మొన్న సాయంత్రం 'మంగళ' సినిమా చూసాం! అసలే దయ్యాలంటే.....వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాను.... నాకు అవసరమా ఇప్పుడు 'మంగళ' చూడటం? అప్పటికే...'నాగవల్లి' సినిమా చూసి..... 'నాగవల్లా....గోడమీద బల్లా?' అనే టైటిల్ తో ఒక పోస్ట్ వేద్దామనుకుంటే....'నాగవల్లి' గారు ఇచ్చిన సీరియస్ వార్నింగ్ దెబ్బకి దడిచి ఆ పోస్ట్ పబ్లిష్ కూడా చేయకుండానే డెలీట్ చేసేసా! అయినా కూడా భయంభక్తి లేకుండా....'మంగళ' చూడ్డానికి రెడి అయిపోయా!
ఇక విషయానికొస్తే....ఒక ఆదివారం సాయంత్రం...తెల్లటి ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్మిన వేళ.....పొద్దున మిగిలిపోయిన మాడిపోయిన ఉప్మా ని మళ్లీ వేడి చేసుకుని తింటూ.....ఇదిగో....ఈ 'మంగళ' సినిమా చూడటం మొదలుపెట్టాం!
కథ పెద్దగా ఏమిలేదు....మూడు ముక్కల్లో చెప్పాలంటే.....ఆ...మూడు ముక్కలు కూడా వేస్ట్.....రెండు ముక్కల్లో..... ఛార్మి,సకూచి అంతే!
ఇందులో ఛార్మి గారు ఒక ప్రముఖ సినినటి :))
ఇక ఈ 'సకూచి ' ఎవరబ్బా అనుకుంటున్నారా? 'సకూచి'....అనగానే మీరు పసిగట్టేయాలి.....మన కాశిమజిలి కథల్లో.....'పిడతకూచి' అంటే ఎవరు? 'పిశాచి' అంటే ఎవరు? అలాగే 'సకూచి' కూడా....ఇది ఎవరినైనా ఆవహిస్తే.....వాళ్ళు చచ్చేదాకా వదిలిపెట్టదు.... :D
ఈ 'సకూచి' గారు....చార్మి గారిని పట్టుకుని పీడిస్తే...ఏం జరుగుతుందో.....అదే కథ :D
సరే...కథనం విషయానికి వస్తే....ఒక పనిపాట లేని మంత్ర గాడు(ప్రదీప్ రావత్)....పిచ్చి పిచ్చి ప్రయోగాలు, చేతబడులు చేస్తూ ఉంటాడు. వాడికి దయ్యాలు,పిశాచాలు మంచి ఫ్రెండ్స్.అలాగే మన 'సకూచి' వారు కూడా! వీడి కొడుకు చచ్చిపోవడానికి 'ఛార్మి' కారణం అని నమ్మి ఈ 'సకూచి' ని నిద్రలేపి మరీ ఛార్మి మీదికి పంపుతాడు. కాని ఇక్కడే ఉంది ఒక ట్విస్ట్! 'సకూచి'......అన్ని దయ్యాల్లాగా.....అల్లరిచిల్లరి దయ్యం కాదు! ఇది ఒక్కసారి ప్రయోగించబడితే..... సీతయ్యలాగా... ఎవరి మాటా వినదు.....ఆ ప్రయోగించిన మాంత్రికుడి మాట తప్ప! మరి మన మెంటల్ మాంత్రికుడేమో ఇంచక్కా దాన్ని ఛార్మి మీద ప్రయోగించేసి.... బాల్చి తన్నేస్తాడు. ఇక ఎలా? 'సకూచి' నించి ఛార్మి ని రక్షించే శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడుంది?
ఇంతలోనే....సినిమాలో మసాలా ఎలిమెంట్స్ మిక్స్ చేయడానికి రెండు సాంగ్లు....మూడు ఫైట్లు ఉంటాయన్నమాట! ఇందులో 'సకూచి' చేసిన ఫైట్ కూడా ఉంటుందన్దోయ్! 'సకూచి' పూనినప్పుడు.....ఛార్మి చేస్తుంది ఫైటు....హ్హహ్హహ్హా ... ఇరగదీసేస్తుందిలే! ఒంటి చేత్తో....రౌడీల దుమ్ము దులిపేస్తుంది తెల్సా! అలా 'సకూచి' వారి విశ్వరూపం ప్రదర్సించాక.....ఛార్మి బ్రతికి బైటపడే మార్గం తెలుస్తుంది....అదెక్కడో తెల్సా! ....'శివకోన' అనే జంగిల్ సెట్టింగ్ లో ;)
ఇక ఎలాగోలా రొప్పుతూ,రోస్తూ ఈ శివకోన చేరిన ఛార్మిని ఈసారి కొంచెం గట్టిగా పూనుతుంది మన 'సకూచి'. ఇక చూడండి.....ఆ శివకోనలో 'సకూచి'గారి విలయతాండవం అబ్బో కేకోకేక!ఈలోగా ఈమెని రక్షించడానికి ఒక 'అఘోర'ల గుంపు జింగుజింగుమని ఎగురుకుంటూ వస్తుంది.ఇది క్లైమాక్స్......ఇక్కడ మనం మాములుగా .....పూజలు...గట్రా ఊహించుకుంటాం. కానీ డైరెక్టర్ గారి స్కిల్ మరి! ఇక్కడ ఆ అఘోరాల చేత మాంఛి గ్రూప్ డాన్స్ పెట్టించాడు. వాళ్ళు అలా కాలికొచ్చిన డాన్స్ వేస్తూ ఉంటె....ఇక ఛార్మి గారి వెకిలి చేష్టలు మొదలౌతాయ్! నాలుక బైట పెట్టడం..... భయపెట్టాలని ముఖంలో పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ పెట్టడం....నేల మీద పాకడం...గాల్లో ఎగరడం అబ్బో! ఛార్మి నట విశ్వరూపం(!?) చూడవచ్చు! నాకైతే భయం సంగతి పక్కనబెడితే.....'ఎహే! ఏంటి ఈ సుత్తి గోల....తొందరగా తేల్చండి' అని అనిపించింది.
అలా అఘోరాలు డాన్సు....చేసి...చేసి.... ఛార్మి వికృత చేష్టలు... చేసి...చేసి...... అలసిపోతున్నప్పుడు ......నాకు విసుగొచ్చి ఆవలిస్తున్నప్పుడు..... ఇక శివుడికి చిరాకేసి .....'ఆపండ్రా బాబోయ్! మీగోల భరించలేకపోతున్నా!' అని జలశివలింగ రూపంలో దర్సనమిస్తాడు. ఆ శివజలం ఛార్మి మొహం మీద కొట్టగానే.....మనం బ్రతికిపోతాం.....అంటే....'సకూచి' గారు చార్మిని వదిలేసి వెకేషన్ కి వెల్లిపోతారన్నమాట.
అద్గదీ సంగతి! అలా ఛార్మి 'సకూచి' కి టాటా చెప్పేసి....మనకి బై చెప్పేస్తుంది.నేను బ్రతుకుజీవుడా....అని టీవీ కట్టేసా!
ఆనక ఒక స్ట్రాంగ్ టీ తాగితే కాని తలనెప్పి వదల్లేదు!
కాని నాకు ఈ సినిమాలో ఒక తీరని వెలితి కనిపించింది. అదేంటంటే.....ఎంతసేపటికి సకూచి చార్మిని ఆవహించడమే చూపించారుగాని......అసలు సకూచి 'రూపలావణ్యాలు'....'అందచందాలు' ఎక్కడా చూపించలేదు! నేనెంత ఫీల్ అయ్యానో తెల్సా! మరి రాత్రి నిద్రపోయేటప్పుడు.....నా కలలోకి సకూచి రావాలంటే....దానికి ఏదో ఒక రూపం ఉండాలి కదా! హ్మ్! ఏం చేస్తాం! నా 'సకూచి' ని చూపించకుండానే సినిమా మొత్తం లాగించేసారు! :((
నాకు బాగా చిరాకేసినవి మాత్రం కితకితలు పెట్టుకున్నా నవ్వురాని కామెడి సీన్లు.....ఎంత భయపడాలనుకున్నా వీలు కానీ హర్రర్ సీన్లు!! కానీ లాస్ట్ క్లైమాక్స్ లో ఒక 'ఫార్మేషన్' నాకు నచ్చింది. ఇక్కడ ఫోటోలో చూపించినట్టు ఆ అఘోరాలందరూ.....ఇలా 'శివలింగం' ఆకారంలో ఫార్మ్ అవుతారు! మధ్యలో ఛార్మి ఉంటుంది ;) అప్పుడు ఒక్కసారిగా మధ్యలోనించి స్ప్రింగ్ లాగా ఛార్మి పైకి లేస్తుంది...అది వేరే విషయం :))))
ఇక ఈ సినిమాలో...నాకు ఛార్మి అస్సలు....అసలులో కొసరు కూడా నచ్చలేదు.ఛార్మిలో మునుపటి చార్మ్ పోయింది ;) డాన్స్ లో కూడా గ్రేస్ లేదు. మ్యూసిక్ ఓకే ఓకే.... డైరెక్షన్ పూర్! ఏదో సరదాగా ఏమి తోచకపోతే ఒకసారి చూడొచ్చు!
ఈ సినిమాలో....ఒక సస్పెన్స్ కాని....థ్రిల్ కాని....హర్రర్ కానీ ఏమి లేదు.....నేనిప్పటికే దీనిని తలదన్నేలాంటి దయ్యం సినిమాలు చూడటం వలన.....ఇది నాకు కామెడి సినిమాగా గుర్తుండిపోతుంది తప్ప.....నో సీరియస్ ఎలిమెంట్స్! సో! మీకెవరికైనా దయ్యాలంటే భయముంటే....దయ్యాల సినిమాలు చూసే ధైర్యం లేకపోతె.....మంచి కామెడి ఎంటర్టైనర్ కావాలంటే ఈ సినిమా చూడండి :)) ఇందులో ఎటు దయ్యంకి ఒక రూపం ఉండదు కనుక.... ఛార్మినే దయ్యం పాత్ర కూడా పోషించింది కనుక.....మనం ఛార్మికి భయపడే సీన్ లేదు కనుక...ధైర్యంగా ఎంజాయ్ చేస్తూ సినిమా చూసేయోచ్చు!
ఇది 'మంగళ' సినిమా మీద ఇందు రివ్యు ;)