27, అక్టోబర్ 2010, బుధవారం

ఆరెంజ్...ఒక రేంజ్ పాటలు...

నాకు ఈ ఏడాది నచ్చిన వాటిల్లో ఈ 'ఆరెంజ్' సాంగ్స్ టాప్ లో ఉన్నాయి..మొన్నటిదాకా 'తకిట..తకిట' బాగున్నాయి అనుకున్నా...అవే ఎక్కువగా విన్నా కూడా....ఖలేజ,బృందావనం వచ్చినా ఏదో ఉన్నాయ్ కానీ పాటల్లో 'సోల్' లేదు.ఆరెంజ్ లో అన్నీ పాటలు నచ్చేసాయ్...నాకు ఎక్కువ సాఫ్ట్,మెలోడి,క్లాసి టచ్ ఉన్న సాంగ్స్ ఇష్టం...అలా అని మరీ సుత్తిగా,మెల్లగా ఉండే స్లో సాంగ్స్ కూడా ఇష్టం ఉండదు...పాట మనసుకి ఆహ్లాదంగా ఉండాలి....పదే పదే వినాలి అనిపించాలి.అర్ధం కానీ లిరిక్స్ ఉన్నా...ఎక్కువ డ్రం బీట్స్  ఉండి తలనొప్పి తెప్పించినా.... చాలా చిరాగ్గా ఉంటుంది.

హారిస్ ఇంతకుముందు చేసిన తమిళ మూవీస్ అన్నిటికీ మంచి మ్యూసిక్  ఇచ్చాడు కానీ ఎందుకో తెలుగు లో 'వాసు','సైనికుడు','మున్నా' పాటల్లో లోపం ఉంది అనిపిస్తుంది.ఒకటి రెండు పాటలు బాగున్నా...పరిపూర్ణంగా ఆడియో మొత్తం నచ్చేసింది అని చెప్పేలా లేవు...మళ్లీ 'ఘర్షణ' బాగా చేసాడు.ఇప్పుడు 'ఆరెంజ్'....సింప్లీ సూపర్బ్.కారుణ్య పాడిన 'ఊల ఊలాల' పాట ఐతే తెగ నచ్చేసింది...అలాగే 'నేను నువ్వంటూ' కూడా...కారుణ్య తెలుగు వాడె అయినా మన వాళ్ళెందుకు సరిగ్గా ఉపయోగించుకోరో!! 'రూబ రూబ' కూడా కొత్త గా బాగుంది. ఇక కార్తిక్ పాడిన 'చిలిపిగా' సాంగ్ కొంచెం బాధ మిక్స్ అయి ఉంది.'హలో రమ్మంటే' హుషారుగా సాగిపోతుంది.ఇక టైటిల్ సాంగ్ నా చివరి చాయిస్.

వీటిల్లో ఇంకో స్పెషాలిటి...డ్యూయట్స్ లేకపోవడం....ఉన్న ఆరు పాటలు హీరో మీద ఫోకస్ చేసినవే...కానీ అన్నిటిలో హీరోయిన్ గురించి పాడినవే......ప్రేమ,విరహం,బాధ,సంతోషం కలగలిపిన వనమాలి సాహిత్యం బాగుంది....ఇక అసలు సినిమా ఎలా ఉంటుందో ఏమో కానీ....ఈ పాటలు మాత్రం నా పర్సనల్ కలెక్షన్స్ లోకి చేరిపోయాయి happy

నిన్నటినించి...ఇంట్లో,కార్లో....ఎక్కడ చూసినా ఈ పాటలే...పెట్టి పెట్టి చందుగారి చెవుల తుప్పు వదిలించేస్తున్నాtongue

25, అక్టోబర్ 2010, సోమవారం

కళ్యాణ వేళ...

అక్టోబర్ 24 రాత్రి.....ఇంకొద్ది సేపట్లో  25 వచ్చేస్తుంది...ఇది నా జీవితం లో పెద్ద మలుపును తెస్తుంది...ఎవరికైనా జీవితం లో మార్పులు,అధ్బుతాలు సంభవించాకే తెలుస్తాయి...కానీ ఇది అలా కాదు.....అంతా తెలిసినట్టే ఉంటుంది...ఒక పక్క మనసంతా ఆనందం...లోలోపల గుండె  పొరల్లో  ఎక్కడో గూడు కట్టుకున్న దుఖం.....సరిగ్గా సంవత్సరం క్రితం ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాను...ఇంట్లో ఎవరు లేరు...నేను,బామ్మ తప్ప......అమ్మ దగ్గర  ఉంటే బాగుండు అని ఎన్ని సార్లు అనిపించిందో ...కానీ పనుల హడావిడి కదా..ఇంతలో నా బెస్ట్ ఫ్రెండ్ రోహిణి వచ్చింది...గోరింటాకు పెట్టటానికి...చందు కి ఆకుగోరింటాకు ఇష్టం....అచ్చం నాలాగే..కానీ ఫోటోలలో సరిగ్గా పడదని మా ఆస్థాన కెమెరామెన్ గారు ఇచ్చిన ఆదేశాలతో తప్పక కోన్ పెట్టించుకుంటున్నా ......రోహిణి తన సంగతులేవో చెప్తోంది.........కానీ నా మనసు ఆలోచనా తరంగాలలో కొట్టుకుపోతోంది.....ఇక రేపటినించి ఈ ఇల్లు నా ఇల్లు కాదు కదా!! నేను ఇక్కడ ఎప్పటిలా మహారాణి లా ఉండలేను కదా!! అమ్మ ని,నాన్న ని వదిలి ఒక్క రోజు ఉండలేనే!! ఇక జీవితమంతా ఎలా??కంటి నించి ఉబికి వస్తున్న ఒక్కొక్క చుక్క పాదాలకు పెట్టిన గోరింటాకు మీద పడుతోంది.... మళ్లీ రోహిణి గమనిస్తుందేమో అని  ముంగురులు సరి చేసుకుంటున్నట్టు కళ్ళు తుడుచుకోవడం....అలా ఆ రోజు రాత్రి పది గంటలకు గోరింటాకు పూర్తయి రోహిణి వెళ్ళిపోయింది...

మళ్లీ మనసును ఆవరించేసింది దిగులు....ఇంతలో బామ్మ అన్నం కలిపి తీసుకొచ్చింది....'ఒద్దు బామ్మ తినాలని లేదు' అన్నాను... 'మళ్లీ నా చేతులతో ఎప్పుడు పెడతానో...నువ్వెప్పుడు తింటావో....తినవే!!' అని ముద్దలు కలిపి పెడుతుంటే...మళ్లీ కళ్ళు చెమర్చాయి...అమ్మ కావాలి!! నా మనసు ఒకటే గోల పెడుతోంది... నాకు బాధ అయినా సంతోషం అయినా అమ్మే!! అందుకే అమ్మ ఒడిలో పడుకుని అలాగే ఉండిపోవలనిపిస్తోంది.... అది చూసి బామ్మ 'ఎందుకె పిచ్చి తల్లి ఏడుస్తావ్?? మళ్లీ రేపు కళ్ళు ఎర్రగా అవుతాయి... అన్నం తినేసి హాయిగా పడుకో....' అని అంది.....సరే అని అలాగే అన్నం ముగించేసి మంచం మీద పడుకున్నా నిద్ర రాదే?? ఎన్నో ఆలోచనలు...రేపు నేను ఏంటి?? నా పరిస్తితి ఏంటి?? అక్కడ అంతా ఎలా ఉంటుందో?? వాళ్ళందరూ  ఎలా ఉంటారో??? అసలు అమ్మాయిలకే ఎందుకు ఇంత బాధ??? నేనెందుకు అమ్మ-నాన్న ని వదిలి వెళ్ళాలి??? ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను....రాత్రి రెండింటికి అమ్మ-నాన్న పిన్ని,బాబాయ్ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చారు....అప్పటిదాకా నిద్ర పోకుండా అలాగే కూర్చున్నా. నన్ను అమ్మ దగ్గరకి తీసుకుంది.... నా సంగతి అమ్మ కి బాగా తెలుసు....అందుకే ఒళ్లో బజ్జో పెట్టుకుని  మెల్లగా జోకొట్టింది....ఎప్పుడు నిద్రపోయానో.....అమ్మ చేతి స్పర్స మహత్యం కాబోలు...

అక్టోబర్ 25 ....
పొద్దున్నే లేచేసరికి....అమ్మ-నాన్న అప్పటికే రెడి అయి మండపానికి వెళ్ళిపోయారు......'ఇందు...టు-డే ఇజ్ ఏ బిగ్ డే..' అనుకుంటూ నిద్ర లేచా!!సెల్ చూస్తే రోజు పొద్దున్నే ఠంచను గా వచ్చే చందు  మెసేజ్ లేదు.....కోపమొచ్చి 'హ్యాపీ వెడ్డింగ్ డే' అని మెసేజ్ కొట్టి సెల్ పక్కన పడేసా!!తరువాత  అత్త,పిన్ని,ఆమ్మ వాళ్ళు నాకు మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతుర్ని చేయడం మొదలు పెట్టారు ....ఇంతలో అమ్మ వాళ్ళు వచ్చారు....ఆ కార్యక్రమం అయ్యాక....నన్ను మండపానికి తీసుకెళ్ళి ఏదో పూజ చేయించారు.....మండపం లోకి అడుగు పెడుతుండగా స్టేజ్ మీదకి చూసా...పాపం చందు....తెల్లవారు ఝామున మూడు నించి ఆ అగ్నిహోత్రం ముందే అట...కళ్ళు ఎర్ర మిరపకాయల్లా  ఉన్నాయ్....ప్రళయ కాల రుద్రుడు లా చూస్తున్నాడు....ఇంకాసేపు అలాగే ఆ పొగ లో కూర్చోబెడితే 'నాకు ఈ పెళ్లి వొద్దు బాబోయ్!!' అని పారిపోతాడేమో అనిపించింది .నాకు నవ్వు,భయం  ఒకేసారి వచ్చాయి ఆ ముఖం చూస్తే.....నేను వస్తుండడం చూసి ఇక వాళ్ళ  బంధువులు చందు ని ఆటపట్టించడం మొదలుపెట్టారు.....అయినా కూడా పోద్దున మెసేజ్ చేయలేదు అన్న కోపం తో కనీసం చూడను కూడా చూడలేదు నేను ....కానీ తరువాత కాశీ యాత్రకి బయలుదేరినపుడు దొంగ చాటుగా చూసాలెండి...

ఆ కార్యక్రమం అయ్యాక ఇంటికి వచ్చి కాసేపు నిద్రపోదామనుకున్నా....కానీ మళ్లీ ఆలోచనలు చుట్టు ముట్ట్టేసాయి....ఇంటినిండా  సామాను..చుట్టాలు....పక్కాలు.....ఎవరి గోల వారిది లాగ ఉంది...నాకు మాత్రం మనసు మనసులో లేదు....రాత్రి నిద్ర లేదేమో అలాగే ఆలోచిస్తుంటే ఎప్పుడో  కునుకు పట్టేసింది...

ఈలోగా సాయంత్రమైపోయింది....అసలు తతంగానికి తెర లేచింది....7 :51 కి ముహూర్తం...అమ్మ వచ్చి నన్ను లేపింది...టైం చూస్తే ఐదు...ఇక నాకు మంగళ స్నానం చేయించి ఎర్రని కంచిపట్టు  చీర కట్టి,ప్రత్యేకంగా చేయించిన పూల జడ దగ్గరుండి కుట్టించి,కళ్యాణ తిలకం దిద్ది,చేతి నిండా గాజులు వేసి,రకరకాల నగలు పెట్టి,ఒక్కసారి నన్ను కళ్ళ నిండా చూసుకుని...'నేను నా కూతురు 'పెళ్లికూతురు' గా ఎలా ఉండాలి అనుకున్నానో అలాగే  ఉన్నావే...' అని దిష్టి తీసింది...... ఆ అలంకరణ అవన్నీ భలే గా అనిపించాయి.....ఎప్పుడూ సింపుల్ గా ఉండే నేను అన్ని నగలు అవి  వేసుకోవడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది....సరిగ్గా ఆరున్నర కి నేను కళ్యాణ మండపానికి బయలుదేరాను ....ఒక్కసారి మళ్లీ నిస్సత్తువ ఆవరించింది....అదే నాకు ఆ ఇంటి మహారాణి గా ఆఖరి క్షణం...ఇక నేను వేరే ఇంటి అమ్మాయిని అయిపోతాను కదా!!.....వెళ్లబోయే ముందు అమ్మ-నాన్న కాళ్ళకి నమస్కరించాను.....నాన్న దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టారు.....అప్పుడు చూసాను నాన్న కళ్ళలో చిన్న నీటి తెర...నా జీవితం లో నాన్న ఏడవడం అదే మొదటిసారి నేను చూడటం ....ఇక అమ్మ అప్పటికే చాలా కంట్రోల్ చేసుకుంది కాబోలు  నన్ను దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టుకుంది....ఇద్దరు నన్ను పొదివి పట్టుకుని బయటకు తీసుకెళ్ళారు...ఇంతలో తమ్ముడు వచ్చాడు..వాడు కార్ లో ముందు కూర్చోగా వెనుక అమ్మ-నాన్న మధ్యలో నేను కూర్చున్నా....కార్ బయలుదేరేముందు ఒక్కసారి ఇంటి వైపు చూసి ఇక చూడలేక తల తిప్పేసుకున్నా....

పెళ్లి మండపం....నేను,అమ్మ కలిసి ఆ అలంకరణ అన్నీ సెలెక్ట్ చేశాం...నాన్న గారికి ఆక్సిడెంట్ అవడం వల్ల అన్నీ మేమే చూసుకోవాల్సివచ్చింది....ఆ మండపం లోకి అమ్మ-నాన్న-తమ్ముడు తో పాటు అడుగు పెడుతూ...అందరూ అంతే చూస్తుంటే సిగ్గు తో తల దించుకుని వడి వడి గా పెళ్ళికూతురి గది వైపు వెళ్ళిపోయా...గౌరీ పూజ చేయడం పూర్తయ్యాక నన్ను బుట్టలో తీసుకెళ్ళారు పెళ్లి పీటల దగ్గరకి...ఇక అక్కడినించి పెళ్లి హడావిడి మొదలు....జీలకర్ర-బెల్లం,తాళి,తలంబ్రాలు,మెట్టెలు,నల్లపూసలు,ఏడు అడుగులు,హోమం,అరుంధతి నక్షత్రం ....అన్నీ పద్ధతి గా జరిగాయి... నేను చూసిన పెళ్ళిళ్ళలో నాకు బాగా నచ్చిన పెళ్లి మాదే......జీలకర్ర-బెల్లం పెట్టేటపుడు చందు చేయి మీద చేయి ఉంచి క్షణం నాకు ఇప్పటికీ మెదులుతూనే ఉంది....ఆ క్షణానే మనసులో అనుకున్నా...ఎప్పటికీ ఈ అబ్బాయి చేయి వదిలి పెట్టకూడదు అని......అలాగే తాళిబొట్టు కట్టేటపుడు....ఆ తాళి ఎప్పటికీ అలాగే పచ్చగా కళకళ లాడుతూ ఉండాలి అని కోరుకున్నా...ఇక తలంబ్రాలు అపుడు ప్రత్యేకంగా తెలుపు-ఎరుపు  ముత్యాలు తెప్పించాం.....(రాముల వారి కల్యాణం చూసినపుడల్లా నాకు ముత్యాల తలంబ్రాలు కావాలనిపించేది..అందుకే వెతికి వెతికి మరీ అవి తెప్పించా)...అవి పోసుకుంటూ చేసిన గోల అంతా ఇంతా కాదు...సప్తపది అపుడు చందు అడుగులో అడుగు వేస్తుంటే ఎంత అబ్బురంగా అనిపించిందో !!..అలాగే మిగితా అన్ని కార్యక్రమాలు ఆహ్లాదంగా జరిగిపోయాయి.....బంధువులు,స్నేహితులు,చుట్టుపక్కలవాళ్ళు,నా చిన్ననాటి స్కూల్ టీచర్లు,...ఇలా చాలామంది దీవెనల మధ్య మా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది....

ఇక అప్పగింతలు  దగ్గరికి వచేసరికి మళ్లీ పరిస్తితి మొదటికి వచ్చింది......అందరి దగ్గరకి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని ప్రతి ఒక్కరికి వీడ్కోలు చెప్పా!! అత్తయ్యలు,పిన్ని వాళ్ళు,ఆమ్మ వాళ్ళు,బాబాయ్,వరలక్ష్మి ఆంటీ వాళ్ళు,బామ్మ,కిరణ్ అన్నయ....అందరికీ....ఇక చివరికి చందు తో కలిసి మా అత్తగారింటికి వెళ్ళేటపుడు..... అమ్మ ని వదిలి మొదటిసారి అస్సలు పరిచయం లేని వారింటికి వెళుతున్నా అన్న భయం....దుఖం...సంతోషం....ఏమని చెప్పను....నా చందు దగ్గరకి వెళుతున్నా అని ఆనందమా!! అమ్మ ని,నాన్న ని వదిలేసి వెళ్ళిపోతున్నా అని బాధా!! అమ్మని దగ్గరికి  తీసుకుని ముద్దులు పెట్టా...అలాగే నాన్నకి కూడా...కూతురు అత్తవారింటికి వెళుతోంది అన్న ఆనందం....తమని వదిలి వెళ్ళిపోతోంది అన్న బాధ...పాపం వారి పరిస్తితి ఇంతే!!

ఇక అమ్మ-నాన్నకి,తమ్ముడికి   'బై' చెప్పేసి  వెనుదిరిగి చూడకుండా కారేక్కేసా....తరువాత దారిపొడవునా ఏడుస్తూనే వున్నా!! చందు చాలా ఓదార్చాడు.... ఇక మర్నాడు తెలతెల వారుతుండగా అత్తవారింట్లో అడుగుపెట్టా....అలా అడుగు పెడుతునపుడు మనసులో ఒకటే అనుకున్నా....'ఇక ఇదే నా ఇల్లు....కష్టమైనా,సుఖమైన....ఇక ఇక్కడే నా జీవితం..' అని చందు తో కలిసి చిరునవ్వుతో....అడుగు పెట్టా!!

అలా జరిగిన సంవత్సరం తరువాత ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుచేసుకోవాలనిపించింది....ఈ సంవత్సర కాలం అసలు ఎలా గడిచిందో కూడా తెలీదు... పెళ్ళికి ముందు అంత భయపడ్డ అమ్మయినేనా ఇన్ని వేలమైళ్ళు అమ్మావాళ్ళకి దూరంగా ఉన్నది??

కాలం అన్నిటికి మందు....కాలం గడిచే కొద్ది కొన్ని మార్పులు జరిగిపోతూ ఉంటాయ్...ఈ సంవత్సర కాలం...ఎన్నెన్నో ఊసులు....ఎన్నెన్నో జ్ఞాపకాలు...చిలిపి తగాదాలు....ఆనందాలు.....ఓదార్పులు....అలకలు...హ్మ్...అలా హాయిగా సాగిపోయాయి రోజులు..

ఎవరో బ్లాగ్ లో చెప్పినట్లు.... 'పెళ్లి అనేది జీవితం లో మనం జరుపుకునే పెద్ద పండుగ'... ఆ పండుగ విశేషాలని  మీ అందరితో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.... :)

 మా పెళ్లిలో ని కొన్ని ముఖ్య ఘట్టాలు...ఫోటోల రూపంలో...

జీలకర్ర-బెల్లం:.

కన్యాదానం:

తలంబ్రాలు:

సప్తపది:21, అక్టోబర్ 2010, గురువారం

నేనే గెలిచా!! నేనే గెలిచా!!

ఈ మధ్య ఆట్టే పనీ,పాటా లేక ఒక మాయదారి దయ్యం నన్ను పట్టుకుంది.....అదే 'అంతర్జాలం లో వింత ఆటలు'...

ఇదివరకు చక్కగా పాటలు,పుస్తకాలు,కథలు,కవితలు అంటూ సాగిపోయిన నా జీవితం ఈ చక్రబంధం లో ఎరక్క వచ్చి ఇరుక్కుపోయి అటు లోపలా ఉండలేక..ఇటు బైటికి రాలేక....చచ్చే చావు వచ్చి పడింది...frustrated

పూర్వాశ్రమం లో అనగా కాలేజి రోజుల్లో  ఆర్కుట్ అనబడే ఒక సైటు మహత్యం వలన ఈ అవలక్షణం  నాకు అలవడిందిI don't know....అందులో 'Mind jolt Games' అని ఒక దిక్కుమాలిన అప్లికషను ని ఏడ్ చేసుకుని....అందులో 'Bouncing Balls','Gold Fishing','Staries','Crazy cabbie','tic-tac-too'...గాడిద గుడ్డు..హల్వా లడ్డు అని ఏవేవో పిచ్చి ఆటలు తెగ ఆడేదాన్ని.....నేను పెట్టె అప్ డేట్స్ చూసి మా ఫ్రెండ్స్ కూడా ఆడేవారుnot worthy...నువ్వా-నేనా అన్నట్లు పోటీలు పెట్టుకుని ఒకళ్ళ స్కోర్ ఒకళ్ళు బీట్ చేసుకునేవాళ్ళం...కొద్దిరోజులకి ఆ ముచ్చట కూడా తీరిపోయి ఇక ఏదో మొక్కుబడి గా ఆర్కుట్ ఓపెన్ చేసేదాన్ని....ఇక ఆ తరువాత ఉద్యోగం,భాద్యతలు...అవి ఇవి వచ్చి మొత్తం మీద నా ఆటలు అటకెక్కాయి ....feeling beat up


సర్లే అసలు మనకి ఏ వ్యసనము లేదు...దేనికి  బానిసలం కాదు...మనం  'క్వీన్ విక్టోరియా'cowboy అని చెప్పి తెగ ఫీల్ అయిపోయి...పోయి...బ్లాగ్ ముందు బొక్కబోర్లా పడ్డాను...ఇదేదో భలే ఉందేthinking...ఏం కావాలంటే అది రాసుకోవచ్చు అని చెప్పి దాన్ని మొదలుపెట్టా...(ఈ బ్లాగ్ కాదులెండి....నాకు ఒక ఇంగ్లీష్ బ్లాగ్ ఉంది)....అలా కంటిన్యు అవుతూ వచ్చింది...అరె! మన తెలుగులో నేనెందుకు బ్లాగట్లేదని ఫీల్ అయిపోతు అదీ మొదలుపెట్టా(ఈ బ్లాగే లెండి) ......అలా మూడు టపాలు...ఆరు కామెంట్లు తో సాగిపోతున్నంతలో...ఫేస్  బుక్  అమెరికా లో  ఫేమస్ అట కదా మనం అప్పుడెప్పుడో రెండు సంవత్సరాల క్రితం మొదలెట్టిన దాన్ని కొంచెం బూజు దులుపుదాం అని చెప్పి మరిచిపోయిన అకౌంట్ తాళంచెవిని మెయిల్ కి రప్పించుకుని మరీ ఫేస్  బుక్  తలుపులు తెరిచా!!


అప్పుడెప్పుడో కాలేజిలో పురుడు పోసుకున్న ఫేస్  బుక్  అకౌంట్ ఇంకా బ్రతికే ఉంది :) అందులో నా ఫ్రెండ్స్ ఆక్టివ్ గా కూడా ఉన్నారు!! ఇంకేం...మాటలు...ఛాటులు..వాల్ మీద  పోస్టులు.....కొద్దిరోజులకి ఆటలు మొదలయ్యాయి...ఆటలంటే ఆర్కుట్ లో లాగ అప్పటికప్పుడు స్కోర్ ఇచ్చేసేవి కాదు...ఇవి రోజులు...నెలలు...సంవత్సరాలు... తరబడి ఆడాలటsurprise(అదీ ముందు తెలిసి ఉంటే అసలు మొదలు పెట్టె దాన్నే కాదు )... ముందుగా 'ట్రెజర్ ఐల్' అని ఒక చెత్త  ఆట మొదలుపెట్టా...నా దీవి నేనే కట్టుకోవచ్చు..నాకు కావాల్సిన చెట్లు చేమలు నేనే పెట్టుకోవచ్చు...నాకు కావాల్సిన పొలాలు నేనే వేసుకోవచ్చు (కానీ స్ట్ర్రాబెర్రీ,పైన్ ఆపిల్,రాస్పబెర్రి,వాటర్ మిలన్  మాత్రమెనండోయ్....).రోజు నా పడవలో ఒక్కొక్క దీవికి వెళ్లి ఒక పార తో త్రవ్వి..త్రవ్వి..బంగారం,మణులు,బోషాణాలు..ఇలా ఎన్నో వెలికి తీయొచ్చు.....అప్పుడప్పుడు తప్పిపోయిన జంతువులకి ఆశ్రేయం ఇవ్వొచ్చు....ఇళ్ళు కట్టుకోవచ్చు.....రకరకాల వస్తువులు నాణేలు పెట్టి కొని అలంకరించుకోవచ్చు.ఇలా మన దీవిని మనకు కావలసినట్టు గా కస్టమైజ్ చేసుకోవచ్చుangel.కానీ వేరే దీవికి వెళ్లి నాణేలు,డబ్బులు,వజ్రాలు సంపాదించాలి...అందుకు శక్తి కావాలి... పైన  చెప్పిన పోలాల్లోవి తింటేనే నాకు శక్తి వస్తుంది (ఇదో పెద్ద గోల!! ఎనర్జీ అయిపోతే రోబో లాగ ఆగిపోతుంది మన బొమ్మ)......ఈ పొలాలు కూడా టైం కి కోత కోయకపోతే ఎండిపోతాయ్ .....sad.ఇలా ఈ ఐలాండ్ లో అదేపనిగా త్రవ్విపోసి....కొద్దిరోజులకి నా దీవి విస్తరించాను కూడా!!


ఇక  ఈ పిచ్చి ఆట నేను ఆడిందే కాకుండా పాపం ఇక్కడ M.S కోసం వచ్చిన నా ఫ్రెండ్ హిమజా కి అంటగట్టాdancing...ఇద్దరం పోటి పడి లెవెల్స్ మీద లెవెల్స్ పూర్తి చేసేసి...ఓ రేయింబవళ్ళు ఆడేసేవాళ్ళం...పంట కోత టైం కి సరిగ్గా కోసేయాలి అనే హడావిడి,ఆదుర్దా....అదీ అర్ధరాత్రైనా..అపరాత్రైనా పంట కోతల టైం కి నెట్ ముందు ప్రత్యక్షం.....కొన్నిసార్లు   వంట మధ్యలో వదిలేసి పొలం లో పళ్ళు కోసుకోడానికి వచ్చేసేదాన్ని...ఒక్కోసారి పొయ్యి మీద పెట్టిన పోపు మాడిపోయేది కూడా!! పోపు మాడినా పర్వాలేదు కానీ నా పొలం లో వేసిన పంట  మాడితే ఎలా?? big grinఒకవేళ  నాకు ఖాళి లేకపోతె ...'కొంచెం ట్రెజర్ ఐల్ ఆడిపెట్టవచ్చు కదా అలా టి.వి చూడకపోతే' అని చందు కి ఆర్డర్స్ కూడా వేసేదాన్నిhee hee.....నా పిచ్చి ముదిరి పాకన పడిందని గ్రహించిన  చందు 'ఇందు నువ్వు దీనికి అడిక్ట్ అయిపోయావ్..తొందరగా దీని నుంచి బైటపడితే మంచిది' అని ఉచిత సలహాలు పడేస్తే....'ఆ!! నేను బాగా ఆడేస్తున్న అని కుళ్ళు!!'angryఅనుకునేదాన్ని...


ఈ దరిద్రమే కాకుండా....కొత్త గా 'ఫారం విల్లె'...'ఫ్రాంటియర్ విల్లె'...'కేఫ్ వరల్డ్' లాంటి పిచ్చి ఆటలు మొదలుపెట్టాd'oh....(అవి ఇదే తరహా....ఈటీవి సీరియల్స్ లాగా అంతం ఉండదు.....ఆరంభం మాత్రమె..)...ఇక రాత్రి,పగలు ఇదే వ్యాపకం అయిపొయింది....సరదా అనుకున్నది వ్యసనం అయిపొయింది...".పొలాలు ఏమైపోతున్నాయో!!","కేఫ్ వరల్డ్ లో వంటలు ఎంతవరకు వచ్చాయో!!", "హిమజని నిన్న రెడ్ జెం పంపమన్న పంపిందో లేదో!!,'నిన్న కోడి పిల్లలకి దాణ వేసా..ఇవాల్టికి అవి పెద్దవయ్యాయో  లేదో!!' ఇదే గొడవ...ఆఖరికి కలలో కూడా నేను పలుగు పార పట్టుకుని ట్రెజర్ ఐలాండ్ లో త్రవ్వుతున్నట్టు....నాకు పెద్ద నిధి దొరికినట్టు....హయ్యో!! ఏం చెప్పను!!at wits' end


ఇక కొద్దిరోజులకి నాకు అర్ధమయిపోయింది....నేను వీటికి మెల్లగా బానిస అయిపోతున్నానని...(అయిపోతున్నా ఏమిటి నామొహం!! అయిపోయా!)sad అందుకే...ఒక సుభాముహుర్తాన .....డిజాస్టర్ రికవరీ ట్రీట్మెంట్ మొదలుపెట్టా.....గాట్టిగ నిర్ణయం తీసేసుకున్నాnerd...ఇక ఫేస్  బుక్  ఓపెన్ చేయకూడదని...దానికి శాస్వతంగా గుడ్ బై  చెప్పేయాలని....దానికి తగ్గట్టే  రెండు రోజుల షికాగో ట్రిప్ కలిసి వచ్చింది...వెళ్ళే ముందు  నిర్ణయించుకున్నా ....'ఇక మళ్లీ ఇంటికొచ్చినపుడు ఆ పిచ్చి  ఆటలు ఆడరాదు' అని....


రెండు రోజులు..హాయిగా ఏ గోల లేకుండా గడిపాను షికాగో లో...ఇంటికొచ్చాక తీసుకున్న నిర్ణయం గుర్తుకొచ్చింది....రెండు మూడు సార్లు వేళ్ళు గుంజాయిnail biting..'ఫేస్ బుక్ పెట్టు పెట్టు అని..' ....'ఊహు!! వీల్లేదు!!' అని మనసుకు గట్టి వార్నింగ్ ఇచ్చా!! అంతే  'టప్' అని నోరుముసుకుంది...ఆ తరువాత కొద్దిరోజులు  గోల చేసేది 'ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి పెట్టు!! అప్పుడప్పుడు ఆడదాం..రోజు వొద్దులే' అని బేరసారాలు కూడా మొదలుపెట్టిందిchatterbox....'నోరుమూసుకో!! తెరిచావంటే ఇడ్లీ పెట్టేస్తా!!' అని చెప్పి బెదిరించా...పాపం దానికి ఇడ్లీ అంటే పడదు లెండి...ఇంకేం చేస్తుంది....కుక్కిన పేను లా పడుంది...హమ్మయ్య అనుకున్నా!!!whew!


నేనే గెలిచా!! నేనే గెలిచా!! మనసు మీద నేనే గెలిచా!!thumbs up


ఇప్పుడు ఇక ట్రెజర్ ఐల్ లో పంటలు లేవు....కేఫ్ వరల్డ్ లో వంటలు లేవు.....ఫుల్ హాప్పీస్...happy

18, అక్టోబర్ 2010, సోమవారం

కన్నుల పండువ గా...

గత మూడు రోజులు....దసరా ఉత్సవాల్లో ముఖ్యమైనవి.....అష్టమి మొదలుకుని దశమి వరకు...సందడే సందడి....


మేము...మాకు దగ్గరలో ఉన్న గుళ్ళు అన్నీ చుట్టేసాం ఈ మూడు రోజుల్లో......కాంటన్,పశ్చిమ కాశీ,భారతీయ టెంపుల్,పరాశక్తి టెంపుల్....కానీ అన్నిటికంటే అంగరంగ వైభవంగా నవరాత్రి మహోత్సవాలు చేసినది మాత్రం 'పరాశక్తి టెంపుల్' లోనే.... నవరత్రుల్లు మొదటి రోజున వెళ్ళాము ఈ గుడికి ....ఆ రోజు వైభవం చూసే..దశమి రోజు ఇంకెంత బాగుంటుందో అనుకున్నా.... అనుకున్నదానికంటే ఘనంగా నిర్వహించారు......


ముఖ్యంగా అమ్మవారి విగ్రహం...అలంకరణ,....పూజ విధానం....ఆలయ కమిటి డిసిప్లిన్ వెరసి....పరాశక్తి గుడి ఈ నవరాత్రి మహోత్సవాలలో అన్నిటికంటే మిన్నగా ఉంది అని చెప్పొచ్చు....అదేమిటో మరి! మిగితా అన్నీ  గుళ్ళు వెలవెల బోయినట్లు ఉన్నాయి....ఒక్క ఈ గుడి తప్ప....


ఇక నిన్న...అనగా దశమి రోజున...అసలే అందంగా అలరారే అమ్మవారిని ఇంకా అందంగా అలంకరించారు.... గులబిమాలలతో...రక రకాల పూల తో చేసిన ఆ అలంకరణ వర్ణనాతీతం ...అమ్మవారిని చూస్తే నాకు అన్నమయ కీర్తన గుర్తొచింది....'ఏమని పొగడుదుమే ఇక నిను!! ఆమని సొబగుల అలమేల్మంగా!! ఏమని పొగడుదుమే!!' అని.... అలంకరణ తరువాత దర్శనం అయ్యాక పూజారులు చదివిన వేదాలు ఆ హాల్ లో ప్రతిధ్వనిస్తుండగా అందరూ అలౌకికమైన భక్తీ పారవశ్యం లో మునిగిపోయారు...సుమారు  మూడు గంటలు....ఎటువంటి విసుగు,చికాకు లేకుండా దైవధ్యానం లో యిట్టె గడిచిపోయాయి....


ప్రతి సంవత్సరం నాకు దసరాలు అపుడు శ్రీశైలం వెళ్ళడం అలవాటు....క్రిందటి ఏడాది నాన్నగారికి బాగోక వెళ్ళలేదు..అలా తప్పిన ఆనవాయితీ ఈ సారి అలవాటయింది....అయినా కూడా ఆ లోటు తీర్చేసినట్టు దర్సనమిచ్చిన పరాశక్తి మాతకు నమస్సుమాంజలి.....


దసరా చివరి మూడురోజులు...చాలా ఆహ్లాదంగా,ఆనందంగా  గడిచాయి...ఆ తల్లి అందరికీ సకల శుభాలని అనుగ్రహించాలని ఆకాంక్షిస్తున్నాను....

13, అక్టోబర్ 2010, బుధవారం

సరదా దసరా

దసరా....చాలా సరదా సరదా గా గడిచిపోయేది చిన్నపుడు.పది రోజుల సెలవులు.....పెద్దపండగ కలిసి ....ఆటలే ఆటలు....గోలే గోల.
అమ్మ మాకోసం కష్టపడి కజ్జికాయలు,కొబ్బరి బూరెలు,కారప్పూస, చెక్కలు,రవ్వలడ్లు,బూంది లడ్లు....ఇలా ఎన్నో చేసి పెట్టేది....అవన్నీ తినడం...అవి అరిగేదాక ఆడడం ఈ పది రోజుల దినచర్య.
చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది.అది నా ఐదవ తరగతి లో అనుకుంటా జరిగింది.నాన్న మాకు అప్పుడే లలితా సహస్రనామాలు చదవడం నేర్పిస్తున్నారు...వాటి విశిష్టత...గొప్పతనం గురించి రోజు కొంచెం కొంచెం చెప్పేవారు.ఒక సారి ఇలాగె చెబుతూ....ఏమన్నా రోగాలు,జ్వరం వచ్చినా ఆ రోగి తల పై చెయ్యి పెట్టి లలిత చదివితే తగ్గిపోతుంది అని చెప్పారు.అది బాగా మెదడు లో పాతుకుపోయింది నాకు,తమ్ముడికి. 


ఒక రోజు మధ్యాహ్నం అమ్మ పాపం పిండి వంటలు చేసి అలసిపోయి నిద్రపోతోంది బెడ్రూం లో.నేను మా తమ్ముడు వరండాలో ఏవో ఆడుకుంటున్నాం. నేను భారత నాట్యం నేర్చుకునే రోజులు అవి. నేనేదో మాములుగా డాన్స్ చేస్తుంటే మా తమ్ముడు 'అక్కా! నేను తాళం వేస్తా నువ్వు చెయ్యి' అన్నాడు.గోడకు తగిలించే ఛార్ట్ కి ఉండే చెక్క తీసుకొచ్చి నేల మీద వాడికి ఇష్టం వచ్చినట్టుగా దరువేస్తున్నాడు. నేనేమో పూనకం వచ్చ్సిన దానిలాగా డాన్స్ చేస్తున్నా.ఇంతలో కాలు లో ఏదో గుచ్చుకున్న ఫీలింగ్.,అయినా తగ్గకుండా వీరావేశం తో తెగ చేసేస్తున్నా డాన్స్ తకదిమి...తకదిమి అనుకుంటూ.ఇంతలో మా తమ్ముడు....'అక్కా! రక్తం..రక్తం!!' అని అరిచాడు..అపుడు చూసుకున్నా...కాలులో చిన్న మేకు దిగింది.మనం ఆపకుండా దానిమీదే డాన్స్ చేయడం వల్ల అది లోపలి దిగబడిపోయింది కూడా...రక్తం ధారాపాతంగా కారిపోతోంది....వాడేమో భయంతో బిత్తరపోయి చూస్తున్నాడు....అప్పుడు నొప్పి తెలిసి ఆరున్నొక్క రాగం మొదలుపెట్టా.నన్ను చూసి వాడు ఏడుపు మొదలెట్టాడు..కాసేపయ్యాక వాడు  ఏడుపు ఆపి ఏదో గుర్తొచ్చిన వాడిలా పూజ మందిరం లోకి వెళ్లి కాటన్ అనుకుని పత్తి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు.నేను మేకు మెల్లగా తీసి అవతల పారేసి ఆ పత్తి తీసుకుని మేకు దిగబడిన చోట పెట్టా.అయినా భయం తగ్గని మా తమ్ముడు మళ్లీ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి 'లలితా సహస్రనామాలు' పుస్తకం తెచ్చి వాడి కుడి చేయి నా తల మీద పెట్టి  వచ్చీ రానీ ఆ నామాలను చాలా కష్టపడి చదివేస్తున్నాడు....ఎలాగైనా అమ్మ లేచే లోగ ఆ గాయం మానిపోవాలని వాడి ఉద్దేశం
ఇంతలో అనుకున్నంతా అయ్యింది.మా హడావిడి కి,ఏడుపులకి అమ్మ లేచేసింది. 'ఏం జరుగుతోంది ఇక్కడ?' అని అడిగింది. భయపడుతూ....అసలు విషయం చెప్పాను.అంతే!! ఇద్దరి వీపుల మీద మద్దెల దరువులు. 'అసలే తుప్పు పట్టిన మేకు.....అదికాకుండా పత్తి తీసుకొచ్చి దానికి పెడతావా? సెప్టిక్ అవుతుందే...ఏం పిల్లలు దొరికారు దేవుడా....పిల్లలు కాదు పిశాచాలు!!' అని తిట్ల తలంటు పోసింది.'ఏం కాదు...నేను లలితా సహస్రనామాలు చదివా....అక్క తల మీద చేయి పెట్టి.అంతా బాగయిపోతుంది. నాన్న చెప్పారు కదా నిన్న' అని మా తమ్ముడు అమాయకపు ఫేస్ పెట్టుకుని చెప్తుంటే వాడికి లాగిపెట్టి  ఒక్కటి ఇచ్చి'చేసిందంతా చేసి ఇంకా వెధవ్వేషాలు ఒకటి' అని తిట్టి హడావిడిగా నన్ను హాస్పిటల్ కి లాక్కెళ్ళి చుర్రుమని టెట్వాక్ ఇంజెక్షన్ చేయించింది మా అమ్మ....అంతటితో ఊరుకుందా? లేదు..సాయంత్రం నాన్నారు రాగానే మళ్లీ రెండవ రౌండు తిట్లు కోటింగ్ వేయించింది...
ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నవ్వొస్తోంది నేను,మా తమ్ముడు చేసిన అమాయకపు పనులు,అల్లరి.......ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండు.....ఆ దసరా సరదాలు మళ్లీ వెనక్కి వస్తే బాగుండు...

11, అక్టోబర్ 2010, సోమవారం

ఆలయాలు....వాటి విశిష్టత....


హిందుత్వం....ఒక మతం లా కాక ఒక సాంప్రదాయం లా నేను భావిస్తాను..గౌరవిస్తాను...


ఒక మనిషి సమాజం లో ఎలా మెలగాలి...తన విధులు,పరిధులు,భాద్యతలు అనునిత్యం  గుర్తు చేసేదే హిందుత్వం.ప్రక్రుతి లో మమేకమై మెలగడం కూడా అందులో ఒక భాగమే..

షికాగో లో 'స్వామీ నారాయణన్' గుడికి వెళ్ళాను....అక్కడ లోపలికి  వెళ్ళే దారిలో కొన్ని ఫోటో ఫ్రేమ్స్  పెట్టారు....వాటిల్లో మన ఆలయాల గురించి వ్రాసిన కొన్ని వ్యాఖ్యలు నాకు నచ్చాయి...ఆలయాలకి-ప్రకృతికి ముడి పెడుతూ...మనిషి యొక్క ఆలోచనలను ప్రభావితం చేసేవిగా చెప్పబడిన ఆ వ్యాఖ్యలు కొన్ని ఇక్కడ వ్రాస్తున్నాను....


ఆలయ శిఖరం-పర్వత శిఖరం వలె ఎత్తు గా ఉండి,దైవం ఎప్పుడు ఉన్నతంగా ఉంటుందని అది చేరుకోవడం ప్రతి జీవి యొక్క  జన్మ కి పరమార్ధం  అని సూచిస్తుంది.అందుకే ఆలయాలు...పర్వతాలను పోలి ఉంటాయి.

ఆలయ కలశం-అమృతత్వానికి చిహ్నంగా,స్వచ్చతకు ప్రామాణికంగా నిలుస్తూ మనిషి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని సూచిస్తుంది.

ఆలయ స్థంబాలు-అడవిలో నిటారుగా,ధృడంగా ఉండే చెట్ల వలె ఉండి....ధృడ చిత్తానికి సంకేతంగా ఉంటాయి.

ఆలయ పతాకము-ధ్వజ స్థంబం మీద ఉండే పతాకము...చెడు పై మంచి  సాధించిన విజయానికి ప్రతీక గా రెపరెప లాడుతూ ఉంటుంది.

ఆలయం పై కప్పు- జ్ఞానాన్ని మనిషి మీద కురిపిస్తున్నట్టు గా దైవత్వానికి చిహ్నంగా ఉంటుంది.

ఆలయ కుడ్యాలు-ఆలయం గోడలపై,స్థంబాలపై,పైకప్పు  పై  చెక్కే పూలు,లతలు....రాయిని కూడా పూవు గా మలచబడే కోమలత్వానికి చిహ్నంగా నిలుస్తుంది.

చిరుగంటలు-చిరుగాలికే కిల కిల మంటూ ఊగే గంటలు....మనసులో ఉండే చెడు ఆలోచనలు దూరం చేసి దైవం మీద ధ్యాస ఉండేలా చేస్తాయి.

గుడిలో వెలిగించే దీపం- అజ్ఞానపు అంధకారాలను  పారద్రోలి....ఎల్లప్పుడూ ప్రకాశించే ఆ దేవదేవుని దివ్య ముఖారవిందం లా  కోటి సూర్యకాంతి ప్రతిఫలిస్తుంటుంది.

గర్భాలయం లో మూర్తులు- 'మూర్తి పూజ' అనేది దైవానికి పక రూపం ఇచ్చి,ప్రాణ ప్రతిష్ట  చేసి...మనసు పరిపరి విధాల పోకుండా ఆ మూర్తి మీదే నిలిపి...ధ్యానించడానికి...ముక్తి ని పొందడానికి.....

ఇవి...మన ఆలయాలలో ఉండే విశిష్టత....గుడి లో చేసే ప్రతి కార్యం,విధానం కి ఏదో ఒక సూక్ష్మార్ధం ఉంటుంది అని పెద్దలు చెప్పే మాటలు నిజమనిపించాయి అవి చూసిన తరువాత.మన వాళ్ళు గుళ్ళు అల్లాటప్పా గా కట్టలేదు...చాలా విశ్లేషించి,లోతు గా అలోచించి నిర్మించిన అద్భుతాలు....మన ఆలయాలు.

5, అక్టోబర్ 2010, మంగళవారం

బుజ్జి పిల్లి నోట శివుని పాట.

' టాకింగ్ టాం'... iPhone లో ఈమధ్య వచ్చిన ఫన్నీ App.మనం ఏది అంటే అదే అనే పిల్లి ఇది.


దానితో 'మహేష్ ఖలేజ' లో ని 'సదా శివ' పాట పాడించి ఎవరో Youtube  లో పెట్టారు...

నాకైతే భలే నచ్చేసింది.బుజ్జి నోటి తో ఎంత ముద్దుగా పాడుతోందో...

మీరు చూడండి...ఈ  బుజ్జి పిల్లి పాట ని ....


4, అక్టోబర్ 2010, సోమవారం

ఆకాశం హొయలు...

ఆకాశమనే కాన్వాసు పై...తన సువర్ణ కిరణాలను కుంచెగా మలచి...సూర్యారావు గారు  గీసిన అపురూప చిత్రాలు....


నిన్న సాయంత్రం బైటికెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నపుడు ఆకాశం లో కనిపించిన సుందర దృశ్యాలు ఇవి....


2, అక్టోబర్ 2010, శనివారం

చిరు జల్లులు....

పొద్దున నించి ముసురు పట్టింది..సన్నగా వర్షం పడుతోంది...
అదేదో పార్క్ లో 'ఫాల్ ఫెస్ట్' ఉంది...వెళ్దాం అనుకున్నాం....కానీ ఈ వర్షం దెబ్బకి ఇంట్లోనే ఉండిపోయాం....
ఒక చినుకు..అర చినుకు...అలా కురుస్తూనే ఉంది కానీ కాసేపైన రెస్ట్ తీసుకుని మమ్మల్ని కనికరించోచ్చుగా!!
గాలి బాగా వీస్తోందేమో  చెట్లు దయ్యాల్లా ఊగుతున్నాయ్....మా ఇంటి ఎదురు ఉన్న చెట్టు ఊగటమే కాక ఆకులు కూడా తెగ  రాలుస్తోంది...
నాకేమో బైటికెళ్ళి అలా అలా తిరగాలనుంది....కానీ ఆ చలికి తట్టుకోలేము వద్దు అని చందు వాదన :(
నిజమే కాబోలు  పొద్దునించి అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియా లో ఒక్క కార్ కూడా కదలలేదు....
అసలు వర్షం వస్తే ఇంట్లో కూర్చుని ఉండటం ఎంత కష్టమో నాకు....ఎప్పుడెప్పుడు బైటికెళ్ళి తడుద్దామా అనే!!కానీ జలుబు...అదీ ఇది అని ఏవేవో వంకలు చెప్తారు అందరూ....నాకేమో చిరాకు.... 
హ్మ్....ఇక చేసేదేమీ లేక కిటికీ లోనించి అలా వర్షాన్ని చూస్తూ ఆనందిస్తున్నా...అలా చూస్తూ ఉంటే ఏదన్నా కవిత రాయాలనిపించింది...కానీ ఏమి రాయబుద్ది కావట్లేదు....మనసు జ్ఞాపకాల పేజీలు వెనక్కి తిప్పుతోంది...


నేను ఇంజనీరింగ్ చదివేటపుడు...హాస్టల్ లో ఉండే రోజుల్లో....ఒక సారి బాగా వర్షం పడింది....కాసేపు ఒద్దులే,బాగోదేమో అని ఊరుకున్నా ఇక ఆగలేక డాబా మీదకి గొడుగు వేసుకెళ్ళి నేను,రాజి,ఫణిత ఇంకా తన చెల్లెళ్ళు... అందరం భలే ఆడుకున్నాం.....తెచ్చిన గోడుగుని ఎక్కడో పడేసి,డాబా మీద నిలిచి పోయిన నీళ్ళలో గెంతుతూ...ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు జల్లుకుంటూ......ఆ వర్షం లోనే చలి వేస్తున్నా దొంగ-పోలిస్ ఆట ఆడుకుంటూ....వర్షం లో తడిసి ముద్దవుతున్న పూలను ముద్దుపెట్టుకుంటూ..... ఆహా!! ఎంత హాయిగా గడిచిపోయాయి ఆ రోజులు! ఆ తరువాత రూం లో తలుపు దగ్గర కుర్చీలో కూర్చుని...ఆ చినుకులు చేసే చప్పుడు ఆస్వాదిస్తూ...ఆ మట్టి వాసన ఆఘ్రానిస్తూ....ఆ వర్షాన్నే చూస్తున్న నాకు ఒక కవిత రాయాలనిపించింది...అప్పటికప్పుడు పెన్ను,పేపరు పట్టుకుని రాసేసా!!.....ఆంటీ వేసిన వేడి వేడి పకోడిలతోపాటు నా బుర్ర కూడా తినేస్తోన్న రాజి నేను రాస్తున్న పేపర్ లాగేసుకుని మరీ  చూసింది.అప్పటిదాకా మనకి ఇలాంటి ఒక వ్యాపకం ఉందని తెలీని రాజి....అది చూసి ఒక పిచ్చి మొహం పెట్టింది...'ఏంటి అంత చండాలంగా రాశాన?' అని నేను దిగాలుగా మొహం  పెట్టాను....'కవిత బానే ఉంది కానీ నాకు కొన్ని కొన్ని వర్డ్స్ మీనింగ్స్ తెలీదే!' అంది...అప్పుడు తట్టింది నాకు  మేడం గారు సెంట్రల్ స్కూల్ లో చదివారని. తరువాత నా కవితల దయవల్ల రాజీకి తెలుగు బానే వచ్చింది....అలాగే నా ప్రతి కవిత కి బలి అయింది కూడా పాపం రాజినే... 


ఏంటో!! ఏమైపోయాయో ఆ రోజులు....వర్షం లో ఆటలు...వెన్నెల్లో ముచ్చట్లు....చుక్కల్ని లెక్కబెడుతూ చెప్పుకునే కబుర్లు.....జీవితం పై ఎన్నెన్నో ఆశలు....కళ్ళలో ఎన్నెన్నో రంగుల కలలు.... 


అప్పటి విశేషాలు ఇప్పటి జ్ఞాపకాలైపోయాయి....నిన్న,మొన్న జరిగినట్టే ఉన్నాయి...కాలేజి వదిలిపెట్టి అప్పుడే రెండు సంవత్సరాలైపోయిందా అనిపిస్తోంది....కాలం పరుగు చాలా వేగం కదా!!...