ప్రకృతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రకృతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఆగస్టు 2016, బుధవారం

నీవు వస్తావని ....

ఎన్నిరాత్రులు ... ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు .. 
నీవు వస్తావని .... 

కలలన్నీ ఆవిరిలా  కరిగిపోయాయి ....  
నా కన్నీటిని అందులో కలిపేసుకుని.... ఆకాశానికి ఎగిరిపోయాయి . 
నిట్టూర్పులు వాకిట్లో దీపాలు పెడుతున్నాయి... 
కళ్ళు కలువరేకులై, సూర్యుని తాపానికి తాళలేక వసివాడిపోయాయి ... 

ఎన్నిరాత్రులు... ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు .. 
నీవు వస్తావని .... 

ఆశెల బాసలను మోసుకొచ్చే నీలిమేఘానివై వస్తావని .... 
ప్రతిచినుకు నను తాకువేళ .... నీ నులివెచ్చని ఊపిరి నాకు ఇస్తావని ... 
ఆ వానే వెల్లువొచ్చి  వరదై ......  నన్ను నిలువెత్తున ముంచే ప్రేమసాగరమౌతుందని... 
ఆ వెల్లువలో మది విచ్చుకున్న మల్లియనై నీ గుండెగుడిలో ఒదిగిపోవాలని ... 

ఎన్నిరాత్రులు.. ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు .. 
నీవు వస్తావని .... 

అదిగదిగో ... వస్తోంది నా ఆశెల మేనా ఎక్కి వలపుల మేఘం!
రెక్కలుచాచి రివ్వున ఎగురుతున్న సీతాకోక విసిరిన ప్రేమ గంధం 
అదిగదిగో ..... నా మనసులాగే పురివిప్పి ఆడుతోంది నృత్యమయూరం!
నేను ఆపినా... ఆగనంటూ...  నా తనువు విడిచి నీకై ఎదురొస్తోంది నా ప్రాణం!

నీవు చినుకుగా మారి నాలో కరిగినా సరే!
నేను ఆవిరైపోయి నీలో కలగలిసినా సరే!

నిన్ను చేరేవరకు ఆగదు నా ప్రాణం! ఆపను ఈ ప్రయాణం!

31, జులై 2012, మంగళవారం

ఒక వాన చినుకు!!

ఒక చిన్నిచినుకు....

మిలమిలా మెరిసిపోతున్న వాననీటి తళుకు...

నీలిమేఘాల కురులసిగలో విరిబాలగా వెలుగుతుంటే..

చల్లనిగాలి వచ్చి చెక్కిలి నిమిరి చక్కలిగింతలు పెట్టగానే...

జలజలా జారి...మధుమాసపు మంచుపూవై రాలి..

నేలమ్మ నులివెచ్చని కౌగిలిలో చేరే వేళ...

పచ్చని ఆకుల పొదరిల్లోకటి సాదరంగా ఆహ్వానిస్తే..

చిగురుటాకుల ఒడిలో సేదదీరి....

కమ్మని మన్నుపరిమళం అనుభవిస్తుంటే...

రంగురంగులరెక్కల కోక ఒకటి వస్తే...

నీకు రంగుల లోకం చూపిస్తా వస్తావా అంటే...

సర్రున జారి.... సీతాకోకరంగుల్లో కలిసిపోయి...

తోటంతా తిరిగి.... ఆటలెన్నో ఆడుకుని... పాటలెన్నో పాడుకుని...

మలిసందె వెలుగు మసకపడే మునిమాపటివేళ...

కోకమ్మ సెలవు తీసుకుని..... మల్లెపొదలో జారవిడిస్తే...

మల్లెపూల రెక్కలపై చిరురవ్వల ముక్కెరైపోయి...

మల్లెభామ మత్తులో తూగి... సందెగాలి పాటలో ఊగి...

రాతిరమ్మ చుక్కలపందిరి కింద వెన్నెలభోజనాలు పెట్టే వేళ...

జాబిలమ్మ వెండి ఊయలలో ఊరేగుతుంటే......

వెన్నముద్దల్లా విచ్చుకున మల్లెపూలతోటలోకి...

 
వయ్యారంగా నడిచి వచ్చిన ఒక చక్కనిచుక్క...

అరవిచ్చిన మల్లెల్లో అచ్చంగా ఒదిగిపోయిన వానచినుకుని చూసి...

మురిసి.....ఆమె మోమున ముద్దబంతిపువ్వు విరిసి...

మత్తెక్కించే  మల్లెలను అరచేతుల్లో పోదివిపట్టుకుని...

ముచ్చటైన ముత్యపుచినుకును ముద్దాడగానే....

 వెల్లకిల్లా ప్రేమలో పడ్డ వానచినుకు....

'ఈ జన్మకిది చాలు' అనుకుని మెల్లగా నేలతల్లి ఇల్లు చేరుకుంది....






-ఇందు

[Imagesource:Google]

26, సెప్టెంబర్ 2011, సోమవారం

మంచుకురిసేవేళలో.....

నేను కోరుకున్న ఉదయం........

నాకెప్పటినించో మంచుపొరలు ఇంకా వీడకముందే బాల్కని/పాటియొలోకి వచ్చి కూర్చుని వేడి వేడి ఫిల్టర్ కాఫీ తాగుతూ సూర్యోదయాన్ని చూడాలని :) మనకున్న నిద్రాదేవి అపారకరుణాకటాక్షాలవలన అది ఈ జన్మకి నెరవేరని కోరిక అని సరిపెట్టుకుంటువస్తున్నా! :)) కాని నాకు అంతకంటే ఎక్కువ నా కిట్టు కరుణ ఉందని(అప్పుడప్పుడూ ఏడిపించినా) మొన్నే అర్ధమయింది ;) 

అసలు సంగతేంటంటే........

మొన్న లాంగ్ వీకెండ్ ఎక్కడికెళదామా అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే వాషింగ్టన్ వెళ్దాం.... అసలే మొన్న భూకంపం వచ్చింది కదా.... కాస్త పరామర్శిద్దాం ఒబామని అని బయలుదేరాం ;)

మాతోపాటు వచ్చారు మాకు తెలిసినవాళ్ళయిన శర్మ,జ్యోతి :) వాళ్ళకి ఇద్దరు కవలపిల్లలు.... సన్ని,బన్ని :) వయసు మూడేళ్ళే అయినా..... అల్లరి మాత్రం ఆకాశమంత :))

హ్మ్! ఇక మా యాత్ర విషయానికి వస్తే...

సరాసరి వాషింగ్టన్ వెళ్తె ఎలా? మధ్యలో ఏమన్నా కవర్ చేద్దామని.... ఇస్కాన్ గుడికి అంటూ వెస్ట్ వర్జీనియాలో ఉన్న 'గోల్డెన్ టెంపుల్ ' కి వెళ్ళాం. ఆ రోజు రాత్రి అక్కడ ఉండి మర్నాడు పొద్దున్నె దర్శనం చేసుకుని పిట్స్బర్గ్ వెళ్ళాలని ప్లాన్. శుక్రవారం మధ్యాహ్నం ఆఫీసులకి డుమ్మా కొట్టి బయలుదేరినవాళ్ళం ఆ రోజు అర్ధరాత్రికి ఇస్కాన్ చేరాం.  కొండల్లో,అడవుల్లో జీపీయస్ ఇచ్చిన తప్పు రూట్లో వెళ్ళిపోయి మళ్ళి ఎలాగొలా తిరిగి తిరిగి కెరెక్ట్ రూట్ కనుగొని ఎలాగైతేనేం అర్ధరాత్రికి వెళ్ళాం :)

ఇక పొద్దున్నే అందరూ నిద్రపోతుంటే ఎప్పటినించో ఉన్న నా కోరిక తీర్చుకునేందుకు ఆరింటికే నిద్ర లేచా :) [అంతా కృష్ణమాయ :)) ]

కిటికి బ్లెండ్స్ పక్కకి జరిపి చూస్తే.....మన గీతాంజలి సినిమాలో చూప్పించినట్టు అంతా పొగమంచు :) కనుచూపుమేరా మబ్బు నేలవాలిందా అన్నట్టు. బైటికి వెళ్ళాలంటే భయమేసింది. అసలే అడవి..... పైగా మంచు..... ఇంకా జనసంచారం లేదు.సరేలెమ్మని వేడివేడి టీ,కాఫీ లేకపొయినా అలా కిటికి పక్కన కూర్చుని ఆల్చిప్పలాగా కళ్ళు తెరిచి చూస్తు ఉన్నా.

కాసేపటికి మంచు తెరలు ఒక్కొక్కటి విచ్చుకోవడం మొదలుపెట్టాయి.సూర్యుడు ఆ మంచు దుప్పట్లని తొలగించి చెట్లని,పూవులని సుతారంగా ముద్దాడి లేలెమ్మని మేల్కొలుపుతున్నాడు. 

అప్పుడే ఒక విదేశిజంట చేతిలో జపమాల తిప్పుతు వెళుతున్నారు.చక్కగా చీరకట్టుకున్న ఆమెని,లాల్చి వేసుకున్న అతన్ని చూస్తే ముచ్చటేసింది :)

ఇక ఆగలేకపోయా.చందూ చూస్తే బాగా నిదరొయింగ్స్! పాపం రాత్రి డ్రైవింగ్కి అలసిపోయినట్టు ఉన్నాడు. ఎందుకులే లేపడం...పాపం పడుకోని అని ఇక నేనే ధైర్యం చేసి ముందడుగేసా! వెంటనే ఎస్సెల్లార్ మెడలో వేసుకుని అభినవ ఫోటోగ్రాఫర్లాగా బయలుదేరా. నేను ఇలా రూంలొనించి బైటికొచ్చా జ్యోతి కూడా నాతో పాటు వచ్చారు....'పద ఒకసారి అలా తిరిగొద్దాం' అన్నారు :)  ఇక ఇద్దరం చెట్టాపట్టాలేసుకుని బయలుదేరాం :) 

మేము వెళ్ళేసరికే దొంగమంచుపొరలు.......సుర్యుడికే మస్కా కొట్టేసి మళ్ళి చెట్ల మీద పరుచుకున్నాయి :)) మళ్ళీ గీతాంజలి సీన్ రిపీట్.

ఇక మెల్లగా ఆ మంచులో అలాగే సన్నగా వణుకుతూ...... తడిసిన ఆ గడ్డిమీద నడుస్తూ.... దారి పక్కనే పెరిగిన బంతి,చేమంతి,గులాబి పూలు మంచుముత్యాలతో అలరారుతుంటే అవి చూస్తు... చేతిలో కెమెరాతో కనపడిన దృశ్యమల్లా బంధిస్తూ....అలా వనవిహారం చేస్తున్నాం. ఒక రెండు అడుగులు వేయగానే నెమళ్ళ క్రేంకారం వినిపించింది :) అది ఏదో పక్షి అని జ్యోతి కాదు నెమలి అని నేను గొడవ :))

కొద్ది దూరం వెళ్ళగానే ఒక అందమైన చిన్ని కొలను అందులో తెల్లని హంసలు[హంస ఇప్పుడు లేదు కదా....అవి తెల్లని పెద్ద బాతులయుంటాయ్] ఆ దృశ్యం చాలబాగుంది :) ఇక ఆ కొలను ఎదురుగా చుడగానే కృష్ణచైతన్య ప్రభువు అలౌకికానందంలో తేలిపోతూ నాట్యం చేస్తున్నారు. ఆ ప్రతిబింబం ఈ నీటిలో పడి ప్రతిఫలిస్తూ ముచ్చటగొలుపుతుంటే నేను,జ్యోతి కాసేపు అక్కడే ఉండిపోయాం :)

మళ్ళి మా నడక కొనసాగించి ఆ చైతన్యప్రభువుల విగ్రహాల దగ్గరకి బయలుదేరాం. ఆ దారంతా గడ్డిపూలు విరగబూసాయి. వాటిమీద మంచుబిందువులు పడి పూల అందం అమాంతం పెంచేసాయి. ఆ పూలని ఫొటో తీద్దామంటే కుదరలేదు :((

అక్కడ ఇంకో చిన్న కొలను దానికి ఆనకట్టా ఉన్నాయి :) దానిపక్కనే నెమళ్ళ కేంద్రం ఉంది. అక్కడ తెల్ల నెమళ్ళు, మామూలు నెమళ్ళు కలిసి వనవిహారం చేస్తున్నాయి. ఇందాక అరిచినవి అవే :))
            
నాకు ఆ మంచు చూస్తుంటే...'మంచు కురిసే వేళలో' పాట గుర్తుకొచ్చింది. పైకి పాడదాం అంటే మళ్ళీ జ్యోతి పారిపోతారని పాడలేదనుకోండీ ;) 

కానీ అబ్బా.... ఎంత బాగుందో! చుట్టూ కొండలు.... దట్టమైన అడవులు... కొద్దిదూరంలో కృష్ణమందిరం.... మంద్రంగా వినిపిస్తున్న కృష్ణమహామంత్రభజన...... ఎదురుగా కొలను అందులో బాతులు... దాని ఒడ్డున చైతన్యప్రభువులు.... ఆ వనమంతా తిరుగుతూ అల్లరిచేస్తున్న నెమళ్ళు... పధ్ధతిగా పెంచిన రకరకాల పూలమొక్కలు.... అందాలు ఒలకబోస్తున్న గడ్డిపూలు.... రెండు కొలనులమధ్య చిన్ని వంతెన.... అక్కడే కూర్చోడానికి చిన్న రాతిబల్ల.... చెట్లమధ్యగుండా తొంగిచూస్తున్న చల్లని సూర్యుడు...... హ్మ్! ప్రపంచంలో ఇంతకంటే అందమైన ప్రదేశం ఉంటుందా? నాకు తెలిసి ఉండదేమో!

ఆ నెమళ్ళని చూస్తు, ఆ వంతెన దాటి ఆ మంచుపొరల్లో మేము మమేకమయిపోయి, అప్పుడే ఆకులు రాల్చడం మొదలుపెట్టిన వనాల్లోగుండా నడక సాగించి, మెల్లగా చెట్లపైకి వచ్చి ఆశగా తొంగిచూస్తున్న సూరీడ్ని నా కెమెరాలో బంధించి, చిరుచలి గిలిగింతలు పెడుతుండగా ఇక మా రూంకి బయల్దేరాము :)

అలా ఆ చెట్లమధ్యగుండా,మా మధ్య దూరిపోతున్న మంచుమేఘాల్ని తడుముతూ మా రూం కి చేరుకుంటున్నప్పుడు ముక్కుపుటాల్ని తాకింది కట్టెపొంగలి వాసన.....ఇంకా చిక్కటి బ్రూ కాఫీ పరిమళం :)

'మంచి రుచికల ఉదయం కొత్త సన్రైజ్' ....ఎందుకో ఈ ఏడ్ ఠక్కున గుర్తొచ్చింది :)

ఇక ఆగలేక వెళ్ళి,ముఖం కడుక్కుని చందు ని లేపి చిక్కటి కాఫీ తెచ్చుకుని ఎంచక్కా ఆ మంచులో ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ కాఫీ తగుతుంటే.....ఆహ!! స్వర్గం కాళ్ళ కింద ఉందేమో అనిపించింది ఒక్క క్షణం.

నేను కోరుకున్న ఉదయం ఇన్నాళ్ళకి నాకు దొరికింది :)

ఎన్నాళ్ళయినా ఈ చల్లటి మంచు, కొలను, నెమళ్ళు, బాతులు, విగ్రహాలు, వంతెన, చెట్లు, సూర్యుడు నా మనసుని దాటిపోవేమో!! :) 

ఏదేమయినా కృష్ణమాయ కృష్ణమాయే! :) 

నాకెందుకో ప్రకృతినిమించిన అందం దేనిలోను కనిపించదు. ప్రకృతి భగవంతుడి సృష్టి కాబట్టి ఆయన అందం కాస్త అడిగి అరువు తెచ్చుకుందేమో! అరువు తెచ్చుకున్న అందమే ఇంత అందంగా ఉంటే...అసలైన అందం....అదే మా కిట్టూ ఇంకెంత అందంగా ఉంటాడో కదా!

హ్మ్మ్!! :)) 

అవీ ఈసారికి కబుర్లు అయిపోయాయి :) ఫోటోలు చూసి కామెంట్లేసేయండి :)











7, జూన్ 2011, మంగళవారం

స్మొకీస్ వెళదామా?

స్మోకీస్...
అందమైన మబ్బుల మేలిముసుగు కప్పుకున్న పర్వతశ్రేణులు! 
కనుచూపుమేరా...నీలిరంగులో కనువిందు చేస్తూ.......అప్పుడప్పుడు మేఘాల్ని ఒడిసిపట్టుకుని తమలో దాచేసుకుంటూ...ఆటలు ఆడుకునే అందాల 'పొగ పర్వతాలు' ;)

ఈ స్మోకీస్ కి మొన్న మెమోరియల్ డే లాంగ్ వీకెండ్ కి వెళ్ళాము....మరి మీరు నాతో వస్తారా?? అలా అలా స్మోకీస్ మొత్తం మీతో చక్కర్లు కొట్టించి తీసుకోచ్చేస్తాలే!! :)

నేను ఉండేది మిషిగన్ కాబట్టి...అక్కడనించి మన ప్రయాణం మొదలు పెట్టేద్దాం :)

సరే...స్టార్ట్!

రయ్య్య్యి ........రయ్య్యి....రయ్య్యి!....

తొమ్మిది గంటల ప్రయాణం....బోర్ కొట్టకూడదు కదా! అంటే నేను నాన్-స్టాప్ గా వాగుతూనే ఉంటాననుకో.....కాని నాకు తోడూ ఉండాలిగా....సరే మరి పాటలు పెట్టుకుందాం :)

'మేఘాలలో.....తేలిపోమ్మన్నది..
తూఫానులా రేగిపోమ్మన్నది.....'

ఆహా! సూపర్ పాట! అలా వింటూ ఉండండి....అదే స్పీడులో మనం దూసుకుపోదాం :) 

అదిగో....ఒహాయో వచ్చేసింది.....ఇదిగో స్టార్బక్స్ .....కాఫీ తాగేద్దామా?? నాకైతే 'చాయ్ లాటే' మరి మీకు? 

ఈ చాయ్ లాటే ఒక సిప్ వేసి.......అందులోకి కరకరలాడే మినప చక్రాలు తింటుంటే....ఆహా! సూపరు!

ఒక్కసారి అటు చూడండి....'సిన్సినాటి' డౌన్టౌన్ అది. బిల్డింగ్స్ అల్టిమేట్ ఉన్నాయ్ కదా!! ఆ బ్రిడ్జి ఎక్కుతూ చూస్తె...ఇంకా బాగుంటుంది :) సూపర్ ఉంది కదా 'సిన్సినాటి' :)

అర్రే! అంతలోకే 'కెంటకి' కూడా వచ్చేసామా? వావ్! ఇక్కడ గుర్రాలు ఫేమస్ అట తెల్సా? కిటికీలోనించి అలా చూస్తూ ఉండండి....బోలెడు 'హార్స్ స్టేబుల్స్' కనిపిస్తాయ్! ఇంకా బోలెడు గుర్రాలు గడ్డి మేస్తూ....తోకలు ఊపుతూ మనకి టాటా కూడా చెబుతాయ్!!  :))

ఆ! గుర్రాలు చూసేసారా? సరే మరి....నెక్స్ట్ వచ్చేది 'టేనేస్సీ'....ఈ టేనేస్సి లోనే ఉండేది...'ది గ్రేట్ స్మోకి మౌంటైన్స్' :)

అబ్బ! కనుచూపుమేరా....కొండలే! పచ్చటి కొండలు.....ఈగలు కూడా దూరలేనంత చిక్కటి అడవులు.....పిన్ను పడితే తీసుకోగలిగేంత స్వచ్చమైన నదులు....ఆహా! ఏమి అందాలు....ఈ కొండల మధ్య ఇంత పెద్దపెద్ద రోడ్లు ఎలా వేసారో! 

హా! ఈ కొండల్ని చూస్తేనే కడుపు నిండిపోతోంది....సరే మరి కాస్త ఆకలేస్తుందేమో...టాకోబెల్ కి వెళ్లి రెండు చలుపాలు లాగించేద్దాం పదండి!

భలే ఉన్నాయ్  కదా...చలుపాలు!! సరే ఇక ఎక్కడా ఆగోద్దులే....ఇస్త్రెట్ గా 'స్మోకీస్' కి వెల్లిపోదాం :)

రయ్యి! రయ్యయ్య్యి! రయ్యయ్య్య్యి !!

అదీ....'పీజియన్ ఫోర్జ్' కి వచ్చేసాం! ఇక్కడికి దగ్గరలో 'గాట్లిన్ బర్గ్' దగ్గరే మన 'పొగ పర్వతాలు' మొదలవుతాయ్ అన్నమాట :) సరే! ఇవాల్టికి ఇక్కడతో రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్నే బయలుదేరుదాం :)  సరేనా! 

ఆ కొండ అంచున అందమైన చెక్క ఇళ్ళు చూసారా? అవే 'క్యాబిన్స్' అక్కడే మనం ఉండేది :) చిక్కని అడవిలో....కొండ అంచున చక్కని చెక్క ఇల్లు :) బాగుంది కదా! సరే రేపు పొద్దున్న తొందరగా లేవాలి కదా! ఇవాల్టికి ఇక రెస్ట్!

డే-1

హా! అందరు కాఫీలు,టిఫినీలు చేసేసి రండి....మనం ముందు 'పీజియన్ ఫోర్జ్' నదిలో రాఫ్టింగ్ కి వెళ్దాం :) నది పెద్ద లోతు లేదులే...కంగారు పడొద్దు!!

ఇదే 'పీజియన్ ఫోర్జ్' నది. మనం రాఫ్టింగ్ చేసేది ఇక్కడే! రండి మన 'రైడ్ గైడ్' తో వెళ్దాం :) అదిగో ఆ లైఫ్ జాకెట్ వేసుకుని....ఇదిగో ఈ 'ఓర్స్' (తెడ్లు) తీసుకుని పదండి ముందుకు....పదండి తోసుకు మనం నడిపే బోటు దగ్గరకు!!

'హైలెస్సా! హైలెస్సా.....హైలెస్సా...ఓఓ....నీలాల కనుల్లో సంద్రమే...నింగి నీలమంతా సంద్రమే....హైలెస్సో....ఓఓ..హైలెస్స!'

భలే ఉంది కదా....అబ్బ....ఈ నీరెండలో....ఈ చల్లటి గాలిలో..... అడవుల మధ్య మెలికెలు తిరుగుతూ సాగిపోతోన్న నదిలో..... మనం అందరం కలిసి ఈ బోటు నడుపుతూ ఉంటె.... అది ఈ నదిమీద అలా అలా తేలిపోతుంటే.... ఆహా!!..ఇంకో పాట కూడా గుర్తోచ్చేస్తోంది!

'లాహిరి...లాహిరి...లాహిరిలో....ఓహో జగమే ఊగెనుగా...సాగేనుగా....ఆఆ....ఆ....ఆఆ....ఆ....'

హ్మ్! ఇలా నడుపుతూ ఉంటె సమయమే తెలీదు...కాని మనం బోలెడు చూడాలి కదా.... :) ఇక ఈ లాహిరి...లాహిరి ఇంతటితో ఆపేసి....వెళ్లి కడుపుకి ఏదన్నా కాస్త దాణా వేసి ఇక బయలుదేరుదాం! ఓహో! ఫోటోలు కావాలా? సరే అలాగే తీసుకోండి...నేను రెస్టారెంట్లో ఆర్డర్ చెబుతూ ఉంటా :)

ఆ! అందరికి ఆర్డర్ ఇచ్చేసా :) రండి.తొందరగా తినేస్తే....మీకు ఇప్పుడు సూపర్ ప్లేస్ చూపిస్తా :)

సరే అందరిది తినడం అయిపొయింది కదా! ఇప్పుడు మనం వెళ్ళబోయేది 'క్లింగ్మెన్స్ డోం' .ఇది స్మోకి మౌన్టేయిన్స్ లో హయ్యెస్ట్ పీక్! ఇక్కడ నించి చూస్తె.....ఈ పొగ పర్వతాల్లోకి దిగిపోయే సూర్యుడు ఎంత అందంగా కనిపిస్తాడో మీరే చూడండి!

ఇదిగో...గాట్లింబర్గ్! ఇది స్మోకీస్ కి పర్వతపాదం అన్నమాట :) ఇక్కడ చిన్న డౌన్టౌన్ కూడా ఉంది....చూసారా! ఇక్కడ బోలెడు ఆక్టివిటీస్ ఉంటాయ్ :) పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు! పిల్లలాగే ఎంజాయ్ చేసే పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది ఇది! మనం రేపు ఇక్కడ 'ట్రాం వే' ఎక్కుదాంలె! సరేనా?!

ఇక ఇక్కడినించి అంతా అడవే! అలాంటి ఇలాంటి అడవి కాదు...పెద్దపెద్ద చెట్లతో.....లోతైన లోయలతో....ఎత్తైన శిఖరాలతో......దారిపక్కనే విరబూసే 'సమ్మర్ ఫ్లవర్స్' తో......ఎక్కడపడితే అక్కడ గలగలమని పారే నదీజలాలతొ అలరారే అద్భుత కీకారణ్యం :) 

అలా వెళుతూ...ఉంటె....వెళుతూనే ఉంటె......చాలా దూరం కొండలు ఎక్కుతూ ఉంటె.....అప్పుడు వస్తుంది ఎత్తైన పర్వత శిఖరం.....'క్లింగ్మెన్స్ డోం' . చుట్టూ కొండలు చూసారా? ఊరికే కూర్చుంటే కాదు....అలా దూరంగా కనిపిస్తోన్న నీలగిరుల్ని చూడండి! ఆ పర్వతసానువుల్లో సాగుతున్న సెలయేర్లని చూడండి....ఆ అడవి బాట వెంబడి విరబూస్తున్న 'అడవి' పువ్వుల అందాల్ని ఆస్వాదించండి!! వయ్యారంగా ఒంపులు తిరుగుతోన్న మెలికల దారులని చూడండి!!

అరె...మాటల్లోనే వచ్చేసింది! చూసారా? ఇదే 'క్లింగ్మెన్స్ డోం' ఎంత బాగుందో కదా! నేను చెప్పలేదు? అలా చూడండి....పర్వతాలన్ని మబ్బుల  ముసుగేసుకుని బజ్జున్నట్టు లేదు?! నీలిరంగు తప్ప మీకు ఏమన్నా కనిపిస్తోందా? వీటికి 'నీలగిరిస్' అని మనం నామకరణం చేసేద్దామా?! ;) అంత బాగున్నాయ్ కదా! హిమాలయాలని చూసి పరవశించిన కాళిదాసుని ఇక్కడ కూర్చోబెడితే.....పెద్ద కావ్యమే రాసేస్తాడేమో !! :)

ఇంతలోనే ఈ మబ్బులు ఎక్కడినించి వచ్చాయి?? మనమీదకి వచ్చేస్తున్నాయ్!! మబ్బులలోకంలో విహరిస్తున్నట్టు లేదు! హేయ్...ఈ మబ్బు చూడండి.....మన మీదగుండా వెళుతోంది.....వావ్! దూదిపింజేలా ఎలా చేతిలోంచి జారిపోతోంది! అర్రే! మనల్ని చుట్టుముట్టేస్తోంది.....హ్హహ్హ! భలే ఉందికదా! 

అదిగో సూర్యుడు! హబ్బ ఇప్పుడు కనిపించాడు.....పదండి సూర్యుడు మబ్బులో దిగే దృశ్యం చూద్దాం! ఇక్కడినించి ఒక మైలున్నర  కొండమీదకి 'ట్రెక్కింగ్' చేయాలి మరి! ఇక్కడ ఎలుగుబంట్లు ఎక్కువ! మీకు ఎక్కడైనా ఎలుగు కనిపిస్తే.....అరవొద్దు....దాన్ని చూడనట్టు వచ్చేయండి సరేనా?

లెఫ్ట్-రైట్.....లెఫ్ట్-రైట్...లెఫ్ట్-రైట్....

దేవుడా! ఆయాసమోచ్చేస్తోంది...కాని లేట్ అయితే మళ్లీ సూర్యాస్తమయం అయిపోతే ఇంతా పడ్డ శ్రమ వృధా! హ్మ్! 

లెఫ్ట్..........రైట్..........లెఫ్ట్............రైట్.............

హా! కొంచెం మంచినీళ్ళుంటే ఇస్తారా? దాహం వేస్తోంది.....కొండ ఎక్కి వచ్చేసరికి! హుహ్!!

అబ్బ! ఆ దృశ్యం చూడండి.....ఇప్పుడు నీలానికి కెంజాయ రంగు తోడయింది! సూర్యుడు పర్వతాలకి ఎరుపు రంగు పులిమేస్తున్నాడు! వావ్! ఎంత బాగుందో..అసలు అలలుఅలలుగా ఈ పర్వతాలు అంతే లేకుండా ఉన్నాయేంటబ్బా? కొండలన్నీ పొగలో ఉన్నట్టు ఉన్నాయ్! అందుకే 'స్మోకీస్' అంటారు కాబోలు! ఎవరు పెట్టారో....కరెక్ట్ పేరు పెట్టారు వీటికి :) కాని ఇవి నీలంగా ఉన్నాయ్ కాబట్టి....'నీలపోగపర్వతములు' అని మనం పెట్టేద్దాం ;)

సూర్యుడు కొండల్లోకి దిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు!! ఇక రాత్రికి సన్నని మంచు దుప్పటి పరుచుకుంటుందేమో ఈ ప్రాంతమంతా! వావ్! అప్పుడు ఇంకా ముద్దుగా ఉంటాయేమో ఈ పర్వతాలు!! హ్మ్!! ఎంత అందమైన అనుభూతో కదా!

సరే ఇక కిందకి వెళ్దాం పదండి.......లెఫ్ట్-రైట్...లెఫ్ట్-రైట్...లెఫ్ట్-రైట్....

అరె....అక్కడేంటి నల్లగా కదులుతోంది.....హేయ్....అది ఎలుగుబంటి పిల్ల :)) హుర్రే!! మనం ఎలుగు పిల్లని చూసాం :) అమ్మో! పిల్ల ఎలుగు ఉంది అంటే...ఖచ్చితంగా తల్లి ఎలుగు దగ్గరలోనే ఉంటుంది.... బాబోయ్.... అసలే పెప్పర్ స్ప్రే కూడా లేదు....పదండి...ఆ పిల్ల ఎలుగుకి టాటా చెప్పి....మన కాళ్ళకి పని చెబుదాం!

హమ్మయ్య! కిందకి వచ్చేసాం :) ఇక ఎక్కడన్నా తినేసి....సరాసరి మన చెక్కగృహమునకు వెళ్దాము :)) అందరు చక్కగా నిదరోయి....పొద్దునే లేచి రెడి అవ్వండి :) 

డే-2

పొద్దున అంటే....పది గంటలకా?? ఇలా అయితే ఎలా? ఎన్ని చూడాలి మనం!! హ్మ్! సర్లే....ఏంచేస్తాం!

ఈరోజు మనం స్మోకీస్లో ఉండే దట్టమైన అడవుల్లో జంతువులని చూడటానికి వెళ్తాం :) ఇక్కడ మన దేశంలోలాగా.... పులులు,ఏనుగులు ఉండవు కాని....ఎలుగులు,జింకలు,రాకూన్లు,ఇంకా బుల్లిబుల్లి జంతువులు ఉంటాయట! చూద్దాం మనకి ఎన్ని కనపడతాయో! :) తెల్సా....స్మోకీస్ 'నల్ల ఎలుగుబంటి'కి పెట్టింది పేరు :) అమెరికాలో ఎక్కువగా నల్ల ఎలుగులు ఉండే ప్రాంతం ఇదే!! :) 

మళ్లీ గాట్లింబర్గ్ నగరసందర్సన చేసుకుని.....అడవుల్లోకి వెళ్దాం పదండి :) ఆ గుర్రాలను చూసారా? మనల్ని వాటిమీద అడవుల్లో షికారుకి కూడా తీసుకెళతారు! ఎవరికన్నా వెళ్లాలనిపిస్తే.....మీ ఇష్టం :) అడవిలో గుర్రం మీద స్వారి చేస్తూ.... 'కొండవీటి దొంగ' లాగా ఫీల్ అయిపోండి కాసేపు ;)

సరే...ఇంకాస్త ముందుకి వెళితే....'కేడ్స్ కోవ్' లూప్ వస్తుంది! అంటే....ఒకసారి అందులోకి వెళితే....ఇక అదే దారిలో ముందుకి వెళ్ళాలి...వెనక్కి రావడానికి ఉండదు :) ఆ లూప్ చుట్టేస్తేనే బైటికి వస్తాం :) ఈమధ్యలో మనకి జంతువులు కనిపిస్తాయన్నమాట! అందరు కార్ విండోస్లో తలలు పెట్టి(బయటకి కాదు...) కళ్ళు అప్పగించి....వీలయితే కొంచెం పెద్దవి చేసి...జంతువుల కోసం చూడండి :))  

ర..యి..యయి....ర...యి...యి...యయి....[అంటే...అంత మెల్లగా వెళుతోంది ట్రాఫిక్ అని అర్ధం! అర్ధం చేసుకోరు!! ;) ]

హబ్బ! ఇలా పదకొండు మైళ్ళు వెళ్ళాలా? హ్మ్! ఈ జంతువులేవి? అన్ని కట్టకట్టుకుని ఎక్కడికేల్లిపోయాయి? మనం వస్తున్నాం కదా! కొంచెం రావోచ్చుగా! ;)

అక్కడ దూరంగా కొంచెం నల్లగా ఏదో కనపడుతోంది..ఎంటబ్బ? ఆగు నా బైనాక్యులర్స్ తో చూస్తాను!! హేయ్...అది మమ్మా బేర్....విత్ టూ బేబి బేర్స్...........కేవ్వ్వ్వవ్!! మనకి పిల్లలతోసహా తల్లిఎలుగుబంటి కనిపించిన్దోచ్! కేవ్వ్వ్!!
(ఎలుగుబంటి కోసం పక్క ఫోటోలో కళ్ళు చికిలించి చూడుము)

అరె...ఇటు పక్కకి చూడండి....తెల్లతోక జింకలు....హేయ్...అవి మన దగ్గరికి వస్తున్నాయ్! వావ్....భలే ఉన్నాయ్ కదా! :) మనకి జింకలు కూడా కనిపించాయోచ్చ్! అసలు మనం కేక :) అడవుల్లో స్వేచ్చగా ఉండే జంతువులని చూస్తె....భలే ఉంటుంది కదా! జూలో పెట్టినవి ఏదో కోల్పోయినట్టు ఉంటాయి...కాని ఇక్కడ అలా కాదు....ఎంత ఉత్సాహంగా....ఉల్లాసంగా ఉంటాయో!

హా...ఇవాల్టికి ఇది చాల్లే! :) సరే....అదిగో లూప్ అయిపోవస్తోంది! బాబోయ్.....రెండు గంటలా మనం లూప్ లోకి వెళ్లి వచ్చేసరికి? అసలు టైం తెలీలేదు కదా! :) 

సరే! ఇక బాక్ టూ గాట్లింబర్గ్! అక్కడ డిసైడ్ అవుదాం....నెక్స్ట్ హాల్ట్ ఏంటో! 

ఎంత మెత్తగా సాగిపోతోంది కారు ఈ మెలికెల రోడ్లమీద! మన పక్కనే నది కూడా వస్తోంది చూసారా? ఎక్కువ లోతు లేదు మరి నదిలోకి దిగి సరదాగా నీళ్ళతో ఆడుకుందామా? ఐతే రండి...ఆ పార్కింగ్ లాట్లో కారు పెట్టి....మనం నదిలోకి దిగుదాం :)

జాగ్రత్తగా దిగండి....ఈ రాళ్ళు బాగా పాచిపట్టి ఉన్నాయ్! జారిపోతాం! 

ఆ.....అందరు దిగేసారా! అదిగో...నదిమధ్యలో ఆ రాయి ఉంది చూసారా? దాన్ని తాకి మళ్లీ ఇక్కడికి వచ్చేయాలి :) అది ఆట! ఎవరు ముందు వస్తే...వాళ్ళు విన్నర్! :))

జింగ్...జింగ్....జింగ్...జింగ్....అర్రే.....బాగా జారుతున్నాయ్ రాళ్ళు! బాబోయ్! హ్హహ్హ...చేపలు కూడా ఉన్నాయ్...భలే భలే :))) 

వామ్మో! నదిమధ్యలో బానే లోతు ఉంది :( మోకాళ్ళ దాకా వచ్చేసాయ్ నీళ్ళు! ఆ రాయిదగ్గర లోతు ఎక్కువేమో....ఎవరు వెళ్ళోద్దులే !! ఇక్కడివరకు చాలు :) ఇక్కడే ఒకళ్ళమీద ఒక్కళ్ళు నీళ్ళు కొట్టుకుందాం... కమాన్! ;) 

టిచిక్.....టిచిక్......టిష్...టిష్....టిచిక్....టిచిక్....

హ్హహ్హ :)) భలే ఉంది కదా....ఈ ఆట :) అందరం తడిసిపోయాం :)) సరే మరి కాసిని ఫుటోలు తీసేసుకుని ఇక వెళ్దాం. ఆత్మసీత గోల పెడుతోంది....'అన్నమో రామచంద్రా' అని :)

చలో.....గాట్లిన్ బర్గ్! అదిగో సబ్వే....ఇదిగో పిజ్జాహట్....మీ ఇష్టం :) 

హమ్మయ్య! ఇప్పుడు కళ్ళు కనిపించింగ్ :) సరే....ఇక 'ట్రాం వే' ఎక్కుదామా? పదండి మరి 'ఒబెర్ గాట్లిన్ బర్గ్' కి :)

టికెట్స్ తీసేసుకున్నా మీ అందరికి.ఇక ట్రాం వస్తే ఎక్కేయడమే.....ఇది రోప్ వే అన్నమాట :) ఇప్పుడు మనం ఆ కనిపిస్తున్న'పెద్ద' కొండమీదకి ఈ ట్రాంలో గాల్లో తేలుకుంటూ వెళ్తాం :)

అదిగో....వచ్చేసింది....తొందరగా ఎక్కేసి....ఆ పెద్దకిటికీ పక్కన ప్లేస్ కొట్టేయండి అందరు :) 

హమ్మయ్య అందరికి కిటికీ దొరికింది...ఇప్పుడు చూడండి ఈ ట్రాంలో....గాట్లిబర్గ్ డౌన్ టౌన్ చుట్టూ పరుచుకుని ఉన్న స్మోకీస్ అందాలు ఈ ఎర్రటి ఎండలో :))

ఎండ బాగా ఉన్నా....ట్రాంలో చల్లని గాలి వస్తోంది కదా! మరి అంతా అడవులు!! పచ్చదనంతో పాటే చల్లదనం :) అందుకే అన్నారు.....'వృక్షో రక్షతి రక్షితః' అని :) భలే ఉందికదా....రెండు రెక్కలు కట్టుకుని ఆకాసంలో ఎగరాలన్న నా కోరిక ఇలా తీరింది అన్నమాట :) మీకు అలాగే ఉందా?

'గాల్లో తేలినట్టుందే......గుండె పేలినట్టుందే.....' పాట గుర్తొస్తోంది నాకు :))

హ్మ్! వచ్చేసాం! ఇక్కడ కొన్ని ఎలుగుల్ని పెంచుతున్నారట! వెళ్లి అవి చూసి వద్దాం పదండి :) 

అవిగో....నల్ల ఎలుగుబంట్లు.....అబ్బ ఎంత బలిష్టంగా ఉన్నాయో! తెలుసా....ఇవి పూర్తీ శాఖాహారులట! వీటికి గింజలు,ఆకులు,పళ్ళుదుంపలు,కూరగాయలు మాత్రమె పెడతారట :) కాని నిగనిగలాడుతూ ఎంత బాగున్నాయో! :) కొన్ని బుజ్జిగా  బజ్జోని నిద్రోతున్నాయ్ :)))) 

సరే....ఇక్కడ అందరు సావేనీర్లు కావాలంటే కొనుక్కుని బయలుదేరండి :) మీకు 'పీజియన్ ఫోర్జ్' లో తిరగబడిన ఇల్లు,టైటానిక్ షిప్పు చూపిస్తా :))

హ్మ్! అందరు....బై బై స్మోకీస్ అని చెప్పండి!! ఇదే ఇక లాస్ట్ హాల్ట్ స్మోకీస్లో! ఇక మనం స్మోకీస్ వదిలి వెళ్ళిపోతున్నాంగా! :( 

బై బై స్మోకీస్!

సరే.....పదండి గాట్లిన్ బర్గ్ వదిలి పీజియన్ ఫోర్జ్ కి మన ప్రయాణం!

ఆ అదిగో....తిరగబడిన ఇల్లు :) 'వండర్ హౌస్'....దానిపక్కనే పెద్ద 'టైటానిక్ షిప్' :) మీకు కావాలంటే టైటానిక్ పోస్ పెట్టి ఫోటోలు దిగొచ్చు :)))

సరే మరి! రేపు పొద్దున్న మన తిరుగుప్రయాణం....బాక్ టూ మిషిగన్ :(:)

పొద్దున్నే తొందరగా లేస్తే.....దగ్గరలో 'ఫర్బిడెన్ కావేర్న్స్' చూపిస్తా :)

డే-౩

హ్మ్! అందరు రెడి కదా.....పదండి ఇక్కడికి దగ్గరే....ఈ 'ఫర్బిడెన్ కావేర్స్' 

ఇవి సున్నపు రాయి గుహలు....ఈ గుహలలో నది కూడా ఉంది తెల్సా! ఈ నదిలో నీటి వల్ల ఈ సున్నపురాళ్ళు వివిధ రూపాలు సంతరించుకున్నాయి....ఇంకా కొత్తకొత్త రూపాలు సంతరించుకుంటునే ఉన్నాయి :) 

సరే....అందరు జాగ్రత్తగా నడుస్తూ....ఈ గుహలు చూద్దాం పదండి :) ఈ గుహలలో ఇదివరకు రెడ్ ఇండియన్స్ (ట్రైబల్స్) ఉండేవారట! వాళ్ళు రకరకాల వస్తువుల తయారి కోసం ఈ గుహలు ఉపయోగించేవారట! ఈ గుహల కింద ఒక నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది :)

అదిగో మనకి కనిపించే....ఆ నది చూసారా....ఇది ఇంకో నది :) ఇలాంటి బోలెడు నదుల నీటి రాపిడి వల్ల ఈ గుహలలో ఇన్ని రూపాలు రూపొందాయి! డైనోసార్.....గాద్జిల్లా.....మనిషి కాళ్ళు.....పెద్ద ముక్కు.....రెక్కల వరాహం....చంద్రమండలం ఇలా బోలెడు :)) భలే చల్లగా ఉంది కదా ఈ గుహలో....నేచురల్ ఏసి :)))

సరే మరి! ఇక ఇంటికి వెళదామా? 

హ్మ్!మన స్మోకీస్ ట్రిప్ అయిపొయింది! హుష్ కాకి!

ఇక మనం ఇంటిదారి పట్టాలి! మీ అందరికి స్మోకీస్ నచ్చింది కదా! నాకైతే భలే నచ్చేసింది :)

సరే....ఐతే....అందరికి టాటా-బిర్లా :) 

ఇంకో టపాతో మళ్లీ కలుద్దాం :) అంతవరకూ చూస్తూనే ఉండండి 'వెన్నెల సంతకం'




అన్ని ఫొటోస్ చూడాలనుకుంటే....పైన పిక్ మీద క్లిక్ చేయండి.....పండగ చేస్కొండి :) 

24, ఫిబ్రవరి 2011, గురువారం

మంచుకి ఎదురీత

ఎవరన్నా ఏటికి ఎదురీత అంటారు...ఇదేంటి ఈ పిల్ల 'మంచుకి ఎదురీత' అంటోంది అనుకుంటున్నారా? చెబుతా చెబుతా! మొన్న మేము చేసిన సాహస యాత్ర కబుర్లు చెబుతా ఆగండీ!!


మొన్న మధ్యాహ్నం మూడింటికి మా చందుగారు  ఇంటికొచ్చి 'పద పద! ఒహాయో వెళ్ళాలి!' అని తెగ తొందర పెట్టేసారు. 'ఒకసారి అటు చూసి చెప్పు' అని కిటికీ వైపు చూపించా. మంచు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయింది.... పైగా సన్నగా పడుతోంది కూడా. 'ఇప్పుడు నీకు ఒహాయో అవసరమా?' అన్నాను.అయినాసరే....'చెప్పాకదా! చాల ఇంపార్టెంట్ పని. ఇవాళ అయిపోవాలి అంతే! పద త్వరగా' అని హడావిడిగా బయలుదేరదీసాడు! మరి పట్టువదలని విక్రమార్కులు కదా ఏంచేస్తాం! ఇక ఎన్ని చెప్పినా ఇంతే...తాను పట్టిన కుందేలుకి పది కాళ్ళు అనే రకం కదా!  అని ఇక బయలుదేరా!


సుమారు మూడున్నరగంటల ప్రయాణం.అక్కడికి ఏడున్నరలోగా చేరాలి అని ఒక డొక్కు టార్గెట్ మళ్లీ మాకు! అసలే ముందురోజు రాత్రి అంతా మంచు కురిసింది.రోడ్లు సరిగ్గా క్లీన్ చేయలేదు.గడ్డగట్టిన ఐస్ రోడ్డుకి అతుక్కుపోయింది.అది చాల ప్రమాదకరం.కార్లు ఈసీగా 'స్కిడ్' అయిపోతాయ్. నాకు గుండె పీచుపీచుమంటోంది.అయినా సరే మా చందుగారి ఆజ్ఞల మీద నోరుమూసుకుని కూర్చున్నా. మా ఇంటినించి 'ఫ్రీవే' మీదకి ఎక్కుతున్నప్పుడు 'రాంప్' మీద ఒకసారి కార్ స్కిడ్ అయింది.కాసేపు అటు ఇటు ఊగుతూ డిస్కో చేసింది.'మొదలయ్యింది దేవుడా! ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది అప్పుడేనా? కొంచెం గాప్ ఇవ్వు స్వామీ!!' అని దేవుడ్ని వేడుకున్నా. నా మాట ఆలకించాడేమో కొద్ది దూరం మాములుగానే కొంచెం కొంచెం జారుకుంటూ...అలా...అలా వెళుతూ ఉన్నాం.


ఇక కాసేపటికి భయంకరంగా మంచు కురవడం మొదలుపెట్టింది. మా ముందున్న కారు,వెనక కారు తప్ప నాకు ఇంకేం కనిపించట్లేదు.దూరంగా ఉన్న బ్రిడ్జి...పక్కన ఉన్న ఇంకో రోడ్డు..దానిమీద వెహికల్స్.....ఏమి కనిపించట్లేదు. నల్లటి రోడ్డు....దాని మీద ఉండే తెల్ల గీతలు ఏమి కనపడకుండా అలుక్కుపోయాయి మంచుతో!'చందు ఇప్పుడు ఇంత వైలెన్స్ తో కూడిన జర్నీ అవసరమా?' అని బిక్కమొహం వేసి అడిగా! 'నేను ఇలాంటి క్లైమేట్లో న్యూయార్క్ దాకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళా! ఏంపర్లేదు! నువ్వు కంగారు పడకు....నన్ను కంగారు పెట్టకు' అని రిప్లై వచ్చింది. సర్లే అసలే టెన్షన్లో ఉన్నాడు...మధ్యలో నేనెందుకు కదిలించుకుని మరీ తిట్లు తినడం అని ఊరుకున్నా. ఇక కొద్దిసేపటికి రోడ్డు మీద మంచు అంతా గాలికి పైకి లేస్తూ చక్కర్లు కొట్టసాగింది....నాకైతే ఆకాశంలో....మేఘాల్లో తేలిపోతున్న ఫీలింగ్. కార్లో ఉన్నానో....ఫ్లైట్లో ఉన్నానో ఒక నిమిషం అర్ధం కాలేదు.ఇక ఈ మంచుగాలి దెబ్బకి ముందున్న రోడ్డు....కారు కూడా కనిపించట్లేదు.కారు మధ్య మధ్యలో జర్రు జర్రు అని జారుతోంది.....పక్కనేమో దయ్యాల్లాగా ఇంతింత ట్రక్కులు యమా ఫాస్టుగా వెళుతూ తట్టెడు మంచు మా మొహం మీద కొట్టి పోతున్నాయ్. అలాగే కనిపించని రోడ్డుమీద.... కనిపించని కార్ల మధ్య.....మంచుకి ఎదురీదుతూ మా విక్రమార్కుడు ముందుకు సాగిపోతున్నాడు.


ఇంతలో ఒక రెస్ట్ ఏరియా వచ్చింది.చందుని అక్కడ ఆపమని చెప్పా. 'స్టార్బక్స్ లో ఒక కాఫీ తాగి అపుడు కంటిన్యు అవుదాం' అని చెప్పా. సరే అన్నాడు.అసలు నా ఉద్దేశం....ఆ కాఫీ తాగే టైమ్లో ఎలాగైనా మనసు మార్చి కారు వెనక్కి తిప్పించేద్దామని.సరే కాఫీ తీసుకున్నాం. కాసేపు కూర్చుని తాగుదాం చందు అంటే.....'టైం వేస్ట్ వెళుతూ తాగొచ్చు కదా పద!' అన్నాడు.'అది కాదు చందు...ఇప్పుడు ఎందుకు చెప్పు ప్రాణాలకు తెగించి ఒహాయో వెళ్ళడం అంత అవసరమా?? చూడు ఎంత డేంజరస్గా ఉందో! నా మాట విను చందు.రేపు పొద్దున్న బయలుదేరదాం.ప్లీజ్' అన్నా. 'సరే! ఇంకో టెన్ మైల్స్ చూసి....అప్పటికి ఇలాగే ఉంటె వెనక్కి తిరుగుదాం లే. సరేనా!' అన్నాడు.హమ్మయ్య ఏదో గుడ్డిలో మెల్ల అని ఊపిరి పీల్చుకున్నా.కాని నా ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బైటికి రాగానే మంచు కురవడం చాలా తగ్గిపోయింది(ఈ దేశంలో ఇంతే! ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరు చెప్పలేరు).నావంక ఒక చూపు చూసి....ఒక నవ్వు విసిరి...ఇక కారు తీసి ఝామ్మంటూ దూసుకుపోయాడు మా విక్రమార్కుడు.


'సర్లే! ఏంచేస్తాం!'అని ఊరుకున్నా.ఒక అరగంట ప్రయాణం బానే సాగింది.మళ్లీ మొదలైంది గాలితో కూడిన మంచు.నేను 'దేవుడా! దేవుడా!' అనుకుంటూ కూర్చున్నా. అంతే! ధడేల్మని పెద్ద శబ్దం! మా కార్ బాగా స్కిడ్ అయ్యి ...జుయ్ జుయ్... అని జారుకుంటూ వెళ్లి డివైడర్ కి గుద్దుకుంది. కార్ అస్సలు కంట్రోల్ అవ్వడంలేదు.చందు కార్ ని డివైడర్ కి దూరంగా తేవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు.కాని అది రానంటోంది. దానికి డివైడర్ బాగా నచ్చినట్టుంది....మాటిమాటికి దానిదగ్గరకి వెళ్ళడం.... చందునేమో.... 'ఒద్దమ్మా! అలా ఇందులాగా గోల చేయకూడదు....మాట వినాలి....ఇలా వచ్చేయ్ రోడ్డు మీదకి' అని బ్రతిమిలాడటం. ఇలా కారుని బ్రతిమిలాడి... లాడి... అప్పుడు రోడ్డుమీదకి తెచ్చాడు.ఈలోగా నా పైప్రాణాలు పైనే పోయాయి. అసలు ఇదే ప్రధమం నా లైఫ్లో.ఎన్ని ప్రయాణాలు చేసానో! ఊటీలో ఒకసారి భయపడ్డా కానీ ఇది టూమచ్! నేను కార్ హాండిల్ని,ఆర్మ్ రెస్ట్ని గాట్టిగా పట్టుకుని కూర్చున్నా.అరవలేదు.... కరవలేదు.... అసలు షాక్ తిన్నా! చందు మాత్రం ఏమి జరగనట్టు చిద్విలాసంగా డ్రైవింగ్ కొనసాగించాడు. 'భయపడ్డావా?' అన్నాడు.దానికి సమాధానం చెప్పే సీన్ కూడా లేదు నాకు.


ఒక పావుగంటకి తేరుకున్నానో లేదో....ఇంకో సంఘటన.చాలా మంది కాప్స్ ఉన్నారు.ఏమిటా అని చూస్తే....పెద్ద ట్రక్కు స్కిడ్ అయ్యి డివైడర్ కి  గుద్దుకుని దాన్లోనించి దూసుకెళ్ళి పక్కనున్న రోడ్లోకి  వెళ్ళిపోయింది.ఆ అడ్డం తిరిగిన ట్రక్కుకి గుద్దుకుని రెండు కార్లు నుజ్జునుజ్జు! నేను మళ్లీ....'కేవ్వ్వ్!!' కాని అప్పటికే సగం పైగా దూరం వచ్చేసాం. ఇక వెనుదిరిగే ప్రసక్తే లేదు.అదీ మా విక్రమార్కుల వారు అస్సలు ససేమీరా.అలాగే ఆ మంచులో....మా కారుతో ఈదుకుంటూ మేము చేరవలసిన గమ్యం చేరాము.కాని ఈ మధ్యలో ఎన్ని ఆక్సిడెంట్లో! పక్కకి స్కిడ్ అయి జారిపోయిన ట్రక్కులు,కార్లు,మంచులో ఇరుక్కుపోయిన కార్లు....వాళ్లకి సహాయం చేస్తూ కాప్ కార్స్...అబ్బబ్బ! ఎన్ని దృస్యాలో!! ఇక ఒహాయోలో  చూడాల్సిన పని చూసుకుని....సరిగ్గా  గంటకి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం.అప్పుడు సమయం రాత్రి తొమ్మిది.


ఒహాయో అంతా విపరీతంగా మంచు కురుస్తోంది.ఇక చేసేది లేక అలాగే మెల్లగా జారుకుంటూ.... జారుకుంటూ.... వెళుతూ ఉన్నాం.ఈలోగా ఆకలేసి బర్గర్కింగ్ లో కాస్త మేత మేసి.... మళ్లీ మా మంచు ప్రయాణం మొదలు పెట్టాం. ఒక గంట బానే జరిగింది.కాని పెద్ద పెద్ద ట్రక్కులు.....అస్సలు రూల్సు పాడులేకుండా ఆ మంచులో డెబ్బై మీద రయ్యిన దూసుకెళుతున్నాయ్. అటు-ఇటు ట్రక్కులు...మధ్యలో మేము! నేనైతే వాటిని ఎన్ని తిట్టుకున్నానో! ఆ లాస్ట్ లేన్లో కదా అవి ఉండాల్సింది...ఇష్టం వచ్చినట్టు పోనిస్తున్నారు వెధవలు! ఈలోగా ట్రాఫిక్ జామ్. 'ఛి జీవితం! ఏది సవ్యంగా జరగదు' అనుకున్నా.అలా అరగంట గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే అప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసారు. తీరా చూస్తె కొద్ది దూరంలో ఆక్సిడెంట్.అందుకే ట్రాఫిక్ జామ్. నాలుగు ట్రక్కులు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయ్. చివరి ట్రక్....ముందు ట్రక్ నుజ్జు,నుజ్జు అయిపోయాయి.మధ్యలోవి గుడ్డిలో మెల్లలాగా బ్రతికి బైటపడ్డాయి.కళ్ళు నెత్తికి ఎక్కి మంచులో అంత స్పీడుతో పొతే అంతే మరి! కాని అదృష్టం....ఎవరికీ ఏమి కాలేదు.


'సరేలే! జాగ్రత్తగా పోనివ్వు చందు ఇంకా రెండున్నర గంటల జర్నీ బాకీ' అన్నాను. 'ఏముందిలే....అయిపోతుంది' అన్నాడు చందు.ఒక్క ఐదునిమిషాలు గడిచిందో లేదో....మా ముందు వెళుతున్న ట్రక్ సడన్ గా  స్కిడ్ అయింది. జర్రుమని జారుకుంటూ పక్కకు వెళ్ళిపోయి అడ్డం తిరిగేసింది.దాని వెనకాలే మేము ఉన్నాం.నాకు గుండె ఆగిపోయింది ఒక్క క్షణం.ఏముంది మేము వెళ్లి దానికి గుద్దుకోవడమే తరువాయి! అక్కడ మాకు కనీసం బ్రేక్ వేయడానికి కూడా లేదు. ఆ ట్రక్కు తోక వచ్చి మా కారుని గుద్దినా చాలు. నేను 'చందూ' అని పెద్దగా అరిచా. 'టెన్షన్ పడకు..ఏం కాదు...టెన్షన్ పడకు' అని చాలా ధైర్యంగా,చాకచక్యంతో  ఆ ట్రక్కు వెనకగుండా ఉన్న కొంచెం రోడ్డులో జాగ్రత్తగా కారు పోనిచ్చాడు చందు....ఎలాగైతేనేం బైటపడ్డాం!!మా వెనకాల వెహికల్స్ అన్ని ఆగిపోయాయి.ట్రక్కు రోడ్డుక్కి అడ్డం తిరిగిపోయింది.త్రుటిలో ఎంత పెద్ద ప్రమాదం తప్పించుకున్నామో  ఊహించుకుంటే ఇప్పటికీ గుండె గుభేలుమంటోంది.నాకైతే ఏడుపొచ్చేసింది! కళ్ళముందు అసలు అంత నారో ఎస్కేప్! దేవుడా! చాలాసేపటికి కానీ మామూలు కాలేకపోయా.పాపం ఆ ట్రక్కు డ్రైవర్ కి ఏమి కాకుండా ఉంటె బాగుండు! :(


చందు మాత్రం.....తదేక దీక్షతో...ఇవేమీ పట్టించుకోకుండా ఒక తపస్సులాగా అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకోచ్చేసాడు.ఇంచుమించు పదిగంటలు ఆపకుండా డ్రైవ్ చేసాడు. నాకు మళ్లీ మా ఇంటి మొహం చూస్తానని కూడా అనుకోలేదు.అంత భయమేసింది ఆ ఆక్సిడెంట్లు చూసి.... ఒక తొమ్మిది గంటలు......నిర్విరామ హాలీవుడ్ థ్రిల్లర్+హర్రర్ మూవీ చూసిన ఫీలింగ్!!


చావు అంటే ఇన్నాళ్ళు నేను పెద్ద లెక్కచేసేదాన్ని కాదు! కాని అంత దగ్గరగా చూసాక మొదటిసారి ప్రాణభీతి కలిగింది :))

దీనివలన తెలిసిన నీతి ఏంటయ్యా అంటే....ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా....కొంపలు మునిగిపోతున్నా.....ఊళ్లు కొట్టుకుపోతున్నా..... ఎప్పుడు మంచులో దూర ప్రయాణాలు పెట్టుకోకూడదు అని :D

4, అక్టోబర్ 2010, సోమవారం

ఆకాశం హొయలు...

ఆకాశమనే కాన్వాసు పై...తన సువర్ణ కిరణాలను కుంచెగా మలచి...సూర్యారావు గారు  గీసిన అపురూప చిత్రాలు....










నిన్న సాయంత్రం బైటికెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నపుడు ఆకాశం లో కనిపించిన సుందర దృశ్యాలు ఇవి....


14, ఆగస్టు 2010, శనివారం

సాగర్ రోడ్డు లో ....

నాకు చాలా ఇష్టమైన,ఎన్నో జ్ఞాపకాలు గుర్తుచేసే సాగర్ రోడ్ ....అందులోని కొన్ని విశేషాలని  ఇక్కడ వ్రాస్తున్నా....


మేము గుంటూరునించి  ఎప్పుడు హైదరాబాదు వెళ్ళాలన్నా...విజయవాడ,నల్గొండ వైపు ఉన్న రహదారులు కాకుండా ఈ సాగర్ రోడ్డు మార్గాన్నే ఎంచుకునేవాళ్ళం....ప్రయాణ సమయం కొంచెం ఎక్కువే అయినా పెద్దగా ట్రాఫిక్ అంతరాయం లేకపోవడం,ఇంకా కనువిందైన సాగర్ అందాలు చూడవచ్చు  అనే ఉద్దేశం తో ఎక్కువగా ఈ దారినే వెళ్ళే వాళ్ళం.....మొన్న అమ్మ వాళ్ళు హైదరాబాదు వెల్లాల్సివచ్చినపుడు ఈ దారిగుండా వెళుతూ అంతకుముందు నేను వారితో కలిసి ప్రయాణం చేసిన జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకున్నారట.....ఇవాళ ఫోన్ చేసినపుడు  దానిగురించి చెప్పారు....అలా సాగర్ రోడ్ గురించి ఆలోచిస్తుంటే ఈ బ్లాగ్ రాయాలనిపించింది....

గుంటూరు నుంచి పిడుగురాళ్ళ-మాచెర్ల-సాగర్-మల్లేపల్లి-మాల్-ఇబ్రహింపట్నం మీదుగా హైదరాబాదు చేరుకునే ఈ రోడ్డు ఈ మధ్యే ఎక్కువ వాడుతున్నారు...గుంటూరు నించి సాగర్ దాక చిన్న చిన్న ఊళ్లు తగులుతూ ఉంటాయ్ కానీ సాగర్ నించి ప్రయాణం కొంచెం విసుగనిపిస్తుంది....అక్కడక్కడ విసిరేయబడ్డట్లు  ఉండే ఊళ్లు,చుట్టూ ఎంతమేరకు చూసినా మట్టిదిబ్బలు కనిపిస్తాయి...కానీ సాగర్ వరకు, ఇంకా సాగర్ దగ్గర ప్రయాణం భలే కులాసాగా సాగుతుంది....


గుంటూరు లో బయలుదేరి....అలా సత్తెనపల్లి మీదుగా వస్తూ దూరంగా కనిపించే 'కొండవీటి కొండల' అందాలను ఆస్వాదిస్తూ...చుట్టూ పచ్చని పొలాలు,మధ్యలో తగిలే వాగుల సొగసులు చూస్తూ.....పిడుగురాళ్ళ 'రావిళ్ళ'హోటల్లో ఒక చిన్న విరామం తీసుకుని కాసిని చాయ్ తాగి...అలాగే ముందుకెళ్ళి మాచర్ల లో మెయిన్ రోడ్డు మలుపు మీద పెట్టిన బజ్జీల కొట్టు లో చాలా ఘాటుగా ఉండే 'మిరపకాయ బజ్జీలు' తిని ఇక సాగర్ వైపు సాగటం మొదలుపెడతాం...ఈ దారి అంతా  మలుపులు మలుపులు గా ఉండి చుట్టూ చిట్టడవులతో భలే ఉంటుంది....ఇక్కడ చిరుత పులులు కూడా తిరుగుతాయట!!( 'శ్రీశైలం-సాగర్ రాజీవ్ పులుల అభయారణ్యం' ఇక్కడే మొదలవుతుంది)...నాకైతే చిన్న చిన్న కుందేలు పిల్లలు ఇంకా తెలుపు-నలుపు నక్కలు కనపడ్డాయ్(ముందు నక్కల్ని చూసి కుక్కలు అనుకున్నా... తరువాత మా డ్రైవెర్ చెప్పాడు అవి నక్కలని వాటి తోక కుచ్చుగా  ఉంటుందని!!!)


ఇక అల్లంత దూరం లో సాగర్ డ్యాం వస్తుందనంగా దూరంగా,లోతుగా కృష్ణానది కనిపిస్తుంది......ఒకవేళ డ్యాం గేట్లు తెరిచి ఉంటే ఆ నీటి ఒరవడికి తుంపర్లు చాలా దూరం వరకు  ఎగసిపడతాయి...దగ్గరకి వెళ్లేకొద్ది కనిపిస్తుంది అద్భుతమయిన నాగార్జున సాగర్ డ్యాం....గుంటూరు-నల్గొండ సరిహద్దుల్లో కట్టిన 'మానవ నిర్మిత మహా సాగరం' ఈ సాగర్ డ్యాం....ఎంతో ఎత్తులో విశాలంగా కట్టిన సాగర్ డ్యాం ని చూస్తే కీ.శే.రాజశేఖర్ రెడ్డి గారు అనే 'ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు' అన్న మాట నిజమనిపిస్తుంది...ఇక్కడ  నది ఎంతో వేగంగా లోతుగా ప్రవహిస్తుంది...నది పై కట్టిన  ఎతైన వంతెన పై నిల్చుని సాగర్ ని అలా ఎంతసేపైన చూడాలనిపిస్తుంది...ఇక సాగర్ డ్యాం కి అటుపక్క వెళ్లి హైదరాబాదు వైపు మళ్ళితే వస్తుంది 'విజయవిహార్' అనే ఆంధ్రా పర్యాటకసేఖవారి వసతిగృహం...అక్కడ ఉండే హోటల్ వెనకవైపు 'సాగర్ బ్యాక్ వాటర్స్' అందం చూసి తీరవలసిందే కానీ చెప్పలేం.....హోటల్ కి 'వ్యూ' కనిపించాలని సాగర్ వైపు అంతా నిలువెత్తు అద్దాలు పెట్టారు.అక్కడ కూర్చుని సాగర్ అందాలూ చూస్తూ ఉండవచ్చు లేదంటే తలుపు తీసుకుని వెనక వైపు ఉన్న చిన్న తోట లోకి వెళ్లి చూడవచ్చు....అక్కడ నించి చూస్తే  అవతలి ఒడ్డు కనిపించనంత సువిశాలంగా నీలిరంగులో మెరిసిపోయే సాగర జలాలు....చీమల్లాగా  కనిపించే డింగిపడవలు.....మధ్యలో చిన్న చిన్న దీవులు....చూడటానికి ఎంత అందంగా ఉంటుందో ఆ ప్రదేశం....ఇక సంధ్యాసమయం ఐతే  వదిలి రాలేము.....నీలి రంగులో ఉండే సాగర జలాల్ని తన సింధూర వర్ణాలు రంగరించి నారింజ రంగులోకి మార్చి మెల్లగా దూరపు కొండల్లోకి ఒదిగిపోయే సూర్యుడిని చూసి మైమరచిపోవలసిందే......అనంతమైన  ఆ సాగరాన్ని చూస్తే అనిపిస్తుంది మనం ఎంత అల్పులం ప్రక్రుతి ముందు అని..అక్కడ రెస్టారెంట్ లో చేసే వేడి వేడి బ్రెడ్ పకోడీ  తిని కాసిని మసాల టీ తాగి బయలుదేరతాం.... 


ఇక ఆ తరువాత కబుర్లలో మునిగి తేలేలోగా లోగా 'మాల్' వస్తుంది...అక్కడ ఆదివారాలు  మన చందమామ కథల్లో సంతలాగా చిన్న సంత జరుగుతుంది మెయిన్ రోడ్డు మీదే అన్నీ రకాల వస్తువులు,తినుబండారాలు పెట్టి అమ్ముతుంటారు...కూరగాయలు చాలా తాజాగా ఉంటాయ్...మా అమ్మ ఎప్పుడు అటువైపు వెళ్ళినా చింతకాయలు,తెల్ల వంకాయలు,దోసకాయలు,చిన్ని చిన్ని మామిడికాయలు తీసుకోకుండా రాదు...ఇక అటు తరువాత మెల్లగా హైదరాబాదు చేరుకుంటాం.....


ఎంతో ఆహ్లాదం కలిగించే సాగర్ రోడ్ ప్రయాణం...ఒక్కసారైనా వెళ్ళవలసిందే...




సాగర్ డ్యాం 'బ్యాక్ వాటర్స్' దగ్గర తీసిన కొన్ని చిత్రాలు :)












8, ఆగస్టు 2010, ఆదివారం

తిరుమల కాలిబాట ...



పరమ పవిత్రమైన తిరుమల కాలిబాట లో  చిరుత చిన్నారుల పై దాడి చేయడం...అదీ ఒకసారి కాకుండా రెండు సార్లు చేయడం......చాల బాధాకరమైన విషయం...


నాకు తిరుమల కాలిబాట అంటే చాలా ఇష్టం...నేను మొట్ట మొదటి సారి మా వరలక్ష్మి ఆంటీ వాళ్ళతో కలిసి కొండకి నడిచి వెళ్ళాను....నేను,అమ్మ,నాన్న,తమ్ముడు,ఇంకా ఆంటీ వాళ్ళ కుటుంబం,వాళ్ళ బంధువులు మొత్తం 11 మంది....అసలు అంతమంది తో వెళితే ఆ సందడే వేరు....సరదాగా కబుర్లు చెప్పుకుంటూ....మధ్యమధ్యలో ఆగుతూ.......అలుపు తీర్చుకుంటూ.....అడవి అందాలను ఆస్వాదిస్తూ....ఎంతో కులాసాగా సాగింది నా మొదటి తిరుమల కాలిబాట ప్రయాణం...నేను చివరిసారిగా కొండకి నడిచి వెళ్ళింది కూడా ఆంటీ వాళ్ళతో కలిసే...మొదటి సారి తిరుమల కాలిబాట ఇంత బాగుంటుందా!! అని అనిపించింది....రెండవసారి అంతకుమించిన అందాన్ని ఆ వేంకటేశ్వరుడు మాకు ప్రసాదించాడు...అదే సన్నని చిరుజల్లులు...పచ్చని  కొండలని అలా  సుతారంగా తాకి వెళుతున్న తెల్లని  మేఘమాలికలు.....వాటిని చీల్చుకుని నేను ఉన్నాను అంటూ అప్పుడప్పుడు పలకరిస్తున్న సూర్యభగవానుడు.....వర్షపు జల్లులో తడిసి మెరిసిపోతున్న తిరుమల గిరుల సోయగాలు...చూసితీరవాల్సిందే కాని వర్ణనాతీతం...అలా వర్షం లో తడుస్తూ....పవిత్రమైన ఆ కాలిబాట వెంట సాగిన మా ప్రయాణం అనిర్వచనీయం...


ముందుగా అలిపిరి దగ్గర లగేజి చక్ చేసి...కొబ్బరికాయ కొట్టి కాలిబాటన మా నడక మొదలుపెట్టాము...అమ్మ,నాన్న బస్సు లో కొండపైకి చేరుకుంటామని మమ్మల్ని జాగ్రత్తగా రమ్మని చెప్పి వెళ్ళిపోయారు....ఇక మిగిలింది ఆంటీ వాళ్ళు 4 గురు ,నేను,తమ్ముడు.....అంతకుముందు కాలిబాట వెళ్ళినప్పటి సంగతులు నెమరువేసుకుంటూ....మనసులో గోవిందనామాల్ని స్మరించుకుంటూ...ఒక్కోక్కమెట్టు అధిరొహిస్తూ ఆ శ్రీనివాసుడ్ని ఎప్పుడు చూస్తామా అని అనుకుంటుండగా...సన్నని తుంపర్లు మొదలయ్యాయి....ముందు అంకుల్ కంగారు పడ్డారు.....సవ్యంగానే సాగుతుందా ప్రయాణం అని.....'ఎం పర్లేదండి...అంతా ఆ వెంకటేస్వరుడే చూసుకుంటాడు ' అని మా ఆంటీ ధైర్యం చెప్పగా వడివడి గా ముందుకు సాగము....చెప్పాలంటే....వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది....కాలిబాట మీద దేవస్థానం  వారు ఏర్పాటు చేసిన షెల్టర్ ఉన్నందువల్ల ఎటువంటి అసౌకర్యం కలగలేదు...కాని మార్గం మధ్యలో కొన్ని చోట్ల షెల్టర్ ఏర్పాటు  చేయలేదు...అక్కడ కొద్దిగా తడిసాము....


ఒకచోట జింకల పార్కు కనిపించింది....ఇక ఆగుతామా!!....వాటికి మాతో తీసుకువ్చిన మొక్కజొన్నలు..కారెట్లు....అక్కడ ఉన్న గడ్డి....ఎవరికీ ఏది దొరికితే అది పెట్టేసాము....మా ఆంటీ వాళ్ళ పిల్లలు చాలా  ఆనందించారు అవి చూసి....కాలిబాట నడిచే భక్తులకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి ఈ జింకలు(ఇప్పుడు ఆ జింకలను వేరే చోటికి తరలిస్తున్నారంటే బాధేస్తోంది)....తరువాత ఒక చోట చిన్న దుకాణాల సముదాయం కనిపించింది...అక్కడ వేడి వేడి బజ్జీలు వేస్తున్నారు....గుంటూరువారం మరి  బజ్జీలు తినకుండా ఉంటామా!! అంకుల్ వెళ్లి  బజ్జీలు ఆర్డర్ ఇచ్చారు... అందరం అక్కడ ఉన్న కుర్చిలలో కుర్చుని  అడవి గాలిని అందులో కలిసి వచ్చే మట్టివాసనను  ఆస్వాదిస్తూ ఉండగా మొదలైంది పెద్ద వర్షం...అందరు ఎక్కడికక్కడ సర్దుకుపోయారు....ఈలోగా మాకు బజ్జీలు వచాయి....ఆ వర్షం లో కొంచెం కొంచెం తడుస్తూ..వేడి వేడి బజ్జీలు తింటుంటే...ఆహ!! స్వర్గమే....కాసేపటికి ఆ జడివాన శాంతించింది..ఈ లోగ మేము కాసిని వేడి టీ కూడా త్రాగి తిరిగి మా నడక కొనసాగించాము....


ఇక అటు తరువాత ఘాట్ రోడ్ మీద కాసేపు మా నడక సాగింది.....అక్కడ కొండల పక్కన నడుస్తుంటే మేఘాల్లో ఉన్న భావన కలిగింది....కొండల మీద మొత్తం తెల్లటి మబ్బులు పరచుకున్నాయి....దూరంగా ఉన్న పెద్ద పెద్ద గాలిమరలు....ఎదురుగా కొద్ది దూరంలో ఉన్న మనుషులు.... ఏమి కనిపించట్లేదు.....సన్నని జల్లు....చుట్టూ పొగలాగా తెల్లటి మేఘాలు అలా మమ్మల్ని తాకుతూ వెళ్ళాయి... మేఘాల్లో తేలిపోవడమంటే  ఇదేనేమో !!!!.భలే ఆనందమనిపించింది.......దేవదేవుడిని చూడటానికి వెళ్తున్న మాకు ప్రక్రుతి ప్రసాదించిన వరం లా అనిపించింది.....అలా మేఘాల్లో నడుస్తూనే మోకాళ్ళ పర్వతం చేరుకున్నాం....అక్కడ కూడా పరిస్థితి ఇంతే ......చాలా ఆహ్లాదంగా ఎటువంటి శ్రమ,చిరాకు,అలసట లేకుండా మా ప్రయాణాన్ని ఇంత నయనానందకరంగా చేసిన ఆ గోవిందునికి మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంటూ....మా యాత్రను ముగించాము...కేవలం 4 గంటలలో తిరుమల చేరుకున్నాం.......మనసు ఆనందంగా ఉందేమో దేహం కూడా పెద్దగా బాధించలేదు....కాళ్ళు నొప్పి కూడా పెద్దగా లేదు....ఆ మరుసటి రోజు కళ్యాణ సేవకి వెళ్లి కన్నులపండువగా జరిగిన దేవుడి పెళ్లిని చూసి అటు పిమ్మట శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి బయలుదేరాము.....దివ్యవిగ్రహ రూపుడైన ఆ స్వామిని దర్శించి,పులకించి....భక్తిపారవశ్యం తో బయటకు వచ్చాము.....


'ఎంత ఆహ్లాదమైన యాత్ర!' అనిపించింది.....తిరుమలకి ఎన్నిసార్లు వచ్చినా  కాలినడకనే స్వామిదర్సనం చేసుకోవాలనిపించింది....కాని మొన్న తిరుమలలో చిరుత జరిపిన దాడి చూసి చాలా బాధేసింది....ఎంతో నమ్మకంతో కొన్ని వేలమంది భక్తులు నిరంతరం కాలిబాటన తిరుమల చేరుకుంటారు.....రాత్రి పగలు అని తేడా లేకుండా ఎల్లప్పుడూ  భక్తుల గోవింద నామాలతో ప్రతిధ్వనించే తిరుమల కాలిబాట లో ఇలా జరగడం ఏంటో!!......ఇది సరైన భద్రత కల్పించని అధికారుల తప్పా??? లేక జనారణ్యం లోకి వచ్చి అలజడి సృష్టిస్తున్న చిరుత తప్పా???


ఏది ఏమైనా ఇకమీదట ఇలాంటివి జరగకుండా చూడాల్సిన భాద్యత భద్రతా అధికారుల పై ఉంది.....చిరుతని పట్టేసాముగా అని అధికారులు అనొచ్చు....కాని.....అప్రమత్తత అనేది అన్నివేళలా అవసరం....


ఈసారి కూడా నేను కాలిబాటనే తిరుమల కొండకి వెళ్దామనుకుంటున్నా....పులి వచ్చినా...ఏమైనా..... ఆ వేంకటేశ్వరుడు ఉన్నాడుగా...... :)

మేము కాలిబాట న వెళ్ళినపుడు తీసిన కొన్ని చిత్రాలు....