31, ఆగస్టు 2010, మంగళవారం

ఆర్చర్డ్ లేక్ దగ్గర...

రోజూ సరదాగా అలా ఆర్చర్డ్ లేక్ కి వెళ్ళడం నాకు,చందు కి అలవాటు ....
రోజులాగే  మొన్న రాత్రి 9  గంటలకి అలా ఆర్చర్డ్ లేక్ వైపు వెళ్ళాం....పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజు కాబోలు..చంద్రుడు ఇంకా కనపడలేదు...'అరె!! పైన్ చెట్ల గుబురుల నించి తొంగి చూస్తూ...ఆర్చర్డ్ లేక్ లో అందంగా ప్రతిబింబించే  చందమామ ని చూద్దామంటే లేదేమిటబ్బా?? ' అనుకుంటూ అలాగే మెల్లగా కార్ లో అలా ఆ సరస్సు చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి 'ఇక ఇవాల్టికి వచ్చేలా లేడు లే ఇంటికి వెళ్దాం' అని అనుకుంటుండగా...ఎందుకో మళ్లీ వెనక్కి వెళ్ళాలనిపించింది....సరే అని కార్ రివర్స్ చేసి మళ్ళి ఆర్చర్డ్ లేక్ ప్రదక్షిణ మొదలుపెట్టాం.....ఇక అలా సరాసరి ఇంటికేల్లిపోదాం అనుకుంటుండగా....ఏదో పెద్ద శబ్దం  వినిపించింది...కార్ డిక్కీ లో ఎమన్నా ఉన్నాయా?? అని అనుమానమొచ్చింది...కానీ ఆ రోజు పొద్దునే 'నమస్తే' లో కావలసినవి కొనుక్కుని వచ్చినపుడు అన్నీ నేనే దగ్గరుండి లోపల  పెట్టా...ఇక ఆ తరువాత బైటికి వెళ్ళలేదు....కాబట్టి లోపల ఏమి ఉండే ఆస్కారం లేదు....సరేలే ఏదో శబ్దం లే అని చెప్పి ఇంకా కొంచెం ముందుకేల్లాం....మళ్లీ శబ్దం....ఈసారి కొంచెం పెద్దగా.....మళ్లీ కాసేపు నిశ్శబ్దం ...ఆ తరువాత ఇక ఆపకుండా శబ్దం  వస్తూనే ఉంది.....నాకు ఒక్కనిమిషం ఏమి అర్ధం కాలేదు....రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది చుట్టూ అంత ఎత్తున   పైన్  చెట్లు...ఎక్కడనించి ఈ శబ్దం అనుకుంటూ ఉండగా....'వ్యూ' మిర్రర్ లోనించి కనిపించాయి ఆకాశం లో తారాజువ్వలు......'చందూ!!...ఫైర్ వర్క్స్!!....పదా వెనక్కి తిప్పు కార్ ని త్వరగా ' అని హడావిడి పెట్టేసా ....ఆర్చర్డ్ లేక్ వైపు కార్ పోనివ్వమన్నా...అక్కడైతే బాగా చూడొచ్చు అని....తీరా వెళ్లి చూస్తే....ఆర్చర్డ్ లేక్ మధ్యలో రెండు పడవల్లో నించి ఆకాశం లోకి తారాజువ్వలు వేస్తున్నారు......లేక్ ఒడ్డు కి వెళ్లి అక్కడున్న చిన్న దిమ్మ మీద కూర్చుని అలా ఆకాశం లోకి చూస్తూ ఉండిపోయాం....అంత దగ్గరగా.....పెద్ద పెద్ద తారాజువ్వలు అదే మొదటిసారి నా జీవితం లో చూడటం...నల్లటి ఆకాశం లో రంగురంగులుగా విరజిమ్ముతున్న తారాజువ్వలు....వెలుగు పూలు మీదకి విసురుతున్నట్టుగా ఉంది...ఒకదాని తరువాత ఒకటి....పువ్వులో పువ్వు విచ్చుకుంటూ,...ఒక్కోసారి నక్షత్రపు రజను నేలమీద పడుతున్నట్టు....ఒక్కోసారి నక్షత్రాలే నేల మీదకి వచ్చాయా అన్నట్టు....ఎన్ని రంగులో...ఎన్ని రూపులో.... కొన్ని సార్లు ఆ వెలుగు రవ్వలు ' మీద పడిపోతాయా ??' అన్నంత దగ్గర గా వచ్చాయి......ఎక్కడా అపశ్రుతి లేకుండా చాలా పద్దతిగా అద్భుతంగా సరిగ్గా గంట జరిగిన ఈ కన్నులవిందు ని చూసి నేనైతే మైమరచిపోయా......చిన్నప్పటి నించి దీపావళి అంటే  నాకు గుర్తుకొచ్చేది..నాకు చాలా నచ్చేది  ఒకే ఒక్కటి 'తారాజువ్వ'...అది వేయాలంటే భయమే కానీ చూడాలంటె ఎంత ఇష్టమో....అలాంటిది...గంట సేపు నిరంతరంగా కళ్ళు మిరుమిట్లుగొలిపేట్టు జరిగిన ఈ తారాజువ్వల ప్రదర్శన నేను ఎప్పటికీ మరిచిపోలేను....నిజంగా కన్నులపండుగ అంటే ఇదేనేమో.....అమెరికా వచ్చాక నేను చూసిన రెండవ 'ఫైర్ వర్క్స్' ఇవి...మొదటిసారి నయగారా దగ్గర చూసా.....కానీ నాకేమి అంత అబ్బురం అనిపించలేదు......కానీ ఈ 'ఆర్చర్డ్ లేక్ ఫైర్ వర్క్స్' మాత్రం అద్వితీయం....


PS :ఇంతకీ ఈ 'ఫైర్ వర్క్స్' ఎందుకు చేసారో మాత్రం తెలీదు....మాలాగే అవి చూడడానికి వచ్చిన వారితో కలిసి  నేను,చందూ ప్రదర్శన  అయిపోగానే చప్పట్లు కొట్టాం....తీరా కార్లోకి ఎక్కాక మళ్ళి ఒకసారి ఆర్చర్డ్ లేక్ వైపు చూసా...అప్పుడు వచ్చాడు చందమామ......చాలా ఆలస్యంగా....బహుశా ఈ 'వెలుగుల పండుగ' కోసమేనేమో అంత ఆలస్యం.... :)

4 కామెంట్‌లు:

కృష్ణప్రియ చెప్పారు...

బాగుంది. మీ బ్లాగ్ టెంప్లేట్, మీ గురించి మీరు రాసుకున్న వాక్యాలు కూడా బాగున్నాయి!

శ్రీ చెప్పారు...

మీరు మా ఊరు బ్లాగరా ?

కొత్త పాళీ చెప్పారు...

బహుశా వుడ్‌వర్డ్ డ్రీం క్రూయిజ్ సందర్భంగా అయి ఉండొచ్చు.

ఇందు చెప్పారు...

@Krishnapriya :థ్యాంక్స్ అండి కృష్ణప్రియ గారు...
@కొత్త పాళీ:ఏమోనండి మరీ!! అయుండవచ్చు,,,