21, ఆగస్టు 2011, ఆదివారం

ఒక బృందావనం!!

బృందావనం.......
ఆ పదమే ఒక పులకింత.....ఆ తలపే ఒక మైమరపు....
ఏ క్షణాన....ఆ సుందర లోకంలో అడుగుపెడతానా...అని నా తనువు నిలువెల్లా కనులై  ఎదురుచూస్తున్నది.....
'కృష్ణా!....మనసు ఎందుకో ఉత్తుంగతరంగమై ఎగసి....ఎగసి....నా మోమును సుతారంగా తాకివెల్లిపోతున్న ఆ  పిల్లతిమ్మెరల మీద సాగిపోతోన్న నీ మురళీగానాన్ని ఓడిసిపట్టుకోవాలని ఆత్రపడిపోతోంది!! ఎందుకో దానికి అంత తొందర? 
వచ్చేస్తున్నాను స్వామీ....నీ దివ్యమనోహర లోకానికి....
నీ మృదుపదస్పర్శతో పునీతమైన ఆ నందనవనంలో ప్రతి రేణువు నీ పాదరజమే కదా!
నీ రూపాన్ని నిండారా నింపుకున్న నీ సుధాధామంలో ఒక్క క్షణం నిలిచినా నా జన్మ ధన్యమవును కదా!'

ఈ ఆలోచనల్లో మునిగిపోతూ..... ఆ ఆనందలోకంలో తేలియాడుతుండగానే వచ్చేసింది 'బృందావనం'....నా కలలవనం...

నాతోపాటు వచ్చిన మిత్రబృందం అంతా తమతమ సామాన్లతో బస్సు దిగి...ముందు నడుస్తున్నారు.....
నేను మాత్రం....బస్సు దిగే ముందే....ఆ 'బృందావనం' అధిదేవత అయిన 'రాధారాణి'ని మనసులోనే అనుమతి అడిగి....నమస్కరించి....బస్సు దిగి పరమపవిత్రమైన ఆ మృత్తికని చేతితో స్పృశించి....శిరస్సున ధరించాను!
ఏదో ఒక అనిర్వచనీయమైన అనుభూతి... నన్నునిలువనీయట్లేదు.....ఆ అనుభూతిలోనే మెల్లగా నడుస్తూ....నా నేస్తాలను అనుసరించాను!

చుట్టూ చూసాను! నా కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయ్! ఏదో చూడాలని ఆశపడుతున్నాయ్! ఏదో కనుగొనాలని ఆత్రపడుతున్నాయ్!! కానీ ఎక్కడ? 

మెల్లగా అలా ముందుకు సాగుతున్నాను.....ఎంతకీ ఆ నందనవనం కానరాదే??
ఇదేనా బృందావనం? అని ఎవరినైనా అడగాలనిపించింది. కానీ కళ్ళముందు ప్రత్యక్షంగా కనపడుతోంది.... మరి నా మనసేమో.... 'ఇది కాదు నేను చూడాలనుకున్న బృందావనం' అని గోలచేస్తోంది.ఇదేమి పట్టించుకోకుండా కెమెరాలతో కనపడినదల్లా ఫోటోలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు నా మిత్రబృందం. వారివెంట జీవంలేనిదానిలాగా నడుస్తున్నాను నేను!

నా భుజాన వ్రేలాడుతున్న కృష్ణుడిముఖచిత్రం ఉన్న హాండ్ బాగ్....బరువుగా అనిపించింది. అందులో కృష్ణుడిమీద రాసిన వేలవేల పాటలు కలిగి ఉన్న పుస్తకం ఉంది. ఈ బృందావనంలో ఆ దేవదేవునికి అంకితం చేద్దామని తెచ్చి పెట్టుకున్న ఆ పుస్తకం.....దీనంగా నావంక చూస్తున్నట్టు అనిపిస్తోంది....

ఆ పుస్తకంలో ఐదువేల పాటలు రాయాలని నా సంకల్పం....ఇప్పటికీ 4999 రాసి....ఆ చివరి పాట ఈ బృందావన క్షేత్రంలో....ఈ సుమనోహర ప్రదేశాన్ని వీక్షిస్తూ....వ్రాసి....నా సంకల్పాన్ని నెరవేర్చి ఆ స్వామి పాదాలకి ఈ పాటలతోటని అంకితమివ్వాలని ఆశ పడ్డా!! కానీ ఏమని వ్రాయను?? ఎలా రాయగలను??? 

జయదేవుడు వర్ణించిన ఆ అద్భుత సౌందర్య అద్వితీయ సుందర నందనవనం ఇదేనా?
నా లీలామోహనుడు....ప్రతినిత్యం రాధాదేవితో రాసలీలలాడే రససామ్రాజ్యం ఇదేనా?
నా మురళీధరుడు తన సఖీసమూహంతో ఆటలాడిన వ్రజ భూమి ఇదేనా?
"మాధవికా....పరిమళ లలితే....నవ మాలతి జాతి సుగంధౌ!!" అని అన్నారే జయదేవులు....మరి ఎక్కడ ఆ మాధవీలతలు? ఎక్కడ ఆ మాలతిపుష్పగంధాలు?
"లలితలవంగలతా పరిశీలన...కోమలమలయసమీరే....మధుకరనికర కరమబ్బిత కోకిల...కూజిత కుంజ కుటీరే!" ఈ కీర్తనకి అర్ధం? ఏవి ఆ లతలతో అల్లుకున నికుంజాలు?? ఫల,పుష్పవృక్షాలతో అలరారే కుటీరాలు? కమ్మని కోయిలల కిలకిలా స్వరాలు?

నా కళ్ళవెంట నీటి తడి! ఎదలో ఏదో మూల అలజడి! ఎక్కడికక్కడ షాపులు..... రకరకాల వస్తువులు అమ్ముతూ నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు..... వస్తువులు కొన్నా కొనకపోయినా కనీసం చూసినా ఖరీదు కట్టమని నిలదీసే వర్తకులు.... విపరీతమైన వానరసేన.....ఇరుకిరుకు సందులు..... పాతకాలంనాటి ఇళ్ళు... కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కుడ్యాలు..... తోసుకుంటూ తిరిగే జనాలు..... అంతకంటే వేగంగా సంచరించే అపరిశుభ్ర గోగణం.... భక్తిభావం అసలు లేకుండా అంతా గోలగోలగా ఓహ్! ఇక నావల్ల  కాలేదు..... నాకు అస్సలు అడుగు ముందుకువేయబుద్ది కాలేదు.... ఇక ఏమీ చూడాలనిపించలేదు!! ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించగా.... అక్కడే ఒక షాపు దగ్గర కూలబడ్డాను! అప్రయత్నంగా నా కనురెప్పలు మూతపడ్డాయి..... మనసుమాత్రం కృష్ణనామజపంలో మునిగిపోయింది! అలా ఎంతసేపున్నానో తెలీదు....

క్రమంగా చీకటిపడిపోయింది.... లేచి చూసేసరికి ఎవ్వరూ లేరు.... నా స్నేహితులు....మమ్మల్ని తీసుకొచ్చిన బస్సు....ఆ మనుషులు.........ఎవ్వరూ లేరు....

దిగ్గున లేచాను! వెనక్కి తిరిగాను....అంతే! మాటాలు రాక చేష్టలుడిగిపోయి మైనపుబోమ్మలా అలా చూస్తూ ఉండిపోయాను! నాకళ్ళను నేనే నమ్మలేకపోయాను!

ఇందాక చూసిన రోడ్ల స్థానే పచ్చటి తివాచి పరిచినట్టున్న నందనవనాలు..... ఇంతింతేసి పువ్వులతో విరగబూస్తున్నాయి...... అంతే కాదు..... ఎప్పుడు కనివిని ఎరుగని రకరకాల ఫలాలతో విరగగాసిన చెట్లు ఆ ఫలభారంతో కొంచెం ముందుకు వంగాయి కూడా! పెద్దపెద్ద చెట్లు.... వాటిని బలంగా అల్లుకుని ఒకచెట్టునించి ఇంకో చెట్టుకి బంధం వేస్తున్న లతలు.... ఆ లతల్ని ఆధారంగా చేసుకుని ఉయ్యాలలూగుతున్న అందమైన గోపికలు..... ఆకాశంలో నక్షత్రాలన్నీ గుదిగుచ్చి తారాతోరణం కట్టినట్టు అంతటా వెలుగుజిలుగులు.... ఎటూ చూసినా.... కన్నెపడుచులు.... నవ్వుతూ.... తుళ్ళుతూ.... ఆటలు ఆడుతూ... పాటలు పాడుతూ.... అబ్బ! ఆ పాటలు తేనెలతేటలులాగా ఎంత బాగున్నాయో.......అలా ఆ వింతలన్నీ అబ్బురంగా చూస్తూ ముందుకు సాగాను!

రకరకాల పక్షుల కిలకిలారావాలతో,కమ్మని పూల పరిమళాలతో ఆ దారంతా ఆహ్లాదంగా ఉంది! కాళ్ళకింద ఆ పూలపుప్పొడి జారిపడి సుతిమెత్తగా తగులుతోంది.... చల్లని మలయమారుతం నా శ్వాసలో మమేకమౌతోంది..... ఆ పువ్వులని... ఆ ఆకులను చేతులతో తాకుతుంటే  ఏదో పులకింత! అలా... ఆ తోటలో..... ఆ పొదరిళ్ళ మధ్యలో...... ఆ చుక్కల పరదా క్రింద మెత్తమెత్తగా నడుస్తూ వెళుతుంటే..... వినిపించింది..... ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతున్న గలగలల సవ్వడి! "యమున....అది యమునా నదే!!" అనుకుంటూ పరుగుపరుగున వెళ్లి చూద్దునుకదా...... అదేమిటో.... నల్లగాఉండే యమున..... పున్నమి చంద్రుడి వెన్నెలకి కాబోలు.... ధవళ కాంతులతో ధగధగలాడుతోంది.... యమున ఒడ్డున ఉన్న సైకత రేణువులు... హిమరజములా అన్నంతగా మెరిసిపోతున్నాయ్! యమున ఎంత ఉవ్వెత్తున ఎగసిపడుతోందంటే...... బృందావనంలోకి వచ్చేసి ఆ అందమంతా తన చేతులతో స్పృశించాలి అనుకునేంతగా!! ఇక నెలరాజు అందం చెప్పనలవికానంతగా ఉంది..... నా కృష్ణుడి మోమల్లె!!

ఇంతలో ఎక్కడినించో.... కిలకిలమని నవ్వులు..... కోలాహలాలు...... మంద్రస్వరంలో గానం వినిపిస్తున్నాయ్! అటు వైపు తలతిప్పి చూస్తే..... ఒక పెద్దదేవగన్నేరు వృక్షం..... చెట్టునిండా పూలే..... అల్లంతదూరానికి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయ్! దానికింద.... బుల్లిబుల్లి తువ్వాయిలు గెంతులేస్తున్నాయ్! ఇంతంత తోకలతో నెమళ్ళు అటు,ఇటు తెగ హడావిడిగా తిరిగేస్తున్నాయ్! ఇంకా చాలామంది గోపీగోపికలనుకుంటా నృత్యాలు చేస్తున్నారు...... అటు వైపు వెళదామని నడక సాగించాను! దారిలో నా కాలికి అక్కడక్కడా చిన్నిచిన్నికుందేలుపిల్లలు అడ్డుపడుతున్నాయ్..... వాటిని పట్టుకుందామని..... ఒకదానివెంట పరుగుతీసాను..... ఇంతలో ఎక్కడినించి వచ్చిందో...... ఒక చిన్నారి జింకపిల్ల బెదురుబెదురుగా చూస్తూ.... నావైపు వచ్చి నన్ను చూడగానే..... పారిపోబోయింది...... నేను దానివేనకే పరుగు మొదలుపెట్టాను.....


అది... .నన్ను ఎక్కడికేక్కడికో తీసుకెళ్ళింది...... ఏవేవో వనాలు తిప్పింది..... దారిలో ఎన్నో వింతలను చూపించింది...... అయినా దానికి అలుపు రాదే! నాకు ఆయసమోచ్చేస్తోంది..... ఇంతలో ఒక పొన్నచెట్టు కనపడితే.... అక్కడ కాసేపు ఆగాను!

 ఈ జింకపిల్ల ఎటువేల్లిపోయింది అని అనుకుంటూ.... మెల్లగా ముందుకు వెళుతుంటే.... అక్కడ  ఏదో ఒక సుప్రకాశం నాకు దగ్గరవుతోంది.... క్రమంగా అది ఒక ఆకృతిని సంతరించుకుంటోంది.... నాకు బాగా పరిచయమున్న వ్యక్తిలాగే అగుపిస్తోంది....... ఆ వ్యక్తి దగ్గరయ్యే కొద్దీ దివ్యచందన పరిమళమేదో నా మేనిని చుట్టేస్తోంది..... ఒక నీలకాంతి ఆ ప్రదేశమంతా పరుచుకుంది..... ఒక మురళీరవం నా చెవుల్లో అమృతం పోస్తోంది..... ఒక అందెలరవళి నా గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది.... ఒక తులసిమాల నా చేతులకు అందే దూరంలో నిల్చుని ఉంది.... ఒక నెమలిపింఛం ఆ మణిమయ కిరీటంలో ఒదిగిపోయింది...... ఒక కస్తూరితిలకం నా కళ్ళకు స్పష్టంగా..... అతి దగ్గరగా కనిపిస్తోంది...... ఒక అచ్చెరువొందే సౌందర్యం ఒలికిస్తున్న నేత్రద్వయం నావైపు చూసింది! సమస్త సృష్టిని స్తంభింపజేసే ఒక చిరునవ్వు ఆ మోమున విరిసింది.... నా గుండె వేగం రెట్టింపయ్యింది...... నా ఊపిరి  క్రమంగా బరువైపోతోంది ...... నా శరీరంలో ఆణువణువూ కంపిస్తోంది..... కానీ పెదవులు మాత్రం........ అతి కష్టం మీద  పెగుల్చుకుని ఒక్క పదం ఉఛ్ఛరించాయి..... 'కృష్ణా!'

అంతే.... లేచి చూసేసరికి చుట్టూరా నా స్నేహితులు..... కంగారుగా నా కళ్ళలోకి చూస్తున్నారు! 'అరె.... ఇప్పుడే కదా... ఇంత దగ్గరగా చూసాను.... ఆ నీలమేఘశ్యాముడిని..ఏడీ?? నా కృష్ణుడు ఏడీ?'...... నాకంతా అయోమయంగా ఉంది..... 'అంటే....ఇదంతా కలా? అయ్యో.... నిజమైతే ఎంతబాగుండేది?' ఒక్క క్షణం దుఖం తన్నుకొచ్చింది.....

'కృష్ణా! ఇదంతా నిజమైతే  బాగుండు కదా....ఎందుకిలా చేసావ్? కనిపించినట్టే కనిపించి మాయమయ్యావా కన్నయ్యా?' అని బాధగా మనసు అడుగుతుంటే.... కళ్ళు శ్రావణమేఘాల్లా వర్షిస్తున్నాయి..... ఎందుకో అప్రయత్నంగా నా హ్యాండ్ బాగ్లో చేయి పెట్టాను..... నా పాటల పుస్తకం బైటకు తీశాను! ఇంకొక్క పాట.... ఒకేఒక పాట రాస్తే...... ఇక ఈ బృందావనవిహారికి అంకితమివ్వొచ్చు!! కానీ ఇప్పుడు ఈ బాధలో.... ఎలా?నావల్ల కాదు.... ఇక ఇప్పటికీ ఇంతే ప్రాప్తం.... మళ్లీ ఎప్పుడు ఈ పుస్తకం పూర్తి చేస్తానో..... ఈ గోపాలునికి ఎప్పుడు అర్పితం చేస్తానో.... అనుకుంటూ...... చివరి పేజి తెరిచాను.....

ఆశ్చర్యం!!!!..... నా గుండె ఒక్క క్షణం  ఆగి కొట్టుకుంది......
నా చేతివ్రాతలో రాసి ఉంది... నా 5000వ పాట! ఇందాక కలలో నేను విన్న ఆ గోపికలు పాడిన పాట! కానీ... ఇది ఎలా సాధ్యం? అంటే.... ఇందాక నేను చూసింది..... కలా? నిజమా?.....

వేవేల మురళీస్వరాలు ఒక్కసారిగా చుట్టుముట్టిన అనుభూతి.....
రంగురంగుల పూలబంతై ఊయలూగుతున్నట్టున్న జగతి....
నన్నల్లుకుపోతున్న మధురాధిపతి అందించిన మధురగీతి. 

ఒక్కసారి ఆ దేవదేవుని మనసారా స్మరించి......కృష్ణస్పర్శతో పునీతమైన ఆ పాటల పుస్తకాన్ని ఆర్తితో ముద్దాడి నా మురళీమనోహరుడి దివ్యచరణాలవిందాలకు సమర్పించాను!
  


[కృష్ణాష్టమి సందర్భంగా వ్రాసిన ఈ బుల్లి కథ నా బుజ్జి కిట్టుగాడికి అంకితం :) ]

21 కామెంట్‌లు:

రాజ్ కుమార్ చెప్పారు...

అద్భుతం గా ఉందండీ.. వేరే మాటలేదు..
[వామ్మో.. ఐదువేల పాటలు రాసారా? అనుకున్నా.. చివర్లో అర్ధమయ్యింది లెండీ..]
కృష్ణాష్టమి శుభాకాంక్షలు...

శశి కళ చెప్పారు...

గ్రెట్ ఇందూ...నా మనసు నీ బ్రుందావనాన్ని వదిలి
రానంటుంది.5000...బాప్ రె...యెంత సాహిత్యం
ఏంత వర్ణన....నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు
గర్వీస్తున్నా...

రసజ్ఞ చెప్పారు...

మధురానుభూతి వస్తోంది మీ ఈ టపా చదువుతుంటే నాకింకా మీరు చెప్పిన ఆ చిన్ని నల్లనయ్యని దగ్గరనించి చూస్తున్నట్టే ఉంది. మనసు ఉప్పొంగుతోంది ఆయన అందెల సవ్వడులతో మాకు కూడా! చాలా బాగుంది మీ వర్ణన.

హరే కృష్ణ చెప్పారు...

:))))
కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇందూ!
బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే :)

చాతకం చెప్పారు...

టపా చాలా బాగుందండి. మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నాకు నీరొషా పాట గుర్తుకు వచ్చింది ;)

MURALI చెప్పారు...

మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. టపా అదిరింది. వ్రాసిన శైలి చాలా సహజంగా సాగింది. నా పేరు నాకెప్పుడూ అపురూపమే. మిగిలినవారి మాటల్లో ఎప్పుడూ ఇంతగొప్పగా వినలేదేమొ. మీ టపాలో మురళీ అని వచ్చిన ప్రతి చోటా అద్భుతమైన భావన ఉంది.

విరిబోణి చెప్పారు...

chaala baaga raasav indu, nee varnanalo nee badulu nenu leenamyya, ending ki vachheppatiki nuvvu raasav, neenu leenamyya ani ardham indi. Keep it up :)

లత చెప్పారు...

చాలా చాలా బావుంది ఇందూ

కృష్ణప్రియ చెప్పారు...

అందంగా రాశారు! అభినందనలు..

మురళి చెప్పారు...

బాగుందండీ టపా.. జన్మాష్టమి శుభాకాంక్షలు..

Sravya V చెప్పారు...

Beautiful Indu gaaru !

ఇందు చెప్పారు...

@వేణూరాం :హ్హహ్హహ్హా! రాజ్ నాకంత సినిమా ఉందా? ;) థాంక్స్ థాంక్స్ :) మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు! @ it is sasi world let us share: కెవ్వ్వ్వ్! తల్లోయ్! నేను రాయలేదు అవన్నీ! నా కథలొ కేరెక్టర్ రాసింది అంది చెప్పితినీ శశి :) @రసజ్ఞ: వావ్! రసఙ్గ్న గారు మీకు ఆ అనుభూతి వచ్చిందటేనే నాకెంత సంతోషంగా ఉందో! అది చాలు ఒక కథకి :) చాల థాంక్స్ అండి :)

ఇందు చెప్పారు...

@ హరే కృష్ణ: నీకు కూడా క్రిష్ణాష్టమి శుభాకంక్షలు ఆండీ! అవును.గోవిందుడు అందరివాడు :)

@చాతకం :హ్హహ్హహ్హా! టపా చదివాక కూడానా? :))))మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు :)

@ MURALI: కెవ్వ్వ్! మురళీగారూ మీరు నన్ను పొగిడారు :))) ఇది గొప్ప విషయం :)మీకు నా టపా అంత నచ్చేసినందుకు బోలెడు థాంక్సులు!

ఇందు చెప్పారు...

@ విరిబోణి: అలా లీనమైపోయి నువ్వు చదవగలిగావు అంటే...నా కథ సక్సెస్ అయినట్టే! ఐతే ఇలాగే కిట్టుకి కూడా నచ్చేసుంటుందేమో! :) థాంక్స్ విరిబోణి!

@ లత:చాల థాంక్స్ లతగారు :)

@ కృష్ణప్రియ: థాంక్స్ కృష్ణగారు :)

ఇందు చెప్పారు...

@ మురళి: థాంక్యూ మురళిగారు :) మీకు కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు :)

@ Sravya Vattikuti: Thankyou Sravya :)

మధురవాణి చెప్పారు...

<<<<
వేవేల మురళీస్వరాలు ఒక్కసారిగా చుట్టుముట్టిన అనుభూతి.....
రంగురంగుల పూలబంతై ఊయలూగుతున్నట్టున్న జగతి....
నన్నల్లుకుపోతున్న మధురాధిపతి అందించిన మధురగీతి....
>>>

నువ్వు రాసింది చదివాక నాక్కూడా అచ్చం ఇలాగే అనిపించింది.. మమ్మల్ని కూడా బృందావనంలో తిప్పేసి తీసుకోచ్చావ్ నీతో పాటుగా!
అద్భుతం.. అద్భుతం.. అద్భుతం.. అంతే! మరో మాటే లేదు!

నువ్వు వాడిన పదాలు, జయదేవుని కీర్తనలని గుర్తు చేసుకోడం.. అదంతా చాలా చాలా బావుంది.. అచ్చంగా యమునా తీరంలో వెన్నెల్లో కృష్ణుడిని చూసి వచ్చిన అనుభూతిని కలిగించావు..

అయితే, ఇంతకీ నీకా కీర్తనలన్నీ వచ్చా.. అందుకేగా అలా అలవోకగా రాసేసావ్! :)

కృష్ణుడు బోల్డు మురిసిపోయి ఉంటాడు నీ అనుభూతిని చూసి.. నేనైతే ఇది కథ అనను.. అనుకోను. కృష్ణుడే స్వయంగా నీకు ఇచ్చిన అందమైన మధురానుభూతి అనుకుంటాను! :)

Claps claps.. Indu... :)

..nagarjuna.. చెప్పారు...

ఆ వర్ణనలు, ఆ కథనం just too good :)

kiran చెప్పారు...

wowwwwwwwwwwwwwwwwwwwwwwwwwww...ఇందు ఎంత బాగుందో నేను చెప్పలేను....ఇది కిట్టి చూసి ఎంత మురిసిపోతున్నాడో తెలిదు కానీ..నేను మురిసిపోతున్నా
అదంతా నిజంగా జరిగిఉంటే ఎంత బాగుండేది ..కదా..ఆశ..అత్యాశ...:P
ఇదంతా ఎవరన్నా picturization చేస్తే భలే ఉంటుంది...:) .sooooooooooper dear..:)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

చాలా బాగుంది ఇందూ,
ఏదో తర్వాత చదవాలని మర్చిపోయానే అనుకుంటూనే ఉన్నాను. నిన్నో అందమైన రాత చదవగానే గుర్తొచ్చింది. చాలా బాగారాశారు ఇందూ!

ధాత్రి చెప్పారు...

ఇది భక్తి కదేమో..అంతకన్నా ఎక్కువ..కన్నయ్య మీద ప్రేమ..
Made my eyes wet..dont know why...
నీలపు కాంతి..నెమలి పింఛం..ఓహ్..ఏమి వర్ణన

MANASIJA చెప్పారు...

ఎలా ఉన్నారు ఇందు గారూ :) Ivala udayame krishnudu..aa venta miru,miru rasina ee brindavanam tapaa gurtochayi..మీకు మీ కిట్టయ్య కి జన్మాష్టమి శుభాకాంక్షలు :)