24, ఆగస్టు 2011, బుధవారం

మసాలా తాతయ్య!!


అవి నేను ఎంసెట్ రాసి,కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఖాళీగా ఈగలు తోలుకుంటున్న రోజులు! 

బద్ధకపు ఉదయాలు..... భుక్తాయాసపు మధ్యాహ్నాలు దాటేసాక ఇక సాయంత్రాలు డాబా మీద చెట్ల మధ్య గడిచిపోయేది. అప్పుడు అమ్మ చేసిపెట్టే  పకోడీలో,బజ్జీలో,కారప్పోసో.... ఏదో ఒకటి నేమరేసేదాన్ని.

ఒకరోజు మా ఎదురింటి సరోజ ఆంటి, పక్కింటి కుమారి ఆంటి మా ఇంటిముందు మెట్లమీద ముచ్చట్లు పెట్టారు. మా అమ్మని ఆహ్వానించారు. నేను సాధారణంగా ఈ రోడ్డు మీద అరుగు పై ముచ్చట్లకి దూరం-దూరం. కానీ ఆ రోజు ఏమి తోచక ఆంటీల బుర్ర తిందామని వెళ్లా! 

అప్పుడే ఒక మసాలా బండి మా ఇంటిముందుగుండా వెళుతోంది.ఆ బండికి 'రాం-లఖన్' అనో....'జై భజరంగబలి' అనో పేర్లు లేవు. మామూలు సాదాసీదాగా ఉంది. ఒక చిన్న గంట కొట్టుకుంటూ ఆ బండి తోసుకేలుతున్న అతనివైపు చూసా! 

చాలా పెద్దాయన. బక్కపలచగా ఉన్నాడు. సన్నని,పొడుగాటి మాసిపోయిన కుర్తా-పజమా ఇంకా తలమీద చిన్న తెల్ల టోపీ.చూస్తేనే తెలుస్తుంది ముస్లిం అతను అని. కళ్ళు లోపలి పోయి ఉన్నాయి. గడ్డం మాసిపోయి ఉంది. ఎందుకో చూడగానే జాలేసింది. 

అప్పటికే అమ్మ స్నాక్స్ ఏమి చేయలేదు. సరే అని...'అమ్మా! మసాలా కొనుక్కుంటా....ప్లీజ్ అమ్మా' అని గొడవ పెట్టా! యే కళనుందో వెంటనే తలూపింది సరే అని.
ఇక ఎగురుకుంటూ వెళ్లి ఆ మసాలబండిని ఆపి.....'తాతా...తాతా.... ఒక మసాలా చాట్ ఇవ్వా?' అని అడిగా.

తాత ఒక చిన్న నవ్వు నవ్వి....వెంటనే ఆ బండిని రోడ్డు పక్కకి పెట్టి.... ఒక న్యూస్ పేపర్ కోన్ లా చుట్టి దాన్లో రెండు చిన్న ఎండు విస్తరాకులు వేసి..... అందులో వేడి,వేడి చనా చాట్ వేసి....ఉప్పు,కారం,ఉల్లిపాయలు, కొత్తిమీరా ఇంకా ఏంటేంటో నాకు తెలీని పొడులు వేసి చకచకా ఒక స్పూన్ పెట్టి తిప్పి పైన నిమ్మకాయ పిండి ఒక తాటాకు ముక్క వేసి తినడానికి ఇచ్చాడు :) 

వేడివేడిగా పొగలు కక్కుతున్న ఆ మసాల చాట్ చూడగానే నా నోట్లో అప్రయత్నంగా నీళ్ళు ఊరిపోయాయి. అయినా ముందు డబ్బులు ఇచ్చి తర్వాత తిందాం అని 'ఎంత తాతా?' అని అడిగితే......'పాంచ్ రుపియా బేటి' అన్నాడు. 

'కేవ్వ్వ్వ్!' అనుకుని లోపలకెళ్ళి ఒక ఐదు రూపాయల బిళ్ళ తీసుకొచ్చి ఇచ్చా! చిరునవ్వుతో అది తీసుకుని ఆ బండి ముందుకు తోసుకుంటూ.....చిన్న గంట మ్రోగిన్చుకుంటూ వెళ్ళిపోయాడు మసాలా తాత.

బండి అటు వెళ్ళగానే ఇటు ఆ తాటాకు స్పూన్ తో ఆ చాట్ తీసి నోట్లో పెట్టుకున్నా......అంతే! అద్భుతం. ఎంత బాగుందంటే.....ఇప్పటివరకు నేను అంత రుచికరమైన చాట్ తినలేదు మళ్లీ. పనిలోపని మా అమ్మకి కూడా ఒక స్పూన్ పెట్టా. అలాగే అక్కడున్న సరోజ ఆంటికి, కుమారి ఆంటికి కూడా! అందరికీ బాగా నచ్చేసింది.

ఇక మరుసటి రోజు సరిగ్గా సాయంత్రం అయిదయ్యేసరికి మళ్లీ మేమందరం రోడ్డు మీద బైఠాయించాం! సరిగ్గా అదే టైముకి వచ్చాడు తాత. ఈసారి ఇరవై రూపాయల బిల్లు చేసాం :)

ఆ మర్నాడు, కుమారి ఆంటి ముగ్గురు అబ్బాయిలు నాని,కిట్టు,పవనూ, మా పక్కింట్లో ఉండే మూడు దయ్యాలు సలోమి,సుధా,సుజాత, మాధవి ఆంటి ఇద్దరూ పిల్లలు అమూల్య,అఖిల, నేనూ...... అందరం కలిసి ఆ చాట్ బండి మీద పడ్డాం. తాత ఫుల్ ఖుష్ ఆ రోజు. మేమందరం కూడా ఫుల్ హాపీస్!

ఇక వారం తిరిగేసరికి మా కిట్టుగాడి క్రికెట్ ఫ్రెండ్స్ అందరూ సాయంత్రం ఐదు అయ్యిందంటే ఆ బండి చుట్టు మూగేసేవారు. మా ఇంటిముందు పెద్ద తురాయి చెట్టు ఉండటంతో ఆ చెట్టు క్రింద బండి నిలిపేవాడు తాత. ఇక ఎంతమంది జనామో! మా కాలని అంతా తాత మసాలాకి ఫిదా అయిపోయారు. ఇంతమందిలోను నన్ను బాగా గుర్తుపెట్టుకునేవాడు తాత. అందరికంటే కూసింత ఎక్కువే పడేది నా వాటా మసాలాచాట్ పోట్లంలో! :) 

కొద్దిరోజులకి గిరాకి బాగా ఎక్కువైపోయేసరికి తన బుల్లి మనవరాలు రేష్మాని తీసుకొచ్చేవాడు సహాయానికి. ఆ అమ్మాయి సన్నగా,బక్కపలచగా ఉన్నా ముఖం ఎంత కళగా ఉండేదో! అలాగే పొడుగైన జడ కూడా! ఆ పాప చిన్ని చిన్ని చేతులతో అందరికీ చాట్ పొట్లాలు అందిస్తుంటే ఒక్కోసారి బాధేసేది. కానీ ఆ అమ్మాయి ఎంతో చలాకీగా,హుషారుగా పని చేస్తూ ఉంటే ముచ్చటేసేది కూడా! 

మా ఆంటివాళ్ళు అరుగుమీద కూర్చుంటే వాళ్ళు బండి దగ్గరకి వచ్చే అవసరంలేకుండా రేష్మా చేత చాట్ పంపేవాడు తాత. నేను వాళ్ళతోపాటే కూర్చునివుంటే 'దీదీ' అనుకుంటూ బుజ్జిగా వచ్చి ఇచ్చేది :) ఎంత ముద్దొస్తూ ఉండేదో!

అలా ముచ్చటగా నాలుగు వీధులు ఉండే మా కాలనీలో తాత,రేష్మ ఫేమస్ అయిపోయారు. మా వీధి చివర మెయిన్ రోడ్డు కలిసే చోట పానీపూరి బండ్లు రెండు వెలసినా తాత మసాల చాట్ కి ఏ ఆటంకము కలిగేది కాదు. అదేమిటో రోజు ఠంచనుగా ఐదింటికి వచ్చే తాత, ఏడింటికి బేరాలన్ని త్వరగా పూర్తిచేసి  వెళ్ళిపోయేవాడు. ఆదివారాలు మాత్రం అస్సలు కనిపించేవాడు కాదు. పోన్లే రెస్ట్ తీసుకుంటాడేమో అనుకునేదాన్ని. 

తాతలో నాకు బాగా నచ్చేది తన చిరునవ్వు. ఎంతమంది కస్టమర్లు ఉన్నా.....అస్సలు విసుగన్నదే ఉండదు ఆ ముఖం మీద. అంతే కాదు.....తాత చాట్ బండి ఎంత నీట్ గా మెయింటెయిన్ చేసేవాడో! డబ్బాలు....చాట్ కలిపే స్పూన్లు అన్నీ చాలా నీట్గా ఉండేవి. అలాగే నన్ను చూసినప్పుడల్లా.... ఏమి మాట్లాడకపోయినా 'బేటి' అంటూ ఆప్యాయంగా అందించే మసాలా పొట్లం ఆ రుచిని అమాంతం పెంచేసేది :) ఇలా మూడు నెలలు పండగ చేసుకున్నా నేను ;)

ఇంతలోనే నా కౌన్సెలింగ్ జరగడం,నేనూ ఇంజినీరింగ్లో జాయిన్ అవడం......రోజు సాయంత్రాలు 'సి' లాంగ్వేజ్ కోచింగ్ క్లాసెస్కి వెళ్లి ఇంటికొచ్చేసరికి ఏడు-ఎనిమిది అయ్యేది. ముందు కొద్దిరోజులు తాత మసాలా మిస్ అయినా క్రమంగా చదువు గోలలో పడి మర్చిపోయా. కానీ అప్పుడప్పుడు తాత గురించి అమ్మని అడుగుతూనే ఉండేదాన్ని. 

ఇక దసరా సెలవులు ఒక వారం రోజులు ఇచ్చారు మాకు. అప్పుడు మళ్లీ తాత దగ్గర మసాలా తిన్నాను. ఎంత ఆనందమేసిందో! తాతకి కూడా నన్ను చూస్తే బోలెడు సంతోషం :) 

మళ్లీ సెలవులు అయిపోయాక మామూలే! ఇక మళ్లీ తాతని చూసే అవకాసం ఎప్పుడు రాలేదు. ఎప్పుడన్నా సెలవులు వచ్చినా మేము ఊర్లకి వెళ్ళడం.....ఇలా ఏదో ఒకటి ఉండటంతో అలా తాతని చూసి చాలా కాలమే అయిపోయింది. 

సెకెండ్ ఇయర్ నేనూ హాస్టల్ లో చేరా! ఇక పూర్తిగా ఈ విషయం మరుగున పడిపోయింది. 

ఒకసారి ఎందుకో గుర్తొచ్చి మాటల మధ్యలో అమ్మని అడిగా!

'తాత ఇంకా వస్తున్నాడా అమ్మా! ఎలా ఉన్నాడు? రేష్మా ఎలా ఉంది?' అని.
'తాతకి ఈమధ్య ఒంట్లో బాగుండటం లేదట. అందుకే కొద్ది రోజులు మసాల బండి రేష్మ,రేష్మ వాళ్ళ అన్నయ్య చూసుకున్నారు. చిన్నపిల్లలు వాళ్ళకేం వచ్చు తాత లాగా రుచికరంగా చేయడం? ఏదో వాళ్ళకి తెలిసినట్టు చేసేవారు. కొద్దిరోజులకి సరైన బేరాలు రాక వాళ్ళు మానేశారు. ఇప్పుడు ఎవరూ మసాల బండి వేయట్లేదు' అని చెప్పింది.

ఎంత బాదేసిందో! తాతకి ఏమి కాకుండా త్వరగా కోలుకుని మళ్లీ మసాల బండి వేయాలని కోరుకున్నా!

కానీ ఆ తర్వాత రేష్మ,వాళ్ళ అన్నయ్య పానిపూరి బండి పెట్టారట మెయిన్ రోడ్డు మీద. మా అమ్మ వాళ్ళదగ్గర ఒకసారి తాత గురించి వాకబు చేస్తే తెలిసిందట.....తాత ఇక లేరని :(

ఎంత బాదేసిందో.....ఆ మాట వింటుంటే! తాత చేతిలో అమృతమైపోయే చాట్...... ఎంత పని ఒత్తిడున్నా తన ముఖం పై చెరగని చిరునవ్వు.......... ఆ గుంటలు పడిన కళ్ళలో నామీద చూపించే అభిమానం,ఆప్యాయత గుర్తొచ్చి చాలా బాధేసింది.

ఏంటో ఈ బంధాలు...... చిత్రంగా కలుస్తాము.......... అంతే చిత్రంగా విడిపోతాము! ప్చ్! ఏంటో కదా!

మళ్లీ ఇన్నాళ్టికి 'మసాలా తాతని' గుర్తుచేసిన మన కొత్తావకాయగారికి బోలెడు బోలెడు ధన్యవాదాలు :) 

20 వ్యాఖ్యలు:

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

చాలా రోజులకు ఈవేళ ఎందుకో నా బ్లాగు స్టాటిస్టిక్కులు చూద్దామనిపించి అటేపెళితే, మీ బ్లాగు నుండి ఓ 13 హిట్లు ఉన్నాయి.....అక్కడెక్కడినుచో మన బ్లాగును నొక్కినవాడెవడ్రా అనిన్నూ, ఇంకా నా బ్లాగు కొంతమంది చూస్తున్నారనిన్నూ ఆనందభరితుడనై - మీ ఆ లింకులు బ్రవుసర్లో కాపీ పేష్టు చేసి - గో - కొడితే ఇక్కడికొచ్చా!

బాగా వ్రాసారు మీ మసాలా తాత గురించి.....

చదివాక మా ఊళ్ళో సోడాల బాబూరావు, బెల్లప్పాకం రామావతారం, రేక్కాయల గొల్ల - ఇల్లా బోల్డు మంది అలా కళ్ళ ముందు కనపడి మాయమయ్యారు....:)

శశి కళ చెప్పారు...

ఏమిటి ఆంటి బుర తిందామని వెళ్ళావా?
యెమైనా నీ హాండ్ గొల్డ్ బంగారు.బందాలు ప్రెమించటం
లొ నీ తరువాత బుజ్జి యెవరైనా...

Ram Krish Reddy Kotla చెప్పారు...

ఎందుకో చదివాక నాకూ చాలా బాధేసింది ఇందు :-(

హరే కృష్ణ చెప్పారు...

చివరకి వచ్చేసరికి బాధ అనిపించింది
జననం మరణం జీవితం లో భాగం అని తెలిసినా కూడా మరణం అనే మాట వచ్చేసరికి ఏదో తెలియని బాధ
పుట్టిన వాడు మరణించక తప్పదు
అలాగే మరణించినవాడు తిరిగి జన్మించకా తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి చింతించుట అనవసరం
ఆత్మ అనేది శాశ్వతం

ఏమిటేమిటో రాసేస్తున్నా క్షమించాలి :)

MURALI చెప్పారు...

కొన్ని భందాలంతే చిత్రంగా కలుస్తాయి. మనకి తెలియకుండానే దూరమవుతాయి. ఇది అని చెప్పలేని ఫీలింగ్ మాత్రం ఉండిపోతుంది మనసులో. తలుచుకున్న ప్రతిసారి మనసులో దాగిపోయిన ఫీలింగ్ బయటపడి మనల్ని కమ్మేస్తుంది.

ఆత్రేయ చెప్పారు...

నాకో ప్లాట్ దొరికిందోఛ్
నేను కూడా రాస్కుంటా మా మసాల బళ్ళ మీద, అయ్ మీన్ మసాల బళ్ళ గురించి !!

Vinay Datta చెప్పారు...

ఏంటో ఈ బంధాలు...... చిత్రంగా కలుస్తాము.......... అంతే చిత్రంగా విడిపోతాము! ప్చ్! ఏంటో కదా!

Very true, Indu garu.

madhuri.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

>>ఏంటో ఈ బంధాలు...... చిత్రంగా కలుస్తాము.......... అంతే చిత్రంగా విడిపోతాము! ప్చ్! ఏంటో కదా!<<

నిజమే కొన్ని బంధాలు అర్దంకావు..
శశి గారు చెప్పినట్టు.. మీది బంగారు చేయి అనమాట. మీరు బోణీ చేస్తే బాగుండేట్లుందీ :)

రసజ్ఞ చెప్పారు...

చాలా బాగుంది. మీరు ఆ చాట్ మసాలాని వర్ణిస్తుంటే నాకు నోరూరింది. కొన్ని బంధాలు చాలా విచిత్రంగా ఏర్పడతాయి. నాకు మా వీధిలో పీచు మిఠాయి అమ్మే వాడు, మా స్కూల్ దగ్గర రేగొడియాల అవ్వ, చెట్టు కింద మామిడి పళ్ళ తాత గుర్తొచ్చారు. మీరు రాసిన ప్రతీదీ అలా సుతారంగా తాకుతుంది.

కొత్తావకాయ చెప్పారు...

చాలా చక్కగా రాసారు, ఇందు గారూ! చివర్లో చిన్న ముల్లు గుచ్చుకున్నా, అంతకన్నా అందమైన గులాబీలా ఉంది మీ టపా. చివర్లో నన్ను తలుచుకున్నందుకు ధన్యవాదాలు.

BTW, నేను మీ బ్లాగుని నా బుక్ మార్కుల పుస్తకంగా వాడుకుంటూ ఉంటాను. నేను తరచూ చూసే బ్లాగులన్నీ ,మీరు "మెచ్చిన బ్లాగులు". మాగంటి వంశీ గారిని మీ బ్లాగులోంచే చూసొస్తూ ఉంటా. మీకు వ్యాఖ్య రాయబోతే ఉంటే రకరకాల అడ్వర్టైజ్మెంట్ల పేజీలు వచ్చేస్తున్నాయండీ. ఎందుకంటారు?

SJ చెప్పారు...

చక్కగా రాసారు..

శశి కళ చెప్పారు...

nee blog maa pillalaki boladanta nachchesindoch...nee widgets anni copy chesesaaru.ika neeku tappadu.vaallato mail chesi maatlaadaalsinde..bangaaru

ఇందు చెప్పారు...

మాగంటిగారు...ముందుగా నా బ్లాగుకి వచ్చినందుకు చాలా సంతోషం :) నేను మీ మాగంటి.ఆర్గ్ సైటుకి ఫ్యాను,ఏసి కూడా :) మీ సైటునించే లలితా సహస్రనామాలు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీయించి రోజు చదువుకుంటున్నా :) మీ బ్లాగుచూడాగనే మీకు ఈ విషయం తెలుపుతూ థాంక్స్ చెబుతూ కామెంటా కూడా :) గమనించినట్లు లేరు. అప్పటినుండి ఈ బ్లాగ్ ఫాలో అవుతున్నా :) అలాగే నాబ్లాగ్ రోలో కూడా మీ బ్లాగ్ ఉంది. కావున అందులొనించి ఎవరైనా చూసినా నా సైటు అడ్రెస్ కనపడుతుంది :) మీకు నా బ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలు :)

ఇందు చెప్పారు...

@ it is sasi world let us share: థాంక్స్ శశి. మరీ ఎక్కువ పొగిడేసావేమో ;) హ్హహ్హహ్హా :))

@Kishen Reddy: అవును కిషన్! :(

@హరే కృష్ణ :ఫర్వాలేదు హరే! నువ్వు చెప్పేది గీతామృతమేగా!

ఇందు చెప్పారు...

@MURALI:నిజమే! మనసు అట్టడుగుపొరల్లో భద్రంగా ఉన్న గ్నపకాలు వెల్లువలావచ్చి కన్నీటి వర్షం కురిపించి వెళ్ళిపోతాయ్! :(

@ ఆత్రేయ:మీ బ్లాగు మీ ఇష్టం :)

@ Vinay Datta: Thankyou Madhuri :)

ఇందు చెప్పారు...

@వేణూ శ్రీకాంత్:అవును వేణూ....చిత్రంగా ఉంటాయ్ :) హ్హహ్హ! ఏమో మరి ;)

@ రసజ్ఞ :ఎందుకో రసఙ్గ్న గారూ....ఇది అని చెప్పలేని ఫీలింగ్ ఆ ఙ్గ్నాపకాలన్నీ! స్నేహితులతో చాట్ బండ్లదగ్గర నిల్చుని ఉఫూఫు అని ఊదుకుంటూ తినే చాట్ ముందు ఏం పనిఒస్తుంది చెప్పండీ :) థాంక్స్ అండీ :)

@సాయి: Thankyou Sai :)

ఇందు చెప్పారు...

@ కొత్తావకాయ: కొత్తావకాయగారూ :) చాలా థాంక్స్ అండీ....అవునా? నా బ్లాగ్రోల్ మీకు నచ్చిందా :) థాంక్స్..థాంక్స్ :) బహుసా...మీ క్లిక్స్ కూడా నా బ్లాగుని మాగంటిగారికి పరిచయం చేసయేమో! :)

అడ్వర్తెయిజ్మెంట్స్ ఆ? అలా ఏమి లేవండీ!! నా బ్లాగులో వాటికి సంబంధించిన పేజీలు కూడా లేవు. మీఉర్ మీ బ్రౌసర్లో పాపప్ బ్లాకర్ ఎనేబులు చేసుకున్నారుగా? లేనట్టైతే చేసుకోండీ....అప్పుడు ఇక రావు :)

@it is sasi world let us share : హ్హహ్హహ్హ! నాతో చాలామంది ఈ మాట చెప్పారు :) చిన్నపిల్లలందరికి నా బ్లాగు బొమ్మల సైటులాగా భలే నచ్చుతుందట. ఈ విషయం చెప్పినప్పుడు భలే హాపిగా ఉంటుంది :) తప్పకుందా శశి.అంతకంటేనా?

kiran చెప్పారు...

అంతే ఇందు...కొన్ని కొన్ని సార్లు...
ఇలాంటి చిన్న చిన్న పరిచయాలే అయిన...బాగుంటాయి..కానీ ఇలా జరిగినప్పుడు చాల బాధ ని కలిగిస్తాయి కూడా..:)

ఇందు చెప్పారు...

@ kiran: Avunu Kiran nijame :)

ధాత్రి చెప్పారు...

ఎందుకండీ చివరి దాకా చిలిపిగా రాసి మతో చదివించి చివర్లో గుండె పిండేస్తారు.."నా నెమలీకల జ్ఞాపకాలు" పోస్ట్ లో కూడా ఇంతే..:((
కానీ పోస్ట్ బాగుంది..