20, జూన్ 2011, సోమవారం

పుష్పక విమానం!

'నీకు బాగా నచ్చిన సినిమా ఏది?' అని ఎవరైనా నన్ను అడిగితే....మహేష్ బాబు ఫ్యాను/ఏసి కాబట్టి ఠక్కున 'అతడు' అని చెప్పేసినా..... మనసులో అప్పటికే బోలెడు సినిమాలు క్యు లో నిల్చుని ఉంటాయ్! నా పేరు చెప్పలేదే....నా పేరు చెప్పలేదే... అని అలా గింజుకునే సినిమాల్లో..... 'సిరివెన్నెల'.... 'స్వర్ణకమలం'...... 'ఆహా నా పెళ్ళంట'.... 'చంటబ్బాయ్'....  'పుష్పక విమానం' ..... 'గీతాంజలి'...... "అభినందన' ..... 'ఆనంద్' ... 'గోదావరి' ........ఇలా లిస్టు చైనా గోడలా సాగుతూనే ఉంటుంది ;) 

పైన చెప్పిన సినిమాలన్నీ నా గుండె గదిలో కుర్చీలేసుకుని  కూర్చుని  పాప్ కార్న్ తింటూ... కూల్ డ్రింక్ తాగుతూ..... నానా హంగామా చేస్తున్నా.....ఒక మూగ సినిమా మాత్రం తన మౌనంతోనే  నన్నాకట్టుకుంది!

అదే 'పుష్పక విమానం' :)

ఈ సినిమా అంటే ఎందుకో ప్రత్యేకమైన అభిమానం!! కాని...కాలగమనంలో.....మన మెమొరి 'క్యు'లో అట్టడుగుకి చేరిపోయింది!!

మొన్న చెవులకి రింగ్స్ పెట్టుకుంటూ అద్దంలో చూసుకుంటుంటే.... పుష్పక విమానంలో అమల గుర్తొచ్చి..... పెదవుల పై చిన్న చిరునవ్వొచ్చి...ఆనక ఈ సినిమా చూసి ఎన్నేళ్ళయిపోయిందో అని గుర్తొచ్చి........... వెంటనే హాల్లోకొచ్చి ..... అప్పటికే మరమరాలలో ఉప్పు+కారం+ఉల్లిపాయలు+నెయ్యి వేసుకుని తింటూ 'సి.ఐ.డి' అనే డొక్కులో టీవి షో చూస్తున్న మా చందు దగ్గర  లాప్టాప్ సర్రున లాక్కుని  తుర్రున పారిపోయా!

ఆ తరువాత వెంటనే 'యుట్యుబ్' అన్నాయ్  దగ్గరకెళ్ళి టక్..టక్..మని తలుపు తట్టి  అడిగా!
'అన్నాయ్....అన్నాయ్....ఈ సినిమా వేసిపెట్టవూ!!' అని. 
అలా అడిగి అడగగానే...ఇలా లింకిచ్చేసాడు మా 'యుట్యుబ్' అన్నాయ్! హెంత మంచోడో :))

ఏంటి అక్కడెవరో గొణుక్కుంటున్నారు విషయం తేల్చమని??? వస్తున్నా.....అక్కడికే వస్తున్నా.....

పుష్పక విమానం....

సినిమాకి డైలాగు కన్నా నటన ముఖ్యం అని చెప్పిన సినిమా!

మెలికెలు తిరిగే డాన్సులు...డ్యుయెట్ల కన్నా.....చక్కని సంగీతంలో పదాలు అవసరంలేని పాటలు కూడా ఉంటాయని తేల్చిన సినిమా!

కామెడి కావాలంటే......ఏదో ఒక డైలాగ్ కావాలి....లేదా ఎవరినో ఒకడిని బకరాగా చూపెట్టాలి అనే అవసరం లేదని చెప్పిన సినిమా!

ఇక విషయానికి వస్తే..........ఒక నిరుద్యోగి....తెలివితేటలున్నా.....ఉద్యోగం రాక అలమటిస్తుంటే.....అదే సమయంలో ఒక ధనికుడు భార్యమీద కోపంతో ఒక విలాసవంతమైన హోటల్లో దిగుతాడు! ఈ నిరుద్యోగికి ఆ భోగి అనుకోని పరిస్థితుల్లో తారసపడడం..... పాత్రలు తారుమారవడం...... చాకచక్యంగా ఆ హోటల్లో ప్రవేశించి.......ఆ ధనికుడి డబ్బుతో విలాసంగా గడపడం.....ఈ క్రమంలోనే అదే హోటల్లో ఉండే అమ్మాయితో ప్రేమలో పడడం.....చివరకు డబ్బు 'శాశ్వతం కాదు' అనే సత్యాన్ని తెలుసుకుని ఆ పాత్రని చాలించి......తన తప్పుని ప్రేమించిన అమ్మాయికి నిజాయితీగా చెప్పి.....ఆ ధనికుడిని యధాస్థానంకి చేర్చి.....అతడికి జరిగింది చెప్పి క్షమార్పణ కోరి.... మళ్లీ తన మామూలు పేద,నిరుద్యోగ జీవితాన్ని సగర్వంగా స్వీకరించి భవిష్యత్తులోకి ఆత్మవిశ్వాసంతో అడుగేయడం.....ఇది సూక్ష్మంగా కథ!

ఇందులోనే చిటికెడు రొమాన్స్.... కాస్తంత సస్పెన్స్ సరంజామా..... కూసింత హాస్యపు రెబ్బలు...... వేసి.... మంచి ఘాటుగా పోపు పెట్టాడు సింగీతం!

సినిమా మొదలుపెట్టేటప్పుడు హీరో ఏ మెట్టు మీద ఉంటాడో....చివరికి అదే మెట్టుమీద ఉంటాడు..........మధ్యలో ఎన్ని మెట్లు ఎక్కినా! :))

ఇందులో కమల్ నటన బాగుందా? అమల అభినయం బాగుందా? సింగీతం డైరెక్షన్ బాగుందా? సన్నివేశాలకి తగ్గట్టు   వైద్యనాధన్ కూర్చిన సంగీతం బాగుందా అంటే.... జవాబు చెప్పలేమేమో!!

భారి సెట్టింగులు అవసరం లేకుండా.....అమెరికా/ఆస్ట్రేలియా బాక్ డ్రాప్ లేకుండా....కేవలం ఒక హోటల్ గది.....ఒక బీద నిరుద్యోగి గది మాత్రమె ఆసరాగా చేసుకుని ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథనం అనితర సాధ్యం!

ఇందులో నిరుద్యోగి ఆకలి మంట,తపన....అలాగే డబ్బున్నోళ్ళ విలాసం,వైభోగం....రెండు భిన్న ధృవాలైనా ఒకే చట్రంలో భలే ఇరికించేసాడు దర్శక మాంత్రికుడు!

ఆశ,ఆకలి మనిషి చేత ఏ పనికైనా ఒడిగట్టిస్తాయని  చెప్పడానికి ఈ సినిమాకంటే ఉత్తమ ఉదాహరణ ఉండదేమో!!

నేషనల్ అవార్డ్ వరించిన ఈ సినిమా ఒక క్లాసిక్! ఏ భాషా అవసరంలేకుండా చక్కటి సందేశాన్ని నేరుగా గుండెల్లోకి మోసుకొచ్చే 'పుష్పక విమానం'.......... 

ఈ సినిమా చూస్తున్నంతసేపు మాటల్లేవు కాని....ఏదో తెలియని ఫీలింగ్....గుండెల్లోనించి!! సినిమా చివర్లో గులాబీ ముల్లులా కసక్కున గుచ్చుకున్నా..... సమంజసమేకదా అని మనసుకి సర్దిచెప్పాల్సివచ్చింది! :))


15 వ్యాఖ్యలు:

కృష్ణప్రియ చెప్పారు...

నా ఫేవరేట్ సినిమాల్లో కూడా ఇది ఒకటి. యూట్యూబ్ లో ఉందన్నమాట.. మళ్లీ చూస్తా అయితే..

హరే కృష్ణ చెప్పారు...

అసలు ఈ ఐడియా రావడమే గ్రేట్ అనుకుంటే..అనుకున్నా విధం గా తీయగలగడం అద్భుతం
కమల్ హాసన్ లాంటి ఆర్టిస్ట్..నిజంగానే మాటల్లేవ్
అమల కూడా బాగా చేసింది
>>ఏ భాషా అవసరంలేకుండా చక్కటి సందేశాన్ని నేరుగా గుండెల్లోకి మోసుకొచ్చే 'పుష్పక విమానం'
well said

స్నిగ్ధ చెప్పారు...

బాగా రాసారు ఇందు ....ఎన్ని సార్లు ఈ సినిమా ఫుల్ గా చూద్దామని అనుకున్నా ఎందుకో కుదరటం లేదు...ఈ సారి తప్పక యూ ట్యూబ్ అన్నాయిని అడిగి చూస్తా..
:)

స్నిగ్ధ చెప్పారు...

మీరూ మహేష్ పంకానా...మీ టూ ...
:)

Ennela చెప్పారు...

యూ ట్యూబ్ అన్నయ్ హెంత మంచోడో....హహహహ్...సమీక్ష బాగుంది...నేనూ మార్గదర్శిలో చేరిపోతా( వీలైతే)..

Ennela చెప్పారు...

యూ ట్యూబ్ అన్నయ్ హెంత మంచోడో....హహహహ్...సమీక్ష బాగుంది...నేనూ మార్గదర్శిలో చేరిపోతా( వీలైతే)..

ఆ.సౌమ్య చెప్పారు...

బలే సినిమా...నాకు కూడా చాలా ఇష్టం...చిన్నప్పుడు రెండు సీన్లు బాగా ఇష్టపడేదాన్ని. ఒకటి - కమల్ తన పాత ఇంటికెళ్ళి సినిమా హాల్ గొడవలనీ రికార్డ్ చేసి తెచ్చుకుని హొటేల్ లో అది పెట్టుకుని వింటూ నిద్రపోతాడు.
రెండు - చండాలం అంతా బాగా పేక్ చేసి పైన సెంటు పూసి బస్టాండ్ లో వదిలేస్తాడు. దాన్ని వాడెవడో ఎత్తుకుపోతాడు. మర్నాడు మళ్ళీ కమల్ డబ్బతో కనిపిస్తే వాడు అరటిపండు తింటూ వాంతి చేసుకుంటాడు. :)))

ఈ రెండు సీన్లు మాత్రం ఎప్పటికీ మరచిపోలేను.

అమల, కమల్ ఇద్దరూ ఇద్దరే...అద్భుతంగా నటిస్తారు. అలాగే అమల వాళ్ళ నాన్న మేజిక్కులు, ఫరీదా జలాల్ అన్నిటినీ లైట్ తీసుకునే తత్వం, టినూ ఆనంద్ ఐసు కత్తి.....ఎప్పటికీ మరచిపోలేని సన్నివేశాలు....గొప్ప సినిమా. టీవీలో ఎన్నిసార్లు వచ్చినా చూస్తూనే ఉంటాను.

శశి కళ చెప్పారు...

nijame baavaalu theliyacheyataniki konni saarlu baasha avasaram ledemo

మనసు పలికే చెప్పారు...

ఇందూ.. నీ టపా లేట్ గా చూసినందుకు నన్ను క్షమించెయ్..:)
నువ్వు పుష్పక విమానం గురించి చెబుతుంటే నాకు మళ్లీ సినిమా అంతా కళ్ల ముందు కదులుతూ ఉంది..:) చాలా మంచి సినిమాని గుర్తు చేసావు ఇందు.. టపా బాగుంది చాలా:))

నేస్తం చెప్పారు...

ఇందులో అమల భలే ముద్దుగా ఉంటుంది... అడుక్కున్నవాడి సీన్( అతని పేరు ఆర్ నారాయణ మూర్తి ఏదో) మొదట్లో కామెడీగా తర్వాతా కంట తడిపెట్టించే విధంగా చాలా బాగా తీసారు ..నిజంగా చాలా వండర్ ఫుల్ సినిమా

కొత్త పాళీ చెప్పారు...

ఇందు గారు, టపాకి సంబంధం లేని కామెంటుకి క్షమాపణలు. ఇది ప్రచురించకపోయినా పరవాలేదు.

http://kottapali.blogspot.com/2011/06/blog-post.html

తప్పక ప్రోగ్రాముకి రండి. మీ మిత్రబృందాన్ని కూడా తీసుకొస్తే, మరీ కృతజ్ఞుడను.

kiran చెప్పారు...

ఇందు - ఏమిటో ఈ బ్లాగులకు వచ్చాక నాకు సినిమా knowledge పెరిగిపోతోంది..
ఈ సినిమా చూసి చాలా రోజులయ్యింది...
నాకేం గుర్తు లేదు..మళ్లీ చూస్తా...:)

చందు చెప్పారు...

ఆహా! కమల్ ఆక్టింగ్ అంటే ఆ రోజుల్లో పడి చచ్చే వాడిని, పైగా సింగీతం డైరెక్షన్ అంటే సినెమాలు అన్నీ చూసే వాడినీ. సినేమా అంతా ఫ్లూట్ ఎక్కువగా వాడి వైద్యనాథన్ చెవుల్లో అమృతం పోసినట్లు, కమల్ నటనతో రెప్పలార్పడం మర్చిపోయినట్లు, పిండి కన్నీరు పెట్టించినట్టు..మీ టపా చదువుతుంటే నాకు మళ్లీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి..

మురళి చెప్పారు...

ఈ సినిమా నాక్కూడా ఇష్టమండీ.. నేనైతే దీనిని 'ప్రపంచ సినిమా' అంటాను.. భాష సమస్య లేదు కదా..

Sree చెప్పారు...

a superbly orchestrated movie with very realistic presentation without being bored for a minute...words levu, songs levu ani feel kooda avvam kada... :).