ఒక సెలవురోజున భోరున వర్షం కురుస్తోంది.
మీరు ఎప్పటిలాగే వేడివేడి పకోడీ చేసుకుని, ఒక పెద్ద మగ్గునిండా టీ నింపుకుని కిటికీ/బాల్కనిలో కూర్చుని వర్షాన్ని ఆస్వాదిస్తూ, నోటికి పని కల్పిస్తున్నారు.
ఇంతలో చిన్న మూలుగుడు వినిపిస్తుంది. మీ చెవులు అసలే షార్పు కదా! చటక్కున లేచి రోడ్డుమీదకి చూస్తారు.
అక్కడ ఒక బుజ్జి కుక్కపిల్ల చలికి వణికిపోతూ ఉంటుంది. మీ గుండె అది చూసి కరిగిపోతూ ఉంటుంది.
వెంటనే మీకు సమాజ సేవ,పెటా,బ్లూ క్రాస్ లాంటివికి కళ్ళముందు 70 .ఏం.ఏం. స్క్రీన్లో కనపడతాయ్! ఇక వెంటనే మీలో రక్తం ఉరకలు వేసి గొడుగు కూడా మర్చిపోయి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వీధిలోకి వెళతారు.
ఎదురింటి అబ్బాయి/అమ్మాయి మిమ్మల్ని గాని చూస్తుంటే ఇంకా రెచ్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ కుక్కని అక్కున చేర్చుకుంటారు. అది జాలికళ్ళతో మిమ్మల్ని చూడగానే మీ హృదయాంతరాలలో దాగున్న జంతుప్రేమ ఒక్కసారి వరదమూసినదిలా ఉప్పొంగిపోతుంది.
అది 'కుయ్యో మర్రో' అన్నా మీకు చిలకపలుకుల్లాగే ఉండి దాన్ని నిమురుకుంటూ ఇంట్లోకి తెస్తారు.
దానికి ఒక టవల్ చుట్టి దుప్పటి మీద బజ్జోపెడతారు. ఆ కుక్క ఎప్పటినించి ఉగ్గబట్టుకుందో ఒక్కసారిగా మీ దుప్పటిని,మీ మంచాన్ని ఖరాబు చేసేస్తుంది.
అయినా మీ మూడ్ సూపరుగా ఉంది కాబట్టి, ఇప్పుడిప్పుడే మీ కుక్క మీద కలిగిన తొలివలపు కాబట్టి మీరు చిదానందబ్రహ్మానంద స్వరూపులై ఎంచక్కా మీ కుక్కని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టి పక్కబట్టలు మార్చి మళ్లీ దానికి బెడ్డింగ్ ఎరేంజ్ చేస్తారు.
ఇంతలోనే దానికి ఏదన్నా పెడదామనే మహత్తర అవిడియా మీ బుర్రలోకి తొంగి చూస్తుంది. వెంటనే దాన్ని అమలు చేస్తారు.
వేడివేడి పాలు కాచి ఒక చిన్ని ప్లేటులో పోసి దానికి అందిస్తారు. అది దాని బుజ్జినాలుక బైట పెట్టి ఆబగా ఆ పాలని ఒక నాకు నాకి.....ఆ వేడికి కెవ్వుమని.....సారి కుక్కలు కేవ్వుమనలేవు కదా....అదే అదే.....'భౌవ్వుమని' అరుస్తుంది.
మీరు....వెంటనే లీటర్ల లీటర్ల సెంటిమెంటు కార్చేసి....'అచ్చోచ్చో! నోరు కాలిందా నాన్నా? ఆగు కాస్త చల్లారబెడతా' అని ఆ కుక్క నాకిన పాలను ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదిపెడతారు.
ఇంతలోనే మీ మట్టిబుర్రకి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. 'అరె! మన పప్పికి ఇంకా పేరెం పెట్టలేదే?' అని.
'ఏం పేరు పెడదాం?' అని అలోచించి.....వర్షంలో దొరికింది కాబట్టి మీ సినిపరిజ్ఞానం ఉపయోగించి 'త్రిష' అని పేరు పెడతారు.
'త్రిష!త్రిష!త్రిష!' అని ముమ్మార్లు ముద్దుగా పిలుస్తారు.
అది దాని రెండు చెవులు ఎత్తి మీవంక ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. మీరు అది అంగీకారం అనుకుని గెంతులేసి.....చేతిలో పాలు ఒలకబోసి..... అయినా కూడా నామకరణోత్సవ సంరంభంలో మునిగి ఉన్నారు కావున అస్సలు విసుక్కోకుండా ఆ ఒలికిన పాలను ఎంచక్కా శుభ్రం చేసేసి మీ త్రిషకి మూతికాలని పాలని తీసుకొచ్చి కొసరి కొసరి స్పూన్తో తాగిస్తారు.
అసలే ఆకలిమీద ఉందేమో మీ త్రిష........ శ్రీ కృష్ణుడు పూతన పాలు తాగినట్టు నిర్విరామంగా తాగుతూనే ఉంటుంది. అది చూసి మీరు మురిసి ముక్కలైపోతారు.ఇలాంటి కొన్ని అపురూప ఘట్టాల మధ్య ఆ రోజుకి అంతా బానే ఉంటుంది. మీ త్రిష బుజ్జి కళ్ళు, చిట్టి తోక, బుల్లిబుల్లి పళ్ళు మీకు తెగ నచ్చేస్తాయ్.
'నా త్రిషా అంత అందమైన కుక్క ఈ ప్రపంచంలో లేదు' అని డిసైడ్ అయిపోతారు.
క్రమంగా మీకు,త్రిషకి మధ్య బంధం దృఢమౌతుంది. తన చిలిపి చేష్టలతో,అల్లరి అరుపులతో త్రిష మీకు బోలెడు ఆనందాన్ని పంచిస్తుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయ్!
ఒకరోజున మీరు ఆఫీసులో పని చేసేబదులు ఆంగ్రి బర్డ్స్ తెగ ఆడేసుకోవడం చూసిన మీ మేనేజరు తన పళ్ళు పరపరా కొరికి.......ఇక మీ చేతులు అరిగిపోయేలా......కళ్ళు పేలిపోయేలా......బుర్ర గిర్రున గింగిరాలు తిరిగేలా పని ఇస్తాడు.
మీది అసలే జాలి గుండె కదా! ఈ దెబ్బకి అది ఇంకా కరిగిపోయి ఆఫీసులో అట్టే నిలవలేక ఇంటికి మోసుకేలుతుంది పనిని.
ఇంటికెళ్ళగానే మీ త్రిష మీకు ఎదురయ్యి మీ బూట్లు నాకుతుంది. మీరు అది స్ట్రెస్ బస్టర్ అనుకుని, మీ త్రిష ఇంట్లో కాలుమోపిన క్షణం నించి అన్ని ఒక రీలేసుకుంటారు.
ముద్దుగా మీ త్రిషని ఎత్తుకుంటారు. మీ ఒళ్లో మీ ఆఫీసు కాగితాలు,పక్కనే లాప్టాపు ఉంటాయ్. మీరు ఎత్తుకోగానే మీ త్రిష సంతోషం ఆపుకోలేక మీమీదనే చిచ్చు చేసేస్తుంది.
మీ లాప్టాపు కీబోర్డ్ మీద, మీ కాగితాలమీద ఒలికిన మీ త్రిషమ్మ ఆనంద భాష్పాలు చూసి మీకు కన్నీరు ఆగదు.
అప్పుడు మొదటిసారి మీలో అపరిచితుడు నిద్ర లేస్తాడు. అసలే ఓపిక లేక, ఆపై ఆఫీసు పని తెమలక.....రేపు బాసుకి అందించాల్సిన డాక్యుమెంట్లను మీ త్రిష ట్రాష్ లో పడేసే పరిస్థతి తీసుకురాగా........... మీ ఆగ్రహం సాగర డ్యాం లా కట్టలు తెంచుకుని ఆ కోపంలో మీ త్రిషని పక్కన పడేసి.....
'దొంగ మోహమా! నిన్ను వర్షంలో కాపాడితే ఇదా నువ్వు చూపించే విశ్వాసం' అని మీ కుక్కకు అర్ధం కానీ భాషలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి..... మీ త్రిష చేసిన ఘనకార్యాన్ని వేనోళ్ళా పొగుడుతూ....... మీ పనిలో మునిగిపోతారు.
త్రిషకి ఏమి అర్ధం కాక..... చిన్నగా మూలుగుతూ ఇంట్లో ఒక మూలకెళ్ళి ముడుక్కుని బజ్జుంటుంది.
ఇదే ఇష్టాలు కష్టాలైపోవడమంటే!!!
ఎంతో నచ్చినది ...........మనం చిరాకులో ఉంటే ఏదన్నా చిన్న తప్పు చేసినా ఓ...విరుచుకు పడిపోయి తిట్టేస్తే......ఎవరికి నష్టం? మనకే! ఏదైనా చూసేదానిలో ఉంటుంది. ఒకప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చలేదు అంటే......ఆ వస్తువులో మార్పు కాదు మన మనసులో ఆ వస్తువు మీద ఉన్న అభిప్రాయం మారింది అని అర్ధం.
కొత్తొక వింత...పాతొక రోత. కొత్త చింతకాయ పచ్చడి బానే ఉంటుంది. పాతబడే కొద్ది రుచి తగ్గుతుంది. అలాగని పచ్చడి మొత్తం దిబ్బలో కొట్టలేం కదా! కష్టపడి పెట్టిన పచ్చడి. ఏముంది కాస్త ఆవాలు, మెంతులు, ఎండుమిరప, ఇంగువ వేసి పోపు పెట్టేయడమే! జీవితమూ అంతే!
ఏమన్నా అర్ధమయిందా? కాలేదా? అర్ధమయితే మహా మంచిది..............కాలేదో.....మరీ మంచిది :)
Anyways.... Happy Valentine's Day Folks!! :)
Anyways.... Happy Valentine's Day Folks!! :)