5, అక్టోబర్ 2010, మంగళవారం

బుజ్జి పిల్లి నోట శివుని పాట.

' టాకింగ్ టాం'... iPhone లో ఈమధ్య వచ్చిన ఫన్నీ App.మనం ఏది అంటే అదే అనే పిల్లి ఇది.


దానితో 'మహేష్ ఖలేజ' లో ని 'సదా శివ' పాట పాడించి ఎవరో Youtube  లో పెట్టారు...

నాకైతే భలే నచ్చేసింది.బుజ్జి నోటి తో ఎంత ముద్దుగా పాడుతోందో...

మీరు చూడండి...ఈ  బుజ్జి పిల్లి పాట ని ....


4, అక్టోబర్ 2010, సోమవారం

ఆకాశం హొయలు...

ఆకాశమనే కాన్వాసు పై...తన సువర్ణ కిరణాలను కుంచెగా మలచి...సూర్యారావు గారు  గీసిన అపురూప చిత్రాలు....










నిన్న సాయంత్రం బైటికెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నపుడు ఆకాశం లో కనిపించిన సుందర దృశ్యాలు ఇవి....


2, అక్టోబర్ 2010, శనివారం

చిరు జల్లులు....

పొద్దున నించి ముసురు పట్టింది..సన్నగా వర్షం పడుతోంది...
అదేదో పార్క్ లో 'ఫాల్ ఫెస్ట్' ఉంది...వెళ్దాం అనుకున్నాం....కానీ ఈ వర్షం దెబ్బకి ఇంట్లోనే ఉండిపోయాం....
ఒక చినుకు..అర చినుకు...అలా కురుస్తూనే ఉంది కానీ కాసేపైన రెస్ట్ తీసుకుని మమ్మల్ని కనికరించోచ్చుగా!!
గాలి బాగా వీస్తోందేమో  చెట్లు దయ్యాల్లా ఊగుతున్నాయ్....మా ఇంటి ఎదురు ఉన్న చెట్టు ఊగటమే కాక ఆకులు కూడా తెగ  రాలుస్తోంది...
నాకేమో బైటికెళ్ళి అలా అలా తిరగాలనుంది....కానీ ఆ చలికి తట్టుకోలేము వద్దు అని చందు వాదన :(
నిజమే కాబోలు  పొద్దునించి అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియా లో ఒక్క కార్ కూడా కదలలేదు....
అసలు వర్షం వస్తే ఇంట్లో కూర్చుని ఉండటం ఎంత కష్టమో నాకు....ఎప్పుడెప్పుడు బైటికెళ్ళి తడుద్దామా అనే!!కానీ జలుబు...అదీ ఇది అని ఏవేవో వంకలు చెప్తారు అందరూ....నాకేమో చిరాకు.... 
హ్మ్....ఇక చేసేదేమీ లేక కిటికీ లోనించి అలా వర్షాన్ని చూస్తూ ఆనందిస్తున్నా...అలా చూస్తూ ఉంటే ఏదన్నా కవిత రాయాలనిపించింది...కానీ ఏమి రాయబుద్ది కావట్లేదు....మనసు జ్ఞాపకాల పేజీలు వెనక్కి తిప్పుతోంది...


నేను ఇంజనీరింగ్ చదివేటపుడు...హాస్టల్ లో ఉండే రోజుల్లో....ఒక సారి బాగా వర్షం పడింది....కాసేపు ఒద్దులే,బాగోదేమో అని ఊరుకున్నా ఇక ఆగలేక డాబా మీదకి గొడుగు వేసుకెళ్ళి నేను,రాజి,ఫణిత ఇంకా తన చెల్లెళ్ళు... అందరం భలే ఆడుకున్నాం.....తెచ్చిన గోడుగుని ఎక్కడో పడేసి,డాబా మీద నిలిచి పోయిన నీళ్ళలో గెంతుతూ...ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు జల్లుకుంటూ......ఆ వర్షం లోనే చలి వేస్తున్నా దొంగ-పోలిస్ ఆట ఆడుకుంటూ....వర్షం లో తడిసి ముద్దవుతున్న పూలను ముద్దుపెట్టుకుంటూ..... ఆహా!! ఎంత హాయిగా గడిచిపోయాయి ఆ రోజులు! ఆ తరువాత రూం లో తలుపు దగ్గర కుర్చీలో కూర్చుని...ఆ చినుకులు చేసే చప్పుడు ఆస్వాదిస్తూ...ఆ మట్టి వాసన ఆఘ్రానిస్తూ....ఆ వర్షాన్నే చూస్తున్న నాకు ఒక కవిత రాయాలనిపించింది...అప్పటికప్పుడు పెన్ను,పేపరు పట్టుకుని రాసేసా!!.....ఆంటీ వేసిన వేడి వేడి పకోడిలతోపాటు నా బుర్ర కూడా తినేస్తోన్న రాజి నేను రాస్తున్న పేపర్ లాగేసుకుని మరీ  చూసింది.అప్పటిదాకా మనకి ఇలాంటి ఒక వ్యాపకం ఉందని తెలీని రాజి....అది చూసి ఒక పిచ్చి మొహం పెట్టింది...'ఏంటి అంత చండాలంగా రాశాన?' అని నేను దిగాలుగా మొహం  పెట్టాను....'కవిత బానే ఉంది కానీ నాకు కొన్ని కొన్ని వర్డ్స్ మీనింగ్స్ తెలీదే!' అంది...అప్పుడు తట్టింది నాకు  మేడం గారు సెంట్రల్ స్కూల్ లో చదివారని. తరువాత నా కవితల దయవల్ల రాజీకి తెలుగు బానే వచ్చింది....అలాగే నా ప్రతి కవిత కి బలి అయింది కూడా పాపం రాజినే... 


ఏంటో!! ఏమైపోయాయో ఆ రోజులు....వర్షం లో ఆటలు...వెన్నెల్లో ముచ్చట్లు....చుక్కల్ని లెక్కబెడుతూ చెప్పుకునే కబుర్లు.....జీవితం పై ఎన్నెన్నో ఆశలు....కళ్ళలో ఎన్నెన్నో రంగుల కలలు.... 


అప్పటి విశేషాలు ఇప్పటి జ్ఞాపకాలైపోయాయి....నిన్న,మొన్న జరిగినట్టే ఉన్నాయి...కాలేజి వదిలిపెట్టి అప్పుడే రెండు సంవత్సరాలైపోయిందా అనిపిస్తోంది....కాలం పరుగు చాలా వేగం కదా!!...

30, సెప్టెంబర్ 2010, గురువారం

ఏంటబ్బా!! ఇంత సహనం??

పొద్దున్నే లేచి కొన్ని తెలుగు వెబ్ సైట్లు చూసాక నాకు వచ్చిన డౌట్ ఇది...
'అయోధ్య' విషయం లో మన వాళ్ళు ఇంత సంయమనం పాటించారా???
ఏ గొడవలు...కొట్లాటలు...అల్లర్లు లేకుండా...60 సంవత్సరాలు కోర్టులో మగ్గిపోయిన తీర్పు బైటికొచ్చిందా?? 
అయినదానికీ కానిదానికీ గొడవలు చేసి...కోడి గుడ్డు కి ఈకలు పీకే రాజకీయ నాయకులు నోళ్ళు మెదపలేదా??? 
చీమ చిట్టుక్కు మన్నా రాద్ధాంతం  చేసే 'మీడియా'...అదీ 'చర్చలు' అనే పేరుతొ 'చిచ్చులు' పెట్టె టీ.వి.9 లాంటి ఛానళ్ళు అసలు ఈ విషయం  గురించి అంతగా పట్టించుకోలేదా?? 
అటు కాకి ఇటు వాలినా...ఇటు కాకి అటు వాలినా.....బందులు...బస్సులు తగలబెట్టడాలు....రాస్తా రోకోలు...వీధుల్లో విధ్వంసాలు సృష్టించే అల్లరి మూకలు తోకలు ముడిచారా?? 
ఆ ఎవరెటు పొతే నాకేంటి అని నిమ్మకు నీరేత్తని పోలీసు వారు...గట్టి గా పహారా కాశారా?? 


అయ్యబాబోయ్!! ఇది ఇండియా నే?? 
ఇది ప్రతి దాన్ని హైలైట్  చేసే మీడియా నే??
వీళ్ళు మన డబ్బులు తిని బొజ్జలు పెంచిన రాజకీయ నాయకులే??
వీధుల్లో గలాటా చేయకుండా ఇంత బుద్ధిగా ఇళ్ళలో కూర్చుని ఉంది మన అల్లరి మూకలే??
తుపాకి ఎక్కుపెట్టి అందరి తలలు వంచగలిగింది మన పోలీసోల్లె??


ఇదంతా నిజామా?? నేను పగటిపూట కూడా కల కంటున్నానా?? 
వామ్మో!!వార్నాయనో!!
అర్జెంటుగా నిన్న తెచ్చుకున్న 'గులాబ్ జామ్' మిక్చరు తో ఇవాళ స్వీట్ చేసేయాల్సిందే...
మన ఇండియా లో ఇంత సహనం,ఓపిక,సామరస్యం....నేను పుట్టాక ఇప్పుడేనేమో బహుశా చూడడం...
ఇప్పుడిప్పుడే  నాకు ఆశ  కలుగుతోంది..మన దేశం కూడా బాగుపడుతుందేమో అని....

జై భారత్ మాత...
జై జై భారత్ మాత...

27, సెప్టెంబర్ 2010, సోమవారం

రెహ్మాన్ సంగీతంతో ప్రతిధ్వనించిన 'సిల్వర్ డోం'

నిన్న 'పాంటియాక్ సిల్వర్ డోం' లో...ఏ.ఆర్.రెహ్మాన్ 'జయహో' షో జరిగింది.రాత్రి 8 గంటలకు మొదలైన ఈ కార్యక్రమం రెహ్మాన్ చేస్తోన్న 'జయహో' ప్రపంచ యాత్ర లో భాగం.సరిగ్గా మూడు నెలల క్రితం జరగాల్సిన ఈ కార్యక్రమం కొన్ని అవాంతరాలవల్ల ఆగిపోయి,ఈ సారి ఎటువంటి ఆటంకాలు లేకుండా కన్నుల పండువగా జరిగింది.రెహ్మాన్ కి ఫాను ఇంకా ఏ.సి. కూడా అయినా నేను వెళ్ళకపోతే ఎలా?? అందుకే పాపం చందు కి రేపు పరీక్ష ఉన్నా తీసుకెళ్లా.సరిగ్గా టైం కి వెళ్ళిన మేము..స్టేజి కి ఎదురుగా  కూర్చున్నాం.'వ్యూ' బాగుంది అనుకున్నా...కానీ జనాలు పెద్ద గా లేరు.చాలా సీట్లు ఖాలీ ఉన్నాయి.


ముందుగా తన కీర్తిని ఇనుమడింప చేసిన 'వందే మాతరం' గీతం తో షో కి స్వాగతం పలికిన రెహ్మాన్ మెల్లగా  తన మాయ మొదలు పెట్టాడు.ఇంతలో కృష్ణ-ప్రసన్న వాళ్ళు కూర్చున్న దగ్గరకి మమ్మల్ని రమ్మన్నారు....సరే అని అక్కడికి వెళ్లి...ముందు ఇంకా చాలా సీట్లు ఖాళి ఉన్నాయని అక్కడికి కుర్చిల మీద నించి దూకుతూ వెళ్లి (ఎక్కడికెళ్ళినా  మన బుద్ది పోతుందా??!!)కూర్చున్నాం ...ఇంతలో ఎప్పుడొచ్చాడో  'రోజా' సినిమా లో 'వినరా..వినరా'(తెలుగు లో కాదులెండి....తమిళం లో) పాడుతూ  'హరిహరన్' వచ్చాడు'.హరిహరన్ గాత్రం గురించి చెప్పేదేముంది?? అది నాకు ఇష్టమైన పాట....ఒక్కసారి తెలుగు లో 'వినరా....వినరా' అంటే బాగుండు అనుకున్నా...ఊహు!! నిరాశే మిగిలింది...ఆ తరువాత లతామంగేష్కర్ తో కలిసి రెహ్మాన్ పాడిన  గీతం ఈ షో కే హైలైట్.ఇంతకీ లతామంగేష్కర్ అక్కడ ఉంటే వింతేముంది?? లతామంగేష్కర్ పాడిన రికార్డెడ్ వాయిస్ తో...స్టేజి మీద ఆమె 3D -లేసర్ ప్రొజెక్షన్ తో  రెహ్మాన్ పాడిన గీతం అద్భుతం.ఆ తరువాత 'మైకేల్ జాక్సన్' పాటల్లో ప్రముఖమైన 'బ్లాక్ ఆర్ వైట్' పాడాడు....దానికి ఒక చిన్న పిల్లాడు...జాక్సన్ స్టయిల్ లో 'మూన్ వాక్' చేస్తూ చేసిన డాన్స్ సూపర్...ఆ తరువాత ఎన్నో అద్భుతమైన పాటలు పాడాడు...మధ్య మధ్యలో వర్ధమాన గాయని గాయకులతో కొన్ని పాడించాడు....



తరువాత హరిహరన్ పాడుతూ ఉంటే దానికి రెహ్మాన్ 'హర్మనీ' వాయిస్తూ...కొంచెం సేపు గాన కచేరి చేసారు.... అప్పటికి ఒక్క తెలుగు ముక్క చెవికి సోకక...తమిళ,హిందీ హోరు తో తుప్పు పట్టిన మా చెవులలో  'ఓ చెలియా! నా ప్రియ సఖియా!! చేజారెను నా మనసే!!' అని పాడి అమృతం పోసాడు ఒక వర్ధమాన  గాయకుడు...అంతే!! చందు-కృష్ణ-ప్రసన్న తో సహా అక్కడ ఉన్న చాలామంది తెలుగువారు అందరూ ఈలలు...చప్పట్లు....బాబోయ్ అదిరిపోయింది....(తెలుగోడి సత్తా అపుడు తెలిసి ఉంటుంది రెహ్మాన్ కి).....కానీ మా ఆనందం ఎంతో సేపు నిలవలేదు....ఎందుకంటే పాడింది ఆ ఒక్క ముక్కే కాబట్టి!!
ఆ తరువాత మత సామరస్యానికి చిహ్నంగా అన్నిమతాలకు సంబంధించిన రెహ్మాన్ స్వరపరిచిన గీతాలు పాడారు....అప్పుడు వచ్చిన 'జోధ-అక్బర్' లో 'ఖ్వాజా మేరె ఖ్వాజా' పాట కి మేము కూడా సినిమా లో లాగే చప్పట్లు  కొట్టాం.


తరువాత వచ్చిన 'రోబో' లో ఒక పాట మాత్రం అన్నిటికంటే నాకు బాగా నచ్చింది...చెప్పాలంటే ఆడిటోరియం దద్దరిల్లింది...రెహ్మాన్ మాజిక్ ఏంటో తెలిసేలా చేసింది...తరువాత ఆల్ టైం హిట్స్ అయిన 'చయ్య!!చయ్య!!'...'దిల్సే రే!!'...'రింగా రింగా' లాంటి పాటలతో హోరెత్తించిన రెహ్మాన్ 'పప్పు కాంట్ డాన్స్!!'(జానే తు..హిందీ సినిమా లో ది) పాట తో అందరి చేత డాన్స్ కూడా చేయించాడు....అందరూ లేచి ఎవరి ఇష్టం వచ్చినట్లు  వారు డాన్స్ చేయడమే!! ఈలలు..చప్పట్లు...గోల..గోల...ఆ తరువాత కాసేపు చట్నీ సాంగ్స్ (తెలుగు,హిందీ,తమిళం అన్నీ కలిపేసి పాడారు).....కానీ ఇందులో కూడా ఒక్క తెలుగు ముక్కే ఉంది...'ఈ హృదయం...' అంటూ పాడాడు...పోన్లే ఏం చేస్తాం!! నేనైతే...దీనికే మురిసిపోయి ఓ తెగ చప్పట్లు కొట్టేసా!!...తరువాత మళ్లీ తన 'వందేమాతరం' గీతం పాడి...'జయహో' పాట తో షో ని ముగించాడు రెహ్మాన్...


షో లో స్టేజి డెకొరేషన్,లైటింగ్,ఆర్కెస్ట్రా అద్భుతం....ప్రతి పాటకి అనుగుణంగా స్టేజి మీద వచ్చే బాగ్రౌండ్స్ చాలా బాగున్నాయ్!!....రెహ్మాన్ కూడా సాధ్యమైనన్ని పాటలు తానె పాడాడు.కానీ,నిరాశపరిచింది మాత్రం 'హరిహరన్ ఎక్కువ పాడకపోవడం '.......'తెలుగు పాట లేకపోవడం'.మన తెలుగు వాళ్ళు....'తెలుగు తెలుగు' అని అరిచిన అరుపుల తో  'తెలుగు సినిమా పరిశ్రమ' కూడా ఒకటుందని....అందులో తాను కూడా పని చేసానని... తెలుగు వాళ్ళు విదేశాల్లో కూడా చాలామంది ఉంటారు అని రెహ్మాన్ గారు కొంచెం గుర్తుకు తెచ్చుకుంటే చాలు!!


రెహ్మాన్ జయహో షో పిక్స్ ఇక్కడ:








22, సెప్టెంబర్ 2010, బుధవారం

నిను చూడక...

'నిను చూడక...నేనుండలేను...'


ఈ ముక్క ఎవరితో అంటున్నాను అనుకుంటున్నారా??? ఇంకెవరితో...నా చిరకాల నేస్తం 'న్యూస్ పేపర్' తో....చూసి ఎన్ని రోజులైపోయిందో....అదేమిటి అంతగా కావాలంటే 'ఈ-పేపర్' చూసుకోవచ్చు కదా అని అనొచ్చు....కానీ పొద్దున్నే లేచి చక్కగా వేడి వేడి టీ తాగుతూ... అలా అలా పేజీలు తిప్పుతూ... పేపర్  చదివితే వొచ్చే ఆనందం ఈ 'ఈ-పేపర్' లో ఏం వస్తుంది???ఇప్పుడంటే...ఈ-పేపర్,ఆ-పేపర్ అని వచ్చాయి కానీ ఇదివరకు అందరిళ్ళలోను(పండగలకి పబ్బాలకి తప్ప) క్రమం తప్పకుండా పొద్దున్నే పాలవాడితోపాటు మేలుకోలిపేది పేపర్ యే కదా ...


నాకున్న అతి తక్కువ మంచి అలవాట్లలో ఈ పేపర్ చదవడం ఒకటి అని నా ఫీలింగ్...చిన్నప్పుడు అనగా నా నాల్గవ తరగతి లో ఈనాడు ఆదివారం లో వేసే 'బాలవినోదిని' తో మొదలైన  నా పత్రికాపఠనం....మెల్లగా  'మొగ్గ' తొడిగి....అంచెలంచెలుగా ఎదిగి...ఆఖరికి 'పేపర్' రాని రోజున దిగులు పడే దాక వచ్చింది.....పేపర్ మొదటి పేజి దగ్గర  నించి చివరి దాక నమిలి మింగేసాక పక్క వాళ్ళకి ఇచ్చేదాన్ని..అప్పటిదాకా నన్ను ఎవరన్నా కదిలిస్తే  'కాళికా' అవతారమే......


నాకు సాధారణంగా పొద్దున్నే లేచే చెడ్డ అలవాటు లేకపోయినా..ఈ పేపర్ దయ వల్ల అది కూడా అబ్బింది. ఠంచనుగా పేపర్ బాయ్ పేపర్ మా ఇంటి గుమ్మం లో విసిరేలోగా తలుపు తీసేదాన్ని....ఒకవేళ ఆ రోజు పేపర్ ఇంకా రాకపోతే కనీసం మొహం కూడా కడుక్కోకుండా అలాగే మెట్ల మీద ఎదురు చూస్తూ ఉండేదాన్ని....ఒక్కోసారి 'దీపావళి','సంక్రాతి' పండగలు వెళ్ళిన మరుసటి రోజున పేపర్ రాదు అని తెలిసినా పోరాపాటులో అలవాటు లాగ పొద్దున్నే లేచి..కాసేపు పేపర్ కోసం చూసి ..'ఐతే నిజంగానే ఇవాళ పేపర్ రాదు అన్నమాట' అని నిర్ధారించుకుని మళ్లీ నిద్ర కు ఉపక్రమించేదాన్ని...కాలేజి కి వెళ్ళే రోజుల్లో...ఇంట్లో చదవడానికి వీలు చిక్కకపోతే బాగ్ లో పెట్టేసుకుని బస్ ఎక్కిన తరువాత హాయిగా చదివేసేదాన్ని....చివరికి అమీర్పేట్ లో హాస్టల్ లో ఉన్నపుడు  కూడా అందరికంటే ముందు లేచి పేపర్ మొత్తం నమిలేసి అప్పుడు వెళ్లి మళ్లీ పడుకునేదాన్ని....నా పేపర్ వీక్నెస్ కనిపెట్టిన మా అమ్మ,తమ్ముడు ఒక్కోసారి నాకంటే ముందే నిద్ర లేచి పేపర్ దాచిపెట్టేసి నన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు  తాగించేవారు....ఆ టైం లో చచ్చినట్టు వాళ్ళు చెప్పిన పనల్లా చేసేదాన్ని.....అందరూ కలిసి నాకు 'పేపర్ పురుగు' అని నామకరణం కూడా చేసారు....


ఎన్ని కష్టాలు ఎదురైనా పేపర్ చదవడం మాత్రం మానుకోలేకపోయా...ఆఖరికి బెంగళూరు మహిమ వల్ల అప్రతిహతంగా సాగుతున్న నా పేపర్ పఠనానికి బ్రేక్ పడింది.ముందు కొద్దిరోజులు అక్కడా పేపర్ తెప్పించా!! కానీ రాను రాను పని వత్తిడి ఎక్కువవడం తో...పేపర్ వాడు వేసే పేపర్ కట్టలు కట్టలు బాల్కనిలో చెత్తలా పేరుకుపోవడం చూడలేక వేయించడం ఆపేసా!! నా బాధ చూసి ప్రతి శని,ఆదివారాలు చందు పేపర్ తీసుకురావడం తో కొంత ఉపశమనం ఉండేది....


కానీ...నా జీవితం లో ఇలా నెలలకి నెలలు...అస్సలు పేపర్ తాకకుండా ఉండే సందర్భం ఒకటి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు......ఆదివారాలు తీరిగ్గా కూర్చుని....వేడి వేడి ఉప్మా లో పంచదార జల్లుకుని తింటూ ...మధ్యలో టీ తాగుతూ....'సండే స్పెషల్' లో వచ్చే కథ  చదువుతూ ఉంటే....ఆహ!! ఆ ఊహే ఎంత బాగుంది!!


ఇంకా ఎన్నాళ్ళో ...ఎన్నేళ్లో......ఈ ఎదురుచూపులు...



'నిను చూడక...నేనుండలేను...'

18, సెప్టెంబర్ 2010, శనివారం

భలే భలే డెట్రాయిట్ జూ...

అదేంటో మరి....నాకు జూ అంటే భలే ఇష్టం...నా చిన్నప్పుడు ఎప్పుడు చూసినా ఆ హైదరాబాద్ 'నెహ్రు జూలాజికల్ పార్క్' కి తీసుకెళ్ళేవారు....అక్కడ జంతువులు తక్కువ నడక ఎక్కువ.....అంతకుమించి నేను ఏ 'జూ' కి వెళ్ళలేదు :( కానీ నా జూ చూడాలనే కోరిక అలాగే ఉండిపోయింది.బెంగుళూరు లో ఉండేటపుడు కొన్ని వందల సార్లు అనుకున్నా 'బన్నెర్ఘట్ట' జూ కి వెళ్ళాలని.....కానీ ఏంచేస్తాం!! 8 నెలల్లో  ఒక్కరోజు కూడా 'జూ' కి వెళ్ళడానికి వీలుపడలేదు....కానీ బెంగుళూరు కి 150కి.మీ దూరం లో ఉన్న 'మైసూరు జూ' కి మాత్రం వెళ్ళా :D ....ఈ 'జూ' ఉపోద్ఘాతమంతా ఎందుకంటే 'డెట్రాయిట్' వచ్చాక...ఇంచుమించు ప్రతి వారాంతం ...'జూ'...'జూ' అని నామజపమే...'తీసుకెళ్తే గాని మనశ్శాంతి లేదు' అని డిసైడ్ అయి చందు క్రిందటి  వారమే నాకు 'జూ' సందర్శనం చేయించడం జరిగింది :) మరి నాకు నచ్చిన పని చేసేస్తే వెంటనే అందరికీ చెప్పేయాలి కదా!! అలా ఫోనులో గంట మా అమ్మ-నాన్న కి జూ మొత్తం వర్ణించా!! ఇక ఇప్పుడు మీకు అన్నమాట :)


అన్నీ 'జూ' లలో ఉండే విధంగానే....ఇక్కడ కూడా 'పులులు,సింహాలు,ఎలుగుబంట్లు,ఖడ్గమృగాలు ,జిరాఫీలు,చారాల గుర్రాలు,జింకలు, పాములు,కప్పలు, తొండలు,మొసళ్ళు,రకరకాల పక్షులు' ఉన్నాయి....ఇక వీటి గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు......కానీ టీ.వి.లో తప్ప నిజంగా నా  జీవితంలో చూస్తాను అని అనుకోని కొన్నిటిని మాత్రం చూసేసా!! అవే 'పెంగ్విన్లు,ధృవపు ఎలుగుబంటి,ఆర్క్టిక్ నక్క,సీల్స్,మీర్కాట్స్,ప్రైరీ డాగ్స్,ఏంట్ ఈటర్స్,రెడ్ పాండా,కంగారు,ట్రీ కంగారు,రెండు మూపురాల ఒంటె,మూపురం లేని ఒంటె'......కానీ మనం ఎప్పుడూ చూసే కోతులు,ఏనుగులు,చింపాంజీలు(వీటికోసం పెద్ద జాగా ఏర్పాటు చేసారు కానీ నాకు  ఎక్కడా కనిపించలేదు) ఇక్కడ లేవు :( 


బుడి బుడి అడుగులేస్తూ బుజ్జిగా నడుస్తున్న పెంగ్విన్లని చూస్తే ఎంత ముచ్చటేసిందో.......వాటికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'పెంగ్వినేరియం' అద్భుతం.....ఇక 'ఆర్క్టిక్ సర్కిల్' లో చక్కగా గడ్డి లో బజ్జోని నిద్రపోతున్న 'ధృవపు ఎలుగుబంటి' గారు తెలుపు+పసుపు రంగులో మెరిసిపోతున్నారు....దాని పక్కనే బిత్తరచూపులు చూస్తున్న 'ఆర్క్టిక్ నక్క' ఎంత చిన్నగా ఉందో...అక్కడినించి 'సీల్స్' చూడటానికి లోపలికేల్లాం...పైన అంతా నీరు కింద గాజు సొరంగం....అక్కడ నించి చూడాలి 'సీల్స్' విన్యాసాలు...అటు ఇటు ఈదుతూ...గెంతుతూ...వెల్లికల పడుకొని ఈత కొడుతూ....ఆహా!! ఏమి ఆడుకుంటున్నాయో!! ఇక 'మీర్కాట్స్' విషయానికి వస్తే వాటికి ప్రత్యేకమైన వసతి ఏర్పాటు చేసారు...ఇసుక,రాళ్ళు-రప్పలు,ఎండు కొమ్మలు  పెట్టారు...అవి ఇసుకలో దూరి తలపైకెత్తి చూస్తూ ఉంటాయ్...అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయ్ ...ఇక ప్రైరీ డాగ్స్ ఐతే  బుజ్జిగా చిన్న చిన్న తోకలు వేసుకుని ఇసుకలోకి దూరి,ఎండు గడ్డి తింటూ భలే ఉన్నాయ్...ఏంట్ ఈటర్స్ పెద్ద పెద్దగా ఉండి సూది లాంటి ముక్కు తో కుచ్చు తోకతో అటు ఇటు హడావిడిగా తిరిగెస్తూ వింతగా ఉన్నాయ్.... కంగారులు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి....ఇక్కడ ఒక చిన్న ప్రదేశం లో వాటిని స్వేచ్చగా వదిలేసారు...మనం వాటి మధ్యలోగుండా నడుచుకుంటూ వెళ్ళవచ్చు....దగ్గరగా  చూడొచ్చు....ఫోటోలు తీసుకోవచ్చు....కానీ మేము వెళ్లేసరికి అవి అలసిపోయి చెట్టు నీడలో పడుకున్నాయ్!!.....ఇక రెండు మూపురాల ఒంటె-మూపురం లేని ఒంటె నేను చూడటం అదే ప్రధమం....అలాగే పక్షుల దగ్గర,సీతాకోకచిలుకల దగ్గర మనం లోపలికెళ్ళి వాటి మధ్య తిరగొచ్చు....పెద్ద పెద్ద నీలిరంగు సీతాకోకచిలుకలు, ఎర్ర కొంగలు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఇక జూ అంత తమదే అన్నట్టు కలివిడిగా తిరిగేస్తున్నాయ్ అందాల నెమళ్ళు....


ఆ తరువాత 3D -4D 'వైల్డ్ ఆఫ్రికా' షో  కి వెళ్ళాం....10 నిముషాలు సాగే ఈ షో చాలా బాగుంది....అందరికీ 3D  గ్లాసెస్ ఇచ్చారు.ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నాక షో మొదలయింది.ఏనుగు ఘీంకరిస్తే ఆ చప్పుడు కి ధియేటర్ మొత్తం అదిరిపోయింది....అలాగే ఖడ్గమృగం హుంకరిస్తే ఆ గాలి మాకు కొట్టింది...ఏనుగు తొండం తో నీటిని స్క్రీన్ మీదకి చిమ్మితే మా  మీద నీళ్ళు చల్లారు...చారాల గుర్రం కి ఒక వేటగాడు బాణం వేస్తె  సీట్ లో నించి మాకు గుచ్చుకున్నట్టు ఉంది .ఒక సింహం ఇంకో సింహాన్ని కొడితే మనల్ని ఎవరో కొట్టినట్టు ఉంది......ఇలా 4D - ఎఫ్ఫెక్ట్లతో షో భలే ఉంది :) ఇది అందరూ తప్పక చూడాల్సిన షో.


అలా షుమారు 4  గంటలు పట్టింది మాకు జూ మొత్తం చూడటానికి. కానీ నేను ఇప్పటిదాకా చూసినవాటికంటే ఇది బెస్ట్ జూ...జంతువుల్ని ఎంతో శ్రద గా,వాటి సహజ వాతావరణం సృష్టించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా  చూస్తున్నారు.  నాకు ఇది బాగా నచ్చింది. ఇక్కడ సావనీర్ గా నాకు అన్నిటిలోకి బాగా నచ్చిన 'పెంగ్విన్' కి గుర్తు గా 'పింక్ పెంగ్విన్' ని తీసుకున్నా!! బుజ్జిది ఎంత బాగుందో!! దానికి 'ప్రెట్టి' అని నామకరణం కూడా చేసేసా :)


ఇవండీ  నా 'డెట్రాయిట్ జూ' సందర్సన విశేషాలు.....


జూ ఫోటోలు కొన్ని ఇక్కడ :


                                                                  పెంగ్విన్లు:

మీర్కాట్స్:


సీల్స్ :
                                                                              
ప్రైరీ డాగ్స్:
                      
                                                                  ధృవపు ఎలుగుబంటి


ఆర్క్టిక్ నక్క 
                                                                    
ఏంట్ ఈటర్స్:
కంగారు:
రెండు మూపురాల ఒంటె :
మూపురం లేని ఒంటె:
సీతాకోకచిలుక:

                          
నెమలి:
ఇక నా 'ప్రెట్టి' గాడు :