6, జనవరి 2011, గురువారం

బుద్ధం శరణం గఛ్చామీ!!

హా! వచ్చేసా! ఇంకో పోస్ట్ తో వచ్చేసా!ఏంటి?! 'శ్రీ కృష్ణ కమిటి' నివేదిక అర్ధం కాక బుర్ర హీటెక్కిందా? ఐతే కాసేపు అలా ఆచ్చికి పోదాం రండి. ఒక ఐదు సంవత్సరాల వెనక్కి వెళదామే!!.అంటే అప్పుడు 2006 అన్నమాట...గిర్రు గిర్రు అని సున్నాలు గీసుకుంటూ(అంటే ఫ్లాష్ బాక్ లోకి అని అర్ధం...అర్ధం చేసుకోరూ!!) మీరూ నాతో పాటు  వచ్చేయండే!ఆ...ఆ....మరీ బాలకృష్ణలాగా ఐదొందలేళ్ళు కాదు....ఐదేళ్ళు చాలు.హా! అద్దీ అక్కడ ఆగిపోండి.ఇప్పుడు చెప్తా వినండి.

సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం.....నేను ఇంజినీరింగ్ రెండో సంవత్సరం....అది కూడా హాస్టల్లో(పేయింగ్ గెస్ట్ అనుకోండి) వెలగబెడుతున్నా.ఇది చెప్పడానికా ఇన్ని గిర్రులు తిప్పావ్ అని తిట్టుకోకండి....చెప్తా!చెప్తా! అప్పుడొచ్చింది ఈ పండగ....'కాల చక్ర-2006-అమరావతి'. ఆహా! మా అమరావతి.మా గుంటూరు పక్కన....అమరేశ్వరుని సన్నిధిలో.... కృష్ణానది ఒడ్డున  ఒద్దిగ్గా ఉండే అమరావతి...కానీ ఇది ఏ హిందూపండగో....జాతారో కాదు....బౌధ్ధుల పండగట.మా అమ్మకి,నాకు బౌద్ధం అంటే కొంచెం ఇష్టం.చైనాలో షాంఘైటెంపుల్......హిమాచల్ ప్రదేశ్ లో ధర్మశాల......మేము చూడాలనుకున్న విష్ లిస్టులో ప్రముఖ స్థానంలో ఉంటాయ్! అన్నిటికంటే ఎక్కువ ఆకర్షించింది 'దలై లామా' వస్తున్నారన్న విషయం.మరి ఆయన ప్రపంచ శాంతి దూత కదా! నాకు ఆయనంటే బోలెడు ఇష్టం.'నో వార్....ఓన్లీ పీస్' టైపు కదా! మా అమ్మ డిక్లేర్ చేసింది....'నేను వెళుతున్నా...మీరు వస్తారా?' అని.నేనెటు హాస్టల్ కదా కుదరదని చెప్పా! కానీ మా నాన్న రోజు అమ్మని తీసుకెళ్ళి...ఒక గంట అలా ఉండి వచ్చేవారు....ఇక  నేను ఉండబట్టలేక ఒక మూడు రోజులు కాలేజికి డుమ్మాకొట్టి ఈ కాలచక్రాకి  వెళ్ళా అనుకోండి!!

2006....జనవరి ఆరవ తేదీన....మొదలయింది ఈ కాలచక్ర మహోత్సవం.సుమారు పదిహేనో తేదీ వరకు జరిగింది.చివరి మూడు రోజులు చాలా ప్రాధాన్యం కలవి.ఇన్నిరోజులూ కష్టపడి వేసిన కాలచక్ర ముగ్గు....అప్పుడు అందరికీ ప్రదర్శిస్తారు.జనవరి నెల మొదలు అమరావతి అంతా ఎర్ర రంగు పులుముకుంది.ఎరుపు రంగు దుస్తులు ధరించిన బౌద్ధభిక్షవులతో కిక్కిరిసిపోయింది.రోడ్లన్నీ టిబెటన్ స్టాల్స్ తో...ఎక్కడికక్కడ గుడారాలతో.......టిబెటన్ వంటకాల ఘుమఘుమలతో.....బౌద్ధభిక్షవుల బాకాల చప్పుళ్ళతో.....టిబెటన్ పాటల హోరుతో....అబ్బో సందడే....సందడి.అమరావతిలో మా పెదనాన్నవాళ్ళు గుడివీధిలో ఉంటారు.వాళ్ళింటికి వెళ్ళడానికి మేము ఎంత దూరం నడిచామో! ఎక్కడో ఊరవతల ఆపించేసారు కార్లని.అక్కడినించి నేను,మా అమ్మ లెఫ్టు...రైటు....మేము ఇలా కాదని....బస్సుల్లో వెళ్ళడం మొదలుపెట్టాం.అప్పుడు కొంచెం లోపలి పోనిచ్చారు...ఏదో గుడ్డిలో మెల్ల అనుకున్నాం.

సరే! ఒకరోజున  అలాగే చస్తూ..బ్రతుకుతూ...ఆ టిబెట్ వాళ్ళని తోసుకుంటూ....ఎలాగో అలా ఆ కాలచక్ర జరిగే చోటికి వెళ్లాం.అందరికంటే ముందు వెళ్ళడం వల్ల డయాస్కి చాలా దగ్గరలో సీట్ దొరికింది మాకు.....నేల మీదే లెండి.ఎవరెవరో  వచ్చారు... ఏంటేన్టో చెప్పారు....నేనేమో 'దలైలామా' కోసం వెయిటింగ్.అసలే మనం తోకలేని కోతులం.ఏదో ఇలాంటి మహానుభావుల ప్రసంగాల వల్ల కొంచెం జ్ఞానం అయినా కలుగుతుందని నా ఆశ :)) అలా చాలాసేపు....ఎదురు చూసి.... చూసి.... నీరసించి.....వెంట తెచ్చుకున్న చాక్లెట్లు.... బిస్కెట్లు ...అవ్వగోట్టేసి....'అమ్మా! ఆకలే!' అని ఎక్స్ప్రెషన్ పెట్టి మా అమ్మ వంక జాలిచూపులు చూస్తుంటే వచ్చారు 'దలైలామా'.అచ్చం టీవీల్లో చూపించినట్టే ఉన్నారు.మెల్లగా నడుచుకుంటూ వచ్చి కూర్చుకున్నారు.కాసేపు ప్రసంగించారు.నేనైతే ఆయన్ని నోరువెళ్ళబెట్టుకుని చూడడమే సరిపోయింది.చాలా చెప్పారు! టిబెట్ గురించి....అక్కడి వాళ్ళు పడుతున్న బాధల గురించి.....టిబెట్ లో శాంతి నెలకొల్పాలంటే ప్రపంచ దేశాలు అందించాల్సిన సహకారం గురించి......బౌద్ధం గురించి...ఇలా ఎన్నో! చివరికి ఈ 'అమరావతి కాలచక్రా' ని 'టిబెట్లో కష్టాలనుభవిస్తున్న వారికి' అంకితమిచ్చారు..తనకి అమరావతి చాలా నచ్చిందని.....బుద్ధుడు ఇక్కడే కాలచక్రకి నాందిపలికాడని....ఇలా మంచి మంచి మాటలు బోలెడు చెప్పారు :)


ఇక లాస్ట్ రోజున మళ్లీ వెళ్లాను.రంగులతో ఎంతో చక్కగా 'కాలచక్ర' ముగ్గు వేసి దానిని వారి పద్ధతుల్లో పూజించి మా అందరికీ ప్రదర్సనకి  పెట్టారు.నేను,అమ్మా వెళ్లి చూసొచ్చాం! ముగ్గు ఎంత బాగుందో! నాకు మామూలు ముగ్గులే రావు....ఈ ముగ్గు చూసి ఫ్లాట్!!నాకు ఈ ముగ్గుని చూస్తే....మన అమ్మవారి 'శ్రీ చక్రం' గుర్తొచ్చింది.ఈ ముగ్గుని బౌద్ధ మంత్రాలతో అనుసంధానించి వేశారుట!నాకు అర్ధం కానిది ఏంటంటే....'ధ్యానం ద్వారా మాత్రమె జ్ఞానాన్ని పొందగలం' అని చెప్పే బౌద్ధంలో మంత్రాలేంటి అని? తరువాత తెలిసింది...బౌద్ధంలో చాలా పధ్ధతులుంటాయనీ.ఆ తరువాత టిబెటన్ల స్పెషల్....'మోమోలు' తిన్నాం అదేదో సాస్లో నంజుకుని.భలే ఉన్నాయ్! నాకు బాగా నచ్చాయని మా అమ్మా తరువాత ఇంట్లో చాలా సార్లు అవి చేసిపెట్టేది :) ఇంకా మనకి మ్యూసిక్ పిచ్చి కదా! భాష రాకపోతే ఏం? సంగీతానికి భాషభేదాల్లెవని ఒక నాలుగైదు టిబెటన్ పాప్ ఆల్బమ్స్ కొన్నా! ఒకటి పనిచేయలేదు.మిగితా వాటిల్లో పాటలు చాలా బాగున్నాయ్! :)) మా నాన్నకి కూడా బాగా నచ్చాయ్!! 'సేవ్ టిబెట్' అని స్లోగన్స్ వ్రాసి ఉన్న మాస్క్లు..... ఇంకా బుద్ధుడి బొమ్మలు కలిగిన బీడేడ్ రిస్ట్ బాండ్స్ కూడా కొన్నా! ఈ కాలచక్ర సందర్భంగా అమరావతిలో పెద్ద బుద్ధుడి విగ్రహం కట్టటం మొదలుపెట్టారు.ఇప్పటికీ పూర్తవలేదు.అదీ మన ప్రభుత్వ నిర్వాకం :))) ఏదైతేనేం...ఎవరూ పట్టించుకోని మా అమరావతిని ఒక పదిహేను రోజులు అంతర్జాతీయస్థాయిలో ఫేమస్ చేసేసిన బుద్ధుడికి జోహార్లు :)

అసలు విషయం మర్చిపోయా! దలైలామ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకున్నా! కానీ ఆయనేమో ఏదో పనుందని వెళ్ళిపోయారు. ప్చ్! ఏం చేస్తాం! నాలాంటి గొప్ప వ్యక్తిని కలిసే భాగ్యం ఆయనకి లేదు ;)

సో! ఫైనల్ గా....'బుద్ధం శరణం గచ్చామి' అని అందరూ అనేసుకోండి. మీ మనసులు ప్రశాంతంగా ఉంటాయ్!! :) అనేసుకున్నారా? సరే! ఇప్పుడు రివర్స్ లో  గిర్రు గిర్రు అని బుద్ధిగా వెనక్కి వచ్చేయండి.....వచ్చేసారా! హమ్మయ్యా! మిమ్మల్ని క్షేమంగా కాలచక్రాకి తీసుకెళ్ళి తీసుకోచ్చేసానోచ్! :)) ఎలా ఉంది మరి మన ఆచ్??

18 కామెంట్‌లు:

kiran చెప్పారు...

హా..!!ఇంటరెస్టింగ్ పోస్ట్.. :)
దలై లమ అంటే ఒక ప్రత్యేక అభిమానం నాకు మా తమ్ముడి వల్ల వచ్చింది.. :)...
కానీ ఆయనవి కొన్ని విదేఒస్ అవి చూసాక..ఫ్యాన్ అవ్వకుండా ఉండలేం !!
ఎంతో ప్రసాంతంగా ఉంటుంది...అలంటి వాళ్ళని చూడగానే..మీరు లక్కీ..! :)

మీరు గ్రేట్ అండి..ఆదిత్య 369 తర్వాత..ఇందు 2011 .. :D

భాను చెప్పారు...

మీ అమరావతి చాలా ఏళ్ల క్రింద చూసా అప్పుడు దిగిన ఫోటో లు కూడా ఎక్కడో ఉండాలి. మీ కాల చక్ర అనుభవాలు చక్కగా కళ్ళ ముందు మేమూ మీ పక్కనే కూర్చుని అదే ఒక సారి గిర్రు గిర్రు అని వెనక్కి పోయి మళ్ళీ గిర్రు గిర్రు అని రివర్స్ లో వచ్చి చూసిన అనుభూతి కలిపించారు:)అప్పడు దీని గురించి మీడియా లో బాగా పబ్లిసిటీ ఇచ్చారు కదా

మనసు పలికే చెప్పారు...

ఇందు గారూ.. చాలా చాలా బాగుంది:) ప్రశాంతంగా ఉంది:)

రాధిక(నాని ) చెప్పారు...

అప్పుడు పేపర్లో ఈ విశేషాలు చదివేదానిని .బాగుంది చక్కగా మీరు దలైలామాని చూసారు:)).

కీర్తన చెప్పారు...

థాంక్స్ అండీ మీ పోస్ట్ తో నన్ను మా స్కూల్ వరకు తీసుకెళ్ళారు
అప్పుడు అమరావతి వచ్చే యాత్రికుల కోసం special buses వేసారు అవి మా స్కూల్ మీదుగా వెళ్ళేవి. మాకు ఉదయం 9.00 కి ట్యూషన్ నుండి స్కూల్ కి వెళ్ళేటప్పుడు అందులో ఉండే టిబెట్ వాళ్ళకి, వాళ్ళకి టాటా చెప్పడం చాలా సరదాగా ఉండేది.కాలచక్ర జరిగినన్నాళ్ళు మాకు రోజూ పండగే.
మీ ఆచ్ చాలా బాగుంది

ramki చెప్పారు...

"అలా చాలాసేపు....ఎదురు చూసి.... చూసి.... నీరసించి.....వెంట తెచ్చుకున్న చాక్లెట్లు.... బిస్కెట్లు ...అవ్వగోట్టేసి....'అమ్మా! ఆకలే!' అని ఎక్స్ప్రెషన్ పెట్టి మా అమ్మ వంక జాలిచూపులు......" సూపర్ narration అండి.....ఆ situation ని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే భలే సరదాగా వుంది ....
ఇంతకి మనం ప్రసాదం భక్తులమా లేకపోతే నిజమైన భక్తులమా.... :) ?
ఎవ్వరికి చెప్పనులెండి.....ఇది మన ఇద్దరి మధ్య సీక్రెట్...... :)

Ennela చెప్పారు...

చాల బాగుంది..నేను అప్పుడు చూడలేదేమొ కానీ ఇప్పుడు చూసేసా..ఆచ్చి తీసుకెళ్ళి అంత తొందరగా తీసుకొచ్చేస్తే ఎలా? వా ఆ ఆ ఆ ఆ నేనక్కడే ఉంటా...ఆ ఆ ఆ రివర్సు చక్రాలు నాకొద్దు....వా ఆ ఆ ఆ ఆ .పాపం ఆయనకా భాగ్యం లేదు...పోనీ మా బెట్టీకి ఆ సౌభాగ్యాన్ని కలిగిద్దామని ఉంది...సరేనా?

ఇందు చెప్పారు...

@ kiran:థాంక్యూ కిరణ్.నన్ను ఇందు2011 అంటే అన్నారు...బాలక్రిష్ణ అనలేదు...థాంక్స్ :)) అవును కిరణ్.అంత పెద్ద వయసులో ఆయన చేస్తోన్న శాంతియుతపోరాటం నాకు చాలా నచ్చింది..నేను ఆయనకి పెద్ద ఫాను.

@ భాను:అవునండీ...ఆ పదిరోజులు టీవీల్లో...పేపర్లలో..గోలేగోల :) హ్హహ్హహ్హా! ఐతే నా ఆచ్ మీకు నచ్చిందన్నమాట :)

@ మనసు పలికే:థాంక్యూ అండీ అపర్ణగారు...అలా అందరూ ప్రశాంతంగా ఉండాలనే ఈ పోస్ట్ ముఖ్య ఉద్దేశ్యం :)

ఇందు చెప్పారు...

@ రాధిక(నాని ):అవునండీ ఒక మాహావ్యక్తిని..సారీ శక్తిని చూసే భాగ్యం నాకు కలిగించాడు ఆ దేవుడు :)

@ keerthu :కీర్తు...ఆ బస్సులు ఆ రోడ్లోనించే అమరావతి వెళ్ళాలి.అప్పుడు మా రోడ్లలో అందరూ బౌధ్ధ సన్యాసులే.భలే సందడిగా ఉండేదిలే! నా ఆచ్ మీకు నచ్చినందుకు థాంకూలు :)

@RAMAKRISHNA VENTRAPRAGADA:హ్హహ్హహ్హా! ఎలా కనిపెట్టేసారు చెప్మా? నిజం చెప్పాలంటే నేను కాంబో! నాకు గుళ్ళో దేవుడూ కావాలీ...ప్రసాదమూ కావాలీ...గుళ్ళో దేవుడికి ఎంత శ్రధ్ధగా దణ్ణం పెట్టుకుంటానో...అంతే ఇష్టంగా ప్రసాదం తింటాను.ఒక్కోసారి గుళ్ళో ప్రసాదం ఐపోతే భలే కోపమొచ్చేస్తుందీ...ఇంతా కష్టపడి వచ్చి ప్రసాదం లేకపోతే ఎలా? గుళ్ళో దేవుడిని చూడకుండ ఉంటే ఎంత పాపమో...ప్రసాదం తినకుండా వెళితే అంతే పాపం.ఇది నా సూక్తి :)) అబ్బో! మన ప్రసాదం లీలల గురించి రాస్తే ఒక పోస్ట్ అవుతుంది :)) ఈ విషయం ఎవరికి చెప్పినా చెప్పకపోయినా కిట్టుగాడికి/వెంకుగాడికి మాత్రం చెప్పకండే! మళ్ళి గుడికి వచ్చేది వాడికోసం మాత్రమే కాదు అని తెగ ఫీల్ అయిపోతాడు :))


@ Ennela:సరే అక్కడే ఉండిపోండీ...మీకు తోడుగా బెట్టీని పంపిస్తా! ;) నాకొద్దు బాబొయ్! మీ బెట్టికి నేను బహుదూరం :))

మంచు చెప్పారు...

తిరిగి వచ్చేటపుడు నిద్రపట్టేసి కొన్ని రింగులు ఎక్కువ తిప్పి ఫ్యూచర్ లొకి వెళ్ళిపొయానట్టున్నా... వెనక్కి ఎలా రావాలొ కాస్త చెప్తారా :D

Ennela చెప్పారు...

manchu gaaru,,,tommidi ninchi okati reversulo lekkettandee..leka pothe urgentgaa... ringa ringa roses...reverse lo chadiveyyali mari hurry up...

మాలా కుమార్ చెప్పారు...

కాలచక్ర గురించి రోజూ పేపర్ లో చదివేదానిని . వెళ్దామని కూడా అనుకున్నాను , కాని అంత ర్ష్ లో బాబోయ్ అనుకొని వెళ్ళలేదు . మీరు అదృష్టవంతులు దలైలామాను చూసారు .

పాపం ఆయనే దురదృష్టవంతుడు :)

Sree చెప్పారు...

aach adirindi.

అశోక్ పాపాయి చెప్పారు...

దలైలామ ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధులకు అధ్యాత్మిక గురువు అని చెపుతారండి..పాపం మీమ్మల్ని కలువలేనందుకు వారు ఎంత ఫిల్ అవుతున్నారో..))పోనిలెండి మీరు మరోసారి వెళ్లినప్పుడు ఆ ఆటోగ్రాఫ్ ఎదో వారి నుండి తీసుకోండి.బుద్ధం శరణం గఛ్చామీ..హ హ్హ హ్హ మీ టపా భలే భలేగా బాగుదండి.

ramki చెప్పారు...

ఓహో.....మీరు కూడా ప్రసాదం భక్తులేనా? :)
ఐతే ఇంకేంటి ఆలస్యం.......
ప్రతి గురువారం మన బాబా గుడికి వచేయండి.....
ఎన్ని ప్రసదాలో .......
చక్రపొంగలి,దద్ధోజనం,పులిహోర, రామ్ములక్కయి అన్నం (అదేనండి...తోమతో రైస్) అబ్బో ......ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ప్లేస్ సరిపోదు ఏమో......

విరిబోణి చెప్పారు...

మీరు చాల లక్కీ ఇందు గారు..:)) అందరికి ఆ ఛాన్స్ రాదు ..పోస్ట్ చదువుతున్నతసేపు అల ఒకసారి మల్లా అమరావతి వెళ్లి వచ్చాను.

ఇందు చెప్పారు...

@ మంచు:ఎన్ని రింగులు ఎక్కువ తిప్పారో అన్ని రింగులు వెనక్కి తిప్పుకుంటూ వచ్చేయండి మంచుగారు :))

@ Ennela: LOLZ....:P

@ మాలా కుమార్ :అవునండీ కొంచెం రష్ యే!! హిహిహీ! అవును పాపం ఆయనే దురదృష్టవంతుడు :P

ఇందు చెప్పారు...

@ Sree :Thnakyou Sri :)

@ అశోక్ పాపాయి :హిహిహి! అవును పాపం దలైలామా :)) థాంక్యూ అశోక్ గారూ!

@ RAMAKRISHNA VENTRAPRAGADA: మాకు అది కొంచెం దూరమండీ.మేము దగ్గర్లో ఉన్న పరాశక్తి గుడికి ఎక్కువ వెళతాం :)

@ విరిబోణి :థాంక్యూ విరిబోణీ గారూ! :)