8, ఆగస్టు 2020, శనివారం

పది వసంతాల బ్లాగాయణం!!

ఆగష్టు 7, 2010

పది సంవత్సరాల క్రితం....

ఏమీ తోచక.... ఎక్కడ రాయాలో... ఎలా రాయాలో... రాస్తే ఎవరన్నా చూస్తారా? అసలు నాకు రాసి పబ్లిష్ చేసే సినిమా ఉందా? అందులో తప్పులు దొర్లితే? ఆలోచనలే తప్పంటే? ఎవరన్నా ఏమన్నా అంటారా?  ఇలా బోలెడు డౌటనుమానాలతో బితుకు బితుకుమంటూ మొదలుపెట్టా నా బ్లాగు.... 'వెన్నెల సంతకం'.

రాయాలన్న ఉత్సుకత , భావుకత , సమయం , బుర్ర నిండా ఆలోచనలు, మనసు నిండా భావాలు ఉన్న రోజులు! వాటికి కీబోర్డ్ ఊతమిస్తే ,  కనిపిస్తున్న అక్షరమాలికే నా బ్లాగ్!

నా బ్లాగ్.... నా ఇష్టం అన్నట్టు రాసేదాన్ని! :))

కాలం ముందు సాగిపోయింది .... జీవితంలో ఎన్నో మార్పులు!

ఇద్దరు పిల్లలతో సంసార భవసాగరాల్లో ఎప్పుడో కొట్టుకుపోయా!!

ఇల్లు, పిల్లలు, పని.... ఇంతే! ఆఖరికి అమ్మా-నాన్నలకి కాల్ చేయడానికి కూడా ఫ్రీ టైం చూసుకునే స్టేజికి వచ్చా !

ఇంకేం భావుకత? ఇంకేం చిలిపిదనం? ఇంకేం వెన్నెలలు? ఇంకేం కవితలు హ్హహ్హహ్హ!! :)))

ఎన్ని పోస్ట్లు రాసానో! ఎప్పుడు లెక్క పెట్టలేదు కానీ.... రాసిన పోస్ట్  మళ్ళీ ఎప్పుడైనా తిరిగి చూసుకుంటే ఆశ్చర్యం వేసేది ... ఇది నేనేనా రాసింది అని.

చాలాసార్లు నేను రాసిన వాటిలో అర్ధం వెతుక్కోవాల్సి వచ్చేది . ఇది ఎలా రాసా? అలా ఎందుకు ఆలోచించా.... లాంటి పనికిమాలిన బ్రెయిన్ స్టార్మింగ్ అన్నమాట ;)

కానీ ఒక్కటి... అప్పటి ఇందు... ఇంకా నాలో ఉందా లేదా అని ఆత్మశోధన  చేస్తూ ఉంటా ఈ బ్లాగ్ చూసినప్పుడల్లా! :)

ఎన్నిరోజులయిందో నా బ్లాగ్ ఓపెన్ చేసి .....  ఎప్పుడో ఉగాదికి అదీ బ్లాగ్ మిత్రులు అంతా సరదాగా మొదలు  పెడితే నేనూ  దుమ్ము దులిపా!! అంతే ! మళ్ళీ ఇటు చూస్తే ఒట్టు!

నిన్న అర్ధరాత్రి ఎందుకు బ్లాగు ఓపెన్ అయిందో! యథాలాపంగా జీమెయిల్ ఓపెన్ చేశా.. ఎదో నొక్కితే... బ్లాగర్ ఓపెన్ అయింది...   నిద్ర పట్టక దొర్లుతున్న నాకు మళ్ళీ  పాత పోస్ట్లు అన్నీ చూస్తూ ఉంటె .... ఎన్ని జ్ఞాపకాలు! ఆ కామెంట్స్ , అందులో హాస్యం, చిలిపిదనం , స్నేహం , ఆత్మీయత ... ఆ బ్లాగ్ రోజులే వేరు!

కానీ ఈ బ్లాగ్ నాకు ఆత్మశోధనకు పనికిరావడంతోపాటు .... ఇంకొన్ని ఇచ్చింది . నేస్తాలు! బ్లాగ్ నేస్తాలు!

ఒకళ్ళా... ఇద్దరా?

కొత్తావకాయ గారు, సుజాత గారు, కొత్తపాళీ గారు, ఎన్నెలమ్మ , వరూధిని గారు, జ్యోతి గారు , రాధికా(నాని) గారు, రమణి గారు , రౌడీ గారు , పడమటి గోదావరి రాజు గారు , వేణు గారు , పప్పు సార్, కౌముది కాంతి గారు , జీవని ప్రసాద్ గారు , బులుసు గారు , చంద్రకళ , మధుర , నిషీ , మురళి, వెన్నెల కిరణ్ , ఆ . సౌమ్య ,  వి. సౌమ్య ,  రాజ్ కుమార్, చారి, బంతి, రహమాన్ , ఆండీ , కార్తీక్ , స్వాతి , లత, లలిత , కావ్య , మంచు పల్లకి ..... ఇలా బోలెడు మంది.

వీరిలో స్వయంగా కలిసిన వాళ్ళు ఉన్నారు . ఫెస్బుక్ లో హలో చెప్పేవాళ్ళు  ఉన్నారు , వాట్సాప్ లో పలకరించేవాళ్ళు ఉన్నారు ... అప్పుడప్పుడు మెయిల్ పెట్టేవాళ్ళు ఉన్నారు.

ఎన్నో పరిచయాలు! ఎన్నో స్నేహాలు ! ఇంతమందిని  నాకు కలిసే భాగ్యం ఈ బ్లాగ్ వల్లే కదా! నేను రాసిన నాలుగు ముక్కల్ని అభిమానించే వీళ్లు నాకు నేస్తాలు అయ్యారు కదా! వీళ్ళతో మాట్లాడినప్పుడల్లా నాకు బ్లాగ్ గుర్తొస్తూనే ఉంటుంది!

మరి ఇంత చేసిన నా బ్లాగు ..... తన పదవ పుట్టినరోజున తానే స్వయంగా ఓపెన్ అయ్యి మరీ విష్ చేయమని చెప్పింది హ్హహ్హహ్హ! (నన్ను మర్చిపోకు అంటూ ). ఎంత ప్రేమ! కదా!

నా మనసులో వెన్నెలలు కురిపించిన 'వెన్నెల సంతకం'..... నీకు జన్మదిన శుభాకాంక్షలు! :)

నేను నిన్ను మర్చిపోలేదు.... ఇందు ఉన్నా, లేకపోయినా నువ్వుంటావు :) ఇందు భావాలు నీలో నిక్షేపంగా ఉంటాయి :) అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాలే! ఊరికే దిగులు పడకు! ;)

సరే మరి.... ఇక ఉంటా.... టాటా.... బిర్లా!!


-ఇందు. 

25, మార్చి 2020, బుధవారం

శార్వరి ....

శార్వరి  నామ సంవత్సరం  ఎలా మొదలయిందయ్యా అంటే ...

Corona దయవల్ల lockdown అవడం వల్ల... పాలు లేవు... వేప పువ్వు లేదు.. మామిడికాయ లేదు(మొన్నే పప్పులో వేసా! కాస్త దాచిపెట్టానో లేదో గుర్తురావట్లేదు ), కొబ్బరికాయ లేదు.... పనిపిల్ల రాలేదు.... పిల్లలు ఇంట్లో ... అంట్లు సింకులో .... ఆఫీసు పని లాప్టాప్పులో .... అలా మొదలయింది.

దేవుడా! సంవత్సరంలో మొదటిరోజే ఇలా ఉంటే .... ఇక సంవత్సరం అంతా ఎలా ఉంటుందో! అనుకుంటూ లేచా!

ఇంతలోకే ఒక వాఁట్సాప్ మెసేజ్ ....
'వేప పువ్వు ' కావాలా? నేను ఎగిరి గంతేశా !
 'కావాలి... ఎక్కడుంది?'
'బైటికి రా పాపా!'
'వస్తున్నా!'
'మన అపార్ట్మెంట్లోనే ఒక మూల ఉంది ఈ చెట్టు ... ఇంద తీసుకో' అని ఇచ్చింది ఒక దేవత!
'వేప పువ్వు....' ప్చ్! అమెరికాలో కూడా ఇంత ఆనందపడలేదు  దీన్ని చూసి...
'హేయ్.. పనిలో పని... మామిడికాయ కూడా ఇచ్చి పుణ్యం కట్టుకోవచ్చుగా!'
'ఒక్కటె ఉంది.. లేదంటె ఇచ్ఛేదాన్ని !!'
'పర్వాలేదులే ...' నారు పోసినవాడే నీరు పోస్తాడు! అనుకుంటూ లోపలివచ్చా!!

ఇక ఫ్రిడ్జ్ మీద దాడి మొదలు.. అసలే ఈ lockdown దెబ్బకి కొన్న కూరగాయలతో , సరుకులతో నిండిపోయింది! ఆ మహాసముద్రాన్ని ఈది ఎలాగోలా పట్టా!! ఒక మామిడికాయ... మొన్న పప్పులో వేయగా మిగిలింది....

హమ్మయ్య! ఇక ఉగాది పచ్చడి రెడీ!

చందు దయవల్ల ఏదో రెండు పాల పేకెట్లు దొరికాయి!! చుక్క కాఫీ నీళ్లు తాగొచ్చు! పిల్లలకి గుక్కెడు పాలు ఇవ్వొచ్చు!

డిష్ వాషర్ లో డిషెస్ క్లీన్.... పిల్లల హెల్ప్ తో ఇల్లంతా క్లీన్.... తర్వాత ఆఫీసు పనిలో కాసేపు మునిగి తేలి .... పులిహోర, పాయసం,  పచ్చడి చేసి... దేవుడికి పెట్టాం! పిల్లలు, ఆఫీసు వాళ్ళు  ఏమిటో మరి బానే సహకరించారు ఇవాళ! పండగ మహత్యం!

పర్వాలేదు... మరీ అనుకున్నంత దారుణంగా కాకపోయినా ఉగాది బానే జరిగింది! సంవత్సరం మొదటిరోజు బానే మొదలయింది!

సంకల్పం..... ఆ పై దైవ బలం!

ఈ సంకల్పం, ఈ  దైవబలమే మనందరికీ , ఈ ప్రపంచానికి ఈ Corona మహమ్మారి నించి బైట పడేస్తుంది అని నమ్ముతూ ....

ఇంట్లోనే ఉండండి.... జాగ్రత్త గా ఉండండి...

మీ ,

ఇందు :)   

17, ఆగస్టు 2016, బుధవారం

నీవు వస్తావని ....

ఎన్నిరాత్రులు ... ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు .. 
నీవు వస్తావని .... 

కలలన్నీ ఆవిరిలా  కరిగిపోయాయి ....  
నా కన్నీటిని అందులో కలిపేసుకుని.... ఆకాశానికి ఎగిరిపోయాయి . 
నిట్టూర్పులు వాకిట్లో దీపాలు పెడుతున్నాయి... 
కళ్ళు కలువరేకులై, సూర్యుని తాపానికి తాళలేక వసివాడిపోయాయి ... 

ఎన్నిరాత్రులు... ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు .. 
నీవు వస్తావని .... 

ఆశెల బాసలను మోసుకొచ్చే నీలిమేఘానివై వస్తావని .... 
ప్రతిచినుకు నను తాకువేళ .... నీ నులివెచ్చని ఊపిరి నాకు ఇస్తావని ... 
ఆ వానే వెల్లువొచ్చి  వరదై ......  నన్ను నిలువెత్తున ముంచే ప్రేమసాగరమౌతుందని... 
ఆ వెల్లువలో మది విచ్చుకున్న మల్లియనై నీ గుండెగుడిలో ఒదిగిపోవాలని ... 

ఎన్నిరాత్రులు.. ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు .. 
నీవు వస్తావని .... 

అదిగదిగో ... వస్తోంది నా ఆశెల మేనా ఎక్కి వలపుల మేఘం!
రెక్కలుచాచి రివ్వున ఎగురుతున్న సీతాకోక విసిరిన ప్రేమ గంధం 
అదిగదిగో ..... నా మనసులాగే పురివిప్పి ఆడుతోంది నృత్యమయూరం!
నేను ఆపినా... ఆగనంటూ...  నా తనువు విడిచి నీకై ఎదురొస్తోంది నా ప్రాణం!

నీవు చినుకుగా మారి నాలో కరిగినా సరే!
నేను ఆవిరైపోయి నీలో కలగలిసినా సరే!

నిన్ను చేరేవరకు ఆగదు నా ప్రాణం! ఆపను ఈ ప్రయాణం!

12, జనవరి 2016, మంగళవారం

మంచు కురిసే వేళలో...

తెల్లవారుఝామున ఎప్పుడో ...

చటక్కున మెలకువ వచ్చేసింది.

ఎదురుగా గాజు కిటికీ.....

అందులోనించి గుడ్డి దీపాల మసక మసక వెలుతురు..

ఆ వెలుతురులో చమక్కు మంటున్న  నల్లటి చెట్ల చేతుల్లో తెల్లటి గులాబి మొగ్గలు.

ఎలా? ఇది ఎలా?

కళ్ళు నులుముకుని చూద్దును కదా!....

మంచు పూల వాన..

ఆగుతూ ... కురుస్తూ...

చూస్తుండగానే...
సన్నని ముత్యాలై..
తళతళ తళుకులీనే తగరపు కాగితాలై..
విరజాజులై..
సన జాజులై..
మల్లెలై ...
బొండు మల్లెలై...
అర్రే .... అదిగో తెలతెల్లటి గులాబీలై...
మోడువారిన చెట్లను చిగురింపచేస్తున్న... వాన....
 ముచ్చటైన మంచు వాన... వెన్నెల సోన... కన్నులలోన .... కలవై ... .. ...

తెల్లగా తెల్లారాక:

గరాజ్ డోర్ తీసి కారు బైటకి తీయగానె...
డ్రైవ్ వే... కుప్పలు కుప్పలు మంచు ...
చిత్తడి చిత్తడి ... చిందరవందర మంచు...
చిరాకు తెప్పించే మంచు...
'అబ్బ! మళ్ళీ  మొదలయిందా? ! I hate Snow! I hate Winters! I hate Michigan Winters... I hate Michigan' (వెయ్యిన్నొక్కటో సారి అనుకుంటూ ఆఫీస్ కి బయలుదేరాను )

-ఇందు 

31, జులై 2012, మంగళవారం

ఒక వాన చినుకు!!

ఒక చిన్నిచినుకు....

మిలమిలా మెరిసిపోతున్న వాననీటి తళుకు...

నీలిమేఘాల కురులసిగలో విరిబాలగా వెలుగుతుంటే..

చల్లనిగాలి వచ్చి చెక్కిలి నిమిరి చక్కలిగింతలు పెట్టగానే...

జలజలా జారి...మధుమాసపు మంచుపూవై రాలి..

నేలమ్మ నులివెచ్చని కౌగిలిలో చేరే వేళ...

పచ్చని ఆకుల పొదరిల్లోకటి సాదరంగా ఆహ్వానిస్తే..

చిగురుటాకుల ఒడిలో సేదదీరి....

కమ్మని మన్నుపరిమళం అనుభవిస్తుంటే...

రంగురంగులరెక్కల కోక ఒకటి వస్తే...

నీకు రంగుల లోకం చూపిస్తా వస్తావా అంటే...

సర్రున జారి.... సీతాకోకరంగుల్లో కలిసిపోయి...

తోటంతా తిరిగి.... ఆటలెన్నో ఆడుకుని... పాటలెన్నో పాడుకుని...

మలిసందె వెలుగు మసకపడే మునిమాపటివేళ...

కోకమ్మ సెలవు తీసుకుని..... మల్లెపొదలో జారవిడిస్తే...

మల్లెపూల రెక్కలపై చిరురవ్వల ముక్కెరైపోయి...

మల్లెభామ మత్తులో తూగి... సందెగాలి పాటలో ఊగి...

రాతిరమ్మ చుక్కలపందిరి కింద వెన్నెలభోజనాలు పెట్టే వేళ...

జాబిలమ్మ వెండి ఊయలలో ఊరేగుతుంటే......

వెన్నముద్దల్లా విచ్చుకున మల్లెపూలతోటలోకి...

 
వయ్యారంగా నడిచి వచ్చిన ఒక చక్కనిచుక్క...

అరవిచ్చిన మల్లెల్లో అచ్చంగా ఒదిగిపోయిన వానచినుకుని చూసి...

మురిసి.....ఆమె మోమున ముద్దబంతిపువ్వు విరిసి...

మత్తెక్కించే  మల్లెలను అరచేతుల్లో పోదివిపట్టుకుని...

ముచ్చటైన ముత్యపుచినుకును ముద్దాడగానే....

 వెల్లకిల్లా ప్రేమలో పడ్డ వానచినుకు....

'ఈ జన్మకిది చాలు' అనుకుని మెల్లగా నేలతల్లి ఇల్లు చేరుకుంది....






-ఇందు

[Imagesource:Google]

14, మే 2012, సోమవారం

శ్రీమతికి ప్రేమలేఖ!

ప్రియాతిప్రియమైన శ్రీమతికి,

నా చేత ప్రేమలేఖ వ్రాయించుకునే అదృష్టం నీదే మరి :) ఎందుకంటే..... ఇదే నా మొట్టమొదటి ప్రేమలేఖ ;)

అలాగని నేను శ్రీ రామచంద్రుణ్ణి అని చెప్పలేను.... నా రేంజికి తగ్గట్టు ఏదో ఒకరో,ఇద్దరో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా... ఇదిగో ఇలా అర్ధరాత్రి మూడింటికి నిద్రపట్టక ప్రేమలేఖ రాయాలనిపించే సీన్ ఐతే లేదు అమ్మడు ఎవ్వరికీ :)))

ప్రేమలేఖ... అంటే ఏం రాయాలి??? మనం ప్రేమికులం కాదు కదా!! పోనీ పెళ్ళికి ముందు తెగ ఫోన్లు చేసుకుని మాట్లాడుకున్న వాళ్ళమూ కాదాయె! కానీ ఏదో రాయాలని ఆరాటం. నా రాతల్లో నిన్ను చూసుకోవాలని ఉబలాటం. పోనీ కవితలు రాద్దామంటే.... మనకి కపిత్వం తెల్సుగాని... కవిత్వం తెలీదే! పాటలు రాద్దామంటే.... ఆ పాండిత్యమూ లేదు! అందుకే.... నా మనసులో ఇప్పటికిపుడు నీగురించి వచ్చిన ఆలోచనలన్నీ అక్షరాల్లో పెట్టేస్తున్నా! సరేనా?!

అదిసరేగాని, అసలు ఏం మాయచేసావ్ నన్నూ?? పోనీ నిన్ను చూసిన మొదటిసారే డుబుక్కున ప్రేమలో పడిపోయాను అంటే అదీ కాదు... [నిజం చెప్పేసా ఏమి అనుకోకు ;) ]

కానీ, మన నిశ్చితార్ధం రోజున నీ చేతి వేళ్ళు చూడగానే మాత్రం ముద్దొచేసాయంటే నమ్ము! మరీ ఎక్కువసార్లు చూశానేమో రెండుమూడు రోజులు కల్లో కూడా అవే వచ్చాయ్ ;) ఆ చేతివేలికి ఉంగరం తొడిగే అదృష్టం నాదే అంటేనే అదొక గొప్ప ఫీలింగ్.... ఎవరెస్టు అధిరోహించేసినట్టు!!

అలాగే మన పెళ్లి ఇంకో రెండురోజుల్లో ఉందనగా.... ఆరోజు మీఇంట్లో చెప్పకుండా నాతో పాని-పూరి తినడానికి వచ్చావు చూడు.... ఆ రోజైతే... ఎవరన్నా చూస్తారేమో అని భయపడుతూ బెరుకుగా చూస్తున్న నీ కళ్ళు, ఆవురావురుమంటూ ఒక్కొక్క పూరిని అమాంతం మింగేస్తున్న నీ బుజ్జి నోరు, ఆ పాని ఘాటుకి ఎరుపెక్కిన నీ కోటేరేసిన ముక్కు.... చూస్తుంటే.... ఎంత అబ్బురమనిపించిందో! హ్మ్! ఎంతైనా నువ్వు అందగత్తెవే!! ఒప్పుకోక తప్పట్లేదు మరి ;)

ఇక పెళ్లిరోజున చూడాలి.... ఆ మెరూన్ కలర్ కంచిపట్టులో.... ఆ బుట్టలో కూర్చుని నువ్వొస్తుంటే.... నాకైతే ఎర్రటి గులాబి బంతిని తెస్తున్నారేమో అనిపించింది. అంతలోకే నీకు-నాకు మధ్య తెర కట్టేసి.... జీలకర్ర బెల్లం పెట్టే వరకు అసలు నిన్ను చూడనివ్వలేదు. ఎంత కోపమొచ్చిందో ఆ పురోహితుడి మీదైతే! జీలకర్ర బెల్లం పెట్టేశాక.... హమ్మయా అనుకున్నానా.... అంతలోకే మధుపర్కాలన్నారు నిన్ను పట్టుకోపోయారు అమ్మలక్కలంతా కలిసి! :( మళ్లీ మొహం మాడ్చేసుకుని కూర్చున్నా!

కానీ ఆ తర్వాత తెల్లని మధుపర్కాలలో అచ్చం రాజహంసలా నువ్వొస్తుంటే.... నాకు రెండు రెక్కలు కట్టుకుని నీతోపాటు ఆకాశవీధిలో విహరించాలనిపించిది!! నీకు తాళి కట్టే వేళ... నువ్వెంత టెన్షన్ పడ్డావోగాని, నేనైతే అరవీరభయంకరంగా పడ్డా! ఎందుకు అని అడగవేం?? ఏంలేదు... ఎక్కడ సినిమాల్లో చూపించినట్టు,.... 'నో... ఆపండి.. నహీ' లాంటి డైలాగ్ కోడతావేమో అని ;) [హ్హహహ్హ! ఉడుక్కుంటున్నావా?? ఊర్కే అన్నాలెద్దూ!! :)) ] ఇక పోతే.... తలంబ్రాలప్పుడు తెలిసింది నీ గడుసుదనం!! అమ్మో.... ' "అమాయకురాలు" అనుకున్నా.... ఆ పదంలో 'అ' తీసేయాలి ' అని అనిపించింది తెల్సా? ;) కానీ, అప్పగింతలప్పుడు నువ్వేడిస్తే నాకేం బాలేదు అమ్మాయ్! నీ కళ్ళలో అలా నీళ్ళు చూడలేను నేను :( 

అయినా, మనిద్దరి పరిచయం ఎంతా?? ఒక్క వారం కదా! ఒక ఆదివారం నిశ్చితార్ధం ఐతే.... నెక్స్ట్ ఆదివారం పెళ్లి. అస్సలు అనుకోలేదు నా జీవితంలో ఇంత ఫాస్ట్ గా పెళ్లి చేసుకుంటా అని ;) ఫాస్ట్ గా కాదు... సూపర్ ఫాస్ట్గా అని చెప్పాలేమో!! హ్మ్! ఏంచేస్తాం! మా డామేజరు సరిగ్గా 15 రోజులు ఇచ్చాడు సెలవులు!! హ్మ్! ఏ బంధమైనా కాలంతో పాటు పెరుగుతుంది. కానీ... మన మధ్య అదేంటో చిత్రంగా ఇంత తక్కువ టైమ్లో అల్లేసుకుంది.  

పెళ్ళైన మూడోరోజే నేను అమెరికాకి బయలుదేరితే.... నీ కళ్ళలో దిగులు చూస్తే.... ఎంత ఆనందమేసిందో తెల్సా? అవును మరి!! నాకోసం ఆలోచించే మనిషి ఒకరున్నారనే భరోసా ఆ దిగులే! నన్ను కావాలనుకునే వాళ్ళు ఉన్నారనడానికి సాక్ష్యం ఆ దిగులే! అందుకే నాకు అది నచ్చింది. కానీ ఆ దిగులు నాకూ అంటుకుని ఇదిగో ఇలా వేధిస్తోంది!! మన పెళ్లి, నీతో గడిపిన ఆ రెండురోజులు ఇవే నాకు ఇప్పుడు తిండి-నీళ్ళు-నిద్ర.... తెల్సా?? ఎన్నిసార్లు నీ ఫోటో చూసినా... ఎంతసేపు నీతో ఫోన్లో మాట్లాడినా....ఆదివారాలు స్కయిప్ చాట్ చేసినా... ఏదో వెలితి గుండెని మెలిపెట్టేస్తోంది. 

నీకో సీక్రెట్ చెప్పనా? అసలు పెళ్ళంటేనే నాకు చిరాకు. హాయిగా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నన్ను... మా అమ్మ 'అమ్మాయి బంగారంలా ఉంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఫోటో చూసి చెప్పరా!' అంటే.... ఇల్లదిరిపోయేలా అరిచా... 'అప్పుడే నాకు పెళ్ళేంటి?' అని. నీ ఫోటో చూపిస్తే చిరాగ్గా చూసి... 'మ్..సరే' అని ముక్తసరిగా సమాధానం చెప్పా! ఏదో ఒకటి పెళ్లి చేసుకుంటే ఈ టార్చర్ తప్పుతుందని. కానీ.... నిజ్జంగా నిజం.... మొదటిసారి నిన్ను చూసినప్పుడు మాత్రం.... మా అమ్మ టేస్ట్ మెచ్చుకోకుండా ఉండలేకపోయా! కానీ మీ అమ్మ, మా అమ్మ ఫ్రెండ్స్ అని.... నీకు నేను ఆరు నెలల ముందే తెల్సు అని తెలిసేసరికి.... అస్సలు నమ్మలేకపోయా! ఆరునెలల నించి నామీద పధకం రచించారన్నమాట మీరంతా కలిసి ;)

నీకేమి గిఫ్ట్ ఇవ్వలేదు నేను... ఇంతవరకు. కానీ నువ్విచ్చిన నీ డైరి.... అందులో నువ్వు దాచుకున్న నెమలీక.... గులాబి రేకులు... వాటిమీద మనిద్దరి పేర్లు..... డైరీలో నాగురించి నువ్వు రాసుకున్న ఊహలు, ఊసులు , కవితలు,........... హ్మ్! రోజుకి కనీసం ఒక పదిసార్లైనా నీ డైరి తెరుస్తా! రోజుకొక పేజి చొప్పున చదువుకుంటూ వస్తున్నా! నువ్వోచ్చేవరకు ఈ డైరి నే నా ఆలనాపాలనా చూసేది మరి :( కానీ.... నీకు అంత నమ్మకమేంటి నామీద? నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని?? ఆ? ఎంత గడుగ్గాయివో!! ఎలాగైతేనేం.... బుట్టలో వేసేసుకున్నావ్ నన్ను!! హాన్నా!

అందుకే నీకోసం ఈ ప్రేమలేఖ వ్రాస్తున్నా! ఇదే నేను నీకివ్వబోయే మొదటి గిఫ్ట్ :) నాగురించి అన్ని రాసుకున్నావ్ కదా నువ్వు.... కానీ నీగురించి రాద్దామంటే..... నీ ఊహల్లో మునిగిపోవడమే తప్ప.... కాగితం మీద కలం కదిలితేనే కదా! ఇదిగో... ఇన్నాళ్టికి అర్ధరాత్రి కుదిరింది ముహూర్తం :)) ఎప్పుడో మర్చిపోయిన అక్షరాలన్నీ కూడబలుక్కుని రాస్తున్నా! నీ అంత అందంగా,కుదురుగా రాయడం కుదరట్లేదు... తిట్టుకోవు కదా! ;)

నేను పెళ్ళికి ముందు.. ఇలాగే ఒంటరిగా ఉండేవాడిని. ఇప్పుడూ నా పరిస్థితిలో మార్పు లేదు. కానీ నా మనసులో మాత్రం బోలెడు మార్పు. చెప్పలేనంత మార్పు. ఆఫీసు-తిండి-నిద్ర తప్ప పట్టని నాకు.. ఊహలు నేర్పావు. కవితలు నేర్పావు. ప్రేమించడం నేర్పావు. విరహం అంటే ఏమిటో చూపిస్తున్నావు. ఇదిగో.... ఇలా ప్రేమలేఖ కూడా రాయించేస్తున్నావు!! 


ఇన్ని ఇచ్చిన నా నెచ్చెలీ... నా దగ్గరికి తొందరగా వచ్చెయవూ??

వచ్చేస్తావు కదూ.... బంగారం!

నీకోసం ఎదురు చూస్తూ.... 

నీ శ్రీవారు!



10, ఏప్రిల్ 2012, మంగళవారం

గుళ్ళో ప్రసాదం ;)

ఆ... టైటిల్ చూసి నోరూరిన  జనతాలో మీరు ఉన్నట్టైతే.... డౌట్ లేదు... మీరు నా క్యాటగిరి నే :)
మరేమో.... అసలు సంగతేంటంటే......

మొన్నామధ్య   నేను, చందూ ఆఫీసునించి సరాసరి రెస్టారెంట్ కి వెళ్లాం :)) బాగా ఆకలిమీదున్నామేమో.... ఒక నాలుగు రకాలు ఆర్డర్ చేసాం ;)

మా ఖర్మకాలి..... మంగళవారం అన్నీ రెస్టారెంట్లకి సెలవు మేము వెళ్ళింది తప్ప :( ఇక జనాలు పొలోమంటూ ఈ రెస్టారెంటుకి క్యు కట్టారు :(((

ఒక పక్కన కడుపులో కుందేళ్ళు పరిగెడుతుంటే.... ఏం చేయాలో తోచక.... అప్పటికే కొరికేసిన గోళ్ళని గిల్లుకుంటూ కాసేపు కాలక్షేపం చేశాం. ఇక లాభం లేదని.... ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటేగాని ప్రశాంతత చేకూరదని.... ఇక తిండి టాపిక్  మొదలెట్టాం!

"అసలు ఇందు.... రాజమండ్రిలో టమాటా బజ్జి ఉంటుంది....."

"చందూ..ప్లీజ్.... ఇది వందో సారి. గుంటూరు మూడొంతెనల దగ్గర మిరపకాయ బజ్జి ఎంత బాగుంటుందో... మీ రాజమండ్రిలో టమాటా బజ్జి అంత బాగుంటుంది. సరేనా? ప్లీజ్.... టాపిక్ చేంజ్"

"హుహ్!....."

"సరే.... నేను చెప్తాలే.... మా ఆఫేసులో నా కొలీగ్  ఒకాయన  ఉన్నారు. ఆయనకి ఫుడ్  ఇంటరెస్టింగ్ టాపిక్ ;)  ఏది ఎలా చేయాలి.... ఎలా తినాలి.... అనేవాటి మీద  మంచి డిస్కషన్స్ పెడతారు. ఆయనకి అన్నిటికంటే నచ్చేది ఏదో తెల్సా??.. గుళ్ళో పులిహోర అట "

"హ్హహ్హహ్హా! మరే.... గుళ్ళో పులిహోర అల్టిమేట్ ఇందు....ప్రసాదాల్లో పులిహోర, చక్రపొంగలి నంబర్ వన్ అసలు. ఒక్క చిన్న స్పూన్  తిన్నా కూడా అమృతంలా ఉంటుంది."

"అవును మరి. దేవుడు ఎంగిలి చేస్తాడేమో.... మంచి రుచిగా ఉంటుంది :). నాకు ఆ చక్రపొంగలి వాసనకే నోరూరిపోతుంది. "

"ఏమోగాని..... ద్రాక్షారామంలో ప్రసాదం మాత్రం సూపర్! దానికి తిరుగులేదు. అసలు దానిని మించి టేస్టీ  ప్రసాదం ఇంకోటి తినలేదనుకో"

"నాకు అది భలే ఇష్టం. ఎంత బాగుంటుందో! అన్నవరం ప్రసాదం తిన్నావా ఎప్పుడైనా?"

"ఆ... అది కూడా కేక! కానీ ద్రాక్షారామం అంత కాదనుకో ;) "

"నిజమే! ఆ ద్రాక్షారామం ప్రసాదం కోసం నేను మూడు సార్లు వెళ్ళా అక్కడికి ;) అసలు నెయ్యి కారుతూ ఉంటుంది. ఆహా!"

"హ్మ్! నాకైతే.... గుడి అంటే ముందు ప్రసాదమే గుర్తొస్తుంది ఇందు. నువ్వు తిట్టుకున్టావ్లె .... కానీ.... నేను మాత్రం  ప్రసాదం బాచ్!" :))

"హ్హహ్హ!! అంతలేదులే.... నిజం చెప్పనా?? మళ్లీ ఎవరికీ చెప్పొద్దూ.... నేనూ సేం పించ్ ;) నాకు గుళ్ళో ప్రసాదం అంటే భలే ఇష్టం!... అసలు గుళ్ళో దేవుడి దర్సనం అయిపోయాక... కళ్ళన్నీ ప్రసాదం మీదే! "

"హ్హేహ్హే! నాకు తెల్సులే! నువ్వెప్పుడు గుడికి వెళ్ళినా  ..... దేవుడికి దణ్ణం పెట్టుకున్తున్నట్టే  ఉంటావ్ కానీ .... ఆ దేవుడి ముందు పెట్టిన ప్రసాదాల వైపే నీ చూపులన్నీ"

"ఏదో నీ అభిమానం ;) ఇది కాదుగాని..... నేను ఇంజినీరింగ్ చదివేటప్పుడు.... మా హాస్టల్ ఫ్రెండ్స్ అందరం.. ప్రతి మంగళవారం, శుక్రవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళేవాళ్ళం. మా హాస్టల్కి రెండు వీధుల అవతల ఒక గుడి ఉండేది. అది నా ఫేవరేట్. అక్కడ ఈ మంగళవారం/శుక్రవారం రోజుల్లో.... చక్కగా చింతపండు పులిహోర, ఆరెంజ్ కలర్ రవ్వకేసరి విత్ జీడిపప్పు+కిస్మిస్+నెయ్యి.... వహ్!! అసలు సూపరనుకో ;) నేనైతే.... మా ఫ్రెండ్స్ వేరే గుడికి వెళ్దామన్నా.... పట్టుపట్టిమరీ ఈ గుడికే తీసుకెళ్ళేదాన్ని.... దేవుడి మీద భక్తీ అనుకునేది మా హాస్టల్ వార్డెన్... ప్రసాదం మీద అనురక్తి అని వాళ్ళకి తెలీదుగా ;) "

"ఆ..... ఆంజనేయస్వామికి మెడలో వేస్తారు చూడు అప్పాలు.... అబ్బ.... ఆ టేస్ట్ అసలు అన్బీటబుల్!"

"అప్పాలా..... అవి బాగుంటాయని నువ్వంత  మొహమాటంగా చెప్పాలా? ;) "

"హహ!! 'అతడు' డైలాగ్ కదా...సూపర్ సినిమాలే. ఏదీ ఏమైనా కానీ అన్నిటికంటే తిరుపతి లడ్డు ప్రసాదం హైలైట్ "

"హా! నిజమే! తిరుపతి అంటే గుర్తొచింది.... శ్రీశైలంలో అమ్మవారిగుడి దగ్గర రాత్రిపూట పూజ అయ్యాక ప్రసాదం పెడతాడు.... ఆహా.... అల్టిమేట్ అసలు. జస్ట్ ఉప్పు+పోపు వేసిన దద్దోజనం ఉంటుంది... వేడివేడిగా.... అబ్బబ్బా!! నోరూరుతుంది చెబుతుంటేనే! అలాగే... ఆ చింతపండు పులిహోర.... దేవుడా! అందులో ఊరిన ఆ ఎండు మిరపకయలైతే ..... సూపరేహే!"

"నాకు శివాలయాల్లో శివుడికి అభిషేకం చేస్తారు.... 'పంచామృతం' .... అది భలే ఉంటుంది ఇందు :) ఆ టేస్ట్ అసలు ఎలా వస్తుందో.... ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా!"

"అవును చందూ.... ప్రసాదాల రుచే వేరు. మొన్నామధ్య మనం పిట్స్ బర్గ్ వెళ్ళినప్పుడు కూడా... ఫుల్లు కుమ్మేసాంగా  అసలు. ప్రసాదం కోసమే గుడికి వెళ్ళినట్టుగా ఉంది." ;)

"సంపత్ ఐతే... ఎప్పుడు హారతి ఇస్తారా.... ఎప్పుడు ప్రసాదం కౌంటర్ వైపు వెళ్దామా అనే!"

"హ్హహ్హ!! నాకు అరోరా టెంపుల్ లో కూడా ప్రసాదం బాగా నచ్చింది. నాచేత డేడ్లి ఇడ్లీ తినిపించాడు వాడి పల్లి  చట్నీ తో! వాడి తరువాతే ఎవరైనా"

"కదా!ఆరోజు సాంబార్ కూడా కత్తిలా ఉంది. ఇంకోసారి వెళ్ళాలి ఇందు షికాగోకి. కనీసం ప్రసాదం తినడానికైనా!! "

" :))) నాకు ఇస్కాన్ ప్రసాదం కూడా నచ్చుతుంది చందూ. ఆరోజు గోల్డెన్ టెంపుల్ లో భలే ఉంది కదా! బెంగుళూర్ ఇస్కాన్లో స్వీట్స్ ఉంటాయి.... వావ్... అసలు పండగే అనుకో"

"అక్కడ ఫుడ్ చాలా బాగుంటుందిరా! 'సండే ఫీస్ట్' ఐతే.... కేక! బ్యాచలర్స్ కి ఒక పూటకి కడుపునిండా భోజనం అన్నమాట ;) "

"హ్మ్! ఎన్నిసార్లు వెళ్ళావ్ బాబు..."

"అబ్బో... లెక్కలేనన్ని....."

"దేవుడి మీద భక్తా? ప్రసాదం మీద ప్రీతా??"

"అది ఇంకా చెప్పాలా? "

"హయ్యో రామా.."

"ఇస్కాన్లో ఉండేది కృష్ణుడు తల్లి... రాముడు కాదు.... అంటే నీ దృష్టి దేవుడి మీదా.... చిత్తం ప్రసాదం మీద అన్నమాట"

"హతవిధీ!"



"సర్ యుర్ ఆర్డర్" అనుకుంటూ............. తీసుకొచ్చాడు.... ఎపటైజేర్.

 'అహనా పెళ్ళంట' సినిమాలో కోటా లాగా........ అప్పటిదాకా మేము డిస్కస్ చేసుకున్న ప్రసాదాల రుచులన్నీ ఊహించుకుంటూ..... ఇద్దరం ఏదో తినేసి బైట పడ్డాం!


అవండి.... మా గుళ్ళో ప్రసాదం గోల.... మరి మీ సంగతేంటి????  ;)

Photos  Courtesy: Google