19, ఆగస్టు 2010, గురువారం

మా అమ్మమ్మగారి ఊరు..!!

నా వేసవి సెలవులు ఎక్కువగా గడిపిన చోటు...
నా జ్ఞాపకాల్లో ప్రముఖ స్థానం కలిగిన ఊరు....
నా చిన్ననాటి చిలిపి సంగతులు ఎన్నిటికో  చిరునామా ఈ ప్రదేశం...
 ప్రకాశం జిల్లాలో 'మార్టూరు' దగ్గర 'కోనంకి' లో దిగి యే 'ఆటో'/'జీప్'/'ఆర్.టి.సి బస్సు' లోనో ఎక్కి 'వలపర్ల' మీదుగా వెళితే  వచ్చే నాగార్జునసాగర్ కుడి కాలువ 'జవహర్ కెనాల్' దాటితే వస్తుంది  చిన్ని పల్లెటూరు 'రామకూరు'...... అదే మా అమ్మమ్మగారి వూరు....


చిన్నపుడు ఈ ఊరికి వెళ్ళడానికి బస్సులు ఉండేవి కాదు....'కోనంకి' దగ్గర బస్సు దిగి రిక్షా లోనో లేదంటే కాలినడకనో ఊరికి వెళ్లాల్సివచ్చేది ...మా తాతయ్య ఈ ఊరికి 'కరణం' గా చేసేవారు...అలాగే 'పోస్ట్ మాస్టర్' కూడా...మా అమ్మమ్మ బాగా చదువుకున్నారు అందుకనే బడి లేని ఆ వూళ్ళో మొదటి బడి మా అమ్మమ్మ ,తాతయ్య కలిసి ఇంట్లోనే మొదలుపెట్టారు...అప్పటినించి అందరూ మా అమ్మమ్మ,తాతయ్యలను 'పంతులమ్మగారు/పంతులుగారు' అనడం మొదలుపెట్టారు......మా అమ్మ,పిన్ని పెద్దయ్యాక ఈ స్కూలు వాళ్లే చూసుకునేవాళ్ళు.....అందుకే ఆ వూళ్ళో అందరికీ మా కుటుంబం అంటే ఎంతో గౌరవం....'కోనంకి' దగ్గర బస్సు దిగినప్పుడు మా వూరు వాళ్ళు ఎవరన్నాకనపడితే వెంటనే చేతిలో సామాను తీసుకుని బండి కట్టించి దగ్గరుండి ఊరికి పంపేవారు....


ఒక్క వేసవి సెలవుల్లో తప్ప ఎప్పుడు ఊరికి వెళ్ళినా  పిల్లలతో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వరండా అంతా నిండిపోయేది....మా ఈడు పిల్లలతో కలిసి తోపులోకేల్లి చింతకాయలు,సీమరేగికాయలు కోసుకోవడం,చిన్ని చిన్ని బాతుపిల్లల వెనకపడి తరమడం,రెండు వీధుల అవతల  ఉండే 'పుల్లయ్య' కొట్టులో జీడీలు పిప్పరమెంటు బిళ్ళలు కొనుక్కుని తినడం,మా బడిలోనే చదువుకునే 'చంద్రసేఖరం' వాళ్ళింట్లో ఉండే కోళ్ళు అవి పొదిగే గుడ్లు,చిన్ని చిన్ని కోడిపిల్లలు ఇంకా కొన్ని రంగులేసిన కోడిపిల్లలను అబ్బురంగా చూడడం,ఇంటి వెనుక ఉన్న రామాలయం కి వెళ్లి రోజు సాయంత్రం హరికథ వినడం,ఇంటి పిట్టగోడ ఎక్కి పక్కన ఉండే 'జాని గేదె' తో ఆడుకోవడం ('జాని' గేదె పేరు కాదు మనిషి పేరు....జాని వాళ్ళ ఇంట్లో ఉండే గేదె కాబట్టి 'జానీ గేదె' అయిపొయింది...ఎన్ని గేదెలు మారినా వాటిపేరు 'జాని గేదె'.. అంతే!!).....ఇంటికి కొద్ది దూరం లో ఉండే పెద్ద వేప చెట్టు దానికింద రచ్చబండ ,మా పాలమ్మి 'బుల్లి' తెచ్చే కమ్మటి జున్ను......మా పొలం లో పనిచేసే 'సూరిగాడు' తెచ్చే తియ్యటి 'తాటి ముంజెలు'......వేసవి లో ఐతే బాగా ముగ్గిన 'రసాలు' 'బంగినపల్లి' మామిడికాయలు,..... వేసవి రాత్రుల్లో ఇంటి ముందు మంచం వేసుకుని అమ్మ కథలు చెబుతూ అన్నం నోట్లో పెట్టడం.....తరువాత అమ్మ పక్కనే వొత్తిగిల్లి  చుక్కలు లెక్కపెడుతూ నిద్రపోవడం,ఇంటి వెనక పెరడు లో ఏపుగా పెరిగిన 'తోటకూర','టమాటా','వంకాయలు' వాటితో మా అమ్మమ్మ చేసే కమ్మని వంటలు, ....ఇంటిముందు ఉండే 'సీతాఫలాలు','జామ' చెట్లు....మా అమ్మ ఎంతో పద్ధతి గా పెంచిన 'కనకాంబరాలు' ,'విరజాజులు' ,'మల్లెలు' ,బంతిపూలు' ,'గులాబీలు' ,నేలలో ఉండే పెద్ద రోలు,పత్రం రాయి వాటిపక్కన పెరిగిన పెద్ద 'యూకలిప్టస్' చెట్టు,ఇంటిపక్కన  సందులో ఉండే  విశాలమైన 'తొట్టి'(చిన్నపుడు అదే నాకు,తమ్ముడికి 'స్విమ్మింగ్ పూల్'),.... కాకా హోటల్లో వేసే కమ్మని నేతిఇడ్లి-కారప్పొడి......పోద్దున-సాయత్రం 'పాలకేంద్రం' సైరను మోత .......దూరంగా మసీదు నించి వినపడే 'అల్లాహో అక్బర్!!'..... పొద్దున్నే కూసే పక్కింటి 'రత్నం' గారి కోడి....... మా గుళ్ళో తాతయ్య(మా తాతయ్య చిన్న తమ్ముడు...ఎప్పుడు గుడిలోనే ఉంటారు అందుకే ఆ పేరు పెట్టేసా!!),'మాణిక్యమ్మ' అత్తయ్య గారి ఇల్లు.....అన్నిటిని మించి మా ఊరి కొండమీద ఉండే  శివుని  కోవెల......ఇవన్ని ఎన్ని యేళ్ళయినా నేను,మా తమ్ముడు ఎప్పటికీ మరిచిపోలేని తీపిగుర్తులు.....


ముఖ్యంగా నాకు మా తమ్ముడికి బాగా నచ్చినది  మా వూరి కొండమీద గుడి....ఇప్పటికీ NH-5 మీద వెళుతుంటే 'కోనంకి' దాటాక దూరంగా కొండమీద గుడి కనిపిస్తుంది....అదే మా వూరి శివాలయం.....పూర్వం రావణాసురుడిని వధించాక 'బ్రహ్మ హత్యాపాతకం' నించి బయటపడడానికి రాముడు తాను 'అయోధ్య' కి తిరిగి వచ్చే దారిలో 'శివలింగాలు' ప్రతిష్థ  చేసేవారట ....అలా రాములవారు మా ఊరికి వచ్చి కొండమీద విశ్రమించి ఇక్కడ స్వామి వారిని ప్రతిష్థించారని నానుడి...అందుకే మా వూరి పేరు 'రామకూరు' అయిందిట....అలాగే ఇక్కడ శివుని పేరు ''క్షీర రామలింగేశ్వర స్వామి'.....తెల్లగా మిల మిల మెరిసిపోతూ ఉండే ఈ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం....ఈ గుడికి మా  తాతయ్య ధర్మకర్త....కానీ కొన్ని గొడవల వల్ల ఈ గుడిని 'దేవాదాయ శాఖ ' వారికి అప్పగించేశారు....ఇప్పటికీ మా కుటుంబం లో ఎవరు ఈ గుడికి  వెళ్ళినా మొదటి పూజ మా పేరున చేసి తరువాత మిగితావాళ్ళకి చేస్తారు....ఈ గుడికి వెళ్ళడానికి ఇదివరకు మెట్లమార్గము మాత్రమె ఉండేది....నేను,తమ్ముడు పోటి పెట్టుకుని పరిగెత్తుకుంటూ మెట్లు ఎక్కేవాళ్ళం....ఈమధ్యే దీనికి 'ఘాట్ రోడ్' వేసారు....గుడికి రెండు కోనేర్లు ఉన్నాయి....ఒకటి మా తాతయ్య వాళ్ళు నిర్మిస్తే ఇంకొకటి సహజసిధంగా ఏర్పడింది.రెండు పెద్ద బండరాళ్ల కిందనించి పైకి ఉబికి వచ్చే నీటి తేట కోనేరుగా ఏర్పడింది ....గుడి వెనుక ఉండే ఈ సహజమైన  కోనేరు చాలా లోతు ఎక్కువ....ఇందులో పొరపాటున కాలు జారి పడినవాళ్ళు ఇంతవరకు ఆచూకి లేరు....దీనికి కాశీ లో ఉండే గంగా నదికి సొరంగమార్గం  ఉందని అంటారు.....కానీ అంతు లేని ఈ కోనేరు అంటే చిన్నప్పుడు నాకు చాలా భయం :( 


ఇప్పుడు మా వూళ్ళో మా వాళ్ళు ఎవరూ లేరు....అందరూ పొలాలు,ఇళ్ళు అమ్ముకుని గుంటూరు,విజయవాడ,ఒంగోలు, హైదరాబాదు  ఇలా తలోదిక్కు వెళ్ళిపోయారు....అమ్మమ్మ కూడా పొలాలు,మా ఇల్లు అమ్మేసి గుంటూరు వచ్చేసింది.....కానీ ఇప్పటికి నేను,తమ్ముడు గోల పెడుతూ ఉంటాం 'మన వూరి గుడికి వెళ్లి వద్దాం!! 'అని. కానీ 'ఎవరులేని ఆ ఊరికి నేను రాలేను....మన ఇల్లు కూడా లేదు....నాకు బాధ గా ఉంటుంది' అని అమ్మ వద్దు అంటుంది....కానీ క్రితం సంవత్సరం 'శివరాత్రి' రోజున ఎలాగో అలా మా అమ్మని ఒప్పించి మా గుడికి తీసుకెళ్లా.....అక్కడ శివునికి అభిషేకం చేస్తుంటే ఎంత ఆనందమేసిందో.....అలాగే మా పొలాలు,ఇల్లు,కాలువ,రామాలయం,మా అమ్మ చదువుకున్న బడి అన్నీ చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుని తిరిగి వచ్చేసాం...మళ్ళి ఎప్పుడు వెళ్తానో మా ఊరికి!!


మా ఊరి చిత్రాలు కొన్ని ఇక్కడ :11 వ్యాఖ్యలు:

malli చెప్పారు...

మీ టపా చదువుతుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాఇ.చాలా బాగా వ్రాశారు

నాగేస్రావ్ చెప్పారు...

ఇప్పుడే వెళ్ళి వచ్చానండి మీరామకూరికి (విక్కీమాపియాలో).
కొండమీదగుడి, ఘాట్ రోడ్డు, మెట్లు అన్నీ చూశాను. రెండు కోనేర్లు కూడ కనపడ్డాయి. 'చంద్రసేఖరం' అంటే ప్రెసిడెంటు గారేనా? మీరామాలయాన్ని కూడ గుర్తు పెట్టండి. మీ జ్ఞాపకాలు చాలా తియ్యగా ఉన్నాయి.

రాధిక(నాని ) చెప్పారు...

చాలాబాగుందండీ మీ అమ్మమ్మ ఊరి వర్ణన ,జ్ఞాపకాలు.

Unknown చెప్పారు...

adbhutam............

ఇందు చెప్పారు...

@malli :మల్లి గారు...థ్యాంక్స్ అండీ,,,
@నాగేస్రావ్ :నాగేశ్వరరావు గారు...థ్యాంక్స్ అండీ.లేదండి..'చంద్రసెఖరం' మా బడిలో చదువుకున్న విద్యార్ధి...అతను ఎక్కడో ఉద్యోగం చేస్తున్నడని మా అమ్మ చెప్పారు....మా ఊరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.... :)
@రాధిక(నాని ) :థ్యాంక్స్ అండీ రాధికగారు..
@confident girl: చాలా థ్యాంక్స్ అండీ,

amma odi చెప్పారు...

మీ ఊరు చాలా బాగుందండి!

కళాపిపాసి చెప్పారు...

మీ వ్యాసంగం చాల బాగుంది....పల్లెలే దేశానికీ పట్టుకొమ్మలు....అలాంటి వూల్లనిన్చి అందరు వలస పోవడం దురదృష్టకరం.....

ఇందు చెప్పారు...

@AMMA ODI :చాలా థ్యాంక్స్ అండీ..


@కళాపిపాసి:థ్యాంక్స్ అండీ అవును మీరు చెప్పింది నిజమే..

Cute Indian చెప్పారు...

indu aripinchav adbutham gaaaa vundi..neee varnanaaaa.. Hrudayaanni taakindi.....Yaaa Ramakuru naku gurtu vundi peru okasari cheppav.
Keeeekaaaaa...Competetions pedithe 1st prize neeeke....

sivaprasad చెప్పారు...

puttina vurini enni rojulu ayina marchipomu .. adukonna aatalu, etc...

ఇందు చెప్పారు...

@Cute Indian : thnx annaya

@sivaprasad nidamanuri : kaadu andi....