12, ఆగస్టు 2010, గురువారం

నా సైకిలు కథ ..

మొన్న 'మర్యాద రామన్న' సినిమా కి వెళ్లాం..అందులో సైకిల్ చూడగానే నా సైకిల్ గుర్తుకొచ్చింది....నా  7వ తరగతి లో మా నాన్న నాకు 'సైకిలు' కొనిపెట్టారు...'చౌదరి సైకిలు షాపు' కి వెళ్లి నాకు కావలిసిన రంగులో నాకు నచ్చిన  'స్టిక్కర్లు' అంటించిన 'లేడి బర్డ్' సైకిల్ చూసి అది కావాలని నాన్నని అడిగాను...మరుసటి రోజుకల్లా అది మా ఇంట్లో ఉంది....నాకు 'లేడి బర్డ్' సైకిల్లో ముందు వుండే ఆ 'బుట్ట' అంటే భలే ఇష్టం...టి.వి లో 'లేడి బర్డ్' ప్రకటనలో ఆ బుట్టలో పూలు(ఆర్చిడ్స్,జేర్బరాలు) పెట్టుకుని ఒక  అమ్మాయ్ సైకిల్ తొక్కుతుంది...అందుకే నాకు అది భలే నచ్చేసింది....నేను అలాగే పూలు పెట్టుకుని సైకిల్ తొక్కాలని ఒకరోజు మా ట్యూషన్ సార్ వాళ్ళ ఇంట్లో పెరిగే 'వాటర్ లిల్లీస్' ని అడిగి తీసుకుని  ఆ బుట్ట లో పెట్టుకుని అచ్చు ప్రకటనలో చూపించినట్టే సైకిల్ తొక్కుకుంటూ ఇంటికొచ్చాను...ఆ రోజు ఎంత ఆనందమేసిందో...నా సైకిల్ కి తగ్గట్టు అందమైన కీచేయిన్ కొన్నాను...'ఎర్రగా హృదయాకారం లో చెక్కతో  చేసి అందులో మళ్ళి ఇంకో చిన్న బంగారు రంగు లో హృదయాకరపు బిళ్ళ పొదిగిన' కీచేయిన్ అది...ఎంతమంది అది చూసి బాగుంది అనేవాల్లో!!!!..నా అందమైన సైకిల్ కి మంచి జోడి అని మురిసిపోయేదాన్ని...

నాకు సైకిలు కొనేముందు చాలా తతంగం జరిగింది....ముందు నాకు సైకిల్ సరిగ్గా నడపడం రావాలి అనేది నాన్న నిబంధన....సరే అని కష్టపడి అప్పటికే సైకిల్ ఉన్న నా స్నేహితురాలు సాయిలక్ష్మి దగ్గర ఎలాగో అలా సైకిల్ నేర్చేసుకున్నా....పాపం ఆ అమ్మాయి కూడా ఏమి విసుక్కోకుండా చాలా ఓర్పు గా నాకు నేర్పింది...ఒకసారి ఆ అమ్మాయి సైకిల్ మీద కూర్చుని ఓ తెగ తోక్కేసుకుంటూ మా ఇంటిముందుగుండా ఝామ్మని పోతుంటే మా అమ్మ పిలిచింది.....అంతే సైకిల్ అదుపుతప్పి పక్కనే వున్న మురికి కాల్వ లోకి దూసుకేల్లిపోయా....సైకిల్ ఒక పక్క...నేను ఒకపక్క....నా కాళ్ళు బురదలో....హ్మ్!!! పాపం అలా ఆ అమ్మాయిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించి ఎలాగో అలా సైకిల్ తొక్కడం నేర్చేసుకుని మా నాన్న ముందు నా విద్య ప్రదర్శించి అప్పుడు కొనుక్కున్న సైకిల్  అది!!!!!

అలా 7వ క్లాసు నించి 10 వ క్లాసు  వరకు నా రధం(అదేనండి నా సైకిలు) మీద హాయిగా తిరిగేదాన్ని....అమ్మకి ఎమన్నా కూరగాయలు తేవడానికి,పచారి సామాను కి,నాన్న పూజకి కొబ్బరికాయ తేవడానికి,నేను ట్యూషన్ కి వెళ్ళడానికి,సరదాగా స్నేహితుల ఇంటికి వెళ్ళడానికి....ఇలా నా బుజ్జి సైకిల్ మీద చాలా పనులు చక్కబెట్టుకోచ్చేదాన్ని....కానీ మా నాన్న నా అత్యుత్సాహం చూసి ఇంకో నిబంధన విధించారు...'ఎప్పుడు చిన్న చిన్న రోడ్ల మీదే తొక్కాలి తప్ప మెయిన్ రోడ్ మీదకి వెళ్లొద్దు' అని....తప్పుతుందా!!! అలాగే ఆచరించా....దాని ఫలితంగా నాకు మెయిన్ రోడ్ మీద సైకిల్ తొక్కటం రాదు అని డిసైడ్ అయిపోయిన మా నాన్న నా ఇంటర్మీడియట్ లో నాకు 'స్కూటీ' కొన్నారు....కొన్నది నాకోసమే...కాని నడిపేది మా నాన్న...!!!! సైకిల్ తొక్కడం రాని నాకు బండి నడపడం అస్సలు రాదనీ గట్టిగా నిర్ణయించుకుని  ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా రొజూ తనే నన్ను కాలేజి దగ్గర దిగబెట్టే వారు....ఒక్కరోజు ఇవ్వమన్నా ఇవ్వలేదు....ఈలోగా నా బుజ్జి సైకిల్ ఇంట్లో అడ్డు అయిపొయింది...నాకు పోటిగా మా తమ్ముడు 8వ క్లాసులోనే సైకిల్ కొనడం...ఇంటర్మీడియట్ లోనే  బైక్ కొనడం వల్ల చిన్నగా గా ఉండే మా ఇంట్లో నాలుగు వాహనాలు ఎక్కువైపోయాయి....అందులోను ఎందుకు పనికి రాని నా సైకిల్ మీదే అందరి దృష్టి...'ఇంకా ఎందుకండీ?? అది వాడుతుందా పెడుతుందా??? ఇంట్లో అడ్డు తప్ప??' అని మా అమ్మ రోజు దాన్ని ఎలా బైటికి పంపించాలా అని ఆలోచించేది....

ఆ రోజు తొందరలోనే వచ్చింది....మా అమ్మ కి మెరుపు లాంటి ఆలోచన వచ్చి నా సైకిల్ ని ఉత్తి పుణ్యానికే(అంటే ఉచితంగా) మా కూరగాయల రమేష్ కి ఇచ్చేసింది.....ఆ రోజు రాత్రి కాలేజి నించి ఇంటికొచ్చిన నేను ఎంత ఏడ్చానో...'నా సైకిల్ నాకు కావలి' అని ఎంత గోల పెట్టానో...సైకిల్ ఇస్తే ఇచ్చింది....దాని కీచేయిన్ కూడా ఇచ్చేసింది......అది ఇంకా ఏడుపొచ్చింది....'కనీసం నా కీచేయిన్ అన్నా  ఇవ్వమను అమ్మ రమేష్ ని' అని అడిగేదాన్ని....ఉహు!! అది కుదరని పని.ఇక ఇంతేలే అనుకుని అలాగే కొన్ని రోజులకి నేనే సర్దుకుపోయా.....

సరిగ్గా నా ఇంటర్మీడియట్ చివరి రోజుల్లో ల్యాబ్ నించి బైటికి వస్తుండగా కనిపించింది నా బుజ్జి సైకిల్.....నా స్నేహితులందరికీ 'అదే నా సైకిల్!!! నేను చెప్తాను చూడు భలే ఉంటుంది అని ఇదే!!' అని అంటుంటే నన్ను వింతగా చూసారు......'నిజమే!!! కావాలంటే నా సైకిల్ తీసుకున్న మా కూరగాయల రమేష్ ఇక్కడే ఎక్కడో ఉంటాడు ఆగండి!!' అని చెప్పి చుట్టూ కలియచూసా.....అక్కడ ఉన్నాడు ఎవరితోనో మాట్లాడుతూ.....సరిగ్గా అపుడే నన్ను చూసి 'ఏంటి అమ్మాయిగారు ఇక్కడ?' అన్నాడు...'ఇదే మా కాలేజి' అని చెప్పా....'నా సైకిల్ ఎలా ఉంది రమేష్ ?' అని అడిగా ...'ఇది మీ సైకిల్ యే అమ్మాయిగారు!! చాలా బాగుందండి...ఇంతవరకు ఏమి రేపెయిర్లు రాలేదు' అన్నాడు...నేను ఒక నవ్వు నవ్వి,మా కోతి బ్యాచ్ వంక చూసి ,....చివరిసారి నా సైకిల్ ని  చూసుకుని అక్కడినించి వచ్చేసా....తరువాత వాళ్ళు వచ్చి 'ఇన్ని  రోజుల తర్వాత అన్ని సైకిల్లలో  నీ సైకిల్ ఎలా గుర్తుపట్టావే?? 'అని అడిగారు....నా బుజ్జి సైకిల్ ని నేను అసలు మర్చిపోతే కదా గుర్తుపెట్టుకోడానికి....ఇప్పుడు ఏమైపోయిందో.... ఎక్కడుందో !!!!

9 కామెంట్‌లు:

వేణూశ్రీకాంత్ చెప్పారు...

మీ సైకిలు ఙ్ఞాపకాలు బాగున్నాయండి :-)
మీ బ్లాగ్ టెంప్లేట్ కూడా నాకు చాలా నచ్చేసింది.

ఇందు చెప్పారు...

థ్యాంక్స్ అండీ వేణుగారు

చందు చెప్పారు...

mee cycle techchi meku present chesthe merentha santhosa padatharo kadaaa !!!
ha ha ha
konni teepigurthulu marapuranivi nestham
hrudayam lo bhadram ga vunchuko kalakaalam
kani marchipoku panchukovatam maato ellakalam

ఇందు చెప్పారు...

@సావిరహే : present cheyadaniki adi ekkada undoo emooo :(

ఇందు చెప్పారు...

@Ramakrishna Reddy Kotla : :(

Cute Indian చెప్పారు...

ఇందు నీ సైకిల్ కి చాల పెద్ద స్టొరీ నే వుంది కదా..
అద్బుతం గా రాస్తున్నావ్ ఒక్కో పోస్ట్. నీ చిన్ననాటి తీపి గుర్తులని అద్బుతం గా నెమరు వేసుకుంటూ మాతో పంచుకున్తున్నావ్ గా. గ్రేట్..నీ బ్లాగ్ కుడా అద్బుతం గా వుంది..
ఇలాగె ఎక్కువ టపాలని కొనసాగించు...
ఏది ఏమిన నీ సైకిల్ కథ మాత్రం అమోఘం...

ఇందు చెప్పారు...

@Cute Indian:చాలా థ్యాంక్స్ అన్నా....అలాగే... :)

snellens చెప్పారు...

Good one... I believe, Everyone really attached to their first cycle. Same with me. I didn't bought the new one, but i have used my Dad's cycle. he finished his graduation on that cycle and even he went to office on that cycle until he bought Vespa Scooter. I use that cycle when i was in my 8, 9th and 10th. Not only to school, me and my friend sridhar use to ride together exploring the new routes to our home from different places. Your posting is amazing and thank you for reminding our past... keep writing..

ఇందు చెప్పారు...

@snellens: thankyou :)