30, సెప్టెంబర్ 2010, గురువారం

ఏంటబ్బా!! ఇంత సహనం??

పొద్దున్నే లేచి కొన్ని తెలుగు వెబ్ సైట్లు చూసాక నాకు వచ్చిన డౌట్ ఇది...
'అయోధ్య' విషయం లో మన వాళ్ళు ఇంత సంయమనం పాటించారా???
ఏ గొడవలు...కొట్లాటలు...అల్లర్లు లేకుండా...60 సంవత్సరాలు కోర్టులో మగ్గిపోయిన తీర్పు బైటికొచ్చిందా?? 
అయినదానికీ కానిదానికీ గొడవలు చేసి...కోడి గుడ్డు కి ఈకలు పీకే రాజకీయ నాయకులు నోళ్ళు మెదపలేదా??? 
చీమ చిట్టుక్కు మన్నా రాద్ధాంతం  చేసే 'మీడియా'...అదీ 'చర్చలు' అనే పేరుతొ 'చిచ్చులు' పెట్టె టీ.వి.9 లాంటి ఛానళ్ళు అసలు ఈ విషయం  గురించి అంతగా పట్టించుకోలేదా?? 
అటు కాకి ఇటు వాలినా...ఇటు కాకి అటు వాలినా.....బందులు...బస్సులు తగలబెట్టడాలు....రాస్తా రోకోలు...వీధుల్లో విధ్వంసాలు సృష్టించే అల్లరి మూకలు తోకలు ముడిచారా?? 
ఆ ఎవరెటు పొతే నాకేంటి అని నిమ్మకు నీరేత్తని పోలీసు వారు...గట్టి గా పహారా కాశారా?? 


అయ్యబాబోయ్!! ఇది ఇండియా నే?? 
ఇది ప్రతి దాన్ని హైలైట్  చేసే మీడియా నే??
వీళ్ళు మన డబ్బులు తిని బొజ్జలు పెంచిన రాజకీయ నాయకులే??
వీధుల్లో గలాటా చేయకుండా ఇంత బుద్ధిగా ఇళ్ళలో కూర్చుని ఉంది మన అల్లరి మూకలే??
తుపాకి ఎక్కుపెట్టి అందరి తలలు వంచగలిగింది మన పోలీసోల్లె??


ఇదంతా నిజామా?? నేను పగటిపూట కూడా కల కంటున్నానా?? 
వామ్మో!!వార్నాయనో!!
అర్జెంటుగా నిన్న తెచ్చుకున్న 'గులాబ్ జామ్' మిక్చరు తో ఇవాళ స్వీట్ చేసేయాల్సిందే...
మన ఇండియా లో ఇంత సహనం,ఓపిక,సామరస్యం....నేను పుట్టాక ఇప్పుడేనేమో బహుశా చూడడం...
ఇప్పుడిప్పుడే  నాకు ఆశ  కలుగుతోంది..మన దేశం కూడా బాగుపడుతుందేమో అని....

జై భారత్ మాత...
జై జై భారత్ మాత...

27, సెప్టెంబర్ 2010, సోమవారం

రెహ్మాన్ సంగీతంతో ప్రతిధ్వనించిన 'సిల్వర్ డోం'

నిన్న 'పాంటియాక్ సిల్వర్ డోం' లో...ఏ.ఆర్.రెహ్మాన్ 'జయహో' షో జరిగింది.రాత్రి 8 గంటలకు మొదలైన ఈ కార్యక్రమం రెహ్మాన్ చేస్తోన్న 'జయహో' ప్రపంచ యాత్ర లో భాగం.సరిగ్గా మూడు నెలల క్రితం జరగాల్సిన ఈ కార్యక్రమం కొన్ని అవాంతరాలవల్ల ఆగిపోయి,ఈ సారి ఎటువంటి ఆటంకాలు లేకుండా కన్నుల పండువగా జరిగింది.రెహ్మాన్ కి ఫాను ఇంకా ఏ.సి. కూడా అయినా నేను వెళ్ళకపోతే ఎలా?? అందుకే పాపం చందు కి రేపు పరీక్ష ఉన్నా తీసుకెళ్లా.సరిగ్గా టైం కి వెళ్ళిన మేము..స్టేజి కి ఎదురుగా  కూర్చున్నాం.'వ్యూ' బాగుంది అనుకున్నా...కానీ జనాలు పెద్ద గా లేరు.చాలా సీట్లు ఖాలీ ఉన్నాయి.


ముందుగా తన కీర్తిని ఇనుమడింప చేసిన 'వందే మాతరం' గీతం తో షో కి స్వాగతం పలికిన రెహ్మాన్ మెల్లగా  తన మాయ మొదలు పెట్టాడు.ఇంతలో కృష్ణ-ప్రసన్న వాళ్ళు కూర్చున్న దగ్గరకి మమ్మల్ని రమ్మన్నారు....సరే అని అక్కడికి వెళ్లి...ముందు ఇంకా చాలా సీట్లు ఖాళి ఉన్నాయని అక్కడికి కుర్చిల మీద నించి దూకుతూ వెళ్లి (ఎక్కడికెళ్ళినా  మన బుద్ది పోతుందా??!!)కూర్చున్నాం ...ఇంతలో ఎప్పుడొచ్చాడో  'రోజా' సినిమా లో 'వినరా..వినరా'(తెలుగు లో కాదులెండి....తమిళం లో) పాడుతూ  'హరిహరన్' వచ్చాడు'.హరిహరన్ గాత్రం గురించి చెప్పేదేముంది?? అది నాకు ఇష్టమైన పాట....ఒక్కసారి తెలుగు లో 'వినరా....వినరా' అంటే బాగుండు అనుకున్నా...ఊహు!! నిరాశే మిగిలింది...ఆ తరువాత లతామంగేష్కర్ తో కలిసి రెహ్మాన్ పాడిన  గీతం ఈ షో కే హైలైట్.ఇంతకీ లతామంగేష్కర్ అక్కడ ఉంటే వింతేముంది?? లతామంగేష్కర్ పాడిన రికార్డెడ్ వాయిస్ తో...స్టేజి మీద ఆమె 3D -లేసర్ ప్రొజెక్షన్ తో  రెహ్మాన్ పాడిన గీతం అద్భుతం.ఆ తరువాత 'మైకేల్ జాక్సన్' పాటల్లో ప్రముఖమైన 'బ్లాక్ ఆర్ వైట్' పాడాడు....దానికి ఒక చిన్న పిల్లాడు...జాక్సన్ స్టయిల్ లో 'మూన్ వాక్' చేస్తూ చేసిన డాన్స్ సూపర్...ఆ తరువాత ఎన్నో అద్భుతమైన పాటలు పాడాడు...మధ్య మధ్యలో వర్ధమాన గాయని గాయకులతో కొన్ని పాడించాడు....తరువాత హరిహరన్ పాడుతూ ఉంటే దానికి రెహ్మాన్ 'హర్మనీ' వాయిస్తూ...కొంచెం సేపు గాన కచేరి చేసారు.... అప్పటికి ఒక్క తెలుగు ముక్క చెవికి సోకక...తమిళ,హిందీ హోరు తో తుప్పు పట్టిన మా చెవులలో  'ఓ చెలియా! నా ప్రియ సఖియా!! చేజారెను నా మనసే!!' అని పాడి అమృతం పోసాడు ఒక వర్ధమాన  గాయకుడు...అంతే!! చందు-కృష్ణ-ప్రసన్న తో సహా అక్కడ ఉన్న చాలామంది తెలుగువారు అందరూ ఈలలు...చప్పట్లు....బాబోయ్ అదిరిపోయింది....(తెలుగోడి సత్తా అపుడు తెలిసి ఉంటుంది రెహ్మాన్ కి).....కానీ మా ఆనందం ఎంతో సేపు నిలవలేదు....ఎందుకంటే పాడింది ఆ ఒక్క ముక్కే కాబట్టి!!
ఆ తరువాత మత సామరస్యానికి చిహ్నంగా అన్నిమతాలకు సంబంధించిన రెహ్మాన్ స్వరపరిచిన గీతాలు పాడారు....అప్పుడు వచ్చిన 'జోధ-అక్బర్' లో 'ఖ్వాజా మేరె ఖ్వాజా' పాట కి మేము కూడా సినిమా లో లాగే చప్పట్లు  కొట్టాం.


తరువాత వచ్చిన 'రోబో' లో ఒక పాట మాత్రం అన్నిటికంటే నాకు బాగా నచ్చింది...చెప్పాలంటే ఆడిటోరియం దద్దరిల్లింది...రెహ్మాన్ మాజిక్ ఏంటో తెలిసేలా చేసింది...తరువాత ఆల్ టైం హిట్స్ అయిన 'చయ్య!!చయ్య!!'...'దిల్సే రే!!'...'రింగా రింగా' లాంటి పాటలతో హోరెత్తించిన రెహ్మాన్ 'పప్పు కాంట్ డాన్స్!!'(జానే తు..హిందీ సినిమా లో ది) పాట తో అందరి చేత డాన్స్ కూడా చేయించాడు....అందరూ లేచి ఎవరి ఇష్టం వచ్చినట్లు  వారు డాన్స్ చేయడమే!! ఈలలు..చప్పట్లు...గోల..గోల...ఆ తరువాత కాసేపు చట్నీ సాంగ్స్ (తెలుగు,హిందీ,తమిళం అన్నీ కలిపేసి పాడారు).....కానీ ఇందులో కూడా ఒక్క తెలుగు ముక్కే ఉంది...'ఈ హృదయం...' అంటూ పాడాడు...పోన్లే ఏం చేస్తాం!! నేనైతే...దీనికే మురిసిపోయి ఓ తెగ చప్పట్లు కొట్టేసా!!...తరువాత మళ్లీ తన 'వందేమాతరం' గీతం పాడి...'జయహో' పాట తో షో ని ముగించాడు రెహ్మాన్...


షో లో స్టేజి డెకొరేషన్,లైటింగ్,ఆర్కెస్ట్రా అద్భుతం....ప్రతి పాటకి అనుగుణంగా స్టేజి మీద వచ్చే బాగ్రౌండ్స్ చాలా బాగున్నాయ్!!....రెహ్మాన్ కూడా సాధ్యమైనన్ని పాటలు తానె పాడాడు.కానీ,నిరాశపరిచింది మాత్రం 'హరిహరన్ ఎక్కువ పాడకపోవడం '.......'తెలుగు పాట లేకపోవడం'.మన తెలుగు వాళ్ళు....'తెలుగు తెలుగు' అని అరిచిన అరుపుల తో  'తెలుగు సినిమా పరిశ్రమ' కూడా ఒకటుందని....అందులో తాను కూడా పని చేసానని... తెలుగు వాళ్ళు విదేశాల్లో కూడా చాలామంది ఉంటారు అని రెహ్మాన్ గారు కొంచెం గుర్తుకు తెచ్చుకుంటే చాలు!!


రెహ్మాన్ జయహో షో పిక్స్ ఇక్కడ:
22, సెప్టెంబర్ 2010, బుధవారం

నిను చూడక...

'నిను చూడక...నేనుండలేను...'


ఈ ముక్క ఎవరితో అంటున్నాను అనుకుంటున్నారా??? ఇంకెవరితో...నా చిరకాల నేస్తం 'న్యూస్ పేపర్' తో....చూసి ఎన్ని రోజులైపోయిందో....అదేమిటి అంతగా కావాలంటే 'ఈ-పేపర్' చూసుకోవచ్చు కదా అని అనొచ్చు....కానీ పొద్దున్నే లేచి చక్కగా వేడి వేడి టీ తాగుతూ... అలా అలా పేజీలు తిప్పుతూ... పేపర్  చదివితే వొచ్చే ఆనందం ఈ 'ఈ-పేపర్' లో ఏం వస్తుంది???ఇప్పుడంటే...ఈ-పేపర్,ఆ-పేపర్ అని వచ్చాయి కానీ ఇదివరకు అందరిళ్ళలోను(పండగలకి పబ్బాలకి తప్ప) క్రమం తప్పకుండా పొద్దున్నే పాలవాడితోపాటు మేలుకోలిపేది పేపర్ యే కదా ...


నాకున్న అతి తక్కువ మంచి అలవాట్లలో ఈ పేపర్ చదవడం ఒకటి అని నా ఫీలింగ్...చిన్నప్పుడు అనగా నా నాల్గవ తరగతి లో ఈనాడు ఆదివారం లో వేసే 'బాలవినోదిని' తో మొదలైన  నా పత్రికాపఠనం....మెల్లగా  'మొగ్గ' తొడిగి....అంచెలంచెలుగా ఎదిగి...ఆఖరికి 'పేపర్' రాని రోజున దిగులు పడే దాక వచ్చింది.....పేపర్ మొదటి పేజి దగ్గర  నించి చివరి దాక నమిలి మింగేసాక పక్క వాళ్ళకి ఇచ్చేదాన్ని..అప్పటిదాకా నన్ను ఎవరన్నా కదిలిస్తే  'కాళికా' అవతారమే......


నాకు సాధారణంగా పొద్దున్నే లేచే చెడ్డ అలవాటు లేకపోయినా..ఈ పేపర్ దయ వల్ల అది కూడా అబ్బింది. ఠంచనుగా పేపర్ బాయ్ పేపర్ మా ఇంటి గుమ్మం లో విసిరేలోగా తలుపు తీసేదాన్ని....ఒకవేళ ఆ రోజు పేపర్ ఇంకా రాకపోతే కనీసం మొహం కూడా కడుక్కోకుండా అలాగే మెట్ల మీద ఎదురు చూస్తూ ఉండేదాన్ని....ఒక్కోసారి 'దీపావళి','సంక్రాతి' పండగలు వెళ్ళిన మరుసటి రోజున పేపర్ రాదు అని తెలిసినా పోరాపాటులో అలవాటు లాగ పొద్దున్నే లేచి..కాసేపు పేపర్ కోసం చూసి ..'ఐతే నిజంగానే ఇవాళ పేపర్ రాదు అన్నమాట' అని నిర్ధారించుకుని మళ్లీ నిద్ర కు ఉపక్రమించేదాన్ని...కాలేజి కి వెళ్ళే రోజుల్లో...ఇంట్లో చదవడానికి వీలు చిక్కకపోతే బాగ్ లో పెట్టేసుకుని బస్ ఎక్కిన తరువాత హాయిగా చదివేసేదాన్ని....చివరికి అమీర్పేట్ లో హాస్టల్ లో ఉన్నపుడు  కూడా అందరికంటే ముందు లేచి పేపర్ మొత్తం నమిలేసి అప్పుడు వెళ్లి మళ్లీ పడుకునేదాన్ని....నా పేపర్ వీక్నెస్ కనిపెట్టిన మా అమ్మ,తమ్ముడు ఒక్కోసారి నాకంటే ముందే నిద్ర లేచి పేపర్ దాచిపెట్టేసి నన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు  తాగించేవారు....ఆ టైం లో చచ్చినట్టు వాళ్ళు చెప్పిన పనల్లా చేసేదాన్ని.....అందరూ కలిసి నాకు 'పేపర్ పురుగు' అని నామకరణం కూడా చేసారు....


ఎన్ని కష్టాలు ఎదురైనా పేపర్ చదవడం మాత్రం మానుకోలేకపోయా...ఆఖరికి బెంగళూరు మహిమ వల్ల అప్రతిహతంగా సాగుతున్న నా పేపర్ పఠనానికి బ్రేక్ పడింది.ముందు కొద్దిరోజులు అక్కడా పేపర్ తెప్పించా!! కానీ రాను రాను పని వత్తిడి ఎక్కువవడం తో...పేపర్ వాడు వేసే పేపర్ కట్టలు కట్టలు బాల్కనిలో చెత్తలా పేరుకుపోవడం చూడలేక వేయించడం ఆపేసా!! నా బాధ చూసి ప్రతి శని,ఆదివారాలు చందు పేపర్ తీసుకురావడం తో కొంత ఉపశమనం ఉండేది....


కానీ...నా జీవితం లో ఇలా నెలలకి నెలలు...అస్సలు పేపర్ తాకకుండా ఉండే సందర్భం ఒకటి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు......ఆదివారాలు తీరిగ్గా కూర్చుని....వేడి వేడి ఉప్మా లో పంచదార జల్లుకుని తింటూ ...మధ్యలో టీ తాగుతూ....'సండే స్పెషల్' లో వచ్చే కథ  చదువుతూ ఉంటే....ఆహ!! ఆ ఊహే ఎంత బాగుంది!!


ఇంకా ఎన్నాళ్ళో ...ఎన్నేళ్లో......ఈ ఎదురుచూపులు...'నిను చూడక...నేనుండలేను...'

18, సెప్టెంబర్ 2010, శనివారం

భలే భలే డెట్రాయిట్ జూ...

అదేంటో మరి....నాకు జూ అంటే భలే ఇష్టం...నా చిన్నప్పుడు ఎప్పుడు చూసినా ఆ హైదరాబాద్ 'నెహ్రు జూలాజికల్ పార్క్' కి తీసుకెళ్ళేవారు....అక్కడ జంతువులు తక్కువ నడక ఎక్కువ.....అంతకుమించి నేను ఏ 'జూ' కి వెళ్ళలేదు :( కానీ నా జూ చూడాలనే కోరిక అలాగే ఉండిపోయింది.బెంగుళూరు లో ఉండేటపుడు కొన్ని వందల సార్లు అనుకున్నా 'బన్నెర్ఘట్ట' జూ కి వెళ్ళాలని.....కానీ ఏంచేస్తాం!! 8 నెలల్లో  ఒక్కరోజు కూడా 'జూ' కి వెళ్ళడానికి వీలుపడలేదు....కానీ బెంగుళూరు కి 150కి.మీ దూరం లో ఉన్న 'మైసూరు జూ' కి మాత్రం వెళ్ళా :D ....ఈ 'జూ' ఉపోద్ఘాతమంతా ఎందుకంటే 'డెట్రాయిట్' వచ్చాక...ఇంచుమించు ప్రతి వారాంతం ...'జూ'...'జూ' అని నామజపమే...'తీసుకెళ్తే గాని మనశ్శాంతి లేదు' అని డిసైడ్ అయి చందు క్రిందటి  వారమే నాకు 'జూ' సందర్శనం చేయించడం జరిగింది :) మరి నాకు నచ్చిన పని చేసేస్తే వెంటనే అందరికీ చెప్పేయాలి కదా!! అలా ఫోనులో గంట మా అమ్మ-నాన్న కి జూ మొత్తం వర్ణించా!! ఇక ఇప్పుడు మీకు అన్నమాట :)


అన్నీ 'జూ' లలో ఉండే విధంగానే....ఇక్కడ కూడా 'పులులు,సింహాలు,ఎలుగుబంట్లు,ఖడ్గమృగాలు ,జిరాఫీలు,చారాల గుర్రాలు,జింకలు, పాములు,కప్పలు, తొండలు,మొసళ్ళు,రకరకాల పక్షులు' ఉన్నాయి....ఇక వీటి గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు......కానీ టీ.వి.లో తప్ప నిజంగా నా  జీవితంలో చూస్తాను అని అనుకోని కొన్నిటిని మాత్రం చూసేసా!! అవే 'పెంగ్విన్లు,ధృవపు ఎలుగుబంటి,ఆర్క్టిక్ నక్క,సీల్స్,మీర్కాట్స్,ప్రైరీ డాగ్స్,ఏంట్ ఈటర్స్,రెడ్ పాండా,కంగారు,ట్రీ కంగారు,రెండు మూపురాల ఒంటె,మూపురం లేని ఒంటె'......కానీ మనం ఎప్పుడూ చూసే కోతులు,ఏనుగులు,చింపాంజీలు(వీటికోసం పెద్ద జాగా ఏర్పాటు చేసారు కానీ నాకు  ఎక్కడా కనిపించలేదు) ఇక్కడ లేవు :( 


బుడి బుడి అడుగులేస్తూ బుజ్జిగా నడుస్తున్న పెంగ్విన్లని చూస్తే ఎంత ముచ్చటేసిందో.......వాటికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'పెంగ్వినేరియం' అద్భుతం.....ఇక 'ఆర్క్టిక్ సర్కిల్' లో చక్కగా గడ్డి లో బజ్జోని నిద్రపోతున్న 'ధృవపు ఎలుగుబంటి' గారు తెలుపు+పసుపు రంగులో మెరిసిపోతున్నారు....దాని పక్కనే బిత్తరచూపులు చూస్తున్న 'ఆర్క్టిక్ నక్క' ఎంత చిన్నగా ఉందో...అక్కడినించి 'సీల్స్' చూడటానికి లోపలికేల్లాం...పైన అంతా నీరు కింద గాజు సొరంగం....అక్కడ నించి చూడాలి 'సీల్స్' విన్యాసాలు...అటు ఇటు ఈదుతూ...గెంతుతూ...వెల్లికల పడుకొని ఈత కొడుతూ....ఆహా!! ఏమి ఆడుకుంటున్నాయో!! ఇక 'మీర్కాట్స్' విషయానికి వస్తే వాటికి ప్రత్యేకమైన వసతి ఏర్పాటు చేసారు...ఇసుక,రాళ్ళు-రప్పలు,ఎండు కొమ్మలు  పెట్టారు...అవి ఇసుకలో దూరి తలపైకెత్తి చూస్తూ ఉంటాయ్...అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయ్ ...ఇక ప్రైరీ డాగ్స్ ఐతే  బుజ్జిగా చిన్న చిన్న తోకలు వేసుకుని ఇసుకలోకి దూరి,ఎండు గడ్డి తింటూ భలే ఉన్నాయ్...ఏంట్ ఈటర్స్ పెద్ద పెద్దగా ఉండి సూది లాంటి ముక్కు తో కుచ్చు తోకతో అటు ఇటు హడావిడిగా తిరిగెస్తూ వింతగా ఉన్నాయ్.... కంగారులు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి....ఇక్కడ ఒక చిన్న ప్రదేశం లో వాటిని స్వేచ్చగా వదిలేసారు...మనం వాటి మధ్యలోగుండా నడుచుకుంటూ వెళ్ళవచ్చు....దగ్గరగా  చూడొచ్చు....ఫోటోలు తీసుకోవచ్చు....కానీ మేము వెళ్లేసరికి అవి అలసిపోయి చెట్టు నీడలో పడుకున్నాయ్!!.....ఇక రెండు మూపురాల ఒంటె-మూపురం లేని ఒంటె నేను చూడటం అదే ప్రధమం....అలాగే పక్షుల దగ్గర,సీతాకోకచిలుకల దగ్గర మనం లోపలికెళ్ళి వాటి మధ్య తిరగొచ్చు....పెద్ద పెద్ద నీలిరంగు సీతాకోకచిలుకలు, ఎర్ర కొంగలు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఇక జూ అంత తమదే అన్నట్టు కలివిడిగా తిరిగేస్తున్నాయ్ అందాల నెమళ్ళు....


ఆ తరువాత 3D -4D 'వైల్డ్ ఆఫ్రికా' షో  కి వెళ్ళాం....10 నిముషాలు సాగే ఈ షో చాలా బాగుంది....అందరికీ 3D  గ్లాసెస్ ఇచ్చారు.ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నాక షో మొదలయింది.ఏనుగు ఘీంకరిస్తే ఆ చప్పుడు కి ధియేటర్ మొత్తం అదిరిపోయింది....అలాగే ఖడ్గమృగం హుంకరిస్తే ఆ గాలి మాకు కొట్టింది...ఏనుగు తొండం తో నీటిని స్క్రీన్ మీదకి చిమ్మితే మా  మీద నీళ్ళు చల్లారు...చారాల గుర్రం కి ఒక వేటగాడు బాణం వేస్తె  సీట్ లో నించి మాకు గుచ్చుకున్నట్టు ఉంది .ఒక సింహం ఇంకో సింహాన్ని కొడితే మనల్ని ఎవరో కొట్టినట్టు ఉంది......ఇలా 4D - ఎఫ్ఫెక్ట్లతో షో భలే ఉంది :) ఇది అందరూ తప్పక చూడాల్సిన షో.


అలా షుమారు 4  గంటలు పట్టింది మాకు జూ మొత్తం చూడటానికి. కానీ నేను ఇప్పటిదాకా చూసినవాటికంటే ఇది బెస్ట్ జూ...జంతువుల్ని ఎంతో శ్రద గా,వాటి సహజ వాతావరణం సృష్టించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా  చూస్తున్నారు.  నాకు ఇది బాగా నచ్చింది. ఇక్కడ సావనీర్ గా నాకు అన్నిటిలోకి బాగా నచ్చిన 'పెంగ్విన్' కి గుర్తు గా 'పింక్ పెంగ్విన్' ని తీసుకున్నా!! బుజ్జిది ఎంత బాగుందో!! దానికి 'ప్రెట్టి' అని నామకరణం కూడా చేసేసా :)


ఇవండీ  నా 'డెట్రాయిట్ జూ' సందర్సన విశేషాలు.....


జూ ఫోటోలు కొన్ని ఇక్కడ :


                                                                  పెంగ్విన్లు:

మీర్కాట్స్:


సీల్స్ :
                                                                              
ప్రైరీ డాగ్స్:
                      
                                                                  ధృవపు ఎలుగుబంటి


ఆర్క్టిక్ నక్క 
                                                                    
ఏంట్ ఈటర్స్:
కంగారు:
రెండు మూపురాల ఒంటె :
మూపురం లేని ఒంటె:
సీతాకోకచిలుక:

                          
నెమలి:
ఇక నా 'ప్రెట్టి' గాడు :

17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

నా టపా 'ఆంధ్ర జ్యోతి' లో పడిందోచ్!!

'పరాయి దేశం లో వినాయక చవితి' అని నా బ్లాగు లో నేను వ్రాసిన టపా 'ఆంధ్ర జ్యోతి' నవ్య లో  'పాలవెల్లి కోసం వాల్ మార్ట్ లో వెతికాం ' అనే శీర్షిక తో వేసారు....నాకు చాలా  ఆనందంగా ఉంది :) అందుకే నా సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటున్నా......ఈ విషయాన్ని నాకు తెలిపిన రాధిక(నాని) గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు..... :)

16, సెప్టెంబర్ 2010, గురువారం

ది మిస్సింగ్ రోజ్'ది మిస్సింగ్ రోజ్ '.....ఒక మనిషి యొక్క వ్యక్తిత్వ లోపాన్ని సరిచేసి,ఆత్మవిశ్వాసం పెంపొందించేలా చేసే నవల....రచయిత 'సేర్దర్ ఒజ్కన్' మొదటి రచన అయినా....కథనం చక్కగా నడిపించాడు...అసలు విషయాన్ని పాఠం లా చెప్పకుండా కథ లో సమ్మిళితం చేసి చెప్పాడు.....  బ్రెజిల్ నుంచి టర్కీ కి వచ్చి మళ్లీ బ్రెజిల్ లో ముగిసే కథ ఈ 'మిస్సింగ్ రోజ్'......


విప్రో లో పుస్తకాల షాపు లో ఈ పుస్తకం కనబడితే శీర్షిక బాగుంది కథ ఏంటో అని వెనక్కి తిప్పి చదివా....'తన కవల సోదరిని వెతుకుతూ ఇస్తాంబుల్ వచ్చిన యువతి, గులాబిలతో మాట్లాడడానికి ఆహ్వానింపబడుతుంది' అని ఉంది. 'ఇదేదో భలే ఉందే....ఈ పుస్తకం చదివితే నాకు గులాబీలతో మాట్లాడే విద్య వస్తుందేమో...అప్పుడు ఎంచక్కా మా ఇంట్లో గులాబీలతో మాట్లాడుకోవచ్చు' అని కొనేసి....తీరిక వేళల్లో చదివేసా!!

ఇందులో నాయిక పేరు  'డయానా'...'రియో' లో ఉండే డయానా అందంగా ఉంటుంది.... నలుగురు నన్ను మెచ్చుకోవాలి అనే రీతిలో ఇతరుల మెప్పు కోసం బ్రతికేస్తుంటుంది....అందుకోసం తనకు ఎంతో ఇష్టమైన 'రచయిత్రి' అవ్వాలనే కోరిక  వదులుకుని అందరూ గొప్ప అని పొగిడే 'లా' చదవాలని అనుకుంటుంది....కానీ తన కూతురు తాను అనుకున్న దారిలో నే వెళ్ళాలని, ఇలా ఇతరుల ప్రభావం వల్ల తన కల ని కల్ల గా చేసుకోకూడదని ఆమె తల్లి ఎన్నో విధాల ప్రయత్నిస్తుంది....కానీ 'డయానా' వినదు....చివరికి మరణించేముందు తనకి ఇంకో కూతురు ఉందని,ఆమె అచ్చం డయానా లాగ ఉంటుందని,డయానా కంటే తెలివైంది బుద్ధిశాలి అని,ఆమె ని తన భర్త తీసుకేల్లిపోయాడని,ఆమెని ఎలాగైనా వెదికి తనకి మంచి జీవితం కల్పించాలని డయానాకి  చెబుతుంది...ఆమె గురించిన వివరాలు ఆమె పంపిన మూడు ఉత్తరాల్లో ఉంటాయని చెప్పి చనిపోతుంది....

తల్లి చనిపోయిన బాధ కన్నా తనకి కవల సోదరి ఉన్నది అన్న బాధ ఎక్కవైపోతుంది డయానా కి...అసలు ఆ అమ్మాయి ఇప్పటికే చనిపోయి ఉంటే బాగుండు అని కూడా అనుకుంటుంది...కానీ తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ ఉత్తరాలు చదివి ఆ అమ్మాయిని తీసుకురావాలని అనుకుంటుంది...అలా మొదటి రెండు ఉత్తరాల్లో ఉన్న  వివరాలతో ఆమె 'ఇస్తాంబుల్' లో ఉన్న ఒక వసతి గృహ యజమాని తోటలో గులాబి పూలతో మాట్లడేదని తెలుసుకుని నవ్వుకుంటుంది....సరే ఆమె వివరాలు ఆ వసతి గృహ యజమానికే తెలుస్తాయని అక్కడికి వెళుతుంది....ఎలాగో అలా కష్టపడి ఆ వసతి గృహాన్ని కనుగొంటుంది....అక్కడ ఉన్న దాని యజమాని డయానా ని చూసి 'మారియా'(కవల సోదరి పేరు) అనుకుంటుంది...కాదు అని తెలిసాక మారియ గొప్పదనం గురించి చెబుతుంది...ఇదంతా నచ్చని డయానా తన సోదరి ఎక్కడ ఉందో చెబితే తనని తీసుకుని 'రియో' వెళ్ళిపోతానని చెబుతుంది...'సరే నీ ఇష్టం కానీ కొద్ది రోజులు నా ఆతిద్యం స్వీకరించు' అని చెబుతుంది....అలా మెల్లగా డయానా ఆ యజమాని ఇంటి వెనుక ఉన్న గులాబీ పూల తోట,మాట్లాడే గులాబీల గురించి వాకబు చేస్తుంది....'ఎక్కడన్నా పూలు మాట్లాడతాయా ?? మరీ విడ్డూరం  కాకపొతే!!' అని  ఆ మాట్లాడే విద్య నేర్పించమని యజమానిని వెటకారంగా అడుగుతుంది.ఆమె భావం గ్రహించిన యజమాని...'గులాబీలు మాట్లాడతాయి అని ధృడ విశ్వాసంతో నేర్చుకుంటేనే ఈ విద్య నీకు అబ్బుతుంది....లేదంటే ఈ జన్మకి నీవు గులాబీలతో మాట్లాడలేవు.ముందు అందుకు సిధ్ధపడు' అని హెచ్చరిస్తుంది. కానీ అసలు ఈ వ్యవహారం అంతు చూద్దాం అనే ఉద్దేశం తో 'నేను నేర్చుకోవడానికి సిద్ధం' అని అంటుంది డయానా.


గులాబీలతో మాట్లాడే విద్య నేర్చుకోవడానికి ముందు ఆ తోటలో ఉండే నియమనిబంధనలు అన్నీ వివరిస్తుంది యజమానురాలు.తరువాత కొన్ని  రోజుల కఠిన శిక్షణ లో భాగంగా రోజు పొద్దున్న,ఒక్కోసారి మధ్యానం,కొన్ని సార్లు అర్ధరాత్రి ఆ తోటలోకి వెళ్లి పూల యొక్క మనోభావాలు ఆ యజమానురాలి ద్వారా తెలుసుకుంటుంది  డయానా.ఆ పువ్వులు తనతో మాట్లాడుతున్నాయని యజమానురాలు చెప్పినపుడు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది....'నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను వాటితో??' అని ప్రశ్నిస్తుంది.....'అవి నీతో మాట్లాడతాయి అని నీకు నమ్మకం కుదిరిన రోజున వాటి తీయటి పిలుపు నీకు  వినిపిస్తుంది...కానీ అది నువ్వు నమ్మవు...ఎందుకంటే అందరూ చెప్పేది అదే కాబట్టి...నువ్వు ఇతరుల  కోసం బ్రతుకుతున్నావ్ కాబట్టి.....నీ జీవితం నీది..నీ నమ్మకాలూ అభిప్రాయలు నీవి...ఎవరికోసమో నువ్వు నీ జీవితాన్ని,నమ్మకాల్ని మార్చుకోవాల్సిన పని లేదు' అంటుంది. క్రమంగా డయానా లో మార్పు వస్తుంది.అలా కొద్ది రోజులు గడిచాక ఒక రోజు ఆ యజమానురాలు తనకి మరియా ఫోను చేసి 'రియో' వెళుతున్నానని చెప్పిందని చెబుతుంది. తన తల్లి మరణించిందని తెలిస్తే మారియా  చనిపోతుందేమోనని కంగారు పడి డయానా వెంటనే రియో కి వెళ్ళిపోతుంది.అప్పుడు నాటకీయ పరిస్తితుల్లో వాళ్ళ అమ్మ దాచిన మూడవ ఉత్తరం చదివి దాని అనుగుణంగా మరియా ఎవరో కనుక్కోడానికి ప్రయత్నిస్తుండగా నిజం బహిర్గతమౌతుంది.....


మారియ ఎవరూ?? డయానా మారియని ఎలా కనుక్కుంది?? తరువాత డయానా జీవితం లో సంభవించిన మార్పులేంటి  అన్నది పుస్తకం చదివి తెలుసుకోవాల్సిందే...!!


నేను ఈ పుస్తకం చదివాక ఒకటి తెలుసుకున్నా.....ఎవరో మెప్పు కోసం జీవిస్తూ ఉంటే ఎవరు సంతోషిస్తారో ఏమో  కానీ అందులో మన ఆనందం ఏమి ఉండదు....అది కూడా నటనే అవుతుంది.......ఇక అప్పుడు జీవితం అంతా నటించాల్సివస్తుంది....అదే మనకి నచ్చిన పని చేస్తే..కనీసం మనం అన్నా సంతోషిస్తాం :)....
కానీ ఇంతకీ నేను గులాబీలతో మాట్లాడే విద్య వస్తుందేమో అని ఆశ పడ్డా...ఒకటి అని చదివితే ఇంకోటి అయింది :D

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

పరాయి దేశం లో వినాయకచవితి....

దీపావళి,ఉగాది లాగే నాకు నచ్చే పండుగ ఈ 'వినాయక చవితి' .....బోలెడంత హడావిడి,అలంకరణ,పత్రి,చంద్రుడు వెరసి చిన్నప్పటినించి యే పండుగ జరిపినా జరుపుకోకపోయినా ఈ వినాయకచవితి మాత్రం ఘనంగా జరుపునేవాళ్ళం.....


అటువంటిది దేశం కానీ దేశం లో మొదటి సారి ఇంటికి దూరంగా ఉండి జరుపుకుంటున్న పండుగ.....


రెండు రోజుల ముందు నుంచే చందు ని హింసించడం మొదలుపెట్టాను....పత్రి ఎలా? మట్టి వినాయకుడు దొరుకుతాడా?? ఉండ్రాళ్ళకి బియ్యపు రవ్వ ఎక్కడ  కొనాలి ?? మరి పాలవెల్లి సంగతేంటి ?? వ్రతకథా పుస్తకం ఎలా ?? బంతిపూల మాలలు దొరకవుగా మరి పూలు ఎలా?? ఇలా అది ఇది అని విసిగించేసా.....


ముందుగా పాలవెల్లి కోసం దగ్గరలో ఉన్న 'ఇండియన్ స్టోర్స్' అన్నీ తిరిగాం....అందరూ 'ఈసారి రాలేదండి' అనేవాళ్ళే..!! 'అయ్యో!!' అని ఉసూరుమంటూ వెను తిరిగి వచ్చేసాం...అసలు పాలవెల్లి లేకుండా వినాయకచవితి ఊహించుకోవడం ఎలా?? పాలవెల్లికి  పసుపు రాసి కుంకుమ పెట్టి గోడకి కట్టి దానికి ఆపిల్ కాయలు,దానిమ్మ కాయలు,వెలక్కాయలు,మొక్కజొన్నలు,అరటి పిలకలు,మామిడాకులు,బంతిపూల మాలలు,కలువ పువ్వులు వంటివన్నీ అలంకరణ చేస్తేనే కదా పండగ కళ వచ్చేది!! ఇక లాభం లేదని ఇంటికి వచ్చి గూగుల్ మీద పడి వెతకడం మొదలుపెట్టా....ఎక్కడా పాలవెల్లి జాడ కనిపించలేదు..... సరిగ్గా రేపు పండగ అనగా ఒక సైట్ లో 'పాలవెల్లి ని నేనే తయారు చేసుకున్నా!!' అని పోస్ట్ కనిపించింది. వెంటనే మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. 'అవును కదా మనమే చేసుకుంటే పోలే!!' అనుకుని చందూ కి చెప్పా!! సరే అని ఇద్దరం ముందు 'వాల్ మార్ట్' కి వెళ్లి కావాల్సిన చెక్కముక్కలు వెతికే పనిలో పడ్డం....దొరకలేదు....ఏంచేయాలో పాలుపోలేదు....సరే మిగితావి తీసుకుందాం  ఈ లోగా ఏదో ఒకటి ఆలోచన రాకపోదు అని బయలుదేరాం. 'క్రోగర్' లో పూల బొకేలు ఒక మూడు,అరటిపళ్ళు తీసుకున్నాం ...... 'నమస్తే' కి వెళ్లి కొబ్బరికాయలు తీసుకున్నాం.వచ్చేటపుడు వాళ్ళు మామిడాకులు, చెరకుగడ, తమలపాకులు,రెండు అరటిపళ్ళు ,ఇంకా ఏవో నాలుగు పళ్ళు ఇచ్చారు...'హమ్మయ్య !! అసలు మామిడాకులు లేకుండా పండుగ ఉహించుకోగలమా !!' అనుకుని ఇక మట్టి వినాయకుని వెదికే ప్రయత్నం మొదలుపెట్టాం. ఏ షాపులో చూసినా రంగులేసిన వినాయక విగ్రహాలే....నాకేమో స్వచ్చంగా,అచ్చంగా మట్టి తో చేసిన వినాయకుడే కావాలి....చివరికి ఒక షాపులో దొరికింది. భలే బుజ్జిగా ఉన్నాడు....చిన్న గొడుగు తో సింహాసనం మీద ఠీవి గా కూర్చున్న గణపతి :) ఈ షాపు లో కూడా పండగ సందర్భంగా మామిడాకులు ఇచ్చారు....


తమలపాకులు,వక్కలు,చందనం,చిన్న దీపపు ప్రమిదలు తీసుకుని ఇక పాలవెల్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. చెక్కలు కావాలంటే  'హోమ్ డిపో' కి వెళ్లి తెచ్చుకోవాల్సిందే అనుకుని అక్కడకి వెళ్ళాం....ఎలాగో అలా కష్టపడి మాకు కావాల్సిన విధంగా చిన్నగా ఉన్న చెక్కముక్కలు,వాటిని కోయడానికి పదునైన చాకు,మేకులు,పురికొస తీసుకుని ఇంటిదారి పట్టాం. ఇంటికి రాగానే పాలవెల్లి ని తయారు చేసే పనిలో చందూ మునిగిపోతే, రేపు వంటకి కావాల్సిన ఏర్పాట్లలో నేను ఉండిపోయా....చెక్కలని కష్టపడి కోసి,మేకులు కొట్టి,ఎలాగో అలా  చందూ గారి దయ వల్ల 'పాలవెల్లి' తయారయింది.....ముద్దుగా బొద్దుగా భలే ఉంది :) ఇక దాన్ని ఎలా వ్రేలాడదీయాలి అని డౌట్!! గోడకి పెద్ద మేకు కొడితే రంధ్రం ఏర్పడుతుంది....అది ఇష్టం లేదు....అలా కాకుండా ఇంత బరువైన పాలవెల్లి ని మోయడం  చిన్న మేకుల పని కాదు .'ఏం చేయాలా ??' అని ఆలోచిస్తుంటే....ఇంకో ఆలోచన వచ్చింది....వెంటనే మా సైడ్ టేబుల్ ని పూజామందిరం చేసేసా...కింద పైన రెండు  గ్లాసులు ఉన్న సైడ్ టేబుల్ అది. కింద గ్లాస్ మీద వినాయకుడిని పెట్టొచ్చు..పైన పాలవెల్లి పెట్టొచ్చు....కావాల్సిన పండ్లు వ్రేలాదదీయోచ్చు....అని అనుకున్నాం....హమ్మయ్య అప్పటికి మనసులు కుదుట పడ్డాయి....


మొత్తానికి చవితి రోజున పొద్దున్నే లేచి త్వర త్వరగా వంట కానిచ్చేసి ఇద్దరం పూజ ముందు కూర్చున్నాం.పాలవెల్లి ని పూల తో అలంకరించి,దానికి ఆపిల్స్,మొక్కజొన్నలు,పళ్ళు కట్టి ,దేవుడిని నానావిధ పుష్పాలతో అలంకరించి,పత్రి కోసం మామిడాకులు,దగ్గరలో ఉన్న కొన్ని చెట్ల ఆకులు తీసుకొచ్చి,లాప్ టాప్ లో వినాయక వ్రతం డౌన్లోడ్ చేసి, దానికి అనుగుణంగా పూజ చేయడం మొదలుపెట్టాం. ఈలోగా పండగ పూట అతిధి గా 'నాని' గారు వచ్చారు.....సావధానంగా,దివ్యంగా పూజ చేసుకుని, పులిహోర-పొంగలి-కుడుములు-ఉండ్రాళ్ళు-వడపప్పు-పానకం  తో పాటు మహానైవేద్యం పెట్టి కథాశ్రవణం  చేసి అక్షతలు వేసుకుని పూజ ముగించాం.తరువాత తీర్ధప్రసాదాలు స్వీకరించి నాని గారికి కూడా అందించాం.'ఇండియా ని గుర్తు చేసారండి ఒక్కసారి' అన్నారు నాని గారు.....చాలా సంతోషమేసింది :)


ఆనక నాని గారితో భోజనం చేశాం.....ఆ రోజు రాత్రికి అతిధులు గా కృష్ణ-ప్రసన్న,ఇంకో కృష్ణ వచ్చారు......మా మందిరం,పాలవెల్లి చూసి ముచ్చట పడ్డారు వారు కూడా.....వారికి తీర్థప్రసాదాలు అందించాం.....ఇక రాత్రి ఎలాగైనా చంద్రున్ని చూడకూడదు అని కిటికీ బ్లైండ్స్ అన్నీ వేసేసి దుప్పటి కప్పేసుకుని నిద్రపోయా :D
అలా పరాయి దేశం లో కూడా చక్కగా వినాయకచవితి జరుపుకున్నందుకు  చాలా సంతోషంగా ఉంది :)

13, సెప్టెంబర్ 2010, సోమవారం

అప్పర్ పెనిన్సులా అందాలు-3

మూడవ రోజు....
మా ప్రయాణం లో చివరి రోజు.....చాలా ఆహ్లాదంగా గడిపిన రోజు కూడా.....
ఈ రోజు కొంచెం తొందరగా అంటే 7 కి లేచాం....మరి క్రూయిజ్ బయల్దేరేది 10:00 కి.....ఈ రోజు కూడా లేవగానే టీ తాగేసి కాసేపు అలా తిరుగుదాం అని తలుపు తీసా...అయ్యబాబోయ్ !! భయంకరమైన చలి....వణికిపోయి వెంటనే  తలుపు వేసేసి 'ఇవాల్టి సంగతి ఏంటి రా దేవుడా??!!' అనుకుంటూ అలాగే కాసిని కార్న్ ఫ్లేక్స్ తినేసి త్వరగా తెమిలి,సామాన్లు అన్నీ సర్దేసుకుని, క్యాబిన్ ఖాళి చేసి,క్యాబిన్ యజమానికి చెప్పి బయటపడ్డాం.....ఆ క్యాబిన్ వదిలి వస్తుంటే బాధేసింది :( . కానీ ఏం చేస్తాం? మన ఇల్లు కాదు కదా!!...


ముందుగా పిక్చర్డ్ రాక్స్  క్రూయిజ్ దగ్గరికి వెళ్ళాం......ఈసారి కొంచెం ముందు వెళ్ళాం నిన్నటిలాగా మిస్ అవకూడదని....పోద్దున 9:30 కి అస్సలు ఎండ లేదు....విపరీతమైన చలి...నేనైతే నా హుడ్ స్వెట్టర్ వేసేసుకుని కూర్చున్నా ఫెర్రి పైన ఎక్కి ముందు వరసలో......చాలా మంది చలికి తాళ లేక కిందనే కూర్చున్నారు...కానీ చూడటానికి వచ్చి కింద ఎందుకు కూర్చోవడం అని అలాగే చలికి తట్టుకుని పైన కూర్చున్నాం....మెల్లగా ఫెర్రి అంతా నిండేసరికి 10:15....అప్పుడు బయల్దేరింది......ఫెర్రి కెప్టెన్ తనని తాను పరిచయం చేసుకుని మైక్   లో పిక్చర్డ్ రాక్స్  గురించి,'లేక్ సుపీరియర్' గురించి చెప్పడం మొదలుపెట్టాడు....మంచి నీటి సరస్సు అయిన 'లేక్ సుపీరియర్' ఒడ్డున వరుసగా ఉండే అందమైన రాళ్ళే ఈ 'పిక్చర్డ్ రాక్స్ '....మధ్యలో గుహలు,జలపాతాలు,నదులు,బీచ్ చూసుకుంటూ ఫెర్రి లో మూడు గంటలు సాగే ప్రయాణమే ఈ 'పిక్చర్డ్ రాక్స్ క్రూయిజ్'. మేము చేసిన తప్పు ఏంటి అంటే...ఫెర్రి లో ఎడమ వైపు కూర్చున్నాం....కానీ చూసేది అంతా కుడివైపే....'అయ్యో!!' అనిపించింది.....'సర్లే!! వచ్చేటప్పుడు ఈ దారే కదా అప్పుడు చూద్దాం' అనుకున్నాం. ముందు ఫర్వాలేదు అనేట్టుగా ఉన్న ఈ రాళ్ళ అందాలు రాను రాను అద్భుతం అనేవిధంగా ఉన్నాయి....సహజంగా ఏర్పడిన ఈ రాళ్ళు వాటి నిర్మాణం లో ఉన్న వైవిధ్యం వలన రకరకాల ఆకారాల్లో,రంగుల్లో దర్సనమిస్తాయి...కింద మెత్తటి  రాయి-పైన గట్టి రాయి ఉండటం వల్ల ఆ రెంటి మధ్య నిరంతరం జరిగే రాపిడి వల్ల ఈ రాళ్ళు ఈ రూపాలు సంతరిచుకున్నాయ్....ఇవి కొన్ని వందల సంవత్సరాల నించి జరుగుతున్న కారణాన ఈ నాటికి ఈ రూపం లో దర్సనమిస్తున్నాయ్....కొద్ది సంవత్సరాల్లో మనం ఇప్పుడు చూసినవి ఉండవచ్చు  లేక వేరే రూపాలు రావొచ్చు......


ఎన్నో రంగులు....ఎవరో చిత్రకారుడు శ్రధ్ధ గా  వర్ణాలు కలగలిపి వేసిన అద్భుత చిత్ర రాజాల్లా ఉన్నాయి....ఆ రంగుల మేళవింపు అంతా ప్రక్రుతిది అంటే ఆశ్చర్యమేస్తుంది.మధ్యలో అంతెత్తు నించి సన్నగా జాలువారే జలపాతాల హొయలు.....అక్కడక్కడ మహాసరస్సు లో సంగమించే నదీముఖాలు......కొన్ని చోట్ల సహజంగా ఏర్పడ్డ అందమైన గుహలు.....వాటిలో నించి తొంగి చూసే 'సీగల్స్' పక్షులు.....ఒకవైపు నించి చూస్తే ఒక ఆకారంలో,ఇంకోవైపు నించి చూస్తే ఇంకో ఆకారం లో దర్సనమిచ్చే రాళ్ళు, సహజంగా ఏర్పడిన 'శిలాతోరణం' ఇలా కనువిందైన దృశ్యాలు చూస్తూ గంటన్నర మైమరచిపోయం....ఒక చోట ఐతే ఏకంగా ఫెర్రి ని గుహ లోపలి తీసుకెళ్ళి మళ్ళి అలాగే వెనక్కి తీసుకొచ్చారు.అప్పుడు ముందు వరసలో కూర్చున్న మా అనుభూతి చెప్పడం కష్టం....ఒకో చోట వరుసగా 'యుద్ధ నౌకలు' లాగ నిలబడిన రాళ్ళు చూస్తే 'ఇవి ఇలా ఏర్పడ్డాయా??లేక ఎవరన్నా చెక్కారా??' అనిపించింది......అలా అడుగడుగునా అద్భుతాలు చూస్తూ చాలా దూరం వెళ్లి వెనకి తిరిగి వచ్చాం....మధ్యలో ఒక చోట పెద్ద ఓడ మునిగిపోయిన ప్రదేశం కూడా చూపించారు....అక్కడ అడుగున ఉన్న ఓడ శిధిలాలను చూడడానికి 'షిప్ రెక్ మ్యుసియం' అనే ప్రత్యక ప్యాకేజి లో తీసుకెళ్ళి చూపిస్తారు.ఫెర్రి ని వెనక్కి  తీసుకు వచ్చేటప్పు కొంచెం దూరంగా తీసుకొచ్చాడు....అప్పటికే అందరూ నీరసపడిపోయారు.....ఫెర్రి బయలుదేరేటపుడు పోటీలు పడి మరీ ఫోటోలు తీసిన మహానుభావులు వచ్చేటప్పుడు చప్ప పడిపోయారు.....అలా అందమైన అనుభూతులు మూట కట్టుకుని తిరిగి వచ్చాం....అసలు 3 గంటలు యిట్టె గడిచిపోయాయి...


తరువాత 'సబ్వే' కి వెళ్లి  'వేజ్జి డిలైట్' తీసుకుని తిరిగి  'జలపాతాలు' చూసే కార్యక్రమం మొదలుపెట్టాం....ఈసారి ఎలాగైనా 'మినిసింగ్ ఫాల్స్' జాడ కనిపెట్టాలని ధృడ నిర్ణయం తీసుకుని చాలా జాగ్రత్తగా అంచనా వేసి ఎలాగైతేనేం అక్కడికి చేరగాలిగాం......పార్కింగ్ నించి కేవలం కొద్ది దూరం లో ఉన్నాయి ఈ ఫాల్స్....అక్కడే ఉన్న చెక్క బెంచిల్లో కూర్చొని 'సబ్వే' తినేసి పక్కనే ఉన్న ఆపిల్ చెట్లు వాటికి విరగ కాసిన ఆపిల్ కాయలు చూస్తూ ఫాల్స్ దగ్గరకి బయలుదేరాం......'మినిసింగ్ ఫాల్స్' కూడా కాఫీ రంగులో ఉన్నాయి....చాలా అందం గా  ఉంది ఈ జలపాతం....కానీ 'ఇక్కడ రాళ్ళు చాలా మెత్తగా ఉండటం వలన అప్పుడప్పుడు అవి కూలిపోయి ప్రమాదాలు జరుగుతాయి దగ్గరికి వెళ్లొద్దు' అని బోర్డు పెట్టారు.....ఈ  జలపాతం దగ్గరకి వెళ్ళే దారి అందమైన చెట్లతో భలే గా ఉంది......ఇక అక్కడినించి 'వాగ్నర్ ఫాల్స్' కి బయలుదేరాం......ఈ జలపాతం కూడా  చాలా అందంగా ఉంది....మనం ఇళ్ళలో పెట్టుకునే 'సీనరి' లో ఉండే జలపాతం లా ఉంది....దానికి వెళ్ళే దారి కూడా వంతెనలతో,చెక్క మెట్లతో ఆహ్లాదంగా ఉంది...దాని పక్కనే ఇంకో చిన్న ప్రవాహం ఉంది....కానీ అక్కడికి వెళ్ళడానికి దారి  లేదు..నాకు,చందూ కి అందులోకి వెళ్ళాలనిపించింది.....వెంటనే ఫెన్సింగ్ ఎక్కి దూకేసి అక్కడికేల్లాం...భలే ఉంది అది...చల్ల గా ఉన్న నీటి లో కాసేపు ఆడుకుని,నున్నని గులకరాళ్ళు ఏరుకుని,కాసేపు అక్కడే కూర్చుని మెల్లగా బయల్దేరి వచ్చాం...నాకు ఆ ప్రదేశం భలే నచ్చింది...చుట్టూ చెట్లు,స్వచ్చంగా ప్రవహిస్తున్న సన్నని జలధార, ఒంపులు తిరుగుతూ బండరాళ్ల మధ్య అది ప్రవహిస్తున్న తీరు,పక్కనే  నున్నటి గులకరాళ్ళు,ఎదురుగా చెక్క వంతెన.... ప్రక్రుతి లో మమేకమై ఎటువంటి కాలుష్యం లేని అంత అందమైన చోటు వదిలి ఎలా రావడం???? కానీ చేసేదేమీ లేక అప్పటికే సమయం మించిపోతున్నందున ఎలాగో అలా మళ్ళి ఆ ఫెన్సింగ్ ఎక్కి దూకి వచ్చేసాం....


తరువాత ఇక నేరుగా ఇంటిముఖం పట్టాం...ఈసారి 'మెకినా బ్రిడ్జి' కి వేరే దారిలో వెళ్ళాం....'లేక్ మిషిగన్' పక్కగా సాగే ఈ దారి ఐతే ఆహ్లాదంగా ఉంటుంది అన్న ప్రసన్న సలహాతో అటు వైపు వెళ్ళాం...కనుచూపు మేర నీలివర్ణం లో సూర్యకాంతి ని ప్రతిఫలిస్తున్న 'లేక్ మిషిగన్' ని చూస్తూ 'మెకినా బ్రిడ్జి' చేరుకున్నాం. అక్కడ కాసేపు గడిపి,కొంచెం స్వాంతన పడి...మళ్ళి ఇంటిదారి పట్టాం.....


'అప్పర్ పెనిన్సులా' వదిలి వస్తుంటే 'అయ్యో!! అప్పుడే మూడు రోజులు అయిపోయిందా?' అనిపించింది....అసలు వెళ్ళిన కారణం 'ఫాల్' చూద్దామని...కానీ ఈ సంవత్సరం ఇక్కడ ఇంకా 'ఫాల్' మొదలవలేదు....అక్కడక్కడ మాత్రమే చెట్లు  రంగులు మారాయి....చందూ,కృష్ణ,ప్రసన్న కొంచెం నిరుత్శాహపడ్డారు 'ఫాల్' రాలేదని ,అది ఉండి ఉంటే ఇంకా అందంగా ఉండేది అని....కానీ నేనైతే ఇప్పటిదాకా చూసిన ప్రక్రుతి సౌందర్యానికి  దాసోహమైపోయా......'ఈసారి కాకపొతే వచ్చే ఏడాది చూడొచ్చు ఫాల్ ఏమి ఫర్వాలేదు '...అనుకుని అప్పటిదాకా చూసిన ప్రక్రుతి అందాలను మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకుంటూ ఇంటికి వచ్చా!!


నేను ఇప్పటిదాకా చూసిన వాటిల్లో నాకు బాగా నచ్చిన ట్రిప్ ఇది....
కొండలు,జలపాతాలు,బీచ్,నదులు,సరస్సులు,అడవులు,ట్రెక్కింగ్,క్యాబిన్లు...ఓహ్!! అద్భుతమైన అందాల మణిహారం ఈ 'అప్పర్ పెనిన్సులా'.....ఇంతటి మంచి అనుభూతికి కారణమయిన చందూ కి ధన్యవాదాలు :)


ఈ రోజు తీసిన కొన్ని చిత్రాలు:


పిక్చర్డ్ రాక్స్:


మినిసింగ్ జలపాతం:వాగ్నర్ జలపాతం:

మిషిగన్ సరస్సు నీటి స్వచ్చతకి దర్పణం:మెకినా బ్రిడ్జి: