17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

నా టపా 'ఆంధ్ర జ్యోతి' లో పడిందోచ్!!

'పరాయి దేశం లో వినాయక చవితి' అని నా బ్లాగు లో నేను వ్రాసిన టపా 'ఆంధ్ర జ్యోతి' నవ్య లో  'పాలవెల్లి కోసం వాల్ మార్ట్ లో వెతికాం ' అనే శీర్షిక తో వేసారు....నాకు చాలా  ఆనందంగా ఉంది :) అందుకే నా సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటున్నా......ఈ విషయాన్ని నాకు తెలిపిన రాధిక(నాని) గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు..... :)





16, సెప్టెంబర్ 2010, గురువారం

ది మిస్సింగ్ రోజ్



'ది మిస్సింగ్ రోజ్ '.....ఒక మనిషి యొక్క వ్యక్తిత్వ లోపాన్ని సరిచేసి,ఆత్మవిశ్వాసం పెంపొందించేలా చేసే నవల....రచయిత 'సేర్దర్ ఒజ్కన్' మొదటి రచన అయినా....కథనం చక్కగా నడిపించాడు...అసలు విషయాన్ని పాఠం లా చెప్పకుండా కథ లో సమ్మిళితం చేసి చెప్పాడు.....  బ్రెజిల్ నుంచి టర్కీ కి వచ్చి మళ్లీ బ్రెజిల్ లో ముగిసే కథ ఈ 'మిస్సింగ్ రోజ్'......


విప్రో లో పుస్తకాల షాపు లో ఈ పుస్తకం కనబడితే శీర్షిక బాగుంది కథ ఏంటో అని వెనక్కి తిప్పి చదివా....'తన కవల సోదరిని వెతుకుతూ ఇస్తాంబుల్ వచ్చిన యువతి, గులాబిలతో మాట్లాడడానికి ఆహ్వానింపబడుతుంది' అని ఉంది. 'ఇదేదో భలే ఉందే....ఈ పుస్తకం చదివితే నాకు గులాబీలతో మాట్లాడే విద్య వస్తుందేమో...అప్పుడు ఎంచక్కా మా ఇంట్లో గులాబీలతో మాట్లాడుకోవచ్చు' అని కొనేసి....తీరిక వేళల్లో చదివేసా!!

ఇందులో నాయిక పేరు  'డయానా'...'రియో' లో ఉండే డయానా అందంగా ఉంటుంది.... నలుగురు నన్ను మెచ్చుకోవాలి అనే రీతిలో ఇతరుల మెప్పు కోసం బ్రతికేస్తుంటుంది....అందుకోసం తనకు ఎంతో ఇష్టమైన 'రచయిత్రి' అవ్వాలనే కోరిక  వదులుకుని అందరూ గొప్ప అని పొగిడే 'లా' చదవాలని అనుకుంటుంది....కానీ తన కూతురు తాను అనుకున్న దారిలో నే వెళ్ళాలని, ఇలా ఇతరుల ప్రభావం వల్ల తన కల ని కల్ల గా చేసుకోకూడదని ఆమె తల్లి ఎన్నో విధాల ప్రయత్నిస్తుంది....కానీ 'డయానా' వినదు....చివరికి మరణించేముందు తనకి ఇంకో కూతురు ఉందని,ఆమె అచ్చం డయానా లాగ ఉంటుందని,డయానా కంటే తెలివైంది బుద్ధిశాలి అని,ఆమె ని తన భర్త తీసుకేల్లిపోయాడని,ఆమెని ఎలాగైనా వెదికి తనకి మంచి జీవితం కల్పించాలని డయానాకి  చెబుతుంది...ఆమె గురించిన వివరాలు ఆమె పంపిన మూడు ఉత్తరాల్లో ఉంటాయని చెప్పి చనిపోతుంది....

తల్లి చనిపోయిన బాధ కన్నా తనకి కవల సోదరి ఉన్నది అన్న బాధ ఎక్కవైపోతుంది డయానా కి...అసలు ఆ అమ్మాయి ఇప్పటికే చనిపోయి ఉంటే బాగుండు అని కూడా అనుకుంటుంది...కానీ తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ ఉత్తరాలు చదివి ఆ అమ్మాయిని తీసుకురావాలని అనుకుంటుంది...అలా మొదటి రెండు ఉత్తరాల్లో ఉన్న  వివరాలతో ఆమె 'ఇస్తాంబుల్' లో ఉన్న ఒక వసతి గృహ యజమాని తోటలో గులాబి పూలతో మాట్లడేదని తెలుసుకుని నవ్వుకుంటుంది....సరే ఆమె వివరాలు ఆ వసతి గృహ యజమానికే తెలుస్తాయని అక్కడికి వెళుతుంది....ఎలాగో అలా కష్టపడి ఆ వసతి గృహాన్ని కనుగొంటుంది....అక్కడ ఉన్న దాని యజమాని డయానా ని చూసి 'మారియా'(కవల సోదరి పేరు) అనుకుంటుంది...కాదు అని తెలిసాక మారియ గొప్పదనం గురించి చెబుతుంది...ఇదంతా నచ్చని డయానా తన సోదరి ఎక్కడ ఉందో చెబితే తనని తీసుకుని 'రియో' వెళ్ళిపోతానని చెబుతుంది...'సరే నీ ఇష్టం కానీ కొద్ది రోజులు నా ఆతిద్యం స్వీకరించు' అని చెబుతుంది....అలా మెల్లగా డయానా ఆ యజమాని ఇంటి వెనుక ఉన్న గులాబీ పూల తోట,మాట్లాడే గులాబీల గురించి వాకబు చేస్తుంది....'ఎక్కడన్నా పూలు మాట్లాడతాయా ?? మరీ విడ్డూరం  కాకపొతే!!' అని  ఆ మాట్లాడే విద్య నేర్పించమని యజమానిని వెటకారంగా అడుగుతుంది.ఆమె భావం గ్రహించిన యజమాని...'గులాబీలు మాట్లాడతాయి అని ధృడ విశ్వాసంతో నేర్చుకుంటేనే ఈ విద్య నీకు అబ్బుతుంది....లేదంటే ఈ జన్మకి నీవు గులాబీలతో మాట్లాడలేవు.ముందు అందుకు సిధ్ధపడు' అని హెచ్చరిస్తుంది. కానీ అసలు ఈ వ్యవహారం అంతు చూద్దాం అనే ఉద్దేశం తో 'నేను నేర్చుకోవడానికి సిద్ధం' అని అంటుంది డయానా.


గులాబీలతో మాట్లాడే విద్య నేర్చుకోవడానికి ముందు ఆ తోటలో ఉండే నియమనిబంధనలు అన్నీ వివరిస్తుంది యజమానురాలు.తరువాత కొన్ని  రోజుల కఠిన శిక్షణ లో భాగంగా రోజు పొద్దున్న,ఒక్కోసారి మధ్యానం,కొన్ని సార్లు అర్ధరాత్రి ఆ తోటలోకి వెళ్లి పూల యొక్క మనోభావాలు ఆ యజమానురాలి ద్వారా తెలుసుకుంటుంది  డయానా.ఆ పువ్వులు తనతో మాట్లాడుతున్నాయని యజమానురాలు చెప్పినపుడు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది....'నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను వాటితో??' అని ప్రశ్నిస్తుంది.....'అవి నీతో మాట్లాడతాయి అని నీకు నమ్మకం కుదిరిన రోజున వాటి తీయటి పిలుపు నీకు  వినిపిస్తుంది...కానీ అది నువ్వు నమ్మవు...ఎందుకంటే అందరూ చెప్పేది అదే కాబట్టి...నువ్వు ఇతరుల  కోసం బ్రతుకుతున్నావ్ కాబట్టి.....నీ జీవితం నీది..నీ నమ్మకాలూ అభిప్రాయలు నీవి...ఎవరికోసమో నువ్వు నీ జీవితాన్ని,నమ్మకాల్ని మార్చుకోవాల్సిన పని లేదు' అంటుంది. క్రమంగా డయానా లో మార్పు వస్తుంది.అలా కొద్ది రోజులు గడిచాక ఒక రోజు ఆ యజమానురాలు తనకి మరియా ఫోను చేసి 'రియో' వెళుతున్నానని చెప్పిందని చెబుతుంది. తన తల్లి మరణించిందని తెలిస్తే మారియా  చనిపోతుందేమోనని కంగారు పడి డయానా వెంటనే రియో కి వెళ్ళిపోతుంది.అప్పుడు నాటకీయ పరిస్తితుల్లో వాళ్ళ అమ్మ దాచిన మూడవ ఉత్తరం చదివి దాని అనుగుణంగా మరియా ఎవరో కనుక్కోడానికి ప్రయత్నిస్తుండగా నిజం బహిర్గతమౌతుంది.....


మారియ ఎవరూ?? డయానా మారియని ఎలా కనుక్కుంది?? తరువాత డయానా జీవితం లో సంభవించిన మార్పులేంటి  అన్నది పుస్తకం చదివి తెలుసుకోవాల్సిందే...!!


నేను ఈ పుస్తకం చదివాక ఒకటి తెలుసుకున్నా.....ఎవరో మెప్పు కోసం జీవిస్తూ ఉంటే ఎవరు సంతోషిస్తారో ఏమో  కానీ అందులో మన ఆనందం ఏమి ఉండదు....అది కూడా నటనే అవుతుంది.......ఇక అప్పుడు జీవితం అంతా నటించాల్సివస్తుంది....అదే మనకి నచ్చిన పని చేస్తే..కనీసం మనం అన్నా సంతోషిస్తాం :)....




కానీ ఇంతకీ నేను గులాబీలతో మాట్లాడే విద్య వస్తుందేమో అని ఆశ పడ్డా...ఒకటి అని చదివితే ఇంకోటి అయింది :D

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

పరాయి దేశం లో వినాయకచవితి....





దీపావళి,ఉగాది లాగే నాకు నచ్చే పండుగ ఈ 'వినాయక చవితి' .....బోలెడంత హడావిడి,అలంకరణ,పత్రి,చంద్రుడు వెరసి చిన్నప్పటినించి యే పండుగ జరిపినా జరుపుకోకపోయినా ఈ వినాయకచవితి మాత్రం ఘనంగా జరుపునేవాళ్ళం.....


అటువంటిది దేశం కానీ దేశం లో మొదటి సారి ఇంటికి దూరంగా ఉండి జరుపుకుంటున్న పండుగ.....


రెండు రోజుల ముందు నుంచే చందు ని హింసించడం మొదలుపెట్టాను....పత్రి ఎలా? మట్టి వినాయకుడు దొరుకుతాడా?? ఉండ్రాళ్ళకి బియ్యపు రవ్వ ఎక్కడ  కొనాలి ?? మరి పాలవెల్లి సంగతేంటి ?? వ్రతకథా పుస్తకం ఎలా ?? బంతిపూల మాలలు దొరకవుగా మరి పూలు ఎలా?? ఇలా అది ఇది అని విసిగించేసా.....


ముందుగా పాలవెల్లి కోసం దగ్గరలో ఉన్న 'ఇండియన్ స్టోర్స్' అన్నీ తిరిగాం....అందరూ 'ఈసారి రాలేదండి' అనేవాళ్ళే..!! 'అయ్యో!!' అని ఉసూరుమంటూ వెను తిరిగి వచ్చేసాం...అసలు పాలవెల్లి లేకుండా వినాయకచవితి ఊహించుకోవడం ఎలా?? పాలవెల్లికి  పసుపు రాసి కుంకుమ పెట్టి గోడకి కట్టి దానికి ఆపిల్ కాయలు,దానిమ్మ కాయలు,వెలక్కాయలు,మొక్కజొన్నలు,అరటి పిలకలు,మామిడాకులు,బంతిపూల మాలలు,కలువ పువ్వులు వంటివన్నీ అలంకరణ చేస్తేనే కదా పండగ కళ వచ్చేది!! ఇక లాభం లేదని ఇంటికి వచ్చి గూగుల్ మీద పడి వెతకడం మొదలుపెట్టా....ఎక్కడా పాలవెల్లి జాడ కనిపించలేదు..... సరిగ్గా రేపు పండగ అనగా ఒక సైట్ లో 'పాలవెల్లి ని నేనే తయారు చేసుకున్నా!!' అని పోస్ట్ కనిపించింది. వెంటనే మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. 'అవును కదా మనమే చేసుకుంటే పోలే!!' అనుకుని చందూ కి చెప్పా!! సరే అని ఇద్దరం ముందు 'వాల్ మార్ట్' కి వెళ్లి కావాల్సిన చెక్కముక్కలు వెతికే పనిలో పడ్డం....దొరకలేదు....ఏంచేయాలో పాలుపోలేదు....సరే మిగితావి తీసుకుందాం  ఈ లోగా ఏదో ఒకటి ఆలోచన రాకపోదు అని బయలుదేరాం. 'క్రోగర్' లో పూల బొకేలు ఒక మూడు,అరటిపళ్ళు తీసుకున్నాం ...... 'నమస్తే' కి వెళ్లి కొబ్బరికాయలు తీసుకున్నాం.వచ్చేటపుడు వాళ్ళు మామిడాకులు, చెరకుగడ, తమలపాకులు,రెండు అరటిపళ్ళు ,ఇంకా ఏవో నాలుగు పళ్ళు ఇచ్చారు...'హమ్మయ్య !! అసలు మామిడాకులు లేకుండా పండుగ ఉహించుకోగలమా !!' అనుకుని ఇక మట్టి వినాయకుని వెదికే ప్రయత్నం మొదలుపెట్టాం. ఏ షాపులో చూసినా రంగులేసిన వినాయక విగ్రహాలే....నాకేమో స్వచ్చంగా,అచ్చంగా మట్టి తో చేసిన వినాయకుడే కావాలి....చివరికి ఒక షాపులో దొరికింది. భలే బుజ్జిగా ఉన్నాడు....చిన్న గొడుగు తో సింహాసనం మీద ఠీవి గా కూర్చున్న గణపతి :) ఈ షాపు లో కూడా పండగ సందర్భంగా మామిడాకులు ఇచ్చారు....


తమలపాకులు,వక్కలు,చందనం,చిన్న దీపపు ప్రమిదలు తీసుకుని ఇక పాలవెల్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. చెక్కలు కావాలంటే  'హోమ్ డిపో' కి వెళ్లి తెచ్చుకోవాల్సిందే అనుకుని అక్కడకి వెళ్ళాం....ఎలాగో అలా కష్టపడి మాకు కావాల్సిన విధంగా చిన్నగా ఉన్న చెక్కముక్కలు,వాటిని కోయడానికి పదునైన చాకు,మేకులు,పురికొస తీసుకుని ఇంటిదారి పట్టాం. ఇంటికి రాగానే పాలవెల్లి ని తయారు చేసే పనిలో చందూ మునిగిపోతే, రేపు వంటకి కావాల్సిన ఏర్పాట్లలో నేను ఉండిపోయా....చెక్కలని కష్టపడి కోసి,మేకులు కొట్టి,ఎలాగో అలా  చందూ గారి దయ వల్ల 'పాలవెల్లి' తయారయింది.....ముద్దుగా బొద్దుగా భలే ఉంది :) ఇక దాన్ని ఎలా వ్రేలాడదీయాలి అని డౌట్!! గోడకి పెద్ద మేకు కొడితే రంధ్రం ఏర్పడుతుంది....అది ఇష్టం లేదు....అలా కాకుండా ఇంత బరువైన పాలవెల్లి ని మోయడం  చిన్న మేకుల పని కాదు .'ఏం చేయాలా ??' అని ఆలోచిస్తుంటే....ఇంకో ఆలోచన వచ్చింది....వెంటనే మా సైడ్ టేబుల్ ని పూజామందిరం చేసేసా...కింద పైన రెండు  గ్లాసులు ఉన్న సైడ్ టేబుల్ అది. కింద గ్లాస్ మీద వినాయకుడిని పెట్టొచ్చు..పైన పాలవెల్లి పెట్టొచ్చు....కావాల్సిన పండ్లు వ్రేలాదదీయోచ్చు....అని అనుకున్నాం....హమ్మయ్య అప్పటికి మనసులు కుదుట పడ్డాయి....


మొత్తానికి చవితి రోజున పొద్దున్నే లేచి త్వర త్వరగా వంట కానిచ్చేసి ఇద్దరం పూజ ముందు కూర్చున్నాం.పాలవెల్లి ని పూల తో అలంకరించి,దానికి ఆపిల్స్,మొక్కజొన్నలు,పళ్ళు కట్టి ,దేవుడిని నానావిధ పుష్పాలతో అలంకరించి,పత్రి కోసం మామిడాకులు,దగ్గరలో ఉన్న కొన్ని చెట్ల ఆకులు తీసుకొచ్చి,లాప్ టాప్ లో వినాయక వ్రతం డౌన్లోడ్ చేసి, దానికి అనుగుణంగా పూజ చేయడం మొదలుపెట్టాం. ఈలోగా పండగ పూట అతిధి గా 'నాని' గారు వచ్చారు.....సావధానంగా,దివ్యంగా పూజ చేసుకుని, పులిహోర-పొంగలి-కుడుములు-ఉండ్రాళ్ళు-వడపప్పు-పానకం  తో పాటు మహానైవేద్యం పెట్టి కథాశ్రవణం  చేసి అక్షతలు వేసుకుని పూజ ముగించాం.తరువాత తీర్ధప్రసాదాలు స్వీకరించి నాని గారికి కూడా అందించాం.'ఇండియా ని గుర్తు చేసారండి ఒక్కసారి' అన్నారు నాని గారు.....చాలా సంతోషమేసింది :)


ఆనక నాని గారితో భోజనం చేశాం.....ఆ రోజు రాత్రికి అతిధులు గా కృష్ణ-ప్రసన్న,ఇంకో కృష్ణ వచ్చారు......మా మందిరం,పాలవెల్లి చూసి ముచ్చట పడ్డారు వారు కూడా.....వారికి తీర్థప్రసాదాలు అందించాం.....ఇక రాత్రి ఎలాగైనా చంద్రున్ని చూడకూడదు అని కిటికీ బ్లైండ్స్ అన్నీ వేసేసి దుప్పటి కప్పేసుకుని నిద్రపోయా :D




అలా పరాయి దేశం లో కూడా చక్కగా వినాయకచవితి జరుపుకున్నందుకు  చాలా సంతోషంగా ఉంది :)

13, సెప్టెంబర్ 2010, సోమవారం

అప్పర్ పెనిన్సులా అందాలు-3

మూడవ రోజు....
మా ప్రయాణం లో చివరి రోజు.....చాలా ఆహ్లాదంగా గడిపిన రోజు కూడా.....
ఈ రోజు కొంచెం తొందరగా అంటే 7 కి లేచాం....మరి క్రూయిజ్ బయల్దేరేది 10:00 కి.....ఈ రోజు కూడా లేవగానే టీ తాగేసి కాసేపు అలా తిరుగుదాం అని తలుపు తీసా...అయ్యబాబోయ్ !! భయంకరమైన చలి....వణికిపోయి వెంటనే  తలుపు వేసేసి 'ఇవాల్టి సంగతి ఏంటి రా దేవుడా??!!' అనుకుంటూ అలాగే కాసిని కార్న్ ఫ్లేక్స్ తినేసి త్వరగా తెమిలి,సామాన్లు అన్నీ సర్దేసుకుని, క్యాబిన్ ఖాళి చేసి,క్యాబిన్ యజమానికి చెప్పి బయటపడ్డాం.....ఆ క్యాబిన్ వదిలి వస్తుంటే బాధేసింది :( . కానీ ఏం చేస్తాం? మన ఇల్లు కాదు కదా!!...


ముందుగా పిక్చర్డ్ రాక్స్  క్రూయిజ్ దగ్గరికి వెళ్ళాం......ఈసారి కొంచెం ముందు వెళ్ళాం నిన్నటిలాగా మిస్ అవకూడదని....పోద్దున 9:30 కి అస్సలు ఎండ లేదు....విపరీతమైన చలి...నేనైతే నా హుడ్ స్వెట్టర్ వేసేసుకుని కూర్చున్నా ఫెర్రి పైన ఎక్కి ముందు వరసలో......చాలా మంది చలికి తాళ లేక కిందనే కూర్చున్నారు...కానీ చూడటానికి వచ్చి కింద ఎందుకు కూర్చోవడం అని అలాగే చలికి తట్టుకుని పైన కూర్చున్నాం....మెల్లగా ఫెర్రి అంతా నిండేసరికి 10:15....అప్పుడు బయల్దేరింది......ఫెర్రి కెప్టెన్ తనని తాను పరిచయం చేసుకుని మైక్   లో పిక్చర్డ్ రాక్స్  గురించి,'లేక్ సుపీరియర్' గురించి చెప్పడం మొదలుపెట్టాడు....మంచి నీటి సరస్సు అయిన 'లేక్ సుపీరియర్' ఒడ్డున వరుసగా ఉండే అందమైన రాళ్ళే ఈ 'పిక్చర్డ్ రాక్స్ '....మధ్యలో గుహలు,జలపాతాలు,నదులు,బీచ్ చూసుకుంటూ ఫెర్రి లో మూడు గంటలు సాగే ప్రయాణమే ఈ 'పిక్చర్డ్ రాక్స్ క్రూయిజ్'. మేము చేసిన తప్పు ఏంటి అంటే...ఫెర్రి లో ఎడమ వైపు కూర్చున్నాం....కానీ చూసేది అంతా కుడివైపే....'అయ్యో!!' అనిపించింది.....'సర్లే!! వచ్చేటప్పుడు ఈ దారే కదా అప్పుడు చూద్దాం' అనుకున్నాం. ముందు ఫర్వాలేదు అనేట్టుగా ఉన్న ఈ రాళ్ళ అందాలు రాను రాను అద్భుతం అనేవిధంగా ఉన్నాయి....సహజంగా ఏర్పడిన ఈ రాళ్ళు వాటి నిర్మాణం లో ఉన్న వైవిధ్యం వలన రకరకాల ఆకారాల్లో,రంగుల్లో దర్సనమిస్తాయి...కింద మెత్తటి  రాయి-పైన గట్టి రాయి ఉండటం వల్ల ఆ రెంటి మధ్య నిరంతరం జరిగే రాపిడి వల్ల ఈ రాళ్ళు ఈ రూపాలు సంతరిచుకున్నాయ్....ఇవి కొన్ని వందల సంవత్సరాల నించి జరుగుతున్న కారణాన ఈ నాటికి ఈ రూపం లో దర్సనమిస్తున్నాయ్....కొద్ది సంవత్సరాల్లో మనం ఇప్పుడు చూసినవి ఉండవచ్చు  లేక వేరే రూపాలు రావొచ్చు......


ఎన్నో రంగులు....ఎవరో చిత్రకారుడు శ్రధ్ధ గా  వర్ణాలు కలగలిపి వేసిన అద్భుత చిత్ర రాజాల్లా ఉన్నాయి....ఆ రంగుల మేళవింపు అంతా ప్రక్రుతిది అంటే ఆశ్చర్యమేస్తుంది.మధ్యలో అంతెత్తు నించి సన్నగా జాలువారే జలపాతాల హొయలు.....అక్కడక్కడ మహాసరస్సు లో సంగమించే నదీముఖాలు......కొన్ని చోట్ల సహజంగా ఏర్పడ్డ అందమైన గుహలు.....వాటిలో నించి తొంగి చూసే 'సీగల్స్' పక్షులు.....ఒకవైపు నించి చూస్తే ఒక ఆకారంలో,ఇంకోవైపు నించి చూస్తే ఇంకో ఆకారం లో దర్సనమిచ్చే రాళ్ళు, సహజంగా ఏర్పడిన 'శిలాతోరణం' ఇలా కనువిందైన దృశ్యాలు చూస్తూ గంటన్నర మైమరచిపోయం....ఒక చోట ఐతే ఏకంగా ఫెర్రి ని గుహ లోపలి తీసుకెళ్ళి మళ్ళి అలాగే వెనక్కి తీసుకొచ్చారు.అప్పుడు ముందు వరసలో కూర్చున్న మా అనుభూతి చెప్పడం కష్టం....ఒకో చోట వరుసగా 'యుద్ధ నౌకలు' లాగ నిలబడిన రాళ్ళు చూస్తే 'ఇవి ఇలా ఏర్పడ్డాయా??లేక ఎవరన్నా చెక్కారా??' అనిపించింది......అలా అడుగడుగునా అద్భుతాలు చూస్తూ చాలా దూరం వెళ్లి వెనకి తిరిగి వచ్చాం....మధ్యలో ఒక చోట పెద్ద ఓడ మునిగిపోయిన ప్రదేశం కూడా చూపించారు....అక్కడ అడుగున ఉన్న ఓడ శిధిలాలను చూడడానికి 'షిప్ రెక్ మ్యుసియం' అనే ప్రత్యక ప్యాకేజి లో తీసుకెళ్ళి చూపిస్తారు.ఫెర్రి ని వెనక్కి  తీసుకు వచ్చేటప్పు కొంచెం దూరంగా తీసుకొచ్చాడు....అప్పటికే అందరూ నీరసపడిపోయారు.....ఫెర్రి బయలుదేరేటపుడు పోటీలు పడి మరీ ఫోటోలు తీసిన మహానుభావులు వచ్చేటప్పుడు చప్ప పడిపోయారు.....అలా అందమైన అనుభూతులు మూట కట్టుకుని తిరిగి వచ్చాం....అసలు 3 గంటలు యిట్టె గడిచిపోయాయి...


తరువాత 'సబ్వే' కి వెళ్లి  'వేజ్జి డిలైట్' తీసుకుని తిరిగి  'జలపాతాలు' చూసే కార్యక్రమం మొదలుపెట్టాం....ఈసారి ఎలాగైనా 'మినిసింగ్ ఫాల్స్' జాడ కనిపెట్టాలని ధృడ నిర్ణయం తీసుకుని చాలా జాగ్రత్తగా అంచనా వేసి ఎలాగైతేనేం అక్కడికి చేరగాలిగాం......పార్కింగ్ నించి కేవలం కొద్ది దూరం లో ఉన్నాయి ఈ ఫాల్స్....అక్కడే ఉన్న చెక్క బెంచిల్లో కూర్చొని 'సబ్వే' తినేసి పక్కనే ఉన్న ఆపిల్ చెట్లు వాటికి విరగ కాసిన ఆపిల్ కాయలు చూస్తూ ఫాల్స్ దగ్గరకి బయలుదేరాం......'మినిసింగ్ ఫాల్స్' కూడా కాఫీ రంగులో ఉన్నాయి....చాలా అందం గా  ఉంది ఈ జలపాతం....కానీ 'ఇక్కడ రాళ్ళు చాలా మెత్తగా ఉండటం వలన అప్పుడప్పుడు అవి కూలిపోయి ప్రమాదాలు జరుగుతాయి దగ్గరికి వెళ్లొద్దు' అని బోర్డు పెట్టారు.....ఈ  జలపాతం దగ్గరకి వెళ్ళే దారి అందమైన చెట్లతో భలే గా ఉంది......ఇక అక్కడినించి 'వాగ్నర్ ఫాల్స్' కి బయలుదేరాం......ఈ జలపాతం కూడా  చాలా అందంగా ఉంది....మనం ఇళ్ళలో పెట్టుకునే 'సీనరి' లో ఉండే జలపాతం లా ఉంది....దానికి వెళ్ళే దారి కూడా వంతెనలతో,చెక్క మెట్లతో ఆహ్లాదంగా ఉంది...దాని పక్కనే ఇంకో చిన్న ప్రవాహం ఉంది....కానీ అక్కడికి వెళ్ళడానికి దారి  లేదు..నాకు,చందూ కి అందులోకి వెళ్ళాలనిపించింది.....వెంటనే ఫెన్సింగ్ ఎక్కి దూకేసి అక్కడికేల్లాం...భలే ఉంది అది...చల్ల గా ఉన్న నీటి లో కాసేపు ఆడుకుని,నున్నని గులకరాళ్ళు ఏరుకుని,కాసేపు అక్కడే కూర్చుని మెల్లగా బయల్దేరి వచ్చాం...నాకు ఆ ప్రదేశం భలే నచ్చింది...చుట్టూ చెట్లు,స్వచ్చంగా ప్రవహిస్తున్న సన్నని జలధార, ఒంపులు తిరుగుతూ బండరాళ్ల మధ్య అది ప్రవహిస్తున్న తీరు,పక్కనే  నున్నటి గులకరాళ్ళు,ఎదురుగా చెక్క వంతెన.... ప్రక్రుతి లో మమేకమై ఎటువంటి కాలుష్యం లేని అంత అందమైన చోటు వదిలి ఎలా రావడం???? కానీ చేసేదేమీ లేక అప్పటికే సమయం మించిపోతున్నందున ఎలాగో అలా మళ్ళి ఆ ఫెన్సింగ్ ఎక్కి దూకి వచ్చేసాం....


తరువాత ఇక నేరుగా ఇంటిముఖం పట్టాం...ఈసారి 'మెకినా బ్రిడ్జి' కి వేరే దారిలో వెళ్ళాం....'లేక్ మిషిగన్' పక్కగా సాగే ఈ దారి ఐతే ఆహ్లాదంగా ఉంటుంది అన్న ప్రసన్న సలహాతో అటు వైపు వెళ్ళాం...కనుచూపు మేర నీలివర్ణం లో సూర్యకాంతి ని ప్రతిఫలిస్తున్న 'లేక్ మిషిగన్' ని చూస్తూ 'మెకినా బ్రిడ్జి' చేరుకున్నాం. అక్కడ కాసేపు గడిపి,కొంచెం స్వాంతన పడి...మళ్ళి ఇంటిదారి పట్టాం.....


'అప్పర్ పెనిన్సులా' వదిలి వస్తుంటే 'అయ్యో!! అప్పుడే మూడు రోజులు అయిపోయిందా?' అనిపించింది....అసలు వెళ్ళిన కారణం 'ఫాల్' చూద్దామని...కానీ ఈ సంవత్సరం ఇక్కడ ఇంకా 'ఫాల్' మొదలవలేదు....అక్కడక్కడ మాత్రమే చెట్లు  రంగులు మారాయి....చందూ,కృష్ణ,ప్రసన్న కొంచెం నిరుత్శాహపడ్డారు 'ఫాల్' రాలేదని ,అది ఉండి ఉంటే ఇంకా అందంగా ఉండేది అని....కానీ నేనైతే ఇప్పటిదాకా చూసిన ప్రక్రుతి సౌందర్యానికి  దాసోహమైపోయా......'ఈసారి కాకపొతే వచ్చే ఏడాది చూడొచ్చు ఫాల్ ఏమి ఫర్వాలేదు '...అనుకుని అప్పటిదాకా చూసిన ప్రక్రుతి అందాలను మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకుంటూ ఇంటికి వచ్చా!!


నేను ఇప్పటిదాకా చూసిన వాటిల్లో నాకు బాగా నచ్చిన ట్రిప్ ఇది....
కొండలు,జలపాతాలు,బీచ్,నదులు,సరస్సులు,అడవులు,ట్రెక్కింగ్,క్యాబిన్లు...ఓహ్!! అద్భుతమైన అందాల మణిహారం ఈ 'అప్పర్ పెనిన్సులా'.....ఇంతటి మంచి అనుభూతికి కారణమయిన చందూ కి ధన్యవాదాలు :)


ఈ రోజు తీసిన కొన్ని చిత్రాలు:


పిక్చర్డ్ రాక్స్:














మినిసింగ్ జలపాతం:







వాగ్నర్ జలపాతం:





మిషిగన్ సరస్సు నీటి స్వచ్చతకి దర్పణం:



మెకినా బ్రిడ్జి:





10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

అప్పర్ పెనిన్సులా అందాలు-2

మర్నాడు పొద్దున్నే (అంటే 9:00 కి అన్నమాట) లేచి ముందు వెళ్లి బ్యాక్ యార్డ్ తలుపు తీసా!! చల్లని గాలి లోపలి దూసుకు వచ్చింది....అప్పటికే బారెడు పొద్దెక్కినా నిన్నటి వర్షం తాలూకు మహిమ వల్ల ఇంకా సుర్యారావుగారు ఆకుల చాటు నించి నేలను తాకట్లేదు....'ఈ  చల్ల చల్లటి అడవి గాలి మధ్య వేడి వేడి టీ పడితే అదుర్స్' అనుకుని  వెంటనే ఫ్రెష్ అయ్యి టీ పని పట్టేలోపు అందరూ లేచేసారు....పెద్ద పెద్ద కప్పుల్లో టీ పోసుకుని ఇక వనవిహారానికి బయలుదేరాం నేను,చందూ....క్యాబిన్ లో హీటర్స్ దయవల్ల చలి తెలియలేదు కానీ అబ్బో చాలా చల్లగా ఉంది వాతావరణం....మెల్లగా టీ తాగుతూ అలా అడవిలో కొద్దిలోపలికి వెళ్లి ఆ చలికి తాళలేక ఇక వెనుదిరిగాం....తరువాత బ్రెడ్ టోస్ట్ చేసుకుని మేపిల్ సిరప్ తో,రాత్రి మిగిలన టమాటా-బంగాళదుంప కూరతో శాండ్ విచ్ లా  చేసుకుని ఫలహారం కానిచ్చాం......ఇక త్వర త్వరగా అందరం స్నానాలు కానిచ్చి బయలుదేరడానికి సిద్ధం అయ్యాం.అందరూ చక్కగా 'షూస్' తెచ్చుకున్నారు...నేనేమో స్టయిల్ గా 'శాండల్స్' వేసుకెళ్ళా...బయట అడుగుపెడితే చలికి కాళ్ళు మొద్దుబారిపోయి అసలు చలనం లేదు కాసేపు....'ఎలా రా దేవుడా?? ఈరోజు??' అనుకుని చేసేదేమిలేక ఒకటికి రెండు స్వెట్టర్స్ వేసుకుని బయలుదేరా ....


ముందుగా 'టాకోమేనన్ ఫాల్స్' కి బయలుదేరాం....అక్కడికి  వెళ్ళడానికి షుమారు గంటన్నర  పట్టింది....అక్కడికి వెళ్లేసరికి 'అప్పర్ ఫాల్స్','లోయర్ ఫాల్స్' అని రెండు ఉన్నాయి...'సర్లే ముందు 'అప్పర్ ఫాల్స్' కి వెళ్దాం' అని  వెళ్ళాం....చిన్న 'ట్రెక్కింగ్ ట్రాక్' లో నడుచుకుంటూ కాసేపు మెట్లు దిగి 'ఫాల్స్' దగ్గరికి వెళ్ళాం.......నేను చాలా జలపాతాలు చూసా...నయగారా కూడా చూసా. కానీ ఈ జలపాతం వింతగా ఉంది.రంగు రంగుల్లో భలేగా ఉంది.నాకైతే కాఫీ డికాషన్ జలపాతం లా పారుతున్నట్టు అనిపించింది.ఆ నీటిలో కలిసిన కొన్ని ఆమ్లాల వల్ల,కొన్ని ఖనిజాల వల్ల వాటికి ఆ రంగు వచ్చిందట.బ్రౌన్,పసుపు రంగుల్లో నీలి ఎండలో మెరుస్తూ జాలువారుతున్న ఆ ప్రవాహాన్ని అంతే చూస్తుండిపోయా కాసేపు....ఇక కాసిని ఫోటోలు తీసుకుని అక్కడనించి ఇంకొంచెం కిందకి మళ్లీ 'ట్రెక్కింగ్' చేసుకుంటూ వెళ్ళాం....అక్కడ ఇదే జలపాతం నీరు దూరం నించి కనపడుతుంది......'లోయర్ ఫాల్' ఇదేనేమో అనుకున్నాం..కానీ అది వేరు అట....సరే అని మళ్ళి దాన్ని చూడడానికి బయలుదేరాం. అక్కడ 3 మైళ్ళు నడిస్తే 'లోయర్ ఫాల్స్' చూడొచ్చు అని బోర్డ్ పెట్టారు  ....'అంత ఓపిక లేదమ్మా!! అదేదో ఇక్కడినించే చూసేద్దాం' అని దగ్గరలో ఉన్న చిన్న చెక్కబల్ల మీద నించి చూసాం.....అంత గొప్పగా 3 మైళ్ళు నడిచి చూసే దృశ్యం ఏమి కాదులే అనుకుని వెనుదిరిగాం.....అప్పటికే మేము వచ్చి గంటన్నర పైనే అయింది......మధ్యాహ్నం  ఒంటిగంట.ఆత్మారాముడు గోలపెడుతున్నాడు...సరే అని మా క్యాబిన్ కి వెళ్ళే దారిలో ఉన్న 'సబ్వే' కి వెళ్లి ఒక 'ఫుట్లాంగ్ వేజ్జి డిలయ్ట్' తీసుకుని ఎక్కడ  తిందామా అని ఆలోచిస్తుండగా 'రోడ్ సైడ్' పార్క్ కనిపించింది.....అక్కడ తినడం  కానిచ్చేసి ఇక 'పిక్చర్డ్ రాక్స్' క్రుయిస్ కోసం బయలుదేరాం. అది 'మినిసింగ్' దగ్గర ఉంది....'టాకోమేనన్ ఫాల్స్' నించి 'పిక్చర్డ్ రాక్స్' కి సుమారు గంటన్నర  పట్టింది......మేము వెళ్లేసరికి 4:30 క్రుయిస్  వెళ్ళిపోయింది....సరేలే 'సన్ సెట్ క్రుయిస్ ' కి వెళ్దాము అనుకుని అది ఎన్నింటికో వాకబు చేసాము....ఆరు కి బయలుదేరుతుంది కాబట్టి 5:45 కి వచ్చేయమన్నారు....సరే అని ఈ లోగా దగ్గర ఉన్న జలపాతాలు,లైట్ హౌస్లు చూద్దాం అనుకుని బయలుదేరాము.


ముందుగా 'మైనర్స్ కాజిల్' చూద్దాం  అనుకున్నాం. సరే అని అక్కడికి వెళ్ళాం. అక్కడ నించి 'మైనర్స్ కాజిల్' దృశ్యం బాగుంది.నీలిరంగు సరస్సు పక్కన ఎత్తైన కొండమీద అందంగా ఉన్న బండరాళ్ల సోయగమే ఈ 'మైనేర్స్ కాజిల్'.దాన్ని ఇంకా దగ్గరగా చూద్దామని అక్కడికి  నడుచుకుంటూ ,మెట్లు ఎక్కిమరీ వెళ్లి చూస్తే దూరంగా ఒక పెద్ద రాయి,పక్కనే 'లేక్ సుపీరియర్' కనిపించాయి...'హా దీనికోసమా ఇంత కష్టపడి  వచ్చింది!!'అనుకున్నాం.....దూరం నించి చూసినంత అందంగా దగ్గరనించి చూస్తే అనిపించలేదు(దూరపు కొండలు నునుపు అంటే ఇదేనేమో).తరువాత దగ్గరలోనే 'మైనర్స్' నది ఇంకా బీచ్ ఉన్నాయని చెప్పి అక్కడికి వెళ్ళాం. నది ఐతే నాకు కనిపించలేదు మరి బీచ్ మాత్రం చాలా బాగుంది[పెద్ద సముద్రల్లా ఉండే వాటినేమో సరస్సులు అంటారు....పిల్లకాలువలు కంటే సన్నగా ఉండే వాటినేమో నదులు అంటారు...ఇదేమి  దేశమో ఏంటో నాకేమి అర్ధం కాదు :( ] కానీ నీళ్ళు గడ్డకట్టుకు పోయేలాగా చల్లగా ఉన్నాయ్....సముద్రం లాగ పెద్ద పెద్ద అలలు కూడా వస్తున్నాయ్!! అక్కడ కాసేపు గడిపాము....ఇక 'క్రుయిస్' వేళ అయిందని అక్కడినించి బయలుదేరాం....సరిగ్గా 5:50 కి ఐదునిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాం.అంతే! టికెట్లు లేవన్నారు.....అదేమంటే....'చెప్పాం కదా 5:45 కి రమ్మనమని' అన్నారు....'అబ్బో!! ఐదు నిమిషాలకేనా ఇంత దృశ్యం!!' అనుకుని రేపు పోద్దున ఎన్నింటికో క్రుయిస్ టైం కనుక్కుని ,కాసేపు అక్కడ చిన్న షాపింగ్ చేసి కాఫీ తాగి బయలుదేరాం.తరువాత ఏంచేద్దాం అంటే ఇక మళ్లీ 'ఫాల్స్','లైట్ హౌస్' కోసం వేట మొదలు.......


ముందుగా 'మినిసింగ్ ఫాల్స్' కి వెళ్దాం అనుకుని రూట్ చూసాం....కానీ అక్కడ ఏమిలేదు.....'లేక్ సుపీరియర్' ఒడ్డు తప్ప జలపాతాలు సరే కనీసం కొండ కూడా లేదు....ఇది కాదు తప్పు దారి అనుకుని కాసేపు అక్కడే అటు ఇటు తిరిగాం...అయినా ఫలితం శూన్యం. ఇక చేసేదేమీ లేదు అప్పటికే 7 అయిపోవచ్చింది....సరే ఇంకో 'వాటర్ ఫాల్' చూద్దాం  అనుకున్నాం. దగ్గరలోనే 'మైనర్స్ ఫాల్' ఉంది. 'సరే ఇక్కడిదాకా వచ్చాం అది చూసేసి వెళ్దాం.ఇవాళ ఎటు ఖాళి యే కదా మళ్లీ రేపు వీలుపడుతుందో లేదో ' అనుకుని అక్కడికి బయలుదేరాం....అక్కడికి వెళ్లేసరికి 7:20.ఎవ్వరూ  లేరు.తీరా చూస్తే మైలున్నర నడవాలి జలపాతం దగ్గరికి వెళ్ళాలంటే అని ఉంది.గుండె గుభేలు మంది.నేనైతే వెనుదిరిగి వెళ్దాం అన్నా...అహ!! నామాట ఎవరు వింటారు???  'ఏంటి ఇందు దీనికే భయమా??' అని 'పదా !' అని తీసుకెళ్ళారు....అసలే 'షూస్' వేసుకోలేదు....ఇంకా అడవి...'ట్రెక్కింగ్ ట్రాక్' అంతా గులకరాళ్ళు....పైగా ఎముకలు కోరికే చలి.....మసక చీకటి....ఒక్క  మనిషి లేడు...'ఇప్పుడు ఇది అంత అవసరమా??రేపు చూడొచ్చు కదా!!!' అని నాలో నేను వంద సార్లు అనుకుని ఉంటాను...ఎక్కడ  నించి యే ఎలుగుబంటి వస్తుందో...యే తోడేలు మీద పడుతుందో అని చుట్టూ బిక్కచూపులు చూసుకుంటూ వస్తున్న  నన్ను చూసి వీళ్ళు పడి పడి నవ్వడం....నాకేమో ఆ నవ్వులు విని ఎమన్నా జంతువులు దగ్గరలో ఉన్నవి వస్తాయేమో అని ఇంకా భయం....'దేవుడా!!నీవే దిక్కు' అనుకుని ఇక అలాగే ఆ రాళ్ళలో నా అందమైన శాండల్స్ వేసుకుని ముందుకు సాగా!!.....అలా మైలు దూరం నడిచాక వచ్చింది..'మైనర్స్' జలపాతం....చాలా అందంగా ఉంది....అప్పటిదాకా పడ్డ శ్రమ మరిచిపోయేలా ఉంది.....ఈ జలపాతం లో నీరు కూడా కాఫీ రంగులో ఉన్నాయ్...కాసేపు అక్కడ ఉండి మళ్లీ వెనుదిరిగాం....ఈసారి బాగా చీకటి పడిపోయింది....వచ్చిన దారిలోనే వడివడిగా నడుచుకుంటూ....రొప్పుతూ రోస్తూ ఎలాగో అలా కార్ దగ్గరకి చేరుకునేసరికి అందరికీ నీరసం వచ్చేసింది....అప్పుడు టైం 8:10....ఎవరన్నా రాత్రి పూట ట్రెక్కింగ్ చేసి జలపాతాలు చూస్తారా??? మేము చూసాం :(


ఇక ఎటు కాకుండా సరాసరి క్యాబిన్ కి వెళ్దామని ఆర్డర్స్ వేసేసా...!! మళ్లీ కథ మామూలే....టీ తాగి కొంచెం స్వాంతన పడి ....ఇక వంట మొదలుపెట్టాం.....మళ్లీ టమాటా కూర,మిక్స్డ్ వేజ్జి కూర,ఆలూ-టమాట కూర,రొట్టెలు,అన్నం (స్పైసేస్ అటు ఇటు మార్చి వేసి వేరే రుచి తెచ్చాం లెండి )....ఈరోజు కూడా ఐస్ క్రీం తినడం మర్చిపోయి.....నిద్ర తూలిపోతుండగా గమ్మున ఎక్కడికక్కడ  పడుకుండిపోయాం....


అలా మా యాత్రలో రెండవ రోజు గడిచింది.....


ఈరోజు తీసిన కొన్ని చిత్రాలు ఇక్కడ:


'టాకోమేనన్ ఫాల్స్(అప్పర్)' :






'టాకోమేనన్ ఫాల్స్(లోయర్)' : 



మైనర్స్ కాజిల్:


మైనర్స్ బీచ్:


మైనర్స్ ఫాల్స్:



8, సెప్టెంబర్ 2010, బుధవారం

'అప్పర్ పెనిన్సులా' అందాలు-1

3 రోజుల సెలవులు....
అందరూ న్యూయార్క్,వాషింగ్టన్,నయగారా ట్రిప్స్ వేసుకుంటున్నారు.......
అవన్నీ ఎప్పుడైనా చూసేవే...ఇది 'ఫాల్' సీజన్ కాబట్టి మనం 'అప్పర్ పెనిన్సులా' కి వెళ్దాం అని చందూ ప్లాన్....
ఒక్కళ్ళమే వెళ్తే ఎం బాగుంటుందని చందూ ఫ్రెండ్స్ అయిన కృష్ణ-ప్రసన్న వాళ్ళని మాతో పాటు  వస్తారేమో అడిగాము..'సరే' అన్నారు....
ఇక 'హోటల్స్' బుకింగ్  అప్పుడు బాగా అలోచించి 'క్యాబిన్' బుక్ చేసాం...అడవిలో అన్నీ వసతులతో ఉండే 'క్యాబిన్' ఐతే  బాగుంటుందని...మాములు 'హోటల్స్' లో ఉండటం ఎప్పుడూ ఉండేదేగా ఇదైతే 'వెరైటీ' అని 'క్యాబిన్' బుక్ చేసాం....


ఇక 'అప్పర్ పెనిన్సులా' విషయానికి వస్తే ....మిషిగన్ రాష్ట్ర పై భాగం లో ఉండే అందమైన ద్వీపకల్పం.....5 మహా సరస్సులతో అలరారే మిషిగన్ రాష్ట్రం లో పెద్ద సరస్సు అయిన 'లేక్ సుపీరియర్' ఒడ్డున ఉన్న 'మినిసింగ్' అనే ద్వీపకల్పానికే 'అప్పెర్ పెనిన్సులా' అని పేరు...ఇక్కడ నవంబరు-ఏప్రిల్ వరకు విపరీతమైన మంచు కురుస్తుంది....అప్పుడు ఇక్కడికి వెళ్ళడం కష్టం...కానీ ఈ 'ఫాల్' లో వెళ్ళడం మంచి సమయం....రంగులు మారిపోయి వసంతం ఆడుకునే చెట్లు....తుళ్ళుతూ ప్రవహించే జలపాతాలు.....చల్లని గాలులు...లేలేత సూర్యకిరణాలు.....దట్టమైన 'హైవత' అడవులు.....కనువిందు చేసే 'పిక్చర్డ్ రాక్స్' అందాలు...ఇంకా కనుచూపు మేర విస్తరించి ఉండే మహా సరస్సు 'సుపీరియర్'......వెరసి అందమైన భూతల స్వర్గం ఈ 'అప్పర్ పెనిన్సులా'...


శనివారం ప్రొద్దున బయల్దేరి కృష్ణ వాళ్ళని కలిసి అక్కడ నించి 'అప్పర్ పెనిన్సులా' కి మా ప్రయాణం మొదలు పెట్టాం......కేవలం రెండే రెండు 'నేషనల్ హైవేస్' మీద సాగే ఈ ప్రయాణం వర్షం వల్ల కొంచెం చిరాగ్గా అనిపించినా బానే సరదాగా సాగిపోయింది....మధ్యాహ్నం 2 గంటలకి 'మెకినా' ద్వీపం చేరుకున్నాం....అప్పటిదాకా చందూ తప్ప అందరం నిద్రపోయాం.....అప్పటికే 'మెకినా' దాటేసాం...ఇక చిన్న చిన్న ఊర్లు తప్ప పెద్దవి ఏమి తగలట్లేదు....ఆకలి దంచేస్తోంది...ఒక పక్క వాన....కార్ లో 'గ్యాస్' అయిపోవచ్చింది... ఇక 'గ్యాస్ స్టేషన్' కోసం వెదుకులాట మొదలు పెట్టాం...ఒక చిన్న ఊరిలో దొరికింది ఒక బుజ్జి 'గ్యాస్ స్టేషన్'.అక్కడే బండికి, మాకు కూడా 'ఫ్యూయల్' దొరికింది....ఒక లోకల్ రెస్టారెంట్ కనిపించింది....మేము తినగలిగేవి 'ఆనియన్ రింగ్స్,ఫ్రెంచ్ ఫ్రయ్స్' మాత్రమె...సరే అని అవే తీసుకుని చిన్న చిన్న తుంపర్లు పడుతుండగా అలాగే నిల్చొని చక చకా తినేశాం...ఆకలి ఐతే తీరలేదు కానీ కొంచెం ఫరవాలేదనిపించింది.'మెకినా' బ్రిడ్జి వరకు 70-80MPH మీద ఝాం..అంటూ దూసుకుపోయిన మేము అక్కడినించి 50MPH మీద మెల్లగా వెళ్ళాల్సివచ్చింది....మధ్యలో 'పిజ్జాహట్' కనిపించేసరికి ప్రాణం లేచి వచ్చింది...'హమ్మయ్య' అనుకుని అక్కడికి వెళ్ళిపోయి  పిజ్జా,బ్రెడ్ స్టిక్స్ లాగించేసి ఇక మెల్లగా మా క్యాబిన్ కి  బయలుదేరాం ....సరిగ్గా 'మెకినా' బ్రిడ్జి నించి 2 గంటల్లో మా 'క్యాబిన్' ఉండే ప్రాంతానికి చేరుకున్నాం...మేము అక్కడికి చేరేటప్పటికి సాయంత్రం 5:30 అయింది....కానీ వర్షం వల్ల తొందరగా చీకటి పడిపోయింది......'హైవత' ఫారెస్ట్ లో మేము ఉండే 'క్యాబిన్' కోసం కొంచెం గట్టిగానే వెతకాల్సి వచ్చింది...ఎక్కడో లోపల.. రోడ్ కి దూరంగా అడవిలో ఉంది అది...ఆ వాన లో చాలా కష్టం మీద దాన్ని  కనిపెట్టి అక్కడికి వెళ్ళాం....


చుట్టూ దట్టమైన అడవి మధ్య ఉన్న చిన్న 'క్యాబిన్ల' సమూహం అది...లక్కపిడతల్లా ఉన్న అందమైన చెక్క ఇళ్లు భలే ఉన్నాయ్ ...మా క్యాబిన్ నంబర్ ముందే తెలుసు కాబట్టి నేరుగా దానిదగ్గరకి వెళ్ళిపోయాం(అక్కడ ఆఫీస్ లో ఎవరూ లేరు మరి!)......చిత్రంగా క్యాబిన్ డోర్ తీసే ఉంది...సర్లే అనుకుని లోపలికి  వెళ్ళాం....అందమైన బుజ్జి ఇల్లు అది.....హాల్,వంటగది,డైనింగ్ ఉన్న 2-బెడ్రూం ఇల్లు...స్టవ్,వంట కి కావాల్సిన డిషెస్,ప్లేట్స్,మగ్స్.టవల్స్,కట్లరి,ఫ్రిజ్జ్,ఓవెన్, ఇంకా చాలా రకాల స్పైసేస్ ఉన్నాయి...టి.వి,డి.వి.డి ప్లేయర్,సోఫా సెట్స్,హీటర్స్ ఉన్నాయి...చిన్న చిన్న బొమ్మలతో,దుప్పుల కొమ్ములతో,ఫ్రేమ్స్ తో  చాలా అందంగా అలంకరించారు ఆ క్యాబిన్ ని.... ఇంకా బ్యాక్ యార్డ్....అక్కడ కుర్చీలు,బార్బెక్యు,ఫైర్ ప్లేస్ కూడా ఉన్నాయి.....మేము కాస్త ఫ్రెష్ అయ్యి ఇక వంట కి కావాల్సిన సామాన్లు గురించి ఆలోచించడం మొదలుపెట్టాం....వచ్చేటపుడు మాతో పాటు ఫ్రూట్స్,కార్న్,బ్రెడ్,కార్న్ ఫ్లేక్స్ తీసుకెళ్ళాం...కానీ కూరగాయలు,నూనె,బియ్యం,పాలు ఇలాంటివన్నీ ఇక్కడే కొనుక్కుందాం అనుకున్నాం....ఇక వాటిని తేవడానికి బయలుదేరాం....సుమారు ఒక 20 మైళ్ళ దూరం లో చిన్న ఊర్లో ఒక మాల్ ఉంది...అక్కడ రెండు రోజులకి సరిపడా సరుకులు తీసుకున్నాం....పైన చెప్పినవే కాకుండా టమాటాలు,బంగాలదుంపలు,అలోప్పినోస్,ఉల్లిపాయలు,మిక్స్డ్ వెజిటబుల్స్(రెండు రకాలు),ఐస్ క్రీం,టీ-బ్యాగ్స్,పంచదార,పెరుగు,టొర్టిల్లొస్(చపాతీలు లాంటివి) తీసుకుని ఇక ఇంటికి వచ్చాం....


ముందు అందరం వేడి వేడి టీ తాగి ఇక వంట ప్రయత్నాలు మొదలు పెట్టాం......నేను కూరగాయలు తరగడం....ప్రసన్న వంట చేయడం....చందూ-కృష్ణ ఏమో  రైస్ సంగతి చూడటం, పైపైన ఉప్పులు-కారాలు సరిచేయడం......టమాటా-బంగాళదుంప కూర,మిక్స్డ్ వేజ్జి కూర,బంగాళదుంప వేపుడు చేశాం...వాటిల్లో రకరకాల స్పైసేస్ కలిపి వింత రుచి తెచ్చాం...మిరపకాయలు బదులు అలోప్పినోస్ వాడాం....రొట్టెలు కాల్చి,అన్నం వండేసి, ఇక తిండి కి ఉపక్రమించాం....అలా అడవిలో అందమైన చెక్క ఇంట్లో సొంతంగా వంట చేసుకుని తింటుంటే ఆ రుచే వేరు........ఆ అడవిలో ఉండే జంతువులూ,అవి వస్తే మనం ఏమి చేద్దాం అనుకుంటూ...సరదాగా అందరం కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించాం....ఇక తరువాత అప్పటికే వందసార్లు చూసిన 'గాడ్జిల్లా' సినిమా పెట్టుకుని చూస్తూ మెల్లగా అందరం నిద్ర లోకి జారుకున్నాం .......


అలా అడవిలో మా మొదటి రోజు సరదాగా,ఆహ్లాదంగా గడిచిపోయింది.......




మా  క్యాబిన్ లో తీసిన కొన్ని చిత్రాలు ఇక్కడ:






1, సెప్టెంబర్ 2010, బుధవారం

జయ జయ దేవ హరే



శ్రిత కమలాకుచ మండలా........ద్రుత కుండలా....ఈ కలిత లలిత వనమాల....
జయ జయ దేవ హరే ...జయ జయ దేవ హరే....                                                ||జయ జయ||    
దినమణి మండల మండనా......భవ ఖండనా......ఈ మునిజన మానస హంసా      ||జయ జయ||
కాళియ విష ధర గంజనా..........జన రంజన........ఈ యదుకుల నళిన దినేశా        ||జయ జయ||
మధు ముర నరక వినాశనా......గరుడాసనా.......ఈ సురకుల కేళి నిదానా            ||జయ జయ||
అమల కమల దళ లోచనా........భవ మోచనా.....ఈ త్రిభువన భవన నిదానా         ||జయ జయ||
జనక సుతా కృత భూషణా........జిత దూషనా......ఈ సమరశమిత దశకంఠా          ||జయ జయ||
అభినవ జలధర సుందరా.........ద్రిత మంధరా......ఈ శ్రీముఖ చంద్ర  చకోరా            ||జయ జయ||
తవ చరణే ప్రణతావయా...........ఇతి  భావయా.....ఈ కురు కుశలం ప్రణతేశూ         ||జయ జయ||
శ్రీ జయదేవ కవేరిదం...............కురుతేముదం.....ఈ మంగళ ఉజ్వల  గీతం           ||జయ జయ||


అర్ధ్ధం :


లక్ష్మీదేవి ని వక్షస్థలమునందు,కర్ణములకు కుండలాలను,మెడలో తులసిమాలను ధరించిన హరీ నీకు జయము జయము....
ప్రచండ సూర్యునివలే ప్రకాశిస్తూ,ఆలోచనలను ఖండిస్తూ,మునుల హృదయాలలో హంసవలె విహరించే  హరీ నీకు  జయము జయము
కాళియుని విషాన్ని హరించి,జనరంజకుడవై,యదుకుల రత్నమై వెలిగే హరీ నీకు జయము జయము....
మధు-ముర రాక్షసులను వధించి,గరుత్మంతుని అధిరోహించి,దేవలోకాన్ని రక్షించిన హరీ నీకు జయము జయము....
కలువరేకుల వంటి కన్నులతో,భవమోచన కలిగించే,త్రిభువన నాధుడవైన హరీ నీకు జయము జయము....
జానకి దేవిని చేపట్టి,అధర్మాన్ని జయించి,రావణుడిని వధించిన హరీ నీకు  జయము జయము...
నీలమేఘ శ్యాముడవై,మంధర పర్వతాన్ని మోసి, చంద్రుని వలె అందమైన ముఖారవిందాన్ని కలిగిన హరీ నీకు జయము జయము...
నీ చరణారవిందాలకి ప్రణమిల్లుతూ,నీ కరుణా కటాక్ష వీక్షణాలు కోరుతూ...జయదేవుడు నీకై వ్రాసిన,మంగళకరమైన గీతం ఈ గీతం....
హరీ నీకు  జయము జయము...శ్రీ హరీ నీకు జయము జయము....


-జయదేవ(గీత గోవిందం)  


అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు...ఈ శుభ దినాన ఆ దేవదేవుని పాదారవిందాలకు నమస్కరిస్తూ చిరు కానుక గా సమర్పించిన జయదేవుని అష్టపది...