17, ఏప్రిల్ 2011, ఆదివారం

ఐ మిస్ యూ!!

సుమారు నెల రోజుల క్రితం.....

ఇంకో మూడు గంటల్లో ఫ్లైట్......వెళుతోంది ఇండియాకి! ఎంత హడావిడో! ఇంకెంత సంతోషమో! ఒక్కదాన్నే వెళుతున్నందుకు కాస్త భయం కూడా! అన్నీ సర్దేసుకుని ఇక బయలుదేరే వేళ............తెలిసింది విషయం అమ్మమ్మ పోయారని! ఒక్క నిమిషం కాలం ఆగిపోయినట్టయింది. ముందు ఏడుపు కూడా రాలేదు ఆ షాక్లో!

కాసేపటికి ఇక నావల్ల కాలేదు! చందు ఎంత ఓదార్చినా కంట్రోల్ చేసుకోలేకపోయా. ఇక ఫ్లైట్లో మరీ ఒక్కదాన్నే అయిపోయేసరికి ఇంకా ఏడుపొచ్చేసింది. ఎక్కడినించి వస్తోందో అంత దుఖం!! అమ్మమ్మ జ్ఞాపకాలు ఒక్కొక్కటి వచ్చి సూదుల్లా గుచ్చుతున్నాయ్! కనీసం చివరిసారైనా చూడటానికి లేదు కదా అని ఎంత బాధేసిందో!! అలా నా బాధంతా కన్నీటి రూపంలో కరిగిపోయి.....ఎప్పటికో సర్దుకున్నా! కాని 'ఇక అమ్మమ్మ లేదు' అనే మాట తలుచుకోగానే తన్నుకొస్తోంది దుఖం! ఇండియాలో ఫ్లైట్ లాండ్ అయ్యాక ఇక నన్ను నేనే తమాయించుకున్నా అదీ అమ్మని చూసేవరకే!

ఇక  నా జీవితంలో 'అమ్మమ్మ' అని ఎవ్వరినీ  పిలవలేను అనుకుంటేనే ఏదో తెలియని బాధ గుండెల్లో మెలిపెడుతోంది! నన్ను చిన్నప్పుడు ముద్దు చేసిన అమ్మమ్మ, నాకు తాయిలాలు చేసి పెట్టె అమ్మమ్మ....నా బాల్యపు తీపిగుర్తుల్లో అత్యంత తియ్యనైన అమ్మమ్మ.....నాకు వీడ్కోలు చెప్పకుండానే......నేను వచ్చేలోగానే హడావిడిగా సుదూర తీరాలకు వెళ్ళిపోయింది! నా పరిస్థితే ఇలా ఉంటే ఇక అమ్మ సంగతి ఏమని చెప్పనూ? అమ్మతో ఫోన్లో మాట్లాడటానికి కూడా నాకు ధైర్యం చాలలేదు! ఎంత ఏడ్చిందో! కన్నతల్లి కదా మరి!

ఎన్నెన్నో జ్ఞాపకాలు! ఒకటా? రెండా? నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో నన్ను మొట్టమొదటిసారిగా తాకింది మా అమ్మమ్మే! అలాగే నన్ను మా ఊరు తీసుకెళ్ళి......తన అరచేతుల్లో పెట్టుకుని  చూసుకుంది! చిన్నప్పుడు నా ప్రతి వేసవి సెలవుల విడిది అమ్మమ్మ ఊరే!! పొద్దున్నే లేచి అమ్మమ్మ కుంపటి మీద చేసే ఉప్మా...... కట్టెల పొయ్యి మీద వండే చక్రాలు,తనకి ఇష్టమయిన వంకాయ కూర,ఇంటి వెనుక పెంచిన మొక్కలు, రోట్లో రుబ్బే గారెల పిండి, దేవుడి గదిలో ఉండే తనకిష్టమయిన రాములోరి పటం, పొద్దున్నే నీళ్ళు పట్టే పెద్ద గాబు,రోజు వెళ్లి దణ్ణం పెట్టుకునే రామాలయం, తను కొండ ఎక్కలేకపోయినా ఇక్కడినించే మొక్కుకునే శివాలయం......ఎన్నెన్ని గుర్తులు తనతో పాటే గాల్లో కలిసిపోయాయి!


నాకోసం ఏరికోరి గుడ్డ తీసుకుని అందమైన పరికిణీలు కుట్టించేది. ముచ్చటపడి వెండి జడ గంటలు చేయించింది. నేనెప్పుడు ఊరికేల్లినా నాకిష్టమైన తాటిముంజెలు,జున్నుపాలు,చెరుకు గడలు సిద్ధం! పిడుగులు పడుతుంటే.....నేను భయంతో తన ఒళ్ళో ముడుక్కుంటే .... 'అర్జునా.... ఫాల్గుణ.... కిరీటి.... శాతవాహనా....' అని పెద్దగా అంటూ ఉండేది.అలా చేస్తే పిడుగు భయపడి మనదగ్గరకు రాదు అన్ని చెప్పేది! నేనెప్పుడైనా  ధైర్యం కోల్పోయి బేలగా మాట్లాడితే అస్సలు ఊరుకునేది కాదు! ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి....ఇలా ఎప్పుడు ఏడవకూడదు అని కన్నీళ్లు తుడిచేది! ఇప్పుడు ఇక నాకు అలా చెప్పేదెవరు?


నాకు ఉహ  తెలిసి అమ్మ తరువాత అంత ఆప్యాయంగా చూసుకుంది అమ్మమ్మే! బామ్మ కంటే నాకు అమ్మమ్మ దగ్గరే ఎక్కువ చనువు! నేనంటే ఎంత ప్రేమంటే....ఊరు వదిలి వచ్చే ప్రతిసారి  తన కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి! మేము ఏ ఊరు వెళ్ళినా తనని వెంటబెట్టుకుని వెళ్ళేవారం! నా పెళ్లి చూడాలనేది అమ్మమ్మ అతి పెద్ద కోరిక! కాని తను రాలేకపోయింది. అది నా పెళ్ళిలో తీరని లోటు! ఇప్పుడు అసలుకే లేకుండా నన్ను ఒదిలి వెళ్ళిపోయింది. 'అమ్మలూ' అని ప్రేమగా పిలిచే ఆ పిలుపు ఇక నాకు ఎప్పటికి వినపడదు కదా!

కొంతమంది అమ్మమ్మ పోయిన విషయం తెలిసి అన్నారు....' ఆ పెద్దావిడ కదా! పోవడమే మంచిది. ఇంకా ఎంతకాలం ఉంటుందిలే' అని. నా మనసు చివుక్కుమంది. పెద్దావిడైనా తను మా అమ్మకి కన్న తల్లి! నన్ను అల్లారుముద్దుగా చూసుకున్న అమ్మమ్మ!  మన  ఆత్మీయులు ముసలివాల్లైతే ప్రేమలు పోతాయా?? అలా అయిపోయాయి మానవ సంబంధాలు!!

ఎవరేమనుకుంటే ఏం....అమ్మమ్మా.....నాకు నువ్వంటే బోలెడు ఇష్టం....నీకు నేనంటే అంతే ఇష్టం. కాని నాకు చెప్పకుండా.....నేను వచ్చే వరకు ఆగకుండా వేల్లిపోయావ్! నాకు నీమీద చాలా కోపంగా ఉంది! అయినా నీమీద అలగడానికి ఇప్పుడు నువ్వు లేవుగా!  పోనిలే! నీకు రాముడంటే ఇష్టంగా అక్కడే ఉండు. హాయిగా అక్కడే నీ బుజ్జి మూతి హనుమంతులవారితో ఆడుకో! ఎప్పుడైనా నాకు కష్టం వచ్చి నిన్ను తలుచుకుంటే....నీ రాములవారితో చెప్పి  నా కంట నీరు తుడుస్తావు కదూ!


అమ్మమ్మా.....ఐ మిస్ యు! నాకు కాలం గిర్రున వెనక్కి తిరిగి మళ్లీ నీ చేతుల్లో ఆడుకోవాలని ఉంది! మన ఊళ్ళో...ఆరుబయట వెన్నెల్లో....నువ్వు చెప్పే కథలు వింటూ....గోరుముద్దలు తింటూ......అక్కడే ఉండిపోవాలని ఉంది! మళ్లీ ఆ రోజులు వెనక్కి వస్తే బాగుండు! నువ్వు 'అమ్మలు' అని పిలుస్తూ నన్ను ముద్దాడితే బాగుండు!


నీకోసం నేనేమి చేయలేకపోయా అమ్మమ్మా! కనీసం ఆఖరి చూపు కూడా చూడలేకపోయా! ఇలా నీ జ్ఞాపకాలు అక్షర రూపంలో భద్రపరుచుకుందామని రాస్తున్నా! ఇదే నేను నీకు ఇస్తోన్న 'అక్షర నివాళి'.........