7, జూన్ 2011, మంగళవారం

స్మొకీస్ వెళదామా?

స్మోకీస్...
అందమైన మబ్బుల మేలిముసుగు కప్పుకున్న పర్వతశ్రేణులు! 
కనుచూపుమేరా...నీలిరంగులో కనువిందు చేస్తూ.......అప్పుడప్పుడు మేఘాల్ని ఒడిసిపట్టుకుని తమలో దాచేసుకుంటూ...ఆటలు ఆడుకునే అందాల 'పొగ పర్వతాలు' ;)

ఈ స్మోకీస్ కి మొన్న మెమోరియల్ డే లాంగ్ వీకెండ్ కి వెళ్ళాము....మరి మీరు నాతో వస్తారా?? అలా అలా స్మోకీస్ మొత్తం మీతో చక్కర్లు కొట్టించి తీసుకోచ్చేస్తాలే!! :)

నేను ఉండేది మిషిగన్ కాబట్టి...అక్కడనించి మన ప్రయాణం మొదలు పెట్టేద్దాం :)

సరే...స్టార్ట్!

రయ్య్య్యి ........రయ్య్యి....రయ్య్యి!....

తొమ్మిది గంటల ప్రయాణం....బోర్ కొట్టకూడదు కదా! అంటే నేను నాన్-స్టాప్ గా వాగుతూనే ఉంటాననుకో.....కాని నాకు తోడూ ఉండాలిగా....సరే మరి పాటలు పెట్టుకుందాం :)

'మేఘాలలో.....తేలిపోమ్మన్నది..
తూఫానులా రేగిపోమ్మన్నది.....'

ఆహా! సూపర్ పాట! అలా వింటూ ఉండండి....అదే స్పీడులో మనం దూసుకుపోదాం :) 

అదిగో....ఒహాయో వచ్చేసింది.....ఇదిగో స్టార్బక్స్ .....కాఫీ తాగేద్దామా?? నాకైతే 'చాయ్ లాటే' మరి మీకు? 

ఈ చాయ్ లాటే ఒక సిప్ వేసి.......అందులోకి కరకరలాడే మినప చక్రాలు తింటుంటే....ఆహా! సూపరు!

ఒక్కసారి అటు చూడండి....'సిన్సినాటి' డౌన్టౌన్ అది. బిల్డింగ్స్ అల్టిమేట్ ఉన్నాయ్ కదా!! ఆ బ్రిడ్జి ఎక్కుతూ చూస్తె...ఇంకా బాగుంటుంది :) సూపర్ ఉంది కదా 'సిన్సినాటి' :)

అర్రే! అంతలోకే 'కెంటకి' కూడా వచ్చేసామా? వావ్! ఇక్కడ గుర్రాలు ఫేమస్ అట తెల్సా? కిటికీలోనించి అలా చూస్తూ ఉండండి....బోలెడు 'హార్స్ స్టేబుల్స్' కనిపిస్తాయ్! ఇంకా బోలెడు గుర్రాలు గడ్డి మేస్తూ....తోకలు ఊపుతూ మనకి టాటా కూడా చెబుతాయ్!!  :))

ఆ! గుర్రాలు చూసేసారా? సరే మరి....నెక్స్ట్ వచ్చేది 'టేనేస్సీ'....ఈ టేనేస్సి లోనే ఉండేది...'ది గ్రేట్ స్మోకి మౌంటైన్స్' :)

అబ్బ! కనుచూపుమేరా....కొండలే! పచ్చటి కొండలు.....ఈగలు కూడా దూరలేనంత చిక్కటి అడవులు.....పిన్ను పడితే తీసుకోగలిగేంత స్వచ్చమైన నదులు....ఆహా! ఏమి అందాలు....ఈ కొండల మధ్య ఇంత పెద్దపెద్ద రోడ్లు ఎలా వేసారో! 

హా! ఈ కొండల్ని చూస్తేనే కడుపు నిండిపోతోంది....సరే మరి కాస్త ఆకలేస్తుందేమో...టాకోబెల్ కి వెళ్లి రెండు చలుపాలు లాగించేద్దాం పదండి!

భలే ఉన్నాయ్  కదా...చలుపాలు!! సరే ఇక ఎక్కడా ఆగోద్దులే....ఇస్త్రెట్ గా 'స్మోకీస్' కి వెల్లిపోదాం :)

రయ్యి! రయ్యయ్య్యి! రయ్యయ్య్య్యి !!

అదీ....'పీజియన్ ఫోర్జ్' కి వచ్చేసాం! ఇక్కడికి దగ్గరలో 'గాట్లిన్ బర్గ్' దగ్గరే మన 'పొగ పర్వతాలు' మొదలవుతాయ్ అన్నమాట :) సరే! ఇవాల్టికి ఇక్కడతో రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్నే బయలుదేరుదాం :)  సరేనా! 

ఆ కొండ అంచున అందమైన చెక్క ఇళ్ళు చూసారా? అవే 'క్యాబిన్స్' అక్కడే మనం ఉండేది :) చిక్కని అడవిలో....కొండ అంచున చక్కని చెక్క ఇల్లు :) బాగుంది కదా! సరే రేపు పొద్దున్న తొందరగా లేవాలి కదా! ఇవాల్టికి ఇక రెస్ట్!

డే-1

హా! అందరు కాఫీలు,టిఫినీలు చేసేసి రండి....మనం ముందు 'పీజియన్ ఫోర్జ్' నదిలో రాఫ్టింగ్ కి వెళ్దాం :) నది పెద్ద లోతు లేదులే...కంగారు పడొద్దు!!

ఇదే 'పీజియన్ ఫోర్జ్' నది. మనం రాఫ్టింగ్ చేసేది ఇక్కడే! రండి మన 'రైడ్ గైడ్' తో వెళ్దాం :) అదిగో ఆ లైఫ్ జాకెట్ వేసుకుని....ఇదిగో ఈ 'ఓర్స్' (తెడ్లు) తీసుకుని పదండి ముందుకు....పదండి తోసుకు మనం నడిపే బోటు దగ్గరకు!!

'హైలెస్సా! హైలెస్సా.....హైలెస్సా...ఓఓ....నీలాల కనుల్లో సంద్రమే...నింగి నీలమంతా సంద్రమే....హైలెస్సో....ఓఓ..హైలెస్స!'

భలే ఉంది కదా....అబ్బ....ఈ నీరెండలో....ఈ చల్లటి గాలిలో..... అడవుల మధ్య మెలికెలు తిరుగుతూ సాగిపోతోన్న నదిలో..... మనం అందరం కలిసి ఈ బోటు నడుపుతూ ఉంటె.... అది ఈ నదిమీద అలా అలా తేలిపోతుంటే.... ఆహా!!..ఇంకో పాట కూడా గుర్తోచ్చేస్తోంది!

'లాహిరి...లాహిరి...లాహిరిలో....ఓహో జగమే ఊగెనుగా...సాగేనుగా....ఆఆ....ఆ....ఆఆ....ఆ....'

హ్మ్! ఇలా నడుపుతూ ఉంటె సమయమే తెలీదు...కాని మనం బోలెడు చూడాలి కదా.... :) ఇక ఈ లాహిరి...లాహిరి ఇంతటితో ఆపేసి....వెళ్లి కడుపుకి ఏదన్నా కాస్త దాణా వేసి ఇక బయలుదేరుదాం! ఓహో! ఫోటోలు కావాలా? సరే అలాగే తీసుకోండి...నేను రెస్టారెంట్లో ఆర్డర్ చెబుతూ ఉంటా :)

ఆ! అందరికి ఆర్డర్ ఇచ్చేసా :) రండి.తొందరగా తినేస్తే....మీకు ఇప్పుడు సూపర్ ప్లేస్ చూపిస్తా :)

సరే అందరిది తినడం అయిపొయింది కదా! ఇప్పుడు మనం వెళ్ళబోయేది 'క్లింగ్మెన్స్ డోం' .ఇది స్మోకి మౌన్టేయిన్స్ లో హయ్యెస్ట్ పీక్! ఇక్కడ నించి చూస్తె.....ఈ పొగ పర్వతాల్లోకి దిగిపోయే సూర్యుడు ఎంత అందంగా కనిపిస్తాడో మీరే చూడండి!

ఇదిగో...గాట్లింబర్గ్! ఇది స్మోకీస్ కి పర్వతపాదం అన్నమాట :) ఇక్కడ చిన్న డౌన్టౌన్ కూడా ఉంది....చూసారా! ఇక్కడ బోలెడు ఆక్టివిటీస్ ఉంటాయ్ :) పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు! పిల్లలాగే ఎంజాయ్ చేసే పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది ఇది! మనం రేపు ఇక్కడ 'ట్రాం వే' ఎక్కుదాంలె! సరేనా?!

ఇక ఇక్కడినించి అంతా అడవే! అలాంటి ఇలాంటి అడవి కాదు...పెద్దపెద్ద చెట్లతో.....లోతైన లోయలతో....ఎత్తైన శిఖరాలతో......దారిపక్కనే విరబూసే 'సమ్మర్ ఫ్లవర్స్' తో......ఎక్కడపడితే అక్కడ గలగలమని పారే నదీజలాలతొ అలరారే అద్భుత కీకారణ్యం :) 

అలా వెళుతూ...ఉంటె....వెళుతూనే ఉంటె......చాలా దూరం కొండలు ఎక్కుతూ ఉంటె.....అప్పుడు వస్తుంది ఎత్తైన పర్వత శిఖరం.....'క్లింగ్మెన్స్ డోం' . చుట్టూ కొండలు చూసారా? ఊరికే కూర్చుంటే కాదు....అలా దూరంగా కనిపిస్తోన్న నీలగిరుల్ని చూడండి! ఆ పర్వతసానువుల్లో సాగుతున్న సెలయేర్లని చూడండి....ఆ అడవి బాట వెంబడి విరబూస్తున్న 'అడవి' పువ్వుల అందాల్ని ఆస్వాదించండి!! వయ్యారంగా ఒంపులు తిరుగుతోన్న మెలికల దారులని చూడండి!!

అరె...మాటల్లోనే వచ్చేసింది! చూసారా? ఇదే 'క్లింగ్మెన్స్ డోం' ఎంత బాగుందో కదా! నేను చెప్పలేదు? అలా చూడండి....పర్వతాలన్ని మబ్బుల  ముసుగేసుకుని బజ్జున్నట్టు లేదు?! నీలిరంగు తప్ప మీకు ఏమన్నా కనిపిస్తోందా? వీటికి 'నీలగిరిస్' అని మనం నామకరణం చేసేద్దామా?! ;) అంత బాగున్నాయ్ కదా! హిమాలయాలని చూసి పరవశించిన కాళిదాసుని ఇక్కడ కూర్చోబెడితే.....పెద్ద కావ్యమే రాసేస్తాడేమో !! :)

ఇంతలోనే ఈ మబ్బులు ఎక్కడినించి వచ్చాయి?? మనమీదకి వచ్చేస్తున్నాయ్!! మబ్బులలోకంలో విహరిస్తున్నట్టు లేదు! హేయ్...ఈ మబ్బు చూడండి.....మన మీదగుండా వెళుతోంది.....వావ్! దూదిపింజేలా ఎలా చేతిలోంచి జారిపోతోంది! అర్రే! మనల్ని చుట్టుముట్టేస్తోంది.....హ్హహ్హ! భలే ఉందికదా! 

అదిగో సూర్యుడు! హబ్బ ఇప్పుడు కనిపించాడు.....పదండి సూర్యుడు మబ్బులో దిగే దృశ్యం చూద్దాం! ఇక్కడినించి ఒక మైలున్నర  కొండమీదకి 'ట్రెక్కింగ్' చేయాలి మరి! ఇక్కడ ఎలుగుబంట్లు ఎక్కువ! మీకు ఎక్కడైనా ఎలుగు కనిపిస్తే.....అరవొద్దు....దాన్ని చూడనట్టు వచ్చేయండి సరేనా?

లెఫ్ట్-రైట్.....లెఫ్ట్-రైట్...లెఫ్ట్-రైట్....

దేవుడా! ఆయాసమోచ్చేస్తోంది...కాని లేట్ అయితే మళ్లీ సూర్యాస్తమయం అయిపోతే ఇంతా పడ్డ శ్రమ వృధా! హ్మ్! 

లెఫ్ట్..........రైట్..........లెఫ్ట్............రైట్.............

హా! కొంచెం మంచినీళ్ళుంటే ఇస్తారా? దాహం వేస్తోంది.....కొండ ఎక్కి వచ్చేసరికి! హుహ్!!

అబ్బ! ఆ దృశ్యం చూడండి.....ఇప్పుడు నీలానికి కెంజాయ రంగు తోడయింది! సూర్యుడు పర్వతాలకి ఎరుపు రంగు పులిమేస్తున్నాడు! వావ్! ఎంత బాగుందో..అసలు అలలుఅలలుగా ఈ పర్వతాలు అంతే లేకుండా ఉన్నాయేంటబ్బా? కొండలన్నీ పొగలో ఉన్నట్టు ఉన్నాయ్! అందుకే 'స్మోకీస్' అంటారు కాబోలు! ఎవరు పెట్టారో....కరెక్ట్ పేరు పెట్టారు వీటికి :) కాని ఇవి నీలంగా ఉన్నాయ్ కాబట్టి....'నీలపోగపర్వతములు' అని మనం పెట్టేద్దాం ;)

సూర్యుడు కొండల్లోకి దిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు!! ఇక రాత్రికి సన్నని మంచు దుప్పటి పరుచుకుంటుందేమో ఈ ప్రాంతమంతా! వావ్! అప్పుడు ఇంకా ముద్దుగా ఉంటాయేమో ఈ పర్వతాలు!! హ్మ్!! ఎంత అందమైన అనుభూతో కదా!

సరే ఇక కిందకి వెళ్దాం పదండి.......లెఫ్ట్-రైట్...లెఫ్ట్-రైట్...లెఫ్ట్-రైట్....

అరె....అక్కడేంటి నల్లగా కదులుతోంది.....హేయ్....అది ఎలుగుబంటి పిల్ల :)) హుర్రే!! మనం ఎలుగు పిల్లని చూసాం :) అమ్మో! పిల్ల ఎలుగు ఉంది అంటే...ఖచ్చితంగా తల్లి ఎలుగు దగ్గరలోనే ఉంటుంది.... బాబోయ్.... అసలే పెప్పర్ స్ప్రే కూడా లేదు....పదండి...ఆ పిల్ల ఎలుగుకి టాటా చెప్పి....మన కాళ్ళకి పని చెబుదాం!

హమ్మయ్య! కిందకి వచ్చేసాం :) ఇక ఎక్కడన్నా తినేసి....సరాసరి మన చెక్కగృహమునకు వెళ్దాము :)) అందరు చక్కగా నిదరోయి....పొద్దునే లేచి రెడి అవ్వండి :) 

డే-2

పొద్దున అంటే....పది గంటలకా?? ఇలా అయితే ఎలా? ఎన్ని చూడాలి మనం!! హ్మ్! సర్లే....ఏంచేస్తాం!

ఈరోజు మనం స్మోకీస్లో ఉండే దట్టమైన అడవుల్లో జంతువులని చూడటానికి వెళ్తాం :) ఇక్కడ మన దేశంలోలాగా.... పులులు,ఏనుగులు ఉండవు కాని....ఎలుగులు,జింకలు,రాకూన్లు,ఇంకా బుల్లిబుల్లి జంతువులు ఉంటాయట! చూద్దాం మనకి ఎన్ని కనపడతాయో! :) తెల్సా....స్మోకీస్ 'నల్ల ఎలుగుబంటి'కి పెట్టింది పేరు :) అమెరికాలో ఎక్కువగా నల్ల ఎలుగులు ఉండే ప్రాంతం ఇదే!! :) 

మళ్లీ గాట్లింబర్గ్ నగరసందర్సన చేసుకుని.....అడవుల్లోకి వెళ్దాం పదండి :) ఆ గుర్రాలను చూసారా? మనల్ని వాటిమీద అడవుల్లో షికారుకి కూడా తీసుకెళతారు! ఎవరికన్నా వెళ్లాలనిపిస్తే.....మీ ఇష్టం :) అడవిలో గుర్రం మీద స్వారి చేస్తూ.... 'కొండవీటి దొంగ' లాగా ఫీల్ అయిపోండి కాసేపు ;)

సరే...ఇంకాస్త ముందుకి వెళితే....'కేడ్స్ కోవ్' లూప్ వస్తుంది! అంటే....ఒకసారి అందులోకి వెళితే....ఇక అదే దారిలో ముందుకి వెళ్ళాలి...వెనక్కి రావడానికి ఉండదు :) ఆ లూప్ చుట్టేస్తేనే బైటికి వస్తాం :) ఈమధ్యలో మనకి జంతువులు కనిపిస్తాయన్నమాట! అందరు కార్ విండోస్లో తలలు పెట్టి(బయటకి కాదు...) కళ్ళు అప్పగించి....వీలయితే కొంచెం పెద్దవి చేసి...జంతువుల కోసం చూడండి :))  

ర..యి..యయి....ర...యి...యి...యయి....[అంటే...అంత మెల్లగా వెళుతోంది ట్రాఫిక్ అని అర్ధం! అర్ధం చేసుకోరు!! ;) ]

హబ్బ! ఇలా పదకొండు మైళ్ళు వెళ్ళాలా? హ్మ్! ఈ జంతువులేవి? అన్ని కట్టకట్టుకుని ఎక్కడికేల్లిపోయాయి? మనం వస్తున్నాం కదా! కొంచెం రావోచ్చుగా! ;)

అక్కడ దూరంగా కొంచెం నల్లగా ఏదో కనపడుతోంది..ఎంటబ్బ? ఆగు నా బైనాక్యులర్స్ తో చూస్తాను!! హేయ్...అది మమ్మా బేర్....విత్ టూ బేబి బేర్స్...........కేవ్వ్వ్వవ్!! మనకి పిల్లలతోసహా తల్లిఎలుగుబంటి కనిపించిన్దోచ్! కేవ్వ్వ్!!
(ఎలుగుబంటి కోసం పక్క ఫోటోలో కళ్ళు చికిలించి చూడుము)

అరె...ఇటు పక్కకి చూడండి....తెల్లతోక జింకలు....హేయ్...అవి మన దగ్గరికి వస్తున్నాయ్! వావ్....భలే ఉన్నాయ్ కదా! :) మనకి జింకలు కూడా కనిపించాయోచ్చ్! అసలు మనం కేక :) అడవుల్లో స్వేచ్చగా ఉండే జంతువులని చూస్తె....భలే ఉంటుంది కదా! జూలో పెట్టినవి ఏదో కోల్పోయినట్టు ఉంటాయి...కాని ఇక్కడ అలా కాదు....ఎంత ఉత్సాహంగా....ఉల్లాసంగా ఉంటాయో!

హా...ఇవాల్టికి ఇది చాల్లే! :) సరే....అదిగో లూప్ అయిపోవస్తోంది! బాబోయ్.....రెండు గంటలా మనం లూప్ లోకి వెళ్లి వచ్చేసరికి? అసలు టైం తెలీలేదు కదా! :) 

సరే! ఇక బాక్ టూ గాట్లింబర్గ్! అక్కడ డిసైడ్ అవుదాం....నెక్స్ట్ హాల్ట్ ఏంటో! 

ఎంత మెత్తగా సాగిపోతోంది కారు ఈ మెలికెల రోడ్లమీద! మన పక్కనే నది కూడా వస్తోంది చూసారా? ఎక్కువ లోతు లేదు మరి నదిలోకి దిగి సరదాగా నీళ్ళతో ఆడుకుందామా? ఐతే రండి...ఆ పార్కింగ్ లాట్లో కారు పెట్టి....మనం నదిలోకి దిగుదాం :)

జాగ్రత్తగా దిగండి....ఈ రాళ్ళు బాగా పాచిపట్టి ఉన్నాయ్! జారిపోతాం! 

ఆ.....అందరు దిగేసారా! అదిగో...నదిమధ్యలో ఆ రాయి ఉంది చూసారా? దాన్ని తాకి మళ్లీ ఇక్కడికి వచ్చేయాలి :) అది ఆట! ఎవరు ముందు వస్తే...వాళ్ళు విన్నర్! :))

జింగ్...జింగ్....జింగ్...జింగ్....అర్రే.....బాగా జారుతున్నాయ్ రాళ్ళు! బాబోయ్! హ్హహ్హ...చేపలు కూడా ఉన్నాయ్...భలే భలే :))) 

వామ్మో! నదిమధ్యలో బానే లోతు ఉంది :( మోకాళ్ళ దాకా వచ్చేసాయ్ నీళ్ళు! ఆ రాయిదగ్గర లోతు ఎక్కువేమో....ఎవరు వెళ్ళోద్దులే !! ఇక్కడివరకు చాలు :) ఇక్కడే ఒకళ్ళమీద ఒక్కళ్ళు నీళ్ళు కొట్టుకుందాం... కమాన్! ;) 

టిచిక్.....టిచిక్......టిష్...టిష్....టిచిక్....టిచిక్....

హ్హహ్హ :)) భలే ఉంది కదా....ఈ ఆట :) అందరం తడిసిపోయాం :)) సరే మరి కాసిని ఫుటోలు తీసేసుకుని ఇక వెళ్దాం. ఆత్మసీత గోల పెడుతోంది....'అన్నమో రామచంద్రా' అని :)

చలో.....గాట్లిన్ బర్గ్! అదిగో సబ్వే....ఇదిగో పిజ్జాహట్....మీ ఇష్టం :) 

హమ్మయ్య! ఇప్పుడు కళ్ళు కనిపించింగ్ :) సరే....ఇక 'ట్రాం వే' ఎక్కుదామా? పదండి మరి 'ఒబెర్ గాట్లిన్ బర్గ్' కి :)

టికెట్స్ తీసేసుకున్నా మీ అందరికి.ఇక ట్రాం వస్తే ఎక్కేయడమే.....ఇది రోప్ వే అన్నమాట :) ఇప్పుడు మనం ఆ కనిపిస్తున్న'పెద్ద' కొండమీదకి ఈ ట్రాంలో గాల్లో తేలుకుంటూ వెళ్తాం :)

అదిగో....వచ్చేసింది....తొందరగా ఎక్కేసి....ఆ పెద్దకిటికీ పక్కన ప్లేస్ కొట్టేయండి అందరు :) 

హమ్మయ్య అందరికి కిటికీ దొరికింది...ఇప్పుడు చూడండి ఈ ట్రాంలో....గాట్లిబర్గ్ డౌన్ టౌన్ చుట్టూ పరుచుకుని ఉన్న స్మోకీస్ అందాలు ఈ ఎర్రటి ఎండలో :))

ఎండ బాగా ఉన్నా....ట్రాంలో చల్లని గాలి వస్తోంది కదా! మరి అంతా అడవులు!! పచ్చదనంతో పాటే చల్లదనం :) అందుకే అన్నారు.....'వృక్షో రక్షతి రక్షితః' అని :) భలే ఉందికదా....రెండు రెక్కలు కట్టుకుని ఆకాసంలో ఎగరాలన్న నా కోరిక ఇలా తీరింది అన్నమాట :) మీకు అలాగే ఉందా?

'గాల్లో తేలినట్టుందే......గుండె పేలినట్టుందే.....' పాట గుర్తొస్తోంది నాకు :))

హ్మ్! వచ్చేసాం! ఇక్కడ కొన్ని ఎలుగుల్ని పెంచుతున్నారట! వెళ్లి అవి చూసి వద్దాం పదండి :) 

అవిగో....నల్ల ఎలుగుబంట్లు.....అబ్బ ఎంత బలిష్టంగా ఉన్నాయో! తెలుసా....ఇవి పూర్తీ శాఖాహారులట! వీటికి గింజలు,ఆకులు,పళ్ళుదుంపలు,కూరగాయలు మాత్రమె పెడతారట :) కాని నిగనిగలాడుతూ ఎంత బాగున్నాయో! :) కొన్ని బుజ్జిగా  బజ్జోని నిద్రోతున్నాయ్ :)))) 

సరే....ఇక్కడ అందరు సావేనీర్లు కావాలంటే కొనుక్కుని బయలుదేరండి :) మీకు 'పీజియన్ ఫోర్జ్' లో తిరగబడిన ఇల్లు,టైటానిక్ షిప్పు చూపిస్తా :))

హ్మ్! అందరు....బై బై స్మోకీస్ అని చెప్పండి!! ఇదే ఇక లాస్ట్ హాల్ట్ స్మోకీస్లో! ఇక మనం స్మోకీస్ వదిలి వెళ్ళిపోతున్నాంగా! :( 

బై బై స్మోకీస్!

సరే.....పదండి గాట్లిన్ బర్గ్ వదిలి పీజియన్ ఫోర్జ్ కి మన ప్రయాణం!

ఆ అదిగో....తిరగబడిన ఇల్లు :) 'వండర్ హౌస్'....దానిపక్కనే పెద్ద 'టైటానిక్ షిప్' :) మీకు కావాలంటే టైటానిక్ పోస్ పెట్టి ఫోటోలు దిగొచ్చు :)))

సరే మరి! రేపు పొద్దున్న మన తిరుగుప్రయాణం....బాక్ టూ మిషిగన్ :(:)

పొద్దున్నే తొందరగా లేస్తే.....దగ్గరలో 'ఫర్బిడెన్ కావేర్న్స్' చూపిస్తా :)

డే-౩

హ్మ్! అందరు రెడి కదా.....పదండి ఇక్కడికి దగ్గరే....ఈ 'ఫర్బిడెన్ కావేర్స్' 

ఇవి సున్నపు రాయి గుహలు....ఈ గుహలలో నది కూడా ఉంది తెల్సా! ఈ నదిలో నీటి వల్ల ఈ సున్నపురాళ్ళు వివిధ రూపాలు సంతరించుకున్నాయి....ఇంకా కొత్తకొత్త రూపాలు సంతరించుకుంటునే ఉన్నాయి :) 

సరే....అందరు జాగ్రత్తగా నడుస్తూ....ఈ గుహలు చూద్దాం పదండి :) ఈ గుహలలో ఇదివరకు రెడ్ ఇండియన్స్ (ట్రైబల్స్) ఉండేవారట! వాళ్ళు రకరకాల వస్తువుల తయారి కోసం ఈ గుహలు ఉపయోగించేవారట! ఈ గుహల కింద ఒక నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది :)

అదిగో మనకి కనిపించే....ఆ నది చూసారా....ఇది ఇంకో నది :) ఇలాంటి బోలెడు నదుల నీటి రాపిడి వల్ల ఈ గుహలలో ఇన్ని రూపాలు రూపొందాయి! డైనోసార్.....గాద్జిల్లా.....మనిషి కాళ్ళు.....పెద్ద ముక్కు.....రెక్కల వరాహం....చంద్రమండలం ఇలా బోలెడు :)) భలే చల్లగా ఉంది కదా ఈ గుహలో....నేచురల్ ఏసి :)))

సరే మరి! ఇక ఇంటికి వెళదామా? 

హ్మ్!మన స్మోకీస్ ట్రిప్ అయిపొయింది! హుష్ కాకి!

ఇక మనం ఇంటిదారి పట్టాలి! మీ అందరికి స్మోకీస్ నచ్చింది కదా! నాకైతే భలే నచ్చేసింది :)

సరే....ఐతే....అందరికి టాటా-బిర్లా :) 

ఇంకో టపాతో మళ్లీ కలుద్దాం :) అంతవరకూ చూస్తూనే ఉండండి 'వెన్నెల సంతకం'
అన్ని ఫొటోస్ చూడాలనుకుంటే....పైన పిక్ మీద క్లిక్ చేయండి.....పండగ చేస్కొండి :) 

23 వ్యాఖ్యలు:

లత చెప్పారు...

థాంక్స్ ఇందూ, మీతో పాటు మమ్మల్నీ
తీసుకువెళ్ళినందుకు
చాలా బావున్నాయి ఫొటోస్

కొత్త పాళీ చెప్పారు...

Nice

వేణూశ్రీకాంత్ చెప్పారు...

మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకు వెళ్ళినందుకు థ్యాంక్స్ :) చాలా బాగారాశారు..

రాజ్ కుమార్ చెప్పారు...

4D మూవీ చూపించేశారు గా? చాలా థాంక్సండీ.. కాణీ ఖర్చులేకుండా ఎంచక్కా తిప్పి చూపినందుకూ.. ;)
ఫోటోలు ఇంకా ఎక్కువ పెడితే బాగుండేదండీ..

హరే కృష్ణ చెప్పారు...

ఇందు గారు, ఫొటోస్ కంటే మీరు రాసిన విధానం ఇంకా బావుంది
మీరు మరిన్ని ట్రిప్ లకు వెళ్లి ఇలాంటి మరెన్నో పోస్ట్ లు బర బరా రాసేయండి :)

నేస్తం చెప్పారు...

చాలా బాగా రాసావు ఇందు..నిజమే ఇంకా ఫొటోస్ పెట్టి ఉంటే బాగుండేది..నాకు ఆ నది గురించి చదువుతున్నపుడు అక్కడికి వెళితే బాగుండు అనిపించింది

మనసు పలికే చెప్పారు...

ఇందు, ముఖ్యంగా ఈ టపాలో నాకు బాగా నచ్చిందేమిటంటే, నీతో పాటు మమ్మల్ని కూడా తీస్కెళ్లిన ఫీలింగ్ కలిగించావు. భలే కొత్తగా రాసావులే. ఇంక స్మోకీస్ అయితే నాకు సూపర్ గా నచ్చింది.. నీ ఫోటో బ్లాగుకి కూడా వెళ్లిపోయి అన్ని ఫోటోలు చూసేసానోచ్.. :))

శశి కళ చెప్పారు...

అబ్బ...యెంత బాగున్దొ .....ఇందు లాగా....

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అబ్బా కాళ్ళు నొప్పి పెట్టేశాయండి. అంతలా పరిగెట్టించే సారేమిటి మమ్మలని.

>>> మీకు ఎక్కడైనా ఎలుగు కనిపిస్తే.....అరవొద్దు....దాన్ని చూడనట్టు వచ్చేయండి సరేనా?

ఎలుగు బంటి మన్ని చూస్తే ??

ఫోటోవులు శానా బాగున్నాయి.

రత్న మాల చెప్పారు...

ఇందు బాగుంది. చదివినంత సేపునేను కూడా రియల్ గా చుసానేమో అన్న ఫీలింగ్ కలిగింది .

కెక్యూబ్ వర్మ చెప్పారు...

చాలా హాయిగా సాగిందండీ ప్రయాణం..థాంక్యూ..

మురళి చెప్పారు...

నిజంగానే తీసుకెళ్ళిపోయారు...

kiran చెప్పారు...

ఇందు..ఇన్ని చూసాం...కదా ఇంటికొచ్చి రెస్ట్ తీస్కుని ఇప్పుడే వస్తున్నా..నీ బ్లాగ్ కి కామెంట్ పెట్టడానికి..
భలే ఉన్నాయ్ కదా..మళ్లీ మనం చూసినవి అన్ని ఇలా ఫొటోస్ లో చూస్తుంటే..:) :)
రాయి..రాయి రాయి...నెక్స్ట్ టపా అప్పటి దాక వెన్నెల్లో ఉంటా..:)

Rams చెప్పారు...

Nice Blog indugaru...Mee native place ekkadandi india lo..
Rams....

Rams చెప్పారు...

Marachipoyanu Pics kuda chala bagunnai...

ఇందు చెప్పారు...

@ లత:లతగారూ! ధన్యవాదాలండీ :)

@ కొత్త పాళీ : ThnQ Sir :)

@ వేణూ శ్రీకాంత్:చాలా థాంక్స్ వేణు :)

ఇందు చెప్పారు...

@ వేణూరాం:అయ్యో త్రీడీనేనండీ,...ఫోర్డీ అంటే... కిరణ్కి మొట్టికాయలూ అలాంటివి ఉంటాయన్నమాట! (కిరణ్ ఈ కామెంట్ చూడకుండా చేయి దేవుడా!! ;) )

@ హరే కృష్ణ:హ్హెహ్హె! అలాగే ప్రతీక్! బరబరా రాసేయనా? బ్లాగ్ పేజి చిరిగిపోతుందేమో అంత భయంకరంగా వ్రాస్తే ;)

@ నేస్తం:నేస్తంగారూ...ఇంకా బోలెడు ఫొటోలు నా ఫొటో బ్లాగులో ఉన్నాయండీ...మీరు చివరి లైన్ చదివుంటే తెలిసేది :( ఆ నదిలో భలే ఆడుకున్నాము మేమంతా!! ఫుల్ తడిసిపోయాం! :) ఆ నదిఫొటో కూడా పెట్టాను చూడలేదా? ధన్యవాదాలు నా పోస్ట్ నచ్చినందుకు :)

ఇందు చెప్పారు...

@మనసు పలికే:థాంక్యూ అప్పూ! ఆ ఫీలింగ్ రావాలనే అలా రాశా! ట్రావెలాగ్ ఎప్పుడూ ఒకేలా రాస్తే బోర్ కొడుతుందనీ :) ఐతే ఇలా రాయడం వల్ల టపా నిడివి కొంచెం ఎక్కువయింది....కాని లైట్ :)) థాంక్స్..నా బ్లాగుకెళ్ళి బుధ్ధిగా ఫొటోలు చూసినందుకు! గుడ్ గర్ల్! :)

@ it is sasi world let us share: అజ్జిబాబోయ్! థాంక్యూ!థాంక్యు!! :)

@ బులుసు సుబ్రహ్మణ్యం: హ్హహ్హహ్హా! బులుసుగారూ.... మీ మరీను! అసలే స్లోమోషన్లో అందరికీ అర్ధమయ్యేలా స్మోకీస్ చూపిస్తే...అలా అంటారేమిటి చెప్మా? ఎలుగు మనల్ని చూసినా సేం పాలసీ! దాన్ని మనం గమనించనట్టు ఉండాలి :) అప్పుడు అది...'ఆ మనల్ని ఎవడూ పట్టించుకోట్లేదని' వెల్లిపోతుంది ;)

ఇందు చెప్పారు...

@రత్న మాల :థాంక్యూ రత్నమాలగారూ! ఆ ఫీలింగ్ రావాలనే అలా రాశా! మీ అందరి కామెంట్స్ చూస్తే...ఆ ఫీలింగ్ తెప్పించాననె అనిపిస్తోంది :)

@ కెక్యూబ్ వర్మ :నా బ్లాగుకొచ్చి...నా టపా మొత్తం చదివి కామెంటు పెట్టినందుకు నేను మీకు ధన్యావదాలు చెప్పాలండీ :) చాలా థాంక్స్ అండీ!

@ మురళి:మురళిగారూ..బోలెడు ధన్యవాదాలు :)

@ kiran :హ్హహ్హ! కిరణ్...థాంక్యూ డియర్! ఐతే మన స్మోకీస్ అందరికీ నచ్చిందిట చూసావా? ఏంటి వెన్నెల్లో ఉంటావా? చలిగా ఉంటుందిగా జలుబు చేస్తుంది...ఇంటికెళ్ళి దుప్పటి కప్పేసుకుని బజ్జో :)

ఇందు చెప్పారు...

@ Rams:నా బ్లాగ్,ఫొటోలు నచ్చినందుకు థాంక్యూ రాం గారు! మాది మిరపకాయల నగరము :))) అనగా చిల్లీ సిటి!(Guntur) :)

Ennela చెప్పారు...

చాలా బాగా చూపించావ్ ఇందూ...థ్యాంక్స్
అటునుంచి ఇటు కెనడా వచ్చెయ్యొచ్చుగా

Unknown చెప్పారు...

Nice Narration !

ఇప్పటికి మూడు సార్లు వెళ్ళానేమో మా ఊరికి దగ్గరగా ఉండటం వల్ల. వెళ్ళిన ప్రతిసారీ కొత్తగా కనిపిస్తుంది. స్మోకీస్ ఫాల్ సీజన్ లో మరింత అందంగా కనిపిస్తాయి. మాంచి చిత్రకారుడి పైంటింగ్స్ లా అనిపిస్తాయి స్మోకీస్ వింత వింత రంగుల్లో..

మీరు చూసినవి, చేసినవీ అన్నీ చేసాము కానీ ఒక్క రాఫ్టింగ్ తప్ప. ఈ సారి అది కూడా ట్రై చేస్తాం. వాటర్ పార్కులు, థీం పార్కులు ఉంటాయి. వాటికి వెళ్ళారా?

మీరు తీసిన ఫొటోలు కూడా చూసాను. చాలా బాగున్నాయి. ఇవి నేను 2007 లో వెళ్ళినప్పుడు తీసినవి. ఆ జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చారు. Thank you !

:)

http://srivenu.blogspot.com/2007/05/pigeon-forge-gatlinburgh-and-smoky.html

నందు చెప్పారు...

chala chala chala bhavunnayandi...