2, మార్చి 2011, బుధవారం

శివ..శివ...హర..హర!

'ఓం నమశ్శివాయ'

ఇవాళ శివరాత్రి కదా! శివుడికి బోలెడు ఇష్టమైన రాత్రి....లయకారుడు లింగోద్భవమై  దర్సనమిచ్చే రాత్రి! మనం  శివరాత్రి ముచ్చట్లు....అలాగే శివుడికి నాకు మధ్య డిష్యు-డిష్యుం అన్నీ చెప్పేసుకుందామే!

ఇప్పుడంటే నాకు కృష్ణుడంటే వల్లమాలిన భక్తీ కానీ....చిన్నప్పటినించి నాకు తెలిసిన దేవుడు శివుడే! మా ఇంట్లో పెద్ద శివుని పటం ఉంటుంది.అది ఒక పెయింటింగ్.ఏదో పెయింటింగ్ ఎక్జిబిషన్ లో నాన్నగారికి బాగా నచ్చి దాన్ని తీసుకొచ్చి ఫ్రేం కట్టించారు! మా ఇంట్లో శివుడి బొమ్మలాంటి బొమ్మ మరెక్కడా చూడలేదు! సాక్ష్యాత్తు శివుడే వచ్చి యోగముద్రలో తపస్సు చేస్తున్నట్టు ఉంటుంది :) 


మా ఇంటికి కూతవేటు దూరంలో 'మల్లిఖార్జున స్వామీ' దేవాలయం ఉండేది.ఆ గుడి ప్రధాన పూజారి మాకు బాగా తెలుసు! ప్రతి సోమవారం అభిషేకం....పండగ రోజుల్లో,పుట్టిన రోజులకి అర్చన....అలా ఆ గుడంటే క్రమంగా ఇష్టం ఏర్పడింది. ఎక్జాంస్ అప్పుడు రోజు ఆ గుళ్ళో దేవుడికి దణ్ణం పెట్టుకుని పరీక్ష రాయడానికి వెళ్ళేదాన్ని! ఆ స్వామి దయవల్లేనేమో.....ఇంత బాగా చదువులు అబ్బాయి మాకు! నా చిన్నప్పుడు ప్రతి శివరాత్రి ఆ గుళ్ళోనే జరిగింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఫుల్లుగా స్వెట్టర్లు వేసుకుని, ఆ చలిలో బయలుదేరేవాళ్ళం గుడికి.ఇక పూజారి అప్పుడు పూజ మొదలు పెట్టి ఏకాదశ మహారుద్రాభిషేకం చేసి....చివరికి సరిగ్గా పన్నెండు గంటలకి లింగోద్భవ వేళ స్వామీ వారి దర్సనం చేయించేవాడు! ఆ చలిలో అలాగే ముడుక్కుని....కళ్ళ మీదకి నిద్రోస్తున్నా ఆపుకుని.... పంచాక్షరిని జపిస్తూ అలాగే కుర్చునేదాన్ని! నేను చలికి వణుకుతూ ఉంటె...అమ్మ చెప్పేది...'శివరాత్రికి చలి శివ...శివా...అని పారిపోతుంది.ఇక చలి బాధ ఉండదులే' అని :) 


కొద్దిగా పెద్దయ్యాక మాకు ఇక గుడికి వెళ్ళే తీరుబడి లేకపోయింది. నేనే ఇంట్లో ఎలాగో అలా ఒంటిగంటవరకు జాగారం(!) చేసి.....నా ముత్యాల దండనే జపమాలగా అనుకుని పంచాక్షరిని జపిస్తూ అలాగే పక్కకి ఒరిగి నిద్రపోయేదాన్ని ..... అలా ప్రతి శివరాత్రి ఇలా జాగారం చేయడం....శివనామస్మరణ చేయడం అలవాటయిపోయాయి! క్రమంగా పరిస్థితులు మారాయి.శివరాత్రికి ఏదో ఒక పవిత్ర క్షేత్రానికి వెళ్ళడం అలవాటయింది.అలా ఒకసారి  శ్రీశైలం వెళ్ళాం! కాని అనుకోకుండా కొన్ని కారణాలవల్ల తిరిగి వచ్చేసాం! అప్పుడు ఎంత బాధేసిందో! నా ఫేవరేట్ పుణ్యక్షేత్రం- శ్రీశైలం. ఆ మల్లిఖార్జునున్నిచేతులార తాకి.....తలని ఆ లింగానికి ఆన్చి మొక్కుకుని....చేతులకు అంటిన ఆ పవిత్ర లింగం యొక్క విభూదిని మహాప్రసాదంగా భావించి ఒక అలౌకికమైన ఆనందంలో మునిగితేలుతూ....బైటికి వస్తుంటే.... 'ఈ గుడిలో శిలనైనా కాకపోతిని స్వామీ నీ సేవ చేయగా ' అని అనిపిస్తుంది! శ్రీశైలం ఇప్పటికి ఏ ముప్పయ్ సార్లో వెళ్లుంటాం....కనీసం ఏడాదిలో మూడు-నాలుగు సార్లు కంపల్సరీ.కాని శివరాత్రి రోజు వెళ్ళాలనే కోరిక మాత్రం తీరలేదు :(

ఇక శివరాత్రి స్పెషల్ అంటే గుర్తొచ్చేది మా గుంటూరు జిల్లా కోటప్పకొండ. అసలు ఈ టైంకి హడావిడే హడావిడి! పెద్ద పెద్ద ప్రభలు కడతారు...వాటిని ఊరేగిస్తూ కొండమీదకి తీసుకెళ్లడం అది ఇంకా పెద్ద ప్రహసనం.అవి తీసుకు వెళ్ళేటప్పుడు ఆ దారిపొడవునా కరెంటు తీస్తారు.ఆ ప్రభలు అంత పొడవుగా ఉంటాయ్ మరి! ఆ తరువాత ఇక తిరునాళ్ళ! కొండమీద తిరునాళ్ళ జరిగాక....మరుసటి రోజు నరసరావుపేటలో పల్నాడు రోడ్డులో 'శివుడి బొమ్మ సెంటర్' దగ్గర మళ్లీ ఇంకోసారి తిరునాళ్ళ జరుగుతుంది. ఆ రోజు కూడా ఊరంతా ప్రభలను ఊరేగిస్తారు. వాటిముందు డాన్సులు వేస్తారు....అబ్బో....గోలగోలలే! :))


మా కోటయ్య స్వామీ మాత్రం ఏం తక్కువ తిన్నాడు!ఇక్కడ ఎంత పద్దతిగా అభిషేకం చేస్తారో! శ్రీశైలంలో హడావిడి కార్యక్రమం ఐతే....ఇక్కడ చాల నిమ్మళంగా..కుదురుగా చేస్తారు. కన్నులపండువగా చూడొచ్చు అంతసేపు స్వామిని. ఐతే....శ్రీశైలం లో స్వామిని తాకే బంపర్ ఆఫర్ ఇక్కడ లేదుగా! అందుకే...దేనికి అదే సాటి :)) నేను ఒకే ఒక్కసారి తిరునాళ్ళకి వెళ్ళా! మా ఫ్రెండు వాళ్ళ తాతయ్య ఒకరు కోటప్పకొండలో ఉన్న ఒక సత్రానికి అధికారి :) ఆయన వి.ఐ.పీ టిక్కెట్లు ఉన్నాయ్...రమ్మంటే నేను,మా ఫ్రెండ్సు వెళ్లాం :)) కాని మేము వెళ్ళేసరికే ఎవరో వచ్చి ఆ టికెట్లు తీసుకేల్లిపోయారట! అలా కొండ ఎక్కి మరీ స్వామిని చూడకుండా వచ్చేసాం! :(

హ్మ్! ఇన్ని చెప్పి మా అమ్మమ్మగారి ఊళ్ళో శివుడి గురించి చెప్పలేదు చూడండి? అయినా మీకు తెలిసిందే కదా ఆ సంగతి.....మా క్షీరా రామలింగేశ్వర స్వామీ.....ఎంత మంచోడో! ఈయనోక్కడే కొంచెం నామీద జాలి చూపించాడు! :D


ఇదెక్కడి చోద్యమో! అటు శ్రీశైలం వెళితే....మల్లన్న....'బెటర్ లక్ నెక్స్ట్ టైం' అన్నాడు....ఇటు కోటప్పకొండలో ...కోటయ్య కూడా....' ఈసారికి ఇలా కానిచ్చేయ్ నాన్నా! ఇంకోసారి చూద్దాంలే!' అన్నాడు. ఈసారి ఇక్కడ మిషిగన్లో...ఫ్లింట్ లో 'పశ్చిమ కాశి' అని పెద్ద శివుని గుడి ఉంది. ఎంత బాగా పూజ చేస్తారో.....అక్కడికి వెళ్దామంటే కుదరనీయకుండా ఒక అడ్డుపుల్ల వేసాడు! హ్మ్! శివుడు బహు చమత్కారి సుమా!!


శివుడెమైనా నా విషయంలో హార్ట్ అయ్యాడా? నేనేం చేసానబ్బా? ఓ! కిట్టుని ఎక్కువగా పట్టించుకుని....శివుడి విషయంలో కొంచెం కినుక వహించాను అనేమో! ఎమన్నా ఉంటే మాట్లాడుకోవాలికాని ఇలా అలిగితే ఎలా?  ఏదేమైనా....శివుడు నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు.ఐ హార్ట్! ఐ హార్ట్ అంతే!! ఇప్పుడు ఇద్దరికీ డిష్యుం-డిష్యుం. శ్రీశైలం వెళ్లి సుమారు రెండు సంవత్సరాలౌతోంది!! ఎవరికీ చెప్పను నా బాధ?? (అమ్మో! ఇలా బాధపడుతున్నా అని తెలిస్తే....శివుడు ఇంకా బెట్టు చేస్తాడో ఏమో!!....)

హ్మ్! ఇక చేసేదేముంది? ఆయనగారి అలక తీరేవరకు నాకు శివరాత్రి రోజున శివాలయంలో శివుని దర్సనం లభించదు :)) అంతే!

అదండీ నా శివరాత్రి సంగతుల్స్! వాట్ ఎల్స్!?

ఓకే మరి....అందరు ఉపవాసాలు చేసి....జాగారాలు చేసి...శివుడి కటాక్షం పొందండి....జాగారం అంటే...బ్లాగుల ముందు...బజ్జుల ముందు కూర్చోడం కాదు ;) శివనామస్మరణ చేయాలి....అర్ధమయిందా? ;) 

'ఓం నమశ్శివాయ' అనండి....అన్నారా? లేదా?.....అద్దీ అలా మంచిగా మాట వినాలి :) 

మరొక్క సారి అందరికి శివరాత్రి శుభాకాంక్షలు :) 

'ఓం నమశ్శివాయ'

21 కామెంట్‌లు:

మనసు పలికే చెప్పారు...

ఇందు..చాలా బాగా రాసారు టపా:) మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి కూడా శివరాత్రి శుభాకాంక్షలు..

లత చెప్పారు...

బావున్నాయి మీ శివుడి కబుర్లు

రాజ్ కుమార్ చెప్పారు...

చాలా బావుంది ఇందు గారు.
హర హర మహాదేవ.
శివరాత్రి శుభాకాంక్షలు..

తృష్ణ చెప్పారు...

సీతాకోకచిలుకల్నే పంపలేదు..ఇప్పుడీ టెడ్డిని మాత్రమ్ అడిగితే ఇస్తారా ఎమిటి..?

బ్రహ్మానందంలా చెప్పాలంటే "ఐ హర్టెడ్" అనాలండీ...:)

శివరాత్రి రోజున దర్శనమ్ ఏం అవుతుందండి? మీరు మరీనూ...ఇప్పుడే సందు చివరిదాకా ఉన్న పొడుగాటి క్యూను చూసి భయపడి చేసేదిలేక ప్రదక్షిణం చేసేసి బయటనుంచే ఓ దణ్ణమేట్టేసుకుని వచ్చేసాం.

అన్నట్టు మీకు బోలెడు థాంకూలు...పొద్దుటి వ్యాఖ్యలకి...:)

సుమలత చెప్పారు...

ఇందు గారు నన్ను మరిచిపోయినట్టు వున్నారు ...
చాలా బాగా రాసారు టపా ,శివరాత్రి శుభాకాంక్షలు.

Ennela చెప్పారు...

బాగున్నాయి మీ డిష్యుం డిష్యుం కబుర్లు...బజ్జు ఒద్దు, బ్లాగు ఒద్దూ అంటే ఎలా చెప్పండీ..అధమ పక్షం ఒక బాలయ్య సినెమా అయిన ఉండాలి కదా జాగారం చెయ్యలంటే...పోనీ..పేకాట ఆడ్డానికి కూడా ఎవరూ లేకపాయే...దగ్గర్లో కసినో ఉంది..కానీ అసలే 'పైసల్లేక పానం మీదకొస్తాందీ' లేక పోతే యీ సారి జాగారం అలా చేసేద్దును సుమండీ!

SHANKAR.S చెప్పారు...

బాబూ శంకరా ఎందుకొచ్చిన గొడవ.
ఇందు గారు కాంగ్రెస్ లో ఉంటూ తె.దె.పా కి సపోర్ట్ చేస్తున్నట్టుగా నీకు అనిపించవచ్చుగాక. కానీ పాపం పూర్వాశ్రమం లో నీకోసం నిద్ర మానుకుని మరీ లింగోద్భవ సమయం లో వేచి ఉన్నారు కాన క్రొత్త కక్షలు మనసులో పెట్టుకోక కుసింత చూసీ చూడనట్టు వదిలేయి. నువ్వు అల్ప సంతోషివని ఆల్రెడీ నా బ్లాగులో అందరికీ చెప్పేసాను. పాపం ఆవిడ నీకోసం పే....ద్ద..పోస్ట్ చివర్లో అందరిచేతా "నమశ్శివాయ" అనిపించారు కూడా. ఈ పాటికే నువ్వు ఉబ్బి తబ్బిబ్బయి ఉంటావు. కాస్త కిందకి చూసి ఆవిడకి శ్రీశైలం ట్రిప్ గ్రాంట్ చేసేయి.

ఇట్లు
శంకర్ (కన్ఫ్యూజ్ కాకు అది నీ పేరు, ఇది నా పేరు )

Unknown చెప్పారు...

ఇందు శివ రాత్రి సంబరాన్ని కళ్ళకు కట్టినట్టు చుపించావ్ . ఆ ప్రభలు .. జాతర .. అబ్బో .. మా ఉరిలో కూడా కొప్పు లింగేశ్వర స్వామి గుడి ఉండేది మేము ప్రతి శివ రాత్రికి అక్కడకి వెళ్ళే వాళ్ళం ..
ఆ గుడి మా తాతగారు కట్టించారు అని మాకు స్పెషల్ ఎంట్రి బలే ఉండేది .. లే .. రధం అది కూడా లాగే వాళ్ళం ..ఆ రోజులే వేరు .. ఐ మిస్ థెం ..
నైస్ పోస్ట్

ramki చెప్పారు...

ముందుగ ఇందు గారికి తరువాత ఫోల్లోవేర్స్ కి శివరాత్రి శుభాకాంక్షలు....
ఇంక విషయానికి వస్తే ఇది మాత్రం టూ ముచ్ అండి......
మా నర్సారాపేట గురించి కూడా రాసేస్తారా? ........అసలు మీరు టచ్ చెయ్యని ఏరియా ఏదైన ఉందా? అసలు వుందా అని ప్రశ్నిస్తున్నాను అధ్యక్షా..... :(
సర్లెండి......
శివరాత్రి టైం కి చక్కగా మా కోటయ్యను, అక్కడ జరిగే విషయాలు అన్ని గుర్తు చేసారు....థాంక్స్...... :)
మీ అనుభవాలు బావున్నాయి ఇందు గారు.....
మీ లాంటి అనుభవమే మనకి ఒకసారి మెట్లు ఎక్కి వెళ్ళినప్పుడు ఎదురయ్యింది....కాకపోతే కోటయ్య దర్శనం ఇచారు లెండి....ఎంతయినా మేము మేము లోకల్ కదా.... :) ఆ మాత్రం కరుణ వుంటుంది లెండి మా మీద.....
కాని మీరు రాసింది చదువుతూ వుంటే శివయ్య గారు మీ మీద ఏదో అలక వహించినట్లున్నారు..... :)
ఇన పర్లేదు లెండి......ఆయనకూడా మీ ఈ పోస్టింగ్ చదివి త్వరలోనే కటక్షిస్తారు లెండి....
శ్రీకాళహస్తి లో కూడా శివరాత్రి బాగా చేస్తారు ....ఎప్పుడో చిన్నప్పటి జ్ఞాపకాలు..
కాని నాకు ఇప్పటిదాకా శ్రీశైలం వెళ్ళే ఛాన్స్ రాలేదు అండి....బాడ్ లక్...
మీ పోస్టింగ్ మొతానికి ఈ వాఖ్యం మాత్రం బాగా నచ్చింది నాకు....."ఈ గుడిలో శిలనైనా కాకపోతిని స్వామీ నీ సేవ చేయగా "....
అన్ని చెప్పి అసలు విషయం మరిచిపోయాను....ప్రసాదం పంపటం మర్చిపోవద్దు..... :)

ఇందు చెప్పారు...

@అప్పు: థాంక్స్ అప్పు :) 'రాసారు ' అవసరమా? ;) రాసావు అనొచ్చుగా! :)) నీకు,మీ ఫామిలీకి శివరాత్రి శుభాకాంక్షలు :))


@లత :థాంక్యూ లత గారు!


@వేణూరాం :థాంక్యూ రాజ్ :) మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు :)

ఇందు చెప్పారు...

@తృష్ణ :హబ్బ తృష్ణగారూ...ఎన్ని రోజులయిందండీ మీ కామెంటు నా బ్లాగులో చూసి :) అయ్యో నేను సీతాకోకచిలుకలని మీ దగ్గరకు పంపానే! ఇంకా రాలేదా? పాపం అల్పజీవులు కదా...ఇన్ని వేలమైళ్ళు ఎగిరి రాలేకపోతున్నయేమో ;) మా టెడ్డీ గాడు నచ్చేసాడా? వీడ్ని కూడా పంపించేయనా మరి?

మీరన్నదీ నిజమే! ఇంటిపక్కన శివాలయానికే బారెడు క్యు ఉంటుంది :) నా అత్యాసే లేండీ!!

మీకు కూడా బోలెడు ధన్యవాదాలు చక్కగా పోస్ట్లు వేయడం ప్రారంభించారు :)

@ సుమలత: నేను మిమ్మల్ని మర్చిపోలేదు....మీ బ్లాగులోకి వెళ్ళి చూడండీ...థాంక్స్ అండీ :)


@ Ennela:హ్హహ్హా! ఎన్నెలగారూ,...మీకు ఉంది ఆగండీ...ఆగండి... :))

ఇందు చెప్పారు...

@ SHANKAR.S :శంకర్ గారూ...బోలెడు థాంకులు మీకు :) భలే రికమెండేషన్ లెటర్ రాసారు శివయ్యకి :)

@ కావ్య:ఈ విషయంలో కూడా మన ఇద్దరికి సిమిలారిటీ ఉంది కావ్యా :) మాకు సొంత శివాలయం ఉంది. మా తాతయ్య ధర్మకర్త.కానీ కొన్ని గొడవలవల్ల ఎండోమెంట్ బోర్డ్కి ఇచ్చేసారు!!


@RAMAKRISHNA VENTRAPRAGADA:హయ్యో! నాకు నరసరావుపేట తెలియకపోవడమేంటండీ! వీధివీధి తెలుసు!! పల్నాడు రోడ్,మల్లమ్మ సెంటర్,చిత్రలయా,శివుడిబొమ్మ సెంటర్,ఏంజెల్ టాకీస్,ప్రకాష్ నగర్,పంచముఖ ఆంజనేయస్వామి గుడి,కోటగుమ్మం,కాకతీయనగర్,ఎస్సెసెన్ కాలెజ్,యల్లమందా,రావిపాడు ....అబ్బో! మనం అసలు ఏలేసాంలే నరసరావుపేటని.గుంటూర్ కి చాల దగ్గర కదా! నాకు నరసరవుపేటలో నచ్చేది....ఆ సినిమా హాల్స్ ఉన్న రోడ్! ;)అన్ని ధియేటర్స్ వరుసగా ఉంటాయ్! ఒక సినిమాకి కాకపోతె ఒకదానికి వెళ్ళొచ్చు! భలే భలే!!

మీకు తెలుసా! నాకు ట్రావెలింగ్ ఇష్టమైన హాబీ :) మన రాష్ట్రంలో చాలా ఊళ్ళు తిరిగేసా! ఇప్పుడు మిషిగన్లో కూడా అంతే :))

sivaprasad చెప్పారు...

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి కూడా శివరాత్రి శుభాకాంక్షలు.. ఇందు గారు కోటగుమ్మం అంటే రాజ గారి కోట కదా అండి, ఇప్పటికి నరసరావుపేట అంతే ఉంది ,ఏమి మారలేదు,

kiran చెప్పారు...

ఇందు ..శివరాత్రి శుభాకాంక్షలు..పోస్ట్ సూపరు :)
ఏకంగా శివుడి తోనే డిష్యుం డిష్యుం...ఎంత గొప్ప దానివో నువ్వు.. :):)
సరే వచ్చే శివరాత్రి కల్లా నువ్వు శివుడు మంచి ఫ్రెండ్స్ అయిపోయి..నువ్వు ఏదో ఒక పుణ్య క్షేత్రం లో ఆయనని దర్సించుకుంటావు లే..:)
నేను reccomend చేస్తా :P

కృష్ణప్రియ చెప్పారు...

:) బాగుంది

విరిబోణి చెప్పారు...

Hi Indu gaaru,
Mee guntur kaadu indu, mana Guntur anaali :))mari nenu kooda guntur kodaline kada eppudu:)
Abba kotappakondani gurthu chesaaru indu ...aa prabalu aa tirunaalla gola bale vundadi le..Koti prabhalu vaste kani aa kotayya konda digi kindaki raadu mari..maa atta & mamyya gaaru monna velli darshnam chesukoni vachharu kotappakondaki:)
Good post:)

విరిబోణి చెప్పారు...

Hello Indu gaaru,
Chinna request andi, Nenu kavya blog start checinapptinundi anni post lu regular gaa chaduvuthunna, but comment matram pettalekha pothunna :( Thana anni post laki, na tarapunundi, all the best ani cheppandi.. meeru tana friend kada andukani mimmalni aduguthunna :)thanks

జయ చెప్పారు...

మీ శివరాత్రి ముచ్చట్లు బాగున్నాయి. బొమ్మలు ఇంకా బాగున్నాయి. మరి మహిళా దినోత్సవానికొచ్చేసాం కదా. మీకు నా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

ఇందు చెప్పారు...

@sivaprasad :అవును శివగారు...అదే! నాకు తెలుసండీ...లాస్ట్ ఇయర్ కూడా ఏదో పనిమీద వెళ్లా :))

@kiran:థాంక్యూ కిరణ్! కొంచెం స్ట్రాంగ్ గా చేయి రికమెండేషన్ ;)

@కృష్ణప్రియ :థాంక్యూ కృష్ణప్రియగారూ!

ఇందు చెప్పారు...

@ విరిబోణి:అవును విరిబోణి గారు...మీది గుంటూరే....మాది గుంటురే! :)) థాంక్స్ అండీ :)

మీ కామెంట్స్ సంగతి కావ్యకి చెప్పాను.తను చూసుకుంటుందిలేండీ...మీరు ఒకసారి మళ్ళీ ట్రై చేయండీ...తనకి కామెంట్ పెట్టడానికి :)


@జయ :థాంక్యూ జయగారు...మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు :)

శశి కళ చెప్పారు...

okka saremi meekosam okati naakosam okati rendu saarlu antaanu.om namasivaaya omnamasivaaya.sasikala.