2, ఆగస్టు 2011, మంగళవారం

తళతళా...మిలమిలా...

ఏమిటి ఇదేమన్న సర్ఫ్ ఎక్సెల్ ప్రకటన అనుకుంటున్నారా? హ్హేహ్హే...కాదుగాని... మా పాత ఇంటి ఇక్కట్లు...మీతో కాసిని పంచుకుందామని ఇటు వచ్చానన్నమాట!

మా ఇల్లు ఒక వెయ్యిచదరపుటడుగుల 'శ్వేతసౌధం' [అంటే అమెరిక ప్రెసిడెంటు ఇల్లుకి ట్రు కాపి అని కాదు నా అర్ధం..మరిన్ని వివరములకొరకు పూర్తీ టపా చదువుడి]
క్రితం సంవత్సరం ఆదరాబాదరా అమ్రికా వచ్చేసామా!? వచ్చిరాగానే మా చందు స్నేహితుల ఇంట్లో దిగాం! :) పాపం పదిరోజులు అక్కడే మకాం! ఈలోగా.... ఇల్లు కోసం కిందా మీదా పడి వెదికాం! ఒక్క అపార్టుమెంటు ఖాళీ లేదాయే! అన్నీ కొన్ని నెలలముందే అడ్వాన్స్ బుకింగ్ చేయించుకోవాల్ట! మరి మా గతి ఏమి??

ఈలోగా....మా కొండల ఊరంతా తవ్వి.....ఎలుకని కాకుండా ఏకంగా ఎలుగుబంటిని పట్టారు మా చందుగారు!! ఈ ఇల్లు చెప్పుకోడానికి సింగిల్ బెడ్రూం అయినా.....లంకంత వంటగది....సముద్రమంత బాత్రూముతో అలరారుతూ....నా ప్రాణానికి గుదిబండ అయ్యింది! ఉంటె ఉంది విశాలంగా......దీనికి తోడు....అంతా ధవళమయమే !! 

తెల్లటి ఫ్రిజ్జు,తెల్లటి పొయ్యితో సరిపెట్టకుండా......వంటగదంతా తెల్లటి తలుపులు...తెల్లటి అరలు...తెల్లటి గట్టు.... ఆఖరికి ఫ్లోరింగ్ కూడా తెలుపే! పోనీ గది కొంచెం చిన్నదైతే తెల్లగా ఉన్నా ఏదో రోజు తుడుచుకుంటూ మేనేజ్ చేయోచ్చు! అబ్బే...ఎంచక్కా ఒక బ్రేక్ఫాస్ట్ టేబిల్ కూడా వేసుకునేంత 'పెద్ద' కిచెన్ నాకవసరమా అధ్యక్షా?

అప్పటికే రెండు ఫ్లోర్ మేట్స్ తెచ్చి వేసా! అబ్బే! లాభం లేదు. రోజు వంట అయ్యాక ఆ జిడ్డుమరకలు తుడుచుకుని, కిందపడ్డ ఆవగింజలు మినప్పప్పుని వేటాడి, చెత్తాచెదారం శుబ్రం చేసేసరికి అందరు దేవుళ్ళు దిగోచ్చేవారు!

 దీనికి తోడు....మంచం వేసుకుని పడుకునేంత విశాలంగా ఇచ్చాడు ఆ బాత్రూం! ఇక్కడ బాత్రుం తలుపుంటే...ఆ మూలేక్కడో కనిపించి...కనిపించకుండా ఉంటుంది బాత్ టబ్! ఇక్కడా నేలంతా పాలసముద్రాన్ని తలపిస్తుంది! ఈ విపరీతాలకి తోడు మనకసలే జుట్టు రోజుకి కిలోల్లెక్కన ఊడిపోతుండడం వలన పొరబాటున బాత్రుమ్లో అద్దంలో చూసుకుని తల దువ్వుకుంటే.....తెల్లటి ఆ గచ్చుమీద నల్లటి నా వెంట్రుకలు చూస్తె  తిరుమలలో 'కళ్యాణ కట్ట' కళ్ళముందు కనపడుతుంది! :((

ఇక మిగితా ఇల్లంతా కార్పెట్ పరిచి నామీద దయతలిచాడు కాని లేకుంటేనా.....చచ్చేదాన్ని! ఇక ఈ సౌలభ్యాలకి తోడూ ఇక్కడ చీపుర్లు గట్రా ఉండవు గనుక....ఒక చిన్న బ్రష్షు తీసుకుని ఆ వంటగది,బాత్రుము చిమ్ముతుంటే ఏడుపోచ్చేదంటే నమ్మండి! వాక్యుం పెట్టొచ్చుగా అంటారేమో.....ఆ వాక్యుం ఘనకార్యలన్ని కార్పెట్ మీదే...ఈ హార్డ్ ఫ్లోర్ మీద చెల్లవు! బ్రష్శే గతి! ఒక్కోసారి నాకు ఇండియాలో ట్రైన్లలో బోగీలు ఊడ్చే చిన్నపిల్లలు గుర్తోచ్చేవారు! :(

ఇక విషయానికి వస్తే..... మొన్న ఇండియా నించి వచ్చాక ఒక వారంరోజులు జెట్లాగ్ పేరుచెప్పుకుని....... ఇంకో రెండురోజులు 'టులిప్ షో' కి వెళ్లి రోజంతా వర్షంలో తడిసి తెచ్చుకున్న జలుబు పేరు చెప్పుకుని మూసిన కన్ను తెరవకుండా పడుకున్నానా.......ఇక ఇల్లు చూస్తె....నాకే చీదర వేస్తుంటే..... పాపం మా చందు వంట తప్ప ఇలాంటి క్లీనింగ్ సెక్షన్లో కాలు కూడా మోపని కారణమున చచ్చినట్టు నేనే లేచి ఘట్టిగా ఊపిరి పీల్చి.....రంగంలోకి దిగాను!

తీరాచూస్తే..........క్లీనింగ్ కోసం నేనెప్పుడు వాడే క్లీనింగ్ సొల్యుషన్ కాకుండా వేరేది ఏదో ఉంది! ఏంటి బాబు ఇది అని అడిగితె.... ఆ నువ్వు లేనప్పుడు ఇది తీసుకొచ్చా.....కొంచెం ఎఫెక్టివ్ గా పనిచేస్తోంది అని చెబితే సంబరపడి.... ఆవేశంతో ఆరోజే ఆ మురికిపట్టిన మల్లెపూవులా ఉన్న మా వంటగదిని శుభ్రం చేసే కార్యక్రమానికి నాంది పలికా!!

తుడిచా...తుడిచా....ఆ సొల్యుషన్ పిచికారి చేయడం....టిష్యు తో  తుడవడం....మళ్లీ తడి బట్ట పెట్టి...దాని పొడి గుడ్డతో తుడిచి....వార్నాయనో చిరాకోచ్చేసింది!! సాయంత్రానికి మా 'మిల్క్ సీ' అదే బాత్రూం కూడా అతి కష్టం మీద శుభ్రం చేసేసరికి నా తల ప్రాణం తోకలోకి వచ్చింది! ఆనక ఇల్లంతా వాక్యుం పెట్టి సోఫాలో కూలబడ్డా!  సరే పనైతే అయ్యింది కాని చేతులు కొంచెం మంట పుట్టాయి!ఆ ఘాటు మహిమలే అనుకుని ఊరుకున్నా!

కాసేపయ్యేసరికి చేతుల మీద చిన్నచిన్న గాట్లు! వామ్మో అని చూసుకునేసరికి అన్ని చేతివేళ్ళు ఎర్రెర్రగా బొక్కలు పడిపోయాయి! :( సొల్యుషన్ కొంచెం ఎఫ్ఫెక్టివ్ అనుకున్నా కాని ఇంతనుకోలేదు! నేను కేవ్వవ్వ్వ్వ్! వాటికి ముందు మాయిశ్రైసర్ రాసా....కాసేపాగి మళ్లీ ఏదేదో రాసి ఎం చేసినా మంట మాత్రం పోదే! అలాగే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ ఎలాగో ఉండిపోయా! :((( అసలే రోజుకోసారి వంట చేసేటప్పుడు విధిగా వేళ్ళు కోసుకోవడం నా రివాజు! దానికితోడు ఇవి కొత్తగా! హతవిధీ!

అలా ఆరు గాట్లు....మూడు చందుచీవాట్లతో రోజులు దొర్లిపోయాయి!

క్రమంగా గాట్లు తగ్గుముఖం పట్టాయ్! ఈలోగా అపార్ట్మెంట్ల వేట మొదలుపెట్టాం. ఈసారి ఒక అపార్ట్మెంట్ ఎంచుకుని అన్నీ మాట్లాడుకుని 'ఒకే. డీల్...డీల్' అనుకుని ఆ అపార్ట్మెంట్ ఫైనలైజ్ చేసాం. తీరా ఒకసారి చూస్తాం మా అపార్ట్మెంట్ చూపించమంటే రిసెప్షన్ దేవత.....'సారి రిపెయిర్లో ఉంది కుదరదు' అంది :( నాకేదో తేడా కొడుతోంది. అయినా సర్లే అనుకుని లైట్ తీసుకున్నాం.

ఇల్లు మారే సమయం ఆసన్నమైంది! ఇండియాలోలాగా పెట్టె,బేడ సర్దుకుని ఎగురుకుంటూ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోవడానికి ఇక్కడ కుదరదుగా......వీళ్ళకి ఇల్లు తీసుకునేటప్పుడు ఎలా ఉందో....ఇచ్చేటప్పుడు అలాగే ఉండాలి! గోడల మీద, పొయ్యి గట్టు మీద,బాత్రూమ్లో చిన్న చిన్న మరకలు పడ్డా ఫైన్ వేస్తాడు! పసుపు మరక పడిందో....ఇక అయిపోయినట్టే!అలాగే మనకి ఇల్లు ఇచ్చేటప్పుడు కూడా....చక్కగా కొత్త పైంటు వేసి,కార్పెట్ మార్చి,రిపైర్లు చేసి ఇస్తారు.....కాబట్టి మనం ఇల్లు ఖాళి చేస్తున్నప్పుడు అంతే నీట్టుగా ఇవ్వాలనడం తప్పు కాదేమో!

అందుకనే ముందు సామాన్లు అన్ని సర్దుకుని ఇక ఒక బ్రష్షు.....బకెట్టు.....చేట.....ఒక లిక్విడు[ఈసారి కొంచెం తక్కువ ఎఫ్ఫెక్ట్ చూపించే లిక్విడ్ తెచ్చాం లెండి] తెచ్చుకుని ఇద్దరం ఇంటిమీద పడి రుద్దడం మొదలుపెట్టాం!

రుద్ది....రుద్ది...కడిగి...కడిగి....కడిగిందే కడిగి....కార్పెట్ మీద వాక్యుం చేసిందే....చేసి....ఎలాగైతేనేం ఇంటిని కొత్త ఇల్లు లాగా తళతళ మిలమిల లాడే ట్రిపుల్ ఎక్స్ లాగా తీర్చిదిద్దేసాం!

హమ్మయ్య! ఒక గోల వదిలింది! ఈసారి వెళ్ళే ఇల్లన్నా కొంచెం ఈ ధవళమయం కాకుండా చూడు స్వామీ!! అని కోరుకుని.....కొత్తింటిని ఒకసారి చూద్దామని వెళ్ళాం!

తలుపు తీయగానే పక్కనే వంటగది......హమ్మయ్య కొంచెం చిన్నదే.....బ్రతికాను దేవుడా అని అనుకుంటూ అలా లోపలికి అడుగుపెట్టి లైటు వేసా.....అంతే.....

కేవ్వ్వ్వవ్వ్వ్వ్!

అవ్వాక్కయ్యా!!

ఎందుకంటే.....ఇక్కడ కూడా.....అవాక్కయేలా 'టైడ్' తెల్లదనమే! నాలుగు దేదీప్యమానమైన లైట్ల వెలుగులో ధగధగా మెరిసిపోతున్న ఆ తెల్లతెల్లటి వంటగది నాకు  ముద్దుముద్దుగా స్వగతం పలుకుతుంటే..... ఏడుపొక్కటే తక్కువ!

మళ్లీ తెలుపుతో నా యుద్ధం మొదలు!

హ్మ్! ఇంటిని మార్చగలిగాం కాని తలరాతని మార్చగలమా?

30 కామెంట్‌లు:

SHANKAR.S చెప్పారు...

"తెల్లటి ఆ గచ్చుమీద నల్లటి నా వెంట్రుకలు చూస్తె తిరుమలలో 'కళ్యాణ కట్ట' కళ్ళముందు కనపడుతుంది!"

ఏడు కొండల వాడా. వెంకటరమణా. గోవిందా గోవింద

"ఒక్కోసారి నాకు ఇండియాలో ట్రైన్లలో బోగీలు ఊడ్చే చిన్నపిల్లలు గుర్తోచ్చేవారు! :("

ఇది అల్టిమేట్ డైలాగ్. ఒకసారి అందరూ మన ఇందు గార్ని అలా ఫ్లోరింగ్ తుడుస్తూ ఊహించుకోండి. :))))))))))))))))))))))

"పాపం మా చందు వంట తప్ప ఇలాంటి క్లీనింగ్ సెక్షన్లో కాలు కూడా మోపని కారణమున"

ఈ స్టేట్మెంట్ తప్పు అని ఈ క్రింద స్టేట్మెంట్ రుజువు చేస్తోంది. పనిచేస్తోంది అంటే ప్రయత్నించినట్టే కదా. అన్యాయంగా చందుగారి మీద అభాండాలు వేయడం మీకు భావ్యం కాదు ఇందు.

"క్లీనింగ్ కోసం నేనెప్పుడు వాడే క్లీనింగ్ సొల్యుషన్ కాకుండా వేరేది ఏదో ఉంది! ఏంటి బాబు ఇది అని అడిగితె.... ఆ నువ్వు లేనప్పుడు ఇది తీసుకొచ్చా.....కొంచెం ఎఫెక్టివ్ గా పనిచేస్తోంది"

కృష్ణప్రియ చెప్పారు...

:) సారీ.. నవ్వినందుకు..

ఆ ఒక్క సుఖం కోసం ఇండియా కి వచ్చేయచ్చు. 'ఈ చివర టైల్ మీద ఏంటి కార్నర్ లో మరక? ' అని దబాయించి అన్నీ కడిగించుకోవచ్చు.

మాలా కుమార్ చెప్పారు...

పాపం మీ శ్వేతసౌధం తో ఇన్ని ఇక్కట్లు పడుతున్నారా :)

లత చెప్పారు...

మళ్ళీ శ్వేతసౌధ కష్టాలు మొదలన్నమాటచదవడానికి సరదాగా ఉంది కానీ
నిజమే వంట చెయ్యడం ఎలా ఉన్నా ఈ క్లీనింగ్ మాత్రం చాలా పెద్ద తలనొప్పి

ఇందు చెప్పారు...

Shankar garu...మా చందు నేను లేనప్పుడు..ఏమీ తోచక షాపుకెళ్ళి ఇది తీసుకొచ్చారు....కేవలం ఒకేఒకసారి[ఒక నెలలో] ఆ పొయ్యి గట్టు తుడిచారు...అలా వారికి ఆ సొల్యుషన్ మహిమ తెలిసిందీ అన్నమాట ;) అంతమాత్రానికే చందుగారు తెగ పనిచేస్తారు అని చెప్పలేను కదా ;)

మాలగారూ....ఇప్పుడు పెద్ద శ్వేతసౌధం నించి చిన్న శ్వేతసౌధానికి వచ్చేసాం :))))

కృష్ణగారూఉ..గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్!! నవ్వుతారా?? :X అవునండీ...వచ్చేయొచ్చు...కానీ నాలాంటి అమ్మయిలకి[అంటే పుట్టింట్లో పని,పాట చేయకుండా పెరిగిన అమ్మయిలకి] బాగా తిక్క కుదురుతుంది... ఇంకా మంచి పనిమంతులు అయిపోతారన్నమాట ;)

రాజ్ కుమార్ చెప్పారు...

హహహ.. కేక పోస్ట్ అండీ.. నాకా లాస్ట్ ఫోటో చూసి తెగనవ్వొచ్చిందీ.. ఈ సారి ఆ అమ్మాయ్ వేసుకున్నా గ్లౌజ్ లు వేసుకోండీ మీరు కూడా.. ;)
నాకు నచ్చిన లైన్స్ అన్నీ శంకర్ గారు రాసేశారు వాఆఅ...వాఆఆఆ.. ;(

అయితే ఒకటీ ఎప్పటికయినా "ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు" టైప్ లో బ్లాక్ & వైట్ లో ఇల్లు డిజైన్ చేయించుకుందాం అనుకున్నా.. మీ పోస్ట్ చూశాక భయమేస్తుందీ.. ;(

మురళి చెప్పారు...

ప్చ్.. పాపం మీరు..

sunita చెప్పారు...

ikkaDakooDaa repeat! America లో నా మొట్ట మొదటి experience కూడా Clorex తో చేతులమీద గాట్లు, బొక్కలు పెట్టించుకోవడమే! తెలీక మామూలు వెసెల్ క్లెనింగ్ లిక్విడ్ డిష్ వాషర్ లో వేస్తే వచ్చిన నురగల సముద్రం చిన్న చిన్న మగ్గులతో ఎత్తి క్లీన్ చేసాను :))

స్నిగ్ధ చెప్పారు...

హ హ హ బాగున్నాయి మీ శ్వేత సౌధం కబుర్లు...
కృష్ణ గారు చెప్పినట్టు ఇక్కదైతే మనం చెప్పి దబాయించి మరీ పని చెయించుకొవచ్చు...
:)

మధురవాణి చెప్పారు...

హహ్హహహా.. బాగున్నాయ్ నీ క్లీనింగ్ కష్టాలు.. :P
అన్నట్టు మా ల్యాబ్ నుంచి ఒక పది పెట్టెల గ్లోవ్స్ పంపించమంటావా.. చేతులకి గాట్లు పెట్టుకోకుండా క్లీన్ చేస్కోవచ్చు ఎంచక్కా.. :D

ఇందు చెప్పారు...

@లత :అవును లతగారూ....చచ్చే చావు! అసలు ఆ ఆవాలైతె...పొయ్యి క్రింద సందుల్లోకి దూరిపోతాయ్! అవి వెతికి బైటికి తెచ్చేసరికి నాకు నీరసమొచ్చేస్తోంది!

@వేణూరాం:గ్లౌజ్ ఉన్నాయ్ రాజ్! కాని అవి సింక్,బాత్రుం క్లీనింగ్ కి వాడతా! మిగితా అరలు,పొయ్యి తుడవడానికి అవి కొంచెం చిరగ్గ అనిపిస్తాయ్.అందుకే తీసేసి మామూలుగా తుడిచా! ఫలితం అలా ఉంది :((

మీ ఐడియా బాగుంది...వంటగదికి నల్లరంగు వేయించేయండీ :))అప్పుడు నో ప్రొబ్స్!

@ మురళి: అవును మురళీగారూ...పాపం నేను :(

ఇందు చెప్పారు...

@sunita: మళ్ళీ రిపీట్! ;) మీ నురగల సముద్రం తలుచుకుంటేనే నవ్వొస్తోంది...పాపం మీరు ;)

@ snigdha: అవును..పాపం మన పనివాళ్ళు...ఇక్కడ...పనులే మనల్ని దబాయిస్తాయ్ :)

@ మధురవాణి: నాదగ్గరా ఉన్నాయ్ అమ్మాయ్ గ్లౌజులు! కాని అవి సింకు క్లీన్ చేయడానికి,బాత్రుం క్లీనింగుకి వాడతా! వంటగదికి వాడలేదు...అదే కొంపముంచింది :(

చందు చెప్పారు...

ఇలా మా ఆవిడ నాకు వారాంతంలో నా చిరిగిన తెల్లటి బనీనులతో, తేయాకు చొక్కాలతో బాఠ్రూమ్ రంగు బనీనులకి అంటే లాగా తుదిపిస్తుంటే, లాటిన్ సుందరులకు ఔట్ సోర్స్ చేసా. ఇప్పటికీ మా నాన్న నన్ను వెక్కిరిస్తూ ఉంటారు "నీది అమెరికాలో అంట్ల బతుకు" అని

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

>>> హ్మ్! ఇంటిని మార్చగలిగాం కాని తలరాతని మార్చగలమా?

pch. లేము, లేము. మీ కష్టాలకి నా సానుభూతి.

హరే కృష్ణ చెప్పారు...

అలా ఆరు గాట్లు....మూడు చందుచీవాట్లతో రోజులు దొర్లిపోయాయి కేక :))
బొమ్మలు చాలా బావున్న్నాయి లాస్ట్ పిక్ అయితే మరీనూ :)

ఎంత పని అయ్యింది ఆ ఫ్లోర్ మీద కవిత వేద్దామా అంటే జనాలు భయపడుతున్నారు :)
సరే ఒక పాట అందుకుంటున్నా

ట్యూన్ http://www.youtube.com/watch?v=nYQ5VJjrmLs

మిల మిలా.. లా.. లా.. క్లీనుతా తా.. తా..
తల తలా.. లా..లా..తోముతా..తా.. తా..
దుమ్ముంటే వేస్కో..తడి గుడ్డ ఇచ్చుకో
ఇంటి మీద పడి కడిగి రుద్ది చూపిస్తా...హా !

ఇందు చెప్పారు...

@చందు : హ్హహ్హహ్హా! నిజమేనండీ...మీ నాన్నగారన్నదీ :)) మనం ఇండియాలో పనివాళ్లమీద బాహా ఆధరపడిపోయి...ఇక్కడకొచ్చి మన పనులు మనం చేసుకోలేక పడుతున్న అవస్థలివి :)) పాపం మీ ఆవిడ మీ చేత చేయిస్తారా??? నమ్మమంటారా? ;) నాకలా అనిపించట్లేదేంటబ్బా??

@ బులుసు సుబ్రహ్మణ్యం : ధన్యవాదాలు గురువుగారు...అవునండీ లేము..లేమూ

@హరే కృష్ణ : హ్హహ్హహ్హా! హరే ...మీరు టూమచ్ :) ఆ పాటేంటండీ బాబూ...నవ్వలేక చచ్చా :)) బాబోయ్ ఇంకో తవికా... అదే... కపితా... ఛ... సారి...కవితా? ఒద్దు మహాప్రభో..ఒద్దు :)))

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ హ ఇందూ ఎంత ఆపుకున్నా నవ్వు ఆగట్లేదండీ :) పాపం మీరు.. నాకు ఒకప్పటి నేనే కనిపించాను.. నావి ఒకప్పుడు సిమిలర్ కష్టాలే.. చికాగోలోఉన్నపుడు తెల్లని ఇంటీరియర్స్.. విశాలమైన వంటిల్లు & బాత్రూమ్.. నేనీ క్లీనింగ్ భరించలేక వంట కూడా మానేసిన రోజులున్నాయ్.. వాక్యూం క్లీనర్ యాక్సెసరీస్ జాగ్రత్తగా గమనించుకుని ఉపయోగించగలిగితే బాగానే గట్టెక్కిస్తాయండి..

తృష్ణ చెప్పారు...

"ఒక్కోసారి నాకు ఇండియాలో ట్రైన్లలో బోగీలు ఊడ్చే చిన్నపిల్లలు గుర్తోచ్చేవారు! :("

"అలా ఆరు గాట్లు....మూడు చందుచీవాట్లతో రోజులు దొర్లిపోయాయి "

నవ్వులు...( మాకు )..:))
పాపం....( మీకు) ..:((

..nagarjuna.. చెప్పారు...

హ్హహ్హహ్హ

ఏలుకోండి, నిశివర్ణం ఉదయించని ఆ శ్వేతసౌధాన్ని మకుటంలేని మహరాణిలా ఏలుకోండి. సపర్యలు చేస్తూ ఏకఛత్రాధిపత్యం చేసేయండి. శుభం భూయాత్ :D

ఆ.సౌమ్య చెప్పారు...

హహహ అయ్యో పాపం ఇందు ...ఈ విషయంలో ఇండియా బెస్ట్...ఢిల్లీ అయితే బెస్టెస్టు...ఇల్లు అద్దంలా ఉంచుతారు ఇక్కడ పనివాళ్ళు.

నువ్వు పెట్టిన బొమ్మలు మాత్రం చాలా క్యూట్ గా ఉన్నాయి...బలే సంపాయించావ్! :)

రవికిరణ్ పంచాగ్నుల చెప్పారు...

ఏవిటో ఇందుగారూ కష్టాలన్నీ దేవుడు మంచోళ్లకే పెడతాడు.

"ఇంటిని మార్చగలిగాం కాని తలరాతని మార్చగలమా?"..
..లేమండీలేము!

మనసు పలికే చెప్పారు...

ఇందూ..
ఆ లాస్ట్ బొమ్మ ఉంది చూడూ, అలా నిన్ను ఊహించుకుంటూ తెగ నవ్వేసుకుంటున్నా నేను;);)
అయినా ఎంచక్కా అంతటి అందమైన శ్వేత సౌధంలో ఇంద్ ఉఎంజాయ్ చెయ్యాలి కానీ, ఈ క్లీనింగ్ గొడవేంటి ఇందూ? పాపం ఇందు:(((
టపా మాత్రం సూపరు.. అంటే నీ కష్టాలు చూసి నవ్వుకుంటున్నా అని కన్నెర్రజేయొద్దు అలా..:P

శశి కళ చెప్పారు...

గొవిందా...గొవిందా...ఇక్కడ కూడా పని వాళ్ళు దొరకడం లెదు.నీ కష్టాలు వింటూ ఉంటె ...వావా...
నావి గుర్తుకు వస్తున్నాయి......ఒక పని చెద్దాము.
ఆ టైల్స్ కనిపెట్టీన వాడిని జాయింట్ గా షూట్ చెద్దామా...

కొత్తావకాయ చెప్పారు...

ఓలమ్మో! అప్పుడే ఏమయిందీ! ముందుంది ముసళ్ళ పండగ. ఓ బుడుగు ఆ కార్పెట్ మీద చిన్న కృష్ణుడి జెరాక్స్ కాపీలా పాకుతూ, బొజ్జలో వేసిన పాలు, రంగు రంగుల గర్బర్ ఫుడ్ కుంచెం కుంచెం కక్కి ఇల్లంతా రాగరంజితం చేసేస్తుంటే ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది క్లీనింగ్లో మజా! ఇంకొంచెం పెద్దయి గోడల నిండా క్రేయాన్లతో గిసి పికాసో ని తలపించి జుత్తు పీక్కోనేలా చేస్తారు. ఆ పై.. ఇందు గారూ.. ఇందు గారూ.. ఉలకట్లేదు పలకట్లేదు. ఏమైపోయార్ చెప్మా ఈవిడ?

:) Nice post.

ramki చెప్పారు...

ఏంటో ఇందు గారు..........
ఇక్కడ మీ కష్టాలు చూసి ఫీల్ అవ్వాలో.......లేకపోతే మీరు వర్ణించిన తీరు చూసి నవ్వాలో........అర్ధం అవ్వటం లేదు........
ఎదితే ఎం....నాకు మాత్రం ఒకటి క్లియర్ గ అర్ధం అయ్యింది.......
ఇండియా లో వున్నప్పుడు చక్కగా మహారాణి లాగా... ఎంజాయ్ చేసి వుంటారు.....మీ అమ్మ గారు వండి పెడుతుంటే.......
ఇప్పుడు చిన్న చిన్న ఆవల వేటలో పడ్డారు.......... :ప
కాని ఈ పాటికే ఒక విషయాన్ని గ్రహించి వుండాలి మీరు........
మొదట్లో మీ శ్వేత సౌధం శుభ్రం చెయ్యటం చాల కష్తం అని అనిపించోచు...కాని..రాను రాను అలవాటు పడిపోయివుంటారు.... :)
తినగా తినగా వేము తియ్యనుండు.......అని పెద్దోళ్ళు ఊరికే అన్నరా?
"తుడిచా...తుడిచా....ఆ సొల్యుషన్ పిచికారి చేయడం....టిష్యు తో తుడవడం....మళ్లీ తడి బట్ట పెట్టి...దాని పొడి గుడ్డతో తుడిచి....వార్నాయనో చిరాకోచ్చేసింది" ....exactly నేను కూడా అంతే........ఎప్పుడో చంద్ర బాబు గారు పూనుతారు ...జన్మ భూమి కరిక్రమం మొదలెడతాను........
ఇంకా చూసుకోండి...నా సామిరంగా....కావాల్సింది....అవసరం లేనిది....మొత్తం కడిగి , తుడిచి అవతల పారేస్తాను.........
బట్టలు కనిపిస్తే చాలు....మొత్తం తీసుకెళ్ళి వాషేర్ లో కుక్కేస్తాను......అది తిరగలేక ఇంకా అది చచ్చి ఊరుకుంటుంది... :)
కాని మీ ఈ ఆర్టికల్ ని పెళ్లి కావాల్సిన ఇండియా అమ్మైలు చదివితే ఇంకా మా జీవితాలు అంతే....... :(
అమెరికా ఎవ్వరు రారు.... :P
నైస్ ఆర్టికల్.....

ఇందు చెప్పారు...

@వేణూ శ్రీకాంత్: హ్హహ్హహా! క్లెనింగ్ భరించలేక వంటమనేసిన రోజులా? కెవ్వ్వ్వ్! బ్రహ్మచారులు కదా చెల్లుతాయండీ...మరి మాకెలా?? అందుకే కొత్త వాక్యుం తీద్దమనుకుంటున్న వేణు :)

@తృష్ణ : అంతేలేండీ :))

@..nagarjuna..:హ్హెహ్హెహే! దీవెన బాగుంది డ్రాగర్జున గారు :) తప్పకుండా మీ ఆఙ్గ్న శిరసావహిస్తాను గురువర్యా :)

ఇందు చెప్పారు...

@ ఆ.సౌమ్య: నిజమె సౌమ్యా! మా ఇంట్లో పనమ్మాయ్ కూడా చక్కగా చేసిపెడుతుంది :) కానీ ఇక్కడికొచ్చాక ఇక వేరేవాళ్ళ పని నచ్చదు :) మనపనే బెస్ట్ అనిపిస్తుంది ;) ఫొటోలా ఏదో అలా దొరికేసాయ్ :)

@ రవికిరణ్ :అవును పాపం! అదీ నాలాంటి అమాయకులకే :(

@ మనసు పలికే :అంతేలే అప్పూ! పేరు గొప్ప ఊరు దిబ్బా అని....అమెరికా అమెరికా అని ఎగురుకుంటూ రావడమే కాదు వీటన్నిటికి సిధ్ధపడాలి అని అందరికీ నా పోస్ట్ వార్నింగ్ అన్నమాట ;)

ఇందు చెప్పారు...

@it is sasi world let us share :యా! కమాన్ శశి. అస్సలు తగ్గొద్దు. నువ్వు చంపేయ్ నేను నీ వెనుక దాక్కుని నీకు చంపదంలో మెళుకువలు నేర్పిస్తా ;)

@ కొత్తావకాయ:ఏమయిపోయింది ఇందూఉ! ఢామ్మున పడిపోయింది :( వాఆఆఆ! వాఆఆఅ! ఇది శాపమా? భవిష్యవాణా? కెవ్వ్వ్వ్వ్వ్వ్!

@ RAMAKRISHNA VENTRAPRAGADA said...:ఆహా! మరి నన్ను చూసి నవ్వారుగా! రేపు మీకు పెళ్ళయితే ఆ కాబోయే అమ్మాయి... 'అమెరికా అంటే వచ్చసాను...ఈ గొడ్డు చాకిరి నేను చేయలనెఉ బాబోయ్' అని అంటే...ఇక మళ్ళీ మీరే....చేట,చీపురు పట్టుకుని రంగంలోకి దిగుతారు :) ఒకసారి ఊహించుకోండి అలా :)))))) [అచికచికా అయ్యింది రామకృష్ణ్గారికి ;) ]

నందు చెప్పారు...

మీ బ్లాగ్స్ అద్బుతంగా ఉన్నాయి...

kiran చెప్పారు...

ఒక్కోసారి నాకు ఇండియాలో ట్రైన్లలో బోగీలు ఊడ్చే చిన్నపిల్లలు గుర్తోచ్చేవారు! :( - :D :D ..నేను ఉహించేసుకున్నా
నవ్వుకోడానికి బాగుంది కానీ.....పాపం అనిపిస్తోంది...
అయిన నవ్వు ఆగట్లేదు..కికికికికికికికికి....:P