20, ఆగస్టు 2010, శుక్రవారం

తప్పిపోయిన నేస్తం....



నన్ను నన్నుగా అభిమానించి....నాతో స్నేహం చేసి.....ఎంతో ప్రేమ కురిపించి....చిన్న మనస్పర్ధల వల్ల దూరమైన నా నేస్తం...'అచ్చు కుట్టి'(అసలు పేరు  'అర్చన')


ఇంటర్ లో ఉండగా తను నాకు పరిచయమైంది ..... బిక్కు బిక్కుమంటూ  క్లాసులోకి అడుగుపెట్టిన నాకు,కొంచెం లేటుగా వెళ్ళడం వల్ల  కూర్చోడానికి ఎక్కడా చోటు లేదు....ఎలాగో అలా సర్దుకుని కూర్చుందాం అని చూస్తే ...అందరూ వెర్రిమొహాలు వేసుకుని చూసేవాళ్ళే తప్ప ఒక్కరు చోటివ్వరే!!! అప్పుడు నన్ను పిలిచి తను  సర్దుకుని నాకు చోటు ఇచ్చిన అమ్మాయే ఈ 'అచ్చు కుట్టి'.... అప్పటినించి మొదలయిన మా స్నేహం తొందరలోనే మమ్మల్ని ప్రాణ స్నేహితులని చేసింది ...తన మాటలు భలే గమ్మత్తు గా ఉంటాయ్ !! తమిళనాడు నించి వచ్చిన తెలుగు అమ్మాయి అవడం వల్ల తెలుగు లో వచ్చీ రాకుండా వింత వింత గా మాట్లాడేది....తన తెలుగు ఉచ్చారణ మొదట్లో నవ్వు తెప్పించినా అంత కష్టపడి తెలుగు మాట్లాడుతున్నందుకు చాలా  సంతోషమేసేది.......తను చాలా చక్కగా ఉండేది....తన పొడవైన జడ నాకు భలే ఇష్టం....కోయంబత్తూరు నించి తెచ్చిన చిప్స్ అని,అవని ఇవని ఏవేవో  తెచ్చి పెడుతూ ఉండేది....


ఒక ఆదివారం రోజున కాలేజి లో పెట్టె పరీక్ష వ్రాసేసాక నాకోసం బయట ఎదురుచూస్తూ నిల్చుంది....అప్పటికే మా నాన్న అక్కడే నాకోసం చూస్తున్నారు....సరే అని తనకు  'బై' చెప్పి వద్దామని వెళితే 'ఇవాళ మా ఇంటికి రావాలి నాన్న ఊరినించి వచ్చారు....ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తా' అంది....ఎప్పుడు ఎవరి ఇళ్ళకి పెద్దగా వెళ్ళే అలవాటు లేని నాకు ముందు భయం వేసింది....'మా నాన్న ఒప్పుకోరులే ....ఈసారికి ఒద్దు ఇంకోసారి చూద్దాం  అన్నా!!'....'నేను మాట్లడతాగా!!' అని ధైర్యంగా నాన్న దగ్గరకి వెళ్లి విషయం చెప్పి నన్ను తీసుకెల్తా అని అడిగింది....ఇలాంటి విషయాల్లో చాలా కచ్చితంగా ఉండే నాన్న ఏమనుకున్నారో ఏమో 'సరే మరి జాగ్రత్తగా వెళ్లిరా....వచ్చేటపుడు ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసేయ్....త్వరగా వచ్చేయి ఎక్కువసేపు ఉండకు' అని చెప్పి నన్ను  పంపారు....తన బండి మీద కూర్చోబెట్టుకుని వాళ్ళ  ఇంటికి తీసుకెళ్ళింది.... వాళ్ళ అమ్మ-నాన్న నన్ను చూసి చాలా సంతోషించి లోపలి రమ్మని  పిలిచారు....వాళ్ళ నాన్నగారు చాలా సౌమ్యంగా మాట్లాడారు...'మా అమ్మాయి ఎవరితోనూ ఎక్కువగా  కలవదమ్మా....కానీ నీ గురించి రోజు చెబుతూనే ఉంటుంది.....అందుకే ఒకసారి తీసుకురమ్మన్నాను..' అన్నారు. వాళ్ళ అమ్మ నాకోసం అప్పటికప్పుడు ఫ్రైడ్రైస్ చేసి పెట్టారు...అచ్చుకుట్టి ఏమో బంగాళదుంప బజ్జీలు వేసింది....మాటల్లో వాళ్ళ అమ్మగారు అన్నారు...'తనకి నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం అమ్మా!! తనకి స్నేహితులు తక్కువే అయినా ఉన్నవాళ్ళందరూ తన ప్రాణస్నేహితులు...తను నిన్ను అలాగే భావిస్తోంది.....కానీ చిన్నపిల్ల మనస్తత్వం ఇంకా పోలేదు....తనని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే భరించలేదు' అని...అప్పుడే అనుకున్న 'ఎప్పుడు అచ్చుకుట్టి ని బాధపెట్టకూడదు,నిర్లక్ష్యం చేయకూడదు' అని.....


తరువాత నేను తనని ఎప్పుడూ బాధ పెట్టకుండా జాగ్రత్తగా చూసుకునేదాన్ని....కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా.....నాకు అచ్చుకుట్టి లాగే ఇంకో స్నేహితురాలు 'స్వప్న' ఉండేది...ముందు ముగ్గురం బానే స్నేహంగా ఉండేవాళ్ళం.....కానీ ఒకరోజు అచ్చుకుట్టి 'ఇంకెప్పుడు నువ్వు స్వప్న తో మాట్లాడొద్దు...నాకు ఇష్టం లేదు' అంది...కారణం అడిగితే చెప్పదు...అటు పక్క స్వప్న కూడా 'ఇంకెప్పుడు అచ్చుకుట్టి తో మాట్లాడకు...దానికి కుళ్ళు మనం బాగా స్నేహంగా ఉంటున్నామని' అంది.....'ఏమైంది వీళ్ళిద్దరికీ??బానే ఉన్నారు కదా ఇన్ని రోజులు??? ఇప్పుడు ఎవర్ని ఒదులుకోవాలి??ఏంచేయాలి??' అని తీవ్రంగా ఆలోచించా.....'పొతే పోనిలే....ఇద్దరితో మాములుగానే ఉందాం...ఏమవుతుందో చూద్దాం' అని ఊరుకున్నా....అంతలో పరీక్షలు దగ్గర పడ్డాయి....ఇక ఆ ధ్యాసలో మునిగిపోయి ఇవేమీ పట్టించుకోలేదు....కొద్దిరోజులకి అచ్చుకుట్టి నాతో మాట్లాడడం పూర్తిగా మానేసింది....నాదగ్గర కాకుండా వేరుగా కూర్చునేది....పలకరిచ్చినా మాట్లాడేది కాదు,...నాకు చాల బాధేసేది... ఎందుకిలా  చేస్తోంది?? అని.ఒకరోజు అడిగా....'ఇక ఇంతేనా???? మాట్లాడవా??? ఇంకో వారం లో పరీక్షలు మొదలవుతాయ్.తరువాత ఎవరిదారి వారిదే.ఇప్పుడు ఎందుకిలా  చేస్తున్నావ్? నా తప్పేంటి?' అని.'నువ్వు స్వప్న తో మాట్లాడకు.అంతే!' అనేసి వెళ్ళిపోయింది...నాకు చాలా  కోపమొచ్చింది.'ఏమి చెప్పకుండా ఏంటి ఇది? పోన్లే అని ఊరుకుంటే మరీ  మొండిగా చేస్తోంది' అని ఇక నేను తనతో మాట్లాడడం మానేశా. కొద్దిరోజులకి పరీక్షలు అయిపోయాయి....అందరం విడిపోయేటప్పుడు తన 'ఆటోగ్రాఫ్' కోసం వెళ్ళా...'నేను స్వప్న తో మాట్లాడొద్దు అన్నది నీకోసమే.....తన ప్రవర్తన మంచిది కాదు.....నీ ముందు ఒకలాగా, బయట ఇంకోలాగా నటిస్తున్నది.....తనతో స్నేహం చేస్తే నిన్ను అలాగే అనుకుంటారు అని 'వొద్దు' అన్నా!! కానీ నువ్వు నన్ను నమ్మలేదు....నమ్మకం లేనపుడు స్నేహం లేదు....స్నేహమే లేనపుడు జ్ఞాపకాలేందుకు ???' అనేసి వెళ్ళిపోయింది....నాకు చాలా బాధేసింది....ఏమిచేయలేక అలా చూస్తూ ఉండిపోయా!!


తరువాత 4 సంవత్సరాలకి మళ్ళి 'స్వప్న' కనిపించింది....అప్పుడు బయటపడింది తన అసలు రూపం....అచ్చుకుట్టి చెప్పింది నిజమే....నేనే పొరబడ్డాను...స్వప్న చాలా అమాయకంగా నటించి నన్ను అచ్చుకుట్టి ని వేరు చేయాలనీ చూసింది(వేరు చేసేసింది కూడా!!)...నాకు తప్పు తెలిసొచ్చింది....వెంటనే అచ్చుకుట్టి ని కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను....అక్కడ వాచ్ మెన్ చెప్పాడు వాళ్ళు ఇల్లు ఖాళి చేసి తమిళనాడు వెళ్లిపోయారని .....కనీసం తను ఎక్కడ ఉందో కూడా తెలీదు....తనకోసం చాలా వెతికా...పాత స్నేహితులు....ఆర్కుట్....గూగుల్....కానీ దొరకలేదు.....అలా నన్ను ఎంతో అభిమానించే నా ప్రియనేస్తం తప్పిపోయింది.... :(

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

chala bagundi andi thanks for sharing, idi chadivaka na flash back loki vella, 7th class lo chitti (divya) inti edurugane illu roju bale adukunevallam transfer ayyi vijayawada vellaru, evaru aina english copywriting lo evi aina sentences oh, words oh rastatu nenu matram i love you divya ani rase vadni ofcoure rendu sarlu intlo dorikanu lendi a age lo evaru antaga pattichukoledu... pedda vadini ayye koddi tana ekkadavunda ani vetakatanike naaku 8years pattindi... kaani ippudu appati laaga ledu... I Miss her and gained her but not happy...

Ur's - DeepU

ఇందు చెప్పారు...

@DeepU: baboy 8yrs vetikaara?? hmmmmm ponlendi okkosari konni ala jarigipotu untay :)

sivaprasad చెప్పారు...

రాఖీ శుభాకాంక్షలు

అశోక్ పాపాయి చెప్పారు...

తప్పిపోయిన స్నేహితురాలి గురించి ఎంత బాధపడతారో నాకు తెలుసండి..మీ బాధ నాకు అర్ధం అయ్యింద. వెతుకుతు ఉండండి మీ స్నేహితురాలుని మీరు మల్లి తప్పక కలుస్తారని ఆశిస్తూ...

ఇందు చెప్పారు...

@sivaprasad nidamanuri : థ్యాంక్యు..
@అశోక్ పాపాయి :థ్యాంక్స్ అండీ...అలగే...వెతుకుతూ ఉంటాను...ఇక అంతకంటే ఎంచేయగలను??

చందు చెప్పారు...

అచ్చుకుట్టి తప్పక దొరుకుతుంది. పోలికలు చెప్తే నేను అక్కడక్కడా "అచ్చుకుట్టి, అచ్చు కుట్టి" అని ఎవరైన ఒంటరిగా వెతుకుతుంటే పిలిచి "ఊ" అంటే "ఇందు తెలుసా?" అని అడుగుతాను. జస్ట్ కిడ్డింగ్. పాపం అచ్చు కుట్టి ఎంత బాధ పడిందో

srinu చెప్పారు...

papam