31, ఆగస్టు 2010, మంగళవారం

ఆర్చర్డ్ లేక్ దగ్గర...

రోజూ సరదాగా అలా ఆర్చర్డ్ లేక్ కి వెళ్ళడం నాకు,చందు కి అలవాటు ....
రోజులాగే  మొన్న రాత్రి 9  గంటలకి అలా ఆర్చర్డ్ లేక్ వైపు వెళ్ళాం....పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజు కాబోలు..చంద్రుడు ఇంకా కనపడలేదు...'అరె!! పైన్ చెట్ల గుబురుల నించి తొంగి చూస్తూ...ఆర్చర్డ్ లేక్ లో అందంగా ప్రతిబింబించే  చందమామ ని చూద్దామంటే లేదేమిటబ్బా?? ' అనుకుంటూ అలాగే మెల్లగా కార్ లో అలా ఆ సరస్సు చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి 'ఇక ఇవాల్టికి వచ్చేలా లేడు లే ఇంటికి వెళ్దాం' అని అనుకుంటుండగా...ఎందుకో మళ్లీ వెనక్కి వెళ్ళాలనిపించింది....సరే అని కార్ రివర్స్ చేసి మళ్ళి ఆర్చర్డ్ లేక్ ప్రదక్షిణ మొదలుపెట్టాం.....ఇక అలా సరాసరి ఇంటికేల్లిపోదాం అనుకుంటుండగా....ఏదో పెద్ద శబ్దం  వినిపించింది...కార్ డిక్కీ లో ఎమన్నా ఉన్నాయా?? అని అనుమానమొచ్చింది...కానీ ఆ రోజు పొద్దునే 'నమస్తే' లో కావలసినవి కొనుక్కుని వచ్చినపుడు అన్నీ నేనే దగ్గరుండి లోపల  పెట్టా...ఇక ఆ తరువాత బైటికి వెళ్ళలేదు....కాబట్టి లోపల ఏమి ఉండే ఆస్కారం లేదు....సరేలే ఏదో శబ్దం లే అని చెప్పి ఇంకా కొంచెం ముందుకేల్లాం....మళ్లీ శబ్దం....ఈసారి కొంచెం పెద్దగా.....మళ్లీ కాసేపు నిశ్శబ్దం ...ఆ తరువాత ఇక ఆపకుండా శబ్దం  వస్తూనే ఉంది.....నాకు ఒక్కనిమిషం ఏమి అర్ధం కాలేదు....రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది చుట్టూ అంత ఎత్తున   పైన్  చెట్లు...ఎక్కడనించి ఈ శబ్దం అనుకుంటూ ఉండగా....'వ్యూ' మిర్రర్ లోనించి కనిపించాయి ఆకాశం లో తారాజువ్వలు......'చందూ!!...ఫైర్ వర్క్స్!!....పదా వెనక్కి తిప్పు కార్ ని త్వరగా ' అని హడావిడి పెట్టేసా ....ఆర్చర్డ్ లేక్ వైపు కార్ పోనివ్వమన్నా...అక్కడైతే బాగా చూడొచ్చు అని....తీరా వెళ్లి చూస్తే....ఆర్చర్డ్ లేక్ మధ్యలో రెండు పడవల్లో నించి ఆకాశం లోకి తారాజువ్వలు వేస్తున్నారు......లేక్ ఒడ్డు కి వెళ్లి అక్కడున్న చిన్న దిమ్మ మీద కూర్చుని అలా ఆకాశం లోకి చూస్తూ ఉండిపోయాం....అంత దగ్గరగా.....పెద్ద పెద్ద తారాజువ్వలు అదే మొదటిసారి నా జీవితం లో చూడటం...నల్లటి ఆకాశం లో రంగురంగులుగా విరజిమ్ముతున్న తారాజువ్వలు....వెలుగు పూలు మీదకి విసురుతున్నట్టుగా ఉంది...ఒకదాని తరువాత ఒకటి....పువ్వులో పువ్వు విచ్చుకుంటూ,...ఒక్కోసారి నక్షత్రపు రజను నేలమీద పడుతున్నట్టు....ఒక్కోసారి నక్షత్రాలే నేల మీదకి వచ్చాయా అన్నట్టు....ఎన్ని రంగులో...ఎన్ని రూపులో.... కొన్ని సార్లు ఆ వెలుగు రవ్వలు ' మీద పడిపోతాయా ??' అన్నంత దగ్గర గా వచ్చాయి......ఎక్కడా అపశ్రుతి లేకుండా చాలా పద్దతిగా అద్భుతంగా సరిగ్గా గంట జరిగిన ఈ కన్నులవిందు ని చూసి నేనైతే మైమరచిపోయా......చిన్నప్పటి నించి దీపావళి అంటే  నాకు గుర్తుకొచ్చేది..నాకు చాలా నచ్చేది  ఒకే ఒక్కటి 'తారాజువ్వ'...అది వేయాలంటే భయమే కానీ చూడాలంటె ఎంత ఇష్టమో....అలాంటిది...గంట సేపు నిరంతరంగా కళ్ళు మిరుమిట్లుగొలిపేట్టు జరిగిన ఈ తారాజువ్వల ప్రదర్శన నేను ఎప్పటికీ మరిచిపోలేను....నిజంగా కన్నులపండుగ అంటే ఇదేనేమో.....అమెరికా వచ్చాక నేను చూసిన రెండవ 'ఫైర్ వర్క్స్' ఇవి...మొదటిసారి నయగారా దగ్గర చూసా.....కానీ నాకేమి అంత అబ్బురం అనిపించలేదు......కానీ ఈ 'ఆర్చర్డ్ లేక్ ఫైర్ వర్క్స్' మాత్రం అద్వితీయం....


PS :ఇంతకీ ఈ 'ఫైర్ వర్క్స్' ఎందుకు చేసారో మాత్రం తెలీదు....మాలాగే అవి చూడడానికి వచ్చిన వారితో కలిసి  నేను,చందూ ప్రదర్శన  అయిపోగానే చప్పట్లు కొట్టాం....తీరా కార్లోకి ఎక్కాక మళ్ళి ఒకసారి ఆర్చర్డ్ లేక్ వైపు చూసా...అప్పుడు వచ్చాడు చందమామ......చాలా ఆలస్యంగా....బహుశా ఈ 'వెలుగుల పండుగ' కోసమేనేమో అంత ఆలస్యం.... :)

27, ఆగస్టు 2010, శుక్రవారం

కుటిల మనస్తత్వం





ప్రపంచం అంతా డబ్బు,అధికారం చుట్టూనే తిరుగుతోంది అనిపిస్తోంది...మంచికి,ప్రేమకి,అప్యాయతకి ఇక్కడ స్థానం లేదు...అవన్నీ ఉన్నవాళ్ళు పిచ్చి వాళ్ళు కింద లెఖ్ఖ...మోసం చేయడం,ఎదుటివారిని మభ్యపెట్టడం,ఇతరుల మీద లేనిపోని నిందారోపణలు చేయడం,ఇతరుల జీవితాలతో ఆడుకోవడం,అధికారం చెలాయించడం కోసం పరితపించడం,దొంగ వేషాలు వెయ్యడం,మొసలి కన్నీరు కార్చడం.....ఇవన్ని చూసి మిగితా వారు కరిగిపోవడం..హ..ఏమి లోకం రా దేవుడా!!! చాలా మందికి తాము మోసపోతున్నామనే ధ్యాసే ఉండదు....ఇతరులు హెచ్చరిస్తున్నా కనీసం ఇంగితం కూడా లేకుండా 'అసలు వీళ్ళు చదువుకున్న మూర్ఖులా ??' అనిపించేంతగా నమ్మేస్తారు మోసగాల్లని.....ఏంచేస్తాం?? ఎవరి ఖర్మ వారు అనుభవించవలసిందే కదా!!




మనుష్యుల లో నాకు నచ్చని ఇంకో తత్వం 'అసత్యం' ...ఎంత అసహ్యం వేస్తుందో అబద్ధాలు చెప్పేవారిని చూస్తే....!!ఏమి సాధించాలని ఇలాంటివి చేస్తుంటారో కూడా అర్ధం కాదు.....ఇతరుల మీద అన్యాయంగా అభాండాలు వేసి హాయిగా దర్జా వెలగబోస్తుంటారు....ఇంత కుళ్ళు మనసులో పెట్టుకున్న వీళ్ళని  చూస్తుంటే...వీళ్ళ కన్నా 'మూసి నది' చాల ఉత్తమం అనిపిస్తుంది....అలాగని అస్సలు అబద్దాలాడకూడదని కాదు...మాన-ప్రానాపాయములందు అబద్ధాలు చెప్పవచ్చు....కానీ...చీటికి మాటికి....అయినదానికీ కానిదానికి....ఎందుకు ఇలా నోటికి వచ్చిన అబధ్ధం చెప్పెస్తారో తెలీదు....పోనీ ఎమన్నా పరిహాసానికి...ఎవరి మనసును నొప్పించకుండా అబద్ధాలు చెప్పినా ఫర్వాలేదు.......కానీ..ఇతరుల వ్యక్తిత్వం దెబ్బ తీసేలాగా ఘోరంగా కథలు సృష్టించి చెప్పేవారిని అసలు ఏంచేయాలో!!!!


నిజానికి అబద్ధానికి ఉన్న తేడా మనుషులకు తెలిస్తే ప్రపంచం ఇలా ఉండేది కాదేమో??


కొంతమంది ఉంటారు...ఎందుకు అంత అభద్రతాభావమో అర్ధం కాదు...ప్రతి విషయము తమకే తెలియాలి....అన్నీ తమ కనుసన్నల్లోనే జరగాలి....చెప్పి చేయాలి....అది ఇది  అంటూ ఉంటారు...భాద్యతలు..గాడిదగుడ్డులు.. అంటూ ముతక బోధలు చేస్తూ ఉంటారు...ముందుగా వీరికి అసలు 'భాద్యత' అంటే తెలీదు....వీరు ఇతరులకి నీతి సూక్తులు వల్లిస్తారు....తము వ్యక్తి పరంగా ఎదగరు.....ఇతరులు ఎదుగుతుంటే చూడలేరు....వీరికి వ్యక్తిత్వం ఉన్నవారంటే భయం...అలాంటివారి వల్ల తమ జీవితాలకి ఎక్కడా ఆపద వస్తుందో అని లేని పోనీ నిందలేసి అలాంటివారిని దూరంగా ఉంచుతారు....ఇది పిచ్చితనమో...పైసాచికత్వమో అర్ధం కాదు....


ఇలాంటివారికి జ్ఞానోదయం ఎప్పుడవుతుందో కానీ...చాలామంది జీవితాలు మాత్రం ప్రసాంతత లేకుండా పోతున్నాయ్.....కనీస పాప-పుణ్య భీతి ఉన్నా....ఇంగిత జ్ఞానం ఉన్నా....సంస్కారం ఉన్నా....ఇలాంటి పనులు చేయరు....అసహ్యమేస్తోంది ఈ కుళ్ళు లోకాన్ని చూస్తుంటే....ముఖ్యంగా అబద్దాలతో పబ్బం గడుపుకనే వాళ్ళని చూస్తుంటే.....

20, ఆగస్టు 2010, శుక్రవారం

తప్పిపోయిన నేస్తం....



నన్ను నన్నుగా అభిమానించి....నాతో స్నేహం చేసి.....ఎంతో ప్రేమ కురిపించి....చిన్న మనస్పర్ధల వల్ల దూరమైన నా నేస్తం...'అచ్చు కుట్టి'(అసలు పేరు  'అర్చన')


ఇంటర్ లో ఉండగా తను నాకు పరిచయమైంది ..... బిక్కు బిక్కుమంటూ  క్లాసులోకి అడుగుపెట్టిన నాకు,కొంచెం లేటుగా వెళ్ళడం వల్ల  కూర్చోడానికి ఎక్కడా చోటు లేదు....ఎలాగో అలా సర్దుకుని కూర్చుందాం అని చూస్తే ...అందరూ వెర్రిమొహాలు వేసుకుని చూసేవాళ్ళే తప్ప ఒక్కరు చోటివ్వరే!!! అప్పుడు నన్ను పిలిచి తను  సర్దుకుని నాకు చోటు ఇచ్చిన అమ్మాయే ఈ 'అచ్చు కుట్టి'.... అప్పటినించి మొదలయిన మా స్నేహం తొందరలోనే మమ్మల్ని ప్రాణ స్నేహితులని చేసింది ...తన మాటలు భలే గమ్మత్తు గా ఉంటాయ్ !! తమిళనాడు నించి వచ్చిన తెలుగు అమ్మాయి అవడం వల్ల తెలుగు లో వచ్చీ రాకుండా వింత వింత గా మాట్లాడేది....తన తెలుగు ఉచ్చారణ మొదట్లో నవ్వు తెప్పించినా అంత కష్టపడి తెలుగు మాట్లాడుతున్నందుకు చాలా  సంతోషమేసేది.......తను చాలా చక్కగా ఉండేది....తన పొడవైన జడ నాకు భలే ఇష్టం....కోయంబత్తూరు నించి తెచ్చిన చిప్స్ అని,అవని ఇవని ఏవేవో  తెచ్చి పెడుతూ ఉండేది....


ఒక ఆదివారం రోజున కాలేజి లో పెట్టె పరీక్ష వ్రాసేసాక నాకోసం బయట ఎదురుచూస్తూ నిల్చుంది....అప్పటికే మా నాన్న అక్కడే నాకోసం చూస్తున్నారు....సరే అని తనకు  'బై' చెప్పి వద్దామని వెళితే 'ఇవాళ మా ఇంటికి రావాలి నాన్న ఊరినించి వచ్చారు....ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తా' అంది....ఎప్పుడు ఎవరి ఇళ్ళకి పెద్దగా వెళ్ళే అలవాటు లేని నాకు ముందు భయం వేసింది....'మా నాన్న ఒప్పుకోరులే ....ఈసారికి ఒద్దు ఇంకోసారి చూద్దాం  అన్నా!!'....'నేను మాట్లడతాగా!!' అని ధైర్యంగా నాన్న దగ్గరకి వెళ్లి విషయం చెప్పి నన్ను తీసుకెల్తా అని అడిగింది....ఇలాంటి విషయాల్లో చాలా కచ్చితంగా ఉండే నాన్న ఏమనుకున్నారో ఏమో 'సరే మరి జాగ్రత్తగా వెళ్లిరా....వచ్చేటపుడు ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసేయ్....త్వరగా వచ్చేయి ఎక్కువసేపు ఉండకు' అని చెప్పి నన్ను  పంపారు....తన బండి మీద కూర్చోబెట్టుకుని వాళ్ళ  ఇంటికి తీసుకెళ్ళింది.... వాళ్ళ అమ్మ-నాన్న నన్ను చూసి చాలా సంతోషించి లోపలి రమ్మని  పిలిచారు....వాళ్ళ నాన్నగారు చాలా సౌమ్యంగా మాట్లాడారు...'మా అమ్మాయి ఎవరితోనూ ఎక్కువగా  కలవదమ్మా....కానీ నీ గురించి రోజు చెబుతూనే ఉంటుంది.....అందుకే ఒకసారి తీసుకురమ్మన్నాను..' అన్నారు. వాళ్ళ అమ్మ నాకోసం అప్పటికప్పుడు ఫ్రైడ్రైస్ చేసి పెట్టారు...అచ్చుకుట్టి ఏమో బంగాళదుంప బజ్జీలు వేసింది....మాటల్లో వాళ్ళ అమ్మగారు అన్నారు...'తనకి నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం అమ్మా!! తనకి స్నేహితులు తక్కువే అయినా ఉన్నవాళ్ళందరూ తన ప్రాణస్నేహితులు...తను నిన్ను అలాగే భావిస్తోంది.....కానీ చిన్నపిల్ల మనస్తత్వం ఇంకా పోలేదు....తనని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే భరించలేదు' అని...అప్పుడే అనుకున్న 'ఎప్పుడు అచ్చుకుట్టి ని బాధపెట్టకూడదు,నిర్లక్ష్యం చేయకూడదు' అని.....


తరువాత నేను తనని ఎప్పుడూ బాధ పెట్టకుండా జాగ్రత్తగా చూసుకునేదాన్ని....కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా.....నాకు అచ్చుకుట్టి లాగే ఇంకో స్నేహితురాలు 'స్వప్న' ఉండేది...ముందు ముగ్గురం బానే స్నేహంగా ఉండేవాళ్ళం.....కానీ ఒకరోజు అచ్చుకుట్టి 'ఇంకెప్పుడు నువ్వు స్వప్న తో మాట్లాడొద్దు...నాకు ఇష్టం లేదు' అంది...కారణం అడిగితే చెప్పదు...అటు పక్క స్వప్న కూడా 'ఇంకెప్పుడు అచ్చుకుట్టి తో మాట్లాడకు...దానికి కుళ్ళు మనం బాగా స్నేహంగా ఉంటున్నామని' అంది.....'ఏమైంది వీళ్ళిద్దరికీ??బానే ఉన్నారు కదా ఇన్ని రోజులు??? ఇప్పుడు ఎవర్ని ఒదులుకోవాలి??ఏంచేయాలి??' అని తీవ్రంగా ఆలోచించా.....'పొతే పోనిలే....ఇద్దరితో మాములుగానే ఉందాం...ఏమవుతుందో చూద్దాం' అని ఊరుకున్నా....అంతలో పరీక్షలు దగ్గర పడ్డాయి....ఇక ఆ ధ్యాసలో మునిగిపోయి ఇవేమీ పట్టించుకోలేదు....కొద్దిరోజులకి అచ్చుకుట్టి నాతో మాట్లాడడం పూర్తిగా మానేసింది....నాదగ్గర కాకుండా వేరుగా కూర్చునేది....పలకరిచ్చినా మాట్లాడేది కాదు,...నాకు చాల బాధేసేది... ఎందుకిలా  చేస్తోంది?? అని.ఒకరోజు అడిగా....'ఇక ఇంతేనా???? మాట్లాడవా??? ఇంకో వారం లో పరీక్షలు మొదలవుతాయ్.తరువాత ఎవరిదారి వారిదే.ఇప్పుడు ఎందుకిలా  చేస్తున్నావ్? నా తప్పేంటి?' అని.'నువ్వు స్వప్న తో మాట్లాడకు.అంతే!' అనేసి వెళ్ళిపోయింది...నాకు చాలా  కోపమొచ్చింది.'ఏమి చెప్పకుండా ఏంటి ఇది? పోన్లే అని ఊరుకుంటే మరీ  మొండిగా చేస్తోంది' అని ఇక నేను తనతో మాట్లాడడం మానేశా. కొద్దిరోజులకి పరీక్షలు అయిపోయాయి....అందరం విడిపోయేటప్పుడు తన 'ఆటోగ్రాఫ్' కోసం వెళ్ళా...'నేను స్వప్న తో మాట్లాడొద్దు అన్నది నీకోసమే.....తన ప్రవర్తన మంచిది కాదు.....నీ ముందు ఒకలాగా, బయట ఇంకోలాగా నటిస్తున్నది.....తనతో స్నేహం చేస్తే నిన్ను అలాగే అనుకుంటారు అని 'వొద్దు' అన్నా!! కానీ నువ్వు నన్ను నమ్మలేదు....నమ్మకం లేనపుడు స్నేహం లేదు....స్నేహమే లేనపుడు జ్ఞాపకాలేందుకు ???' అనేసి వెళ్ళిపోయింది....నాకు చాలా బాధేసింది....ఏమిచేయలేక అలా చూస్తూ ఉండిపోయా!!


తరువాత 4 సంవత్సరాలకి మళ్ళి 'స్వప్న' కనిపించింది....అప్పుడు బయటపడింది తన అసలు రూపం....అచ్చుకుట్టి చెప్పింది నిజమే....నేనే పొరబడ్డాను...స్వప్న చాలా అమాయకంగా నటించి నన్ను అచ్చుకుట్టి ని వేరు చేయాలనీ చూసింది(వేరు చేసేసింది కూడా!!)...నాకు తప్పు తెలిసొచ్చింది....వెంటనే అచ్చుకుట్టి ని కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను....అక్కడ వాచ్ మెన్ చెప్పాడు వాళ్ళు ఇల్లు ఖాళి చేసి తమిళనాడు వెళ్లిపోయారని .....కనీసం తను ఎక్కడ ఉందో కూడా తెలీదు....తనకోసం చాలా వెతికా...పాత స్నేహితులు....ఆర్కుట్....గూగుల్....కానీ దొరకలేదు.....అలా నన్ను ఎంతో అభిమానించే నా ప్రియనేస్తం తప్పిపోయింది.... :(

19, ఆగస్టు 2010, గురువారం

మా అమ్మమ్మగారి ఊరు..!!

నా వేసవి సెలవులు ఎక్కువగా గడిపిన చోటు...
నా జ్ఞాపకాల్లో ప్రముఖ స్థానం కలిగిన ఊరు....
నా చిన్ననాటి చిలిపి సంగతులు ఎన్నిటికో  చిరునామా ఈ ప్రదేశం...
 ప్రకాశం జిల్లాలో 'మార్టూరు' దగ్గర 'కోనంకి' లో దిగి యే 'ఆటో'/'జీప్'/'ఆర్.టి.సి బస్సు' లోనో ఎక్కి 'వలపర్ల' మీదుగా వెళితే  వచ్చే నాగార్జునసాగర్ కుడి కాలువ 'జవహర్ కెనాల్' దాటితే వస్తుంది  చిన్ని పల్లెటూరు 'రామకూరు'...... అదే మా అమ్మమ్మగారి వూరు....


చిన్నపుడు ఈ ఊరికి వెళ్ళడానికి బస్సులు ఉండేవి కాదు....'కోనంకి' దగ్గర బస్సు దిగి రిక్షా లోనో లేదంటే కాలినడకనో ఊరికి వెళ్లాల్సివచ్చేది ...మా తాతయ్య ఈ ఊరికి 'కరణం' గా చేసేవారు...అలాగే 'పోస్ట్ మాస్టర్' కూడా...మా అమ్మమ్మ బాగా చదువుకున్నారు అందుకనే బడి లేని ఆ వూళ్ళో మొదటి బడి మా అమ్మమ్మ ,తాతయ్య కలిసి ఇంట్లోనే మొదలుపెట్టారు...అప్పటినించి అందరూ మా అమ్మమ్మ,తాతయ్యలను 'పంతులమ్మగారు/పంతులుగారు' అనడం మొదలుపెట్టారు......మా అమ్మ,పిన్ని పెద్దయ్యాక ఈ స్కూలు వాళ్లే చూసుకునేవాళ్ళు.....అందుకే ఆ వూళ్ళో అందరికీ మా కుటుంబం అంటే ఎంతో గౌరవం....'కోనంకి' దగ్గర బస్సు దిగినప్పుడు మా వూరు వాళ్ళు ఎవరన్నాకనపడితే వెంటనే చేతిలో సామాను తీసుకుని బండి కట్టించి దగ్గరుండి ఊరికి పంపేవారు....


ఒక్క వేసవి సెలవుల్లో తప్ప ఎప్పుడు ఊరికి వెళ్ళినా  పిల్లలతో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వరండా అంతా నిండిపోయేది....మా ఈడు పిల్లలతో కలిసి తోపులోకేల్లి చింతకాయలు,సీమరేగికాయలు కోసుకోవడం,చిన్ని చిన్ని బాతుపిల్లల వెనకపడి తరమడం,రెండు వీధుల అవతల  ఉండే 'పుల్లయ్య' కొట్టులో జీడీలు పిప్పరమెంటు బిళ్ళలు కొనుక్కుని తినడం,మా బడిలోనే చదువుకునే 'చంద్రసేఖరం' వాళ్ళింట్లో ఉండే కోళ్ళు అవి పొదిగే గుడ్లు,చిన్ని చిన్ని కోడిపిల్లలు ఇంకా కొన్ని రంగులేసిన కోడిపిల్లలను అబ్బురంగా చూడడం,ఇంటి వెనుక ఉన్న రామాలయం కి వెళ్లి రోజు సాయంత్రం హరికథ వినడం,ఇంటి పిట్టగోడ ఎక్కి పక్కన ఉండే 'జాని గేదె' తో ఆడుకోవడం ('జాని' గేదె పేరు కాదు మనిషి పేరు....జాని వాళ్ళ ఇంట్లో ఉండే గేదె కాబట్టి 'జానీ గేదె' అయిపొయింది...ఎన్ని గేదెలు మారినా వాటిపేరు 'జాని గేదె'.. అంతే!!).....ఇంటికి కొద్ది దూరం లో ఉండే పెద్ద వేప చెట్టు దానికింద రచ్చబండ ,మా పాలమ్మి 'బుల్లి' తెచ్చే కమ్మటి జున్ను......మా పొలం లో పనిచేసే 'సూరిగాడు' తెచ్చే తియ్యటి 'తాటి ముంజెలు'......వేసవి లో ఐతే బాగా ముగ్గిన 'రసాలు' 'బంగినపల్లి' మామిడికాయలు,..... వేసవి రాత్రుల్లో ఇంటి ముందు మంచం వేసుకుని అమ్మ కథలు చెబుతూ అన్నం నోట్లో పెట్టడం.....తరువాత అమ్మ పక్కనే వొత్తిగిల్లి  చుక్కలు లెక్కపెడుతూ నిద్రపోవడం,ఇంటి వెనక పెరడు లో ఏపుగా పెరిగిన 'తోటకూర','టమాటా','వంకాయలు' వాటితో మా అమ్మమ్మ చేసే కమ్మని వంటలు, ....ఇంటిముందు ఉండే 'సీతాఫలాలు','జామ' చెట్లు....మా అమ్మ ఎంతో పద్ధతి గా పెంచిన 'కనకాంబరాలు' ,'విరజాజులు' ,'మల్లెలు' ,బంతిపూలు' ,'గులాబీలు' ,నేలలో ఉండే పెద్ద రోలు,పత్రం రాయి వాటిపక్కన పెరిగిన పెద్ద 'యూకలిప్టస్' చెట్టు,ఇంటిపక్కన  సందులో ఉండే  విశాలమైన 'తొట్టి'(చిన్నపుడు అదే నాకు,తమ్ముడికి 'స్విమ్మింగ్ పూల్'),.... కాకా హోటల్లో వేసే కమ్మని నేతిఇడ్లి-కారప్పొడి......పోద్దున-సాయత్రం 'పాలకేంద్రం' సైరను మోత .......దూరంగా మసీదు నించి వినపడే 'అల్లాహో అక్బర్!!'..... పొద్దున్నే కూసే పక్కింటి 'రత్నం' గారి కోడి....... మా గుళ్ళో తాతయ్య(మా తాతయ్య చిన్న తమ్ముడు...ఎప్పుడు గుడిలోనే ఉంటారు అందుకే ఆ పేరు పెట్టేసా!!),'మాణిక్యమ్మ' అత్తయ్య గారి ఇల్లు.....అన్నిటిని మించి మా ఊరి కొండమీద ఉండే  శివుని  కోవెల......ఇవన్ని ఎన్ని యేళ్ళయినా నేను,మా తమ్ముడు ఎప్పటికీ మరిచిపోలేని తీపిగుర్తులు.....


ముఖ్యంగా నాకు మా తమ్ముడికి బాగా నచ్చినది  మా వూరి కొండమీద గుడి....ఇప్పటికీ NH-5 మీద వెళుతుంటే 'కోనంకి' దాటాక దూరంగా కొండమీద గుడి కనిపిస్తుంది....అదే మా వూరి శివాలయం.....పూర్వం రావణాసురుడిని వధించాక 'బ్రహ్మ హత్యాపాతకం' నించి బయటపడడానికి రాముడు తాను 'అయోధ్య' కి తిరిగి వచ్చే దారిలో 'శివలింగాలు' ప్రతిష్థ  చేసేవారట ....అలా రాములవారు మా ఊరికి వచ్చి కొండమీద విశ్రమించి ఇక్కడ స్వామి వారిని ప్రతిష్థించారని నానుడి...అందుకే మా వూరి పేరు 'రామకూరు' అయిందిట....అలాగే ఇక్కడ శివుని పేరు ''క్షీర రామలింగేశ్వర స్వామి'.....తెల్లగా మిల మిల మెరిసిపోతూ ఉండే ఈ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం....ఈ గుడికి మా  తాతయ్య ధర్మకర్త....కానీ కొన్ని గొడవల వల్ల ఈ గుడిని 'దేవాదాయ శాఖ ' వారికి అప్పగించేశారు....ఇప్పటికీ మా కుటుంబం లో ఎవరు ఈ గుడికి  వెళ్ళినా మొదటి పూజ మా పేరున చేసి తరువాత మిగితావాళ్ళకి చేస్తారు....ఈ గుడికి వెళ్ళడానికి ఇదివరకు మెట్లమార్గము మాత్రమె ఉండేది....నేను,తమ్ముడు పోటి పెట్టుకుని పరిగెత్తుకుంటూ మెట్లు ఎక్కేవాళ్ళం....ఈమధ్యే దీనికి 'ఘాట్ రోడ్' వేసారు....గుడికి రెండు కోనేర్లు ఉన్నాయి....ఒకటి మా తాతయ్య వాళ్ళు నిర్మిస్తే ఇంకొకటి సహజసిధంగా ఏర్పడింది.రెండు పెద్ద బండరాళ్ల కిందనించి పైకి ఉబికి వచ్చే నీటి తేట కోనేరుగా ఏర్పడింది ....గుడి వెనుక ఉండే ఈ సహజమైన  కోనేరు చాలా లోతు ఎక్కువ....ఇందులో పొరపాటున కాలు జారి పడినవాళ్ళు ఇంతవరకు ఆచూకి లేరు....దీనికి కాశీ లో ఉండే గంగా నదికి సొరంగమార్గం  ఉందని అంటారు.....కానీ అంతు లేని ఈ కోనేరు అంటే చిన్నప్పుడు నాకు చాలా భయం :( 


ఇప్పుడు మా వూళ్ళో మా వాళ్ళు ఎవరూ లేరు....అందరూ పొలాలు,ఇళ్ళు అమ్ముకుని గుంటూరు,విజయవాడ,ఒంగోలు, హైదరాబాదు  ఇలా తలోదిక్కు వెళ్ళిపోయారు....అమ్మమ్మ కూడా పొలాలు,మా ఇల్లు అమ్మేసి గుంటూరు వచ్చేసింది.....కానీ ఇప్పటికి నేను,తమ్ముడు గోల పెడుతూ ఉంటాం 'మన వూరి గుడికి వెళ్లి వద్దాం!! 'అని. కానీ 'ఎవరులేని ఆ ఊరికి నేను రాలేను....మన ఇల్లు కూడా లేదు....నాకు బాధ గా ఉంటుంది' అని అమ్మ వద్దు అంటుంది....కానీ క్రితం సంవత్సరం 'శివరాత్రి' రోజున ఎలాగో అలా మా అమ్మని ఒప్పించి మా గుడికి తీసుకెళ్లా.....అక్కడ శివునికి అభిషేకం చేస్తుంటే ఎంత ఆనందమేసిందో.....అలాగే మా పొలాలు,ఇల్లు,కాలువ,రామాలయం,మా అమ్మ చదువుకున్న బడి అన్నీ చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుని తిరిగి వచ్చేసాం...మళ్ళి ఎప్పుడు వెళ్తానో మా ఊరికి!!


మా ఊరి చిత్రాలు కొన్ని ఇక్కడ :







15, ఆగస్టు 2010, ఆదివారం

జెండా పండుగ

63వ స్వాతంత్ర్య దినోత్సవం...
మనకి స్వాతంత్ర్యం వచ్చి అప్పుడే ఇన్ని సంవత్సరాలు అయిపోయిందా??? మరి గాంధీగారు కలలు కన్న నవీన భారతం ఏది?? ఇప్పటికైతే ఆ దాఖలాలేమి లేవు బహుశా ఇంకో  63 ఎండ్లకి అయినా ఆయన కోరుకున్న 'రామరాజ్యం' ఏర్పడుతుందో లేదో !!!


జెండా పండగ అంటే...ఒక జాతీయ సెలవు దినం.....చిన్నపిల్లలు చాక్లేట్లకి,పెద్దవారు హాయిగా టి.వి లో వచ్చే సినిమాలు చూడడానికి లేక వరుస  సెలవులు వస్తే ఊళ్ళు తిరగడానికి,రాజకీయనాయకులు దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపి అర్ధం లేని సందేసాలివ్వడానికి,ఉగ్రవాదులు ఈ రోజున అది పేల్చేస్తాం ఇది పేల్చేస్తాం అని బెదిరించడానికి,మన సైన్యం సగానికి సగం తుప్పుపట్టిపోయిన మన ఆయుధసంపదను గొప్పగా ప్రదర్శించడానికి,ఇక టి.వి చానళ్ళ వాళ్ళు 'గొప్ప గొప్ప' ప్రోగ్రాములు చేసి తమ చానళ్ళ టి.ఆర్.పి రేటింగులు పెంచుకోడానికి.......ఇవేగా జరిగేది....ఇంతేగా మనకోసం ప్రాణత్యాగం చేసిన ఎంతో మంది అమర వీరులకు మనం  ఇచ్చే  నివాళి!!!


దేశం ఎంతో అభివ్రుది చెందింది,చెందుతోంది అంటారు...నిజమే!! శాస్త్ర-సాంకేతికరంగాల్లో,విద్య-వైద్య రంగాల్లో,ఆర్ధిక-సామాజిక రంగాల్లో ఇలా చాలా విషయాల్లో అభివ్రుది చెందింది....కానీ ఆ అభివ్రుది ఫలాలు అనుభవించేది కొందరు మాత్రమె...దార్రిద్ర్య రేఖ దిగువున ఉన్నవారికి ఇవేమీ పట్టవు....కడుపునిండా తిండి,ఉండటానికి ఒక నీడ,తాగడానికి గుక్కెడు నీళ్ళు....ఒక మనిషి బ్రతకడానికి కనీస వసతులైన వీటిని కల్పించలేని మన దేశం ఎంత అభివ్రుది చెందితే ఏంటి??? ఎన్ని రంగాల్లో పురోగమిస్తే ఏంటి??? అన్నీ అందరికీ సక్రమంగా అందినపుడే అభివ్రుది అంటాము....యే ఒక్క వర్గమో  ప్రాంతమో బాగుపడితే దేశం మొత్తం బాగుపడినట్టు కాదు...ఎవడి స్వార్ధం వాడిదే తప్ప పక్క వాడి గోడు మనకు అనవసరం అనుకునే మనుషులు ఉన్నంత కాలం అభివ్రుది అన్నది సూన్యం...


 ఈ 63 ఏండ్లలో మన వాళ్ళు సాధించిన ఘనకార్యాలు ఏమిటయ్యా అంటే..... కుళ్ళురాజకీయాలు... లంచగొండితనం.... అక్రమార్జనలు....ఉగ్రవాదం....నేరాలు.....కుంభకోణాలు.....కల్తీ....కుల-మత-వర్గ పోరాటాలు.....దేశాన్ని ముక్కలుగా చేసే ప్రయత్నాలు....అరాచకాలు...అక్రమాలు...ఇంకా చాలా చాలా.....ఇందుకోసమే ఐతే స్వాతంత్ర్యం ఎందుకు?? బ్రిటిష్ వారి పాలనకి మన ప్రస్తుత నాయకుల 'సుపరిపాలన' కి ఏముంది పెద్ద తేడా????


ఈ రోజున కనీసం ఒక్క నిమిషం నేను ఈ దేశానికీ ఎం చేశాను??? నావల్ల ఒక్కమనిషి అయినా సంతోషంగా ఉన్నాడా?? నేను నా జీవితం లో ఒక్కరికైనా స్వార్ధరహితంగా సేవ చేశానా?? అని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకుంటే కర్తవ్యమ్ అదే బోధపడుతుంది....ఈ దేశాన్ని ఎవరో బాగుచేయలేరు చేయరు కూడా!!...మనమే చేసుకోవాలి.....ఇందుకోసం నలుగురితో కలిసి అయినా ఒంటరిగా అయిన చేసే చిన్ని ప్రయత్నం కూడా వృధా పోదు.....ఎంత పెద్ద సముద్రం అయిన చిన్ని నీటి బిందువు తోనే మొదలయ్యేది....దేశం కోసం చేసే సేవ లో చిన్న-పెద్ద తేడాలు ఉండవు...స్వార్ధ్రహితంగా ఇతరుల హితం కోసం చేసే చిన్ని సేవ అయినా దేశ సేవే.....ఇదే మనకోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్యవీరులకు అర్పించే ఘనమైన నివాళి!!!!

14, ఆగస్టు 2010, శనివారం

సాగర్ రోడ్డు లో ....

నాకు చాలా ఇష్టమైన,ఎన్నో జ్ఞాపకాలు గుర్తుచేసే సాగర్ రోడ్ ....అందులోని కొన్ని విశేషాలని  ఇక్కడ వ్రాస్తున్నా....


మేము గుంటూరునించి  ఎప్పుడు హైదరాబాదు వెళ్ళాలన్నా...విజయవాడ,నల్గొండ వైపు ఉన్న రహదారులు కాకుండా ఈ సాగర్ రోడ్డు మార్గాన్నే ఎంచుకునేవాళ్ళం....ప్రయాణ సమయం కొంచెం ఎక్కువే అయినా పెద్దగా ట్రాఫిక్ అంతరాయం లేకపోవడం,ఇంకా కనువిందైన సాగర్ అందాలు చూడవచ్చు  అనే ఉద్దేశం తో ఎక్కువగా ఈ దారినే వెళ్ళే వాళ్ళం.....మొన్న అమ్మ వాళ్ళు హైదరాబాదు వెల్లాల్సివచ్చినపుడు ఈ దారిగుండా వెళుతూ అంతకుముందు నేను వారితో కలిసి ప్రయాణం చేసిన జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకున్నారట.....ఇవాళ ఫోన్ చేసినపుడు  దానిగురించి చెప్పారు....అలా సాగర్ రోడ్ గురించి ఆలోచిస్తుంటే ఈ బ్లాగ్ రాయాలనిపించింది....

గుంటూరు నుంచి పిడుగురాళ్ళ-మాచెర్ల-సాగర్-మల్లేపల్లి-మాల్-ఇబ్రహింపట్నం మీదుగా హైదరాబాదు చేరుకునే ఈ రోడ్డు ఈ మధ్యే ఎక్కువ వాడుతున్నారు...గుంటూరు నించి సాగర్ దాక చిన్న చిన్న ఊళ్లు తగులుతూ ఉంటాయ్ కానీ సాగర్ నించి ప్రయాణం కొంచెం విసుగనిపిస్తుంది....అక్కడక్కడ విసిరేయబడ్డట్లు  ఉండే ఊళ్లు,చుట్టూ ఎంతమేరకు చూసినా మట్టిదిబ్బలు కనిపిస్తాయి...కానీ సాగర్ వరకు, ఇంకా సాగర్ దగ్గర ప్రయాణం భలే కులాసాగా సాగుతుంది....


గుంటూరు లో బయలుదేరి....అలా సత్తెనపల్లి మీదుగా వస్తూ దూరంగా కనిపించే 'కొండవీటి కొండల' అందాలను ఆస్వాదిస్తూ...చుట్టూ పచ్చని పొలాలు,మధ్యలో తగిలే వాగుల సొగసులు చూస్తూ.....పిడుగురాళ్ళ 'రావిళ్ళ'హోటల్లో ఒక చిన్న విరామం తీసుకుని కాసిని చాయ్ తాగి...అలాగే ముందుకెళ్ళి మాచర్ల లో మెయిన్ రోడ్డు మలుపు మీద పెట్టిన బజ్జీల కొట్టు లో చాలా ఘాటుగా ఉండే 'మిరపకాయ బజ్జీలు' తిని ఇక సాగర్ వైపు సాగటం మొదలుపెడతాం...ఈ దారి అంతా  మలుపులు మలుపులు గా ఉండి చుట్టూ చిట్టడవులతో భలే ఉంటుంది....ఇక్కడ చిరుత పులులు కూడా తిరుగుతాయట!!( 'శ్రీశైలం-సాగర్ రాజీవ్ పులుల అభయారణ్యం' ఇక్కడే మొదలవుతుంది)...నాకైతే చిన్న చిన్న కుందేలు పిల్లలు ఇంకా తెలుపు-నలుపు నక్కలు కనపడ్డాయ్(ముందు నక్కల్ని చూసి కుక్కలు అనుకున్నా... తరువాత మా డ్రైవెర్ చెప్పాడు అవి నక్కలని వాటి తోక కుచ్చుగా  ఉంటుందని!!!)


ఇక అల్లంత దూరం లో సాగర్ డ్యాం వస్తుందనంగా దూరంగా,లోతుగా కృష్ణానది కనిపిస్తుంది......ఒకవేళ డ్యాం గేట్లు తెరిచి ఉంటే ఆ నీటి ఒరవడికి తుంపర్లు చాలా దూరం వరకు  ఎగసిపడతాయి...దగ్గరకి వెళ్లేకొద్ది కనిపిస్తుంది అద్భుతమయిన నాగార్జున సాగర్ డ్యాం....గుంటూరు-నల్గొండ సరిహద్దుల్లో కట్టిన 'మానవ నిర్మిత మహా సాగరం' ఈ సాగర్ డ్యాం....ఎంతో ఎత్తులో విశాలంగా కట్టిన సాగర్ డ్యాం ని చూస్తే కీ.శే.రాజశేఖర్ రెడ్డి గారు అనే 'ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు' అన్న మాట నిజమనిపిస్తుంది...ఇక్కడ  నది ఎంతో వేగంగా లోతుగా ప్రవహిస్తుంది...నది పై కట్టిన  ఎతైన వంతెన పై నిల్చుని సాగర్ ని అలా ఎంతసేపైన చూడాలనిపిస్తుంది...ఇక సాగర్ డ్యాం కి అటుపక్క వెళ్లి హైదరాబాదు వైపు మళ్ళితే వస్తుంది 'విజయవిహార్' అనే ఆంధ్రా పర్యాటకసేఖవారి వసతిగృహం...అక్కడ ఉండే హోటల్ వెనకవైపు 'సాగర్ బ్యాక్ వాటర్స్' అందం చూసి తీరవలసిందే కానీ చెప్పలేం.....హోటల్ కి 'వ్యూ' కనిపించాలని సాగర్ వైపు అంతా నిలువెత్తు అద్దాలు పెట్టారు.అక్కడ కూర్చుని సాగర్ అందాలూ చూస్తూ ఉండవచ్చు లేదంటే తలుపు తీసుకుని వెనక వైపు ఉన్న చిన్న తోట లోకి వెళ్లి చూడవచ్చు....అక్కడ నించి చూస్తే  అవతలి ఒడ్డు కనిపించనంత సువిశాలంగా నీలిరంగులో మెరిసిపోయే సాగర జలాలు....చీమల్లాగా  కనిపించే డింగిపడవలు.....మధ్యలో చిన్న చిన్న దీవులు....చూడటానికి ఎంత అందంగా ఉంటుందో ఆ ప్రదేశం....ఇక సంధ్యాసమయం ఐతే  వదిలి రాలేము.....నీలి రంగులో ఉండే సాగర జలాల్ని తన సింధూర వర్ణాలు రంగరించి నారింజ రంగులోకి మార్చి మెల్లగా దూరపు కొండల్లోకి ఒదిగిపోయే సూర్యుడిని చూసి మైమరచిపోవలసిందే......అనంతమైన  ఆ సాగరాన్ని చూస్తే అనిపిస్తుంది మనం ఎంత అల్పులం ప్రక్రుతి ముందు అని..అక్కడ రెస్టారెంట్ లో చేసే వేడి వేడి బ్రెడ్ పకోడీ  తిని కాసిని మసాల టీ తాగి బయలుదేరతాం.... 


ఇక ఆ తరువాత కబుర్లలో మునిగి తేలేలోగా లోగా 'మాల్' వస్తుంది...అక్కడ ఆదివారాలు  మన చందమామ కథల్లో సంతలాగా చిన్న సంత జరుగుతుంది మెయిన్ రోడ్డు మీదే అన్నీ రకాల వస్తువులు,తినుబండారాలు పెట్టి అమ్ముతుంటారు...కూరగాయలు చాలా తాజాగా ఉంటాయ్...మా అమ్మ ఎప్పుడు అటువైపు వెళ్ళినా చింతకాయలు,తెల్ల వంకాయలు,దోసకాయలు,చిన్ని చిన్ని మామిడికాయలు తీసుకోకుండా రాదు...ఇక అటు తరువాత మెల్లగా హైదరాబాదు చేరుకుంటాం.....


ఎంతో ఆహ్లాదం కలిగించే సాగర్ రోడ్ ప్రయాణం...ఒక్కసారైనా వెళ్ళవలసిందే...




సాగర్ డ్యాం 'బ్యాక్ వాటర్స్' దగ్గర తీసిన కొన్ని చిత్రాలు :)












12, ఆగస్టు 2010, గురువారం

నా సైకిలు కథ ..

మొన్న 'మర్యాద రామన్న' సినిమా కి వెళ్లాం..అందులో సైకిల్ చూడగానే నా సైకిల్ గుర్తుకొచ్చింది....నా  7వ తరగతి లో మా నాన్న నాకు 'సైకిలు' కొనిపెట్టారు...'చౌదరి సైకిలు షాపు' కి వెళ్లి నాకు కావలిసిన రంగులో నాకు నచ్చిన  'స్టిక్కర్లు' అంటించిన 'లేడి బర్డ్' సైకిల్ చూసి అది కావాలని నాన్నని అడిగాను...మరుసటి రోజుకల్లా అది మా ఇంట్లో ఉంది....నాకు 'లేడి బర్డ్' సైకిల్లో ముందు వుండే ఆ 'బుట్ట' అంటే భలే ఇష్టం...టి.వి లో 'లేడి బర్డ్' ప్రకటనలో ఆ బుట్టలో పూలు(ఆర్చిడ్స్,జేర్బరాలు) పెట్టుకుని ఒక  అమ్మాయ్ సైకిల్ తొక్కుతుంది...అందుకే నాకు అది భలే నచ్చేసింది....నేను అలాగే పూలు పెట్టుకుని సైకిల్ తొక్కాలని ఒకరోజు మా ట్యూషన్ సార్ వాళ్ళ ఇంట్లో పెరిగే 'వాటర్ లిల్లీస్' ని అడిగి తీసుకుని  ఆ బుట్ట లో పెట్టుకుని అచ్చు ప్రకటనలో చూపించినట్టే సైకిల్ తొక్కుకుంటూ ఇంటికొచ్చాను...ఆ రోజు ఎంత ఆనందమేసిందో...నా సైకిల్ కి తగ్గట్టు అందమైన కీచేయిన్ కొన్నాను...'ఎర్రగా హృదయాకారం లో చెక్కతో  చేసి అందులో మళ్ళి ఇంకో చిన్న బంగారు రంగు లో హృదయాకరపు బిళ్ళ పొదిగిన' కీచేయిన్ అది...ఎంతమంది అది చూసి బాగుంది అనేవాల్లో!!!!..నా అందమైన సైకిల్ కి మంచి జోడి అని మురిసిపోయేదాన్ని...

నాకు సైకిలు కొనేముందు చాలా తతంగం జరిగింది....ముందు నాకు సైకిల్ సరిగ్గా నడపడం రావాలి అనేది నాన్న నిబంధన....సరే అని కష్టపడి అప్పటికే సైకిల్ ఉన్న నా స్నేహితురాలు సాయిలక్ష్మి దగ్గర ఎలాగో అలా సైకిల్ నేర్చేసుకున్నా....పాపం ఆ అమ్మాయి కూడా ఏమి విసుక్కోకుండా చాలా ఓర్పు గా నాకు నేర్పింది...ఒకసారి ఆ అమ్మాయి సైకిల్ మీద కూర్చుని ఓ తెగ తోక్కేసుకుంటూ మా ఇంటిముందుగుండా ఝామ్మని పోతుంటే మా అమ్మ పిలిచింది.....అంతే సైకిల్ అదుపుతప్పి పక్కనే వున్న మురికి కాల్వ లోకి దూసుకేల్లిపోయా....సైకిల్ ఒక పక్క...నేను ఒకపక్క....నా కాళ్ళు బురదలో....హ్మ్!!! పాపం అలా ఆ అమ్మాయిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించి ఎలాగో అలా సైకిల్ తొక్కడం నేర్చేసుకుని మా నాన్న ముందు నా విద్య ప్రదర్శించి అప్పుడు కొనుక్కున్న సైకిల్  అది!!!!!

అలా 7వ క్లాసు నించి 10 వ క్లాసు  వరకు నా రధం(అదేనండి నా సైకిలు) మీద హాయిగా తిరిగేదాన్ని....అమ్మకి ఎమన్నా కూరగాయలు తేవడానికి,పచారి సామాను కి,నాన్న పూజకి కొబ్బరికాయ తేవడానికి,నేను ట్యూషన్ కి వెళ్ళడానికి,సరదాగా స్నేహితుల ఇంటికి వెళ్ళడానికి....ఇలా నా బుజ్జి సైకిల్ మీద చాలా పనులు చక్కబెట్టుకోచ్చేదాన్ని....కానీ మా నాన్న నా అత్యుత్సాహం చూసి ఇంకో నిబంధన విధించారు...'ఎప్పుడు చిన్న చిన్న రోడ్ల మీదే తొక్కాలి తప్ప మెయిన్ రోడ్ మీదకి వెళ్లొద్దు' అని....తప్పుతుందా!!! అలాగే ఆచరించా....దాని ఫలితంగా నాకు మెయిన్ రోడ్ మీద సైకిల్ తొక్కటం రాదు అని డిసైడ్ అయిపోయిన మా నాన్న నా ఇంటర్మీడియట్ లో నాకు 'స్కూటీ' కొన్నారు....కొన్నది నాకోసమే...కాని నడిపేది మా నాన్న...!!!! సైకిల్ తొక్కడం రాని నాకు బండి నడపడం అస్సలు రాదనీ గట్టిగా నిర్ణయించుకుని  ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా రొజూ తనే నన్ను కాలేజి దగ్గర దిగబెట్టే వారు....ఒక్కరోజు ఇవ్వమన్నా ఇవ్వలేదు....ఈలోగా నా బుజ్జి సైకిల్ ఇంట్లో అడ్డు అయిపొయింది...నాకు పోటిగా మా తమ్ముడు 8వ క్లాసులోనే సైకిల్ కొనడం...ఇంటర్మీడియట్ లోనే  బైక్ కొనడం వల్ల చిన్నగా గా ఉండే మా ఇంట్లో నాలుగు వాహనాలు ఎక్కువైపోయాయి....అందులోను ఎందుకు పనికి రాని నా సైకిల్ మీదే అందరి దృష్టి...'ఇంకా ఎందుకండీ?? అది వాడుతుందా పెడుతుందా??? ఇంట్లో అడ్డు తప్ప??' అని మా అమ్మ రోజు దాన్ని ఎలా బైటికి పంపించాలా అని ఆలోచించేది....

ఆ రోజు తొందరలోనే వచ్చింది....మా అమ్మ కి మెరుపు లాంటి ఆలోచన వచ్చి నా సైకిల్ ని ఉత్తి పుణ్యానికే(అంటే ఉచితంగా) మా కూరగాయల రమేష్ కి ఇచ్చేసింది.....ఆ రోజు రాత్రి కాలేజి నించి ఇంటికొచ్చిన నేను ఎంత ఏడ్చానో...'నా సైకిల్ నాకు కావలి' అని ఎంత గోల పెట్టానో...సైకిల్ ఇస్తే ఇచ్చింది....దాని కీచేయిన్ కూడా ఇచ్చేసింది......అది ఇంకా ఏడుపొచ్చింది....'కనీసం నా కీచేయిన్ అన్నా  ఇవ్వమను అమ్మ రమేష్ ని' అని అడిగేదాన్ని....ఉహు!! అది కుదరని పని.ఇక ఇంతేలే అనుకుని అలాగే కొన్ని రోజులకి నేనే సర్దుకుపోయా.....

సరిగ్గా నా ఇంటర్మీడియట్ చివరి రోజుల్లో ల్యాబ్ నించి బైటికి వస్తుండగా కనిపించింది నా బుజ్జి సైకిల్.....నా స్నేహితులందరికీ 'అదే నా సైకిల్!!! నేను చెప్తాను చూడు భలే ఉంటుంది అని ఇదే!!' అని అంటుంటే నన్ను వింతగా చూసారు......'నిజమే!!! కావాలంటే నా సైకిల్ తీసుకున్న మా కూరగాయల రమేష్ ఇక్కడే ఎక్కడో ఉంటాడు ఆగండి!!' అని చెప్పి చుట్టూ కలియచూసా.....అక్కడ ఉన్నాడు ఎవరితోనో మాట్లాడుతూ.....సరిగ్గా అపుడే నన్ను చూసి 'ఏంటి అమ్మాయిగారు ఇక్కడ?' అన్నాడు...'ఇదే మా కాలేజి' అని చెప్పా....'నా సైకిల్ ఎలా ఉంది రమేష్ ?' అని అడిగా ...'ఇది మీ సైకిల్ యే అమ్మాయిగారు!! చాలా బాగుందండి...ఇంతవరకు ఏమి రేపెయిర్లు రాలేదు' అన్నాడు...నేను ఒక నవ్వు నవ్వి,మా కోతి బ్యాచ్ వంక చూసి ,....చివరిసారి నా సైకిల్ ని  చూసుకుని అక్కడినించి వచ్చేసా....తరువాత వాళ్ళు వచ్చి 'ఇన్ని  రోజుల తర్వాత అన్ని సైకిల్లలో  నీ సైకిల్ ఎలా గుర్తుపట్టావే?? 'అని అడిగారు....నా బుజ్జి సైకిల్ ని నేను అసలు మర్చిపోతే కదా గుర్తుపెట్టుకోడానికి....ఇప్పుడు ఏమైపోయిందో.... ఎక్కడుందో !!!!

10, ఆగస్టు 2010, మంగళవారం

కళాశాలలో......

'బాల్యం'...అన్నటికంటే మధురమైన జ్ఞాపకాల దొంతర.....అమ్మ చేతి గోరుముద్దలు...నాన్న మందలింపులు.....బుల్లి బుల్లి  ఆటలు...చిట్టి పొట్టి పోట్లాటలు ....నిజానికి-అభాద్దానికి తేడా తెలియని వయసు.....అటు తరువాత వచ్చేది 'కౌమారం'....అన్ని తెలిసినట్టే ఉంటాయ్....కానీ ఏది తప్పో ఏది ఒప్పో స్పష్టంగా తెలియని విచిత్రమైన దశ.....ఈ వయసు లోనే అడుగుపెడతాం ఆశల  లోగిలి లోకి అదేనండి 'కళాశాల' లోకి....


నా 'ఇంటర్మీడియట్' ఎలా గడిచిందో కూడా నాకు గుర్తు లేనంత వేగంగా వెళ్ళిపోయింది....ఏవో చిన్ని చిన్ని  జ్ఞాపకాలు తప్ప గుర్తుంచుకునే విధంగా ఏమి లేవు...ఉన్నా అవన్నీ నా స్నేహితులతో గడిపిన తీపి గుర్తులు మాత్రమే...నేను బాగా ఆస్వాదించిన జీవితం అంటే నా 4 సంవత్సరాల 'ఇంజినీరింగ్' కళాశాల రోజులు .....నా స్నేహితులు....క్లాసులు..కంప్యూటర్ లాబ్స్....గ్రంధాలయం..కాంటీన్...ఇంకా మా బస్టాండ్..నా జీవితం లో మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఈ 4 సంవత్సరాల్లో చోటు చేసుకున్నాయ్....నాకున్న చాలామంది స్నేహితుల్లో ఎక్కువమంది ఇక్కడ పరిచయం అయినవారే....


రోజు పొద్దున్నే లేచి త్వరగా తయారై బస్సు స్టాప్ కి వెళ్ళడం...అక్కడ నాకోసం ఎదురుచూస్తున్న నా  స్నేహితులను కలవడం....ఒకవేళ బస్ దొరక్కపోతే నాన్న చేత 'స్కూటీ' మీద  బస్సు ని వెంబడించి మరీ  ఆపించి ఎక్కడం...తీరా బస్ ఎక్కాక  మా స్నేహితుల గ్యాంగ్ అంతా ఒకేచోట కూర్చోవాలి అనే నిబంధనను తు.చ తప్పకుండ పాటించాలి  కాబట్టి ఎలాగో అలా ఒక సీట్ లో 4-5 కూర్చొని 'కాలేజి' వచ్చేదాకా  కబుర్లు చెప్పుకోవడం..... వీలుంటే అలాగే ఎవరో ఒకరి  భుజం మీద వాలిపోయి నిద్రపోవడం....తీరా 'క్లాస్' కి వెళ్ళాక(హాజరు కోసమే వెల్తామనుకోండి అసలు) అక్కడ అధ్యాపకులు చెప్పేది అర్ధం కాక...ఏమి చేయాలో తెలియక....అసలేమి అర్ధం కానీ విషయాన్నీకూడా  అంత శ్రధగా  వింటున్న వారిని విచిత్రంగా చూడడం తప్ప ఏమి చేయలేక ...ఎప్పుడు ఈ నరకం అయిపోతుంది రా దేవుడా!!!! అని అనుకుంటూ ఉంటే....దేవతలా వచ్చే 'లంచ్ బ్రేక్' కి ఒక సలాం కొట్టి 'హమ్మయ్యా' అని ఊపిరి పీల్చుకుని  మా గ్యాంగ్ అందరిని తీసుకుని చివరాఖరు బెంచ్ కి వెళ్లి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ....ఒకరు తెచ్చిన  బాక్స్ మరొకరికి అందిస్తూ...అన్ని రుచులు చూసేసి..బాక్సులు ఖాళి చేసేసి...అలా ఒకసారి 'క్యాంపస్' అంతా చక్కర్లు కొట్టి 'క్యాంటీన్' లో కాసేపు గడిపి ఇక నిద్రాదేవి  ఆవహించే వేళ మళ్ళి  'క్లాసు' కి తిరిగి వచ్చి...అధ్యాపకుల వారు చెప్పే పాఠం జోలపాట లా లాలిస్తుంటే హాయిగా ఒక కునుకు తీసి మెలుకువ వచ్చేసరికి  సాయంత్రమయపోగా...ఎంచక్కా అందరం కలిసి 'క్యాంటీన్' కి వెళ్లి కబుర్లు చెప్పుకుంటూ యే బజ్జీలో,పునుగులో,నూడిల్సో,ఫ్రైడ్ రైసో తినేసి ఒక చల్ల చల్లటి శీతలపానియమ్ తాగేసి...మళ్ళి తిరిగి మా బస్సుల దగ్గరకి వచ్చి..... మా జాగాలో కూర్చున్న వారిని కనుసైగలతోనే అక్కడినించి లేపేసి...హాయిగా బ్యాగ్లు ఒకపక్కన పడేసి మళ్ళి కబుర్లలో మునిగిపోయి తేలే లోగ మా బస్టాండ్ వచ్చేస్తుంది....ఇక అక్కడితో ఆ రోజు ముగిసినట్టేనా అంటే ఎలా?? మళ్ళి ఇంటికి వెళ్లి హాయిగా సోఫా లో చేరగిల పడి ఒకపక్క టి.వి చూస్తూ...ఇంకో పక్క పొద్దున్న జరిగిన విషయాలు సెల్లు ద్వారా ముచ్చటించుకుంటూ,సందేశాలు పంపుకుంటూ.....అన్నపానాలు ధ్యాసే లేకుండా కబుర్లు చెప్పుకుని...చెప్పుకుని....రేపటి ఉదయం కోసం ఎదురు చుస్తూ నిద్రలోకి జారుకోవడంతో ఆ రోజు ముగుస్తుంది....


ఇలా ఎంతో హాయిగా సాగిపోయాయి నా 'ఇంజినీరింగ్' రోజులు....మళ్ళి రావు కదా!!! మళ్ళి తిరిగి వస్తే బాగుండు...వచ్చి అలాగే ఉండిపోతే బాగుండు....జీవితం ఆ దశ లోనే ఆగిపోతే బాగుండు.....!!!!!!!!!

9, ఆగస్టు 2010, సోమవారం

ట్విట్టర్...ట్విట్టర్...

'ట్విట్టర్'...ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పదమే కనిపిస్తోంది....వినిపిస్తోంది..
సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఈమధ్య మన దేశం లో వీరవిహారం చేస్తున్నాయ్....'ఆర్కుట్','ఫేస్ బుక్','హై 5','మైస్పేస్', ఆ జాబితాలోకే వస్తాయి...కాని వీటిల్లో  'ఆర్కుట్' దే పైచేయి....విదేశాల్లో 'ఫేస్ బుక్' కి మంచి ప్రాచుర్యమున్నా ఎందుకో మరి ఇండియా లో 'ఆర్కుట్' కే బ్రహ్మరధం పట్టారు మనవాళ్ళు....చాలా మంది వీటికి వ్యసనపరులు కూడా అయిపోయారనుకోండి !!!


తరువాత కొంతకాలానికి 'బ్లాగు' ల పర్వం మొదలయింది....చెప్పాలంటే...'అమితాబ్ బచ్చన్' గారు బ్లాగులకి చాలా ప్రాచుర్యం కల్పించారు....తన సినిమా సంగతులు....కుటుంబ విషయాలు....ఇలా అన్ని బ్లాగు రూపం లో తెలియచేసేవారు...ఇక అప్పటినించి చాలామంది బ్లాగు ని తమ అభిప్రాయాలకు రూపం గా తీర్చిదిద్దడం మొదలుపెట్టారు.కొంతమంది ప్రముఖుల బ్లాగుల వల్ల కొన్ని గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి...కానీ.. భాషని,సంస్కృతీ ని,సాహిత్యాన్ని కాపాడుకోవడానికి....తమకి తెలిసిన విషయాలను అందరికి తెలియచేయడానికి....కళలకు ప్రాచుర్యం కల్పించడానికి...ఇలా బ్లాగు అన్నో విధాలుగా ఉపయోగ పడుతోంది....ఈ 'కంప్యూటర్' యుగంలో కూడా మన సంస్కృతీ -సాంప్రదాయాలకు విలువనిచ్చి సాహిత్య సుమగంధాలను అందరికి అందిస్తోన్న బ్లాగు మరియు బ్లాగర్లకు వందనాలు....


అటు తరువాత బాగా ప్రాచుర్యం పొందినది ఇదిగో ఈ 'ట్విట్టర్' యే.....హాలీవుడ్ నించి టాలివుడ్ దాక విస్తరించిన ఈ కొత్త సంసృతికి తెరలు తీసింది సినిమా జనమే అయినా ఇపుడు ఇంచుమించు దేశం లో ఉన్న ప్రతి  ప్రముఖ వ్యక్తికీ ఒక 'ట్విట్టర్' అకౌంట్ ఉండడం పరిపాటి అయిపొయింది...తమ రోజువారి కార్యక్రమాలు... అభిప్రాయాలు... అభిరుచులు.... అన్నీ ఈ 'ట్విట్టర్' లో పోస్ట్ చేయడం.... అవి చూసి అభిమానులు మురిసిపోవడం జరుగుతోంది... కొన్ని సైట్లు అయితే ప్రముఖులు చేస్తోన్న తాజా 'ట్వీట్స్' సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి. మన రాష్ట్రం లో  ఈ 'ట్విట్టర్' కి విశేష ఆదరణ కలిగించి 'ట్విట్టర్ బాబు' అనే ముద్దు పేరు కూడా దక్కించుకున్న మహేష్ బాబు.....త్వరలో విడుదల కాబోయే తన కొత్త సినిమా విశేషాలని,'లోగో' ని ,అందులో తన చిత్రాల్ని కూడా 'ట్విట్టర్' ద్వారానే తన అభిమానులకి అందించారు... తమ అభిమాన హీరో/హీరోయిన్ కి స్వయంగా తామే  సందేశం పెట్టవచ్చు అనే ఆనందం లో అభిమానులు 'ట్విట్టర్' లో తమ అకౌంట్లు క్రియేట్ చేసుకుని వారిని 'ఫాలో' అయిపోతున్నారు... ఇలా ఇపుడు దేశమంతా 'ట్విట్టర్' మానియా మొదలయింది.....


కాని...'ట్విట్టర్' వల్ల కొంత మేలు కూడా జరుగుతోంది...మొన్న 'పులి' చిత్రం  ఆడియో రిలీజ్ అయ్యాక మహేష్ బాబు పవన్ కళ్యాన్ కి శుభాకాంక్షలు తెలిపి  'ఆల్ ద బెస్ట్' చెప్పడం...'మర్యాద రామన్న' లో సునీల్ చాల బాగా చేసాడని కితాబివ్వడం...... 'ఆయేషా' సినిమా రిలీజ్ అపుడు సోనం కపూర్ కి జెనిలియా  శుభాకాంక్షలు తెలియచేయడం .....ఇదంతా చూస్తోంటే తారల మధ్య వైషమ్యాలు తొలగుతున్నట్టు ఉంది.ఎటువంటి భేషజాలు లేకుండా ఒకరిని ఒకరు అభినందించుకోవడం .......ప్రోత్సహించుకోవడం అనేది సుభాపరిణామం ......ఇంకా ముందు ముందు 'ట్విట్టర్' ఎన్ని మాయలు చేస్తుందో  చూడాలి  :)


'ట్విట్టర్' అనేది ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లు లాగ వ్యసనం కాకుండా  మనుషుల మధ్య  దూరాలు తొలగించి దగ్గరకు చేర్చే వారధి కావాలని ఆశిస్తున్నా......

8, ఆగస్టు 2010, ఆదివారం

తిరుమల కాలిబాట ...



పరమ పవిత్రమైన తిరుమల కాలిబాట లో  చిరుత చిన్నారుల పై దాడి చేయడం...అదీ ఒకసారి కాకుండా రెండు సార్లు చేయడం......చాల బాధాకరమైన విషయం...


నాకు తిరుమల కాలిబాట అంటే చాలా ఇష్టం...నేను మొట్ట మొదటి సారి మా వరలక్ష్మి ఆంటీ వాళ్ళతో కలిసి కొండకి నడిచి వెళ్ళాను....నేను,అమ్మ,నాన్న,తమ్ముడు,ఇంకా ఆంటీ వాళ్ళ కుటుంబం,వాళ్ళ బంధువులు మొత్తం 11 మంది....అసలు అంతమంది తో వెళితే ఆ సందడే వేరు....సరదాగా కబుర్లు చెప్పుకుంటూ....మధ్యమధ్యలో ఆగుతూ.......అలుపు తీర్చుకుంటూ.....అడవి అందాలను ఆస్వాదిస్తూ....ఎంతో కులాసాగా సాగింది నా మొదటి తిరుమల కాలిబాట ప్రయాణం...నేను చివరిసారిగా కొండకి నడిచి వెళ్ళింది కూడా ఆంటీ వాళ్ళతో కలిసే...మొదటి సారి తిరుమల కాలిబాట ఇంత బాగుంటుందా!! అని అనిపించింది....రెండవసారి అంతకుమించిన అందాన్ని ఆ వేంకటేశ్వరుడు మాకు ప్రసాదించాడు...అదే సన్నని చిరుజల్లులు...పచ్చని  కొండలని అలా  సుతారంగా తాకి వెళుతున్న తెల్లని  మేఘమాలికలు.....వాటిని చీల్చుకుని నేను ఉన్నాను అంటూ అప్పుడప్పుడు పలకరిస్తున్న సూర్యభగవానుడు.....వర్షపు జల్లులో తడిసి మెరిసిపోతున్న తిరుమల గిరుల సోయగాలు...చూసితీరవాల్సిందే కాని వర్ణనాతీతం...అలా వర్షం లో తడుస్తూ....పవిత్రమైన ఆ కాలిబాట వెంట సాగిన మా ప్రయాణం అనిర్వచనీయం...


ముందుగా అలిపిరి దగ్గర లగేజి చక్ చేసి...కొబ్బరికాయ కొట్టి కాలిబాటన మా నడక మొదలుపెట్టాము...అమ్మ,నాన్న బస్సు లో కొండపైకి చేరుకుంటామని మమ్మల్ని జాగ్రత్తగా రమ్మని చెప్పి వెళ్ళిపోయారు....ఇక మిగిలింది ఆంటీ వాళ్ళు 4 గురు ,నేను,తమ్ముడు.....అంతకుముందు కాలిబాట వెళ్ళినప్పటి సంగతులు నెమరువేసుకుంటూ....మనసులో గోవిందనామాల్ని స్మరించుకుంటూ...ఒక్కోక్కమెట్టు అధిరొహిస్తూ ఆ శ్రీనివాసుడ్ని ఎప్పుడు చూస్తామా అని అనుకుంటుండగా...సన్నని తుంపర్లు మొదలయ్యాయి....ముందు అంకుల్ కంగారు పడ్డారు.....సవ్యంగానే సాగుతుందా ప్రయాణం అని.....'ఎం పర్లేదండి...అంతా ఆ వెంకటేస్వరుడే చూసుకుంటాడు ' అని మా ఆంటీ ధైర్యం చెప్పగా వడివడి గా ముందుకు సాగము....చెప్పాలంటే....వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది....కాలిబాట మీద దేవస్థానం  వారు ఏర్పాటు చేసిన షెల్టర్ ఉన్నందువల్ల ఎటువంటి అసౌకర్యం కలగలేదు...కాని మార్గం మధ్యలో కొన్ని చోట్ల షెల్టర్ ఏర్పాటు  చేయలేదు...అక్కడ కొద్దిగా తడిసాము....


ఒకచోట జింకల పార్కు కనిపించింది....ఇక ఆగుతామా!!....వాటికి మాతో తీసుకువ్చిన మొక్కజొన్నలు..కారెట్లు....అక్కడ ఉన్న గడ్డి....ఎవరికీ ఏది దొరికితే అది పెట్టేసాము....మా ఆంటీ వాళ్ళ పిల్లలు చాలా  ఆనందించారు అవి చూసి....కాలిబాట నడిచే భక్తులకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి ఈ జింకలు(ఇప్పుడు ఆ జింకలను వేరే చోటికి తరలిస్తున్నారంటే బాధేస్తోంది)....తరువాత ఒక చోట చిన్న దుకాణాల సముదాయం కనిపించింది...అక్కడ వేడి వేడి బజ్జీలు వేస్తున్నారు....గుంటూరువారం మరి  బజ్జీలు తినకుండా ఉంటామా!! అంకుల్ వెళ్లి  బజ్జీలు ఆర్డర్ ఇచ్చారు... అందరం అక్కడ ఉన్న కుర్చిలలో కుర్చుని  అడవి గాలిని అందులో కలిసి వచ్చే మట్టివాసనను  ఆస్వాదిస్తూ ఉండగా మొదలైంది పెద్ద వర్షం...అందరు ఎక్కడికక్కడ సర్దుకుపోయారు....ఈలోగా మాకు బజ్జీలు వచాయి....ఆ వర్షం లో కొంచెం కొంచెం తడుస్తూ..వేడి వేడి బజ్జీలు తింటుంటే...ఆహ!! స్వర్గమే....కాసేపటికి ఆ జడివాన శాంతించింది..ఈ లోగ మేము కాసిని వేడి టీ కూడా త్రాగి తిరిగి మా నడక కొనసాగించాము....


ఇక అటు తరువాత ఘాట్ రోడ్ మీద కాసేపు మా నడక సాగింది.....అక్కడ కొండల పక్కన నడుస్తుంటే మేఘాల్లో ఉన్న భావన కలిగింది....కొండల మీద మొత్తం తెల్లటి మబ్బులు పరచుకున్నాయి....దూరంగా ఉన్న పెద్ద పెద్ద గాలిమరలు....ఎదురుగా కొద్ది దూరంలో ఉన్న మనుషులు.... ఏమి కనిపించట్లేదు.....సన్నని జల్లు....చుట్టూ పొగలాగా తెల్లటి మేఘాలు అలా మమ్మల్ని తాకుతూ వెళ్ళాయి... మేఘాల్లో తేలిపోవడమంటే  ఇదేనేమో !!!!.భలే ఆనందమనిపించింది.......దేవదేవుడిని చూడటానికి వెళ్తున్న మాకు ప్రక్రుతి ప్రసాదించిన వరం లా అనిపించింది.....అలా మేఘాల్లో నడుస్తూనే మోకాళ్ళ పర్వతం చేరుకున్నాం....అక్కడ కూడా పరిస్థితి ఇంతే ......చాలా ఆహ్లాదంగా ఎటువంటి శ్రమ,చిరాకు,అలసట లేకుండా మా ప్రయాణాన్ని ఇంత నయనానందకరంగా చేసిన ఆ గోవిందునికి మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంటూ....మా యాత్రను ముగించాము...కేవలం 4 గంటలలో తిరుమల చేరుకున్నాం.......మనసు ఆనందంగా ఉందేమో దేహం కూడా పెద్దగా బాధించలేదు....కాళ్ళు నొప్పి కూడా పెద్దగా లేదు....ఆ మరుసటి రోజు కళ్యాణ సేవకి వెళ్లి కన్నులపండువగా జరిగిన దేవుడి పెళ్లిని చూసి అటు పిమ్మట శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి బయలుదేరాము.....దివ్యవిగ్రహ రూపుడైన ఆ స్వామిని దర్శించి,పులకించి....భక్తిపారవశ్యం తో బయటకు వచ్చాము.....


'ఎంత ఆహ్లాదమైన యాత్ర!' అనిపించింది.....తిరుమలకి ఎన్నిసార్లు వచ్చినా  కాలినడకనే స్వామిదర్సనం చేసుకోవాలనిపించింది....కాని మొన్న తిరుమలలో చిరుత జరిపిన దాడి చూసి చాలా బాధేసింది....ఎంతో నమ్మకంతో కొన్ని వేలమంది భక్తులు నిరంతరం కాలిబాటన తిరుమల చేరుకుంటారు.....రాత్రి పగలు అని తేడా లేకుండా ఎల్లప్పుడూ  భక్తుల గోవింద నామాలతో ప్రతిధ్వనించే తిరుమల కాలిబాట లో ఇలా జరగడం ఏంటో!!......ఇది సరైన భద్రత కల్పించని అధికారుల తప్పా??? లేక జనారణ్యం లోకి వచ్చి అలజడి సృష్టిస్తున్న చిరుత తప్పా???


ఏది ఏమైనా ఇకమీదట ఇలాంటివి జరగకుండా చూడాల్సిన భాద్యత భద్రతా అధికారుల పై ఉంది.....చిరుతని పట్టేసాముగా అని అధికారులు అనొచ్చు....కాని.....అప్రమత్తత అనేది అన్నివేళలా అవసరం....


ఈసారి కూడా నేను కాలిబాటనే తిరుమల కొండకి వెళ్దామనుకుంటున్నా....పులి వచ్చినా...ఏమైనా..... ఆ వేంకటేశ్వరుడు ఉన్నాడుగా...... :)

మేము కాలిబాట న వెళ్ళినపుడు తీసిన కొన్ని చిత్రాలు....
















7, ఆగస్టు 2010, శనివారం

అమెరికాలొ మరోసారి

మల్లాది గారు వ్రాసిన 'ట్రావెలాగ్'...
మొన్ననే చదవడం పూర్తయింది....ఈ పుస్తకం కొని సంవత్సరం అయింది....ఈ ఏడాది లో 4-5 పుస్తకాలు పూర్తి చేసి ఉంటా చదవడం...కాని ఎందుకో మరి ఇది ఇన్ని రోజులు పట్టింది...(పుస్తకం పెద్దదేమీ కాదు...అనాసక్తంగా కూడా ఏమి లేదు).... బహుశా అమెరికా వచ్చేవరకు చదువుతూనే ఉండాలని రాసిపెట్టుందేమో...
ఇక మల్లాది గారి రచనల గురించి తెలిసిందే...
సున్నితంగా...సునిశిత హాస్యం తో...ఎంతో విశ్లేషించి వ్రాస్తారు....
ఆ కోవ లోకే వస్తుంది ఈ పుస్తకం కూడా..


వారి అమ్మాయి చదివే విశ్వవిద్యాలయం లో జరిగే స్నాతకోత్సవానికి వెళ్ళిన  మల్లాది గారు అక్కడ గడిపిన ౩ నెలల ౩ రోజుల అనుభవాలని పొందికగా ఈ పుస్తకం లో ఆవిష్కరించారు....


అమెరికా విశేషాలు....అక్కడ జీవన విధానాలు....అక్కడ నివశిస్తున్న తెలుగు వారి సంగతులు ....అమెరికన్ల తీరు...  తను ఇదివరకు చూసిన అమెరికా కి ఇప్పటి అమెరికా కి సారూప్యత...ఇలా ప్రతి అంశాన్ని స్పృశిస్తూ....విశేదీకరిస్తూ....వ్రాసిన చక్కని పుస్తకం ఈ 'అమెరికాలొ మరోసారి'...


ఈ పుస్తకం చదవడం వల్లేమో నాకు అమెరికా కి కొత్తగా వచ్చిన భావనే లేదు....అంతా ఇంతకుముందు  చూసినట్టు గానే ఉంది....అంతేకాక అమెరికా లో ఉండి  తెలుగు సంస్కృతీ ని కాపాడటం కోసం కృషి చేస్తోన్న  'కిరణ్ ప్రభ ','వంగూరి చిట్టెన్ రాజు' గార్ల వంటి ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం  కలిగింది...


ఈ పుస్తకం చివరలో మల్లాది గారు ఒక మాట వ్రాసారు....'భౌతిక సుఖాలకి అమెరికా...ఆధ్యాత్మిక ప్రగతికి ఇండియా ని మించినవి లేవు' అని..... నిజమే అనిపిస్తోంది....


చాల ఆహ్లాదంగా సాగిన మంచి 'ట్రావెలాగ్' ఈ 'అమెరికాలొ మరోసారి'.........

స్మరణం


శ్లో|| కృష్ణాంగ మాధుర్య సింధు...సుమధుర ముఖ ఇందు.....అతి మధు స్మిత సుకిరణే.....

అంటే....
పరమాత్మ స్వరూపుడైన కృష్ణుడు 'మహా సాగరం' వంటి వాడు...అతని యొక్క దివ్య ముఖారవిందం సముద్రం నించి ఉద్భవించిన చంద్రుని వలె ఉంటుంది.....అతని యొక్క చిరునవ్వు మధురాతిమదురంగా ఉండి వెన్నెల కిరణాల వలె ప్రసరిస్తుంది....