్స్ కాదు.మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉండే ఫ్రెండ్స్ అందరం ఈ ట్రిప్ వేసుకున్నాం.మేమందరం చిన్నప్పటినించి కలిసి పెరిగాం.ఇంకోద్దిరోజుల్లో ఎవరి దారి వారిది.అందుకే మెమొరబుల్ ట్రిప్ గా ఉండిపోవాలని ఈ ప్లాన్ వేశాం.ఆల్రేడి వైజాగ్ లో ఒక రోజు ఉన్నాం.ఇప్పుడు అరకు చూసుకుని..ఇక బాక్ టు విజయవాడ"
"మరి మీ ఫ్రెండ్స్ ఏరి? మీరు ఒక్కరే ఇటు వచ్చేసారెంటి?"
"అదా! ట్రైన్ ఎక్కేటప్పుడు నేను ఈ బోగిలో ఎక్కా...వాళ్ళందరూ పక్కదాంట్లో ఎక్కేసారు.నెక్స్ట్ స్టేషన్ లో మారదాం అనుకున్నాం.నాకు ఎక్కడా సీట్ దొరకలేదు.అందుకే ఇక్కడ ఖాళీ ఉందని మిమ్మల్ని అడిగాను"
"ఓహ్! ఓకే.ఓకే.కాని మీరు వ్రాంగ్ సైడ్ కూర్చున్నారు.ఇటు వైపు అరకు అంత ఏమి కనపడదు.అటువైపు కూర్చుంటే దారిలో వచ్చే జలపాతాలు,లోయలు...కింద ప్రవహించే వాగులు చూడొచ్చు"
"అవునా?ఇన్ని వివరాలు చెబుతున్నారు? మరి మీరెందుకు ఇటు పక్క కూర్చున్నారు?"
"నేను ఈ ట్రైన్ లో చాలా సార్లు అరకు వెళ్ళా..వచ్చా...కాని మీలాంటివారు జీవితంలో ఒకసారో,రెండు సార్లో వస్తారు.అప్పుడు కూడా నేనెందుకు మీకు కాంపిటీషన్ అని..ఇటు పక్కకి కూర్చున్న! సందేహం తీరిందా మేడం? ఇంతకీ మీ పేరు?"
"నా పేరు అనన్య.మరి మీ పేరు?"
"అర్జున్"
"అర్జున్ !మరి ఇప్పుడు అటు వైపు వచ్చే జలపాతాలు అవి నేను మిస్ అవుతాన?నాకు ఫోటోగ్రఫి చాలా ఇష్టం.నేను ట్రైన్లో వెళుతున్నప్పుడు మంచి మంచి పిక్స్ తీద్దామనుకున్నా! ఇప్పుడు కుదరదేమోగా!" అమాయకంగా అడిగిన ఆమె మొహం చూస్తే నవ్వొచ్చింది అర్జున్ కి.
"హ్హహ్హహ్హ! మరి అంతే కదా! సరే నా దగ్గర ఒక ఉపాయం ఉంది.మనం ట్రైన్ డోర్ దగ్గర నిల్చుందామా? అప్పుడు అన్నీ కనిపిస్తాయి.మనం ఎంచక్కా ఫోటోలు తీయొచ్చు.సరేనా?"
"హా! ఇదేదో బాగుంది.పదండి వెళదాం" అని హుషారుగా లేచింది అనన్య.ఆమె వెంటే నడిచాడు అర్జున్.

ఇద్దరు ట్రైన్ డోర్ దగ్గర నిల్చున్నారు.ట్రైన్ మెలికలు తిరుగుతూ ఆ కొండల్లో,కోనల్లో దారులు వెతుకుతూ వెళుతోంది.ట్రైన్ వేగానికి కొండగాలి రివ్వున వచ్చి ముఖాన్ని తాకుతోంది.చుట్టు ఎత్తైన కొండలు...అంతకు మించి లోతైన లోయలు...అక్కడక్కడ బ్రిడ్జిలు వస్తున్నాయ్.వాటికింద పెద్ద పెద్ద వాగులు పరుగులు తీస్తున్నాయ్.దూరంగా కొన్ని కొండలమీద జాలువారుతున్న తెల్లటి జలపాతాలు కనిపిస్తున్నాయ్.ఇంకొన్ని కొండలు మబ్బుల్ని దాటి ఆకాశాన్ని అంటుతున్నాయ్...అన్నిటిని చారెడేసి కళ్ళతో అబ్బురంగా చూస్తోంది అనన్య.ఆ అందాలన్నిటిని తన కెమెరాలో బంధిస్తున్నది.ఆ అందాన్ని మించిన అందమైన అనన్యని అంతకంటే అబ్బురంగా చూస్తున్నాడు అర్జున్.కాటుక దిద్దిన కళ్ళు,నుదిటి మీద దోస గింజంత బొట్టు,చెవులకి చిన్న ముత్యపు హంగింగ్స్,మెడలో కనీకనిపించని సన్నటి గొలుసు..ముత్యపు పెండెంట్,చేతికి సన్నటి బీడేడ్ బ్రేస్లేట్...అన్నిటిని మించి పొడవైన ఆ జెడ..ఎంత సింపుల్ గా ఉందో అంత ఎలిగేంట్ గా....'అచ్చం వనదేవతలా ఉంది' అనుకున్నాడు అర్జున్.అర్జున్ తననే చూస్తుండడం గమనించింది అనన్య.ఎందుకో కోపం రాలేదు మరి అర్జున్ మీద.చిన్న చిరునవ్వు మాత్రం వచ్చింది.
"హలో సర్! ఎక్కడ ఉన్నారు?" అని నవ్వుతూ అడిగింది అనన్య.
"అదేంలేదు.ఊరికే అలా చూస్తున్నా.మీకు ఈ డ్రస్ చాలా బాగుంది.నైస్ కలర్.."
"ఓహ్! థాంక్స్. ఇందాక జలపాతాలోస్తాయి అన్నారు? ఏవి మరి? ఇంతవరకు రాలేదు"
"వస్తాయండి.ఇంకో ఐదు నిమిషాల్లో వస్తాయి చూడండీ"
"సరే! రాకపోతే మీ సొంతూరు అరకు కాదు అని ఒప్పుకోవాలి"
"అయ్యబాబోయ్! మాది నిజంగా అరకేనండీ. మా నాన్న రైల్వేస్ లో చేస్తారు.మేము చిన్నపుడు చాలా ఊళ్లు తిరిగాం.కాని అరకు వచ్చాక నాన్నకి ఇది బాగా నచ్చింది.ఇక మళ్లీ ఎక్కడికీ వెళ్ళలేదు.ఇక్కడే సొంతిల్లు కట్టుకున్నాం.మా ఇల్లు చాలా బాగుంటుంది.కొండ అంచున ఉంటుంది తెల్సా? మీరు ఒకసారి రండి మా ఇంటికి.అస్సలు వదిలి వెళ్ళలేరు"
"అవునా? అంత బాగుంటుందా? మీరు అదృష్టవంతులు.ఇక్కడే ఉంటారు.మాలాంటివాళ్ళు ఇదిగో ఇలా చుట్టపు చూపుగా రావాల్సిందే!"
ఇంతలో పెద్ద శబ్దం చేస్తూ వచ్చింది ఒక జలపాతం.ట్రైన్ ట్రాక్ పక్కనే అంతెత్తు నించి పడుతున్న ఆ జలపాతం చూసి అనన్య అచ్చెరువొందింది.ఏదో కొంచెం దగ్గరలో జలపాతం చూడొచ్చు అనుకుంది కానీ ఇంత దగ్గరలో ఇలా ట్రైన్లోకి తుంపర్లు పడే దూరంలో అనుకోలేదు.చాలా సంతోషించింది అనన్య.ఆ జలపాతపు జల్లులో తడిసిన అనన్య ని చూస్తే..మంచులో తడిసిన లేత తమలపాకులా ఉంది అర్జున్ కి.
"అబ్బ!అర్జున్ గారు..సూపర్బ్ అండీ.నేను జలపాతం ఎక్కడో ఉంటుంది....ట్రైన్ లోనించి జస్ట్ కనపడుతుంది అనుకున్నా..ఇంత దగ్గరలో అని అస్సలు ఊహించలేదు.వావ్.ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్.థాంక్యు సోమచ్!"అంది ఆనందంలో తేలియాడుతున్న అనన్య
"ఓకే.దీనికి థాంక్స్ ఎందుకండీ...మా అరకులో ఇలాంటి అందాలు బోలెడు.సరే మరి మీకు ఇంకో సర్ప్రైజ్...ఇంకొద్దిసేపట్లో....అప్పటివరకు చూస్తేనే ఉండండి...అరకు అందాలు...." అని నవ్వుతూ అన్నాడు అర్జున్.
"అవునా! ఇంటరెస్టింగ్.ఐ విల్ వెయిట్" అని తలుపుకి ఆనుకుని మళ్లీ  అడవి అందాలు ఆస్వాదించడంలో మునిగిపోయింది.ఆమెని ప్రేమించే పనిలో అర్జున్ కూడా మునిగిపోయాడు.ఇంతలో ట్రైన్ టన్నెల్ లోకి వెళ్ళడానికి టర్న్ తీసుకుంటోంది.అర్జున్ కి ఆ దారి బాగా తెలుసు కాబట్టి ఎక్కడ ఏది వస్తుందో ముందే చెప్పేస్తున్నాడు.
"అనన్య గారు.ఇంకాసేపట్లో...మనం చీకటి గుహలోకి వెళుతున్నాం"
"అమ్మో! నాకు చీకటంటే భయమండి" అని అనన్య అనే లోపు టన్నెల్  వచ్చేసింది...అనన్య కెవ్వుమని అరిచి అర్జున్ చేయి పట్టేసుకుని కళ్ళు మూసుకుంది భయంతో.ఒక పూలచెండు తనని సుతారంగా తాకినట్టు అనిపించింది అర్జున్ కి.ఆమె మృదువైన చేతివేళ్లు అతని చేతిలో లతల్లా అల్లుకుపోయాయి.ఆమె స్పర్శ కి అతను స్థాణువైపోయాడు.అ క్షణం అలా ఆగిపోతే బాగుండు అనుకున్నాడు.భయంతో చిగురుటాకులా వణుకుతున్న ఆమెని చూస్తూ....ముందుకి వంగి నుదిటిమీద ముద్దాడబోయి....వెంటనే తేరుకున్నాడు.'చ! ఏంటి నేను చేస్తున్నది? ఏమైంది ఇవాళ నాకు? నేనేనా ఇలా ప్రవర్తిస్తుంది?' అనుకుని వెంటనే ఆమెకి దూరంగా జరిగాడు.
"అనన్య గారు!టన్నెల్ అయిపొయింది.కళ్ళు తెరవండి"
"అవునా! అమ్మో! నాకు చీకటంటే చాలా భయమండి.ఇంట్లో కూడా కరెంట్ పొతే పెద్దగా అరిచేస్తా" అని చెబుతూ కళ్ళు తెరిచింది.తన చేయి అర్జున్  చేతిలో ఉండడం గమనించి వెంటనే వెనక్కి తీసేసుకుంది.
 "ఐయాం సారి! భయంలో..."
"ఫర్వాలేదండి.అయినా..టన్నెల్స్ లో ట్రైన్ వెళ్ళేటప్పుడు లోపల చీకటిగా ఉండదండి.లైట్లు వేసే ఉంచుతారు.కావాలంటే చూడండీ ఈసారి..ఇలా బోలెడు టన్నెల్స్ వస్తాయి.మీరు అన్నిటికీ కెవ్వు కెవ్వు కేకలు వేస్తె నేనేదో మిమ్మల్ని ఏమన్నా చేస్తున్నా అనుకుంటారు.కాబట్టి భయపడకండి.ఓకేనా?"
"ఓహ్! అవునా...నేను అసలు టన్నెల్ అనంగానే..భయపడిపోయి...కళ్ళుమూసుకుని అలా అరిచేసా!"
"పర్లేదండి.అదుగోండీ టన్నెల్ వస్తోంది...ఈసారి భయంతో అరవడం కాదు...ఆనందంతో కేరింతలు కొట్టాలి మీరు.ఓకేనా?"
"హ్హహ్హా! అలాగే.అలాగే."
అలా ఎన్నో టన్నెల్స్ దాటి..ట్రైన్ అరకు వైపు పరుగులు తీస్తోంది.వారిద్దరి మధ్య స్నేహం కూడా బిడియం దాటి అభిమానం వైపు పరుగులు తీస్తోంది.అనన్య చాలా ఫోటోలు తీసింది.కొన్ని అర్జున్ కి  కూడా తీసింది.అర్జున్ కొన్ని అనన్య కి తీసాడు..తరువాత సరదాగా కబుర్లు చెప్పుకున్నారు.ఇంటి విషయాలు..కాలేజి విషయాలు.....ఇలా ఎన్నో...చాలా వరకు ఇద్దరి అభిరుచులు కలిసాయి.ఒకరిమీద ఒకరికి అభిమానం పెరిగింది.ఆ విషయం ఇద్దరికి తెలిసినా ఎవ్వరు బైట పడలేదు.అనన్య అలా గలగలా మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపించింది అర్జున్ కి.అర్జున్ సెన్స్ఆఫ్ హ్యుమర్...అతని పొందికైన మాటతీరు...ఆలోచనా విధానం బాగా నచ్చింది అనన్యకి.తమ ఫ్యూచర్ గురించి...ఎయిమ్స్ గురించి....తమ సిద్ధాంతాల గురించి ఇలా ఎన్నో విషయాలు ఒకరికి ఒకరు కలబోసుకున్నారు....వారిద్దరి మధ్య అనుబంధం చిక్కనైంది..

కానీ కాలం పరుగు ఆగదు కదా!కొండలు గుట్టలు దాటి...వాగులు వంకలు దాటి ట్రైన్ బొర్రాగుహలు చేరుకుంది.అప్పటిదాకా ఆ ప్రయాణాన్ని తనివితీరా ఆస్వాదించిన అనన్యని ఒక్కసారి దిగులు ఆవరించేసింది.తను దిగాల్సిన స్టేషన్ అదే! ఈ విషయం తెలీని అర్జున్ ఆనందంలో ఏదో చెబుతున్నాడు.అంతలోనే అనన్య ఫ్రెండ్స్ ట్రైన్ దిగి అనన్య ఉన్న కంపార్ట్మెంట్ లోకి వచ్చారు.
"హేయ్ అనూ! నువ్వొక్కదానివే ఎలా ఉన్నవో ఎని ఎంత టెన్షన్ పడ్డామో! ఒక్కచోట కూడా ట్రైన్ దిగటానికి వీలుపడలేదు.ఇంతకీ అంతా బానే ఉంది కదా! ఏమి ఇబ్బంది పడలేదు కదా!"
"అహ.తను ఉన్నారుకదా...అసలు టైమే తెలీలేదు.ఎన్ని కబుర్లు చెప్పారో! వెరీ నైస్ కంపానియన్.చెప్పడం మర్చిపోయా...తను అర్జున్.నాకు ట్రైన్ లో పరిచయం అయ్యారు.వైజాగ్ లో బీటెక్ చేస్తున్నారు.ఇక అర్జున్....వీళ్ళు నా ఫ్రెండ్స్" అంటూ పేరు పేరునా అందరినీ పరిచయం చేసింది.
"ఓకే అనూ.ఇక్కడే మన దిగాల్సింది.ఇవాళ బొర్రా కేవ్స్ చూసేసి నైట్ కి అరకు వెళ్ళాలి.త్వరగా రా.నైస్ టు మీటు యు అర్జున్.సి యు.టేక్ కేర్" అని వాళ్ళు అంటుండగానే ట్రైన్ మెల్లగా స్టార్ట్ అయింది.
అర్జున్ కి  ఏమి అర్ధం కాలేదు.అనన్య అరకు వరకు వస్తుంది అనుకున్నాడు.ఇలా మధ్యలో దిగేస్తుందని అస్సలు అనుకోలేదు.అనన్య మొహం చూస్తే తనకీ వదిలి వెళ్ళడం ఇష్టం లేనట్టుగా ఉంది.'ఇప్పుడు ఎలా? అనన్యని వదిలి ఎలా వెళ్ళడం?నేను తనతో ఎలా వెళ్ళేది? వాళ్ళేమనుకుంటారు?' ఇలా అర్జున్ మనసులో ఎన్నో ఆలోచనలు...
అనన్య ట్రైన్ దిగింది.మెల్లగా అర్జున్ కి  'బై' అని చెప్పింది.వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా 'బై' అని చేతులు ఊపారు..అర్జున్ కి గుండె ఆగినట్టయింది.తన ప్రాణాన్ని ఎవరో లాక్కెళ్ళిపోతున్నట్టు....గుండెలో ఏదో తెలియని  బాధ...
'నా బంగారం వెళ్ళిపోతోంది...తను లేకుండా...నేను...నావల్లకాదు...అయ్యో! కనీసం సెల్ నంబర్ కూడా తీసుకోలేదే!! ఛా! నా చేతులారా అనన్య ని దూరం చేసుకున్నా...'
అనుకుంటూ అనన్య పట్టుకున్న తన చేతి వైపు చూసాడు......అంతే......
-కొరవ తదుపరి టపాలో....

8, డిసెంబర్ 2010, బుధవారం

పర్యావరణం-పరిరక్షణ-సైకిల్

అయ్యో! శీర్షిక చూసి భయపడకండి...నేనేమి 'పర్యావరణం-పరిరక్షణ' మీద క్లాసులు పీకను.కాబట్టి మీరు  సేఫ్ జోన్ లో ఉన్నట్టేhappy...మరెందుకు ఈ టైటిల్ అంటే....మొన్న నెమలీకలగురించి అలా ఆలోచిస్తూ ఉంటే...మా క్లాస్ లో జరిగిన ఒక సంగతి గుర్తొచ్చి భలే నవ్వొచ్చింది...అది  మీకు చెప్పేద్దామని కంకణం కట్టుకున్నా అదన్నమాట సంగతి big grin

నా చిన్నప్పుడు అంటే మరీ చిన్నపుడు కాదులెండి...నా ఏడో క్లాసులో అన్నమాట...ఒకసారి మా సార్ గారు...'ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్' మీద అప్పటికప్పుడు వ్యాసం రాయమన్నారు.నేనసలే వ్యాసరచనల్లో క్వీను tongue ఎప్పుడు మా స్కూల్లో చిల్డ్రన్స్ డే కి పెట్టె టాలెంట్ సర్చ్ లో...వ్యాసరచన పోటిలో నాకు ప్రైజ్ రావాల్సిందేrock on!.అవన్నీ టాపిక్ ముందే తెలుసు కాబట్టి కొంచెం ప్రిపేర్ అయి రాస్తాము..కానీ ఇలా సడన్ గా రాయమంటే? అప్పుడే నా అసలైన టాలెంట్ బైటపడిందిbig grin.సరే ఇక వ్యాసం విషయానికి వస్తే సార్ చెప్పిందే ఆలస్యం పెన్ను-పేపరు తీసుకుని  'జయీభవ!' అనుకుని బరకడం మొదలుపెట్టా..ముందుగా పర్యావరణానికి చెడు చేస్తున్నది వాయు కాలుష్యం అని....దానికి కారణం కర్మాగారాలు...మితిమీరిన వాహనాలు వాటి పొగ అని వ్రాశా.ఆ తరువాత శబ్దకాలుష్యానికి కూడా ఈ వాహనాలు దోహద పడుతున్నాయి అని వ్రాశా.అంతవరకూ బానే ఉంది.ఇక ఇక్కడ నించి మొదలైంది...'అన్నీ వాహనాలు పెట్రోలు లేదా డీజిలు వాడుతున్నాయి.అవి వదిలే హానికారక రసాయనాల వల్లే ఈ కాలుష్యం అంతా.అందుకని అందరూ పెట్రోలు/డీజిలు తో పనిలేని వాహనాలు వాడాలి.కాబట్టి అందరూ సైకిళ్ళు వాడాలిsurprise.సైకిలు వాడితే ఆరోగ్యముతో పాటు...కాలుష్య నివారణ కూడా.ఇంకా అందరూ సైకిళ్ళేవాడడం వల్ల...పెద్ద పెద్ద ఆక్సిడెంట్లు కూడా అవ్వవు...అందువలన మనుషులందరూ హాయిగా ఉంటారు.ట్రాఫిక్ జాములు ఉండవు...పార్కింగ్ ప్రాబ్లం ఉండదు...కాబట్టి ఎటువంటి టెన్షన్లు ఉండవు.లైసెన్సులు...హెల్మెట్లు గోలే ఉండదు.పైగా పెట్రోలు కి,డీజిలు కి అయ్యే ఖర్చు కూడా మిగులుతుంది.అందువల్ల దేశ ఆర్ధిక పరిస్థితి కూడా బాగుపడుతుంది. చిన్నగా మోగే బెల్లు తప్ప భయంకరమైన హారన్లు ఉండవు....ఇంకా వాహనాల రోద కూడా లేదు కాబట్టి శబ్ద కాలుష్యం ఉండదు.దగ్గర ఊళ్ళకి బస్సులు వాడుకోవచ్చు.మరీ దూరప్రయాణాలకు రైళ్ళు ఎటూ ఉన్నాయి.కుటుంబం అంతా వెళ్ళడానికి సైకిల్ కి అప్ గ్రేడ్ వర్షన్ 'రిక్షా' ఉంది. ఇక ఏమర్జెంసిలకి అంతగా కావాలంటే చిన్న చిన్నవ్యాన్లు అడపాదడపా  వాడుకోవచ్చు.కాబట్టి దేశం లో అందరూ హాయిగా స్కూటర్లు,బైక్లు,కార్లు పక్కన పడేసి సైకిళ్ళు వాడడం ఉత్తమం.ఇటు వాయు కాలుష్యం....అటు శబ్ద కాలుష్యం రెండూ తగ్గిపోతాయ్.ఆరోగ్యము..ఆర్ధిక పరిస్తితి మెరుగు పడుతుంది.అందువల్ల సైకిల్ యే పర్యావరణ పరిరక్షణకు...మానవాళి ప్రగతికి నేను సూచించే పరిష్కారం'...అని వ్రాశాapplause.అదేంటో మరి అలా రాసేస! day dreaming

ఇక మా సార్ మా దగ్గర పేపర్లు కలెక్ట్ చేసుకుని అవి చదివి వాటిల్లో బాగున్నవి ఒక పక్క,బాగోలేనివి ఒక పక్క పెట్టారు.నేను నాది యే పక్క ఉందా...అని తెగ టెన్షన్ పడ్డాnail biting.కాని ఒక పేపర్ చదివి అది చేత్తో పట్టుకుని మిగితా పేపర్లు సార్ట్ చేసారు.'ఆ పేపర్ ఎవరిదో! చేత్తో పట్టుకుని ఉన్నారు అంటే..అంత ఘోరంగా వ్రాసారేమో' అని ఒక నవ్వు నవ్వుకున్నాhee hee....చివరికి బాగా వ్రాసిన వాణి,కవిత,మహేశ్వరీ పేపర్లు పైకి చదివి వినిపించారు.నాది చదవనందుకు ఫీల్ అయ్యా broken heart తరువాత....'ఇక్కడ ఒక విచిత్రమైన పరిష్కారం సూచించింది మన ఇందు.చూద్దామా?' అని ఆ చేత్తో పట్టుకున్న పేపర్ చదవడం మొదలుపెట్టారు. అందరికీ ముందు ఏమి అర్ధం కాలేదు..కాసేపు అయ్యాక నవ్వడం మొదలుపెట్టారు....చదవడం పూర్తయ్యాక మా సార్ అన్నారు...'చాలా సింపుల్ గా తేల్చావు ఇందు.idea.ఇంతమంది ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా తెలియని విషయం నువ్వు భలే కనిపెట్టావే..ఆహా! ఒక్క సైకిల్ తో ఇంత మార్పా?' అన్నారు.

ఇప్పటికీ అర్ధం కాదు...ఆయన పొగిడారో...తిట్టారో...కాని నాకు మాత్రం నేను రాసిన ఆ వ్యాసం గుర్తొచ్చినప్పుడల్లా భలే నవ్వొస్తుంది...ఈ సైకిల్ పిచ్చేంటో నాకు blushing

1, డిసెంబర్ 2010, బుధవారం

నా నెమలీకల జ్ఞాపకాలు

మొన్న  మధురవాణి గారి 'మధుర చిత్రాలు' బ్లాగ్ లో 'నా నోట్బుక్ లో నెమలీక' అనే శీర్షిక చూస్తే  నాకు చిన్నప్పుడు పుస్తకాల్లో దాచుకునే నెమలీక గుర్తుకొచ్చింది.

నాకు ఊహ తెలిసాక మొదటిసారి నెమలీక చూసింది మా పక్కింటి బాపమ్మ గారింట్లో.వారి ఇంట్లో ఒక పెద్ద ఫ్లవర్పాట్ లో..నెమలీకల గుత్తి పెట్టేవారు.రంగురంగులుగా మెరిసిపోయే ఆ నెమలీకలు నాకంటికి అబ్బురంగా కనిపించేవి.ఒకసారి ధైర్యం చేసి ఆమెని అడిగేసా! 'బాపమ్మగారు! ఒక్క ఈక ఇవ్వండీ!' అని.ఆమె సంగతేమో కానీ మా అమ్మ నాకు ఒక లుక్ ఇచ్చింది.దాని అర్ధం నాకు తెలుసు.అందుకే ఇక నోరెత్తకుండా ఇంటికేల్లిపోయా.

స్కూల్లో జాయిన్ అయ్యాక....ఇక చెప్పేదేముంది? అక్కడే నెమలీకల పెంపకం-పోషణ గురించి తెలిసింది.నాకు ఒక నెమలీక కావాలనిపించేది.కాని వెధవ మొహమాటం మళ్లీ.ఎవరిని అడిగేదాన్ని కాదు.నేను తన నెమలీకల వంకే  కన్నార్పకుండా చూడడం గమనించిన కల్పన అనే ఒక అమ్మాయి ఈకలు కట్ చేసి చిందరవందరగా ఉన్న ఒక నెమలీక నాకు దానం చేసింది.'నాకు ఇది ఒద్దు! అందంగా లేదు' అని నేను  తిరిగివ్వబోతుంటే చెప్పింది అసలు విషయం....అది పిల్ల నెమలీకట.దానికి రోజు దాణ వేస్తె...చక్కగా ఏపుగా పెరిగి పెద్దవుతుందట.రోజు ఒక రెండు పాల చుక్కలు...క్రిస్మస్ ట్రీ ఆకులు...పెన్సిల్ షార్ప్ చేస్తే వచ్చే పొట్టు.... దానికి ఆహారం.ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే..ఇది ఎవరికన్నా కనపడితే దిష్టి తగిలి పెద్దదవదుట.అందుకని జాగ్రత్తగా ఎవరి కంటా పడకుండా దాన్ని పెంచి పెద్ద  చేస్తే...అందమైన నెమలీకలా అవుతుంది అన్నమాట :)

నేను కల్పన చెప్పిన జాగ్రత్తలు తు.చ తప్పకుండా పాటించా.కాని ఎన్ని రోజులకి నా ఈక పెద్దది అవ్వలేదు.కొద్దిరోజుల తరువాత మా ట్యూషన్ లో డేవిడ్ అని మా క్లాస్ అబ్బాయి పరిచయమయ్యాడు. వాడు,నేను ఒక గ్రూప్.రోజు హోంవర్క్ అయిపోయాక....నాకు బోలెడు కబుర్లు చెప్పేవాడు.వాళ్ళ ఇంటిదగ్గర పెద్ద అడవి ఉందని.....అప్పుడప్పుడు నెమళ్ళు వాళ్ళింటికి వచ్చి వెళతాయని...తన దగ్గర చాలా నెమలీకలు ఉన్నాయని...ఇలా ఏవేవో చెప్పేవాడు.నేను అన్నీ పిచ్చిమొద్దులా నమ్మేసేదాన్ని.నాకు ఒక నెమలీక తెమ్మని అడిగాను.సరే ఈసారి నెమలి మా ఇంటికొస్తే తెస్తా అన్నాడు.నెమలి వాడి ఇంటికి రాలేదు...వాడు నాకు ఈక తేలేదు.నాకు అప్పటికే ఈ ఈకలు పెంచే గోలకి విసుగెత్తింది.కాని నా నోట్బుక్ లో కూడా అందమైన నెమలీకలు ఉంటే ఎంత గర్వంగా ఉండేదో! అందుకే చాలా సంవత్సరాలు నా పుస్తకాలు నెమలీకలకు ఆశ్రయం ఇచ్చాయి.

ఇక మెల్లగా నెమలీకల గురించి నా భ్రమలన్నీ పటాపంచలు అవడం మొదలయ్యాయి..నెమలీకలు గుడ్లుపెట్టడం ...పెరిగి పెద్దవడం...అదంతా ఒక ఫాంటసి అని తెలిసిపోయింది.కాని కృష్ణభక్తి వలన వాటిమీద ప్రేమ ఇంకా పెరిగింది."జోహారు శిఖి పింఛమౌళి" అనుకుంటూ మురిసిపోయేదాన్ని.అలాగే ఒకసారి శ్రీశైలం వెళితే...అక్కడ బోలెడు నెమలీకలు అమ్మేవాడు కనిపించాడు.అందంగా అంత పెద్ద నెమలీకలు చూడగానే ఆగలేక ఆత్రంగా రెండు నెమలీకలు కొనుక్కున్నా.ఒక ఈకని చిన్నగా కట్ చేసి నా కవితల పుస్తకం లో కృష్ణుని బొమ్మ అతికించిన పేజిలో పెట్టా.ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా అంతే ఉంది.ఇక రెండవది....ఒక చిన్న ఫ్లవర్ వాస్లో పెట్టి నా బెడ్రూం కిటికిలో పెట్టా.ఆ తరువాత ఒక బుల్లి వెదురు వేణువు కొని అది కూడా నెమలీక తో పాటు అ వాస్ లో ఉంచా.

తరువాత ఒకసారి గుంటూరు లో నిలగిరీస్ దగ్గర మళ్లీ ఈ నెమలీకలు చూసి టెంప్ట్ అయ్యి ఇంకొక ఈక కొన్నా.అది తీసుకుని నీలగిరిస్ లో దాన్ని పట్టుకుని మా అమ్మ వెంట తిరిగుతుంటే...ఆ షాప్ ఓనర్ (చాలా పెద్దాయన లెండి)...నాదగ్గరకొచ్చి....'ఏం చేస్తావ్ ఈ ఈకతో?' అని అడిగాడు. నేను నవ్వి 'నాకు నచ్చింది సర్.కొనుక్కున్నా.ఇంట్లో దాచిపెట్టుకుంట' అన్నాను.'నాకిస్తావా మరి? ' అన్నారు. 'లేదు.ఇవ్వను' అని చెప్పా.'సరేలే భద్రంగా దాచుకో...మళ్లీ ఎవరైనా చూస్తే ఎత్తుకేలతారు' అని హాస్యంగా అన్నారు.'అలాగేనండి' అని చెప్పి నవ్వేసి ఇంటికొచ్చేసా.దాన్ని నా బెడ్రూం  గోడకి ఒక ట్రాన్స్పరెంట్ టేప్ తో అంటించా! అది ఫ్యాన్ గాలికి అటు ఇటు ఊగుతూ భలే ఉంటుంది.

కాని అలా అంటించేటప్పుడు  చూసా! ఆ ఈకకి చివర కొసన రక్తపు మరక. 'అంటే...ఈ ఈకని బలవంతంగా నెమలి దగ్గరనించి పీకారన్నమాట' అనుకున్నా!మనసు చివుక్కుమంది.అదే లాస్ట్.ఇంకెప్పుడు ఎన్నిసార్లు నెమలీకలు కనిపించినా...నేను కొనలేదు.ఆ రక్తపు మరకే గుర్తొచ్చి బాధేస్తుంది.జూలో ఇంతింత తోకలు వేసుకుని వయ్యారంగా నడిచే మయురాలను చూస్తే...నెమలీకలు నెమలి దగ్గర ఉంటేనే అందం ఏమో  అనిపిస్తుంది. ఎంతైనా ప్రకృతి అందం ముందు అందరం దాసోహమే కదా!

అవండి...నా నెమలీకల జ్ఞాపకాలు.బాగున్నాయా??!!