8, ఆగస్టు 2020, శనివారం

పది వసంతాల బ్లాగాయణం!!

ఆగష్టు 7, 2010

పది సంవత్సరాల క్రితం....

ఏమీ తోచక.... ఎక్కడ రాయాలో... ఎలా రాయాలో... రాస్తే ఎవరన్నా చూస్తారా? అసలు నాకు రాసి పబ్లిష్ చేసే సినిమా ఉందా? అందులో తప్పులు దొర్లితే? ఆలోచనలే తప్పంటే? ఎవరన్నా ఏమన్నా అంటారా?  ఇలా బోలెడు డౌటనుమానాలతో బితుకు బితుకుమంటూ మొదలుపెట్టా నా బ్లాగు.... 'వెన్నెల సంతకం'.

రాయాలన్న ఉత్సుకత , భావుకత , సమయం , బుర్ర నిండా ఆలోచనలు, మనసు నిండా భావాలు ఉన్న రోజులు! వాటికి కీబోర్డ్ ఊతమిస్తే ,  కనిపిస్తున్న అక్షరమాలికే నా బ్లాగ్!

నా బ్లాగ్.... నా ఇష్టం అన్నట్టు రాసేదాన్ని! :))

కాలం ముందు సాగిపోయింది .... జీవితంలో ఎన్నో మార్పులు!

ఇద్దరు పిల్లలతో సంసార భవసాగరాల్లో ఎప్పుడో కొట్టుకుపోయా!!

ఇల్లు, పిల్లలు, పని.... ఇంతే! ఆఖరికి అమ్మా-నాన్నలకి కాల్ చేయడానికి కూడా ఫ్రీ టైం చూసుకునే స్టేజికి వచ్చా !

ఇంకేం భావుకత? ఇంకేం చిలిపిదనం? ఇంకేం వెన్నెలలు? ఇంకేం కవితలు హ్హహ్హహ్హ!! :)))

ఎన్ని పోస్ట్లు రాసానో! ఎప్పుడు లెక్క పెట్టలేదు కానీ.... రాసిన పోస్ట్  మళ్ళీ ఎప్పుడైనా తిరిగి చూసుకుంటే ఆశ్చర్యం వేసేది ... ఇది నేనేనా రాసింది అని.

చాలాసార్లు నేను రాసిన వాటిలో అర్ధం వెతుక్కోవాల్సి వచ్చేది . ఇది ఎలా రాసా? అలా ఎందుకు ఆలోచించా.... లాంటి పనికిమాలిన బ్రెయిన్ స్టార్మింగ్ అన్నమాట ;)

కానీ ఒక్కటి... అప్పటి ఇందు... ఇంకా నాలో ఉందా లేదా అని ఆత్మశోధన  చేస్తూ ఉంటా ఈ బ్లాగ్ చూసినప్పుడల్లా! :)

ఎన్నిరోజులయిందో నా బ్లాగ్ ఓపెన్ చేసి .....  ఎప్పుడో ఉగాదికి అదీ బ్లాగ్ మిత్రులు అంతా సరదాగా మొదలు  పెడితే నేనూ  దుమ్ము దులిపా!! అంతే ! మళ్ళీ ఇటు చూస్తే ఒట్టు!

నిన్న అర్ధరాత్రి ఎందుకు బ్లాగు ఓపెన్ అయిందో! యథాలాపంగా జీమెయిల్ ఓపెన్ చేశా.. ఎదో నొక్కితే... బ్లాగర్ ఓపెన్ అయింది...   నిద్ర పట్టక దొర్లుతున్న నాకు మళ్ళీ  పాత పోస్ట్లు అన్నీ చూస్తూ ఉంటె .... ఎన్ని జ్ఞాపకాలు! ఆ కామెంట్స్ , అందులో హాస్యం, చిలిపిదనం , స్నేహం , ఆత్మీయత ... ఆ బ్లాగ్ రోజులే వేరు!

కానీ ఈ బ్లాగ్ నాకు ఆత్మశోధనకు పనికిరావడంతోపాటు .... ఇంకొన్ని ఇచ్చింది . నేస్తాలు! బ్లాగ్ నేస్తాలు!

ఒకళ్ళా... ఇద్దరా?

కొత్తావకాయ గారు, సుజాత గారు, కొత్తపాళీ గారు, ఎన్నెలమ్మ , వరూధిని గారు, జ్యోతి గారు , రాధికా(నాని) గారు, రమణి గారు , రౌడీ గారు , పడమటి గోదావరి రాజు గారు , వేణు గారు , పప్పు సార్, కౌముది కాంతి గారు , జీవని ప్రసాద్ గారు , బులుసు గారు , చంద్రకళ , మధుర , నిషీ , మురళి, వెన్నెల కిరణ్ , ఆ . సౌమ్య ,  వి. సౌమ్య ,  రాజ్ కుమార్, చారి, బంతి, రహమాన్ , ఆండీ , కార్తీక్ , స్వాతి , లత, లలిత , కావ్య , మంచు పల్లకి ..... ఇలా బోలెడు మంది.

వీరిలో స్వయంగా కలిసిన వాళ్ళు ఉన్నారు . ఫెస్బుక్ లో హలో చెప్పేవాళ్ళు  ఉన్నారు , వాట్సాప్ లో పలకరించేవాళ్ళు ఉన్నారు ... అప్పుడప్పుడు మెయిల్ పెట్టేవాళ్ళు ఉన్నారు.

ఎన్నో పరిచయాలు! ఎన్నో స్నేహాలు ! ఇంతమందిని  నాకు కలిసే భాగ్యం ఈ బ్లాగ్ వల్లే కదా! నేను రాసిన నాలుగు ముక్కల్ని అభిమానించే వీళ్లు నాకు నేస్తాలు అయ్యారు కదా! వీళ్ళతో మాట్లాడినప్పుడల్లా నాకు బ్లాగ్ గుర్తొస్తూనే ఉంటుంది!

మరి ఇంత చేసిన నా బ్లాగు ..... తన పదవ పుట్టినరోజున తానే స్వయంగా ఓపెన్ అయ్యి మరీ విష్ చేయమని చెప్పింది హ్హహ్హహ్హ! (నన్ను మర్చిపోకు అంటూ ). ఎంత ప్రేమ! కదా!

నా మనసులో వెన్నెలలు కురిపించిన 'వెన్నెల సంతకం'..... నీకు జన్మదిన శుభాకాంక్షలు! :)

నేను నిన్ను మర్చిపోలేదు.... ఇందు ఉన్నా, లేకపోయినా నువ్వుంటావు :) ఇందు భావాలు నీలో నిక్షేపంగా ఉంటాయి :) అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాలే! ఊరికే దిగులు పడకు! ;)

సరే మరి.... ఇక ఉంటా.... టాటా.... బిర్లా!!


-ఇందు. 

25, మార్చి 2020, బుధవారం

శార్వరి ....

శార్వరి  నామ సంవత్సరం  ఎలా మొదలయిందయ్యా అంటే ...

Corona దయవల్ల lockdown అవడం వల్ల... పాలు లేవు... వేప పువ్వు లేదు.. మామిడికాయ లేదు(మొన్నే పప్పులో వేసా! కాస్త దాచిపెట్టానో లేదో గుర్తురావట్లేదు ), కొబ్బరికాయ లేదు.... పనిపిల్ల రాలేదు.... పిల్లలు ఇంట్లో ... అంట్లు సింకులో .... ఆఫీసు పని లాప్టాప్పులో .... అలా మొదలయింది.

దేవుడా! సంవత్సరంలో మొదటిరోజే ఇలా ఉంటే .... ఇక సంవత్సరం అంతా ఎలా ఉంటుందో! అనుకుంటూ లేచా!

ఇంతలోకే ఒక వాఁట్సాప్ మెసేజ్ ....
'వేప పువ్వు ' కావాలా? నేను ఎగిరి గంతేశా !
 'కావాలి... ఎక్కడుంది?'
'బైటికి రా పాపా!'
'వస్తున్నా!'
'మన అపార్ట్మెంట్లోనే ఒక మూల ఉంది ఈ చెట్టు ... ఇంద తీసుకో' అని ఇచ్చింది ఒక దేవత!
'వేప పువ్వు....' ప్చ్! అమెరికాలో కూడా ఇంత ఆనందపడలేదు  దీన్ని చూసి...
'హేయ్.. పనిలో పని... మామిడికాయ కూడా ఇచ్చి పుణ్యం కట్టుకోవచ్చుగా!'
'ఒక్కటె ఉంది.. లేదంటె ఇచ్ఛేదాన్ని !!'
'పర్వాలేదులే ...' నారు పోసినవాడే నీరు పోస్తాడు! అనుకుంటూ లోపలివచ్చా!!

ఇక ఫ్రిడ్జ్ మీద దాడి మొదలు.. అసలే ఈ lockdown దెబ్బకి కొన్న కూరగాయలతో , సరుకులతో నిండిపోయింది! ఆ మహాసముద్రాన్ని ఈది ఎలాగోలా పట్టా!! ఒక మామిడికాయ... మొన్న పప్పులో వేయగా మిగిలింది....

హమ్మయ్య! ఇక ఉగాది పచ్చడి రెడీ!

చందు దయవల్ల ఏదో రెండు పాల పేకెట్లు దొరికాయి!! చుక్క కాఫీ నీళ్లు తాగొచ్చు! పిల్లలకి గుక్కెడు పాలు ఇవ్వొచ్చు!

డిష్ వాషర్ లో డిషెస్ క్లీన్.... పిల్లల హెల్ప్ తో ఇల్లంతా క్లీన్.... తర్వాత ఆఫీసు పనిలో కాసేపు మునిగి తేలి .... పులిహోర, పాయసం,  పచ్చడి చేసి... దేవుడికి పెట్టాం! పిల్లలు, ఆఫీసు వాళ్ళు  ఏమిటో మరి బానే సహకరించారు ఇవాళ! పండగ మహత్యం!

పర్వాలేదు... మరీ అనుకున్నంత దారుణంగా కాకపోయినా ఉగాది బానే జరిగింది! సంవత్సరం మొదటిరోజు బానే మొదలయింది!

సంకల్పం..... ఆ పై దైవ బలం!

ఈ సంకల్పం, ఈ  దైవబలమే మనందరికీ , ఈ ప్రపంచానికి ఈ Corona మహమ్మారి నించి బైట పడేస్తుంది అని నమ్ముతూ ....

ఇంట్లోనే ఉండండి.... జాగ్రత్త గా ఉండండి...

మీ ,

ఇందు :)   

17, ఆగస్టు 2016, బుధవారం

నీవు వస్తావని ....

ఎన్నిరాత్రులు ... ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు .. 
నీవు వస్తావని .... 

కలలన్నీ ఆవిరిలా  కరిగిపోయాయి ....  
నా కన్నీటిని అందులో కలిపేసుకుని.... ఆకాశానికి ఎగిరిపోయాయి . 
నిట్టూర్పులు వాకిట్లో దీపాలు పెడుతున్నాయి... 
కళ్ళు కలువరేకులై, సూర్యుని తాపానికి తాళలేక వసివాడిపోయాయి ... 

ఎన్నిరాత్రులు... ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు .. 
నీవు వస్తావని .... 

ఆశెల బాసలను మోసుకొచ్చే నీలిమేఘానివై వస్తావని .... 
ప్రతిచినుకు నను తాకువేళ .... నీ నులివెచ్చని ఊపిరి నాకు ఇస్తావని ... 
ఆ వానే వెల్లువొచ్చి  వరదై ......  నన్ను నిలువెత్తున ముంచే ప్రేమసాగరమౌతుందని... 
ఆ వెల్లువలో మది విచ్చుకున్న మల్లియనై నీ గుండెగుడిలో ఒదిగిపోవాలని ... 

ఎన్నిరాత్రులు.. ఎన్ని పగళ్లు ....  ఈ ఎదురుచూపులు .. 
నీవు వస్తావని .... 

అదిగదిగో ... వస్తోంది నా ఆశెల మేనా ఎక్కి వలపుల మేఘం!
రెక్కలుచాచి రివ్వున ఎగురుతున్న సీతాకోక విసిరిన ప్రేమ గంధం 
అదిగదిగో ..... నా మనసులాగే పురివిప్పి ఆడుతోంది నృత్యమయూరం!
నేను ఆపినా... ఆగనంటూ...  నా తనువు విడిచి నీకై ఎదురొస్తోంది నా ప్రాణం!

నీవు చినుకుగా మారి నాలో కరిగినా సరే!
నేను ఆవిరైపోయి నీలో కలగలిసినా సరే!

నిన్ను చేరేవరకు ఆగదు నా ప్రాణం! ఆపను ఈ ప్రయాణం!

12, జనవరి 2016, మంగళవారం

మంచు కురిసే వేళలో...

తెల్లవారుఝామున ఎప్పుడో ...

చటక్కున మెలకువ వచ్చేసింది.

ఎదురుగా గాజు కిటికీ.....

అందులోనించి గుడ్డి దీపాల మసక మసక వెలుతురు..

ఆ వెలుతురులో చమక్కు మంటున్న  నల్లటి చెట్ల చేతుల్లో తెల్లటి గులాబి మొగ్గలు.

ఎలా? ఇది ఎలా?

కళ్ళు నులుముకుని చూద్దును కదా!....

మంచు పూల వాన..

ఆగుతూ ... కురుస్తూ...

చూస్తుండగానే...
సన్నని ముత్యాలై..
తళతళ తళుకులీనే తగరపు కాగితాలై..
విరజాజులై..
సన జాజులై..
మల్లెలై ...
బొండు మల్లెలై...
అర్రే .... అదిగో తెలతెల్లటి గులాబీలై...
మోడువారిన చెట్లను చిగురింపచేస్తున్న... వాన....
 ముచ్చటైన మంచు వాన... వెన్నెల సోన... కన్నులలోన .... కలవై ... .. ...

తెల్లగా తెల్లారాక:

గరాజ్ డోర్ తీసి కారు బైటకి తీయగానె...
డ్రైవ్ వే... కుప్పలు కుప్పలు మంచు ...
చిత్తడి చిత్తడి ... చిందరవందర మంచు...
చిరాకు తెప్పించే మంచు...
'అబ్బ! మళ్ళీ  మొదలయిందా? ! I hate Snow! I hate Winters! I hate Michigan Winters... I hate Michigan' (వెయ్యిన్నొక్కటో సారి అనుకుంటూ ఆఫీస్ కి బయలుదేరాను )

-ఇందు 

31, జులై 2012, మంగళవారం

ఒక వాన చినుకు!!

ఒక చిన్నిచినుకు....

మిలమిలా మెరిసిపోతున్న వాననీటి తళుకు...

నీలిమేఘాల కురులసిగలో విరిబాలగా వెలుగుతుంటే..

చల్లనిగాలి వచ్చి చెక్కిలి నిమిరి చక్కలిగింతలు పెట్టగానే...

జలజలా జారి...మధుమాసపు మంచుపూవై రాలి..

నేలమ్మ నులివెచ్చని కౌగిలిలో చేరే వేళ...

పచ్చని ఆకుల పొదరిల్లోకటి సాదరంగా ఆహ్వానిస్తే..

చిగురుటాకుల ఒడిలో సేదదీరి....

కమ్మని మన్నుపరిమళం అనుభవిస్తుంటే...

రంగురంగులరెక్కల కోక ఒకటి వస్తే...

నీకు రంగుల లోకం చూపిస్తా వస్తావా అంటే...

సర్రున జారి.... సీతాకోకరంగుల్లో కలిసిపోయి...

తోటంతా తిరిగి.... ఆటలెన్నో ఆడుకుని... పాటలెన్నో పాడుకుని...

మలిసందె వెలుగు మసకపడే మునిమాపటివేళ...

కోకమ్మ సెలవు తీసుకుని..... మల్లెపొదలో జారవిడిస్తే...

మల్లెపూల రెక్కలపై చిరురవ్వల ముక్కెరైపోయి...

మల్లెభామ మత్తులో తూగి... సందెగాలి పాటలో ఊగి...

రాతిరమ్మ చుక్కలపందిరి కింద వెన్నెలభోజనాలు పెట్టే వేళ...

జాబిలమ్మ వెండి ఊయలలో ఊరేగుతుంటే......

వెన్నముద్దల్లా విచ్చుకున మల్లెపూలతోటలోకి...

 
వయ్యారంగా నడిచి వచ్చిన ఒక చక్కనిచుక్క...

అరవిచ్చిన మల్లెల్లో అచ్చంగా ఒదిగిపోయిన వానచినుకుని చూసి...

మురిసి.....ఆమె మోమున ముద్దబంతిపువ్వు విరిసి...

మత్తెక్కించే  మల్లెలను అరచేతుల్లో పోదివిపట్టుకుని...

ముచ్చటైన ముత్యపుచినుకును ముద్దాడగానే....

 వెల్లకిల్లా ప్రేమలో పడ్డ వానచినుకు....

'ఈ జన్మకిది చాలు' అనుకుని మెల్లగా నేలతల్లి ఇల్లు చేరుకుంది....






-ఇందు

[Imagesource:Google]

14, మే 2012, సోమవారం

శ్రీమతికి ప్రేమలేఖ!

ప్రియాతిప్రియమైన శ్రీమతికి,

నా చేత ప్రేమలేఖ వ్రాయించుకునే అదృష్టం నీదే మరి :) ఎందుకంటే..... ఇదే నా మొట్టమొదటి ప్రేమలేఖ ;)

అలాగని నేను శ్రీ రామచంద్రుణ్ణి అని చెప్పలేను.... నా రేంజికి తగ్గట్టు ఏదో ఒకరో,ఇద్దరో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా... ఇదిగో ఇలా అర్ధరాత్రి మూడింటికి నిద్రపట్టక ప్రేమలేఖ రాయాలనిపించే సీన్ ఐతే లేదు అమ్మడు ఎవ్వరికీ :)))

ప్రేమలేఖ... అంటే ఏం రాయాలి??? మనం ప్రేమికులం కాదు కదా!! పోనీ పెళ్ళికి ముందు తెగ ఫోన్లు చేసుకుని మాట్లాడుకున్న వాళ్ళమూ కాదాయె! కానీ ఏదో రాయాలని ఆరాటం. నా రాతల్లో నిన్ను చూసుకోవాలని ఉబలాటం. పోనీ కవితలు రాద్దామంటే.... మనకి కపిత్వం తెల్సుగాని... కవిత్వం తెలీదే! పాటలు రాద్దామంటే.... ఆ పాండిత్యమూ లేదు! అందుకే.... నా మనసులో ఇప్పటికిపుడు నీగురించి వచ్చిన ఆలోచనలన్నీ అక్షరాల్లో పెట్టేస్తున్నా! సరేనా?!

అదిసరేగాని, అసలు ఏం మాయచేసావ్ నన్నూ?? పోనీ నిన్ను చూసిన మొదటిసారే డుబుక్కున ప్రేమలో పడిపోయాను అంటే అదీ కాదు... [నిజం చెప్పేసా ఏమి అనుకోకు ;) ]

కానీ, మన నిశ్చితార్ధం రోజున నీ చేతి వేళ్ళు చూడగానే మాత్రం ముద్దొచేసాయంటే నమ్ము! మరీ ఎక్కువసార్లు చూశానేమో రెండుమూడు రోజులు కల్లో కూడా అవే వచ్చాయ్ ;) ఆ చేతివేలికి ఉంగరం తొడిగే అదృష్టం నాదే అంటేనే అదొక గొప్ప ఫీలింగ్.... ఎవరెస్టు అధిరోహించేసినట్టు!!

అలాగే మన పెళ్లి ఇంకో రెండురోజుల్లో ఉందనగా.... ఆరోజు మీఇంట్లో చెప్పకుండా నాతో పాని-పూరి తినడానికి వచ్చావు చూడు.... ఆ రోజైతే... ఎవరన్నా చూస్తారేమో అని భయపడుతూ బెరుకుగా చూస్తున్న నీ కళ్ళు, ఆవురావురుమంటూ ఒక్కొక్క పూరిని అమాంతం మింగేస్తున్న నీ బుజ్జి నోరు, ఆ పాని ఘాటుకి ఎరుపెక్కిన నీ కోటేరేసిన ముక్కు.... చూస్తుంటే.... ఎంత అబ్బురమనిపించిందో! హ్మ్! ఎంతైనా నువ్వు అందగత్తెవే!! ఒప్పుకోక తప్పట్లేదు మరి ;)

ఇక పెళ్లిరోజున చూడాలి.... ఆ మెరూన్ కలర్ కంచిపట్టులో.... ఆ బుట్టలో కూర్చుని నువ్వొస్తుంటే.... నాకైతే ఎర్రటి గులాబి బంతిని తెస్తున్నారేమో అనిపించింది. అంతలోకే నీకు-నాకు మధ్య తెర కట్టేసి.... జీలకర్ర బెల్లం పెట్టే వరకు అసలు నిన్ను చూడనివ్వలేదు. ఎంత కోపమొచ్చిందో ఆ పురోహితుడి మీదైతే! జీలకర్ర బెల్లం పెట్టేశాక.... హమ్మయా అనుకున్నానా.... అంతలోకే మధుపర్కాలన్నారు నిన్ను పట్టుకోపోయారు అమ్మలక్కలంతా కలిసి! :( మళ్లీ మొహం మాడ్చేసుకుని కూర్చున్నా!

కానీ ఆ తర్వాత తెల్లని మధుపర్కాలలో అచ్చం రాజహంసలా నువ్వొస్తుంటే.... నాకు రెండు రెక్కలు కట్టుకుని నీతోపాటు ఆకాశవీధిలో విహరించాలనిపించిది!! నీకు తాళి కట్టే వేళ... నువ్వెంత టెన్షన్ పడ్డావోగాని, నేనైతే అరవీరభయంకరంగా పడ్డా! ఎందుకు అని అడగవేం?? ఏంలేదు... ఎక్కడ సినిమాల్లో చూపించినట్టు,.... 'నో... ఆపండి.. నహీ' లాంటి డైలాగ్ కోడతావేమో అని ;) [హ్హహహ్హ! ఉడుక్కుంటున్నావా?? ఊర్కే అన్నాలెద్దూ!! :)) ] ఇక పోతే.... తలంబ్రాలప్పుడు తెలిసింది నీ గడుసుదనం!! అమ్మో.... ' "అమాయకురాలు" అనుకున్నా.... ఆ పదంలో 'అ' తీసేయాలి ' అని అనిపించింది తెల్సా? ;) కానీ, అప్పగింతలప్పుడు నువ్వేడిస్తే నాకేం బాలేదు అమ్మాయ్! నీ కళ్ళలో అలా నీళ్ళు చూడలేను నేను :( 

అయినా, మనిద్దరి పరిచయం ఎంతా?? ఒక్క వారం కదా! ఒక ఆదివారం నిశ్చితార్ధం ఐతే.... నెక్స్ట్ ఆదివారం పెళ్లి. అస్సలు అనుకోలేదు నా జీవితంలో ఇంత ఫాస్ట్ గా పెళ్లి చేసుకుంటా అని ;) ఫాస్ట్ గా కాదు... సూపర్ ఫాస్ట్గా అని చెప్పాలేమో!! హ్మ్! ఏంచేస్తాం! మా డామేజరు సరిగ్గా 15 రోజులు ఇచ్చాడు సెలవులు!! హ్మ్! ఏ బంధమైనా కాలంతో పాటు పెరుగుతుంది. కానీ... మన మధ్య అదేంటో చిత్రంగా ఇంత తక్కువ టైమ్లో అల్లేసుకుంది.  

పెళ్ళైన మూడోరోజే నేను అమెరికాకి బయలుదేరితే.... నీ కళ్ళలో దిగులు చూస్తే.... ఎంత ఆనందమేసిందో తెల్సా? అవును మరి!! నాకోసం ఆలోచించే మనిషి ఒకరున్నారనే భరోసా ఆ దిగులే! నన్ను కావాలనుకునే వాళ్ళు ఉన్నారనడానికి సాక్ష్యం ఆ దిగులే! అందుకే నాకు అది నచ్చింది. కానీ ఆ దిగులు నాకూ అంటుకుని ఇదిగో ఇలా వేధిస్తోంది!! మన పెళ్లి, నీతో గడిపిన ఆ రెండురోజులు ఇవే నాకు ఇప్పుడు తిండి-నీళ్ళు-నిద్ర.... తెల్సా?? ఎన్నిసార్లు నీ ఫోటో చూసినా... ఎంతసేపు నీతో ఫోన్లో మాట్లాడినా....ఆదివారాలు స్కయిప్ చాట్ చేసినా... ఏదో వెలితి గుండెని మెలిపెట్టేస్తోంది. 

నీకో సీక్రెట్ చెప్పనా? అసలు పెళ్ళంటేనే నాకు చిరాకు. హాయిగా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నన్ను... మా అమ్మ 'అమ్మాయి బంగారంలా ఉంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఫోటో చూసి చెప్పరా!' అంటే.... ఇల్లదిరిపోయేలా అరిచా... 'అప్పుడే నాకు పెళ్ళేంటి?' అని. నీ ఫోటో చూపిస్తే చిరాగ్గా చూసి... 'మ్..సరే' అని ముక్తసరిగా సమాధానం చెప్పా! ఏదో ఒకటి పెళ్లి చేసుకుంటే ఈ టార్చర్ తప్పుతుందని. కానీ.... నిజ్జంగా నిజం.... మొదటిసారి నిన్ను చూసినప్పుడు మాత్రం.... మా అమ్మ టేస్ట్ మెచ్చుకోకుండా ఉండలేకపోయా! కానీ మీ అమ్మ, మా అమ్మ ఫ్రెండ్స్ అని.... నీకు నేను ఆరు నెలల ముందే తెల్సు అని తెలిసేసరికి.... అస్సలు నమ్మలేకపోయా! ఆరునెలల నించి నామీద పధకం రచించారన్నమాట మీరంతా కలిసి ;)

నీకేమి గిఫ్ట్ ఇవ్వలేదు నేను... ఇంతవరకు. కానీ నువ్విచ్చిన నీ డైరి.... అందులో నువ్వు దాచుకున్న నెమలీక.... గులాబి రేకులు... వాటిమీద మనిద్దరి పేర్లు..... డైరీలో నాగురించి నువ్వు రాసుకున్న ఊహలు, ఊసులు , కవితలు,........... హ్మ్! రోజుకి కనీసం ఒక పదిసార్లైనా నీ డైరి తెరుస్తా! రోజుకొక పేజి చొప్పున చదువుకుంటూ వస్తున్నా! నువ్వోచ్చేవరకు ఈ డైరి నే నా ఆలనాపాలనా చూసేది మరి :( కానీ.... నీకు అంత నమ్మకమేంటి నామీద? నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని?? ఆ? ఎంత గడుగ్గాయివో!! ఎలాగైతేనేం.... బుట్టలో వేసేసుకున్నావ్ నన్ను!! హాన్నా!

అందుకే నీకోసం ఈ ప్రేమలేఖ వ్రాస్తున్నా! ఇదే నేను నీకివ్వబోయే మొదటి గిఫ్ట్ :) నాగురించి అన్ని రాసుకున్నావ్ కదా నువ్వు.... కానీ నీగురించి రాద్దామంటే..... నీ ఊహల్లో మునిగిపోవడమే తప్ప.... కాగితం మీద కలం కదిలితేనే కదా! ఇదిగో... ఇన్నాళ్టికి అర్ధరాత్రి కుదిరింది ముహూర్తం :)) ఎప్పుడో మర్చిపోయిన అక్షరాలన్నీ కూడబలుక్కుని రాస్తున్నా! నీ అంత అందంగా,కుదురుగా రాయడం కుదరట్లేదు... తిట్టుకోవు కదా! ;)

నేను పెళ్ళికి ముందు.. ఇలాగే ఒంటరిగా ఉండేవాడిని. ఇప్పుడూ నా పరిస్థితిలో మార్పు లేదు. కానీ నా మనసులో మాత్రం బోలెడు మార్పు. చెప్పలేనంత మార్పు. ఆఫీసు-తిండి-నిద్ర తప్ప పట్టని నాకు.. ఊహలు నేర్పావు. కవితలు నేర్పావు. ప్రేమించడం నేర్పావు. విరహం అంటే ఏమిటో చూపిస్తున్నావు. ఇదిగో.... ఇలా ప్రేమలేఖ కూడా రాయించేస్తున్నావు!! 


ఇన్ని ఇచ్చిన నా నెచ్చెలీ... నా దగ్గరికి తొందరగా వచ్చెయవూ??

వచ్చేస్తావు కదూ.... బంగారం!

నీకోసం ఎదురు చూస్తూ.... 

నీ శ్రీవారు!



10, ఏప్రిల్ 2012, మంగళవారం

గుళ్ళో ప్రసాదం ;)

ఆ... టైటిల్ చూసి నోరూరిన  జనతాలో మీరు ఉన్నట్టైతే.... డౌట్ లేదు... మీరు నా క్యాటగిరి నే :)
మరేమో.... అసలు సంగతేంటంటే......

మొన్నామధ్య   నేను, చందూ ఆఫీసునించి సరాసరి రెస్టారెంట్ కి వెళ్లాం :)) బాగా ఆకలిమీదున్నామేమో.... ఒక నాలుగు రకాలు ఆర్డర్ చేసాం ;)

మా ఖర్మకాలి..... మంగళవారం అన్నీ రెస్టారెంట్లకి సెలవు మేము వెళ్ళింది తప్ప :( ఇక జనాలు పొలోమంటూ ఈ రెస్టారెంటుకి క్యు కట్టారు :(((

ఒక పక్కన కడుపులో కుందేళ్ళు పరిగెడుతుంటే.... ఏం చేయాలో తోచక.... అప్పటికే కొరికేసిన గోళ్ళని గిల్లుకుంటూ కాసేపు కాలక్షేపం చేశాం. ఇక లాభం లేదని.... ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటేగాని ప్రశాంతత చేకూరదని.... ఇక తిండి టాపిక్  మొదలెట్టాం!

"అసలు ఇందు.... రాజమండ్రిలో టమాటా బజ్జి ఉంటుంది....."

"చందూ..ప్లీజ్.... ఇది వందో సారి. గుంటూరు మూడొంతెనల దగ్గర మిరపకాయ బజ్జి ఎంత బాగుంటుందో... మీ రాజమండ్రిలో టమాటా బజ్జి అంత బాగుంటుంది. సరేనా? ప్లీజ్.... టాపిక్ చేంజ్"

"హుహ్!....."

"సరే.... నేను చెప్తాలే.... మా ఆఫేసులో నా కొలీగ్  ఒకాయన  ఉన్నారు. ఆయనకి ఫుడ్  ఇంటరెస్టింగ్ టాపిక్ ;)  ఏది ఎలా చేయాలి.... ఎలా తినాలి.... అనేవాటి మీద  మంచి డిస్కషన్స్ పెడతారు. ఆయనకి అన్నిటికంటే నచ్చేది ఏదో తెల్సా??.. గుళ్ళో పులిహోర అట "

"హ్హహ్హహ్హా! మరే.... గుళ్ళో పులిహోర అల్టిమేట్ ఇందు....ప్రసాదాల్లో పులిహోర, చక్రపొంగలి నంబర్ వన్ అసలు. ఒక్క చిన్న స్పూన్  తిన్నా కూడా అమృతంలా ఉంటుంది."

"అవును మరి. దేవుడు ఎంగిలి చేస్తాడేమో.... మంచి రుచిగా ఉంటుంది :). నాకు ఆ చక్రపొంగలి వాసనకే నోరూరిపోతుంది. "

"ఏమోగాని..... ద్రాక్షారామంలో ప్రసాదం మాత్రం సూపర్! దానికి తిరుగులేదు. అసలు దానిని మించి టేస్టీ  ప్రసాదం ఇంకోటి తినలేదనుకో"

"నాకు అది భలే ఇష్టం. ఎంత బాగుంటుందో! అన్నవరం ప్రసాదం తిన్నావా ఎప్పుడైనా?"

"ఆ... అది కూడా కేక! కానీ ద్రాక్షారామం అంత కాదనుకో ;) "

"నిజమే! ఆ ద్రాక్షారామం ప్రసాదం కోసం నేను మూడు సార్లు వెళ్ళా అక్కడికి ;) అసలు నెయ్యి కారుతూ ఉంటుంది. ఆహా!"

"హ్మ్! నాకైతే.... గుడి అంటే ముందు ప్రసాదమే గుర్తొస్తుంది ఇందు. నువ్వు తిట్టుకున్టావ్లె .... కానీ.... నేను మాత్రం  ప్రసాదం బాచ్!" :))

"హ్హహ్హ!! అంతలేదులే.... నిజం చెప్పనా?? మళ్లీ ఎవరికీ చెప్పొద్దూ.... నేనూ సేం పించ్ ;) నాకు గుళ్ళో ప్రసాదం అంటే భలే ఇష్టం!... అసలు గుళ్ళో దేవుడి దర్సనం అయిపోయాక... కళ్ళన్నీ ప్రసాదం మీదే! "

"హ్హేహ్హే! నాకు తెల్సులే! నువ్వెప్పుడు గుడికి వెళ్ళినా  ..... దేవుడికి దణ్ణం పెట్టుకున్తున్నట్టే  ఉంటావ్ కానీ .... ఆ దేవుడి ముందు పెట్టిన ప్రసాదాల వైపే నీ చూపులన్నీ"

"ఏదో నీ అభిమానం ;) ఇది కాదుగాని..... నేను ఇంజినీరింగ్ చదివేటప్పుడు.... మా హాస్టల్ ఫ్రెండ్స్ అందరం.. ప్రతి మంగళవారం, శుక్రవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళేవాళ్ళం. మా హాస్టల్కి రెండు వీధుల అవతల ఒక గుడి ఉండేది. అది నా ఫేవరేట్. అక్కడ ఈ మంగళవారం/శుక్రవారం రోజుల్లో.... చక్కగా చింతపండు పులిహోర, ఆరెంజ్ కలర్ రవ్వకేసరి విత్ జీడిపప్పు+కిస్మిస్+నెయ్యి.... వహ్!! అసలు సూపరనుకో ;) నేనైతే.... మా ఫ్రెండ్స్ వేరే గుడికి వెళ్దామన్నా.... పట్టుపట్టిమరీ ఈ గుడికే తీసుకెళ్ళేదాన్ని.... దేవుడి మీద భక్తీ అనుకునేది మా హాస్టల్ వార్డెన్... ప్రసాదం మీద అనురక్తి అని వాళ్ళకి తెలీదుగా ;) "

"ఆ..... ఆంజనేయస్వామికి మెడలో వేస్తారు చూడు అప్పాలు.... అబ్బ.... ఆ టేస్ట్ అసలు అన్బీటబుల్!"

"అప్పాలా..... అవి బాగుంటాయని నువ్వంత  మొహమాటంగా చెప్పాలా? ;) "

"హహ!! 'అతడు' డైలాగ్ కదా...సూపర్ సినిమాలే. ఏదీ ఏమైనా కానీ అన్నిటికంటే తిరుపతి లడ్డు ప్రసాదం హైలైట్ "

"హా! నిజమే! తిరుపతి అంటే గుర్తొచింది.... శ్రీశైలంలో అమ్మవారిగుడి దగ్గర రాత్రిపూట పూజ అయ్యాక ప్రసాదం పెడతాడు.... ఆహా.... అల్టిమేట్ అసలు. జస్ట్ ఉప్పు+పోపు వేసిన దద్దోజనం ఉంటుంది... వేడివేడిగా.... అబ్బబ్బా!! నోరూరుతుంది చెబుతుంటేనే! అలాగే... ఆ చింతపండు పులిహోర.... దేవుడా! అందులో ఊరిన ఆ ఎండు మిరపకయలైతే ..... సూపరేహే!"

"నాకు శివాలయాల్లో శివుడికి అభిషేకం చేస్తారు.... 'పంచామృతం' .... అది భలే ఉంటుంది ఇందు :) ఆ టేస్ట్ అసలు ఎలా వస్తుందో.... ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా!"

"అవును చందూ.... ప్రసాదాల రుచే వేరు. మొన్నామధ్య మనం పిట్స్ బర్గ్ వెళ్ళినప్పుడు కూడా... ఫుల్లు కుమ్మేసాంగా  అసలు. ప్రసాదం కోసమే గుడికి వెళ్ళినట్టుగా ఉంది." ;)

"సంపత్ ఐతే... ఎప్పుడు హారతి ఇస్తారా.... ఎప్పుడు ప్రసాదం కౌంటర్ వైపు వెళ్దామా అనే!"

"హ్హహ్హ!! నాకు అరోరా టెంపుల్ లో కూడా ప్రసాదం బాగా నచ్చింది. నాచేత డేడ్లి ఇడ్లీ తినిపించాడు వాడి పల్లి  చట్నీ తో! వాడి తరువాతే ఎవరైనా"

"కదా!ఆరోజు సాంబార్ కూడా కత్తిలా ఉంది. ఇంకోసారి వెళ్ళాలి ఇందు షికాగోకి. కనీసం ప్రసాదం తినడానికైనా!! "

" :))) నాకు ఇస్కాన్ ప్రసాదం కూడా నచ్చుతుంది చందూ. ఆరోజు గోల్డెన్ టెంపుల్ లో భలే ఉంది కదా! బెంగుళూర్ ఇస్కాన్లో స్వీట్స్ ఉంటాయి.... వావ్... అసలు పండగే అనుకో"

"అక్కడ ఫుడ్ చాలా బాగుంటుందిరా! 'సండే ఫీస్ట్' ఐతే.... కేక! బ్యాచలర్స్ కి ఒక పూటకి కడుపునిండా భోజనం అన్నమాట ;) "

"హ్మ్! ఎన్నిసార్లు వెళ్ళావ్ బాబు..."

"అబ్బో... లెక్కలేనన్ని....."

"దేవుడి మీద భక్తా? ప్రసాదం మీద ప్రీతా??"

"అది ఇంకా చెప్పాలా? "

"హయ్యో రామా.."

"ఇస్కాన్లో ఉండేది కృష్ణుడు తల్లి... రాముడు కాదు.... అంటే నీ దృష్టి దేవుడి మీదా.... చిత్తం ప్రసాదం మీద అన్నమాట"

"హతవిధీ!"



"సర్ యుర్ ఆర్డర్" అనుకుంటూ............. తీసుకొచ్చాడు.... ఎపటైజేర్.

 'అహనా పెళ్ళంట' సినిమాలో కోటా లాగా........ అప్పటిదాకా మేము డిస్కస్ చేసుకున్న ప్రసాదాల రుచులన్నీ ఊహించుకుంటూ..... ఇద్దరం ఏదో తినేసి బైట పడ్డాం!


అవండి.... మా గుళ్ళో ప్రసాదం గోల.... మరి మీ సంగతేంటి????  ;)

Photos  Courtesy: Google 

14, ఫిబ్రవరి 2012, మంగళవారం

ఇష్టాలే కష్టాలైపోతే?

ఒక సెలవురోజున భోరున వర్షం కురుస్తోంది.

మీరు ఎప్పటిలాగే  వేడివేడి పకోడీ చేసుకుని, ఒక పెద్ద మగ్గునిండా టీ నింపుకుని కిటికీ/బాల్కనిలో కూర్చుని వర్షాన్ని ఆస్వాదిస్తూ, నోటికి పని కల్పిస్తున్నారు.

ఇంతలో చిన్న మూలుగుడు వినిపిస్తుంది. మీ చెవులు అసలే షార్పు కదా! చటక్కున లేచి రోడ్డుమీదకి చూస్తారు.

అక్కడ ఒక బుజ్జి కుక్కపిల్ల  చలికి వణికిపోతూ ఉంటుంది. మీ గుండె అది చూసి కరిగిపోతూ ఉంటుంది.

వెంటనే మీకు సమాజ సేవ,పెటా,బ్లూ క్రాస్  లాంటివికి కళ్ళముందు 70 .ఏం.ఏం. స్క్రీన్లో కనపడతాయ్! ఇక వెంటనే మీలో రక్తం ఉరకలు వేసి గొడుగు కూడా మర్చిపోయి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వీధిలోకి వెళతారు.

ఎదురింటి అబ్బాయి/అమ్మాయి మిమ్మల్ని గాని చూస్తుంటే ఇంకా రెచ్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ కుక్కని అక్కున చేర్చుకుంటారు. అది జాలికళ్ళతో మిమ్మల్ని చూడగానే మీ హృదయాంతరాలలో దాగున్న జంతుప్రేమ ఒక్కసారి వరదమూసినదిలా ఉప్పొంగిపోతుంది.

అది 'కుయ్యో మర్రో' అన్నా మీకు చిలకపలుకుల్లాగే ఉండి దాన్ని నిమురుకుంటూ ఇంట్లోకి తెస్తారు. 

దానికి ఒక టవల్ చుట్టి దుప్పటి మీద బజ్జోపెడతారు. ఆ కుక్క ఎప్పటినించి ఉగ్గబట్టుకుందో ఒక్కసారిగా మీ దుప్పటిని,మీ మంచాన్ని ఖరాబు చేసేస్తుంది.

అయినా మీ మూడ్ సూపరుగా ఉంది కాబట్టి, ఇప్పుడిప్పుడే మీ కుక్క మీద కలిగిన తొలివలపు కాబట్టి మీరు చిదానందబ్రహ్మానంద స్వరూపులై ఎంచక్కా మీ కుక్కని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టి పక్కబట్టలు మార్చి మళ్లీ దానికి బెడ్డింగ్ ఎరేంజ్ చేస్తారు.

ఇంతలోనే దానికి ఏదన్నా పెడదామనే మహత్తర అవిడియా మీ బుర్రలోకి తొంగి చూస్తుంది. వెంటనే దాన్ని అమలు చేస్తారు. 

వేడివేడి పాలు కాచి ఒక చిన్ని ప్లేటులో పోసి దానికి అందిస్తారు. అది దాని బుజ్జినాలుక బైట పెట్టి ఆబగా ఆ పాలని ఒక నాకు నాకి.....ఆ వేడికి కెవ్వుమని.....సారి కుక్కలు కేవ్వుమనలేవు కదా....అదే అదే.....'భౌవ్వుమని' అరుస్తుంది.

మీరు....వెంటనే లీటర్ల లీటర్ల సెంటిమెంటు కార్చేసి....'అచ్చోచ్చో! నోరు కాలిందా నాన్నా? ఆగు కాస్త చల్లారబెడతా' అని ఆ కుక్క నాకిన పాలను ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదిపెడతారు. 

ఇంతలోనే మీ మట్టిబుర్రకి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. 'అరె! మన పప్పికి ఇంకా పేరెం పెట్టలేదే?' అని.

'ఏం పేరు పెడదాం?' అని అలోచించి.....వర్షంలో దొరికింది కాబట్టి మీ సినిపరిజ్ఞానం ఉపయోగించి 'త్రిష' అని పేరు పెడతారు.

'త్రిష!త్రిష!త్రిష!' అని ముమ్మార్లు ముద్దుగా పిలుస్తారు.

అది దాని రెండు చెవులు ఎత్తి మీవంక ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. మీరు అది అంగీకారం అనుకుని గెంతులేసి.....చేతిలో పాలు ఒలకబోసి..... అయినా కూడా నామకరణోత్సవ సంరంభంలో మునిగి ఉన్నారు కావున అస్సలు విసుక్కోకుండా ఆ ఒలికిన పాలను ఎంచక్కా శుభ్రం చేసేసి మీ త్రిషకి మూతికాలని పాలని తీసుకొచ్చి కొసరి కొసరి స్పూన్తో తాగిస్తారు.

అసలే ఆకలిమీద ఉందేమో మీ త్రిష........ శ్రీ కృష్ణుడు పూతన పాలు తాగినట్టు నిర్విరామంగా తాగుతూనే ఉంటుంది. అది చూసి మీరు మురిసి ముక్కలైపోతారు.ఇలాంటి కొన్ని అపురూప ఘట్టాల మధ్య ఆ రోజుకి అంతా బానే ఉంటుంది. మీ త్రిష బుజ్జి కళ్ళు, చిట్టి తోక, బుల్లిబుల్లి పళ్ళు మీకు తెగ నచ్చేస్తాయ్.

'నా త్రిషా అంత అందమైన కుక్క ఈ ప్రపంచంలో లేదు' అని డిసైడ్ అయిపోతారు.

క్రమంగా మీకు,త్రిషకి మధ్య బంధం దృఢమౌతుంది. తన చిలిపి చేష్టలతో,అల్లరి అరుపులతో త్రిష మీకు బోలెడు ఆనందాన్ని పంచిస్తుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయ్!

ఒకరోజున మీరు ఆఫీసులో పని చేసేబదులు ఆంగ్రి బర్డ్స్ తెగ ఆడేసుకోవడం చూసిన మీ మేనేజరు తన పళ్ళు పరపరా కొరికి.......ఇక మీ చేతులు అరిగిపోయేలా......కళ్ళు పేలిపోయేలా......బుర్ర గిర్రున గింగిరాలు తిరిగేలా పని ఇస్తాడు. 

మీది అసలే జాలి గుండె కదా! ఈ దెబ్బకి అది ఇంకా కరిగిపోయి ఆఫీసులో అట్టే నిలవలేక ఇంటికి మోసుకేలుతుంది పనిని.

ఇంటికెళ్ళగానే మీ త్రిష మీకు ఎదురయ్యి మీ బూట్లు నాకుతుంది. మీరు అది స్ట్రెస్ బస్టర్ అనుకుని, మీ త్రిష ఇంట్లో కాలుమోపిన క్షణం నించి అన్ని ఒక రీలేసుకుంటారు. 

ముద్దుగా మీ త్రిషని ఎత్తుకుంటారు. మీ ఒళ్లో మీ ఆఫీసు కాగితాలు,పక్కనే లాప్టాపు ఉంటాయ్. మీరు ఎత్తుకోగానే మీ త్రిష సంతోషం ఆపుకోలేక మీమీదనే చిచ్చు చేసేస్తుంది. 

మీ లాప్టాపు కీబోర్డ్ మీద, మీ కాగితాలమీద ఒలికిన మీ త్రిషమ్మ ఆనంద భాష్పాలు చూసి మీకు కన్నీరు ఆగదు.

అప్పుడు మొదటిసారి మీలో అపరిచితుడు నిద్ర లేస్తాడు. అసలే ఓపిక లేక, ఆపై ఆఫీసు పని తెమలక.....రేపు బాసుకి అందించాల్సిన డాక్యుమెంట్లను మీ త్రిష ట్రాష్ లో పడేసే పరిస్థతి తీసుకురాగా........... మీ ఆగ్రహం  సాగర డ్యాం లా కట్టలు తెంచుకుని ఆ కోపంలో మీ త్రిషని పక్కన పడేసి.....

'దొంగ మోహమా! నిన్ను వర్షంలో కాపాడితే ఇదా నువ్వు చూపించే విశ్వాసం' అని మీ కుక్కకు అర్ధం కానీ భాషలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి..... మీ త్రిష చేసిన ఘనకార్యాన్ని వేనోళ్ళా పొగుడుతూ....... మీ పనిలో మునిగిపోతారు.

త్రిషకి  ఏమి అర్ధం కాక..... చిన్నగా మూలుగుతూ ఇంట్లో ఒక మూలకెళ్ళి ముడుక్కుని బజ్జుంటుంది.

ఇదే ఇష్టాలు కష్టాలైపోవడమంటే!!!

ఎంతో నచ్చినది ...........మనం చిరాకులో ఉంటే ఏదన్నా చిన్న తప్పు చేసినా ఓ...విరుచుకు పడిపోయి తిట్టేస్తే......ఎవరికి నష్టం? మనకే! ఏదైనా చూసేదానిలో ఉంటుంది. ఒకప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చలేదు అంటే......ఆ వస్తువులో మార్పు కాదు మన మనసులో ఆ వస్తువు మీద ఉన్న అభిప్రాయం మారింది అని అర్ధం. 

కొత్తొక వింత...పాతొక రోత. కొత్త చింతకాయ పచ్చడి బానే ఉంటుంది. పాతబడే కొద్ది రుచి తగ్గుతుంది. అలాగని పచ్చడి మొత్తం దిబ్బలో కొట్టలేం కదా! కష్టపడి పెట్టిన పచ్చడి. ఏముంది కాస్త ఆవాలు, మెంతులు, ఎండుమిరప, ఇంగువ వేసి పోపు పెట్టేయడమే! జీవితమూ అంతే! 

ఏమన్నా అర్ధమయిందా? కాలేదా? అర్ధమయితే మహా మంచిది..............కాలేదో.....మరీ మంచిది :)

Anyways.... Happy Valentine's Day Folks!! :) 


1, ఫిబ్రవరి 2012, బుధవారం

నాకొక అందమైన డైరి కావలెను!!!

ఆ టైటిల్ ఏవిటి తల్లీ.... 'అందమైన వధువు/వరుడు కావలెను' అని ప్రకటన ఇచ్చినట్టు అంటారా.... అనేసుకోండి :) నా డైరీ వేట ఆ రేంజ్లో సాగింది మరి :)) 
అసలు సంగతేంటి అంటే.....,
నాకు చిన్నప్పటినించి ఏదో ఒకటి రాయడం అలవాటు :) మాటలకంటే రాతలనే ఇష్టపడతాను!! మాటలంటే  గాల్లోకలిసిపోతాయ్!! కానీ రాతలు అలాగే ఉండిపోతాయ్ అని నా ఫీలింగ్! ;) అందుకే చిన్నప్పుడు కనిపించిన కాగితాన్నల్లా నా రాతలతో నింపేసేదాన్ని :))) అలాగే యే ఊరికేళ్ళినా రాసే ట్రావెలాగ్...... కవితలు, కథలు, బుల్లిబుల్లి కొటేషన్లు.... ఇవన్నీ ఎక్కడపడితే అక్కడ రాసేసేదాన్ని :)))) అలా కాకుండా వాటిని అనాధల్లా వదిలేయలేక ఒక గూడు కల్పించి వాటికి ఆవాసం ఏర్పరచదలిచాను.....అదే.... 'డైరి'

ఇక అప్పటినించి మొదలయింది నా డైరి సెర్చ్! 

మొదట్లో మా డ్యాడి ఆఫీసువాళ్ళు ఇచ్చిన డైరీలో రాసుకునేదాన్ని. అవి చూడటానికి ప్లెయిన్ గా ఉన్నా.... ఒక్కోరోజుకి ఒక్కో ఫుల్ పేజి తో.....చాలా స్పేషియాస్గా ఉండేవి. కాని, రానురానూ....అవి బోర్ కొట్టేసి.... మంచి అందమైన డైరి కోసం వెతకడం మొదలుపెట్టా!! ఈ సందట్లో సడేమియాలాగా ఇంజినీరింగ్ చదివేప్పుడు ఆ 'గోదావరి' సినిమా..... అందులో కమలిని డైరి చూసి.... బాగా కుళ్ళేసుకుని అలాంటి డైరియే కావాలని పట్టుపట్టి  తిరిగిన షాపు తిరక్కుండా తిరిగా!! ఎక్కడా లేదు :(

అలా హైదరాబాదు,గుంటూరు,విజయవాడ,విశాఖపట్నం కూడా వెతికేసాక..... ఇక బెంగుళూరులో అడుగుపెట్టినప్పుడు దొరికింది 'ఫోరం మాల్' లో అచ్చు అలాంటిదే! గవ్వలతో,పూసలతో, అందమైన వర్క్ చేసిన ఫ్యాబ్రిక్ కవర్ ఉన్న బుజ్జి డిజైనర్ డైరి! ఎంతముద్దుగా ఉందో! చటక్కున చేతిలోకి తీసేసుకుని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నపుడు చూసా!! ఖరీదు అక్షరాలా ఐదొందలు అట! కేవ్వ్వ్వవ్వ్వ్వవ్!! అక్కడే మూర్చపోయా! ఎవరో నీళ్ళు చల్లి లేపి, కుర్చీలో కూర్చోపెట్టి కూల్ డ్రింక్ ఇప్పిస్తే అప్పుడు  కళ్ళు తెరిచా....

డైరికి ఐదొందలా? వీడు వీడి డొక్కు షాపు! అనుకుని....నోరు,బుగ్గలు నొక్కుకుని బైటపడ్డా!

ఐదొందలు అని వదిలేసానేగాని, ఎన్నిసార్లు అది కల్లోకొచ్చింది అనుకున్నారూఉ??  ఒక్కోసారి వెళ్లి తీసేసుకోవలనిపించేది! సర్లే లైట్ అనుకుని.... కొద్దిరోజులకి కాం అయిపోయా! కానీ ఎప్పుడు యే షాపుకి వెళ్ళినా డైరీలు కనపడతాయేమో అని తెగ వెతికేదాన్ని.

ఆ తరువాతా గుంటూరు నీలగిరిస్ షాపులో కొన్ని అందమైన పుస్తకాలు పెట్టాడు. అవి డైరీలు కాదు....జస్ట్ నోట్ బుక్స్! కానీ అందంగా ఉన్నాయ్ :) సరేలెమ్మని ఒకటి కొనేసుకుని అందులోనే నాకు తోచిన చెత్తాచెదారం అంతా రాసేదాన్ని. కానీ ఎక్కడో వెలితి ఉండేది...... రోజు రాసుకునే డైరి..... కొన్ని సంవత్సరాలయ్యాక చదువుకుంటే ఎంత బాగుంటుందో అని :) ఒకపక్క నిరాశ! ఇంకో పక్క నచ్చిన డైరి కోసం వేట!! 

అప్పటికే నాకు నేనే డిజైనర్ డైరి తయారుచేసేసుకుందాం అని కూడా డిసైడ్ అయ్యా! కానీ నా డైరికి ఉండే కనీస లక్షణాలు కూడా యే పుస్తకానికి లేకపోవడం వల్ల ఆ ప్లాన్ పక్కన పెట్టేసా!!

 అసలు ఐడియల్  డైరి అంటే ఎలా ఉండాలంటే........ అందమైన డిజైనర్ కవర్ ఉండాలి. దానికి బుల్లిబుజ్జి పూసలు,రంగురాళ్ళూ,రిబ్బన్లు లాంటి రకరకాలతో అలకరించి ఉండాలి. అలాగని గంగిరెద్దులా ఉండకూడదు...... అందమైన రంగవల్లిలా ఉండాలి. లోపల పేజీలు బుల్లి బుల్లి డిజైన్లతో..... చూడగానే పెన్నుపట్టుకుని రాసేసేలా ఉండాలి. 'ఎందుకురా బాబూ ఈ డైరి రాయడం' అని ఫీల్ అయ్యేలా ఉండకూడదు. అలాగే.... ప్రతిరోజూ బోలెడు సంగతులు రాసుకోవడానికి ఒక ఫుల్ పేజి ఉండాలి! అప్పుడైతే బోలెడు బోలెడు రాసేసుకోవచ్చు :)) ఇక ఆ పేజీల్లో ఏమన్నా స్లోగన్లు,కొటేషన్లు ఉంటే మహాచెడ్డ చిరాకు నాకు! రాస్తే గీస్తే నేను రాయాలిగాని ఎవరూ అందులో రాసి ఉండకూడదు ;) అదన్నమాట నా సింపుల్ డైరి రిక్వైర్మెంట్!! 

ఇలాంటి డైరి కోసం.....వెతగ్గా వెతగ్గా..... ఎక్కడా దొరక్క, ఇక ఇన్నిరోజులూ చేసిన వృధా చాలు..... ఇప్పటికైనా ఏదో ఒకదాంతో ఎడ్జస్ట్ అయిపోదాం.... ఎన్నిటికి ఎడ్జస్ట్ అవ్వట్లేదు..... డైరి ఒక లెఖ్ఖా? అనుకున్నా!! పోన్లే కనీసం కొంచెం బాగున్నా చాలు అనుకున్నా! ఇక గూగుల్ సర్చ్ మీద పడ్డా!

వార్నీ, అమెరికాలో జనాలు డైరిలే రాయరా? ఎంతవెతికినా అవేంటో చిన్నపిల్లల కథలపుస్తకాలు, ఆ డైరి ఈ డైరి అంటూ వస్తున్నాయిగాని, నేను రాసుకోవడానికి వీలుగా ఖాళీ డైరి ఒక్కటుంటే ఒట్టు!! అసలు వీళ్ళు డైరీని డైరి అనే అంటారా? ఇంకేదన్నా పదం ఉందా?? అసలే అమెరికాది ఉలిపికట్టె చందం కదా.... అనుకుని..... వెతగ్గా దొరికింది.... 'డే ప్లానర్' అట! నా మొహం!! సరేలే యే రాయి ఐతే ఏంటి అని.... ఆ డే ప్లానర్లు అమ్మే షాపులు చూస్తే... ఎమేజాన్ దొరికింది :)) అందులో, రకరకాల డే ప్లానర్లు ఉన్నాయ్ :) కానీ అందులో ఒకేపేజీలో నాలుగైదు రోజులకి రాసుకునేలాగా బుల్లిబుల్లి గడులు ఉన్నాయ్! :(( పోనీ 'ఒక్కోరోజుకి ఒక్కోపేజి' స్కీములో ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం అంటే...... అబ్బే..... అవి 40 -50డాలర్లు ఉన్నాయ్ ;) దీనికంటే..... బెంగుళూరులో  500 బెటర్ అనిపిస్తుంది ;) [టిపికల్ ఇండియన్ మెంటాలిటీ కదా ;) ]

సరేలెమ్మని,ఏదో గుడ్డిలో మెల్లాలా నచ్చిన ఒక డే ప్లానర్ కి ఫిక్స్ అయ్యి, ఆర్డర్ ఇవ్వబోతే.... షిప్పింగ్ డైరి అంత ఖరీదు అయ్యేట్టుంది.... హయ్యో! రామా!! నేనేమన్నా మణులు అడిగానా? మాన్యాలు అడిగానా? ఒక బుల్లిబుజ్జిచిట్టిచిన్ని అందమైన డైరి కావాలన్నాను... అదీ కష్టమేనా???? హుహ్!! 

ఏంచేస్తాం!!! అంతా షిప్పింగ్ కట్టి అదే తీసుకుందాం అనుకున్నా! తీరా చూస్తే.... షిప్పింగ్ న్యు ఇయర్ తర్వాత మాత్రమె చేస్తామన్నాడు :(( హతవిధీ!! జనవరి ఫష్టు కల్లా డైరి లేకపోతె....ఇంకెక్కడ రాసుకొను??? నాకు మధ్యలో మొదలుపెట్టడం నచ్చదు :(( ఏం చేస్తాం? ఇక ఈ సంవత్సరం కూడా డైరి లేకుండానే గడిచిపోతుందేమో!! ఈ ముక్కే మా చందుతో అంటే.... 'ఆ డైరి ఆర్డర్ ఇవ్వు..... అది వచ్చేదాకా ఎక్కడో అక్కడ రఫ్ఫు రాసుకో.... డైరి వచ్చాక అందులో ఫెయిర్ చేయోచ్చు' అట!! :))))))) మహాగొప్ప సలహా కదా! ;) 'డైరిలకి కూడా రఫ్ఫు,ఫైరు రాస్తున్న ఇందు' :))) [ప్రస్తుతం ఈ పనిలోనే ఉన్నా.... ]

అంటే, మేటర్ అర్ధమయ్యిందిగా! ఈసారికి కూడా డైరికి పంగనామమే!!

హ్మ్! అదండీ సంగతి :) సో, మీకుగాని మంచి అందమైన డైరి( పైన చెప్పిన వర్ణన చూడవలెను) కానీ మీకంటికి కనపడితే...... ఇటు పంపించండి :) పండగ చేసుకుంటా :)))) 

23, జనవరి 2012, సోమవారం

మంచు ముచ్చట్లు!!

హాయ్!
ఎలా ఉన్నారండి అందరు?? ఈమధ్య బ్లాగుల వైపే చూడటం మానేసా! :(( టైం లేదు బాబోయ్... టైం లేదు.... ఏం చేస్తాం?
మూడు నెలలు అయిందనుకుంటా ఇటు వైపు వచ్చి..... ఒక పోస్టు వేసి! హ్మ్! నా పని హడావిడి.... ఇండియా ప్రయాణం.... ఆడపడుచు పెళ్లి..... అన్నీ వెరసి ఇదిగో నన్ను, నా బ్లాగును వేరు చేసేసాయి :((
ఈమధ్యలో బోలెడు సంగతులు జరిగాయి తెల్సా?? అవన్నీ మీతో చెప్పాలని ఎంత ఉబలాటంగా ఉన్నా.....  చెప్పేంత తీరిక నాకు లేదని చెప్పడానికి చింతిస్తున్నా :((

అప్పటిదాకా.... మీకోసం.... ఈ వెన్నేలసంతకం నించి జాలువారిన చిన్న జాబిల్లి తునకని జారవిడవకుండా పొదివి పట్టుకుంటారని ఆశిస్తున్నా...

అప్పుడెప్పుడో మీకు చెప్పా కదా..... నేనొక వెబ్ మ్యాగజిన్ కి ఆర్టికల్స్ రాస్తున్నా అని.... ఆ తర్వాతా రెండు,మూడు పోస్ట్లు వేసినట్టున్నా! ఇక అంతే... నా గోలలో పడిపోయి.... ఆ అప్డేట్స్ ఇవ్వడం మర్చిపోయా!!

ఇదిగోండి... చాలారోజులకి మళ్లీ ఇంకో ఆర్టికల్ తో మీ ముందుకొస్తున్నా! ఇంత ఓర్పు,సహనంతో నన్ను ఇంకా భరిస్తున్న  'ఫర్ వుమెన్' పత్రిక ఎడిటర్ గారికి ధన్యవాదాలు! :)

మంచు...మంచు..మంచు.... ఎటూ చూసినా మంచుముద్దలే! శీతాకాలం వచ్చిందంటే గుండెల్లో గుబులే! 
జివ్వుమని నరాలు లాగేసే చలిపులి మీదపడి కోరికేస్తుంటే, మన మడతమంచం పట్టాని పోలిన గుడ్డతో చేసిన కోట్లు,నానారకాల స్వెట్టర్లు, అవీ కుదరదంటే.... ధర్మల్స్ వేసుకుని ఎలాగోలా సర్దుకుపోతుంటాం ఈ చలికాలం అంతా! మరి సరదాగా కాసేపు ఈ మంచుముచ్చట్లు చెప్పుకుందామా?

మిగితా భాగం ఇక్కడ చదవండి.... 'ఫర్ వుమెన్'
చదివి ఎలా ఉందో...చెప్పడం మర్చిపోకండెం!!....

3, అక్టోబర్ 2011, సోమవారం

నోట్ బుక్ వెనుక పేజీలో!!

కాలేజి రోజులు అంటేనే ఎన్నెనో జ్ఞాపకాలు!
అసలు ఆ రోజులు తలుచుకుంటే మనసు రెక్కలు కట్టుకుని రివ్వున ఎగిరిపోతుంది.....
ఈ జ్ఞాపకాల దొంతరలోనే దొరికింది ఒక రంగుల పేజి.....అదే 'నోట్ బుక్' వెనుక పేజి.

బహుశా....ఇది అందరి కాలేజి చదువులకి వర్తిస్తుందేమో. ఎందుకంటే క్లాసులో పాఠాలు వింటూనే మాట్లాడుకునే కళ [ఈమధ్య సెల్ఫోన్లు వచ్చాయనుకోండి] మనకి నేర్పింది ఈ నోట్ బుక్స్ యే కదా! నావరకు నేనైతే ప్రతి నోట్ బుక్ ముందు,చివర రెండు పేజీలు  ఖాళీ ఉంచేదాన్ని.మరి సంవత్సరం మాట్లాడుకునే కబుర్లకి ఆ మాత్రం వదలొద్దూ! ఇక పెన్ను వాడితే ఆ రెండు పేజీలు  తొందరగా అయిపోతాయని పెన్సిల్ వాడేదాన్ని [తెలివి ;) ]

ఇక ఆ రాతల్లో ఎన్నెన్ని ఇంఫర్మేషన్లో! ఫోన్ నంబర్లు హడావిడిగా రాసుకోవాలన్నా.....మనసులో పాడుకుంటున్న పాటకి చేతిలో పెన్ను అక్షర రూపం ఇవ్వాలన్నా...... తవికలైన, కథలైన...... ముచ్చట్లైనా..... తిట్లైనా అన్నీ ఆ వెనుక పేజీల్లో పొందిగ్గా అమరిపోయేవి. అందుకే సాధ్యమైనంతవరకు మా నోట్ బుక్స్ అబ్బాయిలకి అడిగినా ఇచ్చేవాళ్ళం కాదు :)))) [ఇన్ఫో లీక్ అయిపొదూ ;) ]

అలాగే సినిమాకి వెళ్ళాలంటే 'మూవీ?' అని రాసి అందరికీ పాస్ చేసేవాళ్ళం.రావాలనుకునేవాళ్ళు వాళ్ళ పేర్లు రాసేవాళ్ళు. కానీ పాపం లెసన్ చెప్పే సార్ ఏమో మేమేదో నోట్స్ షేర్ చేసుకుంటున్నాం అనుకునేవాడు పాపం మానవుడు! ఇక ఎన్నింటికి వెళ్ళాలి? ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులున్నాయ్? టికెట్లకి సరిపోతాయా? ఇత్యాది లెక్కలన్నీ ఆ పుస్తకాలూ అటు-ఇటు మోస్తూ తిరిగేవి 


నాకు ఇదివరకు హిందీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. షారుఖ్ పాటలంటే మరీను.' సూరజ్ హువా మధం' పాటైతే పిచ్చి :)) ఆ పాట లిరిక్స్ మొత్తం నా 'సి' లాంగ్వేజ్ నోట్స్ వెనకాల ఉండేది. ఒకసారి మా సార్ క్లాస్లో రౌండ్స్ వేస్తూ....నా నోట్స్ తీసుకుని అటు,ఇటు తిప్పి చూస్తూ చివరి పేజిలో ఆ పాట చూసి.....ఒక్క క్షణం  కోపమొచ్చినా నవ్వేసి వెళ్ళిపోయారు :)) అప్పుడెంత భయమేసిందో! అయినా బుద్దొస్తుందా.....అలా రాస్తూనే ఉన్నాం :)) 

ఇక నేనైతే.... ప్రతి పేజి కార్నర్ లో బుల్లిబుల్లి బొమ్మలు వేసేదాన్ని. ఇక చివరి పేజీల్లో ఏదో చేతికొచ్చిన బొమ్మ వేయడం.....దానికి రెండు కళ్ళు,ఒక ముక్కు,నోరు రెండు పిలకలు పెట్టడం...... పక్కనున్న నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరి పేరు రాయడం....... ఇక ఆ అమ్మాయిని ఏడిపించడం! ఆ పిల్ల లబోదిబోమన్నా నోట్స్ ఇచ్చేదాన్ని కాదు. అందరూ చూసి పడి,పడి నవ్వాక అప్పుడు తీరిగ్గా ఆ అమ్మాయికి ఇస్తే.....తను ఎంచక్కా తన పేరు కొట్టేసి నా పేరు రాసి కచ్చ తీర్చుకునేది. హహహ! అయినా కూడా భలే ఉండేది...ఆ మజాయే వేరు!

ఇక నిక్ నేమ్స్ ఒక లెఖ్ఖా? హబ్బో! క్లాసులో ప్రతివారికి నేను నిక్నేమ్స్ పెట్టేదాన్ని :))) అది ఎలాగో తెల్సా? వాళ్ళ పేరు కలిసోచ్చేలా అన్నమాట. ఉదా: దున్న దివ్య,బుల్లిబల్లి, కోతి కవిత, మోహిని పిశాచి, రాజి = పి.ఐ.జి, ఇలా! అవి ఎంతగా పాపులర్ అయ్యాయి అంటే..... నా సెల్ ఫోన్లో వాళ్ళ పేర్లకి బదులు ఇవే పేర్లు ఉంటాయ్...ఇప్పటికీ :))))))))))) నన్నైతే చితక్కోట్టేసేవాళ్ళు అలా పిలిస్తే! ఎంత ఉడుక్కునే వాళ్ళో! హ్హహ్హహా! కానీ పాపం నాకు పెట్టడానికి వాళ్ళకి ఏమి దొరకలేదు :)  [నా పేరు అంత 'స్వీట్ నేం' కదా]

ఇక ఒకరోజు ఎలెక్ట్రానిక్స్ క్లాస్ జరుగుతుంది. నాకు ఈ సబ్జెక్ట్ అంటే చాలా చిరాకు. 'ఎహే సోది గోల' అని చెప్పి ఆ క్లాస్ నోట్స్ వెనుక పేజిలో ఇక ఒక కథ రాయడం మొదలుపెట్టా. క్లాస్ అయిపోయేసరికి నా కథ అయిపోయింది :)) న్యూస్ పేపర్ మీద కథలెండి ;) ఇంకా మీ మీదకి వదలలేదు నేను :)) మా ఫ్రెండ్స్ ఐతే అది చూసి......అసలు నన్ను ఒక రేంజ్లో పొగిడేసరికి మా క్లాసు అటకెక్కి కూర్చున్నా కాసేపు. అలా క్లాసులో రాసిన ఇంకో కథే.....నా 'చిట్టి చీమ కథ'.

అలాగే..... బెంచిలమీద రాసే అలవాటుకూడా మనకి అలవడింది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం 'సి' లాంగ్వేజ్ నేర్చుకోడానికి మా గుంపుగుంపు అంతా ఒక ఇన్స్టిట్యుట్ మీద పడ్డాం. అక్కడ ఒక్కక్కరికి ఒక్కో చెయిర్. దానికి రాసుకోడానికి ఒక బుల్లి బల్ల. ఇక దానిమీద ఉండేవి....బాబోయ్! 'విజయేంద్ర వర్మ.....చూసినోడి ఖర్మ', ఇలాంటి కేక పెట్టించే డైలాగ్స్ ఉండేవి. రోజు అవి చూసి నవ్వుకోలేక చచ్చేవాళ్ళం :)) 

కానీ ఇంటర్లో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ నాకు నవ్వు తెప్పిస్తుంది. మా కాలేజిలో రేసిదేన్శియాల్ స్టూడెంట్స్,డే-స్కాలర్స్ ఇద్దరికి ఒకేచోట క్లాసులు. మా గర్ల్స్ క్యాంపస్ పక్క రోడ్లోనే  గర్ల్స్ హాస్టల్. ఈ హాస్టల్ వాళ్ళు రోజు మధ్యాహ్నం లంచ్ కి హాస్టల్ కి వెళ్ళేవాళ్ళు. ఇక మిగితావారు ఇళ్ళకి వెళ్ళేవారు. మా ఇల్లు దూరం అవడంతో నేను క్యారేజి తెచ్చుకునేదాన్ని.మా క్లాసులో నేనొక్కదాన్నే ఉండేదాన్ని. ఇక హాస్టల్ వాళ్ళు చదుకోడానికి చేయిర్లు,ప్లాంకులు అక్కడే పెట్టుకునేవారు. వాటిమీద ఏవేవో రాసున్దేవి. ఎక్కువగా పవన్,మహేష్ ఫ్యాన్స్ రాసేవారు. వాళ్ళ సినిమా పాటలు,డైలాగ్స్ అలా. ఇంకా ఫ్రెండ్షిప్ కోట్స్,లవ్ కోట్స్....ఇలా బోలెడు సమాచారం ఆ ప్లాన్క్స్ మీద ఉండేది ;) నేను అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ ప్లాంక్స్ మీద రాస్తుండేదాన్ని. :)

ఒకరోజు మధ్యాహ్నం లంచ్ అయ్యాక నేను మా ఫ్రెండ్ చైర్లో కూర్చున్ని బుద్ధిగా చదువుకుంటున్నా. తీరా దాని ప్లాంక్ చూస్తే.....కొత్తగా తళతళ లాడుతోంది.నీట్ గా ఏమి రాయకుండా ఖాళీగా ఉంది. అది చూసేసరికి మన చేతులు దురద పుట్టాయి.  'అరె! నాకు చెప్పలేదేంటి ఎప్పుడు కొన్నది ఈ కొత్త ప్లాంక్? భలే బావుంది' అనుకుని ఎంచక్కా నా హైలైటర్ తీసుకుని......అప్పుడే విడుదలైన 'ఒక్కడు' ఆడియోలో పాట రాసేసా ;) 

ఒకటికి నాలుగు సార్లు అది చూసుకుని మురిసిపోయి.....కాసేపు ఆ ప్లాంక్ మీదే నిద్రపోయి....లేచి ముఖం కడుక్కుని నా ప్లేస్ కి వచ్చి కూర్చున్నా.ఇక లంచ్ చేసి అందరూ వచ్చేసారు.....గోలగోలగా ఉంది. ఇంతలో నాకు అస్సలు పరిచయం లేని ఒకమ్మాయి మా ఫ్రెండ్ చైర్ దగ్గరకొచ్చి ఆ ప్లాంక్ తీసుకుని చూసింది.ఆ ప్లాంక్ ఆ పిల్లదట. కేవ్వ్వ్వవ్వ్వ్వ్!!నేను రాసింది చూసి పళ్ళు పటపటా కొరికింది. ఆ పిల్ల పవన్ ఫ్యాన్ అట! మహేష్ అంటే పడదట! మనకేం తెల్సు? వాఆఆఅ......వా............

'ఇక్కడెవరు కూర్చున్నారు? ఈ పాట రాసిందెవరు?' అది ఇది అని చీల్చి చెండాదేస్తుంటే......అసలే సత్య హరిశ్చద్రుడి కజిన్ సిస్టర్ అయిన నేను...... 'నేనే!' అని చెప్పబోతుంటే నా ఫ్రెండ్ నోరు నొక్కేసింది. 'ఆ ఏమో మరి. మాకేం తెల్సు? అయినా నీ ప్లాంక్స్ ఇక్కడ పెట్టకు. తీసుకెళ్ళి నీ చెయిర్లో పెట్టుకో.నా చెయిర్లో పెట్టావేంటి?' అని మా ఫ్రెండు గయ్యిన పడేసరికి దెబ్బకి ఆ అమ్మాయి తోకముడిచి నన్ను కొరకొరా చూస్తూ వెళ్ళిపోయింది. మా ఫ్రెండు నన్ను నాలుగు చీవాట్లేసింది లోకజ్ఞానం అలవరచుకో తల్లి అని :)) 

హ్మ్! అప్పటినించి ఏం రాసినా.....ఎక్కడ రాసినా ఆచి,తూచి రాస్తుంటా అన్నమాట ;)

అదండీ...... నా జ్ఞాపకాల తేనెతుట్టె కదిపేసి ఆ తేనెటీగలను మీమీదకి వదిలేసా! కామెంటు పెట్టకపోతే కుట్టేస్తాయ్ మరి ;) జాగ్రత్తా! :))))))) 

26, సెప్టెంబర్ 2011, సోమవారం

మంచుకురిసేవేళలో.....

నేను కోరుకున్న ఉదయం........

నాకెప్పటినించో మంచుపొరలు ఇంకా వీడకముందే బాల్కని/పాటియొలోకి వచ్చి కూర్చుని వేడి వేడి ఫిల్టర్ కాఫీ తాగుతూ సూర్యోదయాన్ని చూడాలని :) మనకున్న నిద్రాదేవి అపారకరుణాకటాక్షాలవలన అది ఈ జన్మకి నెరవేరని కోరిక అని సరిపెట్టుకుంటువస్తున్నా! :)) కాని నాకు అంతకంటే ఎక్కువ నా కిట్టు కరుణ ఉందని(అప్పుడప్పుడూ ఏడిపించినా) మొన్నే అర్ధమయింది ;) 

అసలు సంగతేంటంటే........

మొన్న లాంగ్ వీకెండ్ ఎక్కడికెళదామా అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే వాషింగ్టన్ వెళ్దాం.... అసలే మొన్న భూకంపం వచ్చింది కదా.... కాస్త పరామర్శిద్దాం ఒబామని అని బయలుదేరాం ;)

మాతోపాటు వచ్చారు మాకు తెలిసినవాళ్ళయిన శర్మ,జ్యోతి :) వాళ్ళకి ఇద్దరు కవలపిల్లలు.... సన్ని,బన్ని :) వయసు మూడేళ్ళే అయినా..... అల్లరి మాత్రం ఆకాశమంత :))

హ్మ్! ఇక మా యాత్ర విషయానికి వస్తే...

సరాసరి వాషింగ్టన్ వెళ్తె ఎలా? మధ్యలో ఏమన్నా కవర్ చేద్దామని.... ఇస్కాన్ గుడికి అంటూ వెస్ట్ వర్జీనియాలో ఉన్న 'గోల్డెన్ టెంపుల్ ' కి వెళ్ళాం. ఆ రోజు రాత్రి అక్కడ ఉండి మర్నాడు పొద్దున్నె దర్శనం చేసుకుని పిట్స్బర్గ్ వెళ్ళాలని ప్లాన్. శుక్రవారం మధ్యాహ్నం ఆఫీసులకి డుమ్మా కొట్టి బయలుదేరినవాళ్ళం ఆ రోజు అర్ధరాత్రికి ఇస్కాన్ చేరాం.  కొండల్లో,అడవుల్లో జీపీయస్ ఇచ్చిన తప్పు రూట్లో వెళ్ళిపోయి మళ్ళి ఎలాగొలా తిరిగి తిరిగి కెరెక్ట్ రూట్ కనుగొని ఎలాగైతేనేం అర్ధరాత్రికి వెళ్ళాం :)

ఇక పొద్దున్నే అందరూ నిద్రపోతుంటే ఎప్పటినించో ఉన్న నా కోరిక తీర్చుకునేందుకు ఆరింటికే నిద్ర లేచా :) [అంతా కృష్ణమాయ :)) ]

కిటికి బ్లెండ్స్ పక్కకి జరిపి చూస్తే.....మన గీతాంజలి సినిమాలో చూప్పించినట్టు అంతా పొగమంచు :) కనుచూపుమేరా మబ్బు నేలవాలిందా అన్నట్టు. బైటికి వెళ్ళాలంటే భయమేసింది. అసలే అడవి..... పైగా మంచు..... ఇంకా జనసంచారం లేదు.సరేలెమ్మని వేడివేడి టీ,కాఫీ లేకపొయినా అలా కిటికి పక్కన కూర్చుని ఆల్చిప్పలాగా కళ్ళు తెరిచి చూస్తు ఉన్నా.

కాసేపటికి మంచు తెరలు ఒక్కొక్కటి విచ్చుకోవడం మొదలుపెట్టాయి.సూర్యుడు ఆ మంచు దుప్పట్లని తొలగించి చెట్లని,పూవులని సుతారంగా ముద్దాడి లేలెమ్మని మేల్కొలుపుతున్నాడు. 

అప్పుడే ఒక విదేశిజంట చేతిలో జపమాల తిప్పుతు వెళుతున్నారు.చక్కగా చీరకట్టుకున్న ఆమెని,లాల్చి వేసుకున్న అతన్ని చూస్తే ముచ్చటేసింది :)

ఇక ఆగలేకపోయా.చందూ చూస్తే బాగా నిదరొయింగ్స్! పాపం రాత్రి డ్రైవింగ్కి అలసిపోయినట్టు ఉన్నాడు. ఎందుకులే లేపడం...పాపం పడుకోని అని ఇక నేనే ధైర్యం చేసి ముందడుగేసా! వెంటనే ఎస్సెల్లార్ మెడలో వేసుకుని అభినవ ఫోటోగ్రాఫర్లాగా బయలుదేరా. నేను ఇలా రూంలొనించి బైటికొచ్చా జ్యోతి కూడా నాతో పాటు వచ్చారు....'పద ఒకసారి అలా తిరిగొద్దాం' అన్నారు :)  ఇక ఇద్దరం చెట్టాపట్టాలేసుకుని బయలుదేరాం :) 

మేము వెళ్ళేసరికే దొంగమంచుపొరలు.......సుర్యుడికే మస్కా కొట్టేసి మళ్ళి చెట్ల మీద పరుచుకున్నాయి :)) మళ్ళీ గీతాంజలి సీన్ రిపీట్.

ఇక మెల్లగా ఆ మంచులో అలాగే సన్నగా వణుకుతూ...... తడిసిన ఆ గడ్డిమీద నడుస్తూ.... దారి పక్కనే పెరిగిన బంతి,చేమంతి,గులాబి పూలు మంచుముత్యాలతో అలరారుతుంటే అవి చూస్తు... చేతిలో కెమెరాతో కనపడిన దృశ్యమల్లా బంధిస్తూ....అలా వనవిహారం చేస్తున్నాం. ఒక రెండు అడుగులు వేయగానే నెమళ్ళ క్రేంకారం వినిపించింది :) అది ఏదో పక్షి అని జ్యోతి కాదు నెమలి అని నేను గొడవ :))

కొద్ది దూరం వెళ్ళగానే ఒక అందమైన చిన్ని కొలను అందులో తెల్లని హంసలు[హంస ఇప్పుడు లేదు కదా....అవి తెల్లని పెద్ద బాతులయుంటాయ్] ఆ దృశ్యం చాలబాగుంది :) ఇక ఆ కొలను ఎదురుగా చుడగానే కృష్ణచైతన్య ప్రభువు అలౌకికానందంలో తేలిపోతూ నాట్యం చేస్తున్నారు. ఆ ప్రతిబింబం ఈ నీటిలో పడి ప్రతిఫలిస్తూ ముచ్చటగొలుపుతుంటే నేను,జ్యోతి కాసేపు అక్కడే ఉండిపోయాం :)

మళ్ళి మా నడక కొనసాగించి ఆ చైతన్యప్రభువుల విగ్రహాల దగ్గరకి బయలుదేరాం. ఆ దారంతా గడ్డిపూలు విరగబూసాయి. వాటిమీద మంచుబిందువులు పడి పూల అందం అమాంతం పెంచేసాయి. ఆ పూలని ఫొటో తీద్దామంటే కుదరలేదు :((

అక్కడ ఇంకో చిన్న కొలను దానికి ఆనకట్టా ఉన్నాయి :) దానిపక్కనే నెమళ్ళ కేంద్రం ఉంది. అక్కడ తెల్ల నెమళ్ళు, మామూలు నెమళ్ళు కలిసి వనవిహారం చేస్తున్నాయి. ఇందాక అరిచినవి అవే :))
            
నాకు ఆ మంచు చూస్తుంటే...'మంచు కురిసే వేళలో' పాట గుర్తుకొచ్చింది. పైకి పాడదాం అంటే మళ్ళీ జ్యోతి పారిపోతారని పాడలేదనుకోండీ ;) 

కానీ అబ్బా.... ఎంత బాగుందో! చుట్టూ కొండలు.... దట్టమైన అడవులు... కొద్దిదూరంలో కృష్ణమందిరం.... మంద్రంగా వినిపిస్తున్న కృష్ణమహామంత్రభజన...... ఎదురుగా కొలను అందులో బాతులు... దాని ఒడ్డున చైతన్యప్రభువులు.... ఆ వనమంతా తిరుగుతూ అల్లరిచేస్తున్న నెమళ్ళు... పధ్ధతిగా పెంచిన రకరకాల పూలమొక్కలు.... అందాలు ఒలకబోస్తున్న గడ్డిపూలు.... రెండు కొలనులమధ్య చిన్ని వంతెన.... అక్కడే కూర్చోడానికి చిన్న రాతిబల్ల.... చెట్లమధ్యగుండా తొంగిచూస్తున్న చల్లని సూర్యుడు...... హ్మ్! ప్రపంచంలో ఇంతకంటే అందమైన ప్రదేశం ఉంటుందా? నాకు తెలిసి ఉండదేమో!

ఆ నెమళ్ళని చూస్తు, ఆ వంతెన దాటి ఆ మంచుపొరల్లో మేము మమేకమయిపోయి, అప్పుడే ఆకులు రాల్చడం మొదలుపెట్టిన వనాల్లోగుండా నడక సాగించి, మెల్లగా చెట్లపైకి వచ్చి ఆశగా తొంగిచూస్తున్న సూరీడ్ని నా కెమెరాలో బంధించి, చిరుచలి గిలిగింతలు పెడుతుండగా ఇక మా రూంకి బయల్దేరాము :)

అలా ఆ చెట్లమధ్యగుండా,మా మధ్య దూరిపోతున్న మంచుమేఘాల్ని తడుముతూ మా రూం కి చేరుకుంటున్నప్పుడు ముక్కుపుటాల్ని తాకింది కట్టెపొంగలి వాసన.....ఇంకా చిక్కటి బ్రూ కాఫీ పరిమళం :)

'మంచి రుచికల ఉదయం కొత్త సన్రైజ్' ....ఎందుకో ఈ ఏడ్ ఠక్కున గుర్తొచ్చింది :)

ఇక ఆగలేక వెళ్ళి,ముఖం కడుక్కుని చందు ని లేపి చిక్కటి కాఫీ తెచ్చుకుని ఎంచక్కా ఆ మంచులో ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ కాఫీ తగుతుంటే.....ఆహ!! స్వర్గం కాళ్ళ కింద ఉందేమో అనిపించింది ఒక్క క్షణం.

నేను కోరుకున్న ఉదయం ఇన్నాళ్ళకి నాకు దొరికింది :)

ఎన్నాళ్ళయినా ఈ చల్లటి మంచు, కొలను, నెమళ్ళు, బాతులు, విగ్రహాలు, వంతెన, చెట్లు, సూర్యుడు నా మనసుని దాటిపోవేమో!! :) 

ఏదేమయినా కృష్ణమాయ కృష్ణమాయే! :) 

నాకెందుకో ప్రకృతినిమించిన అందం దేనిలోను కనిపించదు. ప్రకృతి భగవంతుడి సృష్టి కాబట్టి ఆయన అందం కాస్త అడిగి అరువు తెచ్చుకుందేమో! అరువు తెచ్చుకున్న అందమే ఇంత అందంగా ఉంటే...అసలైన అందం....అదే మా కిట్టూ ఇంకెంత అందంగా ఉంటాడో కదా!

హ్మ్మ్!! :)) 

అవీ ఈసారికి కబుర్లు అయిపోయాయి :) ఫోటోలు చూసి కామెంట్లేసేయండి :)











1, సెప్టెంబర్ 2011, గురువారం

మా ఇంటి గణపయ్య :)

ఉండ్రాళ్ళ మీదకి దండు పంపూ....గణపయ్యా....
కమ్మని నెయ్యి కడు ముద్దపప్పు గణపయ్యా....
ఓ బొజ్జ గణపయ్య...నీ బంటు నేనయ్యా...

ఈ పాట చిన్నప్పుడు ప్రతి వినాయకచవితికి పొద్దున్నే మా టేప్రికార్డర్లో మమ్మల్ని మేలుకొలిపేది :) ఇవాళ పొద్దున్నే నాలుగింటికి ఈ పాట నేనే పాడుకుంటు లేచి.... అన్ని నైవేద్యాలు చేసి.... గణపయ్యకి బోలెడు వండిపెట్టి... ఇంకా చక్కగా పూజ చేసుకుని అంతా అయ్యేసరికి పది :) అసలే వీక్ డే కదా... అంతా ఉరుకులు,పరుగులు లాగా అయిపోయింది :) 

ఇక అట్టే మీకు నా సోదంతా చెప్పి మిమ్మల్ని విసిగించనులే... పిక్స్ పెట్టా..చూసి...తరించేయండి మా ఇంటి గణపయ్యని :) 

గణపయ్యకి ఇష్టమని..ఉండ్రాల్లు,మోదకాలు,గారెలు,పులిహోర,పాయసం చేసా :) వాటికి తోడు.... టమటా పప్పు, బెండ, దొండ కూరలు.. పులుసు.. ఇంకా వడపప్పు,పానకం :) ఇక మామిడి, చెరుకు, అరిటి, ఆపిల్, నారింజ, ద్రాక్ష, పీర్స్, మొక్కజొన్న కూడా పెట్టాను. మరి సరిపోయాయో లేదో బుజ్జిగణపయ్య బుల్లి కడుపుకి :)


ఇంకా పూజ మొదలుపెట్టకముందు బియ్యప్పిండితో ముగ్గేసి...బియ్యంపోసి గణపతిని,వాళ్ళ డాడి శివయ్యని,మా ఇలవేల్పు వెంకీని, ఆయన భార్య లక్ష్మిని పెట్టాను :) 


మా గణపయ్య పూజకి ఎంతముచ్చటగా రెడి అయ్యాడో చూడండీ :) 


శ్ర్రీ మహాగణాధిపతయే...పుష్పం పూజయామి :) 


శ్ర్రీ మహాగణాధిపతయే...పత్రం పూజయామి :) 


కదళీఫల-నారికేళా సహిత నానావిధభక్ష్యభోజ్యం మహానైవేద్యం సమర్పయామి :) 


అంతే...పూజయిపోయిందోచ్! కథవిని అక్షతలు వేసుకుని...తోరం కట్టుకుని గణపతి ఆశీర్వాదం పొందండి :)

సరే...మరి...అందరికి ఇంకొక్కసారి 'వినాయకచవితీ శుభాకాంక్షలు :)


30, ఆగస్టు 2011, మంగళవారం

పరంజ్యోతి

కర్మ అంటే ఏంటి?

కర్మఫలం అంటే ఏమిటి? 

జన్మలు ఉంటాయా?

మరణించిన మనిషి మళ్లీ బ్రతుకుతాడా?


ఈ ప్రశ్నలన్నిటికీ  సమాధానం చెప్పే  మల్లాది గారి అద్భుత ఆధ్యాత్మిక నవల......'పరంజ్యోతి'

మొన్న మా బజ్జు గుంపులో దయ్యాల మీద,పునర్జన్మల మీద,ఊజాబోర్డు గురించి,మల్లాది గారు వ్రాసిన 'అనగనగా ఒక అతిధి'నవల గురించి ఒక  సుదీర్ఘ చర్చ జరిగింది. అప్పుడు నేను చదివిన ఈ నవల గుర్తొచ్చి అది ఈ బ్లాగు పోస్టుకి నాంది పలికింది :)

ఆమధ్య ఇండియా వెళ్ళినప్పుడు ఈ పుస్తకం మా ఇంట్లో చూడగానే....'హబ్బా ఇంకో బోరింగ్ నవల!' అనుకున్నా! కాని మా అమ్మ 'ఒకసారి చదువు నీకే తెలుస్తుంది.....బోరింగో..ఇంటరెస్టింగో'....అంటే సరేలెమ్మని చదవడం ప్రారంభించా!

ముందు నాలుగైదు పేజీలు  కొంచెం విసుగనిపించినా రానురాను కథలో చిక్కదనం ఎక్కువైంది. ఒక వ్యసనపరుడు సాధువుగా ఎలా మారాడు? తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరాడు అన్నది ఈ నర్మదా-గోదావరి నదుల ఒడ్డున సాగే కథ!

రెండు శతాబ్దాల క్రిందట గోదారి తీరంలో వెలసిన 'నెమలి కొండ' సంస్థానం రాజు 'విజయ రామరాజు'  కథ ఇది. వ్యసనపరుడైన రామరాజు  రాజ్యాన్ని,రాణిని ఆఖరికి కన్న కొడుకుని కూడా లక్ష్యపెట్టకుండా  భోగలాలసలో మునిగి తేలుతుంటాడు. అతన్ని మార్చాలని అతని భార్యతో సహా బంధువులందరూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి. చివరికి అతని వ్యసనాలు మందులేని రోగం రూపంలో అతన్ని మంచాన పడేస్తాయి. అయినప్పటికీ అతనిలో మార్పు ఉండదు. ఇదంతా చూసి విరక్తి చెందిన రామరాజు భార్య,బావమరిది కలిసి విషం పెట్టి అతన్ని చంపేస్తారు.

రామరాజు రోగం వల్లే చనిపోయాడనుకుని భావించిన అందరూ గోదావరి తీరాన అతని దేహానికి దహన సంస్కారాలు చేయడానికి  ఏర్పాట్లు చేస్తారు. చితికి నిప్పు పెట్టాక....ఉన్నట్టుండి పెద్ద వర్షం.....దానితోపాటే గోదారి పొంగిపొరలి కొద్దిగా కాలిన  చితిని కొట్టుకుపోయేలా చేస్తాయి. కళ్ళముందే రామరాజు చితి వరదగోదారిలో కొట్టుకుపోతుంటే చేసేది లేక మిన్నుకుండిపోతారు రాజ కుటుంబీకులు. ఈ విషయం బైటికి పొక్కకుండా జాగ్రత్త పడతారు!

కాని కొద్దిరోజుల తరువాత 'రామరాజు' సగం కాలిన దేహాన్ని ఎవరో సాధువు కాపాడారని.....రామరాజుకి తిరిగి ప్రాణం పోశారని అతని పేరు 'పరంజ్యోతి' అని తెలుస్తుంది! ఇది నిజమేనా? ప్రాణం తిరిగి వచ్చిన రామరాజు ఏమయ్యాడు? రాజ్యానికి చేరాడా లేదా? అసలు ఇంతకీ  'రామరాజు' 'పరంజ్యోతి' ఒకరేనా? ఒకవేళ పరంజ్యోతే రామరాజు ఐతే  తనని చంపినవారెవరో తెలుసా?...... ఇలా ఎన్నో ప్రశ్నల పరంపరకి సమాధానాలు కావాలా? అబ్బా.....ఆశ,దోశ,అప్పడం.... నేను చెప్పనుగా!! మరి ఎలా?  అందుకే మంచిపిల్లల్లా ఈ పుస్తకం చదవాలి మరి ;)

అసలే అమ్మమ్మ చనిపోయి దుఃఖంలో ఉన్న నాకు ఈ నవల ఊరటనిచ్చింది. 'కర్మ' అంటే ఏమిటో చెప్పకుండానే చెప్పిన మల్లాది గారి శైలి అద్భుతం. ఏదైనా మంచి విషయం చెప్పాలంటే సరాసరి చెప్పేస్తే బుర్రలోకి ఎక్కదు. అదే చిన్న కథ రూపంలో చెబితే మనసులో నాటుకుపోతుంది. ఈ నవల కూడా ఆ కోవకే వస్తుంది. ఎన్నో ధార్మిక రహస్యాలు, ఆధ్యాత్మిక విశేషాలు,నిత్యం ప్రతి మనిషి పాటించవలసిన సూత్రాలు....ఇలా ఎన్నో 'పరంజ్యోతి' అనే పాత్రని అడ్డుపెట్టుకుని మనకి చెప్పినట్లు అనిపిస్తుంది. పంతొమ్మిదోశతాబ్దంలో  బెంగాల్లో జరిగిన ఒక నిజజీవిత గాధ ఆధారంగా ఈ నవల వ్రాసారు మల్లాది గారు :)

సాధారణ పాఠకులకి ఈ నవల కొంచెం బోర్ గా అనిపించవచ్చు! కాని దైవ చింతన,ఆధ్యాత్మిక జిజ్ఞాస, జ్ఞాన సముపార్జన అనే విషయాల మీద ఆసక్తి ఉన్నవారు.........జన్మలు,కర్మ సిద్దంతాలు మీద నమ్మకం ఉన్నవారు చక్కగా చదువుకోవచ్చు. ఇవన్ని లేకపోయినా......కనీసం తెలియని విషయాలు తెలుసుకోవాలి అనుకునే ఆసక్తి ఉన్నా ఒక్కసారి ఈ నవల చదివితే జీవితం మీద మీ దృక్పధం మారిపోతుంది అన్నది మాత్రం ఖచ్చితం :)

నాకు ఈ నవల ఎంత నచ్చిందంటే...........దీనిలో నాకు నచ్చిన చాలా విషయాలని నేను విడిగా నోట్ చేసుకున్నా... ఎప్పటికి మర్చిపోకూడదని :)

 ఈ నవల చదవడం కూడా నా కర్మఫలమేనేమో!  :)

24, ఆగస్టు 2011, బుధవారం

మసాలా తాతయ్య!!


అవి నేను ఎంసెట్ రాసి,కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఖాళీగా ఈగలు తోలుకుంటున్న రోజులు! 

బద్ధకపు ఉదయాలు..... భుక్తాయాసపు మధ్యాహ్నాలు దాటేసాక ఇక సాయంత్రాలు డాబా మీద చెట్ల మధ్య గడిచిపోయేది. అప్పుడు అమ్మ చేసిపెట్టే  పకోడీలో,బజ్జీలో,కారప్పోసో.... ఏదో ఒకటి నేమరేసేదాన్ని.

ఒకరోజు మా ఎదురింటి సరోజ ఆంటి, పక్కింటి కుమారి ఆంటి మా ఇంటిముందు మెట్లమీద ముచ్చట్లు పెట్టారు. మా అమ్మని ఆహ్వానించారు. నేను సాధారణంగా ఈ రోడ్డు మీద అరుగు పై ముచ్చట్లకి దూరం-దూరం. కానీ ఆ రోజు ఏమి తోచక ఆంటీల బుర్ర తిందామని వెళ్లా! 

అప్పుడే ఒక మసాలా బండి మా ఇంటిముందుగుండా వెళుతోంది.ఆ బండికి 'రాం-లఖన్' అనో....'జై భజరంగబలి' అనో పేర్లు లేవు. మామూలు సాదాసీదాగా ఉంది. ఒక చిన్న గంట కొట్టుకుంటూ ఆ బండి తోసుకేలుతున్న అతనివైపు చూసా! 

చాలా పెద్దాయన. బక్కపలచగా ఉన్నాడు. సన్నని,పొడుగాటి మాసిపోయిన కుర్తా-పజమా ఇంకా తలమీద చిన్న తెల్ల టోపీ.చూస్తేనే తెలుస్తుంది ముస్లిం అతను అని. కళ్ళు లోపలి పోయి ఉన్నాయి. గడ్డం మాసిపోయి ఉంది. ఎందుకో చూడగానే జాలేసింది. 

అప్పటికే అమ్మ స్నాక్స్ ఏమి చేయలేదు. సరే అని...'అమ్మా! మసాలా కొనుక్కుంటా....ప్లీజ్ అమ్మా' అని గొడవ పెట్టా! యే కళనుందో వెంటనే తలూపింది సరే అని.
ఇక ఎగురుకుంటూ వెళ్లి ఆ మసాలబండిని ఆపి.....'తాతా...తాతా.... ఒక మసాలా చాట్ ఇవ్వా?' అని అడిగా.

తాత ఒక చిన్న నవ్వు నవ్వి....వెంటనే ఆ బండిని రోడ్డు పక్కకి పెట్టి.... ఒక న్యూస్ పేపర్ కోన్ లా చుట్టి దాన్లో రెండు చిన్న ఎండు విస్తరాకులు వేసి..... అందులో వేడి,వేడి చనా చాట్ వేసి....ఉప్పు,కారం,ఉల్లిపాయలు, కొత్తిమీరా ఇంకా ఏంటేంటో నాకు తెలీని పొడులు వేసి చకచకా ఒక స్పూన్ పెట్టి తిప్పి పైన నిమ్మకాయ పిండి ఒక తాటాకు ముక్క వేసి తినడానికి ఇచ్చాడు :) 

వేడివేడిగా పొగలు కక్కుతున్న ఆ మసాల చాట్ చూడగానే నా నోట్లో అప్రయత్నంగా నీళ్ళు ఊరిపోయాయి. అయినా ముందు డబ్బులు ఇచ్చి తర్వాత తిందాం అని 'ఎంత తాతా?' అని అడిగితే......'పాంచ్ రుపియా బేటి' అన్నాడు. 

'కేవ్వ్వ్వ్!' అనుకుని లోపలకెళ్ళి ఒక ఐదు రూపాయల బిళ్ళ తీసుకొచ్చి ఇచ్చా! చిరునవ్వుతో అది తీసుకుని ఆ బండి ముందుకు తోసుకుంటూ.....చిన్న గంట మ్రోగిన్చుకుంటూ వెళ్ళిపోయాడు మసాలా తాత.

బండి అటు వెళ్ళగానే ఇటు ఆ తాటాకు స్పూన్ తో ఆ చాట్ తీసి నోట్లో పెట్టుకున్నా......అంతే! అద్భుతం. ఎంత బాగుందంటే.....ఇప్పటివరకు నేను అంత రుచికరమైన చాట్ తినలేదు మళ్లీ. పనిలోపని మా అమ్మకి కూడా ఒక స్పూన్ పెట్టా. అలాగే అక్కడున్న సరోజ ఆంటికి, కుమారి ఆంటికి కూడా! అందరికీ బాగా నచ్చేసింది.

ఇక మరుసటి రోజు సరిగ్గా సాయంత్రం అయిదయ్యేసరికి మళ్లీ మేమందరం రోడ్డు మీద బైఠాయించాం! సరిగ్గా అదే టైముకి వచ్చాడు తాత. ఈసారి ఇరవై రూపాయల బిల్లు చేసాం :)

ఆ మర్నాడు, కుమారి ఆంటి ముగ్గురు అబ్బాయిలు నాని,కిట్టు,పవనూ, మా పక్కింట్లో ఉండే మూడు దయ్యాలు సలోమి,సుధా,సుజాత, మాధవి ఆంటి ఇద్దరూ పిల్లలు అమూల్య,అఖిల, నేనూ...... అందరం కలిసి ఆ చాట్ బండి మీద పడ్డాం. తాత ఫుల్ ఖుష్ ఆ రోజు. మేమందరం కూడా ఫుల్ హాపీస్!

ఇక వారం తిరిగేసరికి మా కిట్టుగాడి క్రికెట్ ఫ్రెండ్స్ అందరూ సాయంత్రం ఐదు అయ్యిందంటే ఆ బండి చుట్టు మూగేసేవారు. మా ఇంటిముందు పెద్ద తురాయి చెట్టు ఉండటంతో ఆ చెట్టు క్రింద బండి నిలిపేవాడు తాత. ఇక ఎంతమంది జనామో! మా కాలని అంతా తాత మసాలాకి ఫిదా అయిపోయారు. ఇంతమందిలోను నన్ను బాగా గుర్తుపెట్టుకునేవాడు తాత. అందరికంటే కూసింత ఎక్కువే పడేది నా వాటా మసాలాచాట్ పోట్లంలో! :) 

కొద్దిరోజులకి గిరాకి బాగా ఎక్కువైపోయేసరికి తన బుల్లి మనవరాలు రేష్మాని తీసుకొచ్చేవాడు సహాయానికి. ఆ అమ్మాయి సన్నగా,బక్కపలచగా ఉన్నా ముఖం ఎంత కళగా ఉండేదో! అలాగే పొడుగైన జడ కూడా! ఆ పాప చిన్ని చిన్ని చేతులతో అందరికీ చాట్ పొట్లాలు అందిస్తుంటే ఒక్కోసారి బాధేసేది. కానీ ఆ అమ్మాయి ఎంతో చలాకీగా,హుషారుగా పని చేస్తూ ఉంటే ముచ్చటేసేది కూడా! 

మా ఆంటివాళ్ళు అరుగుమీద కూర్చుంటే వాళ్ళు బండి దగ్గరకి వచ్చే అవసరంలేకుండా రేష్మా చేత చాట్ పంపేవాడు తాత. నేను వాళ్ళతోపాటే కూర్చునివుంటే 'దీదీ' అనుకుంటూ బుజ్జిగా వచ్చి ఇచ్చేది :) ఎంత ముద్దొస్తూ ఉండేదో!

అలా ముచ్చటగా నాలుగు వీధులు ఉండే మా కాలనీలో తాత,రేష్మ ఫేమస్ అయిపోయారు. మా వీధి చివర మెయిన్ రోడ్డు కలిసే చోట పానీపూరి బండ్లు రెండు వెలసినా తాత మసాల చాట్ కి ఏ ఆటంకము కలిగేది కాదు. అదేమిటో రోజు ఠంచనుగా ఐదింటికి వచ్చే తాత, ఏడింటికి బేరాలన్ని త్వరగా పూర్తిచేసి  వెళ్ళిపోయేవాడు. ఆదివారాలు మాత్రం అస్సలు కనిపించేవాడు కాదు. పోన్లే రెస్ట్ తీసుకుంటాడేమో అనుకునేదాన్ని. 

తాతలో నాకు బాగా నచ్చేది తన చిరునవ్వు. ఎంతమంది కస్టమర్లు ఉన్నా.....అస్సలు విసుగన్నదే ఉండదు ఆ ముఖం మీద. అంతే కాదు.....తాత చాట్ బండి ఎంత నీట్ గా మెయింటెయిన్ చేసేవాడో! డబ్బాలు....చాట్ కలిపే స్పూన్లు అన్నీ చాలా నీట్గా ఉండేవి. అలాగే నన్ను చూసినప్పుడల్లా.... ఏమి మాట్లాడకపోయినా 'బేటి' అంటూ ఆప్యాయంగా అందించే మసాలా పొట్లం ఆ రుచిని అమాంతం పెంచేసేది :) ఇలా మూడు నెలలు పండగ చేసుకున్నా నేను ;)

ఇంతలోనే నా కౌన్సెలింగ్ జరగడం,నేనూ ఇంజినీరింగ్లో జాయిన్ అవడం......రోజు సాయంత్రాలు 'సి' లాంగ్వేజ్ కోచింగ్ క్లాసెస్కి వెళ్లి ఇంటికొచ్చేసరికి ఏడు-ఎనిమిది అయ్యేది. ముందు కొద్దిరోజులు తాత మసాలా మిస్ అయినా క్రమంగా చదువు గోలలో పడి మర్చిపోయా. కానీ అప్పుడప్పుడు తాత గురించి అమ్మని అడుగుతూనే ఉండేదాన్ని. 

ఇక దసరా సెలవులు ఒక వారం రోజులు ఇచ్చారు మాకు. అప్పుడు మళ్లీ తాత దగ్గర మసాలా తిన్నాను. ఎంత ఆనందమేసిందో! తాతకి కూడా నన్ను చూస్తే బోలెడు సంతోషం :) 

మళ్లీ సెలవులు అయిపోయాక మామూలే! ఇక మళ్లీ తాతని చూసే అవకాసం ఎప్పుడు రాలేదు. ఎప్పుడన్నా సెలవులు వచ్చినా మేము ఊర్లకి వెళ్ళడం.....ఇలా ఏదో ఒకటి ఉండటంతో అలా తాతని చూసి చాలా కాలమే అయిపోయింది. 

సెకెండ్ ఇయర్ నేనూ హాస్టల్ లో చేరా! ఇక పూర్తిగా ఈ విషయం మరుగున పడిపోయింది. 

ఒకసారి ఎందుకో గుర్తొచ్చి మాటల మధ్యలో అమ్మని అడిగా!

'తాత ఇంకా వస్తున్నాడా అమ్మా! ఎలా ఉన్నాడు? రేష్మా ఎలా ఉంది?' అని.
'తాతకి ఈమధ్య ఒంట్లో బాగుండటం లేదట. అందుకే కొద్ది రోజులు మసాల బండి రేష్మ,రేష్మ వాళ్ళ అన్నయ్య చూసుకున్నారు. చిన్నపిల్లలు వాళ్ళకేం వచ్చు తాత లాగా రుచికరంగా చేయడం? ఏదో వాళ్ళకి తెలిసినట్టు చేసేవారు. కొద్దిరోజులకి సరైన బేరాలు రాక వాళ్ళు మానేశారు. ఇప్పుడు ఎవరూ మసాల బండి వేయట్లేదు' అని చెప్పింది.

ఎంత బాదేసిందో! తాతకి ఏమి కాకుండా త్వరగా కోలుకుని మళ్లీ మసాల బండి వేయాలని కోరుకున్నా!

కానీ ఆ తర్వాత రేష్మ,వాళ్ళ అన్నయ్య పానిపూరి బండి పెట్టారట మెయిన్ రోడ్డు మీద. మా అమ్మ వాళ్ళదగ్గర ఒకసారి తాత గురించి వాకబు చేస్తే తెలిసిందట.....తాత ఇక లేరని :(

ఎంత బాదేసిందో.....ఆ మాట వింటుంటే! తాత చేతిలో అమృతమైపోయే చాట్...... ఎంత పని ఒత్తిడున్నా తన ముఖం పై చెరగని చిరునవ్వు.......... ఆ గుంటలు పడిన కళ్ళలో నామీద చూపించే అభిమానం,ఆప్యాయత గుర్తొచ్చి చాలా బాధేసింది.

ఏంటో ఈ బంధాలు...... చిత్రంగా కలుస్తాము.......... అంతే చిత్రంగా విడిపోతాము! ప్చ్! ఏంటో కదా!

మళ్లీ ఇన్నాళ్టికి 'మసాలా తాతని' గుర్తుచేసిన మన కొత్తావకాయగారికి బోలెడు బోలెడు ధన్యవాదాలు :) 

21, ఆగస్టు 2011, ఆదివారం

ఒక బృందావనం!!

బృందావనం.......
ఆ పదమే ఒక పులకింత.....ఆ తలపే ఒక మైమరపు....
ఏ క్షణాన....ఆ సుందర లోకంలో అడుగుపెడతానా...అని నా తనువు నిలువెల్లా కనులై  ఎదురుచూస్తున్నది.....
'కృష్ణా!....మనసు ఎందుకో ఉత్తుంగతరంగమై ఎగసి....ఎగసి....నా మోమును సుతారంగా తాకివెల్లిపోతున్న ఆ  పిల్లతిమ్మెరల మీద సాగిపోతోన్న నీ మురళీగానాన్ని ఓడిసిపట్టుకోవాలని ఆత్రపడిపోతోంది!! ఎందుకో దానికి అంత తొందర? 
వచ్చేస్తున్నాను స్వామీ....నీ దివ్యమనోహర లోకానికి....
నీ మృదుపదస్పర్శతో పునీతమైన ఆ నందనవనంలో ప్రతి రేణువు నీ పాదరజమే కదా!
నీ రూపాన్ని నిండారా నింపుకున్న నీ సుధాధామంలో ఒక్క క్షణం నిలిచినా నా జన్మ ధన్యమవును కదా!'

ఈ ఆలోచనల్లో మునిగిపోతూ..... ఆ ఆనందలోకంలో తేలియాడుతుండగానే వచ్చేసింది 'బృందావనం'....నా కలలవనం...

నాతోపాటు వచ్చిన మిత్రబృందం అంతా తమతమ సామాన్లతో బస్సు దిగి...ముందు నడుస్తున్నారు.....
నేను మాత్రం....బస్సు దిగే ముందే....ఆ 'బృందావనం' అధిదేవత అయిన 'రాధారాణి'ని మనసులోనే అనుమతి అడిగి....నమస్కరించి....బస్సు దిగి పరమపవిత్రమైన ఆ మృత్తికని చేతితో స్పృశించి....శిరస్సున ధరించాను!
ఏదో ఒక అనిర్వచనీయమైన అనుభూతి... నన్నునిలువనీయట్లేదు.....ఆ అనుభూతిలోనే మెల్లగా నడుస్తూ....నా నేస్తాలను అనుసరించాను!

చుట్టూ చూసాను! నా కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయ్! ఏదో చూడాలని ఆశపడుతున్నాయ్! ఏదో కనుగొనాలని ఆత్రపడుతున్నాయ్!! కానీ ఎక్కడ? 

మెల్లగా అలా ముందుకు సాగుతున్నాను.....ఎంతకీ ఆ నందనవనం కానరాదే??
ఇదేనా బృందావనం? అని ఎవరినైనా అడగాలనిపించింది. కానీ కళ్ళముందు ప్రత్యక్షంగా కనపడుతోంది.... మరి నా మనసేమో.... 'ఇది కాదు నేను చూడాలనుకున్న బృందావనం' అని గోలచేస్తోంది.ఇదేమి పట్టించుకోకుండా కెమెరాలతో కనపడినదల్లా ఫోటోలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు నా మిత్రబృందం. వారివెంట జీవంలేనిదానిలాగా నడుస్తున్నాను నేను!

నా భుజాన వ్రేలాడుతున్న కృష్ణుడిముఖచిత్రం ఉన్న హాండ్ బాగ్....బరువుగా అనిపించింది. అందులో కృష్ణుడిమీద రాసిన వేలవేల పాటలు కలిగి ఉన్న పుస్తకం ఉంది. ఈ బృందావనంలో ఆ దేవదేవునికి అంకితం చేద్దామని తెచ్చి పెట్టుకున్న ఆ పుస్తకం.....దీనంగా నావంక చూస్తున్నట్టు అనిపిస్తోంది....

ఆ పుస్తకంలో ఐదువేల పాటలు రాయాలని నా సంకల్పం....ఇప్పటికీ 4999 రాసి....ఆ చివరి పాట ఈ బృందావన క్షేత్రంలో....ఈ సుమనోహర ప్రదేశాన్ని వీక్షిస్తూ....వ్రాసి....నా సంకల్పాన్ని నెరవేర్చి ఆ స్వామి పాదాలకి ఈ పాటలతోటని అంకితమివ్వాలని ఆశ పడ్డా!! కానీ ఏమని వ్రాయను?? ఎలా రాయగలను??? 

జయదేవుడు వర్ణించిన ఆ అద్భుత సౌందర్య అద్వితీయ సుందర నందనవనం ఇదేనా?
నా లీలామోహనుడు....ప్రతినిత్యం రాధాదేవితో రాసలీలలాడే రససామ్రాజ్యం ఇదేనా?
నా మురళీధరుడు తన సఖీసమూహంతో ఆటలాడిన వ్రజ భూమి ఇదేనా?
"మాధవికా....పరిమళ లలితే....నవ మాలతి జాతి సుగంధౌ!!" అని అన్నారే జయదేవులు....మరి ఎక్కడ ఆ మాధవీలతలు? ఎక్కడ ఆ మాలతిపుష్పగంధాలు?
"లలితలవంగలతా పరిశీలన...కోమలమలయసమీరే....మధుకరనికర కరమబ్బిత కోకిల...కూజిత కుంజ కుటీరే!" ఈ కీర్తనకి అర్ధం? ఏవి ఆ లతలతో అల్లుకున నికుంజాలు?? ఫల,పుష్పవృక్షాలతో అలరారే కుటీరాలు? కమ్మని కోయిలల కిలకిలా స్వరాలు?

నా కళ్ళవెంట నీటి తడి! ఎదలో ఏదో మూల అలజడి! ఎక్కడికక్కడ షాపులు..... రకరకాల వస్తువులు అమ్ముతూ నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు..... వస్తువులు కొన్నా కొనకపోయినా కనీసం చూసినా ఖరీదు కట్టమని నిలదీసే వర్తకులు.... విపరీతమైన వానరసేన.....ఇరుకిరుకు సందులు..... పాతకాలంనాటి ఇళ్ళు... కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కుడ్యాలు..... తోసుకుంటూ తిరిగే జనాలు..... అంతకంటే వేగంగా సంచరించే అపరిశుభ్ర గోగణం.... భక్తిభావం అసలు లేకుండా అంతా గోలగోలగా ఓహ్! ఇక నావల్ల  కాలేదు..... నాకు అస్సలు అడుగు ముందుకువేయబుద్ది కాలేదు.... ఇక ఏమీ చూడాలనిపించలేదు!! ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించగా.... అక్కడే ఒక షాపు దగ్గర కూలబడ్డాను! అప్రయత్నంగా నా కనురెప్పలు మూతపడ్డాయి..... మనసుమాత్రం కృష్ణనామజపంలో మునిగిపోయింది! అలా ఎంతసేపున్నానో తెలీదు....

క్రమంగా చీకటిపడిపోయింది.... లేచి చూసేసరికి ఎవ్వరూ లేరు.... నా స్నేహితులు....మమ్మల్ని తీసుకొచ్చిన బస్సు....ఆ మనుషులు.........ఎవ్వరూ లేరు....

దిగ్గున లేచాను! వెనక్కి తిరిగాను....అంతే! మాటాలు రాక చేష్టలుడిగిపోయి మైనపుబోమ్మలా అలా చూస్తూ ఉండిపోయాను! నాకళ్ళను నేనే నమ్మలేకపోయాను!

ఇందాక చూసిన రోడ్ల స్థానే పచ్చటి తివాచి పరిచినట్టున్న నందనవనాలు..... ఇంతింతేసి పువ్వులతో విరగబూస్తున్నాయి...... అంతే కాదు..... ఎప్పుడు కనివిని ఎరుగని రకరకాల ఫలాలతో విరగగాసిన చెట్లు ఆ ఫలభారంతో కొంచెం ముందుకు వంగాయి కూడా! పెద్దపెద్ద చెట్లు.... వాటిని బలంగా అల్లుకుని ఒకచెట్టునించి ఇంకో చెట్టుకి బంధం వేస్తున్న లతలు.... ఆ లతల్ని ఆధారంగా చేసుకుని ఉయ్యాలలూగుతున్న అందమైన గోపికలు..... ఆకాశంలో నక్షత్రాలన్నీ గుదిగుచ్చి తారాతోరణం కట్టినట్టు అంతటా వెలుగుజిలుగులు.... ఎటూ చూసినా.... కన్నెపడుచులు.... నవ్వుతూ.... తుళ్ళుతూ.... ఆటలు ఆడుతూ... పాటలు పాడుతూ.... అబ్బ! ఆ పాటలు తేనెలతేటలులాగా ఎంత బాగున్నాయో.......అలా ఆ వింతలన్నీ అబ్బురంగా చూస్తూ ముందుకు సాగాను!

రకరకాల పక్షుల కిలకిలారావాలతో,కమ్మని పూల పరిమళాలతో ఆ దారంతా ఆహ్లాదంగా ఉంది! కాళ్ళకింద ఆ పూలపుప్పొడి జారిపడి సుతిమెత్తగా తగులుతోంది.... చల్లని మలయమారుతం నా శ్వాసలో మమేకమౌతోంది..... ఆ పువ్వులని... ఆ ఆకులను చేతులతో తాకుతుంటే  ఏదో పులకింత! అలా... ఆ తోటలో..... ఆ పొదరిళ్ళ మధ్యలో...... ఆ చుక్కల పరదా క్రింద మెత్తమెత్తగా నడుస్తూ వెళుతుంటే..... వినిపించింది..... ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతున్న గలగలల సవ్వడి! "యమున....అది యమునా నదే!!" అనుకుంటూ పరుగుపరుగున వెళ్లి చూద్దునుకదా...... అదేమిటో.... నల్లగాఉండే యమున..... పున్నమి చంద్రుడి వెన్నెలకి కాబోలు.... ధవళ కాంతులతో ధగధగలాడుతోంది.... యమున ఒడ్డున ఉన్న సైకత రేణువులు... హిమరజములా అన్నంతగా మెరిసిపోతున్నాయ్! యమున ఎంత ఉవ్వెత్తున ఎగసిపడుతోందంటే...... బృందావనంలోకి వచ్చేసి ఆ అందమంతా తన చేతులతో స్పృశించాలి అనుకునేంతగా!! ఇక నెలరాజు అందం చెప్పనలవికానంతగా ఉంది..... నా కృష్ణుడి మోమల్లె!!

ఇంతలో ఎక్కడినించో.... కిలకిలమని నవ్వులు..... కోలాహలాలు...... మంద్రస్వరంలో గానం వినిపిస్తున్నాయ్! అటు వైపు తలతిప్పి చూస్తే..... ఒక పెద్దదేవగన్నేరు వృక్షం..... చెట్టునిండా పూలే..... అల్లంతదూరానికి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయ్! దానికింద.... బుల్లిబుల్లి తువ్వాయిలు గెంతులేస్తున్నాయ్! ఇంతంత తోకలతో నెమళ్ళు అటు,ఇటు తెగ హడావిడిగా తిరిగేస్తున్నాయ్! ఇంకా చాలామంది గోపీగోపికలనుకుంటా నృత్యాలు చేస్తున్నారు...... అటు వైపు వెళదామని నడక సాగించాను! దారిలో నా కాలికి అక్కడక్కడా చిన్నిచిన్నికుందేలుపిల్లలు అడ్డుపడుతున్నాయ్..... వాటిని పట్టుకుందామని..... ఒకదానివెంట పరుగుతీసాను..... ఇంతలో ఎక్కడినించి వచ్చిందో...... ఒక చిన్నారి జింకపిల్ల బెదురుబెదురుగా చూస్తూ.... నావైపు వచ్చి నన్ను చూడగానే..... పారిపోబోయింది...... నేను దానివేనకే పరుగు మొదలుపెట్టాను.....


అది... .నన్ను ఎక్కడికేక్కడికో తీసుకెళ్ళింది...... ఏవేవో వనాలు తిప్పింది..... దారిలో ఎన్నో వింతలను చూపించింది...... అయినా దానికి అలుపు రాదే! నాకు ఆయసమోచ్చేస్తోంది..... ఇంతలో ఒక పొన్నచెట్టు కనపడితే.... అక్కడ కాసేపు ఆగాను!

 ఈ జింకపిల్ల ఎటువేల్లిపోయింది అని అనుకుంటూ.... మెల్లగా ముందుకు వెళుతుంటే.... అక్కడ  ఏదో ఒక సుప్రకాశం నాకు దగ్గరవుతోంది.... క్రమంగా అది ఒక ఆకృతిని సంతరించుకుంటోంది.... నాకు బాగా పరిచయమున్న వ్యక్తిలాగే అగుపిస్తోంది....... ఆ వ్యక్తి దగ్గరయ్యే కొద్దీ దివ్యచందన పరిమళమేదో నా మేనిని చుట్టేస్తోంది..... ఒక నీలకాంతి ఆ ప్రదేశమంతా పరుచుకుంది..... ఒక మురళీరవం నా చెవుల్లో అమృతం పోస్తోంది..... ఒక అందెలరవళి నా గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది.... ఒక తులసిమాల నా చేతులకు అందే దూరంలో నిల్చుని ఉంది.... ఒక నెమలిపింఛం ఆ మణిమయ కిరీటంలో ఒదిగిపోయింది...... ఒక కస్తూరితిలకం నా కళ్ళకు స్పష్టంగా..... అతి దగ్గరగా కనిపిస్తోంది...... ఒక అచ్చెరువొందే సౌందర్యం ఒలికిస్తున్న నేత్రద్వయం నావైపు చూసింది! సమస్త సృష్టిని స్తంభింపజేసే ఒక చిరునవ్వు ఆ మోమున విరిసింది.... నా గుండె వేగం రెట్టింపయ్యింది...... నా ఊపిరి  క్రమంగా బరువైపోతోంది ...... నా శరీరంలో ఆణువణువూ కంపిస్తోంది..... కానీ పెదవులు మాత్రం........ అతి కష్టం మీద  పెగుల్చుకుని ఒక్క పదం ఉఛ్ఛరించాయి..... 'కృష్ణా!'

అంతే.... లేచి చూసేసరికి చుట్టూరా నా స్నేహితులు..... కంగారుగా నా కళ్ళలోకి చూస్తున్నారు! 'అరె.... ఇప్పుడే కదా... ఇంత దగ్గరగా చూసాను.... ఆ నీలమేఘశ్యాముడిని..ఏడీ?? నా కృష్ణుడు ఏడీ?'...... నాకంతా అయోమయంగా ఉంది..... 'అంటే....ఇదంతా కలా? అయ్యో.... నిజమైతే ఎంతబాగుండేది?' ఒక్క క్షణం దుఖం తన్నుకొచ్చింది.....

'కృష్ణా! ఇదంతా నిజమైతే  బాగుండు కదా....ఎందుకిలా చేసావ్? కనిపించినట్టే కనిపించి మాయమయ్యావా కన్నయ్యా?' అని బాధగా మనసు అడుగుతుంటే.... కళ్ళు శ్రావణమేఘాల్లా వర్షిస్తున్నాయి..... ఎందుకో అప్రయత్నంగా నా హ్యాండ్ బాగ్లో చేయి పెట్టాను..... నా పాటల పుస్తకం బైటకు తీశాను! ఇంకొక్క పాట.... ఒకేఒక పాట రాస్తే...... ఇక ఈ బృందావనవిహారికి అంకితమివ్వొచ్చు!! కానీ ఇప్పుడు ఈ బాధలో.... ఎలా?నావల్ల కాదు.... ఇక ఇప్పటికీ ఇంతే ప్రాప్తం.... మళ్లీ ఎప్పుడు ఈ పుస్తకం పూర్తి చేస్తానో..... ఈ గోపాలునికి ఎప్పుడు అర్పితం చేస్తానో.... అనుకుంటూ...... చివరి పేజి తెరిచాను.....

ఆశ్చర్యం!!!!..... నా గుండె ఒక్క క్షణం  ఆగి కొట్టుకుంది......
నా చేతివ్రాతలో రాసి ఉంది... నా 5000వ పాట! ఇందాక కలలో నేను విన్న ఆ గోపికలు పాడిన పాట! కానీ... ఇది ఎలా సాధ్యం? అంటే.... ఇందాక నేను చూసింది..... కలా? నిజమా?.....

వేవేల మురళీస్వరాలు ఒక్కసారిగా చుట్టుముట్టిన అనుభూతి.....
రంగురంగుల పూలబంతై ఊయలూగుతున్నట్టున్న జగతి....
నన్నల్లుకుపోతున్న మధురాధిపతి అందించిన మధురగీతి. 

ఒక్కసారి ఆ దేవదేవుని మనసారా స్మరించి......కృష్ణస్పర్శతో పునీతమైన ఆ పాటల పుస్తకాన్ని ఆర్తితో ముద్దాడి నా మురళీమనోహరుడి దివ్యచరణాలవిందాలకు సమర్పించాను!
  


[కృష్ణాష్టమి సందర్భంగా వ్రాసిన ఈ బుల్లి కథ నా బుజ్జి కిట్టుగాడికి అంకితం :) ]