24, ఫిబ్రవరి 2011, గురువారం

మంచుకి ఎదురీత

ఎవరన్నా ఏటికి ఎదురీత అంటారు...ఇదేంటి ఈ పిల్ల 'మంచుకి ఎదురీత' అంటోంది అనుకుంటున్నారా? చెబుతా చెబుతా! మొన్న మేము చేసిన సాహస యాత్ర కబుర్లు చెబుతా ఆగండీ!!


మొన్న మధ్యాహ్నం మూడింటికి మా చందుగారు  ఇంటికొచ్చి 'పద పద! ఒహాయో వెళ్ళాలి!' అని తెగ తొందర పెట్టేసారు. 'ఒకసారి అటు చూసి చెప్పు' అని కిటికీ వైపు చూపించా. మంచు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయింది.... పైగా సన్నగా పడుతోంది కూడా. 'ఇప్పుడు నీకు ఒహాయో అవసరమా?' అన్నాను.అయినాసరే....'చెప్పాకదా! చాల ఇంపార్టెంట్ పని. ఇవాళ అయిపోవాలి అంతే! పద త్వరగా' అని హడావిడిగా బయలుదేరదీసాడు! మరి పట్టువదలని విక్రమార్కులు కదా ఏంచేస్తాం! ఇక ఎన్ని చెప్పినా ఇంతే...తాను పట్టిన కుందేలుకి పది కాళ్ళు అనే రకం కదా!  అని ఇక బయలుదేరా!


సుమారు మూడున్నరగంటల ప్రయాణం.అక్కడికి ఏడున్నరలోగా చేరాలి అని ఒక డొక్కు టార్గెట్ మళ్లీ మాకు! అసలే ముందురోజు రాత్రి అంతా మంచు కురిసింది.రోడ్లు సరిగ్గా క్లీన్ చేయలేదు.గడ్డగట్టిన ఐస్ రోడ్డుకి అతుక్కుపోయింది.అది చాల ప్రమాదకరం.కార్లు ఈసీగా 'స్కిడ్' అయిపోతాయ్. నాకు గుండె పీచుపీచుమంటోంది.అయినా సరే మా చందుగారి ఆజ్ఞల మీద నోరుమూసుకుని కూర్చున్నా. మా ఇంటినించి 'ఫ్రీవే' మీదకి ఎక్కుతున్నప్పుడు 'రాంప్' మీద ఒకసారి కార్ స్కిడ్ అయింది.కాసేపు అటు ఇటు ఊగుతూ డిస్కో చేసింది.'మొదలయ్యింది దేవుడా! ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది అప్పుడేనా? కొంచెం గాప్ ఇవ్వు స్వామీ!!' అని దేవుడ్ని వేడుకున్నా. నా మాట ఆలకించాడేమో కొద్ది దూరం మాములుగానే కొంచెం కొంచెం జారుకుంటూ...అలా...అలా వెళుతూ ఉన్నాం.


ఇక కాసేపటికి భయంకరంగా మంచు కురవడం మొదలుపెట్టింది. మా ముందున్న కారు,వెనక కారు తప్ప నాకు ఇంకేం కనిపించట్లేదు.దూరంగా ఉన్న బ్రిడ్జి...పక్కన ఉన్న ఇంకో రోడ్డు..దానిమీద వెహికల్స్.....ఏమి కనిపించట్లేదు. నల్లటి రోడ్డు....దాని మీద ఉండే తెల్ల గీతలు ఏమి కనపడకుండా అలుక్కుపోయాయి మంచుతో!'చందు ఇప్పుడు ఇంత వైలెన్స్ తో కూడిన జర్నీ అవసరమా?' అని బిక్కమొహం వేసి అడిగా! 'నేను ఇలాంటి క్లైమేట్లో న్యూయార్క్ దాకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళా! ఏంపర్లేదు! నువ్వు కంగారు పడకు....నన్ను కంగారు పెట్టకు' అని రిప్లై వచ్చింది. సర్లే అసలే టెన్షన్లో ఉన్నాడు...మధ్యలో నేనెందుకు కదిలించుకుని మరీ తిట్లు తినడం అని ఊరుకున్నా. ఇక కొద్దిసేపటికి రోడ్డు మీద మంచు అంతా గాలికి పైకి లేస్తూ చక్కర్లు కొట్టసాగింది....నాకైతే ఆకాశంలో....మేఘాల్లో తేలిపోతున్న ఫీలింగ్. కార్లో ఉన్నానో....ఫ్లైట్లో ఉన్నానో ఒక నిమిషం అర్ధం కాలేదు.ఇక ఈ మంచుగాలి దెబ్బకి ముందున్న రోడ్డు....కారు కూడా కనిపించట్లేదు.కారు మధ్య మధ్యలో జర్రు జర్రు అని జారుతోంది.....పక్కనేమో దయ్యాల్లాగా ఇంతింత ట్రక్కులు యమా ఫాస్టుగా వెళుతూ తట్టెడు మంచు మా మొహం మీద కొట్టి పోతున్నాయ్. అలాగే కనిపించని రోడ్డుమీద.... కనిపించని కార్ల మధ్య.....మంచుకి ఎదురీదుతూ మా విక్రమార్కుడు ముందుకు సాగిపోతున్నాడు.


ఇంతలో ఒక రెస్ట్ ఏరియా వచ్చింది.చందుని అక్కడ ఆపమని చెప్పా. 'స్టార్బక్స్ లో ఒక కాఫీ తాగి అపుడు కంటిన్యు అవుదాం' అని చెప్పా. సరే అన్నాడు.అసలు నా ఉద్దేశం....ఆ కాఫీ తాగే టైమ్లో ఎలాగైనా మనసు మార్చి కారు వెనక్కి తిప్పించేద్దామని.సరే కాఫీ తీసుకున్నాం. కాసేపు కూర్చుని తాగుదాం చందు అంటే.....'టైం వేస్ట్ వెళుతూ తాగొచ్చు కదా పద!' అన్నాడు.'అది కాదు చందు...ఇప్పుడు ఎందుకు చెప్పు ప్రాణాలకు తెగించి ఒహాయో వెళ్ళడం అంత అవసరమా?? చూడు ఎంత డేంజరస్గా ఉందో! నా మాట విను చందు.రేపు పొద్దున్న బయలుదేరదాం.ప్లీజ్' అన్నా. 'సరే! ఇంకో టెన్ మైల్స్ చూసి....అప్పటికి ఇలాగే ఉంటె వెనక్కి తిరుగుదాం లే. సరేనా!' అన్నాడు.హమ్మయ్య ఏదో గుడ్డిలో మెల్ల అని ఊపిరి పీల్చుకున్నా.కాని నా ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బైటికి రాగానే మంచు కురవడం చాలా తగ్గిపోయింది(ఈ దేశంలో ఇంతే! ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరు చెప్పలేరు).నావంక ఒక చూపు చూసి....ఒక నవ్వు విసిరి...ఇక కారు తీసి ఝామ్మంటూ దూసుకుపోయాడు మా విక్రమార్కుడు.


'సర్లే! ఏంచేస్తాం!'అని ఊరుకున్నా.ఒక అరగంట ప్రయాణం బానే సాగింది.మళ్లీ మొదలైంది గాలితో కూడిన మంచు.నేను 'దేవుడా! దేవుడా!' అనుకుంటూ కూర్చున్నా. అంతే! ధడేల్మని పెద్ద శబ్దం! మా కార్ బాగా స్కిడ్ అయ్యి ...జుయ్ జుయ్... అని జారుకుంటూ వెళ్లి డివైడర్ కి గుద్దుకుంది. కార్ అస్సలు కంట్రోల్ అవ్వడంలేదు.చందు కార్ ని డివైడర్ కి దూరంగా తేవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు.కాని అది రానంటోంది. దానికి డివైడర్ బాగా నచ్చినట్టుంది....మాటిమాటికి దానిదగ్గరకి వెళ్ళడం.... చందునేమో.... 'ఒద్దమ్మా! అలా ఇందులాగా గోల చేయకూడదు....మాట వినాలి....ఇలా వచ్చేయ్ రోడ్డు మీదకి' అని బ్రతిమిలాడటం. ఇలా కారుని బ్రతిమిలాడి... లాడి... అప్పుడు రోడ్డుమీదకి తెచ్చాడు.ఈలోగా నా పైప్రాణాలు పైనే పోయాయి. అసలు ఇదే ప్రధమం నా లైఫ్లో.ఎన్ని ప్రయాణాలు చేసానో! ఊటీలో ఒకసారి భయపడ్డా కానీ ఇది టూమచ్! నేను కార్ హాండిల్ని,ఆర్మ్ రెస్ట్ని గాట్టిగా పట్టుకుని కూర్చున్నా.అరవలేదు.... కరవలేదు.... అసలు షాక్ తిన్నా! చందు మాత్రం ఏమి జరగనట్టు చిద్విలాసంగా డ్రైవింగ్ కొనసాగించాడు. 'భయపడ్డావా?' అన్నాడు.దానికి సమాధానం చెప్పే సీన్ కూడా లేదు నాకు.


ఒక పావుగంటకి తేరుకున్నానో లేదో....ఇంకో సంఘటన.చాలా మంది కాప్స్ ఉన్నారు.ఏమిటా అని చూస్తే....పెద్ద ట్రక్కు స్కిడ్ అయ్యి డివైడర్ కి  గుద్దుకుని దాన్లోనించి దూసుకెళ్ళి పక్కనున్న రోడ్లోకి  వెళ్ళిపోయింది.ఆ అడ్డం తిరిగిన ట్రక్కుకి గుద్దుకుని రెండు కార్లు నుజ్జునుజ్జు! నేను మళ్లీ....'కేవ్వ్వ్!!' కాని అప్పటికే సగం పైగా దూరం వచ్చేసాం. ఇక వెనుదిరిగే ప్రసక్తే లేదు.అదీ మా విక్రమార్కుల వారు అస్సలు ససేమీరా.అలాగే ఆ మంచులో....మా కారుతో ఈదుకుంటూ మేము చేరవలసిన గమ్యం చేరాము.కాని ఈ మధ్యలో ఎన్ని ఆక్సిడెంట్లో! పక్కకి స్కిడ్ అయి జారిపోయిన ట్రక్కులు,కార్లు,మంచులో ఇరుక్కుపోయిన కార్లు....వాళ్లకి సహాయం చేస్తూ కాప్ కార్స్...అబ్బబ్బ! ఎన్ని దృస్యాలో!! ఇక ఒహాయోలో  చూడాల్సిన పని చూసుకుని....సరిగ్గా  గంటకి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం.అప్పుడు సమయం రాత్రి తొమ్మిది.


ఒహాయో అంతా విపరీతంగా మంచు కురుస్తోంది.ఇక చేసేది లేక అలాగే మెల్లగా జారుకుంటూ.... జారుకుంటూ.... వెళుతూ ఉన్నాం.ఈలోగా ఆకలేసి బర్గర్కింగ్ లో కాస్త మేత మేసి.... మళ్లీ మా మంచు ప్రయాణం మొదలు పెట్టాం. ఒక గంట బానే జరిగింది.కాని పెద్ద పెద్ద ట్రక్కులు.....అస్సలు రూల్సు పాడులేకుండా ఆ మంచులో డెబ్బై మీద రయ్యిన దూసుకెళుతున్నాయ్. అటు-ఇటు ట్రక్కులు...మధ్యలో మేము! నేనైతే వాటిని ఎన్ని తిట్టుకున్నానో! ఆ లాస్ట్ లేన్లో కదా అవి ఉండాల్సింది...ఇష్టం వచ్చినట్టు పోనిస్తున్నారు వెధవలు! ఈలోగా ట్రాఫిక్ జామ్. 'ఛి జీవితం! ఏది సవ్యంగా జరగదు' అనుకున్నా.అలా అరగంట గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే అప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసారు. తీరా చూస్తె కొద్ది దూరంలో ఆక్సిడెంట్.అందుకే ట్రాఫిక్ జామ్. నాలుగు ట్రక్కులు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయ్. చివరి ట్రక్....ముందు ట్రక్ నుజ్జు,నుజ్జు అయిపోయాయి.మధ్యలోవి గుడ్డిలో మెల్లలాగా బ్రతికి బైటపడ్డాయి.కళ్ళు నెత్తికి ఎక్కి మంచులో అంత స్పీడుతో పొతే అంతే మరి! కాని అదృష్టం....ఎవరికీ ఏమి కాలేదు.


'సరేలే! జాగ్రత్తగా పోనివ్వు చందు ఇంకా రెండున్నర గంటల జర్నీ బాకీ' అన్నాను. 'ఏముందిలే....అయిపోతుంది' అన్నాడు చందు.ఒక్క ఐదునిమిషాలు గడిచిందో లేదో....మా ముందు వెళుతున్న ట్రక్ సడన్ గా  స్కిడ్ అయింది. జర్రుమని జారుకుంటూ పక్కకు వెళ్ళిపోయి అడ్డం తిరిగేసింది.దాని వెనకాలే మేము ఉన్నాం.నాకు గుండె ఆగిపోయింది ఒక్క క్షణం.ఏముంది మేము వెళ్లి దానికి గుద్దుకోవడమే తరువాయి! అక్కడ మాకు కనీసం బ్రేక్ వేయడానికి కూడా లేదు. ఆ ట్రక్కు తోక వచ్చి మా కారుని గుద్దినా చాలు. నేను 'చందూ' అని పెద్దగా అరిచా. 'టెన్షన్ పడకు..ఏం కాదు...టెన్షన్ పడకు' అని చాలా ధైర్యంగా,చాకచక్యంతో  ఆ ట్రక్కు వెనకగుండా ఉన్న కొంచెం రోడ్డులో జాగ్రత్తగా కారు పోనిచ్చాడు చందు....ఎలాగైతేనేం బైటపడ్డాం!!మా వెనకాల వెహికల్స్ అన్ని ఆగిపోయాయి.ట్రక్కు రోడ్డుక్కి అడ్డం తిరిగిపోయింది.త్రుటిలో ఎంత పెద్ద ప్రమాదం తప్పించుకున్నామో  ఊహించుకుంటే ఇప్పటికీ గుండె గుభేలుమంటోంది.నాకైతే ఏడుపొచ్చేసింది! కళ్ళముందు అసలు అంత నారో ఎస్కేప్! దేవుడా! చాలాసేపటికి కానీ మామూలు కాలేకపోయా.పాపం ఆ ట్రక్కు డ్రైవర్ కి ఏమి కాకుండా ఉంటె బాగుండు! :(


చందు మాత్రం.....తదేక దీక్షతో...ఇవేమీ పట్టించుకోకుండా ఒక తపస్సులాగా అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకోచ్చేసాడు.ఇంచుమించు పదిగంటలు ఆపకుండా డ్రైవ్ చేసాడు. నాకు మళ్లీ మా ఇంటి మొహం చూస్తానని కూడా అనుకోలేదు.అంత భయమేసింది ఆ ఆక్సిడెంట్లు చూసి.... ఒక తొమ్మిది గంటలు......నిర్విరామ హాలీవుడ్ థ్రిల్లర్+హర్రర్ మూవీ చూసిన ఫీలింగ్!!


చావు అంటే ఇన్నాళ్ళు నేను పెద్ద లెక్కచేసేదాన్ని కాదు! కాని అంత దగ్గరగా చూసాక మొదటిసారి ప్రాణభీతి కలిగింది :))

దీనివలన తెలిసిన నీతి ఏంటయ్యా అంటే....ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా....కొంపలు మునిగిపోతున్నా.....ఊళ్లు కొట్టుకుపోతున్నా..... ఎప్పుడు మంచులో దూర ప్రయాణాలు పెట్టుకోకూడదు అని :D

29 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

చాలా సాహసయాత్ర చేసారన్నమాట :) గుడ్ .

kiran చెప్పారు...

హ్మ్న్న్..ఇందు మాకు కూడా ఒక త్రిల్లెర్ సినిమా చుపించేసావ్.. :)
కానీ గొప్ప నిజం తెలుసుకోవడమే కాక..అందరికి చెప్పావు..:)

లత చెప్పారు...

అమ్మో అంత ఎడ్వెంచర్ చేశారా

prabandhchowdary.pudota చెప్పారు...

నమస్కారం అండి,
నాకు అలాంటి అనుబవం ఉందండి...అదీ కొండలమీద..మరలా అధి గుర్తుకొచ్చింది.....నార్వే లో కూడా అంతే అండి...ఎప్పుడు ఎలా వుంటాదో చెప్పలేం...

cbrao చెప్పారు...

ఇంత గగుర్పాటులో ఈ చిత్రాలు మీరు ఎలా తీశారు? జోహార్లు.

Padmarpita చెప్పారు...

Really a good adventure:)

Unknown చెప్పారు...

అమ్మో ఇందు .. చదువుతున్నంత సేపు చాల భయం వేసింది .. ఇంకెప్పుడు అలాంటి ప్రయాణాలు చెయ్యకురా బాబు .. నాకున్నది ఒకే ఒక ఇందు :)
మీ చందు గారికి డేడ్లి వార్నింగ్ ఇచ్చేద్దామ చెప్పు .. మాటాడుత :)

Ennela చెప్పారు...

అమ్మాయ్, చందు గారు ఎప్పుడు ఖాళీగా ఉంటారో కనుక్కో..మా సీతయ్య కి ట్రయినింగ్ ఇప్పించాలి...చందు గారు కెనడాకి వచ్చెయ్యడానికి పర్ఫెక్ట్ లీ ఆల్ రైట్..ఇందూ గారూ మీరే పాపం..గుండె ఇంకాస్త చిక్కబట్టుకోడం ప్రాక్టీస్ చెయ్యాలి...

కృష్ణప్రియ చెప్పారు...

సేఫ్ గా వచ్చేసారుగా ఇంటికి.. అమ్మయ్య!

మనసు పలికే చెప్పారు...

ఇందూ.. హమ్మ బాబోయ్.. ఇట్టాంటి ప్రయాణాలు పెట్టుకోకమ్మా.. అసలే మన పాపికొండల ప్రయాణం, అందులో మన కచ్చేరీ, చాకొలెట్లు.. చాలా పనులు ఉన్నాయి మనకి. నిజంగానే హాలీవుడ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్లు ఉంది..:((

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నిజంగా త్రిల్లింగ్ అనుభవం అన్నమాట. మంచులో అనుభవం లేదు కానీ వర్షాకాలం లో బురదలో స్కూటరు నడపడం కూడా అంతే త్రిల్లింగ్ గా ఉంటుంది, వెనక్కాల కూచున్న వాళ్ళ రన్నింగ్ కామెంటరీ తో. :):)

Sirisha చెప్పారు...

good that u r safe with a thrilling and scary experience..

Rajesh చెప్పారు...

10 hours drive in snow storm is really tiresome and dangerous. veyyandi mee chandu gaariki oka veera thaadu.

I would have pulled over and checked in a hotel till they cleaned the roads.

సుమలత చెప్పారు...

ఆహా! త్రిల్లంగ్ అండి ...బలే రాసారు

SHANKAR.S చెప్పారు...

"ఇందు" మూలంగా అందరికీ తెలియజేయునదేమనగా మంచు పడుతున్నప్పుడు డ్రైవింగ్ మహా థ్రిల్లింగ్ గా ఉండును.
మీరు మరీనండీ ఇందు గారూ. మీకు ఎప్పుడో మంచు కురిసినప్పుడే స్కిడ్ అవడం లాంటి ఫీట్లు
మా హైదరాబాద్ నగరం లో రోడ్ల మీద కక్కుర్తి కాంట్రాక్టర్ వేసిన సన్న గులక రాళ్ళ(వీటిని చిప్స్ అంటారట ఖర్మ) మీద సడన్ బ్రేక్ వేస్తే మిడ్ సమ్మర్ లో కూడా జర్రున జారతాం. ఇంక మీ ట్రక్కుల కన్నా వంద రెంట్లు రెక్లెస్ గా వెళ్ళే ఆటోలు, సిటీ బస్సులు ఉన్నాయి ఇక్కడ.
ఇంకా నిఝామ్గా చెప్పాలంటే మీ అనుభవం లాంటిది హైదరాబాద్ లో నిత్యకృత్యం, మరదీ తెలుగోడంటే.

ఇందు చెప్పారు...

@మాలా కుమార్:అవునండీ మాలగారు :) చాలా పెద్ద సాహసయాత్ర :))

@ kiran :నేనెప్పుడు అంతే కిరణ్ :) ఆనందమైనా బాధైనా అందరితో పంచుకోవాల్సిందే! :)

@ లత :అవును లతగారూ! :(

ఇందు చెప్పారు...

@ prabandhchowdary.pudota:ఓహ్! కొండల్లోనా?? బాబోయ్! ఎలా మేనేజ్ చేసారండీ బాబూ!! అవును ఈ వాతావరణాన్ని అస్సలు అంచనా వేయలేం!

@cbrao:హయ్యోరామా! నాకంత సీన్ లేదండీ! అక్కడ కారు ఆపి ఫొటోలు తీసే దృస్యం కూడానా? హ్మ్! ఇవి గూగులమ్మ దయవల్ల దొరికిన ఫుటోలు :)

@ 'Padmarpita' : గుడ్ కాదు డేంజరస్ అడ్వెంచర్ :)

ఇందు చెప్పారు...

@ కావ్య :హ్హహ్హహ్హా! నీకేంటి కావ్య?? మంచివాళ్లకి ఊరంతా చుట్టాలే అన్నట్టు నీకు బ్లాగులోకమంతా ఫ్రెండ్సే! :)) చందుగారికి వార్నింగా?? ఇదేదో బాగుంది. ఆలోచిద్దాం ;)


@Ennela:చెప్పానుగా సమ్మర్లో మీమీద దాడి ఖాయం :)) నేనా? ప్రాక్టీసా? దేనికి? మంచులో డ్రైవింగ్ కా? లేక మంచులొ డ్రైవింగ్ చేస్తుంటే గుండె ధైర్యం చేసుకుని కూర్చోదానికా? ;)


@కృష్ణప్రియ:అవును కృష్ణప్రియగారూ! Reached safely!! :)

ఇందు చెప్పారు...

@ మనసు పలికే :హ్హహ్హహ్హా! అలాగేలే అప్పూ! నీదగ్గర గిటార్/వయోలిన్ నేర్చుకోకుండా నేను అలా? అందకైన ఉంటాలే ;) అవును సుమా! మనకి బోలెడు పనులున్నాయ్ :D

@ బులుసు సుబ్రహ్మణ్యం :హ్హెహ్హె! నాకు ఆ అనుభవమూ తెలుసు! ఐతే నడిపేది మా నాన్న! రన్నింగు కామెంటరీ నాది :))

@ Sirisha: Yes Sirisha! Im safe. nd Thnx for ur comment on previous post too!! :)

ఇందు చెప్పారు...

@ Rajesh:అంతేనంటారా? ఐతే చందుగారికి రాజేష్ గారి తరఫున ఒక వీరతాడు :) అవునండీ! ఎవరు వెళతారు చెప్పండీ ఆ టైంలో?


@సుమలత: Thrilling nd scary too :(


@SHANKAR.S :హ్హహ్హహ్హా! శంకర్ గారు మీరు అన్నది నిజమే! కానీ ఇది చాల డేంజరస్ అండీ! ఒకసారి కార్ స్కిడ ఐతే ఇక మన చేతుల్లో ఏమీ ఉండదు! నిజమే! వర్షం పడ్డప్పుడు అమీర్పేట్ లొ మోకాళ్ళ లోతు ఆ వర్షపునీటిలో ఈదుకుంటు క్లాసెస్ కి వెళ్ళిన రోజులున్నయ్! నాకు తెలుసండీ ఆ కష్టాలు :) కాని ఇది దానికంటే ఘోరం అని నా అభిప్రాయం అంతే! :)

lalithag చెప్పారు...

No (s)kidding!

రాధిక(నాని ) చెప్పారు...

మంచు లో మీ సాహస,త్రిల్లింగ్ యాత్ర విశేషాలు చాలా బాగా రాసారు :))

శివరంజని చెప్పారు...

ఇందు గారు అప్పుడప్పుడూ ఇలాంటి ఎడ్వెంచర్ కూడా చేస్తుంటారన్నమాట.......ఇంకెప్పుడు అలాంటి ప్రయాణాలు చెయ్యకు ఇందు గారు

ఏమిటొ పోస్ట్ లు రాయడం లోనే కాదు కామెంట్ లు పెట్టడం లో కూడా లేట్ నేను.....Excuse చేయాలి మీరు

ramki చెప్పారు...

సూపర్....
ఏమితెనేంటి ....మా ఊరు వచ్చి మాకు చెప్పకుండా వేల్లిపోతర....సర్లెండి.......
మీ ఈ పోస్టింగ్ చూస్తున్నంత సేపు నేను చేసిన ఫీట్లు కొన్ని గుర్తు వచ్హాయి....
అందులో కొన్ని మచ్చుక్కి....
1 . అప్పుడు మనం డ్రైవింగ్ కి కొత్త....2 నెలల డ్రైవింగ్ ....చాల ఫ్రెష్ .. మన విన్యాసాలు మొదలయ్యిన తోలి నాళ్ళు అనమాట... ఒకానొక స్నో storm రోజు ....చాల జాగర్తగా వళ్ళు దగ్గరపెట్టుకొని నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్న.....ఎందుకో రైట్ లానే కి మారుదాం అని పక్కకు జరగబోయాను....ఐస్ ఉన్నట్లుంది రోడ్ మీద....అంతే.....రైట్ లేన్ కి కాదు కదా....నా కార్ 180 డిగ్రీస్ గుండ్రంగా రోడ్ మీద స్కిడ్ అయ్యింది..... అంతే...కళ్ళు తెరిచి తేరుకొని చుస్తే బుఫ్ఫెర్ లానే లో వున్నా(లెఫ్ట్ లేన) ..... కాసేపు ఏమి జరిగిందో అర్ధం కాలేదు....అన్ని కార్లు నా వైపు వస్తున్నాయి.....అప్పుడు అర్ధం అయ్యింది ఎం జరిగిందో అని......అప్పటినుంచి చంద్రముఖి సినిమాలో ఎప్పుడు రాజినికంత introduction సీన్ చుసిన ఇదే గుర్తు వస్తుంది......
2. మొన్నటికి మొన్న మన డిట్రాయిట్ ఐర్పొర్ట్ కి వెళ్తుంటే BMW కార్ రాంప మీద ఇరుక్కుపోయింది.......
విపరీతమిన స్నో ....
అదిగో మీరు చెప్పినట్లే కార్లు డిస్కో డాన్సు చెయ్యటం మొదలయ్యింది....
ఎంతసేపటికి చూస్తే pickup అవ్వదే ఈ డొక్కులో BMW.... గుండ్రంగా చక్రాలు కొడుతున్నాడు కాని రోడ్ మీదకు రాదాయే .....ఇంకో వైపు ఏమో మా ఫ్లైట్ టైం ఇపోతోంది...
ఇంకేముంది.....షర్టు వెనక్కి మడిచి కార్ తోయ్యటానికి ఇంక నేను మా బావ రంగం లోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది.....
మీ కార్ లాగే ఆ కార్ కి కూడా రాంప మీద రైలింగ్ అంటే ఇష్టం లాగా ఉన్నట్లుంది...దీని దుంప తెగ మాటికి వస్తే అటేపు స్కిడ్ ఇపోతోందే....ఒక ప్రక్క విపరీతమిన స్నో ఇంకో వైపు వాడి కార్ ఎక్కడ రైలింగ్ కి గుదుకుంటుంది ఏమో అని టెన్షన్ ఇది చాలదు అన్నట్లు నా కాళ్ళు స్కిడ్ అవుతున్నాయి.....
దేవుడా వీడు ఈ రోజు ఈ రోడ్ మీద నుంచి పక్కకు జరిగేనా అని అనుకున్న....ఆఖరికి ....అది రోడ్ కి అడ్డగం (90 డిగ్రీ ల కోణం లో ) అరిగిపోయిన టైర్లు ఈడ్చుకుంటూ ఫ్రీవే ఎక్కేసరికి మల్లి మా మంచు యాత్ర మొదలయ్యింది....
ఆఖరికి ఈ జయత్ర యాత్ర లో ఫినిషింగ్ టచ్ ఏంటి అంటే .....ఈ వెధవ BMW గాడు మల్లి దార్లో కనపడ్డాడు....ఈ సరి ఫ్రీవే మీద డిస్కో పెట్టాడు....ఇంక నీ ఖర్మ అని వదిలేసం......

కాని మీ ఈ పోస్టింగ్ చదివినంత సేపు మీ మనసులో పాపం చందు గారిని ఎంత తిట్టుకున్నారో అర్ధం అయ్యింది....... :)
కాని అది ఏమి కనపడకుండా .....
ఫై పెచ్చు మీ కోపాన్ని చాల చక్కగా ఒక సాహసోపెతమిన జర్నీ ని జోడించి చక్కగా వర్ణించారు.... చాల బావుంది...
మొతానికి చందు గారు స్నో డ్రైవింగ్ లో పట్టభద్రులు ఇపోయారు.....మీరే లేట్ ఇంక...... :)

రాజ్ కుమార్ చెప్పారు...

వామ్మో.. మొత్తానికి సాహసయాత్ర చేశారన్నమాట

ramki చెప్పారు...

sorry ఇందు గారు....
కామెంట్ కొంచంగా రాద్దాం అనుకున్న......
ఏదో అనుకోకుండా అల పెద్దదిగా essay అయ్యి కూర్చుంది.... :P

ఇందు చెప్పారు...

@ lalithag : :))

@ రాధిక(నాని ) : Thankyou Raadhika garu :)

@శివరంజని:రంజనీ...కామెంట్లు లేటుగా పెట్టినా...అసలు పెట్టకపోయినా బాధపడను...కానీ నువ్వు మాత్రం పోస్టు రాసి మూడు నెలలు కావస్తోందీ!! ఇది టూమచ్! ఇప్పటికైనా రాయకపోతే....ఇక నో ఎక్స్క్యుసెస్! అంతే! Grrrrr!!


@రామకృష్ణ గారు..మీరు అంత పెద్ద కామెంట్ రాసినందుకు నేనేమీ ఫీల్ కాలేదండీ! మీరెంత ఎక్సైట్మెంట్ తో రాశారో నాకు అర్ధమయింది. నాకు కొంచెం వెరే పని ఉండి బ్లాగు వైపు రాలెదు.అందుకే వెంటేనే రిప్లై ఇవ్వలేకపోయా!

మీ ఫీట్లు బాగున్నాయండీ! బీయండబ్ల్యు అంత పని చేసిందా? ఆ కార్ నంబర్ ఉంటే చెప్పండీ...ఈసారి రోడ్డు మీద కనిపిస్తే...మంచులో కారు ఎలా నడపాలి అని చందు గారితో క్లాసులు పీకిద్దాం.అసలే మా చందుగారూ...పట్టభద్రులైపోయారని చెప్పారుగా! :))

నేను చందుని తిట్టుకోలేదుగానీ భయపడ్డా :(

మీరేమి సారీలు గట్రా చెప్పకండీ....మీరు మరీను! :))


@Raj Kumra: Avunu Raj. Sahasa yatra chesam :D

David చెప్పారు...

imdu gaaru...mee saahasa yaatra baabumdamdi....kaaseapu mammalni bayapeTTaaru mee prayaaNamtoa

ఇందు చెప్పారు...

@ డేవిడ్: hahahaah! Thnq David garu :)